Jump to content

తెలుగు నవల

వికీసోర్స్ నుండి

ప్రపంచ తెలుగు మహాసభ ప్రచురణ :



తెలుగునవల



రచయిత :

శ్రీ అక్కిరాజు రమాపతిరావు



ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ

సైఫాబాద్,

హైదరాబాద్ - 500 004.

ముందుమాట

ఎన్నో ఏళ్ళుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధులందరిని ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. రాబోయే ఉగాది రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో మరపురాని మధుర ఘట్టము కాగలదు.

క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం నుండి తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు దాదాపు ఐదుకోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడేవారి తరువాతి స్థానం తెలుగువారిదే. బౌద్దపూర్వ యుగంనుంచి ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనాయుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్ర దాయాలను ఆయా జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తూ ఉన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు అభిమానుల ప్రతినిధులను ఒక వేదిక మీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషినిగూర్చి చర్చించి, నిర్ణయించుకోవడానికీ, తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖంచేసి మన సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. అంతేకాక ఈ మహాసభలు ఆర్ద్రమైన భావసమైక్యతకు ప్రాతిపదికలై తెలుగుజాతిని సమైక్యం చేయగలవనీ, ఆ విధంగా జాతీయ అభ్యుదయానికి తోడ్పడగలవని విశ్వసిస్తున్నాను.

1975 ఏప్రిల్ 12వ తేదీన, తెలుగు ఉగాది రోజున, ప్రారంభమై ఒక వారం రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచీ, వివిధ రాష్ట్రాలనుంచీ, యునెస్కొవంటి అంతర్జాతీయ సంస్థలనుంచి విచ్చేసిన ప్రముఖులు ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో

చర్చాగోష్టులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమమాలు జరుగుతాయి. దేశ విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల శకం అభివృద్ధి విజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలైన విషయాలపై చర్చాగోష్ఠులు జరుగుతవి. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాలనుంచి ప్రస్ఫుటంచేసే ఒక ప్రదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమగ్రస్వరూపాన్ని సందర్శించడానికి వీలైన సంగ్రహాలయాన్ని (మ్యూజియంను) స్థాపించడానికి ఈ ప్రదర్శన బీజ భూతమవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు సాగుతవి. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను విశదంచేసే ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు భాషలలో విడుదల అవుతాయి. ఈ కార్యక్రమాలలో భాగమే ఈ గ్రంథ ప్రచురణ.

తెలుగు ప్రజలు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ రంగాలలో సాధించిన మనవిజయాలను విశదంచేసే గ్రంథాలు అనేకం ఈ మహాసభల సమయంలో విడుదల అవుతాయి. ఈ గ్రంథాలను రచించి , సకాలంలో మాకు అందించిన రచయితలందరకూ నాకృజ్ఞతలు. ఈ గ్రంథాలను ప్రచురించే భారం వహించడానికి ముందుకు వచ్చిన అకాడమీ అధినేతలను అభినందిస్తున్నాను. తెలుగువారి విశిష్టతలను విశదంచేసే ఈ గ్రంథాలు సహృదయు లందరి ఆదరణ పొందగలవని విశ్వసిస్తున్నాను. అయితే, ఇంత మాత్రం చేతనే ప్రపంచ తెలుగు మహాసభల ఆశయాలు సఫలంకాగలవని నేను అనుకోవడంలేదు. చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్పబడనున్న "అంతర్జాతీయ తెలుగు విజ్ఞాన సంస్థ" మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమే కాక జాతీయ,అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేయగలదని నమ్ముతున్నాను.

జలగం వెంగళరావు

అధ్యక్షులు

ప్రపంచ తెలుగు మహాసభలు.

---000---

పరిచయము

---

సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు దేశపు నలుచెరగుల పరిచితము చేయు సంకల్పములో 1975 వ సంవత్సరమును తెలుగు సాంస్కృతిక సంవత్సరంగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింప జేయటయే గాక , ప్రపంచములోని వివిధ దేశాలలో వసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒక చోట సమావేశమగు వసతిని కల్పించుట కై 1975, ఏప్రిల్ 12( తెలుగు ఉగాది)మొదలుగ ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగునటులప్రభుత్వము నిర్ణయించినది.అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగంవెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖా మంత్రిమాన్య శ్రీ మండలి మెకట కృష్ణా రావు గారు దాని కార్య నిర్వాహకాధ్యక్షులు : ఆర్థిక మంత్రి మాన్య శ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక,సంస్థా కార్యక్రమాల సమన్వయ సంఘాల అధ్యక్షులు.

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి తెలుగు జాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకుఅనువుగ ఆంధ్రభాషా సాహిత్య, కళా చరిత్రాదికములను గురించిఉత్తమములు, ప్రామాణికములునగు కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణ కై 44 మందిసభ్యులు కల ఒక విద్వత్ సంఘమును, శ్రీ నూకల నరోత్త మ రెడ్డిగారిఅధ్యక్షతన నియమించినది. ఆ విద్వత్ సంఘము - లఘు గ్రంథముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆ యా రంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ యెన్నుకొనినది.ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా సాహిత్య చారిత్రిక విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వహింపవలసినదిగ ప్రపంచ తెలుగు మహాసభా కార్య నిర్వాహకాధ్యక్షులు మాన్యశ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు అకాడమీని కోరిరి. మహాసభా సఫలత కొరకై కృషి చేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో అంగీకరించినది.

ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథ శ్రేణిలో ఈ "తెలుగు నవల" అను గ్రంథమును, రచించిన శ్రీ అక్కిరాజు రమాపతి రావుగారు ఆంధ్ర పాఠక లోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతాబద్ధులము. గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ ముద్రించిన లలితా ప్రెస్ వారికి మా కృతజ్ఞత.

హైదరాబాదు,

తేది 15-3-75.

దేవులపల్లి రామానుజరావు

కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.

తెలుగు నవల

1857వ సంవత్సరంలో విక్టోరియా రాజ్ఞి భారతదేశ పరిపాలనా బాధ్యతను స్వీకరించింది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం భగ్నమైపొయింది. ఇంగ్లీషు పరిపాలన కట్టుదిట్టముగా బలపడుతూ వచ్చింది.

1878వ సంవత్సరం లార్డుమేయో బెంగాలు గెజిటులో ఒక ప్రకటన చేశాడు. బంగాళదేశీయుల ఆచార వ్యవహారాలు జీవనవిధానమూ తెలియజేసే గ్రంధానికి బహుమానం లభిస్తుందనేదే ఆ ప్రకటన.

తెలుగుదేశంలో కర్నూల్లో ఆ రోజుల్లో నరహరి గోపాల కృష్ణమ్మ శెట్టి అనే డెప్యూటీ కలెక్టరుండేవారు. బెంగాల్ గెజిటులొని బహుమాన ప్రకటన, తెలుగులో అటువంటి ప్రయత్నం చేయడానికి గోపాలకృష్ణమ్మగారిని ప్రేరేపించింది. ఆ ప్రేరణతో ఆయన శ్రీరంగరాజ చరిత్రమనే చిన్న వచనప్రబంధం వ్రాసి 1872 లో ప్రకటించాడు. ఈ శ్రీరంగరాజ చరిత్రను మద్రాసు గెజెటు తొలి తెలుగు నవలగా పేర్కొన్నది. నాటి సమకాలిక తెలుగు పత్రికలుకూడా దీనిని నవలగానే సంభావించాయి. రచయిత మాత్రం హిందువుల యాచారములు తెలుపు నవీన ప్రబంధం అన్నాడు దీన్ని.

తెలుగు నవల పుట్టిన తరువాత ఇంచుమించుగా పాతికేళ్ళ దాకా ఈ ప్రక్రియను వచన ప్రబంధమనే వ్యవహరించేవాళ్ళు. నవల అనే పదం వాడుక లోకి తెచ్చింది కాశీ భట్టబ్రహ్మయ్యశాస్త్రిగారు. అప్పటిదాకా నవలలు వ్రాసిన వాళ్ళంతా తమ గ్రంథాలను వచన ప్రబంధాలనే పిలిచేవాళ్ళు

1872 వ సంవత్సరానికి పూర్వమే కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు 'మహాశ్వేత ' అనే నవల వ్రాశారని కొందరు పండిత విమర్శకులు ప్రతిపాదించారు కాని, పరిశీలనం మీద కాదంబరిలోని మహాశ్వేత వృత్తాంతానికి వేంకట రత్నం పంతులుగారు యథాతథానువాదం చేశారు కాని, కాదంబరి ఆధారంగా వచనప్రబంధ రచన చేయలేదని స్పష్టపడింది.

శ్రీరంగరాజ చరిత్రం స్వకపోలకల్పితమైన రచన. చారిత్రకమైన పాత్రలు, ప్రదేశాలు స్వీకరించడంవల్ల, ఇతివృత్తం చారిత్రకమైనదేమో అనిపిస్తుంది కాని, జరిగిన కథ కాదనీ, కల్పించిందేననీ రచయిత ప్రస్తావించారు. సంఘంలో ప్రచురంగా కనబడుతున్న కులాచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలు, ప్రసక్తానుప్రసక్తంగా రచయిత వర్ణించాడు. తెలుగు నవలారచనకు తొలి ప్రయత్నంగా దీన్ని భావించవచ్చు. గవర్నర్ జనరలైన మేయో కే దీన్ని అంకితం చేశాడు రచయిత. వీరేశలింగంకూడా తన నవలకు రాజ శేఖర చరిత్రమని పేరు పెట్టటం, సమకాలీన సంఘంలోని ఆచారాలు, మూఢవిశ్వాసాలు విమర్శించటం, శ్రీరంగరాజ చరిత్రం ఆయనపై కొంత ప్రభావం చూపిందనటానికి నిదర్శనాలు. వీరేశలింగం, శ్రీరంగరాజ చరిత్రం చదివాడు.


చిన్నయసూరి వదలి పెట్టిన విగ్రహతంత్రాన్ని వీరేశలింగం అనువదించి ప్రకటించినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్య చెట్టిగారు, వీరేశలింగం ప్రతిభను మెచ్చుకొంటూ ఆయనకు అభినందన లేఖను వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుకోలును సూచించే ప్రోత్సాహ వాక్యాలు వ్రాశాడు. వీరేశలింగం వచన ప్రబంధం వ్రాయటానికి పూనుకొన్నాడు. తెలుగులో తనకు మార్గదర్శకంగా వుండే గ్రంథాలులేవు. అందువల్ల ఇంగ్లీషు గ్రంథాన్ని దేన్నైనా అనువదించి తరవాత స్వతంత్ర రచన చేయవచ్చుననుకొన్నాడు.ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన ది వికరాఫ్ వేక్ ఫీల్డును ఎన్నుకొని, కొన్ని ప్రకరణాలు అనువదించేసరికి,విదేశీ వాతావరణము, పాత్రలూ, కథాగమనము ఆయనకు సంతృప్తి కలిగించలేకపోయినాయి. అందువల్ల స్థూలంగా కథను మాత్రం గ్రహించి దేశీయమైనవాతావరణంతో, పాత్రల పేర్లను మార్చి, తెలుగువాళ్ళకు ఆకర్షణీయంగా ఉండేట్లు రాజశేఖర చరిత్రం పేరున గ్రంథం పూర్తిచేశాడు వీరేశలింగం. అంటే రాజశేఖర చరిత్రం అనువాదం కాదు ఆంగ్లమూలానికి అనుసరణం అన్నమాట.

