దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఢిల్లీ దర్బారు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఢిల్లీ దర్బారు

ఆసంవత్సరము డిశెంబరులో అహమ్మదాబాదులో కాంగ్రెస్‌మహాసభ సమావేశమయ్యెను. ఆసమయముననే డిల్లీలో ఎడ్వర్డు పట్టాభిషేకసందర్భమున ఉత్సవమునకు స్వతంత్రసంస్థాన ప్రభువుల నందరిని రప్పించి గొప్పవేడుకలు సలిపి ఆంగ్లేయ సామ్రాజ్య ప్రాబల్యమును ప్రకటింపవలెనని కర్జనుప్రభువు ప్రకటించి, రాష్ట్ర శాసనసభాసభ్యులు మొదలగువారికి ఆహ్వానములు పంపించెను. బందరునుండి కాంగ్రెసుసభకును, డిల్లీఉత్సవము జూచుటకును వెళ్ళవలెనని చాలమందిమి కుతూహల పడుచుంటిమి. మా కెవ్వరికి ఆహ్వానములు రాలేదు. ప్రయాణ సమయమునకు అందరును వెనుతగ్గిరి. నరసరావుపేటలో ప్లీడరుగా నుండిన వంకాయల శేషావతారముగారు మాత్రము ఒకసారి నాకు గనుపడి, తాను తప్పక వచ్చెదననియు బెజవాడ స్టేషనులో కలుసుకొందుననియు తారీఖుగూడ నిర్ణయించి చెప్పెను. నేను బయలుదేరి నిర్ణయించిన వేళకు బెజవాడ చేరితినిగాని నా కాయన కనపడలేదు. ఒక్కడనే రైలెక్కి చక్కగ అహమ్మదాబాదు చేరితిని. అక్కడికి హిందూపత్రికాధిపతిగా నుండిన కస్తూరి రంగయ్యంగారు, రంగస్వామయ్యంగారు అను హైకోర్టువకీలు, గౌరవనీయులగు పేరరాజుగారు మొదలగు దక్షిణప్రాంతీయు లెందరో సభకు వచ్చిరి. దక్షిణాదిప్రతినిధులకు ప్రత్యేకముగ బస ఏర్పరచిరి. చలి ఎక్కువగా నుండెను. స్నానమునకు బాగుగ మసలుచుండిన వేడినీళ్ళుగూడ పైన పోసుకొనునప్పటికి చల్లబడి శీతబిందువులు ఉష్ణబిందువులు కలియబోసిన ట్లుండెను. పండిత అయోధ్యనాధ్‌గారు మహాసభ కధ్యక్షులుగ నుండిరి. వ్రాసి అచ్చొత్తించి ప్రకటించిన ప్రారంభోపన్యాసమును చేతబట్టకనే అందులో నున్న పదములతోడనే ఎచ్చటను మార్పులేకుండ మిక్కిలి నిపుణత్వముతో సహజసంభాషణవలె ప్రసంగించిరి. సురేంద్రనాధబెనర్జీగారి ఉపన్యాసము అద్భుతముగ నుండెను. ఇతరులు వ్రాసిన విషయములు విడికాగితములమీద వ్రాసి, ఆయన భాషించుసమయములో సందర్భమునుబట్టి జ్ఞాపకార్ధము వారి కార్యదర్శి కంటిఎదుట పెట్టీపెట్టకముందే గ్రహించి, ప్రసంగములో వాని నిమిడ్చిచెప్పు వైఖరియు వారి జ్ఞాపకశక్తియు ఆశ్చర్యముకల్పించెను.

