ద్విపదభాగవతము/మధురకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ద్విపదభాగవతము

(దశమస్కందము)

మధురకాండము

అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట


.......................లబ్ధిచయము
లన్నగంబులు, గుహ్యమ ప్రజాపతియు
నగు, విశ్వరూపాత్మ! అధ్యాత్మరహిత!
నిగమార్థగోచర! నినుఁ గొల్తుఁ గృష్ణ!
విద్యా(ధరస్తుత్య!) విశ్వలోకేశ!
ప్రద్యుమ్న! యనిరుద్ధ! బల! వాసుదేవ!
సంకర్షణాభీమ! సర్వసర్వాత్మ!
పంకజోదర! శుభప్రద! హృషీకేశ!
[1]జలధిలోపల నున్న జలచరములును
[2](చెలఁగ) నవని సర్వజీవులు నినుఁడు
సరసిజాసన రుద్రషణ్ముఖభోగి
వరులును, నీలీల వర్ణింపలేరు.
ఏనొక్క మనుజుండ హీనమానుసుఁడ

………………… మూర్తిఁ బొగడగ గలనె?”
అని యిట్లు కొనియాడు నక్రూరుఁ జూచి,
తనరార శౌరి యంతర్ధానమయ్యె.
ఆతత సుస్నాతుఁడైన యక్రూరు
నీతరి మురహరి యీక్షించి పలికె
…………………………………………
…………………………………………
…………………………………………
……………………………………………
…………………………………………
……………………………………………
……………………………………………
……………………………………………

శ్రీహరి అక్రూరుని కంసునికడకుఁ బంపుట


“కావున నీవు నక్కంసుతోఁ జెప్పు,
వేవేగ మేము నీ వెంటనే వత్తు” 10
మనవుండు నక్రూరుఁ డరదంబు నెక్కి.
…………………………… నచ్చటి వార్తఁ జెప్పె.
తన యింటి కేఁగినంతట రామకృష్ణు
లనుపమం బగు వేడ్క ననుఁగులుఁ దారు.

శ్రీకృష్ణుఁడును, బలరాముఁడును మధురాపురి కేతెంచుట


తొడిపూసి కట్టి సంతోషంబుతోడ,
………………………… దెంచి కని రంతమ్రోల;

పసిడిగోపురములుఁ బసిడికోటలును
బసిడి మాడవులను బసిడిమేడలును
హేమకుంభంబుల నెంతయు నొప్పి
హేమమయముగ సొంపెసలారి యుండఁ
గని వాని మహిమకుఁ గడు సోద్యమంది
తనరార తత్పురద్వారంబు సొచ్చి
రమణీయ(శోభ వుర)మున నేతెంచుఁ
గమలాయతాక్షులఁ గని చాలవేడ్కఁ
బౌరకామిను లెల్ల భావకోల్లాస
పారవశ్యంబునఁ బరతెంచి పేర్చి

పురస్త్రీలు శ్రీకృష్ణ బలరాములఁ జూచి వర్ణించుట


సౌధాగ్రముల యందు సదనంబు (లందు)
వీధుల యందును వెఱవొప్ప నిలిచి
సొరిది వారందఱుఁ జూపులు పఱపి;20
“ ఈతఁడే, యెలనాగ ఇసుమంతనాఁడు
పూతన (పాల్ ద్రావి) పొరిఁగొన్న వాఁడు,
సకియరో! ఈతఁడే శకటమై వచ్చు
ప్రకట దానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు.
ముద్ధియ! ఈతఁడే మొగిఱోలుఁ ద్రోచి
మద్దియ లుడిపిన మహనీయ యశుఁడు.
అక్కరో! ఈతఁడే యఘదైత్యుఁ జీరి
కొక్కెర రక్కసుఁ గూల్చినవాఁడు.
గోవర్ధనముఁ గేల గొడుగుగాఁ బట్టి.

(గోవులఁ దే)ర్చిన గోవిందుఁ డితఁడె.
కొమ్మ! ఈతఁడె పిల్లఁ గ్రోవూది వ్రేతఁ
గొమ్మలఁ గడువెఱ్ఱిఁ గొలిపినవాఁడు.
కాళీయు పడగ లుగ్రతఁ దొక్కి వాని
కాళి .......................... న పుణ్యుఁ డితఁడె.
.................................................
.................................................
.................................................
.................................................
[3](పదవిని దండ్రిచేఁ బలమినిఁ గొన్న)
యెదిరిని కంసుని యేపుమాయించి
యీతఁడే రాజైన నిల యెల్లఁ బ్రతుకు;
.................................................
నెలఁత యీతఁడు రోహిణీదేవికొడుకు
బలుఁ డను రక్కసుఁ బరిమార్చి నతఁడు;30
.................................................
మలసి యిద్దఱి విక్రమంబులఁ జూడ
నా రామ కృష్ణులు నా పట్టణంబు,
భూరి సౌఖ్యమ్ముల నుబ్బుచుం బోయి

శ్రీకృష్ణుఁడు రజకుని రూపుమాపుట


రాచ చీరలఁ దెచ్చు రజకుని శౌరి
చూచి యల్లన నవ్వుచుం జేరి పలికె.
“మడివాల! మాకైన మణుఁగుఁ బుట్టములు

కడువేగఁ దెమ్మన్న” కనలి (వాఁడనియె).
“అద్దిరా! లెస్సవో యగునగు మీకు
దిద్దంగ వచ్చునే తివిరి మీ గుణము
నిను విచారించవు, నినుఁ జూచు కొనవు
చనునె యీ రాచ(వసనము) లడుగగ
నడవులలో మందలాఁగి రానేల?
పొరలు పెట్టెడు పుట్టుభోగులు మీరు
పరిఘమ్ములును గోరుపడము గొంగళ్ళు
(కరకంచు)కోకలు కట్టుడు మీరు
(ఈ రాచ)కోకలు యిమ్మన్న నెట్లు,
నోరాడె? నొంచితి, నొవ్వకుం” డనిన,
శౌరికోపించి యాచాకలిఁ బట్టి.
......................................40
పిడికిటఁ బొడిచినఁ బెల్లుగా నేలఁ
బడి తన్నుకొని వాఁడు ప్రాణముల్ విడిచె;
వడివాఁడుఁ గూలిన వానితోవచ్చు
మడివాళ్ళు బెగ్గలి మడుఁగు(లు వీడి)
కనుఁగొని పారినఁ గన్నిచ్చ వచ్చు
తనుపారు చీరలు ధరయించి శౌరి
బలరామునకును గోపాలసంతతికి
వలయు వస్త్రములిచ్చి వారును దాను

శ్రీకృష్ణుఁడు తన్నుపచరించిన పట్టుశాలి ననుగ్రహించుట


జ(నుచున్నచోఁ) బట్టుశాలి యొక్కరుఁడు
తన నేర్పుమెఱసి వస్త్రమునేసి వేడ్క

మనుజేంద్రునకు నిచ్చి మన్నన వడయఁ
గొనిపోవుచు మ్రోల గోవిందుఁగాంచి
(యసుపమ) భక్తితో నడుగుల కెఱఁగి
తనచేతి చీర ముందటబెట్టి నిలిచి;
యవధరింపుము కృష్ణ! అంభోజనయన!
తవిలి పుణ్యుఁడనైతి ధన్యుఁడనైతి
(నాపద్మ)జాదుల కందగరాని
నీపాదము (లభించె) నిఖలలోకేశ!
మునిలోకనుతపాద! మురవైరికృష్ణ!
(కొనుము యీ పుట్టంబు గోవింద! యనినఁ)50
గని శౌరి కరుణ (సకల కామ్యములును)
తనలోకమును నిచ్చి ధన్యునిఁ జేసె

శ్రీకృష్ణుఁడు సుదాముఁడను పుష్పలావికుని యనుగ్రహించుట


అరుగు దేర సుదాముఁడను పుష్పలావుఁ
డరిగి యెదుర్కొనె నత్యంతభక్తి
బలరామ కృష్ణుల పాదాబ్జములఁ
జెలువారఁ బూజించి చెంగల్వదండ
లిరువురకునునిచ్చి యింపుసొంపార
విరు(లమాలి)కలిచ్చి వెసవేయుగతులఁ
గీర్తింపఁగని హృషీకేశుండు శౌరి
యార్తరక్షణశీలి యతనిమన్నించి
వరము వేడుమటన్న వాఁడు “మీపాద
సరసిజంబులుఁ గొల్చు సద్భక్తి నాకు

దయసేయుమనుడు నాతనిఁదన్పు సేసి
నయమైన తత్ప్రసూనములర్థిఁ దాల్చి
మనమున హర్షించి మరలిపోవంగఁ

శ్రీకృష్ణుఁడు కుబ్జను మంచిరూపమునిచ్చి యనుగ్రహించుట


గనియెఁ గృష్ణుఁడు రహిగంధపుచిప్ప
వలచేతఁబూని త్రివక్రయై నడచు
జలరుహాక్షుఁడు కుబ్జ చపలాక్షి (నొరసి)
(కని) చల్లననగుచు కలకంఠి యెందుఁ
(జనియెదు) గంధబాజన మెవ్వరికిని60
గొనిపో(వుచున్నావు కొమరొప్ప నీవి?)
(అనవుఁడు) హరిఁజూచి యాకుబ్జ పలికె.
“వనపాక్ష యేను...........త్రివక్ర
యనుదాన రాజు నన్నర్థి మన్నించు
గండంబు వాసించి కలపంబుఁగూర్చి
యందంబుగా మేన నలఁదఁగానేర్తు
నిది, దేవరకు యోగ్య మీగంధ, మలఁది
పవివేలుభూములు పాలింపు” మనుచు
మ్రొక్కి గంధపుచిప్ప ముందఱ నిడిన
నక్కజంబుగ శౌరి హలియునుఁ దాను
చందనంబలది యాచపలాక్షి మేని
చందంబుఁజూచి యాచతురుడు దాని
కాలు కాలున మెట్టి కందువకీలఁ
గీలించినంత మైకిటుకును మాని

మెలఁతుక క్రొవ్వాఁడి మెఱుఁగకోయనఁగఁ
గలికి కన్నులసోయగము నివ్వెటిల్ల
మురిపంబు చిరునవ్వు మోమున మెఱయ,
హరిఁ జేరి సరసోక్తి నల్లనే పలికె.
“నా కాలుఁ ద్రొక్కితి నన్ను మన్నించి
నాకోర్కిఁదీర్చుట నెయ్యంబు నీకు
నాయింటి కేతెమ్ము నలినాక్ష!” అనుఁడు,
ఆయింతిఁ గనుగొని “యటఁబోయి మఱలి,
చనుదెంచెదముగాన చనియెద” మనుచు
వనిత వీడ్కొలిపి, యావసుదేవసుతుఁడు
చని వణిక్పథమున సకల(బేహార్లు)
అనుపమదివ్యగంధాంబరాభరణ
ములు కానుకలు చేసి మ్రొక్కి దీవింప;
చెలువల మనములఁ జిత్తజానలము

శ్రీకృష్ణుడు కంసుని మహాధనువును విరచుట


మురిగొని చూడఁగ మొగశాల కడకు
నరుదెంచుచో మందరాంతంబునందుఁ
బొలుచు మహాభోగిభోగమో యనఁగఁ
జలననమొందనియట్టి చాపమో యనఁగఁ
బ్రకటారిజలరాసిపటుశేతు వనఁగఁ
గకుటివారణకరకాండమో యనగఁ
నారూఢగంధపుష్పార్చితం బగుచు
మేరూశైలాగృతి మెఱయు కార్ముకముఁ
గని, దాని చాపకర్కశలు వారింప

దనుజారి యమ్మహాధను వెక్కఁద్రోచి
వడిగుణధ్వని సేసి వారక తివిసి
పిడికిలి వదలిన ఫెళఫెళధ్వనులు80
దిక్కులు వ్రయ్యంగ దిగిభంబు లగలఁ
చుక్కలు డుల్లంగ సురలోక మదర
ధారుణి వణక పాతాళంబు వగుల
వారాసి పిండలివండుగాఁ గలఁగ
పిడుగులు పదివేలు పెట్టి యొక్కెడను
పడియనోయన విల్లు బ్రల్లన విఱిగె
అట మహాధ్వని విని యాపౌరులెల్లఁ
బటుగతిఁ దొలఁగ భూపతి బెట్టుకలఁగి

కంసుఁడు శ్రీకృష్ణునిచేఁ దనధనుర్భంగమును విని విచారించుట


తన కలంకులనుస్న దానవాధిపులఁ
గనుఁగొని పలికె నుత్కటకోప మెసఁగ.
డోపించి “వసుదేవుఁగొడుకులు నేఁడు
నా పట్టణముఁ జొచ్చి నావిల్లు విఱిచి
చలము చేకొని ధనుశ్శాల నున్నారు.
బలసి మీరందఱు బలశక్తి
వారలనిద్దఱ వధియింపు డొండె
కారాగృహాన నుక్కరఁబెట్టుడొండె”.