1878 వ సంవత్సరంలో, తాను నడుపుతున్న వివేకవర్ధని అనే మాసపత్రికలో ధారావాహికంగా ఈ నవలను ప్రచురించాడు వీరేశ లింగం. తరవాత 1880 వ సంవత్సరంలో పుస్తకరూపాన ప్రచురించాడు. రాజశేఖర చరిత్రంలో ఆ కాలపు తెలుగుదేశపు సమగ్ర స్వరూపం కనపడుతుంది. సాంఘిక జీవనమంతా ప్రతిభావంతంగా చిత్రించాడు వీరేశ లింగం సంఘంలో ఆనాడు ప్రచురంగాఉన్న దురాచారాలు, అంధవిశ్వాసాలు, చిత్రించాడు. ఈ రాజశేఖర చరిత్రం మళ్ళీ ఇంగ్లీషులోకి అనువాదం పొందడం, అరవం, కన్నడం వంటి దేశీయ భాషల్లోకి అనూదితం కావడం, ఈ నవల ప్రశస్తికి తార్కాణాలు. 1887 వ సంవత్సరంలో రాజశేఖర చరిత్రం ఇంగ్లీషు అనువాదమైన 'ఫార్చూన్స్ వీల్ ' (అదృష్ట చక్రం)ను లండన్ టైమ్స్ పత్రిక గొప్పగా కొనియాడింది. 1887 కే తెలుగు నవల ఇటువంటి ఘన గౌరవం పొందటం తెలుగువాళ్ళు గర్వించదగిన విషయం. రాజశేఖరచరిత్రలో వీరేశలింగంపంతులుగారు సృష్టించిన పాత్రలన్నీ సజీవమైన పాత్రలు 'రాజశేఖరుడుగారి గృహ వర్ణనము ఇంచుమించుగా మాగృహవర్ణనమే ' అని పంతులుగారు స్వీయ చరిత్రలో వ్రాశారు. ధవళేశ్వరంలో భూస్వామి అయిన మధ్యతరగతి సంపన్నగృహస్థు రాజశేఖరుడు. ఆయన చుట్టూచేరి ముఖస్తుతులు చేస్తూ పురోహితులూ, పూజార్లూ, వైద్యులూ, యాచకులూ, పాచకులూ డబ్బుగుంజుతూ ఉంటారు. స్వర్ణవిద్య నేర్పుతానంటూ ఒక బైరాగి వచ్చి రాజశేఖరుడితో ఇంట్లో తిష్టవేసి, నమ్మించి ఇంట్లోఉన్న వెండిబంగారాలు సంగ్రహించి పారిపోతాడు. దాంతో రాజశేఖరుడు నిర్ధనుడవుతాడు. లోకంపోకడ అంతా ఆయనకు బాగా తెలిసివచ్చి, కనువిప్పు కలుగుతుంది. దారిద్ర్యయం అనుభవించడంవల్ల ఎంతో లోకానుభవం సంపాదిస్తాడు.

భూస్వామ్య వ్యవస్థపట్ల ఆకర్షణ సాహిత్యంలో తగ్గిపోతూ ప్రజాస్వామ్య వ్యవస్థ అభిముఖ్యం ఏర్పడుతున్న తొలినాళ్ళ విశిష్టరచన రాజశేఖర చరిత్రం. రాజశేఖర చరిత్రకు ఇంకొక పేరు వివేకచంద్రిక. ఈ నవలకన్నా ఆరేళ్ళకు ముందే వెలువడ్డ శ్రీరంగరాజ చరిత్రకు కూడా ఇంకోపేరుంది, 'సోనాబాయి పరిణయం ' అనేది. తొలినాళ్ళలో ప్రతి నవలకూ రెండుపేర్లుండేవి. ఇది గమనించదగ్గ అంశం. వీరేశలింగం ఈ నవల కాక ఇంకా రెండు మూడు నవలలు వ్రాశాడు. తెలుగులో మొట్టమొదటి సాంఘిక నవల వ్రాసింది ఆయనే. అది సత్యవతి చరిత్రం. ఇది 1883 లో వెలువడింది. వీరేశలింగం ప్రత్యేకించి స్త్రీలకోసం ఒక మాసపత్రిక నడిపాడు. ఆ పత్రిక పేరు సతీహితబోధిని. ఈ పత్రికలోనే ఆయన సత్యవతీ చరిత్ర మనే సాంఘిక నవలను వరసగా కొన్ని సంచికలలో ప్రకటించి పుస్తకరూపాన తరవాత తెచ్చాడు. ఇవాల్టి దృష్టికి శిల్పం దృష్ట్యా ఈ నవల పేలవంగా కన్పించినా ఇతివృత్తాన్ని బట్టి, సాంఘికప్రయోజనాన్నిబట్టి, దీనిని చాలా గొప్ప నవలగా పరిగణించాలి. అదీకాక ఆ కాలపు సంఘాన్ని ఈ నవల చాలా ప్రభావితం చేసింది. ఆ కాలంలో ఇటువంటి మౌలికమైన నవల వ్రాయడం పంతులుగారి ప్రతిభకు నిదర్శనం. స్త్రీ విద్య, స్త్రీ స్వాతంత్ర్యం, సమాజసౌభాగ్యానికి నాగరికతకు అత్యంతావశ్యకాలని వీరేశలింగం పంతులుగారీ నవలలో ప్రతిపాదించి ప్రబోధించారు.

ఈ నవలలో పంతులుగారు నాలుగు రకాలైన దాంపత్య జీవితాలను తులనాత్మకంగా ప్రతిపాదించి, ఎటువంటి దాంపత్యం, సంఘానికి మేలుకలగజేస్తుందో సిద్ధాంతీకరించారు. ఆలుమగలిద్దరూ చదువుకొన్నవారైతేనే అది అదర్శదాంపత్యమనీ, అనుకూల దాంపత్యమనీ ఆయన ప్రబోధం. స్త్రీ చదువుకొని పురుషుడు చదువురానివాడైన ఒక జంటను, భార్యాభర్తలిద్దరూ చదువుకొన్నవాళ్ళైన కాపురాన్ని, ఇద్దరూ చదువుకోని ఒక దాంపత్యాన్ని, భర్త విద్యావంతుడై, భార్య విద్యావిహీనురాలైన ఒక సంసారాన్నీ వీరేశలింగం ఇతివృత్తంగా తీసుకొని నలుగురు కొడుకులూ, నలుగురు కోడళ్ళ ఉమ్మడికుటుంబపు కష్టసుఖాలను మానావమాలను, మంచిచెడ్డలను, సత్యవతీ చరిత్రంగా రూపొందించారు. సత్యవతి కధానాయక, నారాయణమూర్తి ఆమె భర్త, వీళ్ళద్దరిదీ ఆదర్శ దాంపత్యం, సత్యవతి విద్యావంతురాలు.

ముంగొండ అగ్రహారంలో లక్ష్మీనారాయణరావు, యశోదమ్మలకు, వెంకటేశ్వర్లు, నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం రామస్వామి, అనేవాళ్ళు నలుగురు కుమారులు, వాళ్ళది అవిభక్తకుటుంబం. వెంకటేశ్వర్లు విద్యావంతుడు కాడు. అతడి భార్య సుందరమ్మ అతడికి తగిన ఇల్లాలు అంటే మూర్ఖాచారాలలోనూ మూడవిశ్వాసాలలోనూ ఇద్దరికీ పొంతన కుదిరించి. అవివేకపు పట్టుదలలూ అజ్ఞానపు ఈర్ష్యాద్వేషాల విషయంలో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోరు. అందువల్ల కాడికికట్టిన ఎద్దులులా సంసారశకటాన్ని ఈడ్చుకొంటూ ఉంటారని వీరేశలింగం వర్ణించాడు. ఇద్దరూ చదువురానివాళ్ళైన భార్యాభర్తల దాంపత్యం ఇది. ఇక రెండోది ఇద్దరూ చదువుకొన్నవాళ్ళైన సత్యవతీ నారాయణమూర్తుల దాంపత్యం. నాలుగోజంట సూరమ్మ సుబ్రహ్మణ్యాలది. సుబ్రహ్మణ్యం చదువుకొన్న వాడైనా సూరమ్మ విద్యాగంధంలేని పశుప్రాయురాలు. దయ్యాలని భూతాలని, కేకలువేస్తూ కుటుంబానికి కష్టాలు కలిగించడం, ఇరుగుపొరుగులతో కలహాలు, ఈర్ష్యాసూయలతో ఇంట్లో వాళ్ళందరితో జగడమాడటం, సుబ్రహ్మణ్యం జీవితం నరకప్రాయమే చేస్తూ ఉంటుంది సూరమ్మ. మూడోకొడుకు రామస్వామి. చిన్నతనంలో చదువుకోక చెడుసహవాసాలు చేసి, కుటుంబానికి అప్రతిష్ఠ, మనస్తాపం తెస్తూ ఉంటాడు. ఇతడి భార్య మహలక్ష్మి , విద్యావివేకాలు గల ముద్దరాలు. అన్ని విషయాలలోను సత్యవతినే ఆదర్శంగా చేసుకొని, కష్టాలనుభవించినా భర్తను సరియైన మార్గంలోకి తీసుకొని రాగలుగుతుంది. ఈ విధంగా స్త్రీ విద్యావంతురాలు కావడమే సంసారంలో ఇహలోకస్వర్గానికి ప్రాతిపదిక అని వీరేశలింగంగా రీనవల ద్వారా సాహిత్య ప్రబోధం చేశారు. నిర్బంధ వైధవ్యం, కన్యాశుల్కం, వృద్ధవివాహాలు, మంత్రతంత్రాలపట్ల, జ్యోతిషంపట్ల, ఉండే నమ్మకాలు పంతులుగారీ నవలలో విమర్శించారు.

ఆ రోజుల్లోనే యీ నవల, మలయాళ, అరవ, కన్నడ భాషలలోకి అనువాదం పొందడం, ఇది పొందిన ప్రాచుర్యానికి నిదర్శనం. ఈ నవల చదివిన వాళ్ళెందరో తమకు కూతుళ్ళు పుట్టినప్పుడు సత్యవతి పేరు పెట్టుకుంటూ వచ్చారని వీరేశలింగం స్వీయచరిత్రలో వ్రాశాడు. ఇంతకన్నా ఒక గ్రంథం పొందగల సార్థక్యంవేరే ఏముంటుంది.


ఇటుతరవాత వీరేశ లింగం ఆంగ్లమూలానికి అనుసరణంగా సత్యరాజా పూర్వదేశ యాత్రలనే నవల వ్రాశాడు. అయి ఇది మౌలికమైన గ్రంథం లాగానే తెలుగు పాఠకుల ఆదరణ పొందింది. ఇంగ్లీషులో జోనాధన్ స్విప్ట్ రచించిన 'గలివర్ ట్రావెల్స్' గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని వీరేశలింగం, రెండు భాగాల నవల వ్రాశాడు. ఒక భాగం లంకాద్వీపం. రెండోభాగం ఆడమలయాళం. సత్యరాజాచార్యులనే అతడి యాత్రావృత్తాంతకథనంగా యీ నవల సాగుతుంది. సత్యరాజాచార్యులు నిజమైన వ్యక్తి అని భ్రమపడి, ఆయన చిరునామా తెలియచేయవలసిందిగా కొందరు పాఠకులు వీరేశ లింగంగారికి లేఖలు వ్రాశారుట. అందువల్ల వీరేశలింగం యీ గ్రంథాన్ని ఎంత మౌలికంగా, ఎంత ఆకర్షణీయంగా రచించాడో అర్థంచేసుకోవచ్చు. ఆడమలయాళంలో ఎనిమిది ప్రకరణాలున్నాయి. ఈ ఎనిమిది ప్రకరణాలలోను మనదేశంలో స్త్రీల విషయమై జరుగుతున్న అన్యాయాలన్నీ , ఆడమలయాళంలో పురుషులకు జరుగు తున్నట్లు ఆరోపించి, బుద్ధిమంతులు సిగ్గుపడేట్లు వర్ణించారు. పురుషుల విషయంలో ఇటువంటి దురాచారాలు, దురన్యాయాలు పాటిస్తే ఆ సంఘం ఎట్లా ఉంటుంది అన్న ఆలోచనను రేకెత్తించడమే పంతులుగారి ఆశయం. భార్య చనిపోయిన భర్తలకు ముక్కులు కోయడం ఆడ మలయాళంలో సనాతన సంప్రదాయం. భార్య చనిపోతే భార్య శవంతోపాటు సజీవుడైన భర్తను పూడ్చి పెట్టటం ఆడ మలయాళంలో సదాచారం. అక్కడ స్త్రీలే ఉద్యోగాలు చేస్తారు. పురుషుడు ఇల్లు విడిచి బయట ఆడుగు పెట్టకూడదు. వ్రతాలు, నోములు, ఉద్యాపనలూ అన్నీ పురుషులకే. ఇక్కడ ఈ దేశంలో బోగంవాళ్ళు ఉన్నట్లే, అక్కడ భోగపురుషులుంటారు. ధనవంతురాండ్రు, పెద్ద పెద్ద అధికారులు అయిన స్త్రీలు, అక్కడ భోగ పురుషులను ఉంచుకొంటారు. మగవాళ్ళకు పత్నీ సేవననమే పరమధర్మమనీ, మోక్షప్రదమనీ, ఆడ మలయాళంలో పెద్దలు బోధిస్తుంటారు. గ్రంథాలు ఘోషిస్తాయి. తన కాలంలో సంఘంలో కనపడుతున్న సర్వదురాచారాలను, వ్యంగ్యంగా, హేళనపూర్వకంగా, ఆడమలయాళం దేశానికి అంటకట్టి వీరేశ లింగం వర్ణించాడు. లిల్లిపుట్ దేశయాత్ర అనే గలివర్స్ ట్రావెల్స్ ప్రథమ భాగానికి ఆడ మలయాళం అనుసరణం. బ్రాబ్డింగ్ నాగ్ యాత్ర అనే గలివర్స్ ట్రావెల్స్ రెండో భాగానికి, లంకాద్వీపమన్న భాగం అనుసరణ. లంకాద్వీపంలో ముహూర్తాలు, జాతకాలు, ప్రశ్నలు, శకునాలు, మొదలైనవన్నీ విమర్శకు గురిఅయినవి. సత్యరాజాపూర్వదేశ యాత్రల యీ రెండు భాగాలూ, అరవం, కన్నడం వంటి ఇరుగు పొరుగు భాషల్లోకి అనూదితావైనాయి. తెలుగుదేశం బాగా ఆకర్షితమైంది.