డిల్లీమహోత్సవము చూడవలె నను కోర్కె యున్నది గాని నా కాహ్వానము రాలేదు. ముందుగా బసనిమిత్తము ప్రయత్నము చేయలేదు. ఇంతగా వ్యయప్రయాసల కోర్చి డిల్లీకి చేరినను అచట వసతి లేనియెడల ప్రయోజనముండదు. బసలు దొరకవని బయలుదేరినప్పుడు తెలియదు. డిల్లీకి రానుపోను రెండవతరగతిటికెట్టు ముందుగానే కొంటిని. పేరరాజుగారి నడుగగా తన బసలో మరియొకరికి వీలుండునో యుండదో తెలియదని చెప్పిరి. కాంగ్రెసుకు వచ్చిన ప్రముఖు లెందరో డిల్లీలో ముందే బసలేర్పరచుకొనిరి. వారందరును డిల్లీకి ప్రయాణమయి పోవుచుండిరి. నేనును కానీ, చూతమని వారితోగూడ పయనమై పోతిని. రైలుస్టేషనులో నిలువగనే ఎవరికివారు వెడలిపోయిరి. నేను నాసామానులతో స్టేషనులో నిలచిపోతిని. కూలీలు మాటిమాటికి వచ్చి సామాన్లు తెచ్చెద మని వేధింపసాగిరి. తుద కొక చిన్న కూలీవా డుండగా వానిని బిలిచి నా కప్పటికి వచ్చిన హిందూస్థానీభాషలో సమీపమున ఏదైనా బస కలదా యని ప్రశ్నించగా సత్రము కలదని జవాబు చెప్పెను. అంతట వానిచే సామాను పట్టించుకొని కాలినడకనే ఒకపెద్ద మేడయింటివాకిటికి పోతిమి. ద్వారములో ప్రవేశించగనే రెండువైపుల నెత్తగు గచ్చుటరుగు లున్నవి. అం దొకదానిపై నిరువురు నల్లనిగడ్డాలవారు తలపాగలు పెట్టుకొని చొక్కాలు తొడుగుకొని మనప్రాంతముల మహమ్మదీయులవలె హుక్కాపీల్చుచుండిరి. వ్రాతబల్లమీద రిజిష్టరు పెట్టుకొని లోపలికి పోవువారిపేర్లు వ్రాసుకొనుచుండిరి. ఆమేడ ఎవ్వరిదో స్వంతగృహము. నేను హిందూస్థానీలో నాకు ఆయింట బస దొరకునాయని వారిని అడిగితిని. దక్షిణపుమూల ఖాళీగాయున్నదని రోజు 1కి రు 6/- లు అద్దెఅనియు, ప్రత్యుత్తరమిచ్చిరి. నేనందుకు సంతసించి ఆరోజుకు రు 6/- లు నిచ్చి రసీదు తీసికొని మేడమీదికి సామానుతో పోతిని. తలదాచుకొనుట కిట్లుస్థలము దొరకినందుకు సంతసించుచు భోజనమునకై సమీపమున పూటకూలిబస కలదాయని విచారించితిని. కాని క్రిందనున్న నల్లగడ్డములవారు హిందువు లని తెలుసుకొనినపిమ్మట హిందువు లెవ్వరో, ముసల్మాను లెవ్వరో, హిందువులలో బ్రాహ్మణు లెవ్వరో, బ్రాహ్మణేతరు లెవ్వరో, బ్రాహ్మణు లైనను మాంసభక్షకు లెవ్వరో, కానివా రెవ్వరో నిర్ణయింపలేక, ఆకలితీరుటకు పాలును పండ్లును రొట్టెయును దిని కాలము గడపనెంచితిని. వీధివెంట బయలుదేరి కొంతదూరము పోవునప్పటికి ప్రతి అంగడిలోను పెద్ద కళాయిలవంటి పాత్రలలో పాలు పొయిలమీద క్రాగుచుండెను. ఒక అంగడిలో పాలును, అప్పుడప్పుడు చేసిన రొట్టెయును కొని గదికి తెచ్చుకొని భుజించి, మంచినీరు ద్రావి నిదురించి, కొంతసేపటికి మేల్కొని, పట్టణము చూడవలెనని గదితాళమువేసి బయలుదేరితిని. డిశంబరునెలలో నచట మిక్కిలి చలిగాన ఉన్నిలాగును, ఉన్నిషర్టును దట్టమైన ట్వీడ్ లాంగు కోటును, సరిగతలపాగయు, మెడకు ఉన్నికంఫర్టరును ధరించి, కాళ్ళకు ఉన్నిమేజోళ్ళును బూటులును తొడిగికొనియుంటిని. చేతిలో అందమగు చేతికర్ర యుండెనని జ్ఞాపకము. మరియు బంగారుగొలుసుగల వెండి జేబుగడియారమును కోటుజేబులో వేసుకొనియుంటిని. నాకు అప్పటి వయస్సు ముప్పదియారు సంవత్సరములుగాన దార్ఢ్యముతో కాలినడకనే మెల్ల మెల్లగ పోవుచుంటిని. పట్టణములో హస్తినాపురము అని యొకభాగమున, ఇంకొక భాగమున వీధులలో ఇంద్రప్రస్థ మని