త్రిపురాంతకోదాహరణము/పాఠం

వికీసోర్స్ నుండి

త్రిపురాంతకోదాహరణము

ప్రథమావిభక్తి

ఉ. శ్రీనగచక్రవర్తితుదిశృంగము చూచెదమంచు నేఁటికిం
    బోననిశంబు నుండునిదె[1]! పుట్టువుఁ జావును లేనిమందు నా
    చే ననుచుం బతాక యనుచేఁ దరుణాచల మెక్కి [2]చీఱుఁ బం
    చాననుఁ డిందుమౌళి త్రిపురాంతకదేవుఁడు భక్తలోకమున్.

కళిక - వృషభగతిరగడ - త్రిపుటతాళము


మరియు సజ్జనభక్తగృహముల - మరగి తిరిగెడికామధేనువు
కఱద లెఱుఁగక వేఁడు దీనులఁ - గదియుజంగమరత్నసానువు
శైలజాముఖచంద్రరోచుల - చవులఁ దవిలెడునవచకోరము
వేలుపుందపసుల తలంపున - వెల్లికొల్పెడు నమృతపూరము
[3]దేవతలు మువ్వురకు నవ్వలి - దెస వెలుంగుచునుండు నెక్కటి
భావవీథులఁ గలసి పలుకులఁ - బట్టి చెప్పఁగరాని చక్కటి
ఆఱురేకులమంత్రకుసుమము - నందు వెలిఁగెడు చంచరీకము

వేఱుసేయక యోగిజనములు - వెదకిపొందెడు[4]నూర్ధ్వలోకము

ఉత్కళిక

.

అడుగుఁదమ్ములఁ జొప్పు వసి గని
యడరి శునకాకృతులు గైకొని
మీఱి చదువులు దవుల ముందటఁ
బాఱుక్రోడము నేసి మందట
లాడి తను మార్కొనఁగవచ్చిన
క్రీడి కోరినవరము లిచ్చిన
యాటవికకులసార్వభౌముఁడు
జూట భాస్వత్తుహినధాముఁడు.

పద్యవివరణము

భారతవర్షమున ద్వాదశజ్యోతిర్లింగములయందు[5] తెలుఁగుదేశమునఁ జిరప్రఖ్యాతిఁ గన్న శ్రీశైలమునకు నాలుగుదెసలను నాలుగువాకిళ్లు గలవు. వానికి దూర్చున త్రిపురాంతకము; పడమట బ్రహేశ్వరము (అలంపురి); ఉత్తరమున మాహేశ్వరము; దక్షణమున సిద్ధవటము నని పేరులు. ఈనాలుగు వాకిళ్లకు, త్రిపురాంతకుఁడు, బ్రహ్మేశ్వరుఁడు, మాహేశ్వరుఁడు, సిద్ధవటేశ్వరుఁడు ననువా రధినేతలు. అందు, తూర్పువాకిలి త్రిపురాంతకమున కధినాథుఁ డగుత్రిపురాంతకదేవునిపై నీయుదాహరణము త్రిపురాంతమహాకవిచే రచియింపఁబడినది. కావున నీగ్రంథమునకుఁ ద్రిపురాంతకోదాహరణ మను పేరు గలిగినది.

తరుణాచల మనఁ గుమారగిరి. త్రిపురాంతకమునొద్ద పర్వతభాగమునకుఁ గుమాగగిరి యనుపేరు. ఈకుమారాద్రికిఁ దూర్పుదెసను రెంటాల మల్లినాథుఁ డనుభక్తుఁడు పండ్రెండవశతాబ్దమున సోపానములఁ గట్టించెను. ఈతఁడు పాల్కురికి సోమనాథుని సమకాలికుఁడు. (చూ. బసవపురాణావతారిక - పుట 3).