ఇవికాక చంద్రమతీ చరిత్రాన్ని కూడా వీరేశ లింగం వచన ప్రబంధంగానే పేర్కొన్నాడు కాని, ఇది వచన ప్రబంధం కాదు. చంద్రమతి బాల్యంలో, ఆమె గురువుగారైన విద్యాసముద్రుడు, ఆరోగ్యం, సత్ప్రవర్తన, దయ, ధర్మం, సత్యం, శౌచం మొదలైన విషయాలపై ఆమెకు బోధించిన విషయాలు, పదిహేను ప్రకరణాలుగా కూర్చడమే జరిగింది కాని, కథాకల్పనం ఏమీలేదు.

వీరేశలింగంతోనే తెలుగు నవల వికాసం ప్రారంభమైంది. తెలుగులో ఆప్పటిదాకా లేని ఎన్నో సాహిత్య ప్రక్రియలను తెచ్చి పెట్టి వాటికి వన్నె చిన్నెలు చేకూర్చినట్లే, ఆనంతర కాలంలో నవలగా వ్యవహృతమైన వచన ప్రబంధాన్ని వీరేశలింగమే తొలినాళ్ళలో తీర్చిదిద్దాడు.

ఇంచుమించుగా 1880 వ సంవత్సరం నుంచి 1880 వ సంవత్సరం దాకా తెలుగు దేశంలో వీరేశలింగం ఒక్కడే నవలా రచయిత ఏమోననుకోవాలి. 1881 వ సంవత్సరంలో రాజమండ్రి నుంచి 'చింతామణి' అనే సాహిత్య మాస పత్రిక వెలువడటం ప్రారంభమైంది. 1893 వ సంవత్సరంలో ఈ మాసపత్రిక మొట్టమొదటిసారిగా నవలారచన పోటీ ప్రారంభించింది. ఈ చింతామణి మాస పత్రికను న్యాపతి సుబ్బారావు పంతులుగారు నిర్వహించేవారు. రచనలు ఎన్నిక చేయడం మొదలైన నంపాదకత్వ బాధ్యతను వీరేశలింగమే వహించాడు. తెలుగు సాహిత్యంలో నూత్నరీతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నవలా పోటీలు ఏర్పాటుచేసినట్లు, పత్రిక పేర్కొన్నది. 1893 వ సంవత్సరంలో పోటీకి మూడే నవలలు వచ్చాయి. న్యాపతి సుబ్బారావు, వీరేశలింగం, ఆచంట సుందరరామయ్యగారలు న్యాయమూర్తులుగా వ్యవహరించారు. మొదటి బహుమానం ఖండవల్లి రామచంద్రుడు రచించిన ధర్మవతీ విలాసానికి లభించింది. రెండో బహుమానం తల్లాప్రగడ సూర్యనారాయణరావు రచించిన సంజీవరాయ చరిత్రకు లభించింది. చింతామణి పత్రిక నిర్వహించిన యీ పోటీలవల్ల తెలుగు దేశానికి మహోపకారం జరిగింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం నవలారచయితగా ఆవిర్భవించడమే ఆ ఉపకారం. 1894 వ సంవత్సరంలో జరిగిన పోటీలో చిలకమర్తి పాల్గొన్నాడు. ఆ సంవత్సరం ఆయన రచించిన రామచంద్ర విజయానికి ప్రథమ బహుమానం లభించింది. రెండో బహుమానం గోటేటి కనక రాజుగారి వివేకవిజయానికి వచ్చింది. ఎక్కడో గంజాం జిల్లా రసూల్ కొండలో ఎలిమెంటరీ స్కూలు మేష్టరుగా పనిచేస్తున్న ఖండవల్లి రామచంద్రుడు చింతామణి బహుమాన ప్రకటనచే ప్రేరితులై ధర్మవతీ విలాసమనే నవలను పోటీకి పంపి ప్రథమ బహుమతి గెలుచుకోవడం గొప్ప విషయం. చింతామణి నవలా పోటీల వల్ల తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియ త్వరితగతిని చాలా అభివృద్ధి పొందింది. అంతకు పూర్వం నాటకాలు మాత్రమే రచిస్తూవచ్చిన చిలకమర్తి నవలా రచనపట్ల ప్రేరితుడై పోటీకి నవల పంపించాడు. ఆయన రామచంద్ర విజయానికి ప్రథమ బహుమానం రావటమేకాక, ప్రతిఏడూ ఆయన పోటీలో పాల్గోవడం జరిగింది. చిలకమర్తి పోటికి నవల వ్రాశాడంటే మరెవరికీ ప్రథమ బహుమతి రాదు అనే వాడుక కూడా ఏర్పడింది. చిలకమర్తి అధిక సంఖ్యలో నవలలు వ్రాసి ఆంధ్రస్కాట్ అనే బిరుదు కూడా పొందాడు. ఆయన రచించిన చారిత్రక నవలలు, సాంఘిక నవలలూ బహుళ జనాదరణను పొందాయి. తొలి వాళ్ళ సుప్రసిద్ధ నవలారచయితలలో చిలకమర్తికి సుస్థిరమైన స్థానమున్నది. 1895 వ సంవత్సరంలో ఖండవల్లి రామచంద్రుడు మళ్ళీ పోటీకి నవల పంపించాడు. ఈసారి ఈయనకు రెండో బహుమతి వచ్చింది. ప్రథమ బహుమతి టేకుమళ్ళ రాజగోపాలరావుగారి త్రివిక్రమ విలాసానికి వచ్చింది. 1896 వ సంవత్సరం పోటీకి చిలకమర్తి మళ్ళీ నవల పంపించాడు ఆ నవల హేమలత. దానికి ప్రథమ బహుమానం వచ్చింది. మళ్ళీ రెంతోబహుమానం ఈసారి కూడా ఖండవల్లి రామచంద్రుడే గెల్చుకొన్నాడు. ఆయన నవల లక్ష్మీ సుందరవిజయం. 1887 లో మళ్ళీ చిలకమర్తి నవల అహల్యాబాయికి ప్రథమ బహుమానం వచ్చింది. ఈ సంవత్సరం రెండో బహుమానం లేదు. 1898 లో మళ్ళీ చిలకమర్తి కర్పూర మంజరికి ప్రథమ బహుమానం వచ్చింది. కూనపులి లక్ష్మీనరసయ్యగారి భక్షీ అనే నవలకు ద్వితీయ బహుమానం వచ్చింది. అటు తరవాత చింతామణి పత్రిక ఆగిపోయింది. వీరేశలింగంగారు సెలవు పెట్టి మద్రాసులో ఉన్నారు. ఈ విధంగా ఆరుసంవత్సరాలు చింతామణి మాసపత్రిక నవలా పోటీలు నిర్వహించి ఆధునిక సాహిత్యానికి మహోపకారం చేసింది. ఈ పోటీలు లేకపోతే చిలకమర్తి వంటి గొప్ప నవలారచయితలు నవలలు వ్రాసే వారే కాదేమో. చింతామణి మాసపత్రిక నవలా పోటీలలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ బహుమాన నవలలకు, ధనరూపకమైన బహుమానాలివ్వడమే కాక, ఆ నవలలను పుస్తకరూపాన ప్రచురించి కొన్ని ప్రతులు రచయితలకు బహూకరించేది. ఆ రోజుల్లో నవలా రచయితల కది గొప్ప ప్రేరకమయింది.

1893 వ సంవత్సరంలో తొలిసారిగా నవలా పోటీలను నిర్వహించి సప్పుకు, రచయితలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఈ పత్రిక కొన్ని నియమ నిబంధనలను ప్రకటించింది. ఈ నవలా పోటీలు నిర్వహించినప్పుడు కూడా చింతామణి నవలను వచన ప్రబంధంగానే వ్యవహరించింది. వచన ప్రబంధం ఎట్లా వ్రాయా, దాని లక్షణాలేమిటి ? కథ ఎట్లా ఉండాలి. కథనం ఏవిధంగా ఉండాలి మొదలైన విషయాలు సవివరంగా ప్రకటించింది. పోటీలో పాల్గొనదలచిన వాళ్లు, కందుకూరి వీరేశలింగంగారి రాజశేఖర చరిత్రం, సత్యవతీ చరితం మొక్కన వచన ప్రబంధాలు చదివి, లక్షణాలు గ్రహించవచ్చుననీ ప్రకటించింది. ఏకసూత్రత ఉండాలనీ, అనువాదం కారాదనీ, అక్కడక్కడ సంభాషణరూపంగా కథసాగితే బాగా ఉంటుందనీ, చింతామణి పత్రిక సూచించింది. అందుకే కాబోలు చిలకమర్తి "నవలలు వ్రాయుటకు మాకప్పుడు వీరేశలింగముగారు వ్రాసిన రాజశేఖర చరిత్ర మను నవలయే యాదర్శకము. ఆ నవలను నే నామూలాగ్రముగా చదివి నవలలు రచియించు పద్ధతిని తెలిసి కొని రామచంద్ర విజయమును వ్రాసితిని" అని స్వీయ చరిత్రలో వ్రాసుకొన్నారు. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే రామచంద్రవిజయానికీ, రాజ శేఖర చరిత్రకూ చాలా పోలికలే కనిపిస్తాయి. అనుకరణంతో ప్రారంభించినా, తరవాత తరవాత చిలకమర్తి నవలారచనలో స్వోపజ్ఞతను విశేషంగా ప్రదర్శించాడు.