బల్లలపై వ్రాయబడి యుండెను. చాందినీచౌకు, జుమ్మామసీదు చుట్టుప్రక్కల దర్శనీయముగ నుండెను. పెద్ద మైదానములో ఇప్పుడు క్రొత్తఢిల్లీ కట్టిన స్థానముననే ఉత్సవము నిమిత్తము ఢిల్లీకి వచ్చెడి సంస్థానాధీశు లుండుటకు ప్రత్యేకస్థలము లేర్పరుపబడెను. బరోడామహారాజు కొయ్యపలకలతో రాజమందిరమువలె నొక కట్టడమును నిర్మాణము చేయించుకొనిరి. దానిని మరల ఊడదీసి మడతబెట్టి రైలుమీద వారి సంస్థానమునకు గొనిపోవుటకు వీలుగా నిర్మించిరి. రాకపోకలకు ఎఱ్ఱమట్టితో బాటలను వేయించి, ఇంగిలీకమువలె నెఱ్ఱగ గన్పడు దానిపైన అభ్రకపు బొడి చల్లించుటచే తళతళ మెరయుచుండెను. మహారాజులు, నవాబులు చతురంగసమేతముగా దర్బారుకైవచ్చి విడిసియుండిరి. దర్బారు స్థలమునకు చుట్టును ప్రహరీగోడ కట్టించి, దాని కొకప్రక్క కొంచె మెత్తుగ పెద్ద అరుగును కట్టించి దానిపై సంస్థానాధీశుల కలంకృతములగు పీఠము లమర్చిరి. మధ్యభాగమున మిక్కిలి సుందరమగు ఉన్నతాసనము నేర్పరచి, దిగువ వివిధ రాష్ట్రముల గవర్నరులు, నుద్యోగులు, శాసనసభ్యులును ప్రఖ్యాతి పురుషులు మున్నగువారికి ఉచితాసనము లమర్చిరి. ఇవి గాక ప్రేక్షకులకుగూడ అవకాశములు సమకూర్చిరి. ఒకనాడు పురవీధులలో గొప్ప ఊరేగింపు, ఇంకొకదినము కాల్బలములు, అశ్వదళములుగల అరువదివేలసేన ఒక్కసారిగ ప్రదర్శింపబడుట, మున్నగు కార్యక్రమములు ప్రకటితములైనవి. సభాస్థలమునకు చుట్టును పహరాలుబెట్టి అడ్డములు గట్టినందున వెలుపలివారలకు లోపల నేమియు కనుపడదు. అందు ప్రవేశమునకు ప్రేక్షకులకు టిక్కెట్లు ఇవ్వబడునని తెలియవచ్చినది. కాని ఈ టిక్కెట్లు ఎప్పు డెవ్వ రిచ్చెదరో తెలియదు. పంజాబు దేశస్థుడగు ఒక డిస్ట్రిక్టుమునసబుతో పరిచయము కలిగెను. ఆయనయు స్నేహపాత్రుడుగ నుండెను. టిక్కెట్టునిమిత్తము ఆయన ప్రయత్నము చేయుచున్నాడు గాన నాకు నొకటి సంపాదింతునని వాగ్దానముచేసెను. కాని తుద కాయనకు లభించుటచే దుష్కరమైనది. ఇట్లుండగా నే నుండిన బసలో క్రింద నున్న కొళ్ళాయి యొద్ద ముఖము కడుగుకొనుచుండగా "వీరే వెంకటప్పయ్య" అని యెవరో అనిరి. నే నాశ్చర్యముతో తిరిగి చూచునప్పటికి నా చిరకాలమిత్రుడు నంబూరి తిరునారాయణస్వామి కనబడెను. నే నున్న మేడక్రింది కొట్లలో ఏలూరినుండి వచ్చిన మిత్రులతోగూడ మూడుదినములుగా వంటలుచేసికొనుచుంటి మని ఆయన తెలిపెను. దర్బారునకు టిక్కెట్లనిమిత్తము మరల ప్రయత్నముచేయ నారంభించితిమి. దర్బారునాటి ఉదయమున టిక్కెట్లు ఇచ్చెడి స్థానము తెలుసుకొని మేము పోవునప్పటికి టిక్కెట్లు అయిపోయిన వని తేలిపోయెను. రాజదర్శనము లేకున్నను తీర్థసేవయైనను చేయుదమని యమునానదిలో స్నానము చేసితిమి. పట్టణమునకు మరలివచ్చు సమయమున అడవిగడ్డి మోపులు దాల్చి వచ్చు ఒంటెలమంద కనబడెను. ఒక్కసారిగ అన్ని యొంటెల నెన్నడును చూచియుండలేదు. పిల్లఏనుగులవలె నుండు గవనిబఱ్ఱెలుగూడ మందలై కన్పించినవి. ఇవి నిత్యము బిందెడుపా లిచ్చునని చెప్పుచుండిరి. వీని పెరుగు రాయివలె గడ్డకట్టియుండును. ఒకరాత్రి నేను వీధివెంట బోవుచుండ విశాలమగు పెద్దతొట్టిలో పాలు బిందెలతో తెచ్చి కుమ్మరించుచుండుట కననయ్యెను. ఆ పాల నేమిచేయుదురని యడుగగా ఒక సంస్థానాధీశుని గుఱ్ఱములు త్రాగుటకై తొట్టిలో బోయుచున్నారని చెప్పిరి.

