దశకుమారచరిత్రము/ద్వాదశాశ్వాసము
ద్వాదశాశ్వాసము
శ్రీ విస్తారారాధిత
దేవద్విజలోక! విమలధీసుశ్లోకా!
భూవినుతపాత్రవిద్యా
ద్రావణదేవేశ! తిక్కదండాధీశా!I
వ. మహాపురుషా! పరమకారుణ్యంబ కారణంబుగా నుత్సవం
బైన పాత్రభావంబున.2
ఆ. ప్రాణదాన మిచ్చి రక్షించినాఁడ వి
ట్లగుటఁ జేసి నిన్ను నడుగవలయు
బాలు నెచట నెట్లు బ్రతికించి యిమ్మెయి
నిస్తరించువాఁడ నీతి చెపుమ!3
క. అనుసమయంబున బాలుం
గనుఁగొన నామానసంబు గాఢస్నేహం
బునఁ బొందుటయును దీనికి
బని యేమని యరయఁ గోరుభావముతోడన్.4
వ. ఏ నావృద్ధుతో ని ట్లంటి.5
ఉత్సాహ. తల్లివారిఁ జెప్పు మితని తల్లి నింక వింటి నీ
వెల్ల నెఱిఁగి యున్నవాఁడ విక్కుమారుమీఁద నా
యుల్లమునకు నరులు మిగిలి యున్న యది నిరూపణం
దెల్లమైన బాంధవంబుతీపు గలుగ నోపునే.6
వ. అనిన విని వాఁడు మొగంబున నాస దోఁప ని ట్లనియెఁ
బాటలీపుత్రనగరంబున వణిజుండైన వైశ్రవణు దుహిత
నాగరదత్తకుం గౌసలేశ్వరుం డగు కుసుమధన్వునకు జని
యించినయదియ తజ్జనని యనవుడు నేనును.7
క. ప్రీతి విని వీనితల్లికి
మాతండ్రికి నొక్కరుండ మాతామహుఁ డం
చాతతహర్షంబున నృప
సూతిం గనుఁగొనుచు వృద్ధుఁ జూచితి నెమ్మిన్.8
వ. చూచిన నతండును సందేహంబుతోడ నభినందించి భవత్పితృ
నామంబునుం ద్వదీయాభిధానంబును నెఱింగింపవే యని
యడిగిన నే నతనియంతర్గతం బెఱింగి.9
సీ. అనఘ! వైశ్రవణుని యగ్రనందనుఁడైన
వసుదత్తు సుతులలో వర్యుఁ డనఁగ
సడిసన్న సంశ్రుతుం డడిగెదవేని నా
యభిధాన మని సందియంబు వాయఁ
జెప్పిన మోదంబు చిప్పిలి నిండి మో
మున విరివిరియంగ మోడ్పుఁగేలు
తోడ నీమఱఁదికి నేడుగడయు నీవ
చేకోలు గలిగి రక్షింపు మింక
తే. ననుడుఁ బగ దీర్చి నిలిపెద నధిపతనయు
నెల్లభంగుల నని యూఱడిల్లఁ బలుకు
చున్నయెడ రెండుమృగముల నొక్కవేఁట
కాఁడు వెనుకొని వచ్చుట గని గడంగి.10
వ. అతిత్వరితంబునం జని వానిచేతి కోదండకాండంబులు పుచ్చు
కొని యుచ్చిపోయి డొల్ల నోకకోలతోడన కూల రెంటి
నేసి యమ్మృగయునకు నొక్కటి యిచ్చి తక్కటి దాని
యందలి సారమాసంబు కార్చిచ్చున వారియాఁకలి దీర్చి
యేను నుపయోగించి నాళీజంఘునితో ని ట్లంటి.11
ఉ. ఏను గుమారునిం గనుట యేకత మింతికిఁ జెప్పు మేర్పడన్
గాననభూమిలోన నరుగంగ నృపాత్మజుఁ జంపె నొక్కపం
చానన మంచు వీటఁ గలయం బలుచోటులఁ బల్కు ముమ్మరం
బై నటు లుండు నంత వసుధాధిపువీనుల వార్త సోకినన్.12
తే. ఆత్మఁ బ్రీతుఁ డై శోకించినట్లపోలె
నరుగుదెంచి మహాదేవి ననునయించి
చనిన పదపడి దేవినిఁ బిలిచి చెవుల
కింపుగ నతని కిట్లు చెప్పింపవలయు.13
క. మును పిన్నవాఁడు తనకడ
నునికిఁ దగవుగామిఁ జేసి యుగ్మలి! నీకో
రినపని యెడ సేసెం గడ
చనియె నదియు నింక నీవ శరణం బధిపా!14
ఆ. అనినఁ దలఁపు గట్టి యగుటయుఁ దనమది
నిజముగాఁ దలంచి నృపతి వచ్చు
నపుడ వానిఁ జేరి యంతఃపురముపరి
జనులు చూచుచుండ సతియు నతని.15
వ. ఇమ్మహావిషంబు ప్రయోగించిన జలంబులం దోఁచి విదిర్చి
డించిన కుసుమదామంబున.16
తే. ఏను బతిభక్తినిరతనయేని శస్త్ర
పాతమై మిత్రవర్మునిప్రాణి గొనఁగ
వలయు నని శాప మిచ్చుచుఁ దళము నురము
వ్రేయుటయు వాఁడు పడుఁ గడువిస్మయముగ.17
క. ఆమాలిక గూఢముగా
నీమూలిక సోఁకఁజేసి యింతి పరిజన
స్తోమము నెదురన తనయం
ప్రేమంబునఁ బిలిచి యఱుతఁ బెట్టఁగవలయున్.18
వ. అని చెప్పి రెండు మందులు వేఱువేఱఁ చూపి మఱియు ని
ట్లంటి.19
చ. మనుజవరేణ్యు చావునుఁ గుమారిక మాలిక పూనియుక్కియుం
గనుఁగొనుచున్నవారలు ప్రకాశము గాఁగ నమాత్యభృత్యపౌ
రనికరసన్నిధిన్ భయకరంబున విస్మయమున్ విషాదముం
బెనఁగొనుచుండఁ జెప్పుదు రభేద్యత నీతి వరించు నెమ్మెయిన్.20
క. మృత్యువు పొందినరాజున
కత్యయవిధి యాచరించునప్పుడు పాతి
వ్రత్యస్తుతి యొనరింతు ర
మాత్యాదులు దాన దేవి మహనీయ యగున్.21
వ. అట్టియెడ రెండు మూఁడు దినంబులు చనిన యనంతరంబ.22
ఉ. రాజ్య మరాజకం బయిన బ్రౌఢిమెయిన్ భరియింప నుత్తమ
ప్రాజ్యునకైన దుష్కరమ య ట్లగుటం దమలోన నెంతయున్
సజ్యత నీతివిక్రమవిచారపరంపర పుట్టుచున్నచోఁ
బూజ్యపురస్సరంబుగఁ బ్రభుప్రతతిం బిలిపించి వారితోన్.23
వ. మహాదేవి యి ట్లనవలయు.24
సీ. వింధ్యవాసిని గల వేంచేసి నీపుత్త్రు
నేను సింహాకృతి నెక్కడేని
గొనిపోయి దాఁచితి వినుము మద్గణముల
తోనన మన్నింతు వానిబుద్ధి
బలపరాక్రమములుఁ గలిగెడు నిర్మల
ద్విజకుమారుని రూపవినయవంతుఁ
గాపు పెట్టినదానఁ గ్రమ్మఱఁ బుత్తెంతు
మాహిష్మతీరాజ్యమహిమ యిచ్చి
తే. వాడు మంత్రి యై భాస్కవవర్మపదవి
నడుపునట్లుగఁ బనిచెద నాకు నీవు
వియ్యమవు మంజువాదిని యయ్యమాత్యు
భార్యగా నొనరించితి బ్రదుకుఁ డనియె.25
వ. ఎల్లుండి మనముం దనకు విశేషపూజ గావించి పంచమహా
శబ్దంబులతోడ గుడిలోపల నత్యంతవిజయంబు సేసి తిగిచికొని
వెడలి యెడ గలసియుండ నందుండి యయ్యిరువురు నిర్గ
మించి మనకుఁ బొడసూపంగలవా రనియు నానతి యిచ్చెఁ
గలఁగన్న యాత్మకుం గంప లెత్తికొని పోయినయ ట్లంతన
సంతోషింపలేదు కన్నప్పుడు దాన లోకప్రసిద్ధం బయ్యెడు
నంతవునంతకు నీమాట గుప్తంబు గావలయు నని చెప్పి
వీడుకొలుపునది. వారునుం దమలోన నవ్వనిత పతివ్రత
గావున దైవసాధ్యంబు గలుగనోపు నట్టి యాశ్చర్యంబు
గంటిమేని యింతకంటెను మనకు వెరవు వే ఱొకండు లేదు
లెస్స పొమ్మని యుండుదు రటమున్న యేనునుం గుమారుం
డునుం గాపాలికవేషంబున నాపురంబున నిలిచి భిక్షాన్న
రక్షితశరీరుల మగుచు దుర్గమవిపినంబున నొక్కబిలంబు
దుర్గపీఠంబుచక్కటికి వెడలం ద్రవ్వి జనదృష్టికి ననుపలక్ష్యం
బుగా నాయితంబు సేసి యద్ధనంబు ముందటి యర్ధరాత్రం
బున నీవు దెచ్చియిచ్చిన యుజ్జ్వలాభరణపట్టవసనమాల్యాం
గరాగంబుల నలంకృతుల మై బిలప్రవేశంబు చేసియుండి
పంచమహాశబ్దంబుల నాసమయం బెఱింగి దేవిప్రతిమ
యెత్తుకొని యుద్గమించి దానం గ్రమ్మఱ నెప్పటియట్ల కాఁ
బెట్టి కవాటోద్ఘాటనంబు చేసి చనుదెంచిన రాజ్యసిద్ధి యగు
మద్వచనంబు సాంగత్యంబుగా ననుష్ఠింపు మని పనిచిన. 26
ఆ. వాఁడు నరిగి యంతవట్టు గావించిన
నేము నట్ల సేసి యెల్లజనులు
నట్టు లెత్తి చూడ నాగండి వెడలి య
శంకితాత్ము లగుచుఁ జనినయపుడు.27
మ. కర మాశ్చర్యముఁ బొంది మంత్రిజనముల్ కారుణ్యపాత్రత్వముం
బొరయం గోరుచుఁ జాఁగి మ్రొక్కి ముదితాంభోరాశిభంగిన్ దిశా
పరిపూర్ణం బయి పారలోకజయశబ్దశ్రేణి ఘూర్ణిల్లె నా
దరలీలం దగుసేన రాఁ బనిచె నంతన్ దేవు లచ్చోటికిన్.28
ఉ. పట్టము గట్టి మంత్రులును భాస్కరవర్ముని వారణేంద్రుపై
బెట్టిరి వారువంబుఁ గడుఁ బెం పెసలారఁగ నెక్కి వారు నా
చుట్టును వచ్చుచుండ నృపసూనుని ముందటఁ గొల్చిపోయి య
ప్పట్టణ మంతఁ జొచ్చి తగుభంగిఁ బ్రభుత్వము నిర్వహించితిన్.29
వ. అంత వసంతభానుండు మిత్రవర్ముమరణంబు విని ధరణి గై
కొన దాడిమై నల్పసైన్యంబుతో నడచె మాహిష్మతీరాజ్యం
బరాజకం బగుట నందలివా రెల్లను నంతకుమున్న తమ
తమయంతం జతురంగబలంబులం గూర్చుకొని యునికిం జేసి
యేనును సేనాసమగ్రుండ నై గ్రక్కునం దండువెడలి
వారిచేతం బగతు కొంచెపుఁదనంబు వినుట నుద్దవిడిం గదియ
నడచినం బదంపడి యతండు భాస్కరవర్మ యద్భుతరాజ్య
ప్రాప్తి ప్రపంచం బంతయును విని వెనుకకు జరుగ ననువు
గాక సాహసంబున మోహరించి.30
శా. సైన్యంబుల్ మద మెక్కి బాహుబలముల్ శౌర్యంబులుం జూపి ని
ర్ధైన్యస్ఫూర్తి గడంగిపోరఁ బటుశస్త్రప్రౌఢిమై నిష్ఠురా
న్యోన్యా(స్తా)హవనోత్థితాగ్నికణరౌద్రాకారతన్ లోకసా
మాన్యాతీతమహోగ్రవిక్రమరణోన్మాదప్రకారంబు లై.31
వ. అట్టియెడ.32
క. పసమరక ప్రజలు ముందట
వెసఁ దునుమఁగ నల్లనల్ల వెనుకకు జరగన్
గసిమసఁగఁ జేయి వీచుచు
వసంతభానుండు దాఁకె వసుధ వడంకన్.33
ఉ. తాఁకినఁ దద్బలంబులు నుదగ్రపరాక్రమదుర్దమంబు లై
వీఁక నెదుర్ప జూచి పిఱువీఁక మదీయవరూధినుల్ జముం.
డాఁకలి పుట్టి బిట్టడరునట్లు ప్రజం బురికొల్పికొంచు నే
నాఁకకు మీఱు వారిధిక్రియన్ రిపుసేనల నాక్రమించితిన్.34
వ. ఇట్లు బరవసంబు సేసిన.35
క. దవదహనుఁడు పరపై వెస
గవిసిన రూపడఁగు సాంద్రకాంతారమున
ట్లవిరళశాత్రవసైనిక
వివిధాయుధజాల మడరి వ్రేల్మిడి మ్రగ్గెన్.36
ఉ. ఆసమయంబునం దెగి యుగాంతకృతాంతునిభంగి విక్రమో
ల్లాసమునం గడంగి విపులంబగు మద్బల మెల్ల భూరిసం
త్రాసము పొంది పాయవడ దర్పము మీఱి వసంతభానుఁ డు
ద్భాసితకేతువైన యరదంబు వడిం బఱపెన్ సముద్ధతిన్.37
క. పడగఁ గని వీఁడె రాజని
యడరెడు లెంకలకు మున్న యతిరయమున నే
బిడుగులగమిక్రియ దివి ముడి
వడు తూర్యధ్వనులతోడఁ బఱపితి గజమున్.38
వ. సమస్తవస్తువులు గైకొని భాస్కరవర్మునిం దెచ్చికొని యనం
తవర్మ రాజ్యంబును మిత్రవర్మ రాజ్యంబును నొక్కటిగాఁ జెల్లిం
చుకొని యంతకుమున్న కలిగిన యన్యోన్యదర్శనంబున జని
యించిన యుభయానురాగంబున మనోహరంబైన మంజు
వాదిని వివాహెూత్సవంబు నిర్వర్తిల్లినం బల్లవసోదరంబులగు
భవత్పాదంబుల సంవాహనంబునకు మత్పాణితలంబు లువ్వి
ళ్ళూర నున్నంతం జండవర్మ చంపానగరంబునకు వచ్చిన
సింహవర్మ సహాయార్థంబు చనుదెంచి యీయభ్యుదయం
బనుభవింపఁ గాంచితి ననిన విని రాజవాహనమహీవల్లభుండు
ప్రమదాయత్తచిత్తుం డై.39
క. కార్యవిచారనిరూఢియు
శౌర్యసమగ్రతయు బంధుజనరంజనచా
తుర్యము సమయాలంబిత
ధైర్యంబును నితని కి ట్లుదాత్తం బగునే!40
క. అని విశ్రుతుపౌరుషముం
గొనియాడి ప్రమోదమారఁ గూరిన హృదయం
బునఁ దెలివొందిన యానన
మును నై యందఱముఖాబ్జములు గనుఁగొనియెన్.41
తే. అపుడు కామపాలుండు ప్రహారవర్మ
యును విదగ్ధవాక్యంబుల మనుజవిభుని
బుద్ధిపౌరుషవాక్యసమృద్ధు లర్ధి
గీర్తనము చేసి చెలుల నగ్గించి రంత.42
వ. సింహవర్ము నమాత్యుండు చనుదెంచి వినయంబునం బ్రణ
మిల్లి జలకంబు పెట్టియున్నది వేంచేయుం డని దేవరవర
వుడు విన్నవించి పుత్తెంచె ననవుడుఁ గామపాలప్రహార
వర్ములనుం గుమారసమూహంబునుం దత్తదనుచరులం
దోడ్కొని చని తానును వారలు నిజోచితస్థానకృతమజ్జ
నానంతరంబ చంపేశ్వరభక్తిపూర్వకక్రియమాణప్రియ
సరసాహారంబులు పంక్తి నుపయోగించి యధిపతి యతనిచేత
నర్చితుం డై సుఖసత్కథలం బ్రొద్దుపుచ్చి మఱునాఁడు
శుభముహూర్తంబున జనకుం డిచ్చిన యంబాలిక నపహార
వర్మకు విభవం బెసఁగ వివాహంబు చేసి.43
క. చంపాధీశ్వరు రాజ్య మ
కంపస్థితిఁ బొందునట్లుగాఁ గొని సంర
క్షింపంగలవాఁ డని తగఁ
బంపి యతని యౌవరాజ్యపట్టము గట్టెన్.44
ఆ. సింహవర్ము నిలిపి చెలికిఁ దదీయస
ప్తాంగములును జెల్లునట్లు చేసి
సైన్యములును దాను సఖు లెల్లఁ గొలిచి రా
నడచె మాళవేంద్రు నగరమునకు.45
క. అంత నట దర్పసారుం
డంతయు నిని యాత్మరాజ్య మస్థిర మగుటం
జింతల్లి తపము విడిచి య
వంతిపురికి నేఁగి సైన్యవర్గముఁ గూర్చెన్.46
మ. మానసారుండును మగధనాథనందను తెఱం గెఱింగి
తానును దనయుండునుం గార్యాలోచనంబునకుం జొచ్చిన
సమయంబున నతనితో ని ట్లనియె.47
ఉ. దేవసమానమూర్తి కులదీపకుఁ డేడవచక్రవర్తి యా
భూవరనందనుం డతనిఁ బొందగఁ గన్న యవంతిసుందరీ
దేవియుఁ బెంపునన్ వెలయు దీనిఁ బ్రియంబునఁ గప్ప మిచ్చి సం
భావన గాంచి నీదు నృపభావము సంస్థితిఁ బొందఁజేయవే.48
వ. అనిన విని యతం డుద్ధతుండు గావున నమ్మాట లపహసించి.49
మ. నగుఁబా టారయవైతి వీవు మును కన్యాదూషకుండైన వా
ని గుణాఢ్యుం డని సంస్తుతించె దకటా! నీయట్టివాఁ డి ట్లనం
దగునే? యంతకు నేమి మూడె? నిజసంతానోచితాచారముల్
మగపంతంబును దక్కినన్ జనము లేమం డ్రీభయం బేటికిన్.50
ఉ. వింతయె మాగధుండు మును వీఁడును వానిసుతుండ కాఁడె దు
ర్దాంతమదీయబాహుబలదర్పమునన్ వెలయింపఁ గంటి ని
శ్చింతతతోడ నుండు మని చెప్పఁగ వెండియు నంతఁ బోక భూ
కాంతుఁడు తద్వయస్యుల దగం బ్రణుతించిన దర్పసారుఁడున్.51
క. కూటపమూఁకలకైవడిఁ
బోటై వినియెదవు నీదుపుత్త్రకు నిచ్చో
మాట లివి యేల? యని శౌ
ర్యాటోపము మెఱయఁ బల్కి యాహవమునకున్.52
వ. ఇట్లు చని తదీయస్కంథావారంబు చేర విడిసి యనంత
రంబ రెండుతెఱంగులవారునుం గలను సెప్పి యొడ్డనం
బులు దీర్చుసమయంబునం గుమారులు శృంగారంబులు చేసి
కొని యేలినవానికిం బొడసూప నరుగునవసరంబునం దమ
లోన.53
చ. వెలి మన మెంత యక్కజపువిక్రమముల్ పదివేలు చేసినన్
దలకొని వాని నియ్యకొనుదాతయసన్నిధిఁ గానకొండవె
న్నెలక్రియ రిత్తవోయె ధరణీపతికిన్ బవరంబు గల్గె దో
ర్చలము పరాక్రమంబు నెఱపం దఱి యయ్యెఁ దలంపు గల్గుడీ.54
మ. అని సల్లాపము సేయుచుం జని మహీశాగ్రేసరుం గాంచి యా
ననముల్ జృంభణ మొందఁ బ్రౌఢపదవిన్యాసాదిగంభీరభా
వనరూపస్థితి నొంది ధీరరసనిర్వాహంబు శోభిల్లఁ బ
ల్కిన నాతండు దరస్మితద్రదననాళీకాంతకాంతాస్యుఁ డై.55
తే. నగుచు నింతలు మాటలు నాకు మీకు
ననఁగవలయునె యది యేల? యంతవాఁడె
దర్పసారుండు దన కెట్లు దప్ప గ్రుంక
నగు నుపాయంబు లేమిఁ జాఁదెగియెఁ గాక.56
క. అనుచు మొనలు నడిపింపఁగఁ
బనిచి యెదిరి మోహరమునఁ బడగలు గని మో
మున రణకేలికౌతుక
మినుమడి యై తోఁప మేదినీశుఁడు గడఁకన్.57
మ. గజరాజుం దఱుమం గుమారులును దోర్గర్వంబున న్మీఱి యో
ధజనోల్లాసవిధాయకంబు లగు నుత్సాహంబులం దీవ్రు లై
విజయాకాంక్షఁ గడంగినన్ జలము లుర్వీభాగ మల్లాడ న
క్కజపుంగోల్తల సేసె నొక్కురువడిన్ గార్చిచ్చుచందంబునన్.58
ఆ. అట్టియెడఁ గడంగి యరిసేన రారాతిఁ
దాఁకినట్లు బెట్టు దలవడుటయు
దూలితోన నెగసెఁ దూలిమిడుంగుఱు
గములు ఘోరశస్త్రఘట్టనమున.59
మ. పటుతూర్యధ్వను లాకసం(బలమ)శుంభద్బాహుగర్వంబు మి
క్కుట మై సారథిఁ జూచి నీదగుససంక్షోభత్వమున్ ఘోటకో
ద్భటవేగంబును జూపు మిప్పు డని సంభావించి సంగ్రామలం
పటచిత్తోన్నతి నేచి మూ(ర్ఖతరగర్వ)స్ఫారతం దాఁకినన్.60
క. సంకులసమరము ఖచరా
తంకితపటుభంగి యగుడు ధరణీశ్వరుఁ డా
తంక బహుతూర్యనిస్వన
కింకిణిగర్జా(చయంబు)క్రియ ఘూర్ణిల్లెన్.61
మ. మదవద్దంతిఘటా[1]గ(తాగతచలత్)క్ష్మాచక్రుఁడై శౌర్యసం
పద సొంపారఁగ నస్త్రశస్త్రచయశుంభద్దీప్తిజాలంబు స
ర్వదిశాభాగములందు దీటుకొన సంరంభంబు శోభిల్లఁ గెం
పొదవం జూడ్కుల మాగధధ్వజపటప్రోల్లాస మీక్షించుచున్.62
చ. బెరసిన దర్పసారుఁడు నభేధ్యత మార్కొనినం గుమారు లు
ద్ధురగతిఁ గిట్టి తత్సుభటదుర్జయదోర్బలకాననంబులన్
సరభసదుర్నిరీక్ష్యఘనశాతనిరర్గళహేతి నిష్ఠుర
స్ఫురణ దవాగ్ని నేర్చిరి విభుండును మాళవు నంటఁదాఁకినన్.63
చ. అతఁడును రాజవాహనధరాధిపు చిహ్న మెఱింగి పొంగి యు
ధ్ధతిఁ దలపడ్డ వీరయుగదారుణబాణపరంపరాసము
ద్గతులఁ దదంతరాంబరము గప్పి నభశ్చరమానసంబులం
గుతుకము నొత్తరించుచు [2](మి)గుల్ గదిరెన్ రణఘోరరౌద్రతన్.64
ఉ. అత్తఱి మాళవుండు గదియంబడి తోమరచక్రరాజి ను
న్మత్తగజేంద్రు నొంచి వెస మావతునంగము శోణితంబునం
జొత్తిలఁ జేసినం గినిసి సూతుహయంబుల డొల్ల నేసె భూ
పోత్తముఁ డాతఁ డేమఱక యుగ్రతఁ గైదువు వ్రేసి వెండియున్.65
ఆ. మెఱుఁగు [3]పఱచినట్లు మేదినీశ్వరుఁడు ర
థంబుమీఁది కుఱికి దర్పసారు
శిరము దొరసి డొల్లఁ గరవాలముల వ్రేసె
సురలు సంస్తుతింప సొంపు మెఱయ.66
వ. ఇత్తెఱంగున మాళవేంద్రు నింద్రుచెలిం జేసి తన చెలులు
తదీయతురంగరథంబులు రయంబునం బొదివి తేరం గైకొని
ధర్మకాహళ పట్టించి పదాతిపరుషవ్యాపారంబులు సాలించి
విడిచి.67
ఆ. వార్త ప్రియకుఁ బుచ్చి కీర్తిప్రియుం డయి
మహిమ యెసక మెసఁగ మాళవేంద్రు
నాత్మశోక ముడుప నర్హజనంబుల
మనుజవిభుఁడు నెమ్మిఁ బనిచె నంత.68
క. తా నుత్సుకుఁ డై యుజ్జయి
నీనగరంబునకు నరిగి నిరతిశయప్రౌ
ఢానందపూరసంభృత
మానసనిజవల్లభాసమాగమ మొందెన్.69
వ. ఇ ట్లవంతిసుందరం గలసి తదీయసఖీజనంబు సంభావించి
యంతఃపురంబున విభుండు పేరోలగం[4]బుండి కుమారవర్గంబు
నిరర్గళసేవాసుఖం బనుభవించి యాస్థానమంటపంబున నున్న
సమయంబున సోమదత్తుండును నరపతిపరిజ్ఞాతుం డైన
పుష్పోద్భవుండునుం దొల్లి హంసకథ వినుటం జేసి యప్రతి
విధేయంబగు నాపదకు వెఱవక రత్నోద్భవు సంబంధించి
యప్పురంబునన యునికి నమ్మువ్వురునుం బరమహర్షభరితాం
తఃకరణు లగుచుఁ గొలువు సొత్తెంచి.70
తే. మున్ను వెదకించి తమ్ముఁ బ్రమోద మెసఁగఁ
జూడఁ గోరుటకు నెదుళ్లు చూచునృపతి
మెలమి గద్దియ డిగి యెదురేఁగుదేర
మ్రొక్కి రవనీతలంబునఁ [5]జక్కఁ జాఁగి.71
వ. ప్రణమిల్లిన భూవల్లభుండు సంభ్రమంబున నెత్తి కౌఁగిలిం
చుకొని సోమదత్తపుష్పోద్భవులనుం దక్కటి చెలులనుం
బరస్పరసాదరపరిరంభణంబు సేసినయనంతరంబ రత్నో
ద్భవాదులకుఁ గామపాలప్రహారవర్ముల నెఱింగించి వీరలను
వారలను నపహారవర్మప్రముఖసఖులకు రత్నోద్భవుం జూపి
యన్యోన్యసముచితప్ర(సంగంబు నడిపి) సింహాసనాసీనుం డై
సపరిచరగణంబుల(కు మణిమ)యాసనంబు లొసంగి బహు
మానంబుగా మానసారు రావించి వలపటం బ్రహారవర్మా
సనసమానంబున నునిచి.72
తే. హర్ష మెడ నిండి మోమున నలువు వెడలు
కరణిఁ జెలువొంద లోచనకాంతివూర
మల్ల నిగుడ వసుంధరావల్లభుండు
సోమదత్తుఁ బుష్పోద్భవుఁ జూచి యపుడు.73
క. తనచరితము మిత్రుల వ
ర్తనమును సంక్షేపవృత్తిఁ దగఁ జెప్పి ముదం
బునఁ బుష్పోద్భవునకుఁ ద
జ్జన[6]పదవివిధాధికారసంపద లిచ్చెన్.74
వ. ఇచ్చి యతని సకలకార్యంబులకుం జాలించి బంధుపాలు
రావించి యాలింగనసముచితాసనప్రదానాదుల సంభా
వించి సగౌరవంబుగా సంపద్విశేషప్రయోజకులం గావించి
యనంతరంబ.75
క. విద్యేశ్వరుండు వచ్చిన
నుద్యత్ప్రీతిన్ విభూతి యొసఁగి యతనికి
హృద్యమగు నింద్రజాలకు
విద్యాసంబంధవచనవిరచిత మొసఁగెన్.76
వ. ఇట్లు పూర్వకృతోపకారుం డైన యతని నభిమతార్తంబులం
గృతార్థుం జేసి సోమదత్తపుష్పోద్భవులం గనుంగొని.77
ఆ. మాళవేంద్రుఁ జూపి మాన్యత నితనికి
నెల్లభోగములును జెల్లఁజేయుఁ
డనుచుఁ బ్రియముతోడ నధిపతి వారికి
నప్పగించెఁ బేర్మి యతిశయిల్ల.78
వ. మఱియునుం జెలులకుం గారణమిత్రు లగువారల నందలి
జనంబులను నర్హపదవీప్రదానంబులం బ్రీతచిత్తులం గావించి.79
క. పెనుపొంద సోమదత్తుం
గనుఁగొని మీవీటి కరిగి క్రమ్మఱ నిట చ
య్యనఁ జనుదెమ్మని సముచిత
జనంబుతోఁ బనిచి పుచ్చి సమ్మదలీలన్.80
తే. అప్పురంబునఁ చానుఁ బ్రియాంగనయును
వివిధకేలిఁ గ్రీడింపుచు విభుఁడు నిలిచెఁ
గొన్నిదినములు సైన్యంబు గూర్చుకొని ర
యంబుమై సోమదత్తుండు నరుగుదెంచె.81
వ. ఇవ్విధంబున సంపూర్ణమనోరథుం డైన రాజవాహనుండు
విభవం బెసంగ నవంతిసుందరీసమేతుం డై సకలసేనా
పతులుం గొలిచి రాఁ గతిపయ ప్రయాణంబుల వామదేవు
నాశ్రమంబునకుం జని దాని కనతిదూరంబున నదీతీరంబున
సైన్యంబుల విడియించి యమ్మునీంద్రునకుం దనరాక యెఱిం
గించి[7].82
తే. తాను బ్రియయునుఁ జెలులు నందలము లెక్కి
యాశ్రమమునకు లలి దొలకాడఁ జేరి
వేడ్కయును గౌరవంబును విస్మయంబు
నెడఁ బెనంగొన మునిశిష్యు లెదురుచనఁగ.83
వ. వారల నెడనెడ సంభావింపుచు రాజవాహనమహీవల్ల
భుండు పల్లవతోరణసంఫుల్లప్రసూనప్రాలంబమాలాసము
ల్లసితంబైన మునిపల్లియఁ దఱియం జని యటమున్న [8]యుట
జ(ంబులం దపోధను లిఱ్ఱులతోఁ) గూడ నఱ్ఱు లెత్తి చూచు
చుండ వారికిం గట్టెదు రగుటయు శిబికావతరణంబు సేసి.84
ఆ. చెలులు సందడించి కెలనఁ బిఱుందను
బొదివి య(రుగు దేరబోయి తల్లిఁ
దండ్రి ఋషిని జూచు తమకంబు గ) దుర (న
య్యాశ్రమస్థలంబు) నతఁడు సేరి.85
క. వసుమతికి రాజునకుఁ దా
పసముఖ్యునకుం గ్రమమునఁ బ్రణమిల్లిన
రసదృశహర్షభరితమా
నసు లై గరువంబు దీవెనలు ముందరగాన్.86
చ. పులకలు సమ్మదాశ్రువులుఁ బొందఁగ నాతనిఁ గౌఁగిలించి నె
చ్చెలులు వినీతి మ్రొక్క సవిశేషమనఃప్రమదంబుతోడ వా
రల గ్రమవృత్తి గాఢపరిరంభము సేసి తదీయవక్త్రము
ల్గలయఁగఁ జూచుచుం బ్రచురగౌరవసంభృతవత్సలాత్ములై.87
వ. ఉన్న యెడం గామపాలప్రహారవర్మాదులు సుమతిసచివులకు
యథార్హప్రతిపత్తి యాచరించినం బదంపడి విదగ్ధసఖీ
జనంబులు పొదివి తో డ్తేర లజ్జావనతవదన యగుచు
నవంతిసుందరి యల్లన నరుగుదెంచి యభివందనంబు సేసిన
నాశీర్వాదపురస్సరంబుగా నాముగ్గురుజనంబులు పత్నీ
సహితంబుగా మునిప్రవరుల నెల్లను రావించి వారు
నుం దామును నాదంపతులతోడం గుమారవర్గంబునకు
సేసలు పెట్టిన యనంతరంబ వామదేవుండు రాజహంసాను
మతంబున వసుమతీదేవికోడలి నభ్యంతరపర్ణశాలాంగణం
బునకు సగౌరవంబుగాఁ దోడ్కొని యరిగి యమ్ముద్దియం
జూపి యమ్మునీంద్రునకు నన్నరేంద్రుం డి ట్లనియె.88
ఆ. ఎసక మెసఁగుకరుణ కెపుడును నునికిప
ట్టనఁగఁ జాలుమీకటాక్షమహిమ
మాళవేంద్రుఁ గొన్న మహనీయలక్ష్మి సా
కారలీలఁ దెచ్చె గ్రమ్మఱంగ.89
వ. అనిన విని యతండు గారవంబున ని ట్లనియె.90
క. ఆవసుదేవునిపిమ్మట
నీ వొకఁడవు సకలమేదినీతలమున సం
భావనయోగ్యుఁడ వనుచున్
దీవన లిచ్చెన్ దయార్ద్రదృష్టిం గనుచున్.91
వ. అంతట సకలసైన్యసమేతుం డై స్వజనులతోఁ గుసుమపుర
మునకుం జని రాజవాహనునకు మగధరాజ్యపట్టాభిషేకంబు
చేసి లోకంబులు మెచ్చ ననేకంబులగు దానధర్మంబు లాచ
రించుచు నిర్భరుం డై రాజహంసుం డుండె నంత.92
తే. రాజవాహననృపతి ధర్మమున రాజ్య
పాలనము చేయునెడఁ బ్రజ పరమసుఖము
గదిరి ధర యెల్ల శ్రీధాన్యకటక మయ్యె
నతనికీర్తులు పాల్పొంగినట్లు వెలసె.93
మ. [9](విలసచ్ఛ్రౌతవిధీయమానసరణీవిధ్యుక్తయజ్ఞక్రియా
కలనాతర్పితదేవతేంద్రముఖదిక్పాలా! గృహీతోజ్జ్వల
జ్వలనామష్టమదేహభాగ! మతివైశద్యానవద్యాత్మ! ని
ర్మలవిజ్ఞాన! యనూనవాగ్విభవసామర్థ్యా! కవిగ్రామణీ!.94
క. నవరసభావాలంకృత
కవితారచనావిధానకల్పనపాండి
త్యవిశేష! యుభయభాషా
తివిశారద! బుధవిరాజి! తిక్ నయాజీ!95
మాలిని. సురుచిరచిరకీర్తీ! సుందరాకారమూర్తీ !
చరితసవనపూర్తీ! సత్సుధీచక్రవర్తీ!
పరిణతనయవేదా! భాగ్యసమ్మోదా!
స్థిరతరఘనమోదా! తిక్కనామాత్యవాదా! )96
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
చరిత్రంబను మహాకావ్యంబునందు ద్వాదశాశ్వాసము.
దశకుమారచరిత్రము సంపూర్ణము.