పద్యమునఁ బంచాననశబ్దమును కవి బహుళార్థస్ఫోరకముగ నుపయోగించినాఁడు. పైని వివరించిన నాలుగు వాకిండ్ల యధినేతలును, నాదిశృంగ మగుశ్రీశైలాధీశ్వరుఁడు మల్లికార్జున స్వయంభూలింగమూర్తియు నీశ్వరుని పంచముఖములనుండి యుద్భవించినట్లు పండితారాధ్యచరిత్రమున నిట్లు గలదు:--

అద్భుతలీల నయ్యైస్థానములు స
ముద్భవం బయ్యె లింగోపకంఠమున
నొలసి తదీయ్యసద్యోజాతవదన
మలరి బ్రహ్మేశ్వరం బనఁ బశ్చిమమున
వామదేవాంచితవక్త్రంబు బరఁగె
దా మహేశ్వర మనఁ దగ నుత్తరమున
గురుదక్షిణమున నఘోరవక్త్రమున

వరలె జ్యోతిస్సిద్ధవటనాథుఁ డనఁగ
రమణఁ దత్పురుషవక్త్రము మహామహిమ
నమరెఁ దూర్పున త్రిపురాంతకుఁ డనఁగఁ
దనరె నీశాన్యవక్త్రంబు నూర్ధ్వంబు
నను మల్లికార్జుననామంబు దాల్చి.

మఱియుఁ బంచాననుఁడు చీఱు ననుటలో, తన కెదురుగ నున్నభక్తులనే కాక నలుదిక్కులయందును నాపై నున్నవారినిఁ గూడ విడువక పిలుచు నర్థస్వారస్యము గలుగుచున్నది.

హిమాలయము శ్రీశైలము మొదలగు శబ్ధము లహమర్థకము లైనను మహదర్థకములుగ వాడుట సంప్రదాయసిద్ధమే. పాల్కురికి సోమనాథుఁడు శ్రీశైలమును నగములలోఁ బురుషనగముగా నిట్లు సరసముగ వర్ణించినాఁడు.

'నగము లన్నియుఁ బెంటినగము లీనగము
పొగడఁ బున్నగమును బున్నాగములును'

మఱియు 'శ్రీనగచక్రవర్తి' యని పలుచోట్ల పండితారాధ్యచరిత్రమునఁ గలదు. కావుననే త్రిపురాంతకుఁడు శ్రీనగచక్రవర్తి యని మొదలిడినాఁడు. దేవాలయమున నాయాదైవతచిహ్నము లగుపతాక లుండుటయు, పతాకలు రాజలాంఛనము గావునను నిందు చక్రవర్తిపదము సార్థకమే యగుచున్నది.

కళిక వివరణము

ఆఱురేకులమంత్రకుసుమము. ఓంకారముతోఁ గూడిన పంచాక్షరికి షడక్షరి యని పేరు [6]మంత్రకుసుమమున బీజాక్షరములు రేకులుగా మంత్రాధిదైవతమును దుమ్మెదగాఁ బోల్చుభావము త్రిపురాంతకమహాకవికిఁ బూర్వమునుండియుఁ బ్రచారములో నున్న 'తుమ్మెద'పదములలోఁ గలదు.

తుమ్మెదపదములు పండ్రెండవశతాబ్దమునఁ బ్రచారములోనున్నట్లు పండితారాధ్యచరిత్రమువలనఁ దెలియవచ్చును.

“పదములు తుమ్మెదపదము ల్ప్రభాత
పదములు పర్వతపదము లానంద
పదములు శంకరపదముల్ నివాళి
పదములు వాలేశుపదములు గొబ్బి
పదములు వెన్నెలలపదములు”

అది-ఆఱు-రేకుల-పువ్వు-తుమ్మెదా-అది మీఱిన వాసనె తుమ్మెదా-అనునది. పండితారాధ్యచరిత-నాదప్రకరణము 173 పుట.