దర్బారును చూడకున్న మానె, ఊరేగింపు టుత్సవమైన చూత మనుకొంటిమి. దానిని చూచుటకై వీధులలో తగిన ప్రదేశములను ప్రజలు ముందుగా వెదకుకొనుచుండిరి. జుమ్మా మసీదు వాకిలిమెట్లు ఒకదానిపై నొకటిగ పొడవున వరుస వరుసగ పైకి బోవుచుండుటచే పెద్ద నాటకశాలలో గాలరీవలె నుండెను. కొన్ని వేల జనులు ఆమెట్లపై కూర్చుండవచ్చును. ఆమసీదు అధికారులు ఇదే సమయమని మెట్లకు టిక్కెట్ల నేర్పరచి వసూలుచేయ నారంభించిరి. టిక్కెట్లఖరీదు క్రమమున కొన్ని వందలరూపాయలవరకు బెరిగెను. మసీదుబురుజులమీద సహితము స్థానము లేర్పరచి కొన్నివందలరూపాయలు వసూలుచేసిరి. ఇక రాజవీధులప్రక్క ఇండ్లమేడలమీదను, డాబాలమీదను గోడలమీదనుగూడ ప్రేక్షకులు తావులేర్పరచుకొనిరి. నేను మసీదుమెట్లమీద తొమ్మిదిరూపాయలకు టిక్కెట్టు కొంటిని. ఉత్సవము మధ్యాహ్నము పండ్రెండుగంటలకు ఆగ్రాద్వారముగుండ బయలుదేరెను. అందుకు సూచనగ పెద్దఫిరంగులమ్రోత వినబడెను. పిమ్మట నశ్వరాజము నెక్కిన భారతీయనాయక ప్రముఖుడొకడు పొడసూపెను. ఈతడు సర్‌ప్రతాపసింగు అని కొందరు ప్రేక్షకులు చెప్పుచుండిరి. ఆయనవెంట గుఱ్ఱములపై బ్యాండువాయిద్యము బయలుదేరెను. వారివెనుక పదాతివర్గము నడువసాగెను. ఆ పదాతుల వెన్నుదన్ని మరియొక బ్యాండు వాయిద్యమును వారి వెన్నంటి అశ్వములపై రాజకుమార దళమును నడువసాగెను. సమానవయస్కులు, సుందరగాత్రులునగు రాకుమారులు తెల్లనిషేర్వాణీలును, లేతనీలవర్ణపుదలపాగలును, రత్నస్థగితములై మెరయుచున్న కల్కితురాయిలు ధరించి మణులుచెక్కిన కంఠహారములతో తేజోవంతములగు ముఖారవిందములతో చూచువారల కన్నులకు ఆనందము గొల్పుచుండిరి. నక్షత్రములు ఆకసమునుండి దిగివచ్చి ఈ మహోత్సవమున పాల్గొనుచున్నవా యన్నట్లు ఇరువదియేడు గురు రాకుమారులు ఆశ్రేణిలో నుండిరి. వీ రెక్కిన గుఱ్ఱములును చిరుతపులిచర్మపుజీనులతో నొక్కరూపున నొప్పారు (Pony) పోనీలు. ఈదళము వెనుక ఆఫ్‌గన్‌పటానుయువకులు వదులుగానుండు తెల్లని చొక్కాలు తొడిగి, తోకలు విడిచిన ఆకుపచ్చతలగుడ్డలు పెట్టుకొని పొట్టి టింగణాలపై సాగిపోయిరి. వారివెంట పెద్దగుఱ్ఱములపై నందమగు దుస్తులు ధరించిన బ్యాండువాయిద్యమువారు హృద్యముగ వాయించుచు వెడలిరి. పిమ్మట నొక వృద్ధగజరాజముపై బంగారునీరుపోసిన హౌదాయందు కర్జనుప్రభువును ఆయనసతీమణియును వెడలివచ్చిరి. సరిగపట్టెలుగల చిత్రవస్త్రములతో ఆభరణములతో నలంకరించిన ఈగజమున కిరుప్రక్కలను వెండికఱ్ఱలు బట్టుకొని వేత్రహస్తులు నడచుచుండిరి. ఈ ఏనుగు కాశీమహారాజుల వారిది. 