శ్రీకృష్ణుఁడు కంసునిపంపున నేతెంచిన రక్కసుల రూపడరించుట


అని పుచ్చుటయు దైత్యు లసమసాహసులు,

చనుదెంచి వారితో సమరంబు సేయ
నారామకృష్ణులు నవ్వీరవరులఁ
దోరంబుగల వింటితునుకల నడచి
మెఱసి కంసునియింటిభృత్యుని బలునిఁ
బరిమార్చి యందఱిఁ బఱపి యాలోన
గమ్మన నాయుధాగారంబు వెడలి
యిమ్ములఁ బురలక్ష్మి నెలమిఁ జూచుచును
నొప్పార నందాదులున్న యయ్యెడకుఁ
దప్పకఁ జనిరంతఁ దపసుండుఁ గ్రుంకె.

కంసుఁడు దుర్నిమిత్తములను జూచి బెగడుట


తనరార కాలోచితమ్ములుఁ దీర్చి
యనుపమసుఖలీల నారాత్రియందు
నంతనంతయు విని యాభోజనృపతి
చింతించి బెగ్గలి చేష్టలు సడలి
దారుణంబైన వేదనఁ బొంది కంది
కూరుకుఁ గానకఁ గొందలంబంది
యద్దంపునీడలో నాతతంబునను
నిద్దంబుగాఁ దననీడఁ జూడఁగను
తలలు రెండై యుంట...........
గలవెత నగ్నులు గానంగ బడుట
ఖరలులాయోష్ట్రాదికములును గనుట
యరుదార తలనూనెలంటుకొంచుంట
బిసములుఁదినుచుంట ప్రీతిదాసనపు
కుసుమధామంబులఁ గొనధరించుటయు100

ధూళిలో రొంపిలోఁ ద్రొక్కినయవుడు
కాలుమోవక పాదఖండమై యుంటఁ
చెపులు మూసినయెడ సింధుఘోషంబుఁ
బ్రవిమలంబుగ వినఁబడకుండుటయును
నివియాదిగాఁ బెక్కు లీక్షించి తనకు
యవసానకాల మౌనని యాత్మ నెఱిఁగి
పురపురఁ బొక్కుచుఁ బొగిలి లోగంది
మరణభయంబున మదిఁదప్పెనంత;
నెట్టకేలకు వేఁగ నినుఁడు పూర్వాద్రి
దట్టుఁడై పొడతెంచెఁ దమ్ములింపలర.

కంసుఁడు కొలువుకూటమందు శ్రీకృష్ణబలరాముల రాకను ఎదుఱుచూచుట


అంతఁ గంసుఁడు పూర్వాహ్నికక్రియలు
సంతసంబునఁ దీర్చి సకలభూపతులుఁ
గొలిచియుండఁగఁ బెద్దకొలువుండి వేడ్క
బలరామకృష్ణుల బవరంబుఁ జూడఁ
దలఁచి పెంపెసలారు తమకంబులందు
వలయువారును వసియించెనంత;
మఱియును బహువిధమంచియలందు
వరులు సద్విజరాజవైశ్యశూద్రులను
ప్రవిమలంబుగనుండి, రంగమధ్యమున
వివిధపుష్పసుగంధవిధులు వాసించి110
పరగ నవ్వేళ గోపాలురుఁ దాను
నరుదెంచి నందుండు నాభోజపతికిఁ

బొడఁజూపి తమతెచ్చు భూరివస్తువులు
కడఁకతో నిచ్చినఁ గరము మన్నించి
తనచేరువనె యొక్క తమకంబుమీఁద
నునిచి వారును దాను నొగిఁజూచుచుండె.
కరియూధ మే చుగతి మల్లవర్గ
మరుదెంచ వందిబృందారవం బెసఁగఁ

కొలువునకు ముష్టిక చాణూరు లేతెంచుట


జను దెంచి ముష్టిక చాణూరముఖుల
లెనయ రంగస్థలంబెల్లఁ దారగుచు
భుజమప్పళింపుచుఁ బొరి విజృంభించి
గజభజింపుచునుండగా నంతలోన;

శ్రీకృష్ణునిపై మాపటీడు మదగజమును బురికొల్పుట


వికసితపుష్కరవిభవంబుఁ జెంది
యకుటిలదీర్ఘశృంగారూఢి నొప్పి
మానుగా వంశాఢ్యమహిమఁ జెన్నొంది
దాన నిర్జరలీలఁ దనుపారఁ బేర్చి
పొడవు తక్కువగాని భూధరేంద్రంబు
వడువునఁ జెలువారు వరశక్తిచేత
నష్టదిగ్గజముల నాపంగనోపు
నష్టమదాపూర్ణమై పేర్చుకరణి120
కువలయవేలంబు కోరియాశాల
నవిరళంబుగ నిల్చి యతికౌతుకమున

నెదరుచూచుచునుండె నెంతయు వేడ్క.
యదుకులోత్తంసులు హలియును హరియు
రమణీయజలజాకరమునఁ గ్రీడింప
గమనోగ్రగతివచ్చు గజయుగ్మ మఁనగఁ
గరియూధములమీఁద కలుషించివచ్చు
హరిశోరద్వయమనఁ బెంపు మిగిలి
పౌరులుఁ దముఁ జూచి బహుభంగిఁ బొగడ
నారూఢరంగము నటు డాసి శౌరి
యరుదారఁ దెరుపున కడ్డంబు వేర్చు
కరిఁ జూచి మావంతుఁ గనియు నిట్లనియె.
“ఈకరిఁ దొలగించి యిటఁద్రోవఁ జూపు
మాకంసుకడకు మాకరుగఁగావలయుఁ
బోవనీకుండినఁ బొరిపుత్తు" ననిన;
మావంతుఁడంత నర్మరుషంబుతోడఁ
గరిపతి హరిమీఁదఁ గదియింప నదియుఁ
దిరిగి మహోదండతీవ్రతుండంబుఁ
బ్రసరింపుచును గృష్ణుఁ బటుశక్తి నొడియ
నసమసత్వుఁడు కృష్ణుఁ డటఁ దప్పఁగ్రుంకి130

శ్రీకృష్ణుఁడు మదగజమును సంహరించుట


చరణమధ్యములకుఁ జని బాహు లెత్తి
యరుముష్టి బొడిచిన యురమూరదాఁకి
హుంకారరవమున నోడించి మొరగ
నంకుశంబున సూది హస్తిపుం డార్వఁ,
బురికొని కరటి యపుండరీకాక్షుఁ

గరకాండ మెత్తి యొక్కట మేనుఁజుట్టి
తివిచినఁ దనమేను దివియక శౌరి
యవిరలభోగిభోగావృతం బగుచు
దిరిగెడి మందరాద్రియుఁబోలెఁ దిరిగి
కరమొప్ప శక్తిఁ బుష్కర మొప్పఁబట్టి
వెనకకుఁ ద్రోచిన వివశమై యొరగి
ఘనరౌద్రమున లేచి కఠినదంతముల
హరిమేను బొడవంగ నతఁడు మైఁదప్పె,
కరముగ్రమగు ముష్టిఘాతలఁ జరుప
మావంతుఁ డలిగి తోమరములు మూట
నావిశ్వవిభు వైవ నతఁడు కోపించి
కడఁగి హస్తిపకుని కడకాలుఁబట్టి
పుడమిపైఁ బడ నీడ్చి పొరిఁద్రొక్కి చంపె.
మావంతుఁ డీల్గిన మత్తేభ మడరి
గోవిందుపై నాఁకఁ గొనకఁ బెల్లురకఁ140
బదతాడనంబులఁ బరుషఘాతములఁ
బ్రిదులంబులును బోని పిడికిళ్ళఁ బొడువ
ముక్కున వాతను మొగికర్ణములను
నక్కజంబుగ నెత్తు రందంద నొలుక
పవిఁదాకి కూలిన పర్వతం బనఁగఁ
బవనుచేఁబడు మహావృక్షమో యనఁగ
గజము నిశ్చేష్టమై గజభము లుడిగి
గజగజ వడకి యక్కజముగాఁ ద్రెళ్లె,
కడువడి మెడఁ ద్రొక్కి (గజదంతములను)
బెదిదంపు లావునఁ బెఱికె మురారి
దాననకుంభనిర్దళనంబు సేసి

మేను వ్రేయఁగ వేఁగి మిడమిడ మిడికి
గైరికనిర్ఘరకలితాద్రి వోలె
భూరిరక్తంబులఁ బొలిచె నగ్గజము.

శ్రీకృష్ణుఁడు కొల్వుకూటమును బ్రవేశించుట


కరిమదరక్తపంపకములచే మేనఁ
దొరగెడు ఘర్మబిందువులును నరయ
హరిమేను చిత్రవనాంబుద మనఁగ,
నరుదారఁ జూపట్టె నందందఁ జూడ;
గజగంతములుఁ దాను కామపాలుండు
భుజశిఖరంబులఁ బొలుపొందఁ దాల్చి150
దారుణతరదండధరయుగ్మ మనఁగ
గౌరత మల్లరంగము సొచ్చి నిలువ
గోరిమల్లులకెల్ల కులిశమై, ప్రజకు
ధారుణినాథుఁడై, తల్లిదండ్రులకు
బసిబాలుఁడై యొప్పు, పంకజాక్షులకు
నసమాస్త్రుఁడై, వల్లవావళికెల్లఁ
బరమాప్తుఁడై, యతిప్రతతికి నెల్లఁ
బరతత్వమూర్తియై, బంధుసంతతికి
దైవమై, రోహిణీతనయుఁడుఁ దాను
నావిష్ణుఁ డరుదెంచె నండఱుఁ జూడ.
అతులితగంధపుష్పామోదితులును
సతతసౌఖ్వాఢ్యులఁ జారుభూషణుల
శ్రితకీర్తియుతుల, నాశ్రితకల్పతరులఁ
బ్రతిభటవనదావపావకసముల

ఘనదీర్ఘబాహుల, కఠినవిక్రముల
వనజాతనేత్రుల, వసుదేవసుతుల,
నారామకృష్ణుల, నతులవిక్రముల,
నారూఢనవయౌవనాంగులఁ జూచి160
భోరున జనులెల్లఁ బొగడఁగఁ గంసు
డారవ మాలించి యటఁ జూచునంత;
కువలయపీలంబుఁ గూల్చి తన్నర్థి
కువలయంబంతయుఁ గొనియాడవచ్చు
హరికామపాలుర నందందఁగాంచి
తిరుగుడువడి గుండె దిగులొంది తాల్మి

కంసుఁడు చాణూరముష్టికులను శ్రీకృష్ణునిపైఁ బోరబంపుట


డింది చాణూరముష్టికుల రప్పించి
దందడిఁ బెదవులు దడపుచుఁ బలికె,
"మనమంటపము సొచ్చి మనవిల్లు విడిచి
మనపట్టపేనుఁగ మడియించి వీరు
మనమీఁద వచ్చిరి మహితవిక్రములు.
తనరార మల్లయుద్ధము నేర్పు మెఱసి
పోర మీరిరువురుఁ బొలియించి వేగ
నారాజ్యమును నన్ను నాబంధుజనుల
రక్షించి నాదుసామ్రాజ్య మెంతయును
నక్షయంబుగ నేలుమ”ని పల్కుటయును ;
తివిరి యుక్కున దాత తీర్చినయట్ల
ప్రవిమలంబగు మహాప్రతిమలో యనఁగ

నవయలంబులుగల యద్రులో యనఁగ
[4]పవివ్రేయ నాపెడు బలుదిట్ట లనఁగ
ముష్టికచాణూరముఖ్యులు నృపతి
యిష్టంబుఁ గని రంగమెల్లఁ దారగుచుఁ170
గినుకమై బలరామకృష్ణులఁ జేరఁ
జని మహాధ్వని మల్ల చఱచి యిట్లనిరి.

