ద్వితీయస్కంధము - అధ్యాయము 1

వికీసోర్స్ నుండి
ద్వితీయస్కంధము - అధ్యాయము 1


క. శ్రీమద్భక్త చకోరక, సోమ ! వివేకాభిరామ ! సురవినుత గుణ

స్తోమ ! నిరలంకృతాసుర, రామా సీమంతసీమ ! రాఘవరామా ! (1)


వ. మహానీయ గుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె. అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండిట్లనియె. (2)


సీ. క్షితిపతి ! ప్రశ్నంబు | సిద్ధంబు మంచిది యాత్మవేత్తలు మెత్తు | రఖిలశుభద

మాకర్ణనీయంబు | లయుతసంఖ్యలు గల, వందు ముఖ్యం బిది | యఖిలవరము

గృహములలోపల| గృహమేధులగు నరు, లాత్మతత్త్వము లేశ | మైన నెఱుఁగ

రంగనారతుల ని | ద్రాసక్తిఁ జను రాత్రి, పోవుఁ గుటుంబార్థ | బుద్ధి నహము

ఆ. పశు కళత్ర పుత్ర | బాంధవ దేహాది, సంఘమెల్లఁ దమకు | సత్యమనుచు

గాఁపురములు సేసి కడపటఁ జత్తురు, కనియుఁ గాన రంత్య | కాలసరణి. (3)


క. కావున సర్వాత్మకుఁడు మ, హావిభవుఁడు విష్ణుఁ డీశుఁ | డాకర్ణింపన్

సేవింపను వర్ణింపను, భావింపను భావ్యుఁ డభవ | భాజికి నధిపా ! (4)


ఆ. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని, వలన ధర్మ నిష్ఠ | వలన నైన

నంత్యకాలమందు హరిచింత సేయుట, పుట్టువునకు ఫలము | భూవరేంద్ర ! (5)


తే. అరసి నిర్గుణబ్రహ్మంబు | నాశ్రయించి, విధి నిషేధము లొల్లని | విమలమతులు

సేయుచుందురు హరిగుణ | చింతనములు, మానసంబుల నెప్పుడు | మానవేంద్ర ! (6)


సీ. ద్వైపాయనుండు మా | తండ్రి ద్వాపరవేళ, బ్రహ్మసమ్మితమైన | భాగవతము

పఠనంబు సేయించె | బ్రహ్మతత్పరుఁడనై, యుత్తమశ్లోక లీ | లోత్సవమున

నాకృష్ణ చిత్తుండ | నై పఠించితి నీవు, హరిపాద భక్తుండ | వగుటఁజేసి

యెఱిఁగింతు వినవయ్య ! యీ భాగవతమున. విష్ణుసేవాబుద్ధి | విస్తరిల్లు

ఆ. మోక్షకామునకు | మోక్షంబు సిద్ధించు, భవభయంబు లెల్లఁ | బాసిపోవు

యోగి సంఘమునకు | నుత్తమ వ్రతములు, వాసుదేవ నామ | వర్ణనములు. (7)


తరలము :- హరి నెఱుంగక యింటిలో బహు | హాయనంబులు మత్తుఁడై

పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ | బోవనేర్చునె ? వాఁడు సం

సరణముం బెడబాయఁ డెన్నఁడు | సత్య మా హరినామ సం

స్మరణ మొక్క ముహూర్తమాత్రము | సాలు ముక్తిదమౌ నృపా ! (8)


సీ. కౌరవేశ్వర ! తొల్లి | ఖట్వాంగుఁడును విభుం, డిల నేడుదీవుల | నేలుచుండి

శక్రాది దివిజులు | సంగ్రామ భూముల, నుగ్రదానవులకు | నోడి వచ్చి

తమకుఁ దో డడిగిన | ధరనుండి దివికేఁగి, దానవ విభుల నం | దఱ వధింప

వరమిత్తు మనుచు దే | వతలు సంభాషింప, జీవితకాలంబు | చెప్పుఁ డిదియ

ఆ. వరము నాకు నొండు వరమొల్ల ననవుఁడు, నాయువొక ముహూర్త | మంత తడవు

గల దటంచుఁ బలుక గగనయానమున న, మ్మానవేశ్వరుండు మహికి వచ్చి . (9)