1857 సంవత్సరమున విక్టోరియారాణీగారికి భారత చక్రవర్తిత్వము సిద్ధించినపుడు డిల్లీలో గావించబడిన మహోత్సవమునాడు ఊరేగిన మహాగౌరవము గాంచినదిగాన దానిని మరల ఆమె కుమారుని పట్టాభిషేకకాలమున ఊరేగింపులో రాజప్రతినిధిగ తానెక్కవలెనని కర్జనుప్రభువు పట్టుబట్టి రప్పించెనట. ఆ యుత్సవమునకు ఎడ్వర్డురాజుగారిసోదరుడు కానాట్ డ్యూకు భార్యాసమేతుడై మనదేశమునకు వచ్చెనుగాని రాజప్రతినిధియగు తానే ముందుబోవలెనని కర్జను శాసించెనట. అందువలన కానాట్ సతీమణితోగూడ గజారూడుడై వెనుక వచ్చుచుండ కర్జను తాను ముందు నడిచెను. కానాటు వెనుక గజములనెక్కిన మహారాజులు ఏబదిమంది జంటజంటలుగ వారి వారి చోప్‌దారీలతో మెల్లమెల్లగ బోవసాగిరి. వా రెక్కిన గజములును చిత్రాలంకృతములు గావింపబడియుండెను. వారును వంకరతలపాగల రత్నములుపొదిగిన కలికితురాయిల నమర్చి పట్టుచొక్కాయిలను తొడిగి మణిమయములగు కంఠహారములను, కంకణములను, భుజదండములను ధరించియుండిరి. ఆదృశ్యము భారతదేశపు రత్నములన్నిటి నొక్కచో రాశిబోసినట్లు చూపట్టెను. కాని ఈమహారాజు లందరు విదేశరాజప్రతినిధివెంట దాసులై పోవుట భారతదేశపుబానిసత్వముగూడ ఇచట రూపెత్తినట్లే కనుపించెను. ఈసంస్థానాధిపతులలో ముందుజంటలో నెవ్వరి నేర్పరచవలెననుప్రశ్న వచ్చినపుడు మైసూరు, ట్రావెన్కూరుప్రభువులను మొదటిజంటగా నిర్ణయించిరట. ఈవార్త నైజామునకు తెలిసి తాను మొదటివరుసలోనే ఉండవలెననియు అట్లుగానిచో ఉత్సవమున పాల్గొనననియు పంతముబూని స్వంత రైలుమీదనే డిల్లీకి వచ్చి రైలుస్టేషనులో తన బండిలోనేయుండి రాజప్రతినిధితో ఉత్తరప్రత్యుత్తరములు నడిపి, తుదకు ట్రావెన్కూరుమహారాజును రెండవవరుసకు దించి, తన్ను మొదటి వరుసలో చేర్చినపిమ్మట బండిదిగి పట్టణములో తనబసకు చేరెనని చెప్పుకొనుచుండిరి.

దర్బారుసమయమున ఈమహారాజు లొక్కొక్కరు లేచి మధ్యపీఠాసీనుడైయున్న రాజప్రతినిధియగు కర్జనుప్రభువు నొద్దకు జని, కానాట్‌ప్రభువు పరిచయము నొంది, ఆంగ్లప్రభుత్వముపట్ల తమభక్తిని ప్రకటించు ప్రమాణముసల్పుటకు నిర్ణయమయ్యెనట. అట్లు వారిస్థానములనుండి లేచి కర్జనుప్రభువు నొద్దకు మరలివచ్చుటలో వీపులు కర్జనుప్రభువువైపునకు త్రిప్పకుండ వెనుక వెనుకకు నడచిపోవలెనను నియమము నవలంబింప వలసియుండెనట. మహారాజు లందరును ఆప్రకారమే వారివారి స్థానములకు మెలమెల్లగ వెనుకవెనుకకే నడిచిరటగాని బరోడా మహారాజుగారు వీపు కర్జనుప్రభువువైపునకు త్రిప్పియే తన స్థానమునకు బోయినందుకు కర్జనుప్రభువు కోపించి మహారాజు మీద కొంత చర్యజరిపి,వారిపై నేదియో అపరాధము విధించినట్లు తెలియవచ్చినది.

ఈ మహోత్సవమున భారతజాతిపతనము నైతికముగ శోచనీయమైనను ఆ దృశ్యము అపూర్వము ననన్యమగు వైభవముతో విలసిల్లినదని చెప్పవచ్చును. ఈ ఊరేగింపు జరిగిన మరునాడు అరువదివేలసేన ఒక్కచో ప్రదర్శింపబడెనుగాని దానిని మేము చాలదూరమునుండి మాత్రమే చూడగల్గితిమి.