ముష్టికచాణూరులు బలరామకృష్ణుల నధిక్షేపించుట


“వసుదేవసుతులార! వసుధలో మిమ్ము
లసమానసత్వాఢ్యు లం డ్రెల్లవారు
పెక్కండ్రదనుజుల పీచంబు లణఁచి
యక్కజంబుగ మెఱసినయట్టిసాహసులు;
భోజభూవిభుఁడు మీపోరు నీక్షించి
రాజిల్ల మమ్మిట రప్పించినాఁడు;
మందలోపల గొల్లమగనాండ్లఁ దిరిగి
సందింపుచును నాడ సానురాగములఁ
బిల్లగ్రోలూఁదుచుఁ బెరయుటగాడు
మల్లయుద్ధములకు మమ్ము డగ్గరుట;
యేను చాణూరుండ యితఁడు ముష్టికుఁడు
పూని నీపును నేను బోరుద మెలమి
ముష్టికుతోడ రాముఁడు మల్లయుద్ధ
మిష్టలీలల నొప్పు డిది సాటి" యనుఁడు,
అల్లన నవ్వుచు నంబుజోదరుఁడు

శ్రీకృష్ణుఁడు హేళనగాఁ జణూరనకు బదులు చెప్పుట


"పల్లవులము పిన్నపాపలు మేము
తగిన జెట్లును మీరు ధరణీశునొద్ద
జగతిపైఁ బోరుల సడిసన్నవారు180
మీతోడ రణవీథి మెఱసి సేయంగ
నాతరంబులవార మగుదుమే మేము?
చెనసి భూపతి వేడ్కఁ జెడకుండ కొంత
పెనఁగెద”మని పల్కి ప్రీతి మై పెంచి

శ్రీకృష్ణుఁడు చాణూరునితో మల్లయుద్ధముఁ జేయుట


వడిమల్ల చఱచి భూవలయంబు పగుల
బెడిదంబుగా నార్చి పిడికిళ్లు చాఁచి
వానిమై కదియు ముష్టాముష్టి గవియఁ
జూణూరుఁడును మల్ల చఱచి యిట్లొరసి
యిరువురు భుజ మప్పళించు చప్పుళ్లు
శరనిధి కలఁగె నాశాచక్ర మగిలె
నంతకుఁ దెసఁజేరి యవనిపరాగ,
మింతింతఁగొన మేన నిరవారఁజల్లి
కొనిపదఘాతల కూర్మంబు వగులఁ
దనరు మహాభద్రదంతుల రీతిఁ
జేతికి నొడిసినఁ జేయీక తివిసి
ఘాతసేయంగ దగ్గఱి మేను దొలఁగి
పొడిచిన నది వెలిపుచ్చి మైవంచి
యొడిసి తొడలఁ దట్టి యార్చి పెల్లురికి

లాగంబుఁ గొచను మేలనఁదలఁగ్రుంకి
బాగుఁదప్పకఁ దలప్రహతుల నొంచి190
నడుముఁ బీడింప విణ్ణనుదున మలఁగి
విడిపించుకొని ముష్టి విసరమై పొడిచి
పట్టుచు విడుచుచుఁ బరుషఘాతముల
దట్టించి కూర్పరోద్ధతుల నొప్పించి
కరవశంబుఁగొన కాభీరువోక
దర కాండములు లోనుగానీక తొలఁగి
శిసకంబొనరింప శిరమూన్చి పెట్టు
గాసిల్లి కేలడొక్కరమున నొత్తి
రంకెలువైచు గోరాజుల భంగి
ఝంకించి బింకంబు సరిగాఁగఁబెనఁగి
ముంగలు బలసింగములభంగిఁబొంగి
నింగిమోవంగ నార్చి నిడుగుడి పై కుఱికి
మెడయు గాళ్లును బట్టి మీఁదికి నెత్తి
పుడమి మోవంగవ్రేయ భోరున నెగసి
యడపకరాఁగేల నిరియ బిగించి
వడి నుగ్రమగు ముష్టి వక్షంబుఁ బొడువఁ
దడబడ ముష్టిఘాతల మోములవసి
దొడిదొడి పన్నెత్తురులు వఱ్ఱుగాఁగ
హరియు చాణూరుఁడు నటమల్లయుద్ధ
పరుషతఁ దుల్యులై బవరంబు సేయ;200

బలరాముఁడు ముష్టికునిలో మల్లయుద్ధముఁ జేయుట


సీరితోఁ దొడరి ముష్టికుఁ డుగ్రవృత్తి
బోరెఁ జూపరకు సభ్యులు చూచి పొగడ;

హరిరాములకు జయంబయ్యెడుననుచు
సురలు దీవించిరి, శోకించి పౌరు

శ్రీకృష్ణబలరాములఁ గాంచి పౌరులు శోకించుట


“లక్కటా! ఈకంసుఁ డతిపాపకర్ముఁ
డెక్కడి యీబాలు రెక్కడి వీర
లెక్కడననిఁ జూడ కెట్లు గావించె
నక్కటా! వారించరైరి యెవ్వరును.
ఈసుకుమారుల నిటు సేయఁ దనకు
దోసంబుఁ దిట్టును దూరును గాదె?
పరుషత రిపులతో బవరంబు నేయ
హరిమేను ఘర్మకణాంచితం బగుచు
[5]వివశితాంభోజంబువిధ మొందెఁ జూడు
డీవాసుదేవుల కీబారిగడపు
దైవమాయని" మ్రొక్కి తరుణులు వగువ;
దేవకియును వసుదేవుఁడుఁ బ్రీతి
గోవిందబలులఁ గనుఁగొని వంతనొంది

శ్రీకృష్ణుఁడు చాణూరుని జంపుట


రప్పుడు దనుజారి యామహాజట్టి
దప్పకఁ జూచి యుద్ధత శక్తి మెఱసి210
పిడికిటఁ బొడిచినఁ బెంపేది వాఁడు
పడియొడ్డ నిల్చి యపంకజోదరుని
వక్షంబు శిరమున వడిదాఁకుటయును;

ఈక్షించి హరి వాని వెనుకకుఁ ద్రోచి
కుడిరెట్ట వట్టి పెలుకుఱఁ ద్రిప్పి నేలఁ
బడవైచి తన్ని గొబ్బున మీఁదికుఱికి
మెడఁద్రొక్కి యినుము సమ్మెట మోదినట్లు
తడబడ ముష్టిఘాతల మేను నొంప;
వెగడొంది (ప)ట్టెమ్ము విఱిగి గుండియలు
పగిలి చాణూరుండు ప్రాణముల్ విడిచె.

బలరాముఁడు ముష్టికుని జంపుట


అప్పుడు ముష్టికుం డమరు లీక్షింపఁ
జెప్పబెట్టులుగాఁగ సిరితోడఁ దొడరి
పులులచందమున నుబ్బుచుఁ బొంగిపొంగి
బలులులాయంబులపగిది దాఁటుచును
పాయుచు డాయుచు బాహార్హళముల
వ్రేయుచు నొగిఁ బెక్కువిధములఁ బోర;
ద్రిష్టించి చూపర దిగులొంద నిలిచి
ముష్టికుం డదరి రాముని బెట్టుఁ బొడువ
ఫాలంబు పగిలి తప్పక నెత్తురొలుక
నేలపైఁ బడి లేచి నీలాంబరుండు220
పిడుగు వ్రేసిన భంగిఁ బిడికిటఁ బొడువఁ
బడితన్నుకొని జెట్టి ప్రాణముల్ విడిచె;
గతుఁడైన ముష్టికుఁ గని వానితమ్ముఁ
డతిబలాఢ్యుఁడు కూటుఁడనువాఁడు సీరిఁ
బోకుఁబోకని దాఁకి పొరిముష్టిఁ బొడువ
యాకూటుఁ దెకటార్చి యార్చె మిన్నద్రువఁ
గోసలప్రభృతు లొక్కొట యేడుగురను

వాసుదేవుఁడు వారి వధియించె నంతఁ
గనుఁగొని మల్లవర్గమువారు వారుటయును
యనిమిషావలిఁ జూచి యచ్చెరువందె.

కంసుఁడు ముష్టికచాణూరులు మడియుటఁ జూచి తనసేనాపతులతోఁ బలుకుట


భోజభూపతి వారు పొలియుటఁ జూచి
రాజసం బెడలి బోరన నశ్రులొలుక
వడివాద్యముల మ్రోఁత వారించి తనదు
పడవాళ్ళఁ బిలిచి నిర్భయవృత్తిఁ బలికె.
“ఈపాపకర్ముల నిరువుర నీళ్ల
ద్రాపించి, వసుదేవుఁ దునుమాడి, నంద
గోపునియిల్లు ముట్టుకొని చెఱఁబెట్టి
గోపాలకులఁ బట్టికొని, యుగ్రసేను
దండించు”డని భోజధరణీశుఁ డాడు
దండిమాటల కల్గి దానవాంతకుఁడు230

శ్రీకృష్ణుఁడు కోపించి కంసునిపై లంఘించి యీడ్చి చంపుట


గిరిశృంగమునకు లంఘించు సింహంబు
కరణి దన్గదనుకలిమీఁది కెగయ,
కని భోజపతి కేల ఖడ్గ మంకించి
కొని యాజ కెదుఱంగఁ గొరనవ్వు వెలయ
నురగంబు పక్షీంద్రుఁ డొడియు చందమున
కరవాలుఁగేలు నుగ్రతశక్తిఁ బట్టి
కొసవెంట్రుకలు వట్టి గొరగొర నీడ్చి
వసుమతిఁ బడఁద్రోచి వడి మీదికుఱికి

పిడికిళ్ళ నొప్పింపఁ భిరికి ప్రాణములు
యొడలికిఁబెడఁబాయ నొప్పార కంసు
ఘనకళేబరము రంగము వాయనీడ్చి
యనుపమధ్వనిఁ బేర్చి యార్చి మురారి
యతనితమ్ములు సునాభక్రోధనాథు
లతిసత్వు లెనమండ్ర మలపాణి చంపె;
నప్పుడు పౌరులయార్పులు నింగి
నుప్పొంగి బహుపాశకోక్తులఁ జెలంగె.

కంసుని మరణముఁ గని దేవతలు హర్షించుట


భవకమలాసనప్రముఖదేవతలు
ప్రవిమలంబుగఁ బ్రణుతించి రెలమి
దివిబీఁటకొని మ్రోసె దేవధుందుభులు
దివిజకామినులు నర్తించి రింపార;240
పొరిఁబొరి మందారపుష్పవర్షములు
సురకోటి దేవకీసుతుమీఁదఁ గురిసి
రంతట, కంసుండు హతుడౌట యెఱిఁగి
యంతఃపురాంగన లడలు దీపింప
నడుగులు తడబడ నాత్మలు కలఁగ
సుడివడి లోగుంది సృక్కి బల్వడిని,
నురముల శిరముల నొరి మ్రోదుకొనుచు
పరిపరివిధముల పలవించి మిగుల
నార్తనాదంబుల నందంద బొగిలి

కంసునిస్త్రీలు తమపతి మరణమునకు విలపించుట


భర్తపై వ్రాలుచు బహుభంగి నొగిలి
హా! యని యేడ్చుచు హా నాథ! యనుచు

పోయితే! మము బాసి భోజవంశాఢ్య!
కటకటా! శోకానఁ గ్రాలంగ మమ్ము
నిటఁ జూడ వించుక యేలఁ గైకొనవు?
ఇనుఁడు నీమీఁదట యెండరానోడు;
ననిలుండు నీమీఁద నటవీవ వెఱచు;
ననలుండు తీవ్రార్చు లడరింపనోడు;
ననిమిషాదులు మీకు నడకుదు రెపుడు;
నీయాజ్ఞ నీలావు నీరాజసంబు
నీయొప్పు నీనేర్పు నీమంచితనము250
వ్రేయవారలచేత వేల్మిడినడఁగి
మాయమైపోయితే మనుజదేవేంద్ర!"
అని బహుభంగుల నార్తులై పొగుల
వనితల నూరార్చి వాసుదేవుండు

శ్రీకృష్ణుఁడు కారాగృహమునుండి దేవకీవసుదేవులను విడిపించుట


కారాగృహంబునఁ గడునొచ్చియున్న
వీరుని వసుదేవు, వెలఁది దేవకిని,
గని వారికాలి సంకిలియలూడ్పించి
వినయంబుతో మ్రొక్క వెఱఁగంది వారు
గోవిందహలులఁ గల్గొని తమపాలి
దైవంబులని, యాత్మఁదలఁచిరి గాని
తనయభావంబుగాఁ దలఁచకయున్న
తనమాయ హరి మోహతమముఁ గారించ
చన్నులఁ బాలును సమ్మదాశ్రువులు
కన్నులఁ దొరల నక్కాంతాలలామ

సుతులఁ గౌఁగిటఁ జేర్చి శోకంబుఁ దక్కి
యతులితంబగు ప్రేమ నందఁదఁ జూడ
వసుదేవుఁడును బుత్రవరుల నీక్షించి
యసమానమగుప్రేమ నక్కునఁ జేర్చి
“పుణ్యాత్మ! మీయట్టి పుత్రులఁ గాంచి
పుణ్యకీర్తులఁ గంటి పుణ్యుఁడ నైతి;260
నింతగాలము మిమ్ము నీక్షింపలేక
సంతాపమందుచు శత్రులచేత
బడని బాధలఁ బడి పసువుచుండితిమి;
కడపట! నినుఁ జూడగంటిమి నేడు;
జన్మజన్మాంతరసంచితౌఘములు
చిన్మయ! నినుఁ దలఁచిన మాత్రమేఁగు.
మహనీయ! నీవు కుమారుఁడ వైతి
విహపరంబుల మాకు నేమిటఁ గొఱత?”
అనియున్న గురుల నత్యాదరలీలఁ
గనుఁగొని శౌరి యుత్కటబాష్పుఁ డగుచు

శ్రీకృష్ణుఁడు తల్లిదండ్రులఁ జూచి చింతించుట


“మానిమిత్తముల దుర్మనుజులచేతఁ
బూని బహుక్లేశములు మీకుఁ గలిగె;
జనియించినపుడే యిచ్చటనున్న వెఱచి
యనఘ! నందునియింటి కనిచిన, వారు
బాల్యంబు మొదలుగా భక్తిఁ బోషింపఁ
గౌల్యవర్తనల మెలఁగి కాంచితిఁ గాని
యప్పటప్పటికి మమ్మరసి మీ రర్ధిఁ
జెప్పిన పనిసేయ సిద్ధించదయ్యె;

తనయుఁడు జయించి తల్లిదండ్రులకు
ననుపమంబగుభక్తి నరయకుండినను270
దనయుండె? ఆతఁడు తల్లియవ్వనముఁ
గొనకొని తెగఁజూచు గొడ్డలిగాక!"