క. గిరులం బోలెడి కరులను హరులం దన ప్రాణదయితలై | మనియెడి సుం

దరులను హిత నరులను బుధ, వరులను వర్జించి గాఢ | వైరాగ్యమునన్. (10)


క. గోవిందనామ కీర్తనఁ గావించి భయంబు దక్కి | ఖట్వాంగ ధరి

త్రీ విభుఁడు సూఱగొనియెను, గైవల్యము దొల్లి రెండు | గడియల లోనన్. (11)


వ. వినుము నీకు దినసంబులకుం గాని జీవితాంతంబు గాదు. తావత్కాలంబునకుం బారలౌకిక సాధనభూతంబగు పరమకల్యాణంబు సంపాదింపవచ్చు. అంత్యకాలంబు

డగ్గఱిన బెగ్గడిలక దేహి దేహ పుత్ర కళత్రాది సందోహ జాలంబు వలన మోహసాలంబు నిస్కామకరవాలంబున నిర్మూలంబు సేసి, గేహంబువెడలి పుణ్యతీర్థ జలావగాహం

బొనర్చి, యేకాంత శుచిప్రదేశంబున విధివ త్ప్రకారంబునం గుశాజిన చేలంబుల తోడం గల్పితాసనుండై, మానసంబున * ( నిఖిల జగ త్పవిత్రీకరణ సమర్థంబగ ) అకారాది

త్రివర్ణ కలితంబైన ప్రణవంబు సంస్మరింపుచు, వాయువుల జయించి, విషయంబుల వెంట నంటిగెంటి పాఱెడి యింద్రియంబుల బుద్ధిసారథియై మనో నామకంబులైన

పగ్గంబుల బిగ్గం బట్టి మ్రొగ్గఁదిగిచి, దట్టంబులైన కర్మఘట్టంబుల నిట్టట్టు మెట్టెడు మనంబును శేముషీ బలంబున నిరోధించి, భగవదాకారంబుతోడ బంధించి,

నిర్విషయంబైన మనంబున భగత్పాదాద్యవయవంబులు క్రమంబున ధ్యానంబు సేయుచు, రజస్తమోగుణంబులచేత నాక్షిప్తంబు విమూఢంబు నగు చిత్తంబునఁ

దద్గుణంబులవలన నయ్యెడి మలంబులం ధారణావశంబునఁ బో నడిచి, నిర్మల చిత్తంబునం బరమంబైన విష్ణుపదంబునకుం జను. ధారణా నియమంబు గలిగి

సుఖాత్మకంబగు విషయంబు నవలోకించు యోగికి భక్తిలక్షణంబైన యోగంబు వేగంబె సిద్ధించు ననిన యోగీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. (12)


క. ధారణ యే క్రియ నిలుచును ? ధారణ కే రూప ? మెద్ది | ధారణ యనఁగా ?

ధారణ పురుషు మనోమల, మే రీతి హరించు ? నాకు | నెఱిఁగింపఁ గదే. (13)


వ. అనిన విని రాజునకు నవధూతవిభుం డిట్లనియె. (14)


ఆ. పవనములు జయించి | పరిహృత సంగుఁడై, యింద్రియముల గర్వ | మెల్ల మాపి

హరి విశాలరూప | మందుఁ జిత్తము సేర్చి, నిలుపవలయు బుద్ధినెఱపి | బుధుఁడు. (15)


వ. వినుము భగవంతుడైన హరి విరాడ్విగ్రహంబునందు భూత భవిష్య ద్వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానం బగు. ధరణీ సలిల తేజ స్పమీరణ గగనాహంకార

మహత్తత్వంబు లనియెడి సప్తావరణంబులంచేత నావృతంబగ మహాండ కోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజపురుషుండు దేజరిల్లు. అ మ్మహాత్మునికిఁ

బాదమూలంబు పాతాళంబు, పాష్ణి౯భాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు, గుల్ఫంబు మహాతలంబు, జంఘలు తలాతలంబు, జానుద్వయంబు సుతలంబు, ఊరవులు