ఉత్కళికావివరణము

ఉత్కళికయందు సుప్రసిద్ధ మగు కిరాతార్జునకథ వర్ణితము. పరమేశ్వరుఁ డర్జునునకు పాశుపశము నొసఁగు సందర్భమునఁ గిరాతవేషమును దాల్పుటయు నందు, వేదములు శునకములగుటయు శైవగ్రంథములయందు పలుచోట్ల వర్ణింపఁబడినది. పండితారాధ్యచరిత్రమున నీయవతారలీల పదునైదవదిగా వర్ణింపఁబడినది. ఈలీలలు సాంఖ్యమతానుసారముగా నిరువదియైదు తత్త్వముల కిరువదియైదు లీలలు పాల్కురికి సోమనాథుఁడు వివరించినాఁడు. నిశ్శంక కొమ్మన శివలీలావిలాసమున, శైవసంప్రదాయానుసరణముగ ముప్పదియాఱు తత్త్వములకు ముప్పదియాఱు లీలలు వివరించినాఁడు. కేవల రౌద్రాకారుఁడును, సుహారమూర్తియు నగురుద్రునిదయామయత్త్వమును విశదీకరించు నీ లీల ప్రాచీనకాలమునుండియుఁ గవులమనంబులు చూఱగొని శైవభక్తి స్థిరీకరణమునకుఁ గారణ మైనది. భారవి కీ. శ. 6 వ శతాబ్ధమున కిరాతార్జునకథ రచియించుట ప్రసిద్ధమే.

ద్వితీయావిభక్తి

ఉ. పామును-హారమున్ , నెలయుఁ బాపటసేసయు [7]నేఱు మల్లికా
    దామము, తోలుదువ్వలువు దట్టపుభూతియుఁ జందనంబు మై
    సామునఁ జాల నందముగ సన్నిధినేసినఁ జాడఁగంటి నే
    నామదిలోఁ గుమారగిరినాథుని శైలసుతాసనాథునిన్.

కళిక - విజయభద్రరగడ - జంపెతాళము

మఱియు వేలుపుటేటి - మౌళి నాఁగినవాని
నెఱయఁ గన్నపనోటి - నీటఁ దోఁగినవానిఁ

బొలఁతితో నొక్కొడలఁ - బొత్తుఁగూడినవానిఁ
దలఁకి సేనమరాజు - దాడి కోడినవాని
శాఖ్యతొండని రాల - జడికి నోర్చినవాని
సౌఖ్యతరసాయుజ్య - సరణిఁ దీర్చినవాని
వెన్నెలలఁ బురుణించు - వెలఁదినవ్వులవాని
వెన్నునకు నలువకును - వెదక దవ్వగువాని.

ఉత్కళిక

చిగురుఁగైదువు వెఱికి
మగలసిగ్గులు నఱికి
సతులఁ బాటులుపఱిచి
యతుల వ్రతములు చెఱిచి
ఆలలు చిలుకలు బండు
లెలయఁ గొలువగ నుండు
మరు జయించినవానిఁ
గరుణ మించినవాని.

పద్యవివరణము

అచ్చులోనున్న 'బొట్టు ' అను పాఠముకన్న 'సేస' యనుపాఠము శ్రేష్ఠము. జగ్గన ప్రబంధరత్నాకరమున నుదాహరించిన యీ పద్యమున 'సేస' యనుపాఠమే గ్రహించియున్నాఁడు. చంద్రుఁ డీశ్వరునికి శిరోభూషణ మైనను, సర్ధనారీశ్వరుఁ డైనపుడు చంద్రఖండము 'సేస' వలె సీమంతమున నుండును. అర్ధనారీశ్వరత్వ మిందు ధ్వనితము.

దువ్వలువు- రెండువలువలు- వలువు ప్రాచీనరూపము. (దుగ+వలువు)

కళికవివరణము

1. ఈశ్వరుఁడు గంగను ధరించినకథ శిపపురాణప్రసిద్ధమే. 2 కన్నప్ప యనుశివభక్తుఁడు తనపుక్కిటనీటితో శివు నభిషేకించి సాయుజ్యమునుఁ బొందినకథ బసవపురాణమునఁ గలదు. ధూర్జటి శ్రీకాళహస్తిమాహాత్మ్యకథలోఁ గూడఁ గలదు.

(తృ ఆ.)

3. సేనమరాజు- చేరమచక్రవర్తి. . . మహాగోదుఁ డనినామాంతరము- శైవభక్తుఁడు. 4. సాఖ్యతొండడు. ఈభక్తుఁడు శాక్యుఁ డగుటచే సాక్యతొండఁ డనియుండుట సరి. బసవపురాణమున సాంఖ్యతొండఁ డని కలదు. ఈతని కథయందు షష్ఠాశ్వాసమున[8] వర్ణితము. త్రిపురాంతకుడు ప్రాసస్థానమున నీపదము సౌఖ్య యనుదానితోఁ గుదురుపఱచుటచే నిదియే సాధురూపముగా నెన్నఁదగినది.