శ్రీకృష్ణుఁడు ఉగ్రసేనుని రాజ్యభారమును వహింపఁజెప్పుట


అనిభక్తి సూరార్చి యయ్యుగ్రసేనుఁ
గనుఁగొని కౌఁగిట గదియించి, శౌరి
“నీరాజ్యమంతయు నిర్దయవృత్తి
గ్రూరుఁడై తానె కైకొని యంతఁబోక
యాకలఁ బెట్టి మిమ్మలఁచినయతఁడు
కాకున్న పనియట్లగాక పోరాదు
హీనమానసులైన యీదురాత్ములకుఁ
గానఁజింతింపకఁ గంసాదిసుతుల
కగ్నిసంస్కారాదు లర్థిఁ జేయింపు
ప్రాజ్ఞుల విప్రులఁ బనిచి వేవేగ
రాజ్యభారముఁ దాల్చి రమణ మా కెల్ల
పూజ్యుఁడవై లీల భూమి పాలింపు”,
మనుటయు హరిఁ జూచి యయ్యుగ్రసేనుఁ
“డనఘ! న న్నిమ్మాటలాడంగఁదగునె?
హీనుఁడ నతివృద్ధ నీరాజ్యభరము
పూన నాకర్హంబె? పుండరీకాక్ష!
వసుదేవుఁబట్టంబు వలనొప్పఁగట్టి
యసమానగతిని రాజ్యము నీవె తీర్పు;280
కన్నులు చల్లఁగాఁ గలకాలమెల్ల

నిన్నుఁ జూచుచుఁ బ్రీతి నెగెడద కృష్ణ!"
అనుచుఁ బల్కిన శౌరి యారాజుఁ జూచి
వినయంబు నీతియు వెలయ నిట్లనియె.
“యాదవులకు రాజ్యమర్హకృత్యములు
గాదు యయాతివాక్యముఁద్రోయరాదు;
కావున సామ్రాజ్య కమనీయలక్ష్మి
నీవె పాలించి మన్నించు, బాంధవుల
రప్పించి వారికి రాజ్యంబు లిచ్చి
తప్పక మమ్మెల్ల దయ నేలుకొనుము.
నిఖిలభూపతులును నింపు సేయంగ
సుఖలీలనుండు; కంసుని వంతమాను”.
మనిపల్కి యాతని నవనీభరంబుఁ
గొనకొనుమని నీయకొలిపి మురారి

శ్రీకృష్ణుఁడు నందుని కడకు వచ్చుట


బలుఁడుఁ దానును నందుపాలి కేతెంచి
కలిసి యాతనిఁ జిక్కకౌఁగిటఁ జేల్చ
భోజాధిపతియింటఁ బొలుచు వస్తువులు
రాజ్యయోగ్యములైన రవణంబు లిచ్చి
యతని మన్నించి నెయ్యము తియ్యదనము
నతిగారవంబున నమర నిట్లనియె.290
“నీవు నీసతియును నెమ్మిఁబోషించి
ప్రోవఁగఁ బ్రతికిన ప్రోఢల మేము
తల్లియుఁ దండ్రియు ధనము లియ్యమును
నెల్లబంధువులును నిట మాకు నీవ;
మందలోపలికి నెమ్మది నేఁగి మీర

లందఱిసేమంబు లడిగితిమనుఁడు;
యేనాఱుదినముల యీలోనె నచటి
కే నేగుదెంచెద నీవంతమాను”.
మని వారి నూరార్చి యనుప నందుండుఁ
జనియె గోపాలకసమితియుఁ దాను.
అంతట నిశ్శంక నారాత్రి సౌఖ్య
సంతోషలీలలు సలిపి రింపొంద.
మరునాఁడు శౌరి కుమారులఁ జూచి

శ్రీకృష్ణుఁడు తనగురువగు గర్గ్యునివద్ద విద్యల నభ్యసించుట


తెరగొప్ప సద్గురుద్విజుల రప్పించి
కాలోపనయనసంస్కారాదివిధులు
గాలోచితక్రియగతులుఁ జెప్పింప
యదుకులాగతగురుఁడగు గర్గ్యువలనఁ
జదువొప్ప వేదశాస్త్రము లభ్యసించి
యెఱుక సాధింపుడంచను విప్రునింట
యఱవదినాల్గువిద్యలు నభ్యసించి300

శ్రీకృష్ణుఁడు గర్గ్యుని గురుదక్షిణ గోరుమనుట


గురువులఁ బూజించి కొలిచి మన్నించి
“గురులార! యేనీకు గురుడక్షిణార్థ
మిరవార మదినున్న యీప్పితార్థములఁ
దరమిడికొనివత్తు దయ వేఁడు” మనిన
నతఁడు భార్యయుఁ దాను నటవిచారించి
హితబలాఢ్యునిఁ గృష్ణు నెఱిఁగి యిట్లనియె.

ప్రభాసతీర్థమందు మునిఁగి చనిపోయిన కుమారుని తెచ్చిపెట్టుమని శ్రీకృష్ణుని గర్గ్యుఁడు కోరుట


“తనర ప్రభాసతీర్థములోనఁ దొల్లి
మునిగిపోయినపుత్రు మొగిఁ దెచ్చియిమ్ము
[6]డిది దుష్కరపుకార్య మిటు సేయుఁ” డనిన
యగుఁగాక యని ప్రీతి హాలియును దాను
నగణితాయుధపూర్ణమగురథం బెక్కి

శ్రీకృష్ణుని సముద్రుఁడు పూజించి వచ్చినపనిఁ దెలియఁజెప్పుమనుట


చను దేర; నెదురేఁగి జలరాశి మ్రొక్కి
యనుపమదివ్యరత్నాళిఁ బూజించి
“తామరసాక్ష! మాధవ! లోకవంద్య!
ఏమి విచ్చేసితి రెఱిఁగింపు” మనుఁడు;
“తొడరి మాగురువుపుత్రుని మ్రింగినాఁడ
వుడుకకఁ దెచ్చి మా కొప్పించు” మనిన;
“నా కేమి పని యిది? నాలోన నుండి
భీకరాకారుండు పృథుకంపురూపుఁ310
డగురాక్షసుఁడు మ్రింగె” నని చెప్ప శౌరి
యగణితశక్తిని యంబోధి నుఱికి
వేదచోరునిఁ దొల్లి విదళించుభంగి
నాదుష్టదనుజుని యడగించి వాని
కడుపులోనున్న శంఖము పుచ్చుకొనుచు
తడయక వెడలి రథంబెక్కి కదలి

శ్రీకృష్ణుఁడు యమలోకమునకు వెళ్ళి గురుపుత్రుని యసువులను దెచ్చుట


కాలుని పురము దగ్గర వచ్చి శౌరి
కాలమేఘధ్వనిగతి శంఖరవము
సేసిన, యముఁడు గాసిల్లి యేతెంచి
యాశౌరి బొడగాంచి యర్థి పూజించి
“యేమి వేంచేసితి రిందిరాధీశ!
నామీద కృపఁ జేసి నా కెఱింగింపు”
మనవుఁడు “గురుపుత్రు నక్కటా! ఏల
కొనివచ్చినాఁడవు? కోరి నాకొసఁగు”
మనవుఁడు సమవర్తియు విప్రతనయుఁ
గొనివచ్చి వెస లోకగురునకు నిచ్చె
ఏపార జమునింటి కేఁగిన సుతుని
కోపించి లావునఁ గొనివచ్చి శౌరి
గురులముందటిఁ బెట్ట గోవిందుఁ జూచి
హరుషనిర్భరచిత్తుఁడై పలికె నతఁడు320
“భూరిసత్వాఢ్యులు పుణ్యమానసులు
కారణపురుషులు గారె? ఎవ్వరికి
జమునిల్లుఁజొచ్చినఁజత్తువుఁ దెచ్చు
నమితసత్వాఢ్యు లీయవనిలో గలరె?
నాకోర్కిఁ దీర్చితి నాపుత్రు నిచ్చి
యాకల్పసుఖలీల యవుగాక మీకు”.
అనియర్థి దీవించి యవ్విప్రవరుఁడు
తనర వీడ్కొల్ప నిద్దఱు రథం బెక్కి
యమరపట్టణతుల్యమైపోల్చు మధుర
కమరలోకార్చితు లరుదెంచి రెలమి.

తల్లి దండ్రులకును దగునుగ్రసేను
వల్లభునకు మొక్కి వారిజోదరుఁడు
మతిసురాచార్యుఁడై మాన్యుఁడై పొల్పు
నతని నుద్ధవుఁడనుయాదవుఁ జూచి

శ్రీకృష్ణుఁడు ఉద్ధవుని మందకుఁ బుచ్చుట


తనరార మన్నించి తగఁ గౌఁగిలించి
కొని బుజ్జగించి మ్రొక్కుచు సీరి వలికె.
"ఏపార వ్రేపల్లె కేఁగి యానంద
గోపయశోదలఁ గొమరారఁ గాంచి
మక్కువ వారిసేమములెల్ల నడిగి
మ్రొక్కితినను, నేము మొగి తమ్ముఁ జూడ330
వచ్చెదమను, వేగ వసుదేవు దొంటి
యిచ్చటిచుట్టాలు యేమును గలసి
యున్నారమను, మమ్ము నుగ్రసేనుండు
మన్నించునని చెప్పు, మఁదలోఁ గల్గు
గొపాలకుల నెల్లఁగోరి వేర్వేర
నేపార నక్కుననిడినంటి ననుము;
ననుఁ బాసి మదనబాణములలో దారి
ఘనమైన విరహాగ్నిఁ గ్రాఁగుచునున్న
వల్లవసతుల నెవ్వగలెల్లఁ దీర్ప
నెట్లుటిలోన నే నేతెంతుననుము
పొమ్మన్న” నయ్యదుపుంగవుఁ డెలమి
క్రమ్మర రథ మెక్కి కదలి మాపటికిఁ
గర మొప్ప రవికన్యగాతీరభూమి
బొరి గిన్నరేశునిపురి గ్రేణి సేసి

సకలసంపదలకు సదనమై పొలుచు
నకలంకగతి మందకరిగె నుద్ధవుఁడు
తనరాక నెరిగింపఁ దగ నందుఁ డెదురు

నందుఁడు ఉద్ధవుని పూజించి శ్రీకృష్ణునివృత్తాంత మడుగుట


చనుదెంచి యతనికి సాష్టాంగ మెఱఁగి
కొనిపోయి పెక్కుభంగులఁ బూజసేసి
యనుపమప్రీతిమై నప్పుణ్యధనుని340
యలవడ మజ్జనయాహారవిధుల.
వలయకఁ దీర్పించి యతని కిట్లనియె.
"దేవకియును వసుదేవుఁడు సుఖులె?
కోవిదగ్రామణి కొడుకులుఁ దాను
సురచిరప్రీతిమై సుఖమున్నవాఁడె?
హరి మమ్ముఁ దలఁచునే యప్పటప్పటికి?
సురలోకవైరిఁ గంసుని నేలఁగూల్చి
ధరణిరాజ్యము వానితండ్రికి నొసఁగి
యన్నయుఁ దమ్ముఁడు నతులితప్రేమ
నున్నారె సౌఖ్యులె, యుద్ధవాచార్య
బలురక్కసులబారిఁ బడి చావనీక
చెలఁగు మహాదావశిఖి గ్రాఁగనీక
యహివిషానలవహ్ని నడగంగనీక
మహనీయమగువాన మడియంగనీక
యప్పటప్పటికి మమ్మరసి గండములు
దప్పించి రక్షించె దానవారాతి.

