Jump to content

ద్విపదభాగవతము/జగదభిరక్షకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు
శుభమస్తు

ద్విపద భాగవతము

జగదభిరక్షకాండము

శ్రీరమ్యుఁడగు పుండరీకలోచనుఁడు
ద్వారకాపురినున్న తఱి నొక్కనాఁడు

నృగుని శాపవృత్తాంతము


సాంబుఁడులోనుగా సకలకుమాళ్లు
నంబుధీతీరవిహారణ్యభూమి
మృగయానురక్తులై మెలఁగుచుఁ దప్పి
తగ నిఱ్ఱికందువఁ దడయక వెదకి
యొకనూతిలో నొక్క యూసరవల్లి
వికలమైపడియుండ వెఱఁగంది చూచి
“యెన్నడు పొడగాన మిట్టిగాత్రంబు
నిన్ని వన్నెలుగల యీనరటంబు
కటకటా! ఈ కూపగతమైన” దనుచుఁ
బటుశక్తి నందఱుబట్టి యీడ్వఁగను
వెడలకయుండిన వెన్నునితోడ

కడువేగఁజెప్ప నక్కడికేఁగుదెంచి
కూపగతంబైన కృకలాసకంబు
శ్రీపతి వీక్షించి చేతను దివియ
నది దివ్యపురుషుఁడై నంబుజోదరుని
పదపంకజములకు భక్తి మ్రొక్కుటయు
హరిజూచి పలికె “పుణ్యాత్మ! నీకిట్టి
సరటజన్మం బేల సమకూరె?” అనుఁడు10
“అనఘాత్మ! నృగుఁడ నిక్ష్వాకువంశజుఁడ
బెనుపడ సంపదఁబేర్చినవాఁడఁ
దారకంబులు వృష్టిధారలు నిసుక
వారాసితరగలు వడినెన్న వచ్చు
గాని నే విప్రసంఘములకు నిచ్చు
ధేనుసంఖ్యలు గణతింపఁగఁజాల
నొకపుణ్యదినమున నొకవిప్రవరున
కొకగోవునిచ్చిన యురక యాకుఱ్ఱి
క్రమ్మర నామంద గలసిన నెఱుఁగ
కమ్మొద వొక బ్రాహ్మణాఢ్యుని కొసఁగ
మును ధారకొన్న యాముసలి బ్రాహ్మణుఁడు
తనకుఱ్ఱి తప్పినఁ దడవుచు వచ్చి
యావిప్రునింటిలో నేపారుచున్న
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి
“యేమి కాఱులు చెప్పెదీకుఱ్ఱి నాకు
భూమీశ్వరుఁడు ధారపోసినవాఁడు
రాజుచే మును పరిగ్రహముఁగన్నాఁడ
యీజగంబెఱుఁగు నా యిది కుఱ్ఱియగుట

ధరణీశుకడకుఁబోదము ర” మ్మటంచు;
నిరుపురు నాకడనేతెంచి నన్ను20
దీవించి యిద్దఱుఁ దెఱగెల్లఁ జెప్ప
భావించి రెండవ బ్రహ్మణుఁజూచి
వేవిరపడి మీకు వివరింపనేల
యీవిప్రునకు మొన్నయిచ్చిన కుఱ్ఱి
తొఱఁగంది వచ్చినా దొడ్డిలోనున్న
యెఱుఁగక నిచ్చితి యీతప్పుసైచి
వెలయ నీకుఱ్ఱి యీ విప్రునకిమ్ము
నులియకఁ గొనిపొమ్ము నూఱుధేనువుల
ననవుఁడు నవ్విప్రుఁ డనలంబువోలెఁ
గనలచుఁ బరుషవాక్యముల నిట్లనియె
“ద్విజునకిచ్చిన సొమ్ము వీడ్పడ నిచ్చు
కుజనుండు దుర్గతిఁగూలు పెక్కేండ్లు
దరఁ బ్రతిగ్రహధనత్యాగి దుర్ఘటము;
పరగంగ ధనమీని పతి జంబుకంబు
నగుదురిట్లెఱిఁగియు నన్యాయమాడఁ
దగదయ్య నాకిచ్చి ధర్మచారిత్ర!”
ఎన్ని చెప్పిన కుఱ్ఱినీనంచు నతఁడు
గ్రన్నన దనయింటికడకుఁ గొంపోవ
యీవిప్రవరుఁజూచి యిట్లంటి “నీకు
యీవట్టి మొదవేల? ఇదెనీకు లక్ష30
గోవుల నిచ్చెదఁ గొని నీవు కరుణ
కావవే నన్ను దుర్గతిఁదోయ” కనుఁడు
“ధారుణీశ్వర! నాకుఁ దగ దొంగటాలు

[1]ధారవోసెద వేట దానంబు నీవు
కుఱుమట్టు పొడవును కొమ్మలుగలిగి
తెఱగగు చన్నులు తీరైనతోఁక
చక్కదనము నొక్కచక్క మేయుటయుఁ
నెక్కడవిడచిన నిల్లుచేరుటయుఁ
గ్రేపులు బిలుచునర్మిలిని మాశిశువు
లేప్రొద్దు వేడిన నీడనిచ్చుటయు
కడుసాదునై లక్ష్మిగతి నింటిలోన
నుడుగక నీధేనువుండిన జాలు;
యిదిదప్పిపోయిన యింటివారెల్ల
మదిలోన మలమల మఱుఁగుచున్నారు;
యీకుఱ్ఱినాకు నీవీ వోవలేని
యేకాఱులును జెప్ప కిట్లొండు మాట
నాడితి కృకలాసమై యుండు” మనుచు
నాడి బ్రాహ్మణుఁడు శాపంబిచ్చె నంత;
వడవడ వణకుచు వడినేఁగి యతని
యడుగులపైఁబడి యతనితో నంటి40
“నీకష్టజన్మంబు నేనోర్వజాలఁ
జేకొని నన్ను రక్షింపవే” యనిన
“హరి లోకరక్షణార్థమై కృష్ణుఁడనఁగఁ
బరగు నాతని కరస్పర్శమాత్రమున
నీకష్ట శాపంబు నీఁగి నీపుణ్య
లోకంబునొందు సుశ్లోక! పొ” మ్మనిన

“తడయక యీకష్టతను బొంది యిందుఁ
బడనిపాటులఁబడి పద్మాయతాక్ష!
వేదాంతవేద్యులు వెదుకంగలేని
నీదివ్యచరణ సన్నిధిగంటి మంటి
పనివినియెదనో కృపారసపూర్ణ!”
అనిచెప్పి కృష్ణున కందంద మ్రొక్కి
కనకవిమాన సంకలితుఁడై నృగుఁడు
చనియె దివ్వులుకొల్వ జంభారిపురికి
అతఁడు వోయినఁ జూచి యద్భుతంబంది
శతదళనేత్రుఁ డచ్చటివారి కనియె.
“హాలాహలాభీలమగు వహ్నికంటెఁ
గ్రాలును విప్రవర్గపుకోపవహ్ని
వారల సొమ్ములెవ్వరు హరించినను,
దారుణలీల బాధలఁ బెద్దగాల50
మలమటఁబొంది కీటాదులైపుట్టి
పొలిసిపోదురు కులంబులు గూలిపోవు
నదిగాన విప్రుల యర్థమీభంగి
మదిఁ జూడవలయు నెమ్మదిఁ గోరువారు”
అనుచు పుత్రులు దాను నరిగి మురారి
తనమందిరమున సంతసలీల నుండె.

వసంతఋతువర్ణనము


అంతట సకలలోకానందమగుచుఁ
గంతుని సామ్రాజ్యఘనలక్ష్మి యనఁగ
పరమానురాగసంపన్న కారణము

విరహిమానసమహా విద్యేషణంబు
శుకకోకిలాలాప సుస్వరప్రదము
ప్రకటితదంపతి ప్రాణవల్లభము
మధుపకుటింబికా మందిరాంగణము
మధురసౌరభశైత్య మాంద్యకారణము
[2]ప్రాలేయకులవార్థి బడబానలంబు
ప్రాలేయకులవార్ధి బడబానలంబు
నానొప్పి వనముల నవకంబులెక్క
మానుగానేతెంచె మధుమాసలక్ష్మి.
తరులతావలులకుఁ దమకంబులెక్కి
పరిమళంబై మంద పవనుఁడు వీచె;60
గుమురెక్కి తరులెల్లఁ గొనచిగురాకు
గములు క్రొన్నన నవకపు మొగ్గ మ్రొగ్గ
వలిమొగ్గ క్రొవ్విరి వలవులు గులుక
వెలిపూవు నూనూఁగు పిందెలుగాయ
కసుగాయ వులికాయ కడునొప్పు దోర
పసనుపండులు వనిపండులు గలిగి
తరువు లెల్లను గల్పతరువుల భంగి
పరువమై చూపట్టు పరిమళశ్రీల!
వాసంతి వనములు వాసనగలిగి
వాసికి నెక్కిచామంతులు పూచె;
గొజ్జంగలలరుల గొమరారుమరుని
సజ్జపట్టులభంగి సౌరభంబొలసె;
కందర్పుటమ్ముల కరణిని వెడలి

సింధువారంబులు చెన్నారఁ బూచె;
మగువల గండూప మధుకేళిఁ దేలి
పొగడ లామనివేళఁ బొగనొందఁ బూచె;
తన్నాసపడి చూడఁ దరుణీజనంబు
తన్నాసపడిపూచె దగనశోకంబు;
తన్నిన నలరుటే తగవంచు సతుల
కన్నుసన్నలఁ దిలకంబు చూపట్టె;70
సుదతుల కౌఁగిళ్ళ జొక్కులఁ జొక్కి
ముదమంది కురవకంబులు మ్రానుపడియె;
పాటలు చెవివిని పాటలీతరులు
పాటిల్లె సతుల యా పాటల నలరి;
సంపంగిపూదేనె చవిఁజొక్కి క్రింద
గుంపులై యలరెడు గొదమతుమ్మెదల
పానాభిరతిఁ జొక్కి పతులును సతులు
గానంబు లొనరించు గతిని జూపట్టె;
కాయజుఁ డదె దండు గదలి యేతెంచె
రాయడి యడలి బోరన గూడుఁ డనుచుఁ
గోయని యెలమావి కొమ్మల మీఁదఁ
గోయిల లెలిగించె కొమరగ్గలింప;
భావజు త్రైలోక్య పట్టంబుగట్ట
దీవించఁ జనుదెంచు ద్విజులచందమునఁ
జెలరేఁగి యెల్లెడఁ జిలుకలు మ్రోసె;
వెలుఁగొందు చంద్రుడు వెన్నెలతేట
పరువంపు చిన్నిపూపాటన నమర
మురిపెంపు నవ్వు కెమ్మోవులఁ దనరఁ

దిలకించు చందన తిలకంబు లలర
కలికెలు మేన నుత్కలికలై తనర80
వనములు నిత్యయౌవనలక్ష్మిఁ జెంది
వనితలచందమై వలనొప్పుఁ జూడ
నీభంగి నామని యేపార సీరి
యాభీరుకాంతల నాత్మలోఁదలఁచి;
 

బలరాముఁడు వ్రేపల్లెకు నరుదెంచుట


హరికి నెఱింగించి యట రథంబెక్కి
యరుదెంచె వ్రేపల్లె కాప్రొద్దె కదలి
ఏపారఁ జనుదేర నెదురేఁగి యంత
గోపయశోద లక్కునఁ జక్కఁజేర్చి
“నాతండ్రి! నాయన! నాముద్దుకూన!
ఏతెంచితే మమ్ము నిందఱుఁ జూడ
దేవకియును వసుదేవుఁడు హరియు
నీవు రోహిణి నెమ్మి నెలతలు సుఖులె?”
అని ప్రేమ నడుగుచు నర్మిలి పుత్రుఁ
గనుఁగొని హర్షాశ్రుకణములు దొరగ
సంతసింపుచునుండ సకలగోపికలు
నంతలో నరుదెంచి హలపాణిఁ గాంచి
సేమంబుఁ జెప్పి తత్సేమంబు లడిగి
యామోహరసవార్ధి నందందతేలి
హలియు మజ్జనఁ భోజనాది కృత్యములు
సలిపి వారునుఁ దాను సంతోషలీలఁ90
గలసి వినోదించి కాళిందితీర