పురాతనమగు ఈమహానగరమున లాల్‌ఖిల్లా కుతుబ్ మినారు మున్నగు అపురూపములగు దృశ్యములు తిలకించి పిమ్మట ఆగ్రాకు చేరి, అచట నొక హిందూగృహస్థు ఇంట బసచేసితిని. టాజమహల్ అక్కడికి సమీపముననే యుండుటచేత మిక్కిలి ఆతురతతో ఆభవనముచెంతకు బోయి కొంచెముసేపు దానిని ఆశ్చర్యముతో పరికించి, పిమ్మట సావధానముగ చూడవచ్చునని మరల బసకు వచ్చితిని. దుకాణమునుండి పాలును, పండ్లు తెచ్చుకొని భుజించి కొంత విశ్రమించి మరల టాజమహల్‌ను దర్శించితిని. ఈదివ్యభవనమునకు బట్టిన పాలఱాయి యంతయు జయపూరునుండియు, ఎఱ్ఱయిసుకరాయి ఫట్టిపూరుసిక్రీనుండియు తెప్పించిరట. దాని నిర్మాణకౌశలముగాని శిల్పవైచిత్ర్యమునుగాని వర్ణింపశక్యముగాదు. ఇది చంద్ర శిలామయమైన అపురూపచిత్రనిలయము.దీనిని దర్శించునపుడు కలలో జూచుచున్న మయసభ యని తోచును. 'పాలరాతితో గట్టిన కవితాకల్పన' యని ఆంగ్లేయగ్రంధకర్త వర్ణించియున్నాడు. పచ్చలతివాచితో కప్పబడినట్లు పచ్చికతోడను వృక్షములతోడను శృంగారముగనుండు ఉద్యానవనమధ్యమున కట్టబడియిన్నది. దీని చుట్టును ఎఱ్ఱరాతితో గట్టిన ప్రాకారము గలదు. ముఖద్వారము మహోన్నతమై, విశాలమై, సుందరముగా నున్నది. ఈ ద్వారమునుండి తోటలోనికి బోయి నిడువగు పాలరాతితిన్నెమీదుగ భవనమునకు బోవుటకు బాట ఏర్పరుప బడినది. ఈ బాట కిరుప్రక్కల వృక్షములు గలవు. బాటగానున్న ఈతిన్నె మధ్య శుభ్రజలములతో నిండి విలాసార్థముగ కట్టిన పాలరాతికాలువ గలదు. ఇందు కలువమొదలగు పుష్పములు వికసించుచుండును. ఈ విలాసకుల్యల కిరుప్రక్కల చిన్న తొట్లలో గుమ్మటములుగ పెరుగుచున్న వన్నెవన్నెల మొక్కలు కనుపండువొనర్చుచుండును. ఈ తిన్నెమీదుగ బోయి కొంచె మెత్తుగను, విశాలముగ నున్న చలువరాతి వేదిక నెక్కి యించుక ముందు నడిచి దివ్యభవనమును ప్రవేశింపవచ్చును. ఈవేదికకు నాలుగుమూలలను నాలుగు - ఎత్తును, ఎత్తునకుదగిన లావును గల చలువరాతిస్తంభములును, వానిపై అందములైన బురుజులును, పొంకము లీనుచుండును. ఈ వేదికపై నిలచి ఆ దివ్యభవనమును దర్శించినప్పుడు హృదయము మహదానందమున మునిగిపోవును. ముఖద్వారమున్న కుడ్యమున కిరుప్రక్కల గోడలు తలుపురెక్కలవలె నించుక లోపలికి వంపుదీర్చి కట్టబడినవి. వానిపై చిన్నబురుజులు ముద్దులొలుకుచున్నవి. గోడలమీదినుండి పైవరకు నొక్కరాతితో కట్టబడినట్లున్న ఆభవనము నునుపుదేరి అద్దమువలె నీడ లీనుచుండును. ఈ నిర్మాణమునందు కలప వినియోగించక రాళ్ళతోడనే పైకప్పు అమర్పబడినది. భవనములోపల ప్రవేశింపగనే వెలుపలి గోడలకు కొంత యెడము వదలి, లోపలిభాగమున వెలుపలి రూపమునకు ప్రతిరూపముగ గట్టబడిన గర్భగృహము గలదు. ఈ రెండుగోడల మధ్యస్థలము గదులుగా నేర్పరుపబడినది. ఒక గదినుండి మరియొక గదికి పోవుటకు మధ్య గోడలు లేకపోవుటచే కోణములుదీర్చిన ఒకవలయముగుండ గర్భగృహమునకు చుట్టు ప్రదక్షిణముచేయుటకు వీలుగా నున్నది.ఇందు రెండు లేక మూడు గదులు దాటి మరియొక కోణమునకు జేరులోపల వెలుపలినుండి యొక పెద్దద్వారమును, దానికి నెదురుగ గర్భగృహమునకు బోవుటకు మరియొక ద్వారమును గలదు. ఈ గదులలో గోడలమీద ఆకులు పువ్వులతీగలు అందముగ చెక్కబడి పచ్చలు, గోమేధికములు, పుష్యరాగములులోనగు విలువగలరాళ్ళు పొదగబడి, ఎప్పుడును వాడకుండ జీవముతో పెరుగుచున్న పూదీగవలెనే గన్పడుచుండును. అక్కడక్కడ ఈ పుష్పలతలప్రక్క అందములగు చిలుకలు, గోరువంకలు మొదలగు పక్షులును మణివికారములై, జీవకళ యుట్టిపడుచుండును. ఈ గర్భగృహము గోళాకారమగు పెద్ద చంద్రశిలాగోపురము. దాని శిఖరము నర్ధచంద్రాలంకార నిర్మితము. ఈ గోపురము ఇన్నూరడుగుల యెత్తు. గోపురముక్రింద గర్భగృహమధ్యమున రెండు సమాధు లున్నవి. అం దొకటి షాజహానుభార్యదనియి, రెండవది షాజహానుదనియు చెప్పుదురు. ఈ సమాధులకు చుట్టును అనన్యమగు శిల్పవిద్యాకౌశల్యమును ప్రకటించు చలువతాతి యలవ యొకటి కోణములుదీర్చి, మణిమయపుష్పలతాలృకంతమై, యొప్పారుచున్నది.