కడపటఁ దనుఁ జూడఁ గానక యేముఁ
బొడవడఁ బొక్కకఁబోలు రాఁడాయె;
నతని విక్రమలీల లాత్మలయందు
సతతంబు దలఁచి నిశ్చలవృత్తు లగుచు350
వ్రేపల్లె విహరించు వెలఁదులు పతులు
నాపూర్ణధన్యులు యగుదు రేప్రొద్దు
మాయింటఁబెరిగిన మందెమేలమున
నాయన్నదమ్ముల నాత్మజు లనుచుఁ
దలఁతుము దేవతాతనువులు గాక
యిలనిట్టి విక్రమం బెవరికి గలదు?”

ఉద్ధవుఁడు శ్రీకృష్ణుని గుఱించి యశోదానందులకుఁ జెప్పుట


అనిపల్కి నందుండు నయ్యశోదయును
మనమున హర్షించి మ్రాన్పడి మేను
గరుపార హర్షాశ్రుకణములు దొరుగఁ
బొరిఁబొరిఁ జిత్రరూపులుభంగి నున్న
యాదంపతులఁ జూచి యనియె నుద్ధవుఁడు.
"వేదాంతవిదుఁడైన విష్ణునియందుఁ
బూని మీచిత్తాబ్దములుఁ బెట్టినారు
కాన యెందును బుణ్యకర్మలు మీరు.
కృష్ణ! జనార్దన! కేశవ! శౌరి!
విష్ణు! నారాయణ! వేదాంతవేద్య!
అని తలంచినవారి కఘములు వొలియుఁ
బెనుపార వారలఁ బెంచి పోషింప
మీభాగ్వమహిమకు మితి వేరె కలదె?

శోభనాఢ్యుల మిమ్ముఁ జూడంగఁగలిగె;360
హరికిని మీమీఁది యర్మిలి ఘనము
సొరిది మిమ్మందఱిఁ జూడంగ వచ్చు
జననంబు మరణంబు శత్రులు హితులు
తనువు లింద్రియములు తల్లిదండ్రులును
నతని కెవ్వరు లేరు యతఁడె యందఱికిఁ
బతి, జగత్పతి, రామపతి, సర్వసముఁడు,
నిర్గుణుండయ్యును నిఖిలంబుఁ ద్రావ
స్వర్గాదులకు వచ్చు సర్వాత్ముఁ డతఁడు;
అతఁడు సర్వాత్ములయందె కాపుండు
నతనివ్వతిరిక్తమది లేదు దలఁప”.
అనియిట్లు బోధించి నవ్విభావరియుఁ
జనియె నంతట గోపసతు లొప్ప పెరుగు

ఉద్ధవుఁడు వ్రెతలఁ గన్గొనుట


ద్రచ్చుచు ఘుమఘుమధ్వనులతోఁ గృష్ణు
సచ్చరిత్రముఁ బాడు సామగానములు
ఘోషింప నంత నర్కుఁడు దోఁప వినయ
భాషణుఁడగు నెదుప్రవరుఁడు వెడలి
యరదంబు వెసనెక్కి యమునకు నరిగి
తరమిడి కాలోచితంబులు దీర్చి
చనుదెంచి వల్లవసతుల నీక్షించి
యనునయోక్తుల వారినందఱఁ బిలిచి370
తప్పక కృష్ణుఁడు తమతోడ మున్ను
చెప్పినమాటలు నేర్పుగాఁ జెప్ప

విని గోవరమణులు వెఱఁగంది యతనిఁ
గనుఁగొని పలికి రుద్ధతబాష్పు లగుచు,

విరహార్తలగు గోపభామినులు ఉద్ధవునిఁ జూచి పలుకుట


“హరి నిన్నుఁ బుత్తేర నరుదెంచి యంత
వరయశోదకును నవ్వార్తలుఁ జెప్పి
యూరకె పోవేల? ఒగి మమ్ముఁ జూచి
చేరి స్వామిహితంబుఁ జెప్పెదుగాక!
ఇట నింక నెనరువా రెవ్వరు గలరు?
కటకటా! మమ్మేల కమలాక్షుఁ డడుగు?
అడిగెడివాఁడైన నరుదేఁడె యిట్లు
విడుచునే మమ్ము నీవిరహాగ్నినడుమ?"
అని పల్కి కృష్ణుని యంగంబుసొబగుఁ
కనుబారులీలలు, తనువు చిత్తమునఁ
గ్రొత్తైన విరహాగ్ని గురుసులు వార
నత్తలోదరులు సిగ్గరి యాడిపాడి
యొకయింతి కుసుమగుచ్ఛోద్ధూతమధువుఁ
బ్రకటితంబుగఁ గ్రోలి పాడుచునున్న
మధుపంబుఁ జూపి నెమ్మది మాటువెట్టి
మధురగర్వోక్తి నున్మాదియై పలికె.380

గోపికల విరహము


“చంచరీకమ! నీవు చంచలాత్ముఁడవు
వంచకుండవు పుష్పవతులఁ గీలింతు
నిలిచినకాలున నిలువ వేప్రొద్దు

మలినాంగుఁడవు దానమహిమ కాసింతు
వెచ్చోటి కైనను నేఁగుదుగాని
మచ్చిక కల్గునా? మరియొల్ల; నీవు
పక్షపాతివి నీవు బహుచుంబకుఁడవు
వీక్షింప నివి నైజవిద్యలు నీకు!
ఏలయ్య! మధుకర! ఈపుష్పరసముఁ
గ్రోలెడు వేడుకఁ గులకాంతమీఁద
నెయ్యంబు వదలెడు నినుఁ బాసియంత
దయ్యదే నొవ్వదే దర్పకుఁజేత?”
అని పెక్కుభంగుల నన్యాపదేశ
మునఁ బల్కుచున్న యప్పొలఁతులఁ జూచి
యల్లన నుద్ధవుం డాకృష్ణుమాట
లెల్లను బల్కుట యెఱిఁగి యిట్లనియె.

ఉద్ధవుఁడు గోపికల నూరార్చుట


“దానతపోధ్యానధర్మవర్తనల
కైనను గలుగ దీహరిభక్తిపెంపు
తనయులఁ బతులను దల్లిదండ్రులను
యనుగులఁ జుట్టాల నందఱి విడిచి390
హరియందు మర్ములు నైతిరిగాన
నిరవార మీభాగ్య మేమని చెప్ప!
హరి వేడ్క మీతోడ ననుమన్నపలుకు
వెరవేది చెప్పద వినుఁడు యిండఱును
సర్వేంద్రియంబులు సమతఁ బోషించు
నిర్వికల్పజ్ఞాననిధియైన నన్ను

విరహాగ్నినెపమున వెలుపల మఱచి
పరమయోగధ్యానపరులచందమున
పరమానురక్తి హృత్పద్మంబులందు
చిరలీల నిలిచి భజింపుటఁ జేసి
మీతలంపులయందు మెలఁగుదుఁగాని
మీతో వియోగమేమియు లేదు మాకు
నిచ్చట పనిఁజూడ నెఱిఁగి మీకడకు
వచ్చెదననియె నవ్వసుదేవతనయుఁ"
డని చెప్ప, నుద్ధవాచార్యునిఁ జూచి
మనసిజోన్మాదులై మగువలిట్లనిరి.

గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట


“నల్లని మే నున్నతమైన యురముఁ
దెల్లదమ్ముల మించు తెలిగన్నుగవయు
నెరిజడ చొళ్లెము నిటలరేఖయును
జిరునవ్వు మోమును జేత వేణువును400
నాయతబాహులు నధరంపుకెంపు
పాయక జిగిమించు పసిఁడిచేలయును
[7]దలఁబురిపెనపు కదంబమంజరియు
ధళధళ వెలుఁగెడు దంతదీధితియుఁ
గలరూపు మోమున గట్టినట్లుండ
తలఁచకుండిన నుండు తలఁచిన నుండు
[8]కలలందు మాతోడఁ గవయుచు నుండు
నెన్నడు వచ్చునో యిందిరావిభుఁడు

కన్ను లాకలి తీర్పగలుగునో?" అనుచుఁ
దరుణులు ప్రేమ నుద్ధవుఁ జూచి “మమ్ము
నెరవుగాఁ జూడ నిందు రమ్మనుచు
నిక్కడఁ గృష్ణుఁడు, ఇందఱుఁ జూడ
గొక్కెరరక్కసుఁ గూల్చిన చోటు;
గిరికొని యున్నది కేళిమైఁజూడ
హరిచేత [9]గతజన్ముఁ డఘదైత్యు డొక్క;
యావులఁ గృపను మమ్ముందఱిఁ గాచి
గోవిందుఁ డెత్తిన గోవర్ధనాద్రి;
సఖులుఁ దానును శౌరి చల్దులు గుడిచి
సుఖలీల నుండిరి సురవొన్న నీడ;410
నీసైకతస్థలి నిందిరావిభుఁడు
రాసకేళిఁ జరించు రమణులుఁ దాను;
జల్లని యీరూపచాయ మురారి
పిల్లగ్రో లూదు గోపిక లాత్మ మెచ్చ;
నాపొన్న క్రిందఁబో హరి వేడ్క లెల్ల
గోపిక లలుక గ్రక్కున మెక్కి తీర్చె;
బలభద్రుఁడును దాను బసుల మేవుచును
యలమి చిమ్మనబంతు లిచ్చట నాడు;
పొలుచు నీగురివింద పొదరిండ్లలోన
జలజలోచనఁ గ్రీడ సలిపి మాధవుఁడు
అమ్మానినీడ నాకిఱిఁ గౌఁగిలించి
తమ్మఁ బ్రసాదించె తామరసాక్షుఁ”
డని పెక్కుభంగుల హరివిచారములు

ఉద్ధవుఁడు గోపికల మాటలను విని వారి పుణ్యమునకై మెచ్చుకొనుట


తనరారఁ జెప్ప నుద్ధవుఁడు చిత్తమున;
“వీరు దన్యాత్ములు వీరు పావనులు
వీరికి శౌరికి వేరు లేదెందు
వీరలఁ గనుఁగొంట విష్ణునిఁగంట
వీరికై హరివచ్చి వ్రేపల్లెఁ బెరిగె
నిన్ని చందంబుల నీమందవారి
మన్నించి కృష్ణుడు మమళ వాపించి420
నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నించి
యీమహాకార్యార్థ మిటు వచ్చె శౌరి
యిది జన్మఫలసార మిది దోషమార
మిదిగదా సౌభాగ్య మిదిగదా యోగ్య"
మని సంతసిల్లుచు, నతివలుఁ దాను
జనుదెంచి ప్రేమ మజ్జనభోజనములు
సలిపి, గోపికలు నిచ్చలు మానసములఁ
గలిసి చెప్పక విష్ణుకథ లెల్ల వినుచు;
నందయశోద లున్నతిఁ గారవింప
మందవారెల్ల సమ్మతి విందులిడఁగ
నొకకొన్ని నెలలుండి యుద్ధవుఁడంత;

ఉద్ధవుఁడు మధురానగరికి మరలుట


యకలంకగతి వార లనుపంగఁ గదలి
మధురకుఁ జనుదెంచి మాధవు గాంచి

మధురోక్తి నచ్చటి మాటలు చెప్ప;
నందంద నడుగుచు నప్పటప్పటికి
మందలోఁగలుగు సేమములెల్ల వినుచు
ననుపమయోగవిద్యాలీల శౌరి
తనుఁబొందఁగోరిన తరుణి నెంతయును

శ్రీకృష్ణుడు కుబ్జయభీష్టమును నెరవేర్చుట


గరిగామియగు గంధగౌరకి యింటి
కరుదేర నది శౌరియడుగుల కెఱఁగి480
మజ్జనభోజన మహితసౌఖ్యముల
నజ్జగన్నాథున కతిభక్తిఁ దనుపఁ
బువ్వులసజ్జపై పుండరీకాక్షుఁ
డవ్వేళఁ గృప నంగజాహవకేళి
దాని యభీష్టంబు దయనిచ్చి శౌరి