1897 వ సంవత్సరం నవలాసాహిత్య చరిత్రలో చాలా ప్రాధాన్యం కలది. ఈ సంవత్సరంలో కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి గారి 'వివేకచంద్రికా విమర్శనం' అనే విమర్శగ్రంథం వెలువడింది. వీరేశలింగం రాజ శేఖరచరిత్రను విమర్శిస్తూ వెలువడిన గ్రంథం ఇది. ఇంతకు పూర్వమే 'రాజయోగి' అనే మాసపత్రికలో ఇది భాగభాగాలుగా వెలువడ్డా 1887 లో పుస్తకరూపంలో వచ్చింది. వీరేశ లింగం రాజశేఖర చరిత్రలో చాలా అనౌచిత్యాలున్న వంటూ, ఆలివర్ గోల్డ్ స్మిత్ మూలగ్రంథంతో దీన్ని పోలుస్తూ,దాన్ని అనుకరించబోయి పాడుచేశాడని, చాలా చోట్ల రసాభాసంపాలైనాయి వీరేశలింగంచేసిన వర్ణనలూ, పాత్ర చిత్రణలూ అనీ తీవ్రంగా బ్రహ్మయ్యశాస్త్రి విమర్శించారు, పుస్తక రూపంగా ప్రకటించినప్పుడు దీనికి పీఠిక వ్రాస్తూ ఈ ప్రక్రియను ఇంగ్లీషులో మాదిరిగానే 'నవల' అని పిలవటమే బాగనీ, తానికముందునుంచీ యీ ప్రక్రియను నవలగానే వ్యవహరిస్తాననీ, ఆ పీఠిక లో ఆయన పేర్కొన్నాడు. అప్పటి నుంచీ వచన ప్రబంధమన్న పేరుకు బదులు 'నవల' అనే పేరు బాగా ప్రచారం లోకి వచ్చి పదిపది హేనేళ్ళు గడిచేసరికి ఈ ప్రక్రియకు నవల అన్న పేరే రూఢమైపోయింది.

చింతామణి పోటీల తర్వాత మళ్ళీ పోటీలు జరిపిన విజ్ఞానచంద్రికా మండలి వాళ్ళు, నవలాపోటీలుగానే యీ పోటీలను - పేర్కొన్నారు. కాబట్టి '1873 వ సంవత్సరం నుంచి 1897 దాకా అంటే పాతిక సంవత్సరాలు నవలను వచన ప్రబంధంగా వ్యవహరించేవారనీ, అటు తరవాత నవల అన్న పేరు ప్రచారంలోకి వచ్చిందని తెలుస్తున్న ది. 1872 నుంచి ఇంచుమించుగా 1900 సంవత్సరందాకా తెలుగు నవలాసాహిత్య చరిత్రలో మొదటి ఘట్టం. చారిత్రక నవలలు, సాంఘిక నవలలు, ప్రధానంగా వెలువడ్డాయి. 1900 సంవత్సరం నుంచీ రెండో ఘట్టం ప్రారంభమైంది. చిలకమర్తి పౌరాణికేతివృత్తాలను గ్రహించి నవలలుగా వ్రాయటం ప్రారంభించాడు. 1905, 1906 వ సంవత్స రాలలో వంగదేశ విభజనోద్యమం తెలుగుదేశాన్ని బాగా ప్రభావితం చేసింది. స్వాతంత్ర్యోద్యమం కూడా బలపడసాగింది. వంగదేశపు సాహిత్యం, చరిత్ర, సాంఘిక జీవనంపట్ల తెలుగు ప్రజలు ఆకృష్టులైనారు. వాళ్ళను గురించి తెలుసు కోవాలన్న కుతూహలం కలిగింది. పురావైభవం, చారిత్రక పరిజ్ఞానం ద్వారా స్మరణకు తెచ్చి కర్తవ్యోపదేశం చేయాలనే ఉద్యమాలు కొన్ని దేశంలో బయలు దేరినవి. సాంస్కృతిక పునరుజ్జీవనం భారతదేశ వివిధ ప్రాంతాలలో ప్రారంభమైంది. విజ్ఞానచంద్రికామండలి ఈ దృష్టితోనే సంస్థాపనం చెందింది. దేశ దేశాల చరిత్రలు, స్వాతంత్ర్యోద్యమచరిత్రలు, శాస్త్రీయ విజ్ఞానం, విజ్ఞానసర్వస్వం, తెలుగువాళ్ళకందజేసే ఉద్దేశంతో పుట్టిన గొప్ప సంస్థ విజ్ఞానచంద్రికామండలి. వీరేశలింగం తల పెట్టిన సంఘసంస్కరణోద్యమాన్ని బహుముఖీనంగా, సమగ్రంగా, సమన్వయపూర్వకంగా, విస్తరింపచేయటమే విజ్ఞానచంద్రికామండలి లక్ష్యం.

దేశీయులలో స్వాతంత్ర్య పిపాసను పెంపొందించి, చైతన్యోన్ముఖులను చేయటానికే కొమర్రాజులక్ష్మణరావు హిందూమహాయుగం, మహమ్మదీయ మహాయుగం వంటి గ్రంథాలు రచించాడు. ప్రజలకు చరిత్రపట్ల అభిరుచి కలగటానికి విజ్ఞానచంద్రికామండలిద్వారా లక్ష్మణరావు చారిత్రక నవలలపోటీ ఏర్పాటు చేశాడు. విజ్ఞానచంద్రికామండలివారు పోటీలు నిర్వహించినందువల్లనే తెలుగుదేశంలో చారిత్రక నవలకు వికాసంకల్గింది. భోగరాజునారాయణమూర్తి, కేతవరపు వేంకటశాస్త్రి, దుగ్గిరాల రాఘవచంద్రయ్య, మొదలైనవారెందరో ఉత్తమచారిత్రక నవలలు వ్రాశారు. భోగరాజు నారాయణమూర్తి వ్రాసిన ఆంధ్రరాష్ట్రము, విమలాదేవి మొదలైన నవలలు పాఠకులను బాగా ఆకర్షించాయి. ప్రాచీనాంధ్ర చరిత్రను ఔజ్జ్వల్యమొనర్చే నవలలు కేతవరపు వేంకటశాస్త్రి గారు వ్రాశారు. ఈయన రచించిన రాయచూరు యుద్ధం గొప్పనవల. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు యుద్ధంలో సుల్తానులను వోడించడం, వీరశృంగార అద్భుతరసాలతో కమనీయంగా వర్ణించారు రచయిత. 1900 నుంచి 1920 వ సంవత్సరందాకా సాగిన రెండో ఘట్టంలో వంగనవలల అనువాదాలు, చారిత్రక నవలలు, అపరాధ పరిశోధక నవలలు వెలువడ్డాయి. 1910 వ సంవత్సరంలో ప్రారంభమైన ప్రత్యేకాంధ్రరాష్టోద్యమం కూడా, తెలుగువాళ్ళ గత చరిత్రను అధ్యయనం చేసి నవలల రూపంలో అందించడానికి ప్రేరకమయింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వంటి ఆధునికరచయితలు కూడా చరిత్రను కొత్త దృక్కోణాలతో వ్యాఖ్యానించి ప్రతిపాదించారు. బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించి దేవరాజు వేంకటకృష్ణారావు వాడేవీడు, నేను, కాలూ రాయివంటి నవలలను ఈ కాలంలోనే ప్రకటించారు. వెంకటపార్వతీశ్వరకవులు, చాగంటి శేషయ్య, దొరస్వామయ్య మొదలైనవారు బెంగాలీ నవల అనువాదాలు వెలయించారు. ముఖ్యంగా బంకించంద్ర ఛటర్జీ నవలలు కపాలకుండల, ఆనందమఠం, దుర్దేశనందిని మొదలైన నవలలు తెలుగులో అనూదితాలైనాయి. 1800 నుంచి 1929 వ సంవత్సరం వరకూ బెంగాలీ నవలల అనువాదాలు చాలా వచ్చాయి. ఇందులో సాంఘికాలూ, అపరాధ పరిశోధకాలూ ఉన్నాయి. చిలకమర్తి, వెంకటపార్వతీశ్వరకవులు, చారిత్రక, పౌరాణిక ఇతివృత్తాలతో నవలలు వ్రాశారు. భారతదేశ చరిత్రకు సంబంధించిన ఇంగ్లీషు అనువాదాలు కూడా యీ కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా రమేశచంద్రదత్, కల్నల్ టాడ్, మెడోస్ టైలర్ మొదలైన రచయితల నవలలకు అనువాదాలు వెలువడ్డాయి. విజ్ఞానచంద్రికామండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, వేగుచుక్క గ్రంథమండలి మొదలైన ప్రచురణసంస్థలు నవలలను విశేషంగా ప్రచురించాయి.

క్రిందటిశతాబ్దపు చివరి దశకంలోనే దేశీయులు విదేశాలకు వెళ్ళి ఇంగ్లీషు చదువులు చదివి ఉన్నతమైన పట్టాలు పొంది ఈ దేశానికి వచ్చి ఘన గౌరవాలు పొందడం ప్రారంభమైంది. ఇంగ్లీషు చదువులపట్లా, వారి నాగరకతపట్లా, అభిమానం కూడా, వృద్ధికావడం మొదలైంది. అందువల్ల అంధానుకరణము. ఉద్యోగ వ్యామోహము, తమ స్తోమతుకుమించిన ఖర్చులు, మధ్యతరగతి కుటుంబాలను ప్రభావితం చేశాయి. కేతవరపు వెంకటశాస్త్రి గారి 'లక్ష్మీ ప్రసాదం' అప్పటి మధ్యతరగతి సంసారాల సాంఘిక జీవనాన్ని బాగా ప్రతిబింబించే నవల అని చెప్పాలి. 1920 వ సంవత్సరానికి ముందే యీ నవల వెలువడింది. విశాఖపట్టణ ప్రాంతాన్ని రంగభూమిగా, గొప్ప ఉపజ్ఞ చూపుతూ వెంకటశాస్త్రి గారీ నవల వ్రాశారు. మధ్యతరగతి కుటుంబ గృహస్థజీవనమూ, ఆచారాలు, వ్యవహారాలు, ఈ నవలలో రచయిత చక్కగా చిత్రించారు. లక్ష్మి అనే ముగ్ధ ఇందులో నాయిక. ప్రసాదరావు నాయకుడు. వీళ్ళిద్దరూ మేనత్త మేనమామ బిడ్డలే. లక్ష్మి తండ్రి రామశర్మ పాశ్చాత్య నాగరకతా వ్యామోహం లేకుండా గుట్టుగా సంసారం నడుపుకొనే గృహస్థు. ఆయన చెల్లెలు రాజేశ్వరమ్మ తన కొడుకును ఇంగ్లండ్ పంపించి ఐ. సి. ఎస్ చదివించి, కలెక్టరుగా ఆతణ్ణి చూడాలన్న విపరీతవ్యామోహం కలది. ఈ వ్యామోహంతో ఆమె ఉన్న వన్నీ తెగనమ్మీ, అప్పులు చేసి కొడుకును ఇంగ్లండ్ పంపిస్తుంది. ఆమె భర్త జోగారావు కోర్టు మున్సబు ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు స్వతహాగా ఇష్టం లేక పోయినా భార్య ప్రోద్బలంవల్ల, కొడుకును విదేశాలకు పంపించి చదువు చెప్పించడంవల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి లంచాలు కూడా తీసుకోవడం మొదలు పెడతాడు. దాంతో ఇంటా బయటా అనేక చిక్కులు ఎదురవుతాయి . ఇంతలో మొదటి ప్రపంచయుద్ధం వస్తుంది. ఇంగ్లండులో ఉన్న ప్రసాదరావు చదుపు సాగించడానికి వీలులేక, చదువు పూర్తికాకుండానే తిరిగి రావలసి వస్తుంది. రాజేశ్వరమ్మ చాలా ఆశాభంగం చెంది, కోడలి పైన, అన్న గారి కుటుంబం పైనా కఠినత్వం వహిస్తుంది. లక్ష్మి అనేకమైన కష్టాలపాలవుతుంది. చివరకు ప్రసాదరావు తల్లి ప్రవర్తనలోని అంతర్యాన్ని తెలుసుకొని, భార్యను ఆదరిస్తాడు. సరళమైన భాష, చక్కని సన్ని వేశాలతో వెంకటశాస్త్రి గారీనవలను ఒకానొక సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి వ్రాశారు.

1800 నుంచి 1990వ సంవత్సరంలోపున వెలువడిన నవలలలో వెంకట శాస్త్రి గారి నవలలకు ప్రత్యేకమైన స్థానమున్నది. ఈయన సాంఘిక నవలలు, చారిత్రక నవలలు, అపరాధ పరిశోధక నవలలు కూడా వ్రాశారు. ఈ కాలంలో నవలలు బహుళ సంఖ్యలో వెలువడటమే కాకుండా, ఇతివృత్త వైవిధ్యంతో కూడా రావడం తెలుగు నవలాసాహిత్య చరిత్రలో, ఈ కాలపు విశిష్ట లక్షణంగా చెప్పాలి.

శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి గారి లాంటి ప్రసిద్ధరచయితలు మిథునానురాగం, వీరపూజ, విష భుజంగం, మొదలైన నవలలు ఈ కాలంలోనే వ్రాశారు. ఆయన వ్రాసిన పెద్ద కథలన్నీ నవలికలే అని చెప్పవచ్చు.

ఇంగ్లీషు నుంచీ, బెంగాలీ నుంచీ, శివశంకరస్వామి, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, మొదలైన రచయితలు, ఊర్లూ పేర్లు మార్చి, అనుసరణాత్మకమైన నవలలు వెలువరించడం కూడా ఈ కాలంలోనే జరిగింది. అక్కిరాజు ఉమాకాంతం, మెడోస్ టైలర్ రచించిన టిప్పూసుల్తాన్ నవలకు అనువాదం. ప్రకటించాడు. దీనిపీఠిక లో పాశ్చాత్య దేశాలలో నవలావిర్భావక్రమపరిణామాన్ని ఆయన సమీక్షించాడు. అపరాధ పరిశోధక నవలలు, వంగ నవలల అనువాదాలతోపాటు, మాతృమందిరము, వసుమతీ వసంతం, ప్రమదావనం వంటి మౌలికమైన నవలలను కూడా వెంకటపార్వతీశ్వరకవులు ప్రకటించారు. అటుతరవాత వీరు రవీంద్రనాథ ఠాగూర్ 'గోరా' ను కూడా అనువదించారు. రాజారత్నము , గణపతి వంటి నవలలు ఈ కాలంలోనే చిలకమర్తి ప్రకటించాడు. విశ్వనాథ, వేలూరి శివరామశాస్త్రి గారు వంటివారు కూడా ఈ ఘట్టంలోనే తొలి నవలలు ప్రక టించారు.

ఈ కాలంలో నవలలను అధిక సంఖ్యాకంగా ప్రచురించిన సాహిత్య సంస్థలు, విజ్ఞానచంద్రికామండలి. ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, వేగుచుక్క గ్రంథమాలలు. విజ్ఞానచంద్రికామండలి కేవలం చారిత్రక నవలలే ప్రకటించింది. ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల చారిత్రకాలు, పౌరాణికాలు, ఆపరాధ పరిశోధక నవలలూ కూడా ప్రచురించింది. వేగుచుక్క గ్రంథమాల కేవలం అపరాధపరిశోధక నవలలే ప్రచురించింది ఈ కాలం గాంధీయుగానికి పూర్వరంగం. తిలక్ మహరాజు అఖిలభారతాన్నీ ప్రభావితం చేస్తున్న రోజులు. తదనుసారంగా జాతీయ చైతన్యాన్ని జాగృతం చేయడానికే సాహిత్యం కూడా సమాయత్తం కావడం ఈకాలపు ప్రత్యేక లక్షణం. నాటకం వ్రాసినా, నవల వ్రాసినా, కవిత వ్రాసినా, భారతీయ చరిత్రలోని, సంస్కృతిలోని ఔజ్ట్వల్యాన్ని గుర్తుకు తెచ్చి, జాతిని కర్తవ్య పరాయణోన్ముఖంగా ప్రబోధించడం కనపడుతుంది. భారతదేశ వీర చరిత్రలో, ఉదాత్త సంస్కృతిలో ఏక దేశమైన ఆంధ్రుల చరిత్ర, సంస్కృతులు కూడా, రచయితలను ఉత్తేజితులను చేశాయి. దేశభక్తి ప్రబోధం, పెల్లుబికింది. అయితే ఈ కాలంలో వెలువడ్డ చారిత్రక నవలలు, మేధావుల విమర్శకు కూడా గురి అయినాయి. గురజాడ అప్పారావు, దుగ్గిరాల రాఘవచంద్రయ్యగారి విజయనగర సామ్రాజ్యాన్ని , హేళనపూర్వకమైన విమర్శకు గురిచేశారు. నాటి చారిత్రక నవలల వర్ణనలన్నీ మూసపోసినట్లుగా ఉండటం, కల్పనలలోనూ వైవిధ్యం లేకపోవడం, చలం హేళనకు గురిఅయి, ఆయన 'తెలుగునవల' అనే వ్యంగ్యహాస్య విమర్శ వ్రాయడానికి ప్రోద్బలకాలైనాయి.

1900 నుంచి 1920 వ సంవత్సరం వరకు భారతీయ స్వాతంత్ర్యోద్యము నాయకులు బాలగంగాధర తిలకు, అరవిందుడు, లజపతిరాయ్ వంటి వారలు. ఆప్పటికి గాంధేయ ప్రభావం ఉద్యమం పైన లేదు.

ఏవిధంగా, ఏ ప్రమాణాలను బట్టి చూచినా ఇరవైయవ శతాబ్దపు మహా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఉన్నవవారు మాలపల్లి ప్రకటించడానికి ముందుకాని, అటుతరవాత కాని, తెలుగునవలా సాహిత్యంలో అంతటి ఉత్కృష్టమైన నవల మరేదీ ప్రభవించి ఉండలేదు. తెలుగునవలా రచయితలలో ఆయన బుజాలఎత్తు వరకూనైనా నిలబడగల రచయిత లెవరైనా ఉన్నారో లేరో చెప్పడం కష్టం.

ఉన్నవ లక్ష్మీనారాయణగారు అకలంకదేశభక్తుడు. ఉన్నత విద్యాధికుడు. స్వార్థత్యాగి. ఉద్యమసారథి. మేధావి. హృదయవాది. గొప్ప పండితుడు. ప్రపంచ దేశాల రాజకీయోద్యమ తత్త్వవేత్త. సంప్రదాయాభిజ్ఞుడు. పాతకొత్తల మేలుకలయికను ఎరిగినవాడు. క్రొమ్మె రుంగులుజిమ్మగా ప్రదర్శింప గలిగిన శక్తి సామర్థ్యాలున్న వాడు.

ఉన్నవ వారు రచించిన నవల, మాలపల్లి, మహోత్తమ నవల. ఈ నవలకు సంగవిజయమని కూడా నామాంతరంవుంది. నాలుగు భాగాల నవల ఇది. పెద్ద సైజున ఏడువందల పుటలకుమించిన ఉద్గ్రంథం. ఇరవైయో శతాబ్దిలో వెలువడిన తెలుగు రచనలలో కనీసం కొన్ని వందల ఏళ్ళు జీవించగలిగిన నవల ఇది భక్తిజ్ఞాన కర్మ మార్గాల సమన్వయం సాధించిన నవల ఇది. తిలక్ గాంధీ సిద్ధాంతాల ఆదర్శసమన్వయం ప్రతిపాదితమైనది యీ నవలలో. సోషలిస్ట్ సిద్ధాంతా లను, దృక్పథాలను ప్రతిపాదించిన మొట్టమొదటి తెలుగు నవల, తెలుగు సాహిత్యంలో వెలువడిన మహోద్గ్రంథమూ, ఈ మాలపల్లి అని చెప్పాలి. వాస్తవిక చిత్రణ, ఆదర్శవాదము రెండూ అత్యద్భుతమైన శిల్పసమ్మేళనం పొందగా యీ మాలపల్లి నవల ఆవిర్భవించిందని చెప్పాలి. నిఖిలాంధ్రదేశానికి నడిగడ్డగా చెప్పదగిన గుంటూరు జిల్లా మెట్ట ప్రాంతం రంగ భూమిగా ఈ నవల రూపొందింది. ఈ నవలలో కనిపించే పాత్రలన్నీ సజీవంగా కనిపిస్తాయి. కల్పనవున్నా అది కల్పన అనిపించదు. ఇంతగా వాస్తవికత ప్రతిబింబించే తెలుగు నవలలు వేళ్ళ మీద లెక్క పెట్టదగినవి మాత్రమే ఉంటాయేమో. ఈ నవల తెలుగుదేశాన్నంతా చాలా గొప్పగా ప్రభావితం చేసింది. ఇది మొట్టమొదటిసారిగా 1921 వ సంవత్సరంలో వెలువడింది. ఆనాటి దేశకాలపరిస్థితులను తెలుసుకొంటే ఉన్నవ వారు ఆనాటికే యీ నవల వ్రాయటం, అద్భుతాద్భుతం అనిపించక తప్పదు. ఇతర భారతీయ భాషలలో ఆ కాలంలో ఇటువంటి మహోద్గ్రంథం వెలువడిందో లేదో ! తన సమకాలీన సమాజాన్ని, ప్రభుత్వ వ్యవస్థను, భూతద్దం క్రింద పరిశీలించి నట్లుగా చిత్రించాడు రచయిత. స్వాతంత్ర్యోద్యమంలో కారాగార శిక్షను అనుభవిస్తూ ఉన్నవవారు ఈ నవల వ్రాసినట్లు చెపుతారు. ఈ నవల మొట్టమొదటిసారి ముద్రింపజేసిన ఘనకీర్తి శ్రీ బెల్లంకొండ రాఘవరావుగారిది. ఈయన గొప్ప సారస్వతవేత్త. గుంటూరు జిల్లా నరసారావు పేట దగ్గర పమిడిపాడనే అగ్రహారం వీరి కాపుర స్థలం. కవిపండిత మిత్రులుగా, వదాన్యులుగా ఈయన పేరుకెక్కారు. దీనికి కాశీనాథుని నాగేశ్వరరావుగారు పీఠిక వ్రాయడం కూడా చెప్పుకోదగిన విశేషమే. ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం. ఈ నవలను ప్రచారం నుంచి నిషేధించడమేకాక , లభ్యమవుతున్న ప్రతులను జప్తు చేయటం కూడా చేసింది. మొదటిసారి వెలువడిన తరవాత చాలా కాలానికి గాని యీమహోత్తమ వచన కావ్యం పునర్ముద్రణ పొందలేదు.

సాహిత్యం జీవితానికి చేరువగా ఉండాలని, వాస్తవికతే దాని పరమాదర్శంగా ఉండాలని అనుకొంటే తెలుగులో ఇటువంటి నవల ఇంకొకటి రాలేదని చెప్పటం సత్యదూరం కాదు. ఈ నవలకు ఇంకొక ఇంగ్లీషు నవలకు పోలికలు చూపి, ఇది అట్లా ఉందని కొందరు విమర్శకులు గొప్ప పరిశోధన విషయం బయట పెట్టినట్లు ప్రస్తావించడం నిరుపయోగమూ, నిరర్థకమూ అని చెప్పాలి. ఏమంటే ఒకవేళ ఈ మహా విమర్శకులు చూపే పోలికలేఉన్నా, తెలుగు నవలగా దానికున్న విశిష్టతకు, ఉన్నవవారి స్వోపజ్ఞతకు కాని అవి అపకర్షకావు.

మాలపల్లిలోని పాత్రలన్నీ వాస్తవికమైనవి. వాస్తవిక ప్రపంచంలోని అనేక సంఘటనలు రసాత్మకంగా రూపకల్పన చేయటమే ఉన్నవవారి గొప్ప ప్రజ్ఞను నిరూపిస్తున్నది. అచలవేదాంతి తుంగదు ర్తి బుచ్చయ్యగారు, క్రిస్టియన్ ఫాదరీ బ్రాన్సనూ, ఆయన్ను ఆశ్రయించుకొని ఉండి సెటిల్మెంటు ఖైదీలపై ఆజమాయిషీ చేసే పౌలూ, ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ లో యూరోపియన్ పద్ధతులను అనుకరించే, వంటవాడూ, అప్పుడప్పుడే మొదలవుతున్న నగరీకరణమూ , కూరలవాళ్ళూ, పాలవాళ్ళూ, మంగళాపురంలోని పూజారి పిచ్చయ్య, కరణం, మున్సబు ఒక రేమిటి, ఒక టేమిటి, ఈ శతాబ్ది ప్రథమ పాదంలోని తెలుగుదేశపు ప్రతిబింబం మాలపల్లి నవల.