ములను బృందావనంబున గ్రీడ సలిపె

బలరాముఁడు వ్రేతలతో నెమునాతీరమందుఁ గ్రీడించుట


తాను గోపికలును దనపిన్ననాఁడు
పూని క్రీడించుచాడ్పునఁ గ్రీడసలిపి;
పసిఁడి కోరల నుంచి పడతులు సీధు
వసలారఁ దనియంగ నందఱుఁ గ్రోలి;
తనివోక కాళిందితటతరుశ్రేణి
తనరారు నీడలఁ దగ విశ్రమించి;
వరుణసంభవయైన వారుణిఁ దేలి
తరమిడి బలభద్రుఁ దలపెల్ల నెఱిఁగి
పరిమళమాధుర్యఁ భరితమై నిండిఁ
తరుకోటరమున నుద్భవమొంది నిగుడఁ
గని ప్రలంబారి య క్కాంతలుఁదాను
దనుపారియున్న కాదంబరిఁగ్రోలి
మానినిగండూష మదిరారసంబు
లాని మన్మథకేళి లందంద తేలి
మదమెత్తి తన్ను దామఱచి గోపాల
సుదతులింపు నడిమి సూరెల నిలువ
ఘనకరిణులలోని గజము చందమున
సనువార నందవిహారంబు సలుపఁ100
జెన్నారు మోవుల జిగి జేగుఱింపఁ
జన్నుల కొంగులు జార పయింట
వెన్నులపై నీలవేణులు నెఱయఁ
గన్నులందును సోయగములు మ్రాన్పడఁగఁ

గౌనులు నులియంగఁ గరతాళగతుల
సానురాగంబుల శౌరిఁ బాడుచును
సన్నులచాయలఁ జతురులాడుచును
నన్నులన్నుల వెడ యాటలాడుచును
సీరితోఁ బలుమారు చెనకి నవ్వుచును
“మేరలు మీఱి స మేలంబు లాడి
కలసి వినోదింపగా సీరపాణి
యలసి యంగము సోల నందంద సొక్క
వెలసిన నెరివేణి వ్రేలాడ చమట
కలసి కస్తూరి యెక్క వలువ లెల్ల
గటకాంగుళీయకగ్రైవేయహార
పటుకిరీటప్రభాపటలి శోభిల్ల
మదియించు దివిజసామజము చందమున
నెదురెవ్వరును లేక యేపు దీపింప
తరుణులుఁ దనుగొల్వఁ దరులతావలులఁ
బరికించి చిత్తవిభ్రాంతిమై పలుకు;110
“ఏలకో! ననుఁజూచి యీరాజశుకము
శీలించి మొగమొఱ్ఱ సేయుచున్నదియ!
నాయంబరంబుల నలుపెల్లఁగొన్న
దీయలి!” అని కన్ను లెఱ్ఱజేయుచును
దరువులెల్లను నేడుఁ తనుజూచి నవ్వ;
“నరుణించె కింశుకంబదియేమి!” అనుచు
వదనంబు వఱువట్లు వట్టి మైదప్పి
గదిమి దిగ్గనలేచి కాళిందిఁ జూచి

బలరాముఁడు యమునను నాగలిచే నెత్తుట


“ఓ సూర్యకన్యక! ఓ లోకమాత!
ఓ సారసల్లాప! ఓ సారసాక్షి
నీరువెట్టుము లేక నిలువంగజాల
బోరన నుదకంబుఁ బోయవే!” అనుఁచుఁ
బలుమారు పిలిచినఁ బలుకక యున్నఁ
గలుషించి పరుషవాక్యముల నిట్లనియె.
“పిలిచిన నామాట పెడచెవిఁబెట్టి
పలుకవు మదిలోన భయమంది రావు!
మలినాంగి! నీమేని మదమెల్ల నడఁచి
దళనంబు సేసి యుద్ధతమాన్తు” ననుచు
నదలించి హలమున నమ్మహాతటము
విదళించి తివిసిన వెఱఁగొంది యమున120

యమున బలరామునిఁ బ్రార్థించుట


వడవడ వడఁకుచు వచ్చి తాలాంకు
నడగులపై వ్రాలి యరుదొందఁ బలికె.
“ఓ సర్వలోకేశ! ఓ సుప్రకాశ!
ఓ సౌమ్యహృద్గేయ! ఓ రౌహిణేయ!
ధరణిభారముఁ బాప దనుజుల నడఁపఁ
గరమర్థి దేవకీగర్భంబునందుఁ
జెలువారఁ బుట్టిన చెలువుఁడ వీవ!
బలభద్ర! బలప్రలంభధ్వంసరామ
జడసంగతి బలచంచలచిత్తమలినఁ

దడయక నీ మహత్వముఁగానఁగలనె?
నెలతలు సేసిన నేర్పు నేరములుఁ
దలఁకక లోగొండ్రు ధన్యులే ప్రొద్దు”
అని వేడుకొనుచున్న యమున మన్నించి
ఘనదయామతి హలకర్షంబు విడిచె.
ప్రీతిఁ గాళింది విభేదనుండనుచు
నాతని దీవించి రమరసంఘములు!
బలుఁడు నాఁగట గొల్వ వాపినచోటు
బలతీర్థ మన ధాత్రిఁ బ్రఖ్యాతమయ్యె.
అచట కృతస్నాతులైన మానవుల
కచలిత విష్ణులోకానంద మొదవు!130
ఈభంగి బలభద్రుఁ డెంతయు వేడ్క
యాభీరు సతులతో నెమునఁ గ్రీడించి
యేపారు నిబ్బంగి నీయాఱు నెలలు
వ్రేపల్లెలోపల వేడ్కలు సలిపి
హరిఁజూచు తలఁపున నట ద్వారవతికి
నరుదెంచెఁ బ్రజబాలలర్థిఁ దన్ననుప

పౌండ్రక వాసుదేవుని వృత్తాంతము


నాలోన గర్శదేశాధినాయకుఁడు
పాలసచిత్తుఁడు పౌండ్రభూవిభుఁడు
హరితో విరోధియై యతని చిహ్నములు
తరమిడి ధరియించి తానంతఁ బోక
వాసుదేవుండను వలనొప్పఁ బేరు
భాసురంబుగఁ దాల్చి పటుశక్తి మెఱసి

యక్షౌహిణీద్వితయము తన్నుఁ గొలువ
నక్షతబలశాలియై దండు వెడలె.
ఆరాజునకు మిత్రుఁడై కాశిరాజు
ధీరుఁ డక్షౌహిణీ త్రితయంబుతోడఁ
బటుశక్తి నతనికి బాసట యగుచు
భటదంతిహయరథప్రతతితో నడువ
నీరసంబునఁ బ్రౌండుఁ డేతెంచి పేర్మి
ద్వారకానగర ముద్దతి డాయవిడిసి140

పౌండ్రకుఁడు దూతను శ్రీకృష్ణుని వద్దకుఁ బనుచుట


హరి సన్నిధికిఁ దజ్ఞుఁడను దూతఁబనుప
నరుదెంచి తగ సుధర్మాభ్యంతరమున
వృష్టిభోజాంధక వీరులుఁ గొలువ
నిష్టవర్తన నున్న నిందిరారమణుఁ
గని మ్రొక్కి తనవచ్చు కార్యమంతయును
వినుపించఁ జొచ్చెను వెఱపింత లేక.
“ఆపౌండ్ర నృపతి యాహవదండపాణి
భూపాలతిలకంబు వుత్తెంచె నన్ను.
ఆతఁడు నీతోడ ననుమన్న మాట
లాతతంబుగ విను మంభోజనయన!
“వసుధభారము మాన్ప వైరుల నడంప
దెసలఁ బెంపఁగ వాసుదేవుఁడ నేను
నాచిహ్నములుఁ దాల్చి నాపేరుఁ దాల్చి
యీచావుఁ దెచ్చుకో నేఁటికి నీకు?
ఘనగదాశంఖచక్రమును శార్ఙమును

గనకాంబరంబును గరుడకేతనము
మకరకుండలములు మణికిరీటంబుఁ
బ్రకటంబగుజలసత్ప్రసవమాలికయు
నివినాకు వేవేగ నిచ్చి ప్రాణముల
సవరించుకొని నన్ను శరణంబుఁ జొరుము;150
కాదేని నాతోడ కదనంబు సేయ
నాదటఁ బేర్చి ర”మ్మ ని చెప్పె” ననుఁడు;
విని జనులందఱు వికవిక నగఁగ
ఘనుఁడు కృష్ణుఁడు వానిఁ గనుగొని పలికె.
“కండ క్రొవ్వున గన్ను గానకఁ బెక్కు
దుండగంబులు ప్రేలి త్రుళ్ళుగాకేమి!
భండనభూమిలోఁ బరిమార్చి వాని
కండలు భేతాళగణముల కిత్తు,”
అని పల్కి దూతకు నర్ఘ్యవస్తువులఁ
దనిపి వీడ్కోలుప పౌండ్రునితోడ
హరి వాక్యములు జెప్ప నతఁడు కోపించి
దురమున కేతెంచె దోర్గర్వ మెసఁగ.

పౌండ్రకుఁడు హరినిఁ దాఁకుట


బహుదళంబులతోడఁ బౌండ్రుఁ డేతేర
నహిమాంశు సమతేజుఁడగు వెన్నుఁడెఱిఁగి
పరఁగు సారథ్యదర్పంబు మెఱయఁగ
దేరెక్కి శస్త్రాస్త్రదీప్తులు నొలయఁ
బాంచజన్యధ్వని పరిపంథి సేనఁ
జంచలించఁగ వచ్చు శౌరిపై నడరి

పరిఘతోమరగదా ప్రాసచక్రములుఁ
గురిసిన, మురవైరి క్రూరబాణములు160
నడవులనేర్చు కాలాగ్ని చందమునఁ
దొడరి సేనలనెల్ల ద్రుంచివైచుటయుఁ
గనుఁగవ కెంపొందఁ గడఁగి పౌండ్రుండు
తనసేనఁ బురిగొల్పి దళములఁ దాకె.
కృత్రిమ చక్రంబుఁ గినిసి వైచుటయుఁ
శత్రుఁడు బెగడ నాచక్రంబు నఱికె;
గదయును విల్లును ఖండించి తేరు
చిదురుపలుగఁ జేసి సిడముఁ ద్రుంచుటయు
బఱిగొని వాలును బలుకయుఁ గొనుచు
నఱిముఱి నార్చుచు నరుదేరఁ జూచి
హరి శార్ఙ్గమున భల్లమరివొసి కంఠ
మరుదార లక్షించి యార్చి వైచుటయు
మకరకుండలరత్నమకుటంబు తోడఁ
బ్రకటోల్ముఖము భంగి పడియె తచ్ఛిరము.
కూలిన పౌండ్రుఁ గన్గొని సేనలెల్ల
నాలచందంబున నందంద పఱచె.

పౌండ్రకుని మరణమునుగాంచి కాశిరాజు శ్రీకృష్ణునిపై గవిసి మడియుట


కని కాశిరాజు “నేఁగలుగంగ నేలఁ
గనుకని పార నొక్కట నిల్వుఁ” డనుచు
దళములఁ బురిగొల్పి దైత్యారితోడఁ
దలపడి బహుబాణతతుల నొప్పింపఁ170

గోల వ్రేసిన మ్రోఁగు కోల్పులిభంగి
వాలమ్ములురమున వడిఁగీలు కొలుపఁ
[3]గాలాగ్నిసదృశభీకరచక్రనిహతి
ముడివడు బొమలతోఁ బొలుచు మస్తకముఁ
బడవైచి యార్చె; నీ భంగి శాత్రవుల
నిరివురఁ బొలియించి నిందిరాధీశుఁ
డరుదెంచె ద్వారక కమరాళి పొగడ.
 