శ్రీకృష్ణుఁడు అక్రూరుని మందిరమునకుఁ జనుట


మానుగా నక్రూరుమందిరంబునకుఁ
జనుదేర నెదురుగాఁ జనియు నొండొరుకు
వినతుఁడై చనుదెంచి వేతెఱంగులను
గంధమాల్యాంబరఘనభూషణముల

అక్రూరుఁడు శ్రీకృష్ణుని స్తుతియించుట


బంధురార్చనలిచ్చి ప్రణుతుఁడై నిలిచి
“మాన్యుఁడ నైతిని మత్కులం బెల్ల

ధన్యమై వెలుఁగొందె తామరసాక్ష!
కులముద్దరించితి కులశైలధైర్య!
నీవ భూతంబుల నెరయఁబుట్టించి
ప్రోవనడపఁగనోపు పురుషుండ వీవ
[10]సకలంబుఁ గనుఁగొను సాక్షివి నీవ
వసుదేవునకును దేవకి కుద్భవించి
వసుధభారము మాన్చి వైరుల నడఁచి440
యక్షయ! నీచేత నసురసైన్యంబు
లక్షోహిణిశతం బణఁగిపోగలదు;
దేహబంధంబులుఁ దెలియంగ లేక
మోహాంధుఁడైన నామోహపాశములు
దెగఁగోసి నాకోర్కి తెఱవానతిమ్ము
సగుణనిర్గుణరూప! సత్యసల్లాప!"
అని వేడుకొనియెడు నక్రూరుఁ జూచి

శ్రీకృష్ణుఁడు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై హస్తినాపురికిఁ బుతైంచుట


“అనఘ! పితృపివ్యుండ వాత్మబంధుఁడవు
సరసవాక్ప్రౌఢిని సౌమ్యచిత్తుఁడవు
పరమాప్తుఁడవు మాకు బంధులలోన
నీయట్టి చెలికాఁడు నీయట్టి సుకృతి
నీయట్టి సుజ్ఞాననిధి యెందుగలఁడు?
మాతండ్రి యట్లట్ల మమ్ము శిక్షించి

యీతెఱంగని చెప్పు దేకార్యమైన;”
ననిపల్కి కమలాక్షుఁ డక్రూరుఁ జూచి,
తనరార బాంధవత్వముఁదోఁపఁ బలికె.
“ఆనకదుందుభియనుజ! ధర్మాత్మ!
మేనత్త మాకు నర్మిలి తల్లికంటె
పెనిమిటి గడచన్న బిడ్డలుఁ దాను
మనపట్టు లేక యున్మలికతోఁ గొంతి450
క్రూరాత్ముఁడగు బావ కుదురునేయున్న
యారాజపుత్రులు యసమపాహసులు
తమ్మునిపాలుఁ దత్తనయుల కిచ్చి
నెమ్మదినుండగ నేరఁ డానృపతి
వారికి వీరికి వసుధకైఁ బోర
నీరసంబున మీఁద నెట్లు గాఁగలదొ?
కరివురి కేఁగి యక్కడ పాండుసుతుల
నరసి యిచ్చటి సేమమంతయుఁ జెప్పి
[11]గర్వితుఁడగు కంసుఁ గడపి తజ్జనకు
నుర్వి యేలింపుచున్నారమనుము
ధృతరాష్ట్రుచందంబుఁ దెలిసి
మతులెల్లఁ దెలిసి క్రమ్మర వేగరమ్ము
పొ మ్మందఱకుఁ గట్నములు భూషణములు
నిమ్మంచు” చెప్పించి యిచ్చి యాలోన
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి
బద్ధానురాగుఁడై పద్మాక్షుఁ డుండె.

అక్రూరుఁడు హస్తినాపురిఁ బ్రవేసించుట


అరుదార నక్రూరుఁడట రేపఁగదలి
యరదంబు వెసనెక్కి హస్తినావురికి
నరిగి యాధృతరాష్ట్రు నలమొగసాల
నరదంబు డిగిపోవ నటయింద్రులీల460
కొలువిచ్చి యున్న యాకురురాజుఁ గాంచి
యలసతఁజని యల్ల నడుగుల కెఱఁగ
గద్దియపై నుండి కౌఁగిటఁ జేర్చె;
గద్దియఁ దనగద్దెఁ గదియఁబెట్టించి
యర్హపూజలఁ డన్ప నక్రూరుడంత
హరియిచ్చు కట్నంబు లారాజు కిచ్చి
సేమంబు లడిగి తత్సేమంబుఁ జెప్పి
ప్రేమ కాలోచితప్రియములుఁ బలుక
విడియంగఁ బంపించి విదురుని యింట

అక్రూరుఁడు విదురునియింట విడియుట


విడియు మట్లని చెప్పి వీడుకొల్పుటయు;
నతని మందిరమున కరుగంగ విదురుఁ
డతులితగంధపుష్పార్చన లిచ్చి
పొలుపార మజ్జనభోజనవిధులు
సలిపి యిద్దఱు మృదుశయ్యల నుండి
హరి జనించిన మొదలె, వచ్చి మధుర
దొరసి యేలుచునుండఁ దుదియైనలీల
లక్రూరుచే విని హర్షాశ్రులొలుకఁ
జక్రాయుధునిఁ దల్చి సాష్టాంగ మెఱఁగి

పులుకలు మైఁగ్రమ్మఁ బుండరీకాక్ష!
జలశాయ! గోవింద! శౌరి! శ్రీకృష్ణ!470
అని భక్తిఁ గీర్తించి యతనిఁ దోడ్కొనుచుఁ
జనుదెంచి పాండుని సతి యింటికడకు

అక్రూరుఁడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్నఁ గావించుట


నరుదేరఁ గొంతియు నక్రూరుఁ జూచి
కరచకితాస్యయై కన్నీరు దొరుగ
నెలుఁగెత్తి యేడ్చుచు నెడయైన వగలఁ
బలుమారు పలవింపఁ పడతి నూరార్చి
ధర్మనందనవృకోదరపార్థకవల
నర్మిలి కౌఁగిట నందందఁ జేర్చి
యందఱ మణిభూషణాళిఁ బూజించి
కాందినీసూనుఁ డాకమలాక్షి కనియె.
"అమ్మ మీమేనల్లుఁ డమరేంద్రవంద్యుఁ
డమ్ముకుందుఁడు మిమ్ము నరయఁ బుత్తెంచె.
పాండుమహీపతి పరలోక మరుగ
నిండిన వగలతో నీవుఁ బుత్రులను
యిచ్చటి కరుదెంచి రెఱిఁగి రమ్మనిన
వచ్చితి, నచ్చట వసుదేవుఁడొంటి
మనవారలెల్ల నెమ్మది నున్నవారు
ఘనపాపకర్ముని గంసునిఁ ద్రుంచి
ధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి
హరి యెల్లశత్రుల నణఁచుచున్నాఁడు;480
తగిన మీకిట్టిదుర్దశ వొందు టెఱిఁగి

వగచుచునుండు నావసుదేవసుతుఁడు;
తనపుత్రులట్ల తాఁదలఁచి నీసుతుల
యనుఁగొప్ప బ్రోచునా యాంబికేయుండు?
దుర్యోధనాదిపుత్రులు వీరితోడఁ
గ్రౌర్యంబు లెడబాసి కలసియుండుదురె?
పండితసామంతబంధులు మిమ్ముఁ
బాండుఁ గొల్చినయట్ల భజియింతురమ్మ?”

అక్రూరునితోఁ గుంతి తనకష్టములను జెప్పుట


అని పల్కుటయుఁ గొంతి యక్రూరుఁ జూచి
యనుకంపతోడ నిట్లని యల్లఁ బలికె
“ఆరాజు సముఁడౌను యతని నందనులు
క్రూరులు ప్రజ వీరిఁ గొలువంగనీరు.
అదిగాక బిడ్డల నందఱిఁద్రోచి
మదిఁబూని బంధించి మడుగులోపలను
గరళంబు పెట్టించి ఘనసర్పవితతి
పరువడి గరపింపఁ బ్రాణగండములు
దలఁచిన వీరును తప్పుగాఁ గొనరు
వలదని సుతులను వారింపఁ డతఁడు
దైవంబుకతన నింతలు బారులడఁగె
గోవిందుతోడ మాకుశలంబుఁ జెప్పు490
పుట్టిన యిల్లునుఁ బొరిఁజొచ్చినిల్లు
నిట్టిదె మాభాగ్య మేమంచు వగవ
దేవకి కడుపున దేవేంద్రవంద్యు
డావిష్ణుఁ డుదయించునని పెద్ద లాడఁ

బలుకులు విందు రాభాగ్యంబు కతనఁ
దలఁచిన తలఁపులుఁ దలకూర్చె దైవ
మ”ని చెప్పుటయు విని యక్రూరుఁ డంత
వినయంబుచేఁగొని విదురుడుఁ దాను

అక్రూరుఁడు కుంభజాదులయిండ్లకుఁ జనుట


దుర్యోధనాదిపుత్రుల గుంభజాది
యార్యుల కర్ణాదులగు యోధవరుల
నాపగా [12]దాయాదులగు బంధుజనుల
నేపారఁగని వారియిండ్లకు నరిగి
కుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచి
దృతరాష్ట్రు కడ కేఁగి తెంపును దగవు
[13]హితవును ధర్మంబు నేర్పడఁ బలికె

అక్రూరుఁడు ధృతరాష్ట్రునికి హితోక్తుల నుడువుట


“ధరణీశ! నీవును ధర్మచిత్తుఁడవు
భరతవంశాఢ్య! నీ ప్రతియవ్వ రెందు!
పాండుభూపతి నీకుఁ బరమభక్తుండు
దండివీరుఁడు నిన్ను ధరణి యేలించె500
నాతనిపుత్రుల కతిబలాఢ్యులకు
బైతృకంబగు రాజ్యభారంబుఁ బంచి
యిచ్చిన నీకుఁ బెంపెక్కు లోకములఁ
[14]బొచ్చంబుఁగల్గఁ బోవుదు వధోగతికి

నీపుత్రమిత్రులు నీశరీరంబు
నీపురి యీరాజ్య మింతయు మిథ్య
మేలుగీడును గడ మి మ్మొందుఁ గాని
కాలంబుచేతఁ గ్రాఁగనివారు లేరు
హరి పాండుపుత్రుల కాత్మబాంధవుఁడు
హరి సంతసించుట యది లెస్స మనకు
చిత్త మేభంగియో చెప్పితి"నంత
నుత్తరం బీఁజూచి యొయ్యనఁ బలికె
“నీ వాడినన్నియు నిజమంటి, తెఱఁగుఁ
గావింతు నట దైవగతి యెట్టిదగునొ?
[15]అమృతతుల్యములు నీవాడు వాక్యములు
కమలనాభునకు నీక్రమ మెఱిఁగింపు.”
మని పల్కి, హరి కుపాయన మిచ్చి యతనిఁ
దనరారఁ బూజించి దయ వీడుకొల్ప
నరిగి పాండవులతో నంతయుఁ జెప్పి
యరయ సౌఖ్యము నొంది యక్రూరుఁ డంత,510

కంసుని భార్యలు మగధేసునివద్ద మొఱయిడుట


అస్తియు.............నను కంసుభార్య
లస్తికుండలను మగధాధీశు సుతలు
హరిచేతఁ దమభర్త యడఁగిన దుఃఖ
పరవశలై తండ్రిపాలి కేతెంచి
యడుగులపైఁ బడి యడలూనఁ జెప్పఁ

గడురోషభీషణాగ్రహవృత్తిఁ బలికె
“ఏమేమిరా! కృష్ణుఁడే యింత సేసె!
భూమి నయాదవంబుగ సేయవలయు"

మగధేశుఁడు యాదవులపై దండెత్తుట


నని పల్కి, యందంద ననిభేరి వేయ
ఘనభాంకృతుల నబ్ధిగలఁగ సైనికుల
నీక్షించి మొనలేర్చి యిరువదినాల్గు
యక్షోహిణులఁ గూడి యటవచ్చి మధుర
వెడలె మైముచ్చుట విడిసిన ప్రజను
వొడకుండ శ్రీకృష్ణుఁ డుగ్రసేనాదు
లగువారుఁ దానుఁ గార్యాలోచనంబుఁ
దగఁ జేయ వేగ నందఱుఁ జూచుచుండ