ఉత్కళిక యందు మారసంహారము వర్ణితము.

తృతీయావిభక్తి

ఉ. వాలి నటించు ముక్తి వరవర్ణినిపయ్యెదకొంగు చాడ్పునం
    గ్రాలునిజాంకపుంబడగఁ గన్నులఁ జూచిన జాలు, నిమ్నగా

    స్ఫాలితమౌళిచేతఁ, బురభంజనుచేతఁ గుమారపర్వతం
    బేలెడు రాజుచేత ఫలియించు జనావళికోరు కోరుకుల్.

కళిక - (హయప్రచారము లేక తురగవల్గనరగడ) రూపక తాళము

మఱియు మఱ్ఱిమ్రానిమొదల - మరగి యున్న గురునిచేత
గొఱిలి తాపసులకు నెఱుకఁ - గెలుపు జటిలవరునిచేత
నంబి ననుప కుంటెనలకు - నడచిన యెడకానిచేత
నంరాదితత్త్వములకు - నవలయైన ఱేనిచేత
బల్లహునివధూటి కాస - పడిన గుండగీనిచేత
నల్లయంక యేలురాజు - ననుఁగుసంగడీనిచేత
భూతిమాయు మానవులకుఁ - బుట్టుమాన్సు వైద్యుచేతఁ
బ్రీతి ధాతపునుకకోర - భిక్షసేయు నాద్యుచేత.

ఉత్కళిక

ఇల రథంబులీల నొప్ప
నలువ నిగమహరుల రొప్పఁ
బొసఁగఁ బాపవారిఁ బట్టి
పసిఁడికొండ నెక్కువెట్టి
జడధి నిద్రవోవుశరము
దొడఁగి నేలఁ కూలఁ బురము
లేసియున్న జోదుచేత
దాసవరకణాదుచేత.

పద్యవివరణము

ఇందు, దేవాలయము పైపతాక ముక్తికాంతపైటతోఁ బోల్పఁబడినది.

కళికవివరణము

1. వటవృక్షము దక్షిణామూర్తికి స్థానము. దక్షిణామూర్తిగా శివుఁ డవతరించుట శివుని యిరువదినాల్గవలీల.

దక్షిణామూర్తివై ధనమునీంద్రులను
శిక్షించి ప్రోచినశివుడ రక్షించు సోమనాథస్తవము.
ముసుల శ్రీదక్షిణామూర్తివేషంబు
నను బ్రోచు టిరువదినాల్గవలీల పండితారాధ్యచరిత్రము.

ఒక్కొక దేవత కొక్కొకవృక్షము ప్రియ మగుట భారతీయసంప్రదాయము. శ్రీమహావిష్ణువు ప్రళయకాలమున మఱ్ఱియాకుపై విశ్రమించును. కావున నే 'వటపత్రశాయి' నామము ధరించినాఁడు. బిల్వము శివునకుఁ బ్రీతి.

కళికవివరణము

2. ఇందు శివునిసర్వజ్ఞత్వము వర్ణితము.

3. నంబి=సుందరమూర్తినయనారు- అరవమునఁ గొప్పకవి. తెలుఁగున నొడయనంబివిలాస మీతనిచరిత్రము దెలుపును. బరవ, సంకలి యనుపేరులుగల యిరువురుభార్యల నీతనికి శివుడు దూత్యము నడిపి పెండ్లి సేయించెను.

4. బల్లహుఁడు=భళ్లాణరాజు- ఈకథ తెనుఁగువారికిఁ బ్రేమపాత్రమైనది.

5. అల్లకయేలురాజు- అలకాధిపతి కుబేరుఁడు.

ఉత్కళికవివరణము

ఇందు త్రిపురాసురసంహారము వర్ణితము:-- చూడుఁడు-

సీ. ఖండఖండములుగఁ గదిసిన తేరికి
                     భంగంపుటిరుసు పొసంగఁగూర్చి

    విజ్జోడుపడి విచ్చవినువీథిఁ దిరిగెడు
                     చక్రంబు లొనఁగూడ సంఘటించి
    తలకొన్నభీతి కొందలపడ బహుముఖ
                     భ్రాంతసారథి నేరుపరిగ నిలిపి
    పలుకపదక్రమంబుల నలుజాడల
                     బోయెడు గుఱ్ఱముల్ పూనుకొలిపి
    కుంటివింటనుఁ బలువంకఁగోలఁ దోడిగి
    విషమలక్ష్యంబు లేగతి వేసి తయ్య
    వేల్పు లెవ్వరు నీసాటి విజయవాటి
    మల్లికార్జునలింగ! ఉమాప్రసంగ.

(బొడ్డపాటి కొండయ)

చతుర్థివిభక్తి

ఉ. ఆఱడియాస నీరసధరాధిపలోకము లిండ్లు వాకిళుల్
    దూఱుట మాని శ్రీనగము తూఱుపువాకిలిఁ జొచ్చి పాపముల్
    నీఱుగఁ జేసి గంధవతి[9] నీటనుఁ గ్రుంకి మనంబులోని చి
    చ్చాఱఁగఁజేయు టొప్పు త్రిపురాంతక దేవునకై నమస్కృతుల్.

కళిక - వృషభగతిరగడ. త్రిపుట తాళము

మఱియును మెఱయఁగ దిశలనియెడు మను-మడుఁగులుగట్టిన శృంగారికినై
కొఱలినదయ బాణాసురుమోసల - కూరిమిఁ గాచిన ఫణిహారికినై
మేలపుఁజదువులు చదివిన విని మది - మెచ్చినలక్ష్మీపతి బావకునై

యీలుపుగల సద్భక్తులు ముక్తికి - నేఁగెడు చేరువపెనుత్రోవకునై
కూటికిఁ గూరకు భక్తులఁగూరిమి - కొడుకుల నడిగెడు వెడజోగికినై
ఏటికి బోటికి జడలును నోడలును - నిచ్చినజగదేకత్యాగికినై
ప్రొద్దును రేవెలుఁగును నేత్రములై - పొలయఁ గనుంగొడియెడు దేవునకై
నిద్దము లగుపెద్దలపే రెఱుకల - నెలకొనియెడు నిశ్చలభావునకై.

ఉత్కళిక

కడుదీనతతో ముదితాపసికై
వడి నింటికిఁ జని వెడకప్పెరకై
కొని యాలుమగలఁ బెనురచ్చలకై
చనుదెండని నిక్కము సేయుటకై
వెనుద్రిప్పిన గుండములోపలఁ గై
కొని చని తన యెప్పటిరూపముకై
కొని గుండయ మెచ్చినవేల్పునకై
వినత పితామహఫణితల్పునకై.

కళిక - తొలిపాదము - దిగంబరుఁడని చెప్పుటకు మాఱుగ కవి యిట్లు చమత్కరించినాఁడు.

రెండవ పాదము - బాణునికి లింగావసరకాలమున నీశ్వరుడు వాకిటి కాఁపులవాఁడుగా నున్న కథ బసవపురాణము 4.వ ఆశ్వాసమునగలదు. (132-పుట)

ఉత్కళికయందు గుండయ్యచరిత్రము సూచింపఁబడినది.

బసవపురాణము - 4ఆ - 139 పుట.

గుండయయను భక్తుఁ డొకనాడు తిరునీలకంఠదేవునిగుడినుండి వచ్చుచున్నప్పుడు దారిలో నాతనిపై, మేడపైనుండి తెలియక యొక వెలఁది, యెంగిలినీరు చల్లెను. ఆమెయు తనతప్పిదము తెలిసికొని, తత్క్షణము క్రిందికి వచ్చి, యెంగిలినీరు పడిన యా భక్తుని తోడ్కొనిపోయి, యభ్యంజనాదిక్రియల నొనరించి తన్ను క్షమింపుమని గోరెను. గుండయయు నామెను వీడి యింటికి వచ్చినతోడనే గుండయభార్య, యీతని వైఖరిని గనిపెట్టి సానియింటినుండి వచ్చితివని యాతనిపై కోపించి, తన్ను ముట్టిన తిరునీలకంఠదేవరయానయని యొట్టువెట్టెను. దంపతు లీనియమముతో నెనుబదియేం డ్లుండిరి. ముదుసలు లైరి. అంతట నీశ్వరుఁడు భక్తునివేషము దాల్చి, వీరికడకువచ్చి వీరి కొకకప్పెర నిచ్చి దాచుఁడనియు, తాను కోరినపు డీయవలయునని చెప్పి వెడలిపోయెను. శివుడు వెడలిపోయి, కప్పెర నదృశ్యము చేసి, తిగివచ్చి దాని నిమ్మని కోరెను. గుండయ్యయు భార్యయు వడవడ వడఁకుచు తమ కేమి తెలియదని చెప్పిరి. ఈశ్వరుఁడు వారల నచ్చటకు దగ్గఱగనున్న గుండములో నుఱికి తెలియదని శపథము చేయగోరెను. వారట్లు గుండమున దుముకగానే, వారిరువురు నవయౌవను లైరి. ఈశ్వరుఁడు ప్రత్యక్షమై వారి నెనుబదేండ్లవఱకు నిట్లే యౌవనవంతులుగ నిలిపి, వెనుక ప్రమథగణమునఁ జేర్చుకొనెను.

పంచమీవిభక్తి

ఉ. పోయెడుఁగాల మన్యగతి బొందదు, మోక్షము వెండికొండకుం
    బోయెడుత్రోవ మీ కెఱుఁగఁబోలదు మానవులార! రండు లేఁ
    బ్రాయపుఁగొండ కందు శివభక్తులలోపల నద్రిరాజక
    న్యాయుతపుణ్యమూర్తివలనం గడతేరెడు జన్మఖేదముల్.

కళిక - జయభద్రరగడ జంపెతాళము

మఱియు సకలాశ్రితుల - మనుచునర్థమువలన
వఱలు పరమానంద-వనధి తీర్థమువలన
కొమరుమిగిలిన మంచు-గొండయల్లునివలన
విమరపురదహనకర - విష్ణుభల్లునివలన
శివభక్తహృదయసం-చితనిధానమునలన
వివిధరూపములలో - వెలుయుజ్ఞానమువలన
అజ్ఞానఘనతమం - జడచుదీపమువలన
సుజ్ఞానులకును బొడ-సూపురూపమువలన.

ఉత్కళిక

తనకినుకలోఁ బుట్టి
కనలి దక్షునిఁ గొట్టి
యడరి వేల్బులఁ బఱచి
తొడరి జన్నము చెఱచి
వీరభద్రుఁడు వచ్చి
చేరి మ్రొక్కిన మెచ్చి
యలరునిత్యునివలన
దళితదైత్యునివలన.

ఉత్కళికయందు దక్షాధ్వరధ్వంసము వర్ణితము

షష్ఠీవిభక్తి

చ. కమలజుతోరపుంబునుకకంచము, పాదసరోరుహార్చనా
    కమలము వారిజోదరునికన్ను కరంబున కాదిభోగిభో

గము రవణంబు, చంద్రుఁడు శిఖాకుసుమంబటె, యెవ్వరీ డుమా
    రమణునకుం గుమారగిరిరాజనివాసున కన్యదైవముల్.

కళిక - హయప్రచారము లేక తురగవల్గనము రూపకతాళము

మఱియు మెఱయు వేదవాద - మథనకథనసారమునకు
మెఱయు దొట్టముట్టి ముట్టు - మేటినీటితీరమునకు
బత్తు లుత్తు లొరసి యొకసి - పట్టు గట్టితేజమునకు
సత్తుఁ జిత్తు దాన యైన - సత్యనిత్యబీజమునకు
వలచి కొలుచువారిఁ జేరి - వలపుదలఁపు దయ్యమునకు
నిలిచి నిలిచి చూడఁ జూడ - నిండియుండు తియ్యమునకు
మునులు ఘనులు బోధవీధి - ముట్టినట్టి తత్త్వమునకు
పనులఁ గనులు నెఱుఁగనట్టి - పరమపదమహత్త్వమునకు.

ఉత్కళిక

కదలి వదలి జూటకోటి
చదలఁ బొదల నేటినీటి
కడలఁ గడలఁ జెంది చెంది
జడల నొడలఁ బొంది పొంది
బాలలీలఁజూడఁజూడ
సోలి లీలఁ గ్రీడలాడ
నాదినాథజనకమునకు
[10]వాదపూరికనకమునకు.

సప్తమీవిభక్తి

ఉ. వాచవిలోనుగా నొడలివాకిళులం బొడచూపు తీపులం
    ద్రోచి శివార్చనానియతితో వెలిచూడక చూడనేర్చినన్
    లోచవిఁ బోలునేచవులు, లోకముచూడనిచూపులంగుమా
    రాచలనాథునందుఁ ద్రిపురాంతకునందు గరంగు చిత్తమా!

కళిక - జయభద్రరగడ జంపెతాళము

మఱియునుఁ గటాక్షజిత - మారునందు
తఱిత్రాడు సొమ్మగును - దారునందు
బరులూను భక్తపశు - పాలునందు
కరుణాసుశీతకరి - కాలునందు
జగములు జనించు తొలి - జాడయందు
నిగమార్థముల్ నిలుచు - నీడయందుఁ
బొడ వెల్ల శాంతి యగు - పుణ్యునందు
గడలేక యొప్పు నర - గణ్యునందు.

ఉత్కళిక

ఇలయు సలిలంబు
వెలుఁగు ననిలంబు
దివియు మిశ్రుండుఁ
గువలయాప్తుండు
పరగుయజమాన
పరిపూర్ణుఁ డైన
యష్టతనునందు
శిష్టనుతునందు.

సంబోధనము

ఉ. శ్రీచనుదోయిపై శరముఁ జేర్చి, భుజంగమరాజసజ్య హే
    మాచల మెక్కుడించి నిగమావళి యజ్ఞులు వీడ్చి, పద్మజుం
    జూచి మొగంబు లిచ్చిదివిశజుల్ గొనియాడఁగనున్న నీ రణాం
    తాచరణంబు విందుఁ జెవులారఁ గుమారగిరీంద్రమందిరా!

కళిక - జయభద్రరగడ

మరియు నానామంత్ర - మణిగణసుధాకల్ప!
కొఱలు నేనుఁగుమోము - కొడుకుఁ గాంచినవేల్ప!
మూఁడుమోములపోటు - ముట్టుఁ బట్టెడుశూర!
వేఁడిచూపునఁ దియ్య - విలుతుఁ ద్రుంచినధీర!
తాపసుల యీలువులఁ - దనరు తపములపంట!
చూపులకు నెల్లఁ బర - సుఖవార్థి పెన్నింట!
తిలకాయమానదీ - ధితిసుధాసంసూతి!
వెలుఁగులకు నెల్లఁ దుది - వెలుఁ గగుపరంజ్యోతి!

ఉత్కళిక

వినుతముఖనలినమును
ఘనజఘనపులినమును
వరవళితరంగములు
గురుకుచరథాంగములుఁ
గలిగినయుమాసరసి
లలితముఖములఁ బెరసి
క్రాలు నొకకలహంస!
బాలచంద్రోత్తంస!

సార్వవిభక్తికము

శా.

నీ వాద్యుండవు

ప్రథమావిభక్తి


నిన్నుఁ దెల్పుఁ జదువుల్

ద్వితీయావిభక్తి


నీచేత మే లొంద

తృతీయావిభక్తి


నీకై వాక్పూజ లొనర్తు

చతుర్థీవిభక్తి


నీవలన బ్రహాండావళుల్ పుట్టు

పంచమీవిభక్తి


నీ కేవేల్పుల్ సరి, యన్య దైవభజనం బే నొల్ల

షష్ఠీవిభక్తి


నీయందు మద్భావం బందఁదగుం

సప్తమీవిభక్తి


గుమారగిరినాధా! చంద్రచూడామణీ!

సంబోధనము

  1. మానవులు - ముద్రితములు
  2. చేరు - వ్రాతపుస్తకము
  3. దేవతలకు - ముద్రితములు
  4. పొందెడి - ముద్రితములు
  5. ద్వాదశ జ్యోతిర్లింగములు:--( 1 ) సౌరాష్ట్రమున సోమనాథుఁడు, (2) శ్రీశైలమున మల్లికార్జునుఁడు, (3) ఉజ్జయిని మహాకాళుఁడు, (1) అమరేశ్వరము ఓంకారేశ్వరుఁడు, (5) వారేల్యమున వైద్యనాథుఁడు, (6) దారుక నాగనాథుఁడు, (7) వారణాసి విశ్వేశ్వరుఁడు, (8) దాక్షారామము భీమేశ్వరుఁడు, (9) రామేశ్వరమున రామలింగేశ్వరుఁడు, (10) హిమాలయమున కేదారేశుఁడు, (11) నాసిక త్ర్యంబకేశ్వరుఁడు, (12) ఏలాపురి ధిషణేశ్వరుఁడు. ఈద్వాదశజ్యోతిర్లింగములఁ గూర్చినప్రశంస భారతి, రక్తాక్షి, ఫాల్గునము, 'మార్చి 1925' లోఁ గనఁదగును.
  6. ఓంకారపూర్వో మంత్రో౽యం పంచాతురమయం వరః
    శైవాగమేషు వేదేషు షడక్షరి ఇతి స్మృతః. సిద్ధాంతశిఖామణి.
    ప్రణుతింపఁ బంచాక్షరములకు మొదలఁ
    బ్రణవ మొంద షడక్షరంబు నాఁ బరఁగు. ధీక్షాబోధ-ద్వితీయాశ్వాసము.

    ప్రధమముద్రణమునందు, ఆఱురేకులమంత్ర మన మూలాధార స్వాధిష్ఠాన మణిపూర కానాహత శుద్ధ సహస్రార బ్రహ్మరంధ్రము లని వ్రాయఁబడి ద్వితీయముద్రణమున నాఱురేకులమంత్ర మనఁ బ్రణవాక్షరపూర్వక మగుపంచాక్షరి యని వ్రాయబడియున్నది. ఇందు తొలియర్థము తాంత్రికసంప్రదాయము. రెండవది శైవసంప్రదాయము. ఈసంప్రదాయములు రెండును సోమనాథభాష్యమునను, వీరశైవాష్టావరణప్రమాణాష్ట్రకాభరణమునను వివరింపఁబడి యున్నవి. శైవాగమములు శివలింగ మీషడక్షరీమంత్రరూప మని తెలుపుచున్నవి.

  7. బొట్టు -
        ముద్రితపుస్తకము
  8. బౌద్ధదంపతులకుఁ బుట్టిన శాఖ్యతొండఁడు శివభక్తిపరుఁడై శివాలయమున ముప్పూటలు మూఁడు ఱాలతో శివపూజ సేయుచుండ నొకతఱి నేడురోజులు వర్షము గురియుటచే నాలయమునకు బో వీలు లేక నుపవాసముండి యేడవనాఁడు నాఁడొకఱాయియు దొరకకపోవుటచే నొకపెద్దబండ నెత్తి, శివునిఁ బూజించెను. శివుఁడు ప్రత్యక్షమై సాయుజ్య మిచ్చెను.
  9. ఈపద్య మప్పకవీయమున నుదాహరింపఁబడియున్నది. ద్వి. ఆ. 214 పద్యము, గంధవతి త్రిపురాంతకమునందలి తీర్థము.
  10. వాతపురి - సంస్కృతము - (చిదంబరము-) రసవాదపుటూ రని ద్రావిడోత్పత్తి.
    కరిశాల చక్రవర్తి కీశ్వరుఁడు పసిఁడివాన గురియించినాఁడు.
    ఉత్కళికయం దీశ్వరునియష్టమూర్తిత్వము వర్ణితము - చూ. శాకుంతలము నాందీశ్లోకము - ‘యాసృష్టీత్యాది’—