మహాప్రసిద్ధమగు ఈ నిర్మాణమువెనుక దాని నానుకొనియే యమునానది ప్రవహించుచున్నది. వెన్నెల రాత్రులందు చంద్రికాప్రవాహమున తేలియాడు ఈ చంద్రశిలాభవనసౌందర్యము కన్నులార జూచియానందించవలసనదేగాని వర్ణింప దరముగాదు. మరియొకమారు దీరికచేసుకొని రాత్రివేళ అట్టి తరుణమున ఆసుందరభవనమును దర్శించితిని. అమందానందము నొందితిని.

డిల్లీ నుండి నాకంటె ఒకపూట ముందు బయలుదేరి ఆగ్రాలో నన్ను కలిసికొందు ననిచెప్పిన మిత్రుడు తిరునారాయణస్వామి కనుబడకపోయినందున,నతనియొద్ద దమ్మిడీయైన లేకుండ నేను తీసికొనియుండుటచే అత డెక్కడ నెంత నిస్సహాయుడుగ నుండెనో, ఏమైపోయెనో యను చింత హృదయశల్యమై బాధించుచుండెను.కాబట్టి మరునాడు రైలుస్టేషనుకుబోయి రైలునిమిత్తము వంతెనపై నిలచి చూచుచుంటిని. కొంతవడికి రైలు వచ్చినది. మిత్రుడు కనుపింపడాయెను. ఇంతలో నెవ్వరో వెనుకనుండి నాభుజములను పట్టుకొని నేను వెనుకకు తిరుగకుండ నిలిపిరి. తిరునారాయణే యైయుండునని తలచి, ఇంతలో పట్టు కొంచెము సడలుటచే దిరిగిచూచునప్పటికి వంకాయలపాటి శేషావతారమును, మరియొకమిత్రుడును గనుపించిరి. డిల్లీ ప్రయాణమునకు నన్ను బెజవాడలో కలిసికొందునని చెప్పిన ఈ మిత్రుడు ఇప్పటికి మరల తలవనితలంపుగ నిట్లు కంటబడెను. ఆయన మరికొందరు బెంగుళూరువారితో కలసివచ్చెను. వారితో గలసి, పట్టణములోనికి బోయి వారి స్వహస్తపాకమున చేరితిని. వంకాయబజ్జితో స్వయంపాకము చేసుకొని భుజించితిని. అప్పటికి అన్నము దిని పండ్రెండురోజు లయినందున ఆవంకాయబజ్జి అమృతప్రాయమై తోచెను. పిమ్మట వారు మధుర, బృందావనము మొదలగు తీర్ధయాత్రల కరిగిరి. నేను కాశీ, ప్రయాగ, కలకత్తా జగన్నాధముల సేవింప క్రొత్తమిత్రులతో కలసి పయనమైతిని. కాశిలో గంగాస్నానముచేసి విశ్వనాధుని దర్శనము చేసితిమి. విశ్వనాధాలయము చిన్నదియైనను సుందరముగనే కట్టబడినది. విశ్వనాధుని లింగము ఒక సావడిలో వెండిరేకు పొదిగిన నేలతొట్టికి మధ్య నున్నది. ఈ లింగము దగ్గర పూజారియొకడు దుప్పటికప్పుకొని, తలగుడ్డతో కూర్చుండెను. మడిమొదలగు మర్యాదలుగాని మంత్రములుగాని లేనందున విపరీతముగ గానుపించెను. యాత్రికులు కులవివక్షలేక, మంత్రసహితముగ అభిషేకముచేయగలవారు క్లుప్తముగ మంత్రముచెప్పి, స్వయముగ లింగమును తాకి, అభిషేకముచేసి, పత్రములు పూవులు లింగముపై బెట్టి, తొట్టిలో దక్షిణలు వేసి పోవుచుండిరి. ఇతరులు లింగముమీద నీళ్ళుపోసి చేతులతో లింగమును ముట్టుకొని కండ్లకద్దుకొని పూలు సమర్పించి పోవుచుండిరి. ఇట్లు కులభేదములు పాటింపక లింగమును స్వయముగ ముట్టుకొని ఆరాధించు నాచారము అసాధారణమైనను గొప్ప సంతుష్టి కల్పించినది. శంభోశివ యని నామోచ్చారణచేయుచు ఆరాధనచేయు మహాభక్తుల సందడిచే ఆస్థలము మహాపవిత్రముగ గన్పట్టినది. దేవాలయపు గ్రిందిభాగము మసీదు పోలికగా నుండుటచే మసీదునే దేవాలయముగా మార్చినట్లు తలచితిని. ఔరంగజేబు కాలములో ఆలయము మసీదు కాగా, ఆ మసీదును మరల దేవాలయముగ మార్చిరేమో యనుకొంటిని. పిమ్మట ప్రయాగలో గంగాయమునాసంగమమున స్నానముచేసి ఆవెనుక గయకు బోయి, గయలో విష్ణుదేవుని ఆలయమున నా తల్లిగారికిని పితరులకును పిండములువేసితిని. తండ్రి బ్రతికి యుండగా పిండమువేయవచ్చునా, లేదా యను సంశయము కలిగినదిగాని మాతల్లికి నేను కర్మచేసితిని.పిమ్మట ప్రతిసంవత్సరము ఆబ్దికముపెట్టి పిండదానము చేయుచుంటిని. కనుక ఇట్టి పుణ్యస్థలమున పిండ మేల వేయకూడ దని నమ్మి నా ధర్మమును తీర్చితి ననుకొంటిని. హిందూస్థానములో తీర్థవిధులు పెట్టించు గయావళులు మొదలగువారు ధనోన్మత్తులును ధనార్జనాసక్తులు మాత్రమేగాని నిజముగ భక్తిపరులు గారు. స్మార్తవిద్యాజ్ఞానమైనను పూజ్యమే. గయలో నాకు లభించిన బ్రాహ్మణుడు తీర్థవాసియైనను గయావళిగాడు. మంత్రవిధానము తెలిసినవాడు. వారియింటనే నాకు భోజన మమర్చెను. సజ్జనుడుగ గన్పడినాడు. ప్రయాగలో అంగళ్ళవీధిని పోవుచు నొక యున్ని దుప్పటి నాలుగు రూపాయలకు తీసికొంటిని. అది దట్టముగా ఇరువది మూళ్ళ పొడవుండెను.

అటనుండి కలకత్తానగరము ప్రవేశించితిమి. ఒక్కరోజు మాత్ర మక్కడ నుంటిమిగాని చూచిన విశేషము లేమియు జ్ఞాపకములేవు. కలకత్తానుండి జగన్నాధమును రాత్రి పండ్రెండుగంటలకు చేరితిమి. అచట దేవాలయములోపల జగన్నాధసుభద్రాబలభద్రుల విగ్రహములు మూడును వరుసగ ఎత్తగు వేదికపై నిలువబెట్టియున్నవి. ఆ వేదికచుట్టును భక్తులందరు ప్రదక్షిణమొనర్తురు. బంగాళీయులును, ఉత్కళులును భక్తిపరవశులై పాటలుపాడుచు ప్రదక్షిణముచేయుదురు. ఈస్వామికి జాముజామునకు వంటకములు నివేదింతురు. ఈ వంటకములు కుమ్మరులు వండి, కావళ్లమీద దేవాలయము లోపలికి గొనిపోవుదురు. ఇవి స్వామికి నివేదనమైన పిమ్మట భక్తులకు అమ్ముదురు. ఈ ప్రసాదమును అన్ని కులముల వారును సేవింతురు. మేమును ఆప్రసాదమును కొని కొద్దిగా సేవించితిమి. కాని మాతోడి బ్రాహణకుఱ్ఱవాడు కండ్ల నీళ్ళుబెట్టుకొని అతికష్టముతో ఆప్రసాదమును స్వీకరించెను.

ఇంటికి జేరినపిమ్మట తిరునారాయణస్వామినిగూర్చి విచారణసేయగా ఏలూరుకాపురస్థులు మోతేగంగరాజుగారు మొదలగువారు తోడైనందున వారితో బనారసు కలకత్తాల మీదుగా ఇల్లుచేరినట్లు తెలిసినది. ప్రయాణములో నెన్ని విశేషములు చూచినను, ఎన్ని అనుభవములు కలిగినను, స్వేచ్ఛగా ఆకాశమున ఎంతో దూరము విహారముచేసిన పక్షి మరల గూటికి చేరినట్లు, నేను ఇంటికిచేరి, మామూలు వృత్తికార్యములు నడుప జొచ్చితిని. యాత్రలలోని నూతనానుభవముల జ్ఞానము కొంత విశాలదృష్టి కల్పించుటకు కారణమయ్యె నని తలంచుచున్నాను.