యాదవమాగధుల యుద్ధము


దివ్యరథంబులు దివ్యాయుధములు
నవ్యోహగతి వచ్చి హరిమ్రోల నిలిచె
నప్పుడు కమలాక్షుఁ డన్న నీక్షించి
“తప్పక చూడు యాదవకోటి నెల్ల
మడియఁగాలంబన మనమీఁద నాజి
నడచి వచ్చిరి వీరి నడఁపక నుండ
నొండుపాయంబున నుడుగునే వీడు?
దండిమీరిన యాయుధంబులుఁ బూను”
మనవుఁడు ముసలము శూలమునుఁ బుచ్చు

కొని దివ్యరథముపైఁ గొమరారె సీరి,
హరి శంఖచక్రగదాదిశార్ఞముల
ధరియించి కరమొప్పఁ దనరథం బెక్కి
మేరుశిఖరముల మెఱుఁగులతోడ
సారమై బహువిధచ్ఛాయలఁ గలిగి
[16]ధారాధరము బంగిఁ దనరారెఁ జూడ;
నాలోన వృష్టిభోజాంధకాధిపులు
నేలఁబట్టవియించి నిష్టురోక్తులను
గరిఘటాబృంహితఘననేమిరావ
తురగఘోషితరావతూర్యముల్ మ్రోయఁ
బురికొని వెడలి యార్పులు నింగి ముట్టఁ
బరవసంబునఁ దాఁకెఁ బరగ సైన్యములు;
నేలయీనిన భంగి నిగిడి “యే మేము
చాలుదుమనివచ్చు" సైనికోత్తముల530
యురుపాదహతులను నోర్వక దివికి
నరిగెనో యన ధూళి యర్కునిఁ గప్పె;
నప్పుడు గోవిందుఁ డఖలసైనికులు
నుప్పొంగ నిజశంఖ మొత్తె, నొత్తుటయుఁ
బెడరి దిగ్గజములు, భీతిల్లె దిశలు,
కదలె కులాద్రులు, కలఁగె వారిధులు
వంగె మేరువు, ధరావలయంబు దిరిగె,
క్రుంగెఁ గచ్ఛపరాజు, ఘూర్ణిల్లె నభము,
కెరలి సేనలు పెల్లగిలి పారఁజూచె
శరపరంపరలు భీషణముగా నిగిడి

కరములు దునిసి యంగంబులు నాటి
శిరములు వెసఁ ద్రుంచి శిడములు నఱికి
బరులు వ్రక్కలు వాపి పదములు విఱిచి
కత్తళంబులు చించి కంఠంబు లెడపి
నెత్తురు వెడలించి నెనళ్లు గలఁచి
కండలుఁ దెగఁజెండి గాత్రంబు లడఁచి
గుండెలుఁ గూల్చి ప్రేగులు వెల్వరించి
బొమ్మిడకల్ రాల్చి బొడగలుఁ గూల్చి
యెమ్ములు నలిసేసి యెఱచులు చదిపి
పొరి వీరి వారిని బోలింపరాక
బెరసె పీనుగులై పృథివియంతయును;
హలికుండు నఱికిన యడవిచందమునఁ
గలసి కాల్వురు చాపకట్టుగాఁ బడిరి
ముందఱ బయలైన మొనసి రావుతులు
యందఱు నొక్కసాహసకేళి సలిపి
తురగంబు రవుతును దునుకలై పడఁగఁ
దరవలికత్తి నుద్ధతి మొత్తువారు
లవుణి వ్రేశిన మేను లవుణియై తిరిగి
తివిరి ఖడ్గంబులఁ దెగవ్రేయువారు
యంతళంబుల మేను లందంద పొడువ
నెత్తురు వఱ్ఱలై నెఱిఁ గూలువారు
మునిగాళ్లు తెగి వాహములు మ్రొగ్గ సరకు
గొనక మార్తురమ్మని కొనునాశ్వికులును
యమ్ములు తగనాట యావల వెడలి
బొమ్మలక్రియఁ గూలి పొలయు గుఱ్ఱములు

తుండంబు కొమ్మును దునియ రోఁజుచును
గొండలవలె వ్రాలు కుంజరంబులును
నొగలూడి యిరుసులు నులిసి చక్రములు
పగిలి రథంబులు ప్రాణంబు లెడలి
రథికులు మడిసి సారథు లుర్విఁ గూలి
రథములు వికలమై రణభూమి నిండె.
కీలాలనదులలోఁ గీలాలకేళి
నోలలాడుచునుండు నోలిభూతములుఁ
గంకగృధ్రాదుల కలకలంబులును
బింకఁబుతో నాడు భేతాళములును
గొడుగులచిప్పలు గుబురులై పడిన
పడగలు తుమురైన బహుశస్త్రములును
నాడెడు నట్టలు హతవీరవరుల
నాడకుఁ గొనిపోవు నమరకామినిలు
నీభంగి రణభూమి యెసఁగి చూడ్కలకు
బీభత్సరవములు బెరసి యాలోన
సరభసంబున జరాసంధుఁడు తరుమ
భరమంది యాదవబల మోహటించి
[17]విరిసిన సేనఁ గవిసి యార్చుచును

శ్రీకృష్ణబలరాముల యుద్ధవర్ణన


తరమి యుద్ధతలీల దాలాంకు డంత
నరదంబు వరపించి యట్టహాసమున
శరలాఘవమున భీషణవృత్తిఁ గురియ

[18]మ్రగ్గె నేనుఁగలు మడిసె గాల్బలము
మ్రొగ్గె రథము లశ్వములుఁ గీటడఁగె.560
అక్షీణబలశాలియగు సీరిచేత
నక్షోహిణులు పడి యవనిపైఁ గూలె.
గరుడకేతనకాంతి గగనంబుఁ గప్ప
యరదంబు రప్పింప హరి యాజి కెఱఁగి
పటుశౌర్యనిర్ముక్తబాణజాలముల
విటతాటమై కూలె వీరసంఘంబు
హరివజ్రహతిఁ గూలె నటవారణములు
తరిమి కృష్ణుని చక్రధారలచేతఁ
బరివరలై మ్రొగ్గె బహుశతాంగములు
దనుజారి నందకదారుణహతుల
తునకలై ధరవ్రాలె తురగసంఘములు
నడవుల నేర్చు దావాగ్ని చందమునఁ
గడువడి శౌరి సంగరకేళి సల్ప
నతనితోఁ బద్నాలుగక్షోహిణిలును
హతమయ్యె వెస బ్రహారార్ధమాత్రమున

తనసైన్యముయెక్క పాటును జూచి జరాసంధుఁడు విజృంభించుట


నంతట మగధాధీశుఁ డాత్మసైన్యంబు
నంతకుకడ కేఁగు టంతయుఁ జూచి
ఘనరోషలయకాలకాలునిభంగి
తనర ధనుర్గుణోద్ధతి సింహనాద670

నేమి నిర్ఘోషంబు నెరపంగ రథము
కామపాలుని తేరుఁ గదియించి పలికె.
“పిన్నవాఁడవు మున్ను భీమసంగ్రామ
మెన్నఁడైనను జూచి యెఱుఁగుదే(నీవు)?
పటుశత్రువన దావపావకుండనఁగ
నిట జరాసంధుని నెఱుఁగవే తొల్లి?
తలఁ గోసివేసెదఁ దరలక నిలువు
కలఁచి నాయల్లునిఁ గ్రక్కింతుననుచు;”
యమ్ములు వఱగించ యందంద సీరి
యెమ్ములుఁ గీలింప నెంతయు నలిగి
యేమిటి కీరజ్జలిటు ప్రేలెదనుచు
నామహాబలశాలి యరదంబు డిగ్గి
వానకుఁ దలవంచి వచ్చు గోరాజు
పూనికె వానియమ్ములు లెక్కఁగొనక
ముసలంబుఁ గొని హయంబులఁ జావ మోది
యెసఁగి సూతుని తల నిల డొల్లవ్రేసి
గదిసి జరాసంధు కాయంబు మోముఁ
జదియంగ నడిచి నిశ్చలితుగాఁ జేసి
పెడగేలుఁ గట్టి యాభీమవిక్రముఁడు
పెళపెళ నార్చినఁ బేర్చి సైన్యములు580
పటహళంఖారావపటుసింహనాద
చటులఘోషముల దిక్సంధులు పగిలె.

కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదలి పుచ్చుట


కడువేగ హరి వచ్చి కరుణమై నతని

విడిపించి యనిపిన వెలవెల నగుచు
నసిహేతి హతశేషులగు వారుఁ దాను
మసలకఁ జనియె నమ్మగధభూవిభుఁడు
జయముఁ జేకొని రామజలజాక్షులంత
జయజయధ్వనులును సౌమగానములు
వందిమాగధభాగవతసంఘనినద
మందంద మ్రోయఁగ నమరేంద్రు లీల
పురము సొత్తెంచి యిమ్ముల రాజ్యభోగ
వరసౌఖ్యలీలల వ్రాలుచు నుండె
నాలో జరాసంధుఁ డఖిలబాంధవుల
నాలోచనము సేసి యప్పుడెంతయును
నలువొంద నిరువదినాలుగక్షోహి
ణులుఁ గూర్చి మధుర మున్నుగ వచ్చి ముట్టి
వదలకఁ దొంటికైవడి నొచ్చి పోయి
పదునెనిమిదిమార్లు బవరంబు సేసి
హరితో జరాసంధుఁ (డాహవకేళి)
బరిభవం బందుట పరికించి చూచి590

నారదుని ప్రోత్సాహముచే కాలయవనుఁడు సైన్యముతో జరాసంధునకు సహాయుఁడై వచ్చుట


యారూఢుఁడగు కాలయవనునితోడ
నారదుఁ డెఱిఁగింప నలివాఁడు కదలి
ఘోరసత్యుల మూఁడుకోట్లను నేర్చి
శౌరిపై దండెత్తి చనుదెంచె నంత;

జరాసంధకాలయవనుల దాడినిఁ జూచి శ్రీకృష్ణుఁడు క్రొత్తపట్టణమును నిర్మించుట


హరి రాముఁడును దాను నటు విచారించి
“పరఁగ యాదవుల కాపద వచ్చెఁ జూడు
డిదె వచ్చె బలవంతుఁ డీకాలయవనుఁ
డదె జరాసంధుఁడు నటవంక వచ్చె
నేది కార్యము? మన కీప్రోలనుండ
రాదు; నాశమునొందుఁ బ్రజయిందు నున్న
ననిపల్కి; గోవిందుఁ డబ్ధిఁ బ్రార్థించి
చనుదెంచి దేవతాశైలంబుపొంతఁ
గర మొప్ప వ్విశ్వకర్మ రావించి
పురము నిర్మింపఁ బంపుటయు నతండు
బహువప్రగోపురభర్మహర్మ్యముల
బహురత్నకనకవిభ్రమచిత్రితముల
తతి చెలంగగను ద్వాదశయోజనములఁ
జతురశ్రమంబుగా సౌభాగ్యలీల
వలను మీరఁగ ద్వారవతి యనుపేరఁ
గలిగింప నప్పురిఁ గని సంతసిల్లి600
తనరారఁ బారిజాతము సుధర్మమును
యనిమిషేంద్రుఁడు శౌరి వీథిఁ బుత్తెంచె
ధనదునిఁ దలఁచిన దన మహాద్రవ్య
మెనిమిది కోశంబు లిచ్చి పుత్తెంచె.
అధికయోగారూఢుఁడగు ముకుందుండు
మధురలోపలఁ [19]దన్ను మఱచి నిద్రించు

జనుల నెత్తుక రాత్రి చని ద్వారవతిని
దనరు మందిరములఁ దగుభంగి నునిచి
మరలి సీరయుఁ దాను మధుర కేతెంచి

కృష్ణుఁ డొంటరిగా కాలయవనునికడకుఁ జనుట


హరి నిరాయుధలీల నట కాలయవను
కడకు నిర్భయత నొక్కరుఁడు నేతేరఁ
గడుసోద్యమంది యక్కమలాక్షు నెఱిఁగి
యడరి దిగ్గన లేచి యటఁ గాలయవనుఁ
డడనయ్యె నదె పట్టుడని వెంటఁదగుల
హరి వానిఁ గడపట నందంద పరువ
వెరవేది వాఁడును వెనుకొని పలికె
“వీరధర్మము మాని వెలివారు నగఁగ
నీరీతిఁ బారుట యిది బంటుతనమె?
పగవాఁడు నీవెంటఁ బడ సిగ్గుమాలి
తెగిపారఁ బ్రాణంబు తీపటె కృష్ణ?610
పోవకు పోయినఁ బొరిగొందు” ననిన