కాశిరాజు కుమారుఁడు రుద్రుని వరమును బొంది కృత్తిని బుట్టించుట


కాశీశ్వరుని తల ఘనచక్రనిహతిఁ
గాశిగాఁగూలినఁ గని పౌరులెల్ల
నడరి సోద్యంబంద యాయొక్క శిరము
పడియె కుండలమణిప్రభలతో నపుఁడు.
అతివలు దుఃఖింప నతని నందనుడు
సితకీర్తియగు సుదక్షిణుఁడను వాఁడు
తన తండ్రి తల యౌటఁదా నిశ్చయించి
ఘనభక్తి నగ్నిసంస్కారంబు సేసి
యతుల సమాధి నిష్ఠాత్ముఁడై ప్రమథ
పతినాత్మనిలిపి తపంబాచరింప;
హరుఁడు ప్రత్యక్షమై “యడుగుము నీకు
వరమిత్తు” ననుటయు వాడు “మజ్జనకుఁ180
జంపిన పాపాత్ము సమయించు నట్టి

పెంపు ప్రసాదింపు భీమాక్ష!” అనుఁడు
ఆ దేవుఁడును “దక్షిణాగ్నిగుండమున
నాదరంబున విప్రులాభిచారాఖ్య
హూమంబు సేయఁగ నొకకృత్తి పుట్టి
సోమిచ్చి నీశతృఁ జుఱువుచ్చు” ననుచు
హరుఁ డదృశ్యుండయ్యె నంత ఋత్విజుల
నరుదార వేల్పింప నాయగ్ని వలన

అగ్నిలో నుండి పుట్టిన కృత్తి శ్రీకృష్ణునిపై వెడలుట


నాలోన భయదజిహ్వాలవక్త్రంబు
ఫాలనేత్రంబును బాహాశతంబు
శూలతోమరగదా క్షురికాది భిండి
వాలచక్రములు దుర్వారాయుధములు
చటులకఠోరదంష్ట్రలు తాడనములు
కుటిలపు బొమ్మలు క్రూర ద్రుష్టులును
దీర్ఘతాభీలత తీవ్రాట్టహాస
గర్ఘరస్వరములు ఘనశరీరంబు
నడర లోకములెల్ల హరుఁ డొక్కవేట
మడియింపఁ బుట్టిన మాడ్కి యో యనఁగఁ
బదతాడనముల భూభాగంబు వగుల
నదరి [4]లోహితవర్ణ మదరి యందంద190
“ఎవ్వని బరిమార్తు నిట పంపు మనుఁడు”
“నవ్వాసుదేవుని నడచిర” మ్మనిన

బహుభూతఢాకినీప్రతితోడ వచ్చి
దహనార్చు లొలయ నాద్వారకఁ జొరఁగ
కారగ్ని దరికొన్న ఘనసత్వచయము
పారెడుగతి జనప్రతతి రేఁపఱచి
యతివలతో జూదమాడుచు నున్న
శతదళాయతనేత్రు సన్నిధి నిల్చి
“ఇదె యొక్క కృత్తి యహీనాగ్ని శిఖలఁ
గదిసి పట్టణమెల్లఁ గాల్చుచు వచ్చె
నిక్కడ దిక్కులేదీబారిఁ గడపి
గ్రక్కున మమ్ములఁ గావవే కృష్ణ!”
అని యార్తులై పలుక నాపౌరజనులఁ
గనికేల వారించి కడకంట నగుచు
యది మహేశ్వరకృతియౌ కృత్తి యగుట
మదిలోన నెఱిఁగి సౌమ్యజ్ఞాన విభుఁడు;

శ్రీకృష్ణుఁడు సుదర్శనమును గృత్తిపై పనుచుట


తనుకొల్చియున్న సుదర్శన పురుషుఁ
గని నల్ల నవ్వుచు కనుసన్నఁ బనుప
నమ్మహాచక్రంబు హరి యాజ్ఞఁ బూని
క్రమ్మన నేతెంచి కాలాగ్ని వోలె200
శతయోజనోత్తాల చటుల విగ్రహము
శతభుజసమదోగ్రశస్త్రాస్త్రములును
ఘనసహస్రార్కనిర్గత తీవ్రరుచులఁ
బెనుమంటలెగయ నాభీలమై పేర్చి
హరి చక్రమేతెంచు టాలించి కృత్తి

మఱలె బిట్టొఱలుచు మది విహ్వలింప
పఱగంగ నయ్యెదు ప్రవరసాధనము
యఱిముఱి వెనుకొన నదికాశిఁ జొచ్చె.
చొచ్చిన నిట్టట్టు సురగంగ నీక
నచ్చక్ర మడరి ఘోరానలశిఖల
నాఋత్విజులతోడ నాకృత్తితోడ
నారాజుతోడ జనావళితోడ
ఘనశతాంగక వాజి గజశాలతోడ
ధనధాన్య వస్తు సంతానంబుతోడఁ
[5]బొలుపారుసౌధగోపురములతోడఁ
గాశీపురము చక్కుగాఁ జేసి కాల్చి
యీశేషి హరి పాలికేతెంచి మ్రొక్కె.
నీకథావర్ణన మెల్ల వారలకు210
ప్రాకటకృత్యముల్ బాధలు నడఁగు
పుత్రసంపదలును భోగసంపదలు
శత్రుక్షయంబు మోక్షము నిచ్చుచుండు.”
అనిచెప్పుటయువిని యభిమన్యసుతుఁడు
వినతుఁడై శుకయోగివిభున కిట్లనియె.
“ఆ మందలో నుండి యరుదెంచి యచట
కామపాలుండేమిగతి విశ్రమించె?
ఆతని చరితంబు ననిశంబు వినఁగఁ
గౌతుకంబయ్యె నాకథఁ జెప్పు” మనిన

ద్వివిదుఁడను వానరుఁడు తన చెలికాఁడగు నరకుని జంపినందులకుఁ బగఁబూని చెలరేఁగుట


“వినవయ్య కురునాథ! ద్వివిదుండనంగ
దనరారు మైందుని తమ్ముఁడు ఘనుఁడు
గిరిచరాధిపుఁడు సుగ్రీవుని మఱఁది
నరకుని చెలి మహోన్నత బలాధిపుఁడు
నారాయణునిచేత నరకుఁడు దెగినఁ
గ్రూరవార్తకు మదిఁ గుమిలి మర్కటుఁడు
హరి నడఁచెదనని నద్దేవుఁ డేలు
పురములు నూళ్ళును బొరి చిచ్చులిడుచు
కొండలు బెఱికి యుక్కున నూళ్ళ మీఁద
మెండుగావైచి భూమిని పాడుసేయ
వనితల బతులను వడివెంట బెట్టి
కొనిపోయి పర్వత గుహలలో డాఁచు220
నీరీతి నుండగ నెఱిఁగి యాశౌరి
యూరకనుండఁగ నొక్కనాడంత;
వారాసి దాఁటి దైవతకందరమున
కారూఢగతివచ్చి యగచరాధిపుఁడు
మానినీమంజుళమధురగానముల
వీనులకింపార విని యల్ల నచట
కరిగి చేరువనొక్క యవనిజమెక్కి
పరికింపుచున్నచోఁ బడఁతుల నడుమ
నారుణితాక్షుడై యాసవక్రీడ
నారామలును దాను నలరి పాడుచును
గోవులలోనున్న గోరాజుభంగి

దావేడ్క విహరించు తాలాంకుఁ జూచి
హరియకాఁ దలపోసి యాకీశనరుఁడు
తరులెక్కి కిలకిల ధ్వనులు సేయుటయు
తరుణులు నవ్వుచుఁ దను చూడ మేను
పరపి ఝంకించుచుఁ బండ్లిగిల్చుచును
బొమలార్చి చూచుచుఁ బొరి మీఁదఁ బొలయు
భ్రమరాళిఁ గని యుల్కిపడి పట్టుకొనుచు
వెలికిలపడి యాడి వెక్కిరింపుచును
వెలఁదులఁ గని వంగి వెనుకఁ జూపుచును230
గోడిగంబులు సేయుఁ గ్రోతి సేఁతలకుఁ
జేడియలందఱుఁ జెలరేఁగి నవ్వ;

బలరామ ద్వివిదుల ద్వంద్వయుద్ధము


తాలాంకుఁడొకరాత దర్పించి వైన
నాలోనఁ గోపించి నతనిపై కుఱికి
చీరలు జించి యాసీధుభాండంబు
బోరనఁ బగులంగఁ బొడిచి దాఁకుటయు;
కామపాలుఁడు వానిఁ గడకతోఁ బట్టి
వేముష్టిఁ బొడిచిన వికవిక నవ్వి
ప్రళయకాలోత్తాలభైరవుభంగి
బలియుఁడై మైవచ్చి బలున కిట్లనియె.
“నలినాక్ష! యేరీతి నాఁడు నామిత్రుఁ
దలమీరి నరకు నుద్దండతఁ జంపి
వచ్చితి నేనేఁడు వచ్చిన వాఁడఁ
జెచ్చెర సమరంబు సేయు నాతోడ!

తనరార మైందుని తమ్ముఁడ ద్వివిదుఁ
డనువాఁడ శూరుఁడ నర్కజు మంత్రి
రామునకై పూని రావణుతోడ
భీమాహవము సేసి పేర్చినవాఁడ
నెలకొన్న రణవీధిని ద్రుంచివైవఁ
గెలసి నాచెలికాని కెలసంబుఁ దీర్తు.”240
అనిపల్కియార్చి మహాశూలమెత్తి
కొని వైచుటయు సీరి క్రుంకి మైఁదప్పి
ముసలంబుఁగొని బెట్టు మోదిన వాఁడు
వెస మహాతరువెత్తి వేసి యార్చుటయుఁ
దప్పించుకొని సీరి తరుచరుమీఁద
గుప్పించి యుఱికి ముక్కున ముష్టిఁ బొడువ
తెరలక వానరాధిపుఁ డొక్క పెట్టు
తరుణులు బెగ్గిలఁ దరువృష్టిఁ గురిసె
లాంగూలమున వ్రేసి లలి నఖాగ్రమున
నంగంబుఁ జీరి మేనందంద కఱచి
పిడికిటఁ బొడిచినఁ బెనుమూర్ఛ నొంది
పడిలేచి యాబలభద్రుఁ డాతనిని
గళమున జిక్క నాగలి దగిలించి
యలుకమై రోఁకట నందంద పొడువ
హనువులు పగిలి మైయదటెల్లఁ బొలిసి
కనుమూసి నెత్తురు గ్రక్కిరోఁజుచును
బవిదాఁకి కూలిన పర్వతంబనఁగఁ
బ్లవగేంద్రుఁ డిలఁగూలి ప్రాణంబు విడిచె.
ఉవిదలందఱు వెఱఁగంది కీర్తింప

దివిజసంఘము రాము దీవించిరంత250
నలిన నేత్రుండున్న నగరికేతెంచి
హలి కృష్ణుతోడ నయ్యగచరు వార్త
వినుపింప శౌరియు వివిధ బాంధవులు
వినుతు లొనర్చిరి వెసరామునంత