ఇందులో ప్రధానమైన తక్కెళ్ళ జగ్గడి పాత్ర కూడా వాస్తవికమైన పాత్రే ఇటువంటి గజదొంగ ఒకడు ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలలో పెద్ద పెద్ద దొంగతనాలు చేసి అమరావతి వంటి చోట ఆలయంలో విశేషార్చనలూ, సంతర్పణలు చేసిన యథార్థ కథనాన్ని పెద్దిభోట్ల వీరయ్యగారు తమ స్వీయ చరిత్రలో వ్రాశారు. ఈ గజదొంగను ప్రభుత్వం చాలా కాలానికి గాని పట్టుకొని దారిలోకి తీసుకొని రాలేకపోయిందట. జ్యోతి, అప్పాదాసుల అలౌకికమైన ప్రేమ వృత్తాంతం చాలా గంభీరంగా, ఉదాత్తంగా చిత్రించారు రచయిత. నల్లమోతు చౌదరయ్య, ఆయన కొడుకు రామానాయుడు, కోడలు కమల, మనవడు సాహూకృష్ణ, భార్య లక్ష్మమ్మ, పెంచిన కొడుకు వెంకటయ్య, రామదాసు, ఆయన కొడుకులు వెంకటదాసు, సంగదాసు, రంగడు, కూతురు జ్యోతి, మేనల్లుడు అప్పాదాసుల పాత్ర చిత్రణంలో గొప్పనేర్పు చూపించారు రచయిత. పెద్దింటికోడలు కమల లేచిపోతుంది. ఆ కమల పాత్రచిత్రణం అత్యంత వాస్తవికంగా వుంది. అసమానమైన ప్రజ్ఞకనపరిచారు ఆమె పాత్రచిత్రణంలో ఉన్నవవారు. పోలీసు డిపార్టుమెంటు ఇలాకాలో జరిగే దొంగతనాలు, జైళ్ళలో జరిగే అక్రమాలు, జైలు సర్జన్లు, వార్డర్లు, ఆఫీసర్లు, - జైలు ఖైదీల రేషన్లను ఎవరెవరు ఎట్లా ఎంతెంత పంచుకొని తినేదీ, ప్రభుత్వ శాఖల్లోని అవినీతి, లంచగొండితనం , అక్రమార్జనలు, హృదయ విదారకంగా వర్ణించారు ఉన్నవవారు. 1921 వ సంవత్సరానికే సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ఆగ్రహంచెంది విప్లవపంథాను ఆయన ప్రతిపాదించి వర్ణించటం, చాలా ఆశ్చర్య కరమైన విషయం. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ యంత్రాంగంలో క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన అవినీతి, ఆలసత్వం, ఆశ్రితపక్షపాతం మొదలైనవాటినిగూర్చి ప్రస్తావిస్తూ పెద్దవాళ్ళు 'మా హయాంలో ఇట్లాకాదు , బ్రిటిషు ప్రభుత్వం పరిపాలనలో ప్రజలకు, ప్రభుత్వాధికారులకు భయభక్తులు, క్రమశిక్షణ, ఎంతగానో వుండేవి' అని ఆ గత కాలాన్ని గూర్చి అంగలార్చడం వింటూవుంటాం కాని మాలపల్లి చదివితే, ఆ సమాజంలోని దురన్యాయాలన్నీ ఆవిష్కారమవుతవి. నేరాలు చేసే జాతులుగా కొందరిని పరిగణించి, వాళ్ళకు సెటిల్మెంటు లేర్పచడం, అక్కడి జీవిత విధానాలు, నిర్బంధించి శరీరకష్టం చేయించటం, అనేక విధాలుగా ఆ అమాయకులను హింసించటం. ఇవన్నీ కరుణాత్మకంగా చిత్రించారు రచయిత. 'వాడుక భాషయందు నవరసభరితమైన కావ్యమును రచించిన లక్ష్మీనారాయణగారు ధన్యులు'. అన్నారు కాశీనాథుని నాగేశ్వరరావుగారు పీఠికలో, స్వరాజ్యం వచ్చేసిందని, పర ప్రభుత్వం స్థానంలో ప్రజాస్వామిక దేశీయ ప్రభుత్వం ఏర్పడి సురాజ్యం రూపొందిందని సామాన్యుడి 'జీవితం మూడు పువ్వులు ఆరుకాయలైందని, సామాన్యుడి జీవితాన్ని స్వర్గతుల్యం చేయడానికే చట్టాలన్నీ రూపొందాయనీ, యోగ్యులు, ప్రజాక్షేమపరాయణులు, దేశహితైకతత్పరులు, శాసనసభల ప్రాతినిధ్యం వహించి, శ్రీలు పొంగిన జీవగడ్డగా మళ్ళీ భరతదేశాన్ని రూపొందిస్తున్నారని, పాపం తమ కన్న కలను శ్రీ లక్ష్మీనారాయణ పంతులుగారు తమ నవల నాలుగోభాగం 18వ ప్రకరణంలో వర్ణించారు. లక్ష్మీనారాయణగారు అప్పటికే భాషా ప్రయుక్త రాష్ట్రవాదులు కనుక, ఆంధ్రరాష్ట్రం వచ్చేసినట్లూ, ఆ రాష్ట్ర శాసనసభ వారు ప్రజాక్షేమానికి సంబంధించి 12 చట్టాలు అమలులోకి తెచ్చినట్లు వర్ణించి తృప్తిపడ్డారు. లక్ష్మీ నారాయణగారు కన్న కలలను బట్టిచూస్తే స్వాతంత్ర్యం రాగానే భూతల స్వర్గం ఊడిపడుతున్నట్లే వారు భావించినట్లు కనపడుతున్నది. పాపం ఆ తరం వాళ్ళంతా అందువల్లనే గొప్పగొప్ప త్యాగాలు చేయటానికి వెనుదీయలేదు. ఉన్నవ లక్ష్మీ నారాయణగారు, వర్ణించిన ఆ శాసన చట్టాలు ఆ విధంగా అమలు జరిగితే, వారాశించిన విధంగా స్వరాజ్యం సురాజ్యంగానే రూపొందిఉండేది. మాలపల్లి నవల ఒక విజ్ఞాన సర్వస్వంవంటిది. మత, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, సాహిత్య సిద్ధాంతాలన్నీ పరామర్శితములై, వాటిలోని నిగ్గును ప్రదర్శిం చారు రచయిత. నూరు సంవత్సరాలకు పూర్వం తెలుగుదేశపు సామాజిక స్వరూపం ఏ విధంగా ఉండేదో, ఈ శతాబ్దపు ప్రథమపాదంలో, ఆ సమాజ స్వరూపం ఏ విధంగా పరిణామం చెందిందో, ఉన్నవవారు కళ్ళకు కట్టేటట్లు చిత్రించారు. భాష కాని, భావాలు కాని. నిర్వహణం కాని, పాత్ర చిత్రణం కాని, ఉత్తమ సాహిత్యవేత్తకు ఉండవలసిన భావోద్విగ్నత, సంయమనము, దర్శ నము, సందేశము, మొదలైన విషయాలలో కాని 'నాన్యఃపంథా ' ఉన్నవ వారిది, మాలపల్లికి సాటి అయిన నవల తెలుగులో నభూతో. భవిష్యత్తుమాట ఎవరు చెప్పగలరు ?

ఆధునిక తెలుగునవలా సాహిత్యాన్ని పరిశీలిస్తే చెప్పుకోదగిన నవలా రచయితలు నలుగురున్నారు. విశ్వనాథ, బాపిరాజు, చలం, నోరి నరసింహ శాస్త్రి. ఇంకెందరో నవలలు వ్రాసినవాళ్ళున్నారు. కాని ప్రత్యేకత చూపించుకొన్న నవలా రచయితలు ఈ నలుగురు. ఇదేవిధంగా 1940 వ సంవత్సరం నుంచి 1950 వ సంవత్సరం వరకూ పదేళ్ళలో బుచ్చిబాబు, గోపీచంద్, జి. వి. కృష్ణారావు, కొడవటిగంటి కుటుంబరావులను, విశిష్టులైన నవలా రచయితలుగా పేర్కొనవచ్చు. 1950 తర్వాత ఈ పాతిక సంవత్సరాలలో అత్యధిక సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. తెలుగునవల ఇజీవలే శతజయంతి జరుపుకొన్నా మొదటి డెబ్బై ఆయిదు సంవత్సరాలలో వెలువడిన నవలలకన్నా ఈ పాతిక సంవత్సరాలలో వెలువడ్డ నవలలే సహస్రాధికంగా ఎక్కువవుంటాయని చెప్పాలి. మొదటి డెబ్భై అయిదు సంవత్సరాలలో వచ్చిన వాటికంటే నిస్సందేహంగా తరవాతి యీ పాతికేళ్ళలో ఐదారు రెట్లు నవలలు వచ్చివుంటాయి. వస్తువైవిధ్యం, శిల్పం, ప్రయోగాలూ కూడా, ఆధునిక కాలంలో చెప్పుకోదగినంతగా ఈ ప్రక్రియ సంతరించుకొన్నది తెలుగు సాహిత్యంలో ఈనాడు నవల కున్నంత ప్రాచుర్యమూ, పలుకుబడి మరే ఇతర సాహిత్య ప్రక్రియకూ లేదేమోననుకోవచ్చు. అందుకనే కొందరు ఇది నవలాయుగం అని కూడా అంటున్నారు.

ఆధునిక సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణగారు స్పృశించని ప్రక్రియలేదు. చిన్న కథ నుంచి మహాకావ్యం వరకూ వారు సాహిత్యవ్యవసాయం చేశారు. ఆయనది ఒక విలక్షణమైన మార్గం. సనాతన సంప్రదాయాలపట్ల వారికి అభినివేశం ఎక్కువ. ఏ మాత్రం అవకాశం వచ్చినా సనాతన దృక్పథాన్నీ, ఆచారాలను, ఆయన తన రచలనలో ప్రతివాదించి వాటి వైశిష్ట్యం నిరూపించే ప్రయత్నంచేస్తూ ఉంటారు. గొప్పకల్పనాశక్తి, భావావేశమూ, భాష మీద ప్రభుత ఉన్న రచయిత ఆయన. కాని మంత్రశాస్త్ర ప్రక్రియలు సామాన్యులకు అర్థం కానట్లు, విశ్వనాథవారి రచనలు ఒక వర్గం వారిని మాత్రమే ఉత్తేజితులను చేస్తవి. విశ్వనాధ చేపట్టిన సర్వసాహిత్య ప్రక్రియలలోనూ వారు అధిక సంఖ్యలో నవలలే వ్రాశారు. నవలల్లో కూడా సాంఘీకాలూ, చారిత్రకాలు, పౌరాణికాలు, ఆధిక్షేపిక నవలలు. వైమర్శికాలు, ఎన్నో వ్రాశారు. చిన్నా పెద్దా కలిపి చూస్తే విశ్వనాథ సుమారు అరవై నవలలదాకా వ్రాసినట్లు కన్పిస్తుంది. చాలా ప్రసిద్ధి పొందినవి వేయిపడగలు, ఏకవీర, చెలియలికట్ట, మా బాబు,తెరచి రాజు; బద్దన్న సేనాని, మొదలైనవి. ఇవికాక ఇటీవల ఆయన పురాణరవైగ్రంథమాల పేరుతోనూ, నేపాల రాజవంశ చరిత్రకు సంబంధించీ కొన్ని నవలలు ప్రకటిందారు. మ్రోయు తుమ్మెద, కుణాళుని శాపం, ఆరు నదులు, దమయంతీ స్వయంవరం, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, సముద్రపు దిబ్బ, మొదలైన నవలలు తెలుగు పత్రికలలో ధారావాహికంగా ప్రచురితాలై గత పదిహేను, ఇరవై సంవత్సరాలలో పుస్తక రూపంలో వచ్చాయి.

ఏక వీర నవలలో విశ్వనాథ చూపిన శిల్ప ప్రతిభ చాలా గొప్పది. అది మధుర ప్రాంతాలను పరిపాలించిన రాజకుటుంబపు ప్రణయగాథ రసవత్తరమైన కావ్యంలా సాగుతుంది ఈ నవల.