శ్రీకృష్ణుఁడు వెంటఁ దఱుముచున్న కాలయవనుఁడు చూచుచుండగా నొకకొండగుహను బ్రవేసించుట


నావిష్ణుఁ డదరి మహాద్రిగహ్వరముఁ
జొచ్చిన వాఁడును జొచ్చి తోడ్తోన
నచ్చోట సుఖసుప్తుఁడగు పుణ్యుఁ గాంచి
హరి యదృశ్యుండైన యట నిద్రనొందు
నరుఁ గాంచి యతఁడు నున్నతప్రీతిఁ బలికె

శ్రీకృష్ణుఁడను భ్రాంతిచే కాలయవనుఁడు ముచికుందుని లేపుట


"ఓరి! గోపాలక! ఓర్వక వెఱచి
దూరించి వెడఁగుసందులుఁ జొచ్చి యచట
నిద్రపోయినఁ బోదునె? నిన్ను దీర్ఘ
నిద్రఁ బుచ్చెదనంచు నిగుడి తాఁకుటయుఁ
బెద్దకాలము నిద్రఁ బేర్చిన పుణ్యుఁ
డద్దురాత్ముఁడు చావ నట మేలుకాంచి
యీక్షింపఁ గాలాగ్నియెరఁ గాలయవనుఁ
డాక్షణంబున భస్మమై పోయె ననుఁడు

ముచికుందుని వృత్తాంతము


ఎవ్వఁడా పురుషుఁ డందేల నొక్కరుఁడు
నవ్విధి నిద్రితుఁడై యుండఁగోరె!
అతని చూపులఁ గాలయవనుఁడు కాల
గతమేమి? ఆయనకథఁ జెప్పవలయు”
ననుఁడు నాశుకయోగి యారాజచంద్రుఁ
గనుఁగొని విస్మయకలితుఁడై పలికె.620
కురువిభుఁ డిక్ష్వాకుకులవార్ధిచంద్రుఁ
బరహితచంద్రుఁడు ప్రథనసాహసుఁడు
మాంధాతసుతుఁడు నిర్మలమతి సత్య
సంధాస్యుఁ డఖిలరాజన్యశేఖరుఁడు
ముచికుందుడనువాఁడు మును దేవతార్థ
మచలితస్థితిఁ బోరి యసురుల నోర్చె.
అతనిని మెచ్చి యింద్రాదిదేవతలు

యతులితంబగు వరమడ్గవే యనిన
నారాజు పెక్కండ్రు యసురులతోడఁ
బోరాడి తనియకవో నిద్రఁ బోవ
“వరమిండు నన్ను నెవ్వఁడు మేలుకొలుపుఁ
బొరివాఁడు భస్మమైపోయెడు” ననుచు
దివిజుల వీడ్కొని ధృతి నొక్కశైల
వివరంబు సొచ్చి యవ్విధి నిద్రవొంద
హరిమాయఁ బడెఁ గాలయవనుఁ డీరీతి.

ముచికుందుఁడు శ్రీకృష్ణునిఁ గాంచుట


ధరణీశవర్యుఁ డంతట లేచి వచ్చి
జలజాక్షు దేహతేజస్ఫూర్తి బిలము
వెలుగొంది చీకటి విఱియుటఁ జూచె.
ఆయతాంబునేత్రు నతిదీర్ఘబాహు
తోయదనీలాంగు తుహినాంశువదను630
గనకపీతాంబరుఁ గౌస్తుభోద్భాసి
వనమాలితోరస్కు వారిజనాభు
మకరకుండలదివ్యమకుటకేయూరు
వికసితాలంకారు విష్ణునిఁ గాంచి
వెఱఁగంది యందంద వెఱచి గోవిందు
నెఱుఁగక ముచికుందుఁ డిట్లని పలికె.
“హరివహ్నిశశిభానులం దొక్కదివ్య
పురుషుఁడవో! కాక భువి నిట్టితేజ
మెవ్వరికున్న దిం దేల విచ్చేసి
తెవ్వరు నీనామ మెఱిఁగింపు” మనిన,

శ్రీకృష్ణుఁడు ముచికుందునకుఁ దన వృత్తాంతము నెఱుఁగఁ జెప్పుట


“వసుదేవతనయుఁడ, వాసుదేవుఁడను
ససమసాహసుఁ గంసు నవలీలఁ జంపి
మసలక రాక్షసమథనంబు సేసి
మధురాపురంబు నెమ్మది నేలుచుండ
నధికసత్వుఁడు కాలయవనుఁ డేతెంచి
నలిమీరి మాపట్టణము నిరోధింప
నెలయించి యాతని నిటు తోడి తేర
నీకోపశిఖిచేత నీరయ్యె నాతఁ
డేకతం బీగుహ నేల యున్నాఁడ?640
వాదిరాజులకంటె నధికుండ వైతి
మేదినీశ్వర! నిన్ను మెచ్చితి వరము
పోఁడిగా నిచ్చెదఁ బొరి నేదియైన
వేఁడుము నీ" వన్న వినతుఁడై పలికె.
“దివ్య తేజోమయ! దేవేంద్రవంద్య!
అవ్యయాత్మజ! కృష్ణ! అంభోజనయన!
భక్తపరాధీన! భక్తలోకేశ!
భక్తప్రజత్రాణ! పరమకల్యాణ!
రాజ్యంబు సేసి యా రాజులలోన
పూజ్యుఁడవైమని పుత్రులఁ గంటి
ధనదాన్యవస్తుసంతతియందు నాకు
మనమురోయుట సేసి మదికోర్కెలుడిగె
నేకర్మములు మాని యీగుహాంతమున
నేకచిత్తుండనై యిట నిద్రవోవ

నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నింప
నీవిందు విచ్చేసి తేఁ గృతార్ధుఁడను;
బ్రహ్మయోగీంద్రులు భావింపలేని
బ్రహ్మమై తోఁచు నీపదపంకజములుఁ
గనుఁగొంటి నీదు లోకముఁ బ్రసాదింపు
వనజాక్ష! ఏనొండు వర మొల్ల" ననుఁడు650

శ్రీకృష్ణుఁడు ముచికుందునకు వరము ప్రసాదించుట


“రాజువై యుండియు రాజధర్మములు
యోజఁ దప్పక యుండియును మృగహింస
మాని చిత్తమునఁ జిన్మయుడఁగు నన్నుఁ
బూని నిల్పితిగానఁ బొలిసెఁ బాపములు
భావిజన్మమున విప్రత్వంబుఁ దాల్చి
సేవకోత్తమ! నన్నుఁ జెందెద”వనుచు
ముచికుందు బోధింప మొగి నమ్మహీశుఁ
డచలితంబగుభక్తి నందంద మ్రొక్కి
హరికిఁ బ్రదక్షిణమై వచ్చి నృపతి
గురుతరంబగు శైలకుహరంబు నెడలి
యతిసూక్ష్మతరదేహులగు మనుష్యులను
నతిసూక్ష్మతరువుల నందంద చూచి
కలియుగంబున వెళ్లగా నోపు ననుచుఁ
దలఁచుచు గంధమాదనముల కరిగె
బదరికావనభూమిఁ బద్మాక్షు నాత్మ
వడలక ఘనతపోవరనిష్ఠ నుండె.
హరి కాలయవనుని యడఁచి యమ్మధుర

కరిగి తత్సేనల నవనిపైఁ గూల్చి
వాని ఘోటకమణి వారణావళుల
మానైన హాటకమణి కదంబముల
ద్వారావతికిఁబుచ్చి తానుసీరియును
నారూఢజయకాములై యుండిరంత.

మరల జరాసంధుఁడు శ్రీకృష్ణునిపై దండెత్తుట


నట జరాసంధుఁడు నత్యుగ్రలీల
భటకోటిరథకరిప్రకరంబుఁ గూర్చి
యీక్షింప నదిగాక యిరువదినాల్గు
యక్షోహిణులు దాను నట దండువచ్చి
మధురపై విడిసిన మదిఁజింత వొడమి
మధువైరి హలియు నమ్మగధీశుకడకు
నల్లనఁ గాల్నడ నరుదేర వీర
లెల్లను జూచి వీరెవ్వరో యనఁగఁ
జుని జరాసంధుఁ డచ్చటఁ గోపుఁ డగుచు
వెనువెంట నడువంగ వెఱచిన భంగిఁ
బరువంగ మగధాధిపతి సేనతోడ
నరిమురిఁ దరుమంగ నతిదూర మరిగి

హర్షాచలముపై నెక్కిన బలరామకృష్ణులను జూచి జరాసంధుఁడు కొండకు నిప్పంటించుట


హరియు రాముఁడుఁ డాను హర్షాచలంబుఁ
దరమిడి నెక్క నుద్ధత జరాసంధు
డాకొండ దిరిగిరా ననలంబు వెట్టి

చేకొని కాల్పఁగా సీయు హరియు
వారుఁ గానక యుండ నడిదిగ నుఱికి
ద్వారకాపురికి నిద్దఱు నేఁగిరంత.670

బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలంచి జరాసంధుఁడు మఱలిపోవుట


నాలో జరాసంధుఁడా గోపవరులఁ
గాలి చచ్చినవారిగా నిశ్చయించి
యగణితంబగు సేనలన్నియుఁ గొలువ
మగధదేశమునకు మగుడ నేతెంచె.
అక్కడ గోవిందుఁ డఖలబాంధవులుఁ
దక్కక తనుఁగొల్వ ద్వారకాపురిని
నానకదుందుభి యనుమతి నుగ్ర
సేనుఁడు తనపంపు సేయ సామ్రాజ్య
కలనంబునకుఁ దానె కర్తయై పేర్చి
బలభద్రుఁగూడి నిర్భయవృత్తి నుండె.
మధురలోపల శత్రుమథనంబు సేసి
మధువైరి విహరించు మహానీయకధలఁ
దాత్పర్యమున విన్న ధన్యచిత్తులకు
సత్పుత్రలాభంబు శత్రుజయంబుఁ
గమనీయధర్మార్థకామమోక్షములు
సమకూరి హరిభక్తి సౌఖ్యంబు నొందు
నని చెప్పుటయు వీని ననఘునిచేత
విని కృతార్ధుఁడనైతి వివిధసంపదల
హరి యెట్లు విహరించె నట మీఁది కథలఁ

బరిపాటితోడ నేర్పడఁ జెప్పుమనిన680
నమ్మహీశ్వరునకు నభిమన్యుసుతుకు
నమ్మహాయోగి యిట్లని చెప్పఁదొడఁగె.
అనియిట్లు నయనిర్జరామాత్యు పేర
ధనధాన్యమణిమయదానాఢ్యు పేర
భూభరణక్షమభుజసారు పేర
ఔభళమంత్రి కందామాత్యు పేరఁ
గోరి భారద్వాజగోత్రసంజాతుఁ
డారూఢమతి నయ్యలార్యందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింగయామాత్యుఁడు చెలువగ్గలింప
సలలితరసభావశబ్దగుంభనల
వలసొప్ప శ్రీభాగవతపురాణమున
మహనీయమగు దశమస్కంధసరణి
విహితలీలల నొప్పు విష్ణుచరిత్రఁ
బ్రాకటంబగు మధురాకాండ మనిన
నాకల్పమాకల్పమగు భంగిఁ జెప్పె.688

మధురకాండము సమాప్తము.

  1. జలధిలోపల జలచరము
  2. .........నిలో సర్వజీవులునుడు
  3. ....... తండ్రి చేకొన్న
  4. పవి వ్రెయ్యవాపిన బలుచాగలనంగ
  5. ఈ పద్యపాద మొక్కటియే కన్పడుచున్నది.
  6. “డిది మాయభీష్టమిది దుష్కరపుకార్యమిటు శేయుండనిన” అని పాఠము, దీనిని
    రెండుపాదములుగా విభజింప వీలులేనందున పైవిధముగా సరిదిద్ది యొకపాదము
    మాత్ర మివ్వబడినది.
  7. తలబిరిపెనపు
  8. ఈపద్యపాద మొక్కటే కన్పడుచున్నది.
  9. గతజన్మయఘదైత్యు డొక్క
  10. పద్యపాద మొక్కటే కన్పడుచున్నది.
  11. దర్పితుండగు కంసకు ద్రుంచి తజ్జనకు
  12. తనయాదులగు
  13. ఈ పద్యమునకు పాద మొక్కటే కన్పట్టుచున్నది.
  14. బొంచంబు గలిగిన బోవధోగతికి
  15. యమిత
  16. ఒకేపాదము కన్పడుచున్నది.
  17. విరిసినశానపైవిని
  18. మ్రొగ్గె
  19. నాద