సాంబుఁడు దుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట


అంబుజోదరపుత్రుఁ డతిరథోత్తముఁడు
జాంబవతేయుండు సాంబుఁడు ఘనుఁడు
కోరి ధుర్యోధను గూఁతు లక్షణను
వారణవురి స్వయంవరమునందునను
వరియించి కొనిపోవ వారలందఱును
గురుపతి కెఱిఁగింపఁ గోపించి యతఁడు
“ఏమేమిరా! సాంబుఁడే నాతనూజ
నేమని కొనిపోయె నెట్లు జూచితిరి?
కురువంశజులతోడఁ గూడి యాదవులు
పరిణయప్రాప్తులే పరికించి చూడ?
పడుచువాఁడీకన్య బలిమిఁ గొంపోవఁ
దడయకఁ జూచుట తగవుగా దతని
బట్టి తెత్త” మటంచు బలములతోడ
దట్టుఁడై వడి సుయోధనుఁ డుగ్రవృత్తి
వెడలి యార్పుచుఁ దాఁకి విష్ణునందనుని
దడయక శస్త్రాస్త్రతతుల నొప్పింపఁ260
గనిపోయి తిరిగి యగ్గలికమై వేఁచి
తన రథంబఖిలవర్తనలఁ గ్రీడింపఁ

బడియార్చి విలుగుణధ్వని చేసి శరము
లడరింపఁ గురుసేన నందొక్కపెట్ట
మురిసె రథంబు లమ్ముల గీటణంగెఁ
గరులు రోఁజుచుఁగూలెఁ గాల్బలం బణఁగెఁ
దరమిడి సాంబు కోల్తల కోహటించి
తిరిగిసేనలు రాజు దిక్కున కొదుఁగ
గినిసి యాతని శల్యకేతుఁడు దాఁకఁ
గని రాజుతమ్ముఁడు గర్ణ సౌబలులు
వెనుఁ బ్రావుగా బాణవృష్టి వేల్పుటయు
ధనువుసారించి యా దైత్యారి సుతుఁడు
కాఁడగ నేడు మార్గణముల సేసి
యేడు బాణముల మహీశు నొప్పించి
యతని తమ్ముని నాల్గుటమ్ములఁ గ్రుచ్చి
శతసాయకంబులు శకునిపైఁ గప్పి
తొలఁగక శల్యకేతుని విల్లుఁ దునిమి
బలముల శరపరంపరలఁ గూల్చుటయు
నతని విక్రమకేళి కచ్చెరువంది
యతులితంబగు యోధులందఱుఁ గూడి270

కురువీరులందఱుఁ గూడి సాంబుని విరథునిగాఁ జేసి పట్టుకొనుట


కురుపతి విలుదుంచెఁ గొసరేది కర్ణుఁ
డరదంబు నుగ్గాడె హరుల గీటణఁచె;
విరథునిగాఁ జేసి వెలఁదుకతోన
యరదంబుపైనిడి యతనిఁ దోతెంచె.

నాకన్య బెగడొంద నాకుమారకునిఁ
జేకొని బంధించి చెరఁబెట్టిరంత.

బలరాముఁడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా హస్తినాపురికి వెడలుట


కరిఘోటరథభటోత్కరములతోడఁ
గరిపురిపై దండుగదలుటఁ జూచి
బలభద్రుఁ డది “యెంతపని మీరలేమి
తలఁచి కౌరవులపై దండుపోయెదరు?
యాదవులందు నెన్నడు కౌరవులకు
భేదంబు లేనిచోఁ బ్రీతి నందెఱిఁగి
యేమిసేసిన వార లేమన్న వారొ!
ఆమార్గ మెల్లను నఱసి సామమునఁ
దెలిసి సాంబునిఁ దోడితెచ్చెదఁగాని
కలహంబునకుఁబోవ కారణం బేమి?”
అని వారి వారించి యట రథం బెక్కి
చనియె నుద్ధవుఁడు తోఁజనుదేర సీరి.
అరిగి వారణపురోద్యానంబులందు
కరమొప్ప విడిసి యక్కామపాలుండు280
దనరాకఁజెప్పి యుద్ధవుఁ బంపుటయును
జని యమ్మహాత్ముఁడాస్ధానంబు నందుఁ
గురురాజు సచివు శకుని దుస్ససేను
గురు భీష్మకృపబాహ్లీకులు గొలువంగఁ
గొలువున్న యతనిఁ గన్గొని పొడచూపి
భలభద్రురాక నేర్పడ జెప్పుటయును;

నతిసంభ్రమంబున నందఱుఁగూడి
యతని సన్నిధికేఁగి యర్ధిఁబూజించి
సేమంబులడిగి యాసీరి నీక్షించి
“యేమివిచ్చేసితి రెఱిఁగింపుఁ”డనిన
ధార్తరాష్ట్రులును బాంధవులును వినఁగ
నార్తరక్షణశీలి హలపాణి పలికె.
“కోరి మామేనత్త కొడుకులు మీరు.
ఆరూఢి మీకు మేనల్లుఁడుగానఁ
దన మేనమఱఁదలి దరళాయతాక్షిఁ
జనవునఁ గొనిపోయె సాంబుఁడు దీనఁ
గలఁగి విరోధింపు టర్హంబుగాదు
వెలఁదితో నాతని విడిచి తెం”డనిన.
అల్లన నవ్వుచు నాసుయోధనుఁడు
ప్రల్లదంబున బలభద్రుతో ననియె.290

హేళనచేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి హస్తినాపురిని నాగలిమొనచే లేవనెత్తుట


 “అకట! గురుస్థానమని నిన్నుఁజూడ
మెకమెకపడు మందమేళముల్ తగునె?
[6]ఒకనిఁ గొల్చిన వార లుర్విలో మీరు!
ఆదిగర్భేశ్వరు లగు కౌరవులకు
యాదవులకు వియ్యమందంగఁ దగునె?
మిమ్మేలురాజును మీరును నాకు

నెమ్మి యీడొనరింప నెంతటి వారు!
హరి మంచితనమున నన్నియు నొప్పె
జరగుట సల్లాపసహజభోజనము
సలిపి మన్నించినఁ జనవున మీరు
కలసి వర్తింతురుగాక యేనాట
నెక్కడి బాంధవంబిక? మాకు మీకు
ఫక్కి వోనాడఁగఁ బనిలేదు వేగ
విచ్చేయు” మను కురువిభుఁ జూచి సీరి
చిచ్చులో నెయ్యిఁబోసిన భంగి మండి!
“కాలుఁడు ప్రేరేపఁ గానక యిట్లు
ప్రేలెదవేల? నీ పెంపెల్లఁ బొలియ
వరుస నెఱుంగక వదరెదుగాక
హరికి నీకును నేది యంతర మోరి!300
ఎవ్వరు నాకు మీ రెందఱున్నారు?
ఎవ్వరుగలరు నీకీబారి గడప!
నీ బలంబులు నిన్ను నీ పట్టణంబు
నాబాలవృద్ధమై యమునలోవైతు!”
అని పేర్చి దర్పించి హలదండమెత్తి
ఘనరౌద్రలయకాలకాలుఁడో యనఁగ
కరిపురికోట నాఁగటి వాత గ్రుచ్చి
భరమున నుంకించి పటుశక్తిఁ దివియ;
నది యొడ్డగిలి పడ నఖిలమానవులు
బెదరి నిల్వఁగలేకఁ పృథివిపై వ్రాల
భీతిల్లి సంధులు పృథివి వేచఱువ
నాతురారావంబు నందంద చెలఁగ

నాంబికేయుఁడు విని హలిచందమెఱిఁగి
సాంబుని విడిచి లక్షణసమేతముగఁ
దోకొని సకలబంధులుఁ దన్ను గొలువ
నాకౌరవేశ్వరుఁ డాపగాతనయు
విదురుల మాట నిర్విణ్ణుఁడై వినుచు
బదరుచు నేతెంచి బలభద్రుఁగాంచి

కురుపతి బలరాముని బ్రార్ధించుట


ముదము తత్తరపాటు మొలవంగ నతని
పదపంకజములకుఁ బ్రణమిల్లి నిల్చి310
యాతనిదెస మొగంబై కేలుమొగిచి
యాతుర ఫణతి నిట్లని విన్నవించె.
“దేవదేవారాధ్య! దివ్యావతార!
భావగమ్యాకార! భక్తలోకేశ!
శ్రీధరణీభర! శేషావతార!
మాధవ! నిగమవాఙ్మయ నిర్వికార!
వెయ్యిపాదంబులు వెయ్యిచేతులను
వెయ్యితలల్ రెండువేలుజిహ్వలును
గలిగి యందొక ఫణాగ్రమున నీజగతిఁ
గొలఁది నీలముభంగిఁగొని తాల్చునీవు
భూతాళి బుట్టింప బ్రోవ శిక్షింప
చాతుర్యుఁడవు నీవు సకలలోకేశ!
నీతత్వమెఱుఁగంగ నేరక క్రొవ్వి
యీతఁడాడిన మాటలెల్లను సైఁచు!
రక్షించు! మీ యుపద్రవము వారించు!

అక్షయబలరామ!” అనిసంస్తుతింప
ఘనప్రసన్నాత్ముడై కామపాలుండు
తనరార నంబికాతనయు మన్నించి
హలముఖ మెడలించె నప్పురికోట
బలరాముచే బాధపడి కొంత యెత్తి320
నేఁడును జూపట్టె నెఱి మోము మహిమ!
పోఁడిగా వినుతింపఁ బోలదెవ్వరికి
కురుపతి యల్లునిఁగూతును ననిచి
యరణంబు పదివేలు హరులును గరులు
మూఁడు వేల్రథములు మొగినాల్గువేలు
పొఁడిగ నిచ్చి యపుడు దోడుకొనుచును
ద్వారక కేతెంచెఁ దాలాంకుఁడంత;
శౌరి యంతయు విని సంతోషమందె.”
అనిచెప్పుటయు రామునతుల విక్రమము
విని కురుప్రవరుండు విస్మయంబంది
“పరమయోగీశ్వర! బలభద్రు మహిమ
సరసిజాసనుకైనఁ జర్చింపరాదు
హరియెట్లు విహరించె నటమీఁది కథలు
పరిపాటి నాకు నేర్పడఁ జెప్పుఁ”డనిన
బాదరాయణియు నప్పద్మాక్షు మహిమ
నాదరంబున వినుమని చెప్పఁదొడఁగె.
“నరకునిద్రుంచి యానలినలోచనుల
వెరవార పదియాఱువేలనూఱ్వురను
పరిణయంబయ్యె నాపంకజోదరుఁడు
పరసేది యిందఱఁ బొందునా! ఒకతె330

నారదుఁడు శ్రీకృష్ణుని లీలలను జూడనేతెంచుట


మరిగివర్తించునో! మరి నేర్పుకొలఁది
యరసివచ్చెదఁగాక యనుచు నారదుఁడు
[7]వరభక్తి నేతెంచి వడి ద్వారవతికి.
చనుదెంచుచో సత్య సదనంబునందుఁ
దనుపారుఁ బారిజాతమునీడ నొప్పు
విరులచప్పరములో విశదమై పొలుచు
పరువంపు పువ్వులపానుపు మీఁద
పల్లవశ్రీమించి పరగుకెంగేల
నల్లన రుక్మిణి యడుగులొత్తుచును
కాళిందిసతియు లక్షణయును నిలిచి
తాలవృంతంబులు దనుపార వీవ;
తమ్ములమీయంగఁ దగ మిత్రవింద;
అమ్ముకుందునకు నానందమొదింప
శంబరాంతకు మూలశక్తియో యనఁగఁ
బంబినరాగసంభ్రమచిత్త యగుచు
జాంబవతీదేవి చందనంబలఁద;
కంబుకంఠలు మదిఁగరము సంతసము
నలి సత్యభామయు నాగ్నజిత్తియును
సలలితంబైన వింజామర లిడఁగఁ;340
కెంగేలఁగేలును గీలించి భద్ర
యంగుళాగ్రములొత్తి యందంద తివియ;
లాలితమంగళాలాపంబు లొలయఁ

గేళిమై నింతులు కెలఁకులఁ గొలువ;
మండితకోటీరమణికాంతి నిగుడ
కుండలరుచులు జెక్కుల నవ్వులొలయఁ;
చెనకి కౌస్తుభమణి శ్రీవత్సరుచుల
వనమాల యురమున వాసనఁ జూప;
ఆయత శంఖచక్రాది చిహ్నములఁ
గేయూరకంకణాంకితబాహు లొలయ;
హాటకరుచిరచేలాంచలద్యుతులఁ
బాటిల్లి బాలాతపస్ఫూర్తి నిగుడ,
తెల్లదామెరమీఁది తేఁటి చందమున
నల్లనిమేను నున్నతశయ్యఁ జేర్చి
[8]సుదతులతోఁ గూడి సుఖగోష్ఠినున్న
యారూఢయౌవను నంభోజనయను
నారాయణుని సచ్చిదానందుఁగాంచి
మఱుఁగున నిలుచుండి మహతి మీటుటయు;
నెఱిఁగి దిగ్గనలేచి యెదురేఁగి మ్రొక్కి350
యమ్మునిఁ దోతెంచి యర్థిఁ బూజించి
క్రమ్మన నెమ్మోముఁ గనుఁగొని పలికె.
“ఓమునీశ్వరచంద్ర! యోగీంద్రవంద్య!
సేమమేనీకు? నీశిష్యులు సుఖులె?
మామీదగృపఁగల్గి మమ్ము మన్నించి
యేమివిచ్చేసితి రెఱిగింపు” మనిన
నల్లననవ్వుచు హరికేలుపాణి
పల్లవంబులఁబట్టి పలికె నమ్మౌని.