వితలాతలంబులు, జఘనంబు మహీతలంబు నాభీవివరంబు నభస్తలంబు వక్షంబు గ్రహ తారకా ముఖర జ్యోతిస్స్మూహ సమేతంబగు నక్షత్రలోకంబు, గ్రీవము

మహర్లోకంబు, ముఖంబు జనలోకంబు, లలాటంబు తపోలోకంబు, శీర్షంబులు సత్యలోకంబు, బాహుదండంబు లింద్రాదులు, కర్ణంబులు దిశలు, శ్రవణేంద్రితంబు శబ్దంబు,

నాసాపుటంబు లశ్వనీదేవాతలు, ఘ్రాణేంద్రియంబు గంథంబు, వదరంబు వహ్ని, నేత్రంబు లంతరిక్షంబు, చక్షురింద్రితము సూర్యుండు, రేయింబగళ్ళి ఱెప్పలు, భ్రూయుగ్మ

విజృంభణంబు బ్రహ్మపదంబు తాలువులు జలంబు, జిహ్వేంద్రియంబు రసంబు, భాషణంబులు సకలవేదంబులు, దంష్ట్రలు దండధరుండు, దంతంబులు పుత్రాది

స్నేహకళలు, నగవులు జనోన్మాద కారిణియగు మాయ, కటక్షంబులు దురంత సంసర్గంబులు, పెదవులు వ్రీడాలోభంబులు, స్తనంబులు ధర్మంబు, వెన్నధర్మమార్గంబు,

మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు విత్రావరుణులు, జఠరంబు సముద్రంబులు, శల్యసంఘంబులు గిరులు, నాడీ నివహంబులు నదులు, తనూరుహంబులు తరువులు,

నిశ్వాసంబులు వాయువులు, * కాలంబు గమనంబు, కర్మంబులు నానావిధ జంతుసన్నివహ సంవృత సంసరణంబులు, శిరోజంబులు మేఘంబులు, కట్టు పుట్టంబులు

సంధ్యలు, హృదయంబు ప్రధానంబు సర్వవికారంబులకు నాశ్రయభూతంబైన మనము చంద్రుండు, చిత్తంబు మహత్తత్వంబు, అహంకారంబు రుద్రుండు, అశ్వాశ్వతర్యుష్ట్ర

గజంబులు నఖంబులు, కటిప్రదేశంబు పశు మృగాదులు, విచిత్రంబలె న యాలాపనైపుణ్యంబులు పక్షులు, బుధ్ది మనువు, నివాసంబు పురుషుండు, షడ్జాదులయిన

స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధాత సిద్ధ చారణాప్సర స్సమూహంబులు, స్మృతి ప్రహ్లాద ప్రముఖులు, వీర్యంబు దైత్య దానవానీకంబై యుండు. మఱియు

నమ్మహావభునకు ముఖంబు బ్రాహ్మణులు, భుజంబులు క్షత్త్రియులు, ఊరులు వైశ్యులు, చరణంబులు శూద్రులు, నామంబులు నానావిధంబులైన వసు రుద్రాది

దేవతాభిధానంబులు, ద్రవ్యంబులు హవిర్భాగంబులు, కర్మంబులు యజ్ఞప్రయో గంబులు. ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబున ముముక్షుండైన వాఁడు

మనస్సంధానంబు సేయవలయునని చెప్పి వెండియు నిట్లనియె. (16)


క. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయను పనిలేదా

హరిమయము గానిద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన ! వింటే. (17)


సీ. కలలోన జీవుండు కౌతుహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి

యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెఱుఁగు కరణి

నఖిలాంతరాత్మకుఁ డగు పరమేశ్వరుఁ డఖిల జంతుల హృదయములనుండి'

బుద్ధివృత్తులనెల్ల బోద్ధయై వీక్షించు బంధబద్ధుఁడు కాఁడు ప్రాభవమున.


తే. సత్యుఁ డానందబహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁ గాక యన్య సేవఁ

గలుగు నేఅవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసార బంధ మధిప ! (18)