వేయి పడగలు సంగ్రహవిజ్ఞాన సర్వస్వంవంటిది. సాహిత్యము, మతము. రాజకీయాలు, సంస్కృతి, అన్నీ యీ నవలలో ప్రస్తావికంగా సమీక్షితాలైనవి పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్ధంలో ప్రారంభమైన సాంస్కృతిక పునరుజ్జీవనము. మత రాజకీయ సాంఘికోద్యమాలు, ప్రాచీనకాలం నుంచీ చెల్లుబాటవుతున్న సాంఘిక వ్యవస్థతో నవీనాదర్శాలకు సంఘటించిన సంఘర్షణలు, ఆధారంగా చేసుకొని తెలుగుదేశంలోని యుగసంధి పరిణామాలను విశ్వనాథ వారు వేయి పడగలలో వివరించారు. గతించిపోతున్న ఒక వ్యవస్థ తాలూకు చరమదీప్తులను చూచి ఆయన నిట్టూర్పులు విడుస్తున్నట్లు కనపడుతుంది. వేయిపడగలద్వారా అయన అందించదలచిన సందేశాన్ని బట్టి చూస్తే.

చెలియలికట్ట, తెరచిరాజు, స్వర్గానికి నిచ్చెనలు, మాబాబు, జేబుదొంగలు, మొదలైన నవలల్లో మత, సాంఘిక విశ్వాసాలు ప్రతిపాదితములైనవి. ధర్మ చక్రం, కడిమిచెట్టు, బద్దన్న సేనాని మొదలైన నవలల ద్వారా, ఆయనగారి బహుముఖీనమైన ప్రతిభ వెల్లడవుతున్నది. కొత్తదైన గవేషణతో, నూత్నమైన విశ్లేషణతో, చరిత్రను పురాణాలను, విశ్వనాథ వ్యాఖ్యానించి నవలలరూపంతో అందించారు. సాహిత్య జీవితంలో నలభై సంవత్సరాల కాలం అవిచ్ఛిన్నంగా నవలలు వ్రాయటం విశ్వనాథలోని ప్రత్యేకత. విశిష్టత కూడా.

స్వర్గీయ అడవి బాపిరాజు అన్నిటా భావుకుడు. గంధర్వలోకాలనుండి శపుడై(?) వచ్చి తెలుగుదేశంలో కవిగా, చిత్రకారుడిగా, భావుకుడుగా, సౌందర్య పిపాసిగా, కళావేత్తగా ఆయన జన్మించారేమోననిపిస్తుంది. తెలుగుదేశం, తెలుగుభాష, తెలుగు చరిత్ర , తెలుగు విజ్ఞానం, తెలుగు అన్నది ఏదైనా ఆయనను పులకింపచేసేది, పరవశింపచేసేది. బాపిరాజు ఎంత భావుకుడో అంత పండితుడు. ఆయనలో హృదయమూ, మేధా, కూడా వికాసపారమ్యాన్ని పొందాయి. లలితమైన భావన, మృదులమైన ఊహ, భావుకతా పారమ్యాన్ని అందుకోగల సౌందర్యదర్శనం, బాపిరాజు రచనలలోని నాయికానాయకుల పాత్ర చిత్రణలో కనపడతాయి. అచ్చమైనకవి. ఆదర్మోన్ముఖమైన వాస్తవిక చిత్రణం ఆయన ధ్యేయం. నారాయణరావు, కోనంగి, మొదలైన సాంఘిక నవలలు, హిమబిందు, గోనగన్నా రెడ్డి, అడవి శాంతిశ్రీ, మొదలైన చారిత్రక నవలలు బాపిరాజు ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. బాపిరాజు నవలల్లో ఇతి వృత్తానికి అపరిహార్యం కాని విషయాలు కూడా విశేషంగా చోటు చేసుకొంటాయనే, పాత్రచిత్రణం. వర్ణనలు మొదలైనవాటిలో వైవిధ్యంకూడా చెప్పుకోదగినంతగా కనిపించదనీ ఒక విమర్శ ఉన్నది ఆకాలపు రచయితలు నవలలు వ్రాసే కాలానికి నవలా శిల్పం నేటి కాలానికివలె నిర్ధారితం కాలేదు. ప్రతిపాదితమూ కాలేదు. ఆధునిక కవిత్వలక్ష ణాలతోనూ అది ఉద్దేశించిన ప్రయోజనాలతోనూ, పోల్చి ప్రాచీన కావ్యసాహిత్యాన్ని విమర్శించినట్లు ఉండకూడదుకదా నేటి ప్రమాణాలతో బాపిరాజు నవలలను విమర్శించటం. 1933వ సంవత్సరంలో విశ్వనాథ సత్యనారాయణగారితోపాటు బాపిరాజు కూడా ఆంధ్ర విశ్వకళాపరిషత్ బహుమతిని అందుకొన్నారు. ఆయన 'నారాయణరావు' నవలకు. విశ్వనాథ 'వేయిపడగల' తో బాటుగా యూనివర్శిటీ బహుమానం ఇచ్చింది.

ఈ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప సంచలనాన్ని సృష్టించిన రచయితగా చలానికి అగ్రేసరమైన స్థానమున్నది. చలం చెల్లుబాటవుతున్న సమకాలీన సాంఘిక వ్యవస్థ పైన గొప్ప తిరుగుబాటు చేశాడు ఉవ్వెత్తుగా సాహిత్య తరంగాలతో విరుచుకొనిపడ్డాడు. ఉప్పెనలా పాత భావాలను ముంచాడు. కడలిలా రోదించాడు. గాలిలా తన ఉనికిని అందరికీ ఇష్టమున్నా లేకపోయినా తెలియజేశాడు. చలం సాహిత్యం ద్వారా సాధించింది వివాదాస్పదం. ఏభై అరవై సంవత్సరాల క్రితం సాంఘిక వ్యవస్థ పూర్తిగా అర్థం చేసుకొంటే కాని చలం రచనలు, అవి ప్రతిపాదించే సిద్ధాంతాలూ అర్థంకావు. నాటి సాంఘిక వ్యవస్థలో ప్రచురంగా కనపడిన పురుషుని దౌష్ట్యం. ఆత్మ వంచన, అల్పత్వం, నీచత్వం, చలానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనికితోడుగా స్త్రీలు అన్యాయానికి, వంచనకు, బానిసత్వానికి, గురికావడంచూసి, ఆయన ఓర్చుకోలేక పోయినాడు. చలం రచనలకు ఆనాడు చలం దర్శించిన సంఘమే చాలా వరకు ప్రోద్బలకమై ఉంటుంది. ఆయన వ్రాసిన అమీనా, బ్రాహ్మణీకం. దైవమిచ్చిన భార్య, మైదానంవంటి నవలికలలో ఆయనకు ఎదురైన సాంఘిక ప్రతినిధులనే ఆయన చిత్రించి ఉండవచ్చు. ఆయన దర్శనం వేరు. అది ఆయన దృష్టితో చూస్తే ఆర్థంకావలసిందే. మానవ ప్రకృతిలోని అతిబలమైన ప్రవృత్తిని ఆయన అర్థం చేసుకొన్నట్లుగా, అద్దం పట్టి చూపినట్లుగా, విశ్లేషించి వివరించినట్లుగా, సమకాలీన రచయితలెవ్వరూ అర్థం చేసుకోలేదని, చలాన్ని మెచ్చేవాళ్ళు అంటారు. చలం గొప్ప భావుకుడు. కవి. ఉద్రేకి ఈ లక్షణాలు ఆయన సర్వరచనలలోనూ కనపడుతూ వుంటాయి. సాంఘిక ప్రబోధంకోసం, సంఘ సంస్కరణంకోసం, చలం రచనలు చేసిఉంటే, అవి కవిత్వధోరణిలోనూ, ప్రతీకాత్మకంగానూ, మార్మికంగానూ ఉండటం, ఎంతవరకు ఆయన ఆశించిన ప్రయోజనాన్ని సిద్ధింప చేశాయో, ఆ చలానికే తెలియాలి. చలం ఘోష, చలం భాష, అసామాన్యమైనవి. సామాన్యుడికి అర్థమయ్యేవికావు. సాంఘిక పరిణామాలు, ఆర్థిక, రాజకీయ పరిణామాల మీద, ప్రపంచవ్యాప్తమైన అనేక ఉద్యమాలమీద ఆధారపడి ఉంటాయి. రైళ్ళు, కాఫీ హోటళ్ళు సినిమా హాళ్ళు, వార్తాపత్రికలు, నిత్య జీవితాన్ని సాంఘిక వ్యవస్థలో ప్రభావితం చేసినంతగా చలంగాని, విశ్వనాథలుగాని ప్రతిపాదించే సిద్ధాంతాలు, సాహిత్యరచనలు ప్రభావితం చేయలేవు. ఇట్లా చెప్పటం సాహిత్య ప్రభావాన్ని కించపరచటంకాదు. చలం సిద్ధాంతాలను చెనకటమూకాదు.


తెలుగు నవలాసాహిత్యంలో ఈ కాలవిభాగానికి చెందిన మరొక ప్రతిభావంతుడైన నవలా రచయిత నోరి నరసింహశాస్త్రీ, ఈయన పండితుడు. వ్యుత్పన్నుడు. చారిత్రక నవలా రచనలోనే ఈయన ప్రత్యేకించి కృషి చేశారు. అదిన్నీ తెలుగుదేశపు చరిత్రకు సంబంధించిన నవలలే వారు వ్రాశారు. రుద్రమదేవి, నారాయణ భట్టు, కవిసార్వభౌముడు, కవిద్వయము, ధూర్జటి, మల్లారెడ్డి, మొదలైన నవలలన్నీ , తెలుగుల చరిత్రకు ఔజ్జ్వల్యం చేకూరుస్తూ రచించారు. చారిత్రక నవలలు వ్రాయటంలో, నాటి సామాజిక వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, భావుకతాస్ఫోరకంగా, పాత్రచిత్రణలో సజీవతా రామణీయక స్ఫూర్తితో, ఇతివృత్త నిర్మాణం చేయడం నోరి వారి రచనా విశిష్టత. రాణివాసపు గాథలు,రాచవీరుల పరాక్రమ కథనాలూ కాకుండా, కవిమూర్ధన్యుల కమనీయ జీవితవృత్తాంతాల చుట్టూ కథలల్లడం, నోరి వారి చారిత్రక నవలల్లో చూడవచ్చు. బహుముఖమైన శాస్త్ర పాండిత్యము, వైదుష్యము, కావ్య నాటకాలంకారిక విజ్ఞానము, అనుసంధించి పాత్రచిత్రణం చేయటం, యుద్ధ ఘట్టాలు వర్ణించవలసినప్పుడు ఆశ్చర్యావహమైన విషయ వివరణమూ, నోరి నరసింహశాస్త్ర గారి చారిత్రక నవలల్లోని విశిష్టత. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నంచేసిన మహా కవుల జీవితకాలాలకు సంబంధించిన చరిత్ర అంతా నవలలుగా నోరి వారు రూపొందించినట్లే చెప్పవచ్చు. కవిత్రయం వారి జీవితాలకు సంబంధించి నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి నవలలు, శ్రీనాథ పోతనల జీవితాలకు సంబంధించి కవిసార్వభౌముడు. కవిద్వయం నవలలు, ధూర్జటి మహాకవి జీవితానికి సంబంధించిన ఇటీవలి నవల ధూర్జటి, తెలుగు నవలల్లో చారిత్రక నవలా విభాగంలో చెప్పుకోదగినవి.

గొప్ప సాహిత్యవేత్తగా, మహాకవిగా తెలుగుదేశానికి పరిచయం కాక పోయినా యోగీశ్వరుడు, మంత్రద్రష్ట, తపస్వి వాసిష్ఠ గణపతిముని తెలుగులో నవలా రచనకు పూనుకోవడం ఆధునిక యుగంలో తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప విశేషం. ఈ నవలను ఆయన సంస్కృతంలో వ్రాయాలని మొదట్లో సంకల్పించి ప్రారంభించినా, తరవాత మనసు మార్చుకొని తెలుగులో ప్రారంభించి కొన్ని ప్రకరణాలు రచించటం తెలుగుభాషకు గొప్ప గౌరవం అని చెప్పాలి. గణపతిముని అత్యంతాధునిక దృక్పథం కలవారు. స్వాతంత్ర్యోద్యమంలో కూడా పనిచేశారు. తమిళనాడు కాంగ్రెసుకు స్వల్పకాలికంగా అధ్యక్షులుగా కూడా ఉన్నారని తెలుస్తున్నది. అంటరానితనాన్ని నిరసించారు ఆధునిక భారతదేశం అనుసరించవలసిన రాజ్యాంగాన్ని కూడా ఆయన సంస్కృతంలో రచించినట్లు తెలుస్తున్నది. గణపతి ముని గొప్ప జాతీయవాది, సంస్కృత భాషాభిమాని. అరుణాచల యోగిని రమణ మహర్షిగా లోకానికి వెల్లడి చేసింది గణపతిముని అని వారి జీవిత చరిత్రనుబట్టి తెలుస్తున్నది. గణపతి ముని సంకల్పించిన ఈ నవల ఆయన సంపూర్ణంగా రచించలేదు. రెండువందల ప్రకరణాలలో బృహత్తరమైన ప్రణాళికతో అనన్య సాధ్యమైన ఐతిహాసిక నవలగా ’పూర్ణ’ అనే పేరుతో ఈ నవల వ్రాయాలని గణపతి ముని సంకల్పం. కాని ముప్ఫై అధ్యాయాలు మాత్రమే ఆయన రచించటం జరిగింది. గణపతి ముని ఈ నవలను సంపూర్ణంగా రచించి ఉన్నట్లయితే, అఖిలభారతీయ భాషలలో దేనికీలేని విశిష్టమైన, అద్వితీయమైన ఘనగౌరవం తెలుగు సాహిత్యానికి లభించి ఉండేది. గణపతి ముని రచించిన ఈ 'పూర్ణ' నవలలోని ముప్ఫై ప్రకరణాలు సుప్రసిద్ధ సారస్వత మాసపత్రిక భారతిలో 1937 సంవత్సర ప్రాంతంలో అచ్చైనాయి. భారతి సంపాదకులు స్వర్గీయ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఈ నవలను నిరుపమానమైనదిగా ఆప్పుడు పేర్కొన్నారు. ముప్ఫై ప్రకరణాలు మాత్రమే ప్రచురితమై ఆగిపోయిన ఈ నవల ఇంచుమించుగా పాతిక సంవత్సరాల తర్వాత సంగ్రహరూపంలో 'సత్య ప్రభ' పేరుతో వెలువడింది. గణపతి ముని కుమారుడే 'వాసిష్ఠ' అనే పేరుతో, తండ్రిగారి ప్రణాళిక లో కథాభాగాన్ని అనుసరించి మార్పులు కొన్ని చేసి యథాశక్తి 'సత్య ప్రభ' నవలను ప్రచురించడం జరిగింది. ఇది చారిత్రక పౌరాణిక నవల.

కవిత్వంలో భావకవిత్వ ధోరణులనుంచి ఆధునిక కవిత్వ మార్గాలలోకి ఆడుగు పెట్టినట్లుగా నవలా రచనలో కూడా 1940 వ సంవత్సరం తరవాత ఇతివృత్తంలోనూ, శిల్పంలోనూ, నిర్వహణంలోనూ, నవీనమైన పంథాలు బయలు దేరినాయి. మనోవిశ్లేషణం, తాత్విక చింతన, రాజకీయ సిద్ధాంత విశ్లేషణం, మొదలైనవన్నీ నవలల్లో కూడా చోటుచేసుకొన్నాయి. అంటే సిద్ధాంత ప్రతిపాదనకు అనుగుణమైన పాత్రచిత్రణం చేసి సామాజిక పరిస్థితులను విశ్లేషించడం, వ్యాఖ్యానించడం రచయితలు ప్రారంభించారు.

దేశ భక్తి, జాతీయోద్యమం, పూర్వవైభవస్మరణం, స్వాతంత్ర్య ప్రబోధం, మొదలైన ఇతివృత్తాలు క్రమంగా సన్న గిలిపోయి, సామాజిక దృక్పథం, వాస్తవిక చిత్రణం ప్రాధాన్యం వహించాయి. కొడవటిగంటి కుటుంబరావు,గోపీచంద్, జి. వి. కృష్ణారావు, బుచ్చిబాబు, లు కొత్త తరహా నవలలు వ్రాశారు.

కొడవటిగంటి కుటుంబరావు సామాజిక సిద్ధాంతాలను గూర్చి స్పష్టమైన విశ్వాసాలున్న రచయిత. రాజకీయ వ్యవస్థనుగూర్చి, ఆర్థిక వ్యవస్థకూ సామా జిక దృక్పథానికీ గల పరస్పర సంబంధాన్ని గురించి అవగాహనవున్న వారు. వర్గ సంఘర్షణ, ఆర్థికమైన విలువలే సామాజికమైన తక్కిన విలువలన్నిటికీ పునాది అనే విషయమూ, ఆయన రచనల్లో ఎక్కువగా ప్రస్తావిస్తూవుంటారు. మధ్య తరగతి కుటుంబాల కృతక విలువలు, ఆత్మవంచనలు, భయాందోళనలు, ఆయన కథల్లోనూ, నవలల్లోనూ ఇతివృత్తాలు. ఆయన ఆశావాది. అతి వాస్తవిక రచయిత. కుటుంబరావుగారు చిన్న చిన్న నవలికలు చాలా రచించారు ఈయననవల 'చదువు' తెలుగులోని సామాజిక నవలల్లో పేర్కొనదగినది సుందరమనే మధ్యతరగతి కథానాయకుడు,తన జీవితంలో ఎదుర్కొన్న సన్ని వేశాలు, అనుభవించిన కష్టసుఖాలు, తటస్థించిన పాత్రలు, ఒక దృక్కోణంతో వర్ణించుకొంటూపోయినగాథ 'చదువు' నవలగా రూపొందింది. ప్రపంచ యుద్ధచ్ఛాయలు, నిరుద్యోగం, డిప్రెషన్, మధ్యతరగతి విలువలూ, కుటుంబరావు సున్నితమైన సునిశితమైన వ్యంగ్యంతో, కథేతివృత్తాలుగా స్వీకరిస్తారు. కుటుంబరావు రచనల్లోని తిరుగుబాటు ధోరణి తర్క సహంగా, సిద్ధాంత ప్రాతిపదికంగా ఉంటుంది.

జి. వి. కృష్ణారావుగారు రచించిన నవల "కీలుబొమ్మలు " విలక్షణమైన నవల. తెలుగుదేశంలో పల్లెటూళ్ళను ప్రభావితం చేసిన రాజకీయాలు, ఆధునిక నాగరకత పల్లెటూళ్ళను కూడా ఏవిధంగా ప్రభావించేసిందో ఆ వైనం, మనిషిలోని బాహ్యాభ్యంతర ప్రవృత్తులు, వాటి సంఘర్షణలు. పాపపుణ్యాల భావనలు, ఆవి వ్యక్తి జీవితంలో ప్రసరింపజేసే ప్రభావాలూ, ప్రపంచంలో ఆదర్శాలు ప్రవచించడానికి, వాస్తవిక పరిస్థితులను ఎదుర్కొనడానికి మధ్య ఉండే అంతరం, మనిషిలో ఆహాన్ని కాపాడుకోవటానికి, పరువును పోగొట్టుకోకుండా ఉండటానికి, నిరంతరం చెల రేగే తాపత్రయమూ, ఈ నవలలో రచయిత వర్ణించారు. ఎన్నో పాత్రలు, నాటి సామాజిక పరిస్థితులకు ప్రతిబింబాలుగా ఈ నవలల్లో కనపడతాయి. జి. వి. కృష్ణారావుగారు "పాపికొండలు" పేరుతో ఒక నవలను కొంతదూరం వ్రాశారుకాని, దానిని ముగించినట్లు తోచదు. తాత్త్విక చింతన, మనోవిశ్లేషణ, సామాజికావగాహన, సమర్థవంతంగా నిర్వ హించగలిగిన నవలారచయితలలో శ్రీకృష్ణారావుగారొకరు.

శ్రీ గోపీచంద్‌ది ఒక విలక్షణమైన దృక్పథం. విలక్షణమైన శైలి. ఆయన ఆ సమర్థుని జీవయాత్ర మొదలుకొని అసంపూర్ణంగా వదిలి పెట్టిన "చీకటి గదుల" వరకూ, ఆయనలోని తాత్త్విక చింతన ఏయే అగాథమైన లోతులను సృశిస్తూ వచ్చిందో, ఏయే ఉన్నత శిఖరాల విహరిస్తూ వచ్చిందో, క్రమ పరిణామశీలంగా గమనించవచ్చు. హేతువాదదృక్పథంతో జీవితంలోకి చొచ్చుకొనివచ్చి, పూర్ణ యోగందాకా ఎదిగిన నిరంతర పరిశ్రమ, సాధన, జిజ్ఞాస గోపీచంద్ జీవితంలోని విలక్షణతలు. “ఎందుకు”. అని ప్రశ్నించటంతో ముందుకుసాగి, గవేషణతో పరిభ్రమించి “ఇందుకు!" అని సమన్వయ ప్రతివాదన చేయగల ప్రతిభాశాలిత్వం గోపీచంద్ రచనలలో కనపడుతుంది. గడియపడని తలుపులు, పరివర్తన, పిల్లతెమ్మెర వంటి నవలికలలోనైతేనేమి. ఆసమర్థుని జీవయాత్ర, మెరుపుల మరకలు,పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, చీకటిగదుల వంటి నవలల్లో అయితేనేమి, గోపీచంద్ నిశితమైన మేథోసంపత్తి, తార్కిక ప్రజ్ఞ , పాత్రల మానసిక సంఘర్షణలలో నుంచి నిగ్గుతీసి ప్రదర్శించగల నేర్పు వ్యక్తమవుతాయి. గోపీచంద్ భాషకాని, వాతావరణ చిత్రణం కాని, అత్యంత సరళ సుందరంగా, స్వభావసిద్ధంగా ఉంటాయి, మెరుగులు,అలంకారాలు పాండిత్య ప్రదర్శకమైన విరుపులూ ఏవీలేకుండా ఉదయకాలపు ఎండవలె, సాయంకాలపు ప్రశాంతత వలె, ఆయన శైలి అత్యంత సహజంగా ఉంటుంది. సమాజంలో వివిధ స్థాయులకు చెందిన వ్యక్తులను, ఆయన నవలల్లో పాత్రలుగా ఎన్నుకొన్నాడు. ఆధునిక నాగరకతలో పైఅంతస్తులవాళ్ళూ, పల్లెటూళ్ళలో ఆధునిక విద్యా, నాగరకతల గాలిసోకని వాళ్ళూ , కళాకారులూ, పత్రికా రచయితలూ పారిశ్రామికులూ, శ్రామికులూ, ఎందరో గోపీచంద్ నవలల్లో దర్శనమిస్తారు. అసమర్థుని జీవయాత్రలో సీతరామారావు, మెరుపుల మరకల్లోని రాధారాణి, వంటి పాత్రలు మరుపురానివి.

బుచ్చిబాబు భావనలో, భాషలో, ఇతివృత్త నిర్వహణంలో, వర్ణనలు చేయడంలో అన్నిటా కళాకారుడు. ఆయన రచనలన్నీ వర్ణచిత్రాల లాగానే ఉంటాయి. ఒకేఒక్క నవల వ్రాసినా తెలుగునవలా సాహిత్య చరిత్రలో బుచ్చిబాబు, స్థిరంగా నిలిచిపోగలగటం 'చివరకు మిగిలేది’ అనే ఆయన నవల విశిష్టతను చాటి చెపుతున్న ది. ఆయన శైలి మాటలను రంగుల్లో ముంచి కుంచెతో బొమ్మ గీసినట్లుంటుంది. ఆయనలోని సౌందర్య పిపాస, ఆయన ప్రకృతి వర్ణనలలోనూ, స్త్