“ఆదినారాయణ! అఖిలాండనిలయ!
వేదాంగవాహన! విశ్వప్రకాశ!
విశ్వంభరాంబర! విశ్వంభరాఖ్య!
విశ్వాత్మ! నిత్య! సువిజ్ఞానరూప!
నీపేరు భవదుఃఖనీరధితేప!
నీపాదములఁ బుట్టె నిఖిలతీర్థములు
తీర్థపూతుఁడవీవ తీర్థంబు నీవ
తీర్థఫలంబిచ్చు దేవుఁడ వీవ
నీరజభవుఁడును నీతత్వమెఱుఁగ
నేరఁడు ననుఁబోఁటి నేర్చునే కృష్ణ!
నిన్నుఁజూడగలేని నీరసాత్మకులఁ
గన్నులు కన్నులే కమలాభిరామ!360
జలజాక్ష! నీపాదజలజాతయుగముఁ
దలఁపనేరని దుష్టతముల నేమందు!
తప్పక నీమూర్తి దర్శించి మ్రొక్కి
యిప్పుడే పనివింటి నిందిరారమణ!
కన్నులఁ జల్లగాఁ గనుగొంటి మంటి
నెన్నిచందంబుల నేకృతార్దఁడను!”
అనిపల్కి కృష్ణున కందంద మ్రొక్కి
చనియె నారదుఁ డొండు సదనంబులోని

శ్రీకృష్ణలీలలు


కక్కడ హరి యుద్ధవాచార్యు తోడ
నక్కజంబుగఁ జూదమాడగఁ జూచి
యతనిచేఁ బూజితుఁడై వేరె యొక్క

సతియింటి కరుగుచో శస్త్రాస్త్రలీల
లభ్యసింపుచునున్న హరిగాంచి మ్రొక్కి
యభ్యుదయంబని యటవోయి చూడఁ
చిన్నిపాపల బొమ్మపెండ్లిండ్లు సేయు
చున్న వెన్నునిఁగాంచి యుల్లంబులోన
సంతసిల్లుచునుండి మంత్రులుఁదానుఁ
దగుకార్య మూహింప దైత్యారిచేత
నగణితంబుగఁ బూజలంది యామౌని370
యటపోయి చూచుచో నశ్వరత్నంబుఁ
జటులత నెక్కి బజ్జళ్లుఁ ద్రొక్కించు;
మరియొక్క యింటిలో మగువలు దాను
నరమి దాఁగలిమూఁత లాడంగఁజూచి
యాదట నొకయింట నమలధేనువులు
భూదేవులకు ధారఁబోయఁగఁ జూచి;
వెండొక్క యింటిలో వెన్నుఁడు సతులు
కుండలీనృత్యంబుఁ గోరి యీక్షింపఁ
గనుగొనె, నాయింట కజ్జాలు పంచి
పెనుపార సతులకుఁ బెట్టంగఁజూచె;
ఇద్దసమాధిభూయిష్ఠుఁడై యొక్క
శుద్ధాంతమున నుండఁజూచి యిబ్బంగి
వెరవార పదియాఱువేవుర యిండ్ల
పరిపరివిధములఁ బంకజోదరుఁడు
కోరి క్రీడింపఁ గన్గొని దేవమౌని
శౌరిసత్యజ్ఞానసంపదలాత్మ
నచ్చెరువందుచు హరిఁబ్రస్తుతించి

యిచ్చ నెంతయుమెచ్చి యిట్లని పలికె.
“సర్వభూతాత్మక! సతతంబు మెలఁ(ఱఁ)గు
సర్వజ్ఞుఁడవు నీవు సకలలోకేశ!380
మానుషతను బొంది మహనీయ యిట్టి
జ్ఞానాధికుండౌట చర్చింపనరుదు!
యోగమాయారూఢి నొనరిన నిన్ను
యోగీంద్రులును గాన నోపరు కృష్ణ!
ఏయుగంబులయందు నెవ్వరు మున్ను
నాయంత నెఱుఁగరు నలినాక్ష నిన్ను!
నీతత్వరూపంబు నెఱిఁ బెక్కుగతులఁ
జేతోగతంబయ్యెఁ జెన్నార నాకు!
నొక్కఁడ వయ్యును నురుపుణ్యమూర్తి!
పెక్కురూపులుదాల్చి పెంపొందుచుండి;
గురుఁడును దండ్రియుఁ గోరి దైవంబుఁ
బరమాత్ముఁడవు పరబ్రహ్మంబు నీవ!”
అని ప్రదక్షిణపూర్వమై వచ్చి మ్రొక్కి
జననాథ! నవ్వుచుఁ జనియె నారదుఁడు
హరియుఁ బదారువేలంగనాజనులు
మరిగి వర్తించిన మహనీయకథలు
చదివిన వ్రాసిన సద్భక్తి విన్న
మదిలోఁన దలచిన మనుజోత్తములకుఁ
గరమొప్ప ధర్మార్థ కామమోక్షములు
దొరకును భవదుఃఖదోషంబు లణఁగు”390
నని చెప్పి శుకయోగి యప్పుణ్యచరిత
లనఘ! వెండియు వినుమని చెప్పదొడఁగె.

“నారదు వీడ్కొల్పి నలినాక్షుఁడంత
నారులు దాను నున్నత కేళిసలుపఁ
గమలారి యామినీకన్యకఁ బ్రీతిఁ
గ్రమమొప్పఁ బెండ్లికి గానేఁగుదేర

సాయంకాల వర్ణనము


చరమాద్రి యను కలశము నీటిలోన
గురువెట్టిన ఘడియకుడుకయో యనఁగ!
పరపైన ద్విజవాక్యఫణతులు చెలఁగఁ
గరమొప్పఁ గ్రుంకె భాస్కరమండలంబు;
ఎఱసంజ యడరి కెంపెక్కె నంబరము;
తఱితఱిఁ బొడఁజూపెఁ దార లందంద,
ఆలోన సకలదిశాక్రాంత మగుచు
మేలైన కృష్ణుని మేచాయఁ బోలె
నెఱినొప్పఁ గాళింది నీరంబువోలె
తఱచైన తేఁటుల దాటుఁల వోలె
పెనుపైన నీలాల పేరులు వోలె
ఘనమైన యేనుఁగ కదువులు వోలె
నలినొప్పు నీలోత్పలంబులు వోలెఁ
బొలుపైన కస్తూరి ప్రోగులు వోలెఁ400
దొలుకారుకాంతులు తుఱుములు వోలెఁ
దలమీరి చీఁకటి దట్టమై పేర్చి
ఘనతమోవారణగర్వంబు లణపఁ
గొనకొన్న సింగంపు కొదమకో యనఁగ
రాకావధూమణి రాగిల్లి చూచు

ప్రాకట రత్నదర్పణమకో యనఁగ
శార్వరీసతిముఖజలజమోయనఁగఁ
బూర్వపర్వతముపైఁ బొడమె చందురుఁడు;
తఱిమి దిక్పతుల దంతపుకరాటమున
నెఱయఁ గర్పూరంబె నించిన మాడ్కి
పరమైన బ్రహ్మాండభాండంబు నిండి
కరమొప్ప విలసిల్లె కౌముదీలక్ష్మి;
అంతట పీడితులై చకోరములు
వింతమైఁ బఱతెంచె వెన్నెఁలగ్రోల;
వెరవారఁ గృష్ణుఁడు వెన్నెలబైటఁ
దరుణులు దానును దగ వినోదించి
నందఱి యిండ్లను నమరు పాన్పులను
నందఱఁ గ్రీడించె నన్ని రూపములఁ
దెఱవలుఁ దారు మోదిలి యుండిరంతఁ
దఱచుగా నెలుగెంచెఁ దామ్రచూడములు.410

శ్రీకృష్ణుఁడు మేల్కని ప్రాతఃకాలకృత్యములఁ దీర్చుకొనుట


వందిమాగధ భాగవత నినాదములఁ
గ్రందున శౌరి మేల్కని ధర్మచింతఁ
దలపోయుచును లేచి తల్పంబు డిగ్గి
కలధౌతమయపాదుకలఁ బ్రేమఁ దొడిగి
యువిదలు కైదండలొసఁగి తోనడువ
రవణించు కనకవజ్రపు బిందియలను
జలకములాడి వస్త్రములు మైఁదాల్చి

సలలితంబుగఁ దీర్చె సంధ్యకృత్యములు.
ఎసగంగ నుదయాచలేంద్రంబు మౌళి
పసిఁడి కోహళియన భానుఁడు వొడువఁ
గలకొన కర్పూరగంధ వాసనల
నలరెడి విరులచే నతిభక్తితోడ
దేవార్చనంబు భూదేవార్చనంబు
దైవపైతృకములు తెఱఁగొప్పఁ జేసి
తిలభూహిరణ్మయధేను దానముల
సలలితంబుగ విప్రసంఘంబుఁ దనిసి
కోరి విద్వజ్జన గోష్ఠి నాలించి
యారూఢగతిని తత్వార్థంబుఁ దెలసి
యంబరాభరణమాల్యానులేపములు
తాంబూలములు నిచ్చి తగ వీడుకొల్పి420
దివ్యమాల్యంబులు దివ్యగంధములు
దివ్యభూషణములు దివ్యాంబరములు
ధరియించి తగ నాజ్యదర్పణద్యుతులు
పరికించి మోసాల బయలికేతెంచి
పటహకాహళశంఖపాటకారావ
పటుతరాశీర్వాదభద్రనాదములు
తరమిడి మ్రోయ నందక శంఖచక్ర
వరగదాశార్ఙ్గ దుర్వారశస్త్రములు
పురుషరూపముఁ దాల్చి పొరిదన్నుఁ గొలువ
కరుణాకటాక్షవీక్షణరోచు లొలయ

నల్లన నవ్వుచు నఖిలబాంధవులఁ
జల్లని చూపుల శౌరి వీక్షింపఁ
దేరాయతము సేసి తెచ్చి మ్రొక్కుటయు
దారకుఁగని నవ్వి తగ రథంబెక్కి
పసిఁడిబద్దలబూనిఁ పడవాళ్లు మ్రోయ
నెసఁగ సందడి జడియించి తోనడువ
నగరి సుధర్మాఖ్య యగు సభాస్ధలిని
కరమొప్పు ముత్యాల గద్దియ మీఁద
వీరాసనస్థుఁడై విష్ణుఁ డొప్పారె.
చేరి రసజ్ఞులు సేవకోత్తములు430
నగణిత నీతివిద్యావిశారదులు
దగుమంత్రి సామంత దండనాయకులు
నల్లుఁడు కొడుకులు నఖిలబాంధవులు
నెల్లసంపదలతో నేపారి కొలువ
అందంద కరకంకణారావ మెలయ
చందనగంధులు చామరల్ వీవఁ
గొలువెల్లఁ దామరకొలను చందమున
నలరి సేవింపఁగ నధికమోదమున
నగ్రజుఁడును దాను యమ్మురారాతి
యుగ్రసేనునిఁ గొల్చియున్న యావేళ
దౌవారికులచేతఁ దగఁజెప్పి పనిచి
యావాసుదేవుని యనుమతిఁ బడసి
చనుదెంచె నొక్కఁ డాజలజాత నేత్రుఁ
గని మ్రొక్కి పలికె నక్కటికంబుఁదోఁప.

