దశకుమారచరిత్రము/అష్టమాశ్వాసము
అష్టమాశ్వాసము
శ్రీవాణీ భూషాద్విత
యావేష్టితమూర్తి! లసితహరపదపద్మై
కావాసచిత్తమధుకర!
దేవేంద్రసమానవిభవ! తిక్కనమంత్రీ!1
ఉ. భూపలలామ! నిన్ వెదకి భూవలయంబునఁ బ్రోళు లెల్ల నా
యోపినభంగిఁ జూచి సతతోత్సవలీలల నుల్లసిల్లు కా
శీపురి కేఁగి యందు సురసిద్ధమునీశ్వరపూజ్యుఁడైన గౌ
రీపతికిం బ్రదక్షిణము ద్రిమ్మరుచో గుడియుత్తరంబునన్.2
క. మనమునఁ గదిరిన వగ మో
మునఁ దెల్లము గాఁగ బొమలు ముడుచుచుఁ గడకం
దనఖడ్గముదెస కోపం
బునఁ జూచుచునున్న యొక్కపురుషుం గంటిన్.3
మ. కని డాయం జని వానిచిత్త మరయంగాఁ [1]జూచి యిట్లంటి సం
జనితాంతర్గతఖేద మాస్యమున విస్పష్టంబు గా సాహసం
బునకుం బూనెడు కారణం బెఱిఁగినం బోలించి నానేర్చురూ
పున సాహాయ్యము సేయువాఁడఁ జెపుమా పూర్వాపరం బంతయున్.4
క. అని ప్రియమున నల్లన ప
ల్కిన నతఁ డి ట్లనియె నొక్కగృహపతిసుతుఁడన్
ఘనబలుఁడఁ బూర్ణ చంద్రుం
డనఁ బరఁగినవాఁడ దుష్క్రియానిపుణుండన్.5
మ. ఒకనాఁ డే నొకయిల్లు గన్న మిడి యత్యుద్భాసితంబైన సొ
మ్మొకచో డాఁపఁగఁ జూచి పట్టికొని రోషాగ్రాకృతిం దెచ్చి యా
రెకు లొప్పించిరి నన్ను భూపతికి ధాత్రీనాథుఁడుం గామపా
లకుచే నిచ్చె నతండు మత్తకరిమ్రోలం ద్రోచి తా వేడుకన్.6
క. కరిగణశాలాంగణమున
నురువేదిక యెక్కి చూచుచున్నంత భయం
కరకరదండము సాఁచుచు
నురువడి ననుఁ బొదివె దంతి యుగ్రాకృతి యై.7
వ. ఏనును.8
సీ. వెసఁ బూచి పట్టి యాకస మంట వైచి కొ
మ్మొడ్డి నిల్చినఁ దప్ప నుఱికియుఱికి
కోపించి పొడిచినఁ గొమ్ములమొన తప్పి
చనఁ జూచి బలువిడిఁ జఱచిచఱచి
తొండంబు సాంచినఁ దొడల బెట్టిదముగా
నిరికి పుష్కరమును గఱచికఱచి
పిఱుసని సృణిపాతభీతిఁ బై వచ్చిన
నసము డింపక యంట నార్చి యార్చి
తే. వారణముతోడఁ దాపనఁ బోరు పోరి
భయము సెడి యున్న యెడఁ గామపాలకుండు
చోద్య మంది మావతు దెసఁ జూచి దంతి
నిలుపు మని పంచి నను జేరఁ బిలిచి ప్రీతి.9
ఉ. మెచ్చులతానకం బయిన మేటిబలంబు పరాక్రమంబు నీ
కిచ్చిన మాల దైవ మిది యేమిటికిం బురు లెల్లఁ [2]దోఁపఁగా
మ్రుచ్చులఁ గూర్చె మంచిగుణము ల్గలవాఁడవ యైన నీకు ని
వ్వచ్చుఁడు గాలిచూలు నెనవత్తురుగాక యొరుల్ సమానులే.10
శా. అన్యాయంబులు దక్కి నన్ గొలువు మిష్టార్థంబు లేనిచ్చెదన్
ధన్యుం జేసెద నిన్ను నావుడును దద్వక్త్రప్రసాదంబు వా
గ్విన్యాసక్రమమున్ గుణగ్రహణరాగిత్వంబు నీక్షించి సా
మాన్యస్వాంతుఁడు గాఁడు వీఁ డని మహామాత్యాగ్రణిం గొల్చితిన్.11
వ. ఇవ్విధంబునం గొలిచి ప్రాణోపకారియైన యమ్మంత్రికిం
జిత్తానువర్తి నై మెలంగుచు సేవాచాతుర్యంబునం బరమ
విశ్వాసంబు వడసి నిరంతరంబును నతనిమనంబు రంజిం
చుచు నుండి యొక్కనాఁ డేకాంతంబునం దద్వృత్తాంతం
బడిగినం జిఱునవ్వు నవ్వుచు నిట్లనియె.12
క. విను చెప్పెదఁ గుసుమపురం
బను వీటను రాజహంసుఁ డను నరనాథుం
డనుపమగుణరత్నాకరుఁ
డనఁ దగి రాజ్యంబు సేసె నసదృశలీలన్.13
చ. అతనికి ధర్మపాలుఁడు ధరామరవర్యుఁడు మంత్రి యేను ద
త్సుతుఁడ సుమంత్రు కూర్మియనుజుండ మదద్విరదంబపోలె న
ద్భుతతరతీవ్రకర్మములు పూని యొనర్తు గురూపదేశశి
క్షితకరణీయముల్ సరకు సేయక దుర్దమదర్పశాలి నై.14
క. జనకుఁడు నన్నయు నాదు
ర్వినయంబులు మాన్ప బుద్ధి విన నొల్లమి నం
దునికి యుడిగి దేశాంతర
మున కరిగితి నెంతయున్ సముద్ధతవృత్తిన్.15
క. వారక ధరఁ గ్రుమ్మఱి యీ
వారాణసి డాయ వచ్చివచ్చి యెదుర ర
మ్యారామభూమిఁ గంద
ర్పారాధనకేలి సలుపు నతివలఁ గంటిన్.16
తే. తారకావళిలోన నితాంతకాంతిఁ
బొలుచు బాలేందురేఖయుఁ బోలె నొక్క
యువిద యచ్చెల్వపిండులో నున్నఁ జూచి
యల్లనల్లన వేడ్క నంతంతఁ జేరి.17
వ. తత్సఖీజనంబుల సల్లాపంబులవలన మహారాజుకూఁతు రగు
టయుం గాంతిమతి యను పేరునుం దెలిసి తదీయదుర్లభ
త్వవిచారంబున కెడ యీని మారవికారంబునం బొంది
పొంది.18
చ. అదియును నన్ను జూచి మదనాతుర యైనతెఱం గెఱింగి స
మ్మదమునఁ బొందఁ గాంచి యొకమార్గమునం జతురైకదూతికా
వదనగతాగతాభిమతవార్తల నిక్క మెఱింగి కన్యకా
సదనము సొచ్చి యన్నెలఁతసంగతి యన్యు లెఱుంగకుండఁగన్.19
వ. విహరించుచున్నం గొండొకకాలంబునకు నారాజనందన
గర్భంబు దాల్చి మదుపదిష్టనివిధచిత్రోపాయంబులం జేసి
రహస్యభంగంబు గాకుండ దివంబులు గడపి నడురేయి
కొడుకుం గాంచిన నబ్బాలకు నాప్రొద్ద యొక్క యంతరంగ
యైన దాదిం బుచ్చి పరేతభూమిపై వైవం బంచిన నది
యును నట్ల చేసి మగుడి వచ్చునెడం దలవరులు గని పట్టి
కొని.20
ఉ. ఎవ్వరు పుచ్చి రెందులకు నేమిటి కీనడురేయి వీటికిం
దవ్వులఁ బోయి వచ్చెదవు తప్పక చెప్పుము చెప్పకున్న నీ
క్రొవ్వఱ ముక్కునుం జెవులుఁ గోయుదుమన్న విభీతచిత్తయై
యవ్విధ మెల్లఁ జెప్పె నదియంతయు రాజు నెఱింగె వారిచేన్.21
క. నరనాథుఁడు పనుపఁగ నా
వరవుఁడు నాయున్నయెడకు వడి నారెకులం
దెరలఁ గొనివచ్చి నిద్రా
పరతంత్రత నున్న నన్నుఁ బట్టించుటయున్.22
క. పెడకేలు గట్టి వా ర
ప్పుడ జనపతియనుమతమునఁ బురమువెలికి వ్రే
ల్మిడిఁ గొనిచని వధ్యులఁ జం
పెడు నంత్యజు నొకనిఁ జేరఁ బిలిచినఁ గడఁకన్.23
క. వా లెత్తి యుగ్రుఁ డై చం
డాలుఁడు బెట్టిదము వ్రేయుటయుఁ ద్రెవ్వెఁ బెడం
గేలుంగట్టిన త్రాళులు
కాలావధిగామి దైవకారుణ్యమునన్.24
చ. బలువిడినప్పు డంత్యజు కృపాణము ప్రాణముఁ గొన్న నాదుదో
ర్బలమున కుల్కి యారెకులు పైఁబడఁజాలక లేటిపిండుక్రో
ల్పులిఁ గనినట్ల చేవ సెడి పోయిన నేనునుఁ గాన సొచ్చి వి
చ్చలవిడి రాత్రి పుచ్చి దివసం బగుడుం దలపోయుచుండితిన్.25
మ. ఒకచంద్రానన యప్పు డొంటిమెయి నయ్యుగ్రాటవీభూమిలో
నికి నేతెంచి ముఖాకృతిం బ్రకటమై నెయ్యంబు దోతేర ను
త్సుకతం దాఁ బ్రణమిల్లి వన్యకుసుమస్తోమంబు నాకర్థిఁ గా
నికఁ గా నిచ్చినఁ గౌతుకంబు మదిలో నెక్కొన్న నేఁ బల్కితిన్.26
క. కోమలి! యెవ్వరిదానవు?
నామం బెయ్యది! వనంబునను నొక్కతవున్
రా మది వేడుక పుట్టుట
కేమి గతం? బెఱుఁగఁ జెప్పు మింతయుఁ నాకున్.27
వ. అనిన విని యమ్మగువ యి ట్లనియె.28
సీ. మహనీయగుణనిధి మాణిభద్రుం డన
నభినుతి కెక్కిన యక్షవరుని
యర్మిలితనయఁ దారావళి యను దాన
నెలమి నిన్నరాత్రి మలయగిరికి
నరిగి క్రమ్మఱి వచ్చునపుడు వారాణసి
నగరంబుకడ మసనంబులోన
నొక్కబాలకుఁ డేడ్చుచున్న నేఁ గృప పుట్టి
యెంతయుఁ బ్రీతిమై నెత్తి తెచ్చి
తే. జనకునకుఁ జూపి చెప్పితిఁ గనినభంగి
యాతఁ డప్పుడ చెప్పె ధనాధిపతికి
విను కుమారకుఁ గనుఁగొనువేడ్కఁ జేసి
నన్ను రావించి కిన్నరనాయకుండు.29
తే. ఉన్నభంగిన చెప్పు మీచిన్నవాని
యందు నీచిత్త మెట్లుండు ననిన దేవ!
యేనుఁ గడుపారఁ గాంచినవాని నెట్టు
లట్ల చూతు నిక్కంబు నీయడుగు లాన.30
తే. అనిన నిక్కంబ పలికె నీయబలఁ వీడు
దీనినందనుం డగు నైనతెఱఁగు మీకు
దెలియఁ జెప్పెద నని తనకొలువువారు
వినఁగ ని ట్లర్థిఁ జెప్పె సవిస్తరముగ.31
క. భువి నార్యదాసి యన విన
యవతి యనఁగ శూద్రకాఖ్యుఁడగు గృహపతికిన్
యువతులు గలిగిన వంశం
బు వెలయ నయ్యార్యదాసి పుత్రుం గాంచెన్.32
ఆ. వాని నర్థి వినయవతి తల్లియనుమతిఁ
బెనిచె నొక్కకొడుకుఁ బెనిచినట్ల
యాకుటుంబ మిట్టు లన్యోన్యజనితసం
ప్రీతి యగుచు మని యతీత మయ్యె.33
క. వినయవతి కాంతిమతి యా
తనయుఁడు వీఁ డార్యదాసి తారావళి యి
జ్జననంబున శూద్రకుఁడున్
జనియించెం గామపాలనామాంకితుఁ డై.34
ఆ. వారణాసి యేలువానికిఁ బుట్టిన
కాంతిమతికిఁ బుట్టి క్రమ్మఱంగఁ
దల్లిఁ జేరె వీఁడు తనుఁ గన్నతల్లి దు
ర్వర్తనమునఁ బాఱవైచుటయును.35
క. ఆకాంతిమతికిఁ బతి యై
యేకాంతమ దుర్వినీతి నీసుతుఁ గని తా
నాకామపాలుఁ డిప్పుడు
నేకవ్యథఁ బొంది పోయె నెయ్యెడ కేనిన్.36
చ. ఆన విని నాకు నీవలన నాదట పుట్టిన నిన్నుఁ బొందఁగా
ననుమతి చేసి నన్నుఁ దగ నంచుట కుత్తుఁడుదాన కాన నా
తని కిలఁ జాఁగి యొక్క విశితంబుగ నానతి యిమ్ము దేవ! యి
త్తనయుఁ గన్నతండ్రి నుచితమ్ముగ నెమ్మెయి నేను జేరుదున్.37
చ. అనిన ధనేశ్వరుండు కమలానన! నీదుకుమారు రాజవా
హనసఖుఁ జేయువాడఁ జతురంతమహీతల మేల నున్నవాఁ
డని యెడఁ బల్కి నవ్వి ప్రియు నర్థిమెయిం గను మన్న నిందు నీ
యునికి యెఱింగి యేనుఁ దనయుం గొనిపోయి మనోముదంబునన్.38
తే. రాజహంసుని దేవి యంభోజనేత్ర
యైన వసుమతికడ నిడి యట్లు గాంచి
యిట్లు వచ్చితి నింక నా కేడుగడయు
నీవె చేకొని రక్షింపు జీవితేశ!39
వ. అనిన నేనునుం బూర్వజన్మశ్రవణసంస్కారజనితాను
రాగుండ నై తారావళి నయ్యవసరంబున కనురూపంబులైన
యాలాపంబులం గలపికొని తత్ప్రభావదర్శితరమ్యహర్మ్యం
బున మానవలోకదుర్లభంబులగు భోగంబు లనుభవించి
నిశాసమయం బగుటయు మెత్తన నమ్మత్తకాశినితో
ని ట్లంటి.40
మ. రమణీ! మాలనిఁ బంచి చంపు మని క్రూరంబైన దండంబు నా
కమరం జేసిన చండసింహుని ననాయాసంబునం జంపి వ
చ్చి ముదం బందుదుఁగాని యొండుగతి నాచిత్తంబులోనున్న కో
పము మానింపఁగ నేర నెద్ది తెఱఁ గొప్పం జెప్పుమా యిత్తఱిన్.41
చ. అనవుడు నమ్మృగాక్షి దరహాసమనోహరలీలఁ జూచి నీ
మనమున నున్న కామినిసమాగమ మిమ్ములఁ గోరితేని ర
మ్మని తగ మేలమాడి వెస నంబరవీథికి నెత్తి తెచ్చి య
జ్జనపతి సెజ్జపట్టయిన సౌధతలంబున నన్ను డించినన్.42
శా. నిద్రాముద్రితలోచనుం డయినవానిం జండసింహాభిధా
నద్రోహిం దెగఁ జూచి నాపడినబన్నం బెల్ల నుద్యాపనం
బుద్రేకంబునఁ జేయఁ గంటి నని యుద్యోగించినం జూచి యు
న్నిద్రాబ్దానన నాకు నడ్డపడి మాన్పెం జంపకుండం గృపన్.43
వ. ఏనును సమున్నతశాతకృపాణం బైన కేలు దిగిచికొని తారా
వళి యనుమతంబునం జండసింహుండు మేలుకాంచి నన్ను
గన్నులు విచ్చి చూచి బెగ్గలం బగ్గలం బై నివ్వెఱఁగందిన
నీయల్లుండ ధర్మపాలుండను భూసురాగ్రేసరు తనయుండఁ
గామపాలుం డనువాఁడ నిదియునుఁ దారావళియను నొక్క
యక్షి దేవా! దీని దివ్యానుభావంబున నియ్యెడకు వచ్చితి
నీకు మన్నింపం దగినవాఁడన కాని విరోధిం గా నని యతని
వెఱ వాయం బలికి మఱియును.44
ఉ. గర్వము మీఱి నీతనయఁ గాంతిమతిం దమకంబుపేర్మి గాం
ధర్వసమాగమంబు నుచితం బని చూడక కూడియున్న నా
దుర్వినయంబు సైఁచి దయతో ననుఁ జేకొను నీవు నావుడుం
బూర్వకృతంబుమందలకు భూపతి వెల్వెలఁబాఱి యి ట్లనున్.45
ఉ. ఎగ్గులు చూపి చంపు మని యెక్కులు పెట్టిన వారిపల్కు లే
లగ్గుగ నాత్మలోపలఁ దలంచి వివేకము లేక యిట్టి నీ
కగ్గలమైన దండ మనయంబునఁ జేసితి మోసపోయి నే
సుగ్గడి నైతి నీ మొగము చూడఁగ నెట్టులు నేర్తు జెప్పుమా.46
ఉ. అల్లుఁడ వీవు రాజ్యమున కంతకు నర్హుఁడ వీవు భూమికిం
దల్లివి తండ్రివిన్ బహువిధంబుల దాతవు నీవు మాకులం
బెల్ల సముద్ధరింప నుదయించిన పుణ్యుఁడ వీవు నీకు నే
నెల్లి మదీయపుత్రిఁ బుర మెల్ల నెఱుంగఁగఁ బెండ్లి సేసెదన్.47
వ. అని యిత్తెఱంగున నూఱడం బలికి మఱియు ననేకప్రకా
రంబుల బహుమానంబులు శపథసహితంబులు నగు మాట
లాడి కలసికొనినం బరస్పరవిస్రంభప్రసన్నహృదయుల మై
యున్నంత వేగుటయు నమ్మహీపతి మంత్రిపురోహితవర్గం
బున కంతయుం దెలిపి తారావళి మహానుభావంబుల నొండు
దలంప నేరక తదనుమతిం గాంతిమతి నాకు నిచ్చి సేనా
ధిపత్యంబు నియోగించెఁ దారావళియునుం గుబేరుచేత
విన్న వృత్తాంతంబుం దనయు నిల్లడ యిడి తా నిట వచ్చు
టయఁ గాంతిమతికి సవిస్తరంబుగా నెఱింగించిన నవ్విధం
బున నలవడి సుఖంబున నున్నవాఁడ నని యాత్మవర్తనవ్ర
కారం బంతయు నేర్పడం జెప్ప నిట్లు మైత్రి నిష్టభృత్యుండ
నై యుండుదు నతండును నిజస్వామికిం గార్యఖడ్గంబులకు
ననన్యసామాన్యం బైన సాహాయ్యం బనుష్ఠింపుచు మహో
న్నతుం డై ప్రవర్తిల్లుచుండం గొండొకకాలంబునకు.48
మత్తకోకిల. చండసింహుడు చచ్చెఁ జచ్చిన జండసింహునిపుత్రునిం
జండఘోషునిఁ గట్టి పట్టము చండఘోషుఁడు చచ్చినం
జండఘోషునికూర్మితమ్ముఁడు శౌర్యవంతుఁడు సింహఘో
షుండు రాజుగఁ జేయ నాతఁడు సొంపున ధరయేలఁగాన్.49
ఆ. ఏకమంత్రి యైన యాకామపాలుని
చనవు పెంపుఁ దమ కసహ్య మగుడు
నితరమంత్రిముఖ్యు లెగ్గులు పొనరించి
యేకతమునఁ బతికి నిట్టు లనిరి.50
సీ. కమలాక్షి మీయప్పఁ గాంతిమతీకన్యఁ
గన్యకాత్వము చెడ గాసి చేసె
బందికాఁ డై చొచ్చి పతిఁ బట్టి జంకించి
యజ్జోటిఁ దాఁ బెండ్లియాడె బలిమి
నంతఁ బోవక విష మాహారముగ నిడి
నతినిష్ఠురతఁ జంపె నమ్మహీశు
నదియునుం జాలక యతనిఁ జంపినయట
గుణవంతుఁ డగు చండఘోషుఁ జంపి
తే. ప్రజకు నమ్మిక గా నిన్ను బట్టబద్ధుఁ
జేసెఁ గాని పదంపడి చెల్లనీఁడు
బాలభావంబు దక్కి మాపలుకు వినుము
కామపాలుండు ప్రెగ్గడ గాఁడు నీకు.51
మ. అని నానాఁటికిఁ బెక్కుదోషము లసూయాగ్రస్తు లై కామపా
లునిపై నేర్పడఁ జెప్పి చెప్పి కడు బేలుం జేసి భూపాలనం
దనుఁ దా రెంతయు వశ్యుఁ జేసికొనియుం దారావళీశక్తిసం
జనితాంతర్గతభీతిమై విడిచి రుత్సాహంబు కౌటిల్యమున్.52
వ. అంత నొక్కనాఁడు.53
క. నేరక వల్లభుఁడు సవతి
పేరం దనుఁ బిలుచుటయును బిట్టలిగి మదిన్
సైరణ సేయం జాలక
తారావళి వోయెఁ దల్లితండ్రులకడకున్.54
ఉ. ఆకమలాక్షి యి ట్లలిగి యక్షపురంబునకు న్నిజంబుగాఁ
బోక యెఱింగి మంత్రులును భూపతియుం దమలోనఁ గూడి శో
కాకులచిత్తుఁ డై నగరి కల్లన వచ్చిన కామపాలునిం
జేకుఱఁ బట్టి సంకలియః జెచ్చెరఁ బెట్టి దయవిహీనతన్.55
తే. అతనికన్నులు పుచ్చువా రైరి గాన
యేను నప్పుడె ప్రాణ మీఁ బూని యచట
నాయితం బయి పగతుర నం పొనర్చి
తాఁకఁ జూచెద నాభుజదర్ప మొప్ప.56
ఉ. నావుడు నిట్టు లంటి మసనంబున నేడ్చెడునన్నుఁ జూచి తా
రావళిఁ బ్రీతిఁ గైకొని ధరాధిపుపంపున రాజహంసధా
త్రీవరుదేవి నావసుమతీసతిఁ జేర్చిన బాలకుండ నే
భూవినుతుండఁ గాంతిమతిపుత్రుఁడ నిక్కువ మర్థపాలుఁడన్.57
ఉ. కావున నీకు నిక్కఁ బని గాదు విషాదము దక్కి చూడు నా
లావును బీరమున్ వెలయ లంకకు వానరవీరుఁ డేఁగున
ట్లీవసుధాధినాయకుని యింటికి నేఁగెద గాని చేసెదన్
దీవస మొప్పఁగా జనకుఁ దెచ్చెద వేగమ యెల్లభంగులన్.58
వ. అనుచు విచారించి.59
క. పెనుమూఁకలలో సందడి
జనకుఁడు తొడిఁ బడియెనేని సంరంభం బె
ల్లను నిష్ఫల మై భస్మం
బున వేల్చిన యాహుతియును బోలెం గాదే!60
క. మనకుం దెఱఁ గెయ్యదియో
యని పలికెడుసమయమున మహాసర్పము గ్ర
క్కున నొక్కబొక్క వెలువడి
చనుదెంచెసు రోఁజుచున్ విషజ్వాలలతోన్.61
తే. మంత్రతంత్రబలమును గ్రమక్రమమున
దానివీర్యంబు మర్దించి తత్క్షణమునఁ
బట్టికొని యప్పు డొక్కయుపాయమాత్ర
నెఱిఁగి యాపూర్ణచంద్రుతో నిట్టు లంటి.62
సీ. మనకు దైవం బిప్పు డనుకూలముగఁ దెచ్చె
జింతితార్థంబులు సిద్ధిఁ బొందె
జనకుఁ గన్నులు పుచ్చ నని వధ్యశిలకుఁ దె
చ్చినయప్పు డొకభంగిఁ జేరి యతని
నీపాము గఱపించి యే వెజ్జ నై చొచ్చి
వెడచంపు చంపినన్ బుడమిఱేని
యనుమతంబునఁ బతియనుమరణమునకుఁ
గాంతిమతీదేవి గడఁగి యంత్య
తే. మండనార్థంబుగాఁ దనమగని నిజగృ
హంబునకుఁ గొనిపోవంగ నంత నీవు
నన్నుఁ దోడ్కొని చనిన నానంద మెసఁగ
నిర్విషంబు గావించెద నివుణవృత్తి.63
క. మఱియుఁ దగుపనులపా టే
ర్పఱుపంగాఁ జేయ నగునుపాయం బిది యి
త్తెఱఁగును నా తెఱఁగును నీ
వెఱిఁగింపు మదీయజనని కేకాంతమునన్.64
వ. అనవుడు నకృత్రిమస్నేహంబుం దెలుపుచున్న మదియో
ద్యోగంబునం జేసి నన్నుం గామపాలనందనుం డగుట నిశ్చ
యించి యే నందు రాకకుం గతం బడిగి నావలన దేవర
వృత్తాంతంబును విని మదుపదిష్టక్రమంబునం గార్యం
బొనర్పం బూని యత్యంతహర్షంబునం బూర్ణచంద్రుం
డరిగెఁ దదనంతరంబ రాజమందిరంబు దెసఁ గలకలం బైన
నాలించి కామపాలుం గన్నులు పుచ్చం గొనివచ్చుటగా
నెఱింగి దర్శనకౌతుకంబున నున్నతస్థలంబు లెక్కువారలం
గలసి వధ్యశిలాసమీపతింత్రిణీశాఖాసమారూఢుండ నై
యున్నంత.65
క. తొడరుచు జను లొండొరులం
గడవం బఱతెంచి చూడఁగా మజ్జనకుం
బెడకేలుఁ గట్టి తెచ్చిరి
కడునిష్ఠురవృత్తిఁ జింతకడ కారక్షుల్.66
క. ప్రీతిఁ జనుదెంచి వధ్యశి
లాతటి నునుచుటయు మాలలకు మేటి మహా
పాతకుఁ డొక్కరుఁ డి ట్లని
చేతులు నల్దెసలఁ జాఁచి చీరుచుఁ జాటున్.67
ఉ. ఆఱడిగానిఁ దండ్రి సచివాగ్రణిఁ జేసినఁ గూర్మిసొంపునన్
మీఱి దురాశతన్ జెఱిచి మేటిగ రాజ్యము సేయఁజూచినం
బాఱునిఁ జంప దోస మను పల్కునకుంబతి యిద్దురాత్మునిం
గాఱియఁ బెట్టఁగాఁ దలఁచి కన్నులు పుచ్చఁగఁ బంచెఁ జెచ్చెరన్.68
వ. అనిపలుకు నవసరంబున.69
క. మ్రానిపై నుండి పడుటయ
కా నెల్లజనంబు దలఁపఁ గడు నేర్పున నే
నానాగము వైచిన నది
నే నడరం గఱచె జనకునిం గోపముతోన్.70
తే. చానఁ బుట్టినక్రందున మ్రాను డిగ్గ
నుఱికి సందడిలోపల దఱియఁ జొచ్చి
వెజ్జ నై మంత్రజలమున విషము మస్త
మునకు నెక్కించుటయుఁ దండ్రి మూర్ఛవోయె.71
వ. ఇవ్విధంబునం గపటమరణం బాపాదించి కృత్రిమమంత్రౌష
ధంబులు ప్రయోగించి నిర్విషంబు చేయంజాలమి భావించి
మెఱమెచ్చుల కి ట్లంటి.72
సీ. తొల్లి గైకొన్న మందులు మంత్రములు నేఁడు
పరికించి చూడ నిష్ఫలము లయ్యె
నేలినవానికి నెగ్గు దలంచిన
పాపంబు సేసేతఁ జూప కున్నె
చంపింప నొల్లక జననాయకుఁడు నేత్ర
యుగళంబు పుచ్చంగ నున్నచోట
విధి కామపాలుని వెనువెంటఁ జనుదెంచి
సర్పరూపంబునఁ జంపెఁ జూడుఁ
తే. డనిన విని కొంద ఱానంద మంది రచట
కొంద ఱెంతయు శోకంబు బొంది రంత
నడలు గలయట్ల వేవేగ యరుగుదెంచి
కాంతుఁ గనుఁగొని గద్గదకంఠ యగుచు.73
క. లలన పతిపిదప నిలుచుట
కులనిందకుఁ గారణం బగుం గావున న
న్నలఁపక యీతని యెగ్గులు
దలఁపక యిమ్మనుఁడు చిచ్చు దయతో నాకున్.74
క. అని చెప్పి పుచ్చ జనపతి
యనుమతమున నంత్యమండనార్థముగా మ
జ్జనని నిజమందిరమునకు
జనకుం గొనిపోయి దర్భశాయిం జేసెన్.75
ఉ. అయ్యెడఁ బూర్ణచంద్రుఁడు సహాయుఁడుగా నతిగూఢచారివై
యొయ్యన చొచ్చి తల్లికి మహోత్సన మంద నమస్కరించి మా
యయ్యకు మంత్రతంత్రముల నభ్యుదయం బొనరించి వారికిం
దియ్యముమీఱ నే రిపు వధింపఁ గడంగినమాట లాడినన్.76
మ. కొడుకా! పుట్టిననాఁడు ని న్నదయతన్ ఘోరశ్మశానంబులో
నడురే యెవ్వరు గానకుండఁ బటునానాభూతసంఘంబు పా
ల్పడ నే వైచిన నన్నుఁ దల్లి యని సంభావించిర క్షింప ని
క్కడి కేలా? చనుదెంచి తిప్పు డనుచుం గన్నీట నూఱార్పుచున్.77
వ. మాతల్లి నన్ను గాఢాలింగనపూర్వకంబుగా మూర్థాఘ్రా
ణంబు సేసెఁ బూర్ణచంద్రుచేతం దనవృత్తాంతంబును మదీ
యోపాయంబుల నాపదలుం దలంగుటయుం బతికి నేర్పడం
జెప్పిన నతండును బునఃపునరాలింగనంబున నభినందించె న
ట్లయ్యిరువురు నానందరసభరితు లై యున్నంత సూర్యాస్త
మయం బగుటయు రాత్రిసమయంబు నగ్నిప్రవేశం బను
చితం బను నెపంబున నహితజనంబుల వంచించి మనకు
నియ్యెడ నెయ్యది కార్యం బని యాలో చించుచున్న రహ
స్యాలాపంబులలో నస్మదీయగృహప్రాకారంబున కనతి
దూరంబున సింహఘోషుశయ్యామందిరం బునికి విని దాని
చక్కటిం దెలియ నెఱింగి యనాయాసంబున వానిం బట్టు
కొను నుపాయంబు నిశ్చయించి యేనునుం బూర్ణ
చంద్రుండును.78
ఉ. కన్నము పెట్టి పెట్టి యెడఁ గాంచితి మే మొకభూగృహంబులోఁ
గన్నియపిండు గొల్వఁగ సుఖస్థితి నున్న లతాంగి నంత నా
యన్నులు నన్నుఁ జూచి మలయానలధూతలతావితానలీ
ల న్నిజగాత్రముల్ గడు వడంక భయంపడి నిల్చి రత్తఱిన్.79
ఉ. అం దొకవృద్ధకాంత వినయంబున నా కిలఁ జాఁగి మ్రొక్కి మే
మందఱ మాఁడువారము దయామతిఁ గావుము నావుడుం బ్రియం
బొందఁగ నమ్మృగేక్షణల నోడకుఁ డోడకుఁ డన్నఁ దేటి నీ
వెందుల కేఁగె దెవ్వఁడ వహీనపరాక్రమశాలి! చెప్పవే!80
వ. అనిన నయ్యవ్వకుం బూర్ణచంద్రుం డి ట్లనియె.81
చ. ఘనుఁ డగు కామపాలునకుఁ గాంతిమతీసతికిన్ సుతుం డితం
డనుపముఁ డర్థపాలుఁడు నరాధిపుపాలికిఁ గార్యకాంక్షమైఁ
జనియెడు గూఢమార్గమున సంభ్రమమున్ భయమున్ విషాదమున్
మనమున దక్కియుండుఁ డొకమాత్రన వచ్చెద మేము గ్రమ్మఱన్.82
క. పన్నగకాంతల కెన యగు
నిన్నారులు గొలువ నున్న యిది యెవ్వతె యీ
మన్నింట నేమికతమున
నున్నది యెఱిఁగింపు మింతయును దెలియంగన్.83
వ. అనిన నమ్ముదుసలి నామొగము గనుంగొనుచు ని ట్లనియె.84
సీ. కులదీపకుఁడు సింహఘోషున కాచార
వతికి జనించి యివ్వామనయన
నడయాడఁ గఱచిననాఁడు చిత్తంబునఁ
గాంతిమతీకన్య క్రమము తలఁచి
వెలి నిల్పనీక యిచ్చెలువ మీమాతామ
హుండు దాపంబున నునిచె నతని
యోజ తప్పక తత్తనూజులు నిచట ని
మ్మగువ నిల్పిరి తగుమగని కిచ్చి
తే. పుచ్చునంతకు నీగృహమునకు నధిపు
సెజ్జయింటిలో వాకిలి సేసి యునికి
నతిసురక్షిత యై యుండు నంబుజాక్షి
నామమును మణికర్ణిక నరవరేణ్య!85
క. అనవుడుఁ బ్రీతాత్ముఁడ నై
చని జనపతిఁ బట్టి బాలసర్పంబును గై
కొని వచ్చు గరుడిచందం
బునఁ దెచ్చితి నతివలున్న భూగృహమునకున్.86
ఆ. అపుడు సంభ్రమించు నబలలఁ బోకుండ
నాఁగఁ బూర్ణచంద్రు నప్పగించి
కళవళంబువలనఁ గాకుండ మద్గృహం
బునకు నానృపాలతనయుఁ దెచ్చి.87
క. జనకునకుఁ జూపి చంపెద
నని కడఁగినఁ దల్లి వచ్చి యడ్డపడిన నా
తనిఁ జెఱ నిడి యెఱింగింపం
బనిచితి మస్మత్పదాతిపరిజనములకున్.88
మ. జనకుం డగ్గల మైన నేను గడు నుత్సాహంబునన్ మున్ను గూ
ర్చినదానం బుర మెల్ల వ్రేల్మిడిని వచ్చెం గాన నేనప్డు శ
త్రునికాయంబులఁ బట్టఁ బంచి యలుకం దున్మించి యాపూర్ణచం
ద్రుని రావించి నయంబు విక్రమము నుద్యోగంబు సంధిల్లఁగన్.89
వ. మఱునాఁడు.90
ఉ. ఎల్ల ఱెఱుంగఁ దండ్రికి మహీపతి పట్టము గట్టి వేడ్క ను
త్ఫుల్లసరోజనేత్రియగు భూపకుమారికఁ బెండ్లియాడి శో
భిల్లెడు రాజ్యసంపదలఁ బేర్చియు భూవర! నిన్నుఁ గొల్వగా
నుల్లము గోర్కులం బెనఁగి యుత్తల మందుచు నుండ నున్నెడన్.91
ఆ. చండవర్ముఁ డిట్లు చంపాపురంబుపై
వచ్చుటయును సింహవర్ముతోడి
బాంధవముపేర్మిఁ బ్రాపుగా నేతెంచి
తొంటికోర్కిఫలము గంటి నధిప!92
చ. అన విని రాజవాహనధరాధిపుఁ డక్కట! దైవ మిట్లు నే
ర్పునకు సహాయమైన తలఁపుల్ దలకూడుట యింత యొప్పునే
యని ప్రమతిం గనుంగొని ముఖాంబురుహం బలరంగ నీదుకీ
ర్తన మెటు లన్న నాతఁ డనురాగమునం బ్రణమిల్లి యి ట్లనున్.93
చ. అనితరగమ్యవాఙ్మయమహార్ణవవర్తనకర్ణధార! స
జ్జనధరణీరుహోత్కరవసంత! వికారవిదూరచిత్త!
జనయవిధాప్రయోజనవిశారద! శారదమేఘకాంతిభం
జనపటుకీర్తిజాల! కులసత్తమ! యాజకమండలోత్తమా!94
క. ఆర్జితబహువిధపుణ్యా!
నిర్జితదేవేంద్రవిభవ! నిరుపమమూర్తీ!
వర్జితదుర్జనసంగ! ప్ర
తర్జితకలిదోష! సతతదానవినోదీ!95
మాలిని. మతివిజితసురేజ్యా! మాన్యకామ్యైకరాజ్యా!
వితరణరవిపుత్రా! విద్వదంభోజమిత్రా!
వితతగుణసముద్రా! విశ్రుతాచారముద్రా!
రతిపతిసమరూపా! బ్రౌఢవిజ్ఞానదీపా!96
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
చరిత్రం బను మహాకావ్యంబునం దష్టమాశ్వాసము.