రాజులచేఁ బంపఁబడిన దూత శ్రీకృష్ణుని యెదుట మొరవెట్టుట


“జగతి భారము మాన్ప శత్రుల నడప
నగణితంబగు సాదులగు వారిఁగావ
యాదవాన్వయమున నవతారమొంది
తాదినారాయణ! అమరేంద్రవంద్య!
మగధభూపాలుఁడు మది నోట లేక
జగతీశ్వరులనెల్లఁ జంపుచున్నాఁడు!440
వెఱవేది యిరువుర వేవుర నృపులఁ
జెఱఁబెట్టి మదిఁ గృపచింత వోవిడిచి
తరమిడి దినమొక్క ధరణీశవరునిఁ
బొరివుచ్చి భైరవపూజఁగావించు.
అతనికి లోఁబడ్డ యవనీశులెందుఁ
గతిలేక యున్న మీకడకుఁ బుత్తేర
నరుదెంచినాఁడ నీవాజరాసంధుఁ
బరిమార్చి నృపకోటి ప్రాణంబు లెత్తు
మేవిధంబున నైన నీబారిఁ గడవ
నీవెకాకొక్కండు నేర్చునే కృష్ణ?
ఇది నీకు విక్రమింబిది నీకుఁ బెంపు!
ఇది నీకు శౌర్యంబు యిందిరాధీశ!
కీర్తియు సుకృతంబు గెలుపు నీకబ్బు!
ఆర్తుల రక్షింపు మంభోజనయన!”

నారదుని యాగమనము


అని దూత వినుతింప నంత నారదుఁడు

చనుదెంచె దివినుండి శౌరిసన్నిధికి.
అమ్ముని కెదురేఁగి యర్హపీఠమున
నిమ్ముల నిలిపి మోమీక్షించి పలికె.
“మునినాథ! త్రిభువనంబుల వార్తలెల్ల
ఘనదివ్యదృష్ఠిని గననివిలేవు!450
ఏమి విశేషంబు లెఱిగింపు” మనిన
ఆముని నవ్వుచు హరిఁ జూచి పలికె.
“నీమహత్వంబున నిఖిలంబుఁగాంతు
నీమాయకడఁగాన నేరకున్నాఁడ!
కోరి నీ మేనత్తకొడుకు ధర్మజుఁడు
సూరివంద్యుఁడు రాజసూయాధ్వరంబుఁ
జేయనుద్యోగించి చెచ్చెర నిన్ను
శ్రీయుక్తి నాచార్యుఁ జేయనున్నాఁడు!
ఆమఘంబీక్షింప నఖిలదేవతలు
భూమీశ్వరులు వేడ్కఁ బోవుచున్నారు
నీరజాయతనేత్ర నీవువిచ్చేసి
బోరున రిపుకోటిఁ బొరిమార్చు వేగ
నచ్చట, శిశుపాలు డడరి నీచేత
జచ్చు నీపయనంబు సమకూర్పవలయు;
పొరి జరాసంధుఁ నుబొరిమార్ప నెట్టి
వీరున కెందును వెరవుగాదెందు!
అతఁడు భీమునిచేత నట మల్లయుద్ధ
హతుఁడౌను యన్యుల కతఁడజేయుండు.
భీమునిచేతను బెరపెట్టి చంపు
నే మీకు నెఱిఁగింప నేతెంచినాఁడఁ460

నారదుని మాటలను విని శ్రీకృష్ణుఁ డుద్ధవాచార్యుని యభిప్రాయము నడుగుట


బనివినియద” నంచుఁ బద్మాక్షు వీడు
కొని నారదుఁడు బోవ గోవిందుడంత
నయ్యుద్ధవునిఁ జూచి యంతరంగమున
నెయ్యంబు లియ్యంబు నెరయ నిట్లనియె.
“నీతియు ధర్మంబు నేర్పును హితవుఁ
జాతుర్యమును గల సత్యసంధుడవు;
కడఁకతోఁగార్యంబుఁ గనుచోట మాకుఁ
గడునొప్పు మీరలె కన్నులు బుద్ధి”
యనుటయు నుద్ధవుఁడంబుజోదరునిఁ
గనుఁగొని నమ్రుఁడై కడునొప్పఁ బలికె.
“ఇందిరాధీశ! నీవెఱుఁగని కృత్య
మెందును గలదె నన్నిలఁ బెద్దఁజేసి
మన్నించి యడిగెద మార్గంబుఁ దెలియ
విన్నవించెద నర్థి విను”మని పలికె.
“పరమబంధుఁడు నీకు పాండవాగ్రజుఁడు
సురుచిరంబుగ రాజసూయంబు సేయఁ
దలఁచినయట్టి యధ్వరకృత్యమునకుఁ
గలఁకువ లేకుండఁ గాచి రక్షింపు!
ప్రాణంబుతోడ జరాసంధుఁడుండ
స్థాణునకును గావ శక్యంబు గాదు!470
వాని నేగతినైన వధియింపకున్న
పూను జన్నంబు సంపూర్ణంబు గాదు.
ఘనబలాఢ్యుఁడు గాన కదనంబులోనఁ

జెనకి యెవ్వనికి నిర్జింపఁగా నరిది
యనిలజార్జునులతో నాపురికేఁగి
చని విప్రవరులయాచందమై వేడి
మల్లయుద్ధంబున మరి భీముచేత
నెల్లభంగులవాని యేపడగింపు
మాతఁడు దీరిన నఖిలరాజులకుఁ
“బ్రీతియౌ పగదీరుఁ బెంపొందు నీకుఁ
దగ జరాసంధుచేతను బద్ధులైన
జగతీశ్వరులఁ బ్రోవఁ జనుటయే లెస్స.”

శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థ ప్రయాణము


అని యుద్ధవుండిటు లాడువాక్యములు
విని సంతసమునొంది వెన్నుఁడాప్రొద్దె
యానకదుందుభి హలపాణి యుగ్ర
సేనాదులనుమతి సేయంగఁ గదలి
భూతలాధీశులు పుత్తెంచినట్టి
దూతకభీష్ట వస్తువులిచ్చి యనిపి
పటు సైన్య మేఘ పుష్పక బలాకాది
చటులవాజులఁ బూని సన్నద్ధలీల480
గరుడకేతనకాంతిఁ గడునొప్పు తేరు
గురుతరంబుగ దారకుఁడు దెచ్చి మ్రొక్క
నారోహణము సేసి యఖిలబాంధవులుఁ
దోరంపు వేడుకతోఁ గొల్చి రాఁగఁ;
జెలువారు కాంచన శిబిరంబు లెక్కి
యెలమి పట్టపుదేవు లెనమండ్రు నడువ;

[9]వలనొప్ప పటహాదివాద్యంబు లొలయ
వందిబృందములు కైవారంబు సేయ
సందడి పడవాళ్లు జడిసి తోనడువ
నతివైభవముల నిత్యప్రయాణముల
జతురతఁ బెక్కు దేశములుత్తరించి
జలజాతనేత్రుఁడు సకలసంపదలఁ
బొలుచునింద్రప్రస్థపురము కేతెంచె.

ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట


అమ్మహాత్మునిరాక యరసి ధర్మజుఁడు
తమ్ములుఁ దాను బాంధవులతో నెదురు,
వచ్చి నమ్రుండైన వసుదేవతనయు
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చె; గోవిందు డంత
ననిలనందను బ్రేమ నక్కునఁ జేర్చి
తనకు మ్రొక్కిన మాద్రి తనయుల నరుని490
[10]ననువార నాలింగనము సేసి వార
లందఱుఁ గొల్చిరా నమరేంద్రులీలఁ
జెంది యప్పురిఁ ప్రవేశించె మురారి.
పౌరుల కన్నులపండువ గాఁగ
భూరిపుణ్యుఁడు పాండవుల నగరికిని
నరిగి కుంతికి మ్రొక్క నమ్మహాదేవి
కరమొప్పఁ గృష్ణుని గౌఁగిటఁ జేర్చి
యానందరసముబ్బి యలుగులుఁ బారఁ

బూని యందఱఁ బ్రేమఁబూజించి కుంతి
పాంచాలసుతయు సుభద్రయుఁ గృష్ణుఁ
గాంచి సాష్టాంగంబు కరమర్థి నెఱఁగి
హరి కాంతలును దాను నన్యోన్య ప్రేమ
బరిరంభణముల సంభావన క్రియల
సలిపి యింపార మజ్జనభోజనములఁ
గలసి క్రీడించిరి; కమలాక్షుఁడంత
నాపాండవుల సేమమంతయు నడిగి
యాపార్థు గృహమున కరుగ నన్నరుఁడు
మజ్జనభోజన మహిత సౌఖ్యముల
నజ్జగన్నాథుని నతిభక్తిఁ దనిపి500
హంసతూలిక పాన్పునందు సంప్రీతిఁ
గంసారి నునిచి కాల్గడనుండి క్రీడ
నడుగు లొత్తుచు నుచితాలాప లీలఁ
గడఁగి వినోదింపగా ధర్మసుతుఁడు
చనుదెంచుటయు శౌరి చయ్యన లేచి
తనర నానృపు కరస్థలిబట్టి తివియ
నేక శయ్యను వారలిరువురు నుండఁ
జేకొని తమ్ములు సేవించియుండ
“నారగించితే కృష్ణ! అలసితీ” వనుచు

ధర్మరాజు రాజసూయయాగ విషయమై శ్రీకృష్ణుని యెదుట ప్రస్తావించుట


శౌరితోడ నజాతశత్రుఁ డిట్లనియె.
“లోకబాంధవ! చంద్రలోచన! భక్త

లోకరక్షణ! సితశ్లోక! లోకేశ!
నీవెఱుఁగని యవి నిఖిలంబు లందు
లేవెల్ల యెడల నిర్లేవుండ వీవ
వినుము నీ కెఱిఁగించు విన్నపమొకటి.
ఆనఘాత్మ! రాజసూయము పేరి క్రతువు
సేయుదునని మదిఁ జింతించినాఁడ
నేయుపాయంబున నిదిసిద్ధి బొందు
నానతిమ్మనుఁడు నాయమతనూభవుని
యాననంబీక్షించి హరి ప్రీతిఁ బలికె.510

శ్రీకృష్ణుఁడు రాజసూయయాగము నాచరింపవలసినదిగా ధర్మపుత్రుని ప్రోత్సహించుట


“కౌరవవృషభ! లోకము రాజులకును
యేరీతి సిద్ధింప దీమహాక్రతువు
ధరణీశ! నీవు నీతమ్ములు బలిమి
దొరకని కార్య మెందును గలదయ్య?
పితృదేవ సద్విజప్రీతి గావింపు
టతిశయమగుపుణ్య మయ్యధ్వరంబు!
రాజులఁ గెలిచి వారల ధనావళుల
రాజసంబునఁ దెచ్చి రాజసూయంబు
వెలయింపవలయు దిగ్విజయంబు సేయఁ
దలఁచిన వేగ నీ తమ్ములఁ బంపు”
మని చెప్పుటయు విని యమనందనుండు
ననుజుల దిగ్విజయార్థంబు ననుపఁ

పాండవులు దిగ్విజయ యాత్రకై వెడలుట
జటుల బలాఢ్యుఁడై సహదేవుఁ డెలమి
యట దక్షిణంబున కరిగె పెంపొంది;
నకులుఁడుదగ్రసైన్యము తన్ను గొలువఁ
బ్రకటితంబుగ నేఁగెఁ బడమటి కడకు;
ఘనబలోపేతుఁడై కదలి యర్జునుఁడు
ధనదు దిక్కునకు నుద్ధతవృత్తి నడచె;
సేమంబుతోడుత నెఱిఁ బూర్వదిశకు
భీమబలాఢ్యుఁడై భీముఁడుఁ గదలె;520
నీభంగిఁ జని దిక్కులెల్ల సాధించి
యాభీలరణకేళి నహితుల నోర్చి
కరిహయమాణిక్యఘన నిష్కములును
వరరత్నభూషణావలు లొప్పఁ దెచ్చి
ధర్మనందనునకుఁ దగ వేఱవేఱ
నర్మిలి నొప్పించి యనుజు లిట్లనిరి.
“జననాథ! విను జరాసంధుఁడు దక్క
మన కరి వెట్టని మహివుఁడు లేడు
వాని నిర్జింప కధ్వరకృత్యమునకుఁ
బూనఁగఁ దలఁచుట బుద్ధిగా దెందు.”
అని పల్క నుర్వీశుఁడగు ధర్మసుతునిఁ
గనుఁగొని బోధించి కంసారి పలికె.

శ్రీకృష్ణుఁడు జరాసంధుని మాయించెదనని చెప్పుట


“జననాథ! నీభుజాశ్రయశక్తి దలఁప
నెనయ జరాసంధుఁ డెంతటి వాడు?

మల్ల యుద్ధంబున మారుతిచేత
నెల్లుండి చంపింతు నిటు జూడు మమ్ముఁ
బనుపుము నీకింత భయమంద నేల?”
అనిపల్కి భీముఁడు నర్జునుఁ డెలమి
తనుఁగొల్చి రాగ నుద్ధత గిరివ్రజము

శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో బ్రాహ్మణవేషములను ధరించి గిరివ్రజము ప్రవేశించుట


దనర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి530
యరులకభేద్యుఁడై యలరు మాగధుని
వర మందిరమున కవారణ నరిగి
దేవగురుద్విజ తృప్తిఁ గావించు
సావధానుని జరాసంధునిఁ గాంచి
వామనరూపమై వచ్చి యబ్బలిని
భూమి వేఁడినయట్టి బుద్ధులప్రోగు
యనిలజార్జునులతో నర్థి దీవించి
చనవున నాజరాసంధుతో ననియె.
 

శ్రీకృష్ణుఁడు జరాసంధుని యుద్ధభిక్ష వేఁడుట


“అనఘాత్మ! యీయింటి కథితులు మేము
చనుదెంచినారము సకలవస్తువులు
నడిగిన లేదన కర్థుల కిచ్చు
కడుపుణ్యనిధివి మాగధరాజతనయ!
ఏమిగోరిన యర్థ మిచ్చి నిచ్చలును
భూమిలోఁ బొగడొంది బొంకవెన్నఁడును!

ఘనకపోతమునకై కండలు గోసి
తనువిచ్చి శిబి ధాత్రి ధన్యుఁడు గాఁడె!
మును హరిశ్చంద్రుండు మొగి కౌశికునకుఁ
దనరార పుత్రునిఁ దగ విక్రయించి
చండాలరూపమై శౌర్యంబుఁ గ్రాఁగి
యుండి తాఁబొందఁడే యూర్ధ్వలోకంబు!540
ఒక కపోతము తొల్లి యొక కిరాతునకుఁ
బ్రకటమై తనమేను భక్ష్యంబుఁ జేసి
యెట్టిపుణ్యులకైన నెన్నఁగరాని
యట్టిలోకము గాంచె నని చెప్ప వినమె!
పడుచును కనకంబుఁ బ్రాయంబు నమ్మి
యడిగిన లేదని యర్థి వర్గంబు
నెడపిన పాపాత్ము లిందును నందుఁ
జెడిపోవుదు”రనుచుఁ జెప్పిన నతఁడు
వారి తేజంబులు వారి సత్వములు
వారి మేనుల రణవ్రణకిణంబులును
గని మహీనాథులుగా నిశ్చయించి
యనియె వారలతోడ నల్లన నగుచు.
“భూపాలకులు మీకుఁ బురుడేది! విప్ర
రూపంబులొంది మా ప్రోలికి వచ్చి
యడుగుచున్నారు మీరథితులుగారు!
అడుగుఁడు ప్రాణంబులైన మీకిత్తు!
విప్రవేషముఁదాల్చి వేఁడుట చేత
విప్రోత్తముఁడు స్వయం విష్ణుఁడ వీవ”
యని పలుకఁగ శౌరి యతని తెంపునకు

మనములోపలమెచ్చి మగధున కనియె.550
అనఘ! యుద్ధార్థులమై వచ్చినార
మెనయఁ గృష్ణుండ నే నితఁడు వాయుజుఁడు
వాఁడు కవ్వఁడి మాకు ద్వంద్వయుద్ధంబు
పోఁడిగా నిమ్మన్న పొంగి మాగధుఁడు
“అగుఁగాక మీకోరి నట్ల యుద్ధంబుఁ
దగ నిచ్చినాఁడ యుద్ధతఁ జేర్చిరండు
“గోపాల! నీవోడి కురుకుమారకుల
వైపునఁ దెచ్చితి! పడుచుల తరమె!
పసదప్పి నీవోడి పారిన నేల
కసువు మొల్వదు నేఁడు! కాన నీతోడ
సమరంబు సేయుట సమయంబు గాదు
కమలాక్ష! నాకీడుగాఁ డర్జునుండు
మల్లయుద్ధంబున మారుతాత్మజుని
త్రుళ్లడంచెద! మీరు తొలఁగఁగ జూడుఁ”

భీమజరాసంధుల మల్లయుద్ధము


డనిపల్కి సన్నద్ధుఁడై యూరు వెడలి
చని యొక్క యెడ సమస్ధలముఁ గావించి
మారుతాత్మజుఁడును మగధభూపతియు
నీరసంబున డాసి యేపార నంత;
నంతకాకారులై యత్యుగ్ర భద్ర
దంతావళంబులు దగ్గఱు మాడ్కి560
పటుతర నిర్ఘాతపాతంబులట్ల
చటులతమై మల్ల చఱచి యొండొరులఁ

బట్టుచు విడుచుచు బాహుపాశములఁ
జుట్టి విణ్ణాణముల్ చూపి యార్చుచును
సరియగు సవ్యాపసవ్య మార్గములఁ
దరమిడి గదిసమై తాఁకి వైచుచును
గడల కొమ్మంటులు గ్రమ్మంగఁ జెట్టు
కడఁగి వ్రేయుచుఁ జేత గదిమి తప్పుచును
నాశీవిషంబుల ననువున మ్రోసి
యాశుగమును బోలి యందంద వ్రేయ
ముదమున డగ్గరి ముష్టిఘాతముల
పదతాడనంబులు పటుశక్తిఁ జూపి
భీముని మగధుండు పిడికిటఁ బొడువ
నామారుతాత్మజుఁడ చలుఁడై నిలిచి
మోకాలఁ గొని గుండె మోవంగఁ బొడువ
వీఁకరి మగధభూవిభుఁ డుర్వి వ్రాలె!
క్రమ్మన లేచి భీకర ముష్టి హతుల
నమ్మారుతాత్మజు నందంద నొంప
తఱలక నాతఁడాతని జత్రు దేశ
మఱిముఱి బొడిచిన యంగంబు వడఁక570
పడిపడి నిల్చి యాపవమానసుతుఁడు
నడుముఁ బీడించి విణ్ణాణంబు గొనఁగ
జాడించి యిరువురు సమసత్వ లీల
వీడాడి నొప్పింప వెన్నుఁడు గాంచి!

జరాసంధవధ


వాయుపుత్రుఁడు జూచువగ వృక్షశాఖఁ

జేయార్చి రెండుగాఁ జీరి నవ్వుటయు
నాసన్న దెలిచి మహాబలాత్మజుఁడు
ఆసన్నుఁడగు శత్రు నంటంగఁ బట్టి
పడవైచి కడకాలుఁ బరుసనఁ ద్రొక్కి
వెడవెడ నార్చుచుఁ బ్రిదిలి పోనీక
నటమున్ను జరచేత నంటంగబడిన
చటులాత్ముఁడగు జరాసంధుని మేను
తరమిడి కదిళికాస్తంభంబుఁ జీరు
కరిఁబోలి నుగ్రభీకర లీలఁ జీరి
యిరుపక్కలుగఁ జేసి యిరువంక వైచి
పరువడి నార్చిన పవమానసుతుని
హరియును నర్జునుఁ డందంద పొగడ
సురసమూహము ప్రీతిఁ జూచి కీర్తించె.

శ్రీకృష్ణుఁడు జరాసంధుని కుమాఁరుడు సహదేవుని రాజ్యమం దునిచి, కారాగృహవాసులగు రాజులను విడిచిపుచ్చుట


హరియు జరాసంధియగు సహదేవుఁ
బరగ మగధరాజ్య పట్టంబుఁ గట్టి;580
యఱిముఱిఁ జరసాల యందున్న నృపుల
వెఱవాపిఁ యందఱ విడిచి పుత్తెంచె.
కారాగృహంబునఁ గడుమాసి సొచ్చి
క్రూరబాధలఁ గంది కుందుచునున్న
యిరువదివేవురు నెనమన్నూటాఱ్వు
రురుచయ భ్రాంతులై యొండొండ వెడలి
చనుదెంచి కనిరి వాసవలోకవంద్యు

ననుపమదివ్యభూషాంబరాభరణు
భీమార్జునసమేతుఁ బృథుదీర్ఘబాహు
కామితార్థప్రదుఁ గడు భక్తి మ్రొక్కి;
“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిన్హ!
దానవాంతక! కృష్ణ! తామరసాక్ష!
ధారుణి రక్షింప ధర్మంబు నిలుపఁ
గ్రూరదైత్యులఁ ద్రుంపఁ గోరి జన్మించి
యాజనార్దునుఁడ వీవామ్నాయరూప!
ఈ జరాసంధుచే నీబాధనొంది
నునికియు నిది మహదుపకారమయ్య!
ఘనయోగవర్యులు గానఁగలేని
[11]నినుఁజూడఁ గంటిమి నిఖిలాండ నిలయ!590
తలఁపులుఁ దనువులు దయనిచ్చితీవు
జలజాక్ష! ఇది పునర్జన్మంబు మాకు!
ఖలు జరాసంధు నొక్కట జీరివైచి
బలియుఁడై పేర్చెనీ బకవైరి లావు!”
అని దీనవదనులై యర్థి కీర్తించు
జననాయకులఁ గృపాజలరాశిఁ దేల్చి
జలజాక్షుఁడంత మజ్జనభోజనముల
నలరించి భూషాంబరాదు లర్పించి
వారల నూరార్చి వలనొప్పఁ బలికె.
“క్రూరాత్ము చరసాలఁ గుంది లోఁగంది
ముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల

లచ్చుగ భోగించుఁ డరుగుడు వేడ్క
మదమత్సరంబులు మాని యేప్రొద్దు
మదిలోన నన్ను నేమఱకుండుఁ” డనుచు
రాజుల ననిచి జరాసంధి చేతఁ
బూజలు గొని రథంబులు వేడ్క నెక్కి
యనిలజార్జునులతో యతివైభవమున
దనుజారి వచ్చె నింద్రప్రస్థపురికి.

శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో నింద్రప్రస్థపురికి మఱలి వచ్చుట


వచ్చి యాపట్టణద్వారంబు నందు
సచ్చరిత్రుఁడు పాంచజన్యమొత్తుటయు600
నారవమాలించి యరుదెంచి పౌరు
లారూఢమగు మహా హర్షంబుతోడఁ
గామాది రహితు నిష్కాము శ్రీకృష్ణు
రామానుజన్ముఁ బురాణ పూరుషునిఁ
గనిమొక్కి సంతోష కలితులై రంత;
అనుజులు కృష్ణుఁడు నరుదెంచి మ్రొక్క
పరమసమ్మదమునఁ బాండవాగ్రజుఁడు
కరమర్థి మువ్వురఁ గౌఁగిటఁ జేర్చి
హరిమోముఁ గని ముదితాత్ముఁడై పలికె
“పురుషోత్తమాచ్యుత! పుండరీకాక్ష!
వరద! వామన! భక్తవత్సల! కృష్ణ!
సరసిజాసనవంద్య! సారసనేత్ర!
నీదాసులగు మాకు నిఖిలలోకముల

నేదసాధ్యములగు నిందిరాధీశ!
మఱఁదులు నీవు నమ్మగధేశు మీఁద
యఱిముఱి నేఁగిన నంతనుండియును
విలసిల్లు నురిగోల వేదనఁ బొందు
పులుగు చందంబునఁ బొరలు చుండితిమి!
చెచ్చెర శత్రునిర్జించి మీరిందు
వచ్చిన ప్రాణంబు వచ్చె గోవింద!”610
అని పల్కుటయు పాండవాగ్రజుఁ జూచి
వినయంబుఁ దోఁప నవ్విష్ణుఁ డిట్లనియె.
“నీయాజ్ఞ తలమోచి నెగడిన మాకు
నాయెడ జయలబ్దులగు టెందు నరుదె?
మూఁడులోకములకు ముల్లైన యట్టి
వాఁడు మగధభూమి వల్లభు నట్టె
వాని నశ్రమమున వధియించె భీముఁ
డేను నాసత్వము నేమనఁగలను!
బెడిదంపు పగదీరెఁ బెంపొంద నీవుఁ
దొడరి యజాతశత్రుఁడవైతి గాన

శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయమునకు గడంగుట


రాజుల రక్షింప రాజసూయంబు
నోజముఁ దప్పక నొనరింపు” మనిన
హరి వాక్యములకుబ్బి యమతనూభవుఁడు
కురుపతి ముఖ్యులఁ గోరి రప్పించి
భాగీరథీతీర పావనస్థలిని

యాగశాలలు గట్టి యఖిల వస్తువులు
సమకూర్చి వ్యాసాది సంయమీశ్వరులఁ
గ్రమమొప్ప ఋత్విజగణము రావించి
యాగోపకరణంబు లన్నియుఁ దెచ్చి
యాగమోక్తక్రియ నన్ని సంధించి620
దక్షుల నియమించి ధర్మనందనుడు
దీక్షితుఁడై మహాద్విజకోటితోడ
వేలుచుచుండఁగ విష్ణుఁడంతటికిఁ
జాలి భూసురవర్యసమితితో నిలువ
తమ్ములు సకలబాంధవులును దారుఁ
గ్రమ్మర పరిచర్యఁ గావింపుచుండ
హవ్యభాగమునకు నఖిల దేవతలు
దివ్యయానములతో దివినుండి చూడ

యుధిష్ఠిరుఁడు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట


నయ్యుధిష్ఠురుఁడు ధౌమ్యాదుల గూడి
చయ్యన నగ్రపూజలు చేయఁగోరి
యందఱ రాజుల నర్థి నీక్షించి
‘ఇందెవ్వరికి నర్ఘ్యమిత్తునో” యనఁగ
సహదేవుఁ డన్నకు జలజాక్షుఁ జూపి
“విహిత మాయర్ఘ్యంబు విష్ణున కిమ్ము
ద్విజుఁడును గురుఁడు ఋత్విజుఁడును భూమి
భుజుఁడు దైవంబునై పొలుపారు నతఁడు!
అతనిఁ బూజించిన నఖిలదేవతలు
పితరులు మునులు సంప్రీతిగావింతు”

రనవుండు ప్రియమంది యమతనూభవుఁడు
ఘనభక్తి హరికి నర్ఘ్యము సమర్పించె.630
బహురత్న భూషణాంబర గంధపుష్ప
విహితభంగుల మంత్ర విధిఁ బూజ సేయ
మునులు రాజులు మనంబుల సంతసిల్ల
ననిమిషావళి వచ్చి యభినుతి సేయ
నాలోన శిశుపాలుఁ డంతయుఁ జూచి
కాలాహిగతి మ్రోసి కరతలంబెత్తి
యొండొండ రోషాగ్ను లొలుకుచుండఁగను
పాండవాగ్రజు జూచి పలికె నుద్వృత్తి

శిశుపాలుఁడు శ్రీకృష్ణుని నిందించుట


“కటకటా! ధర్మజ! కడుచిన్నపాపఁ
డిటుజెప్ప నీబుద్ధి యేల నిట్లయ్యె?
గోపాలకుని జాలికుని సత్వహీను
బాపాత్ముఁ బశుకర్ముఁ బరదారగమను
నేమని పూజించి తిందఱి నడుమ?
ఏమటివాఁడు వీఁడీ యర్ఘ్యమునకు
బలపరాక్రముల భూపతుల సన్మునుల
దలవంపు సేయఁగఁ దగునయ్య నీకు?
ఎఱుగక కూర్మి నీవిచ్చిననైన
తఱిలేచి యర్ఘ్యంబు తానెట్లుగొనియె?
పూజనీయులగు నీ పురుషులలోన
నేజాతిగలవాఁడు! ఇటుపెద్ద సేయ?”640

ధర్మరాజు శిశుపాలునకు సమాధాన మిచ్చుట
అనిపల్కుటయు విని యంతకాత్మజుఁడు
“వినవోయి! శిశుపాల! వెఱ్ఱివి గాక
హరికి సమానుఁడు నధికుఁడు గలడె?
ఇరవుఁదప్పినమాట నేటికాడెదవు?
యజ్ఞరక్షకుడును యజ్ఞభోక్తయును
యజ్ఞఫలంబిచ్చు నతఁడును దానె!
అతని తేజోశంబు లఖిలదేవతలు
నతని గాదన నీకు నర్హమే యిట్లు?”
అని పల్క సభ్యులు నతనిఁ గీర్తించి
కనుఁగొని శిశుపాలుఁ గలుషించిరంత.

శిశుపాలవధ


ఆమాటలకు దైత్యుఁ డాత్మసైన్యంబు
తో మహారౌద్రంబుతోఁ బన్నునిలుచె!
కురుబలంబుల నాఁగఁగొనక వే గదిసి
పరవశంబొనరింప పంకజోదరుఁడు
వారల వారించి జ్వలనార్చులొలయ
దారుణచక్ర ముద్ధతఁ బ్రయోగింప
నాదిత్యకుండలాయతతీవ్రమగుచుఁ
జేదిభూపతి శిరచ్ఛేదంబు సేసె.
ఆహారవంబులు నమరసన్నుతులు
నోహోబలంబుల నులివు పె ల్లడర650
నాతని తేజోంశ మందఱుఁ జూడ
నాతతంబుగ వచ్చి హరిలోనఁ గలసె!

మునులు ఋత్విజులునుమురవైరి లావుఁ
గొనియాడి మెచ్చిరి గురుభక్తి నంత
రాజసూయంబుఁ బూర్ణము సేసి ధర్మ
రాజు, పెంపున భగీరథు సుతయందు
నవభృతస్నాతుఁడై యరుదెంచి రాజ
నివహంబుఁ బూజించి నెరవడిఁ గొలిపి
[12]వరదక్షిణల విప్రవరకోటిఁ దనిపి
యావిభవంబున నఖిలబంధులకు
వావిరి నుత్తమవస్తువు లొసఁగి
యనుప! సుయోధనుఁ డా పట్టణమున
నినుపారఁ గొన్నినెలలు వర్తించి
యాసంపదల పెంపు నయ్యధ్వరంబు
నాసభావిభవంబు నాగౌరవంబుఁ
బాంచాలి రూపసౌభాగ్యసంపదలుఁ
గాంచి నిర్విణ్ణుఁడై కడు చిన్నపోయి
యమ్మహీపతిపేర్మి యంతరంగమునఁ
గ్రమ్మర దనవీటి కరిగె రారాజు.660
పొరిఁ బాండవులచేతఁ బూజలు వడసి
హరి ద్వారవతి కేఁగె నతివలుఁ దాను.”
అని చెప్పుటయు కౌరవాధినాయకుఁడు
వినుతుఁడై శుకయోగి విభున కిట్లనియె
“వరమునీశ్వర! నీదువాక్యామృతంబు
గురుభక్తి నెంతఁయు గ్రోలిననైన

తనివొందు చిత్తమాదైత్యారి మహిమ
వినుపింపు మటుమీఁది వృత్తాంత” మనుఁడు
అమ్మహాయోగీంద్రుఁ డమ్మహాత్మునకుఁ
గ్రమ్మన నప్పుణ్యకథఁ జెప్పదొడఁగె.
“ఇవియాదిగాఁ బెక్కు లిందిరావిభుఁడు
వివిధవినోదియై విహరింపుచుండె.
మఱియును గృష్ణుఁడు మహనీయగతుల
తెఱవలఁగూడి వర్తించెఁ బెంపార;
బహురత్నచిత్రితభర్మ్యహర్మ్యముల
విహరించె సతతము వెలఁదులు దాను;
వరపుష్పతానేక వనముల యందు
మరియును బెక్కైన మదనతంత్రములఁ
దనిపి యాయింతుల ధన్యులఁ జేసె.”
అనియిట్లు విష్ణుని యవతారకథలు670
వినిపించు ఘనులకు విన్నపుణ్యులకు
వినిమెచ్చియీగల వివరమంతులకు
ఘనదోషహరమును గైవల్యసుఖము
ఘనులు యోగీంద్రులు గమనింపలేని
హరిభక్తి గల్గును నరయంగ నిదియ
వెరఁగున మది గల్గు విమలాత్ములకును
అని యిట్లు నిత్యధర్మారంభు పేర
జనలోకనవపారిజాతంబు పేరఁ
జతురకళాపూర్ణచంద్రుని పేర
నతులవైభవనిర్జరాధీశు పేర
శోభితనవరూపనూనాస్త్రు పేర

నౌభళమంత్రి కందామాత్యు పేరఁ
గోరి భరద్వాజగోత్రసంజాతుఁ
ఢారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింగనామాత్యుఁడు చెలువగ్గలించి
సలలితరసభావశబ్దగుంభనల
వలనొప్పు శ్రీభాగవతపురాణమున
మహదాదియగు దశమస్కంధసరణి
విహితలీలలనొప్పు విష్ణుచారిత్రఁ 680
బ్రాకట జగదభిరక్షకాండంబు
నాకల్ప మాకల్ప మగుభంగిఁ జెప్పె.
 

జగదభిరక్షకాండము సమాప్తము.


శ్రీకృష్ణార్పణమస్తు.
  1. ధావోసెదవు+ఏట. ఏట=పక్షపాతము
  2. ఒకే పాదము కన్పడుచున్నది
  3. ఒకే పాదమున్నది
  4. అర్థము చింత్యము
  5. ఒకే పాదము కన్పట్టుచున్నది.
  6. ఒకే పాదమున్నది
  7. ఒకే పాదమున్నది
  8. ఒకే పాదమున్నది
  9. ఒకే పాదమున్నది
  10. ఒకే పాదమున్నది
  11. ఒకే పాదమున్నది
  12. ఒకే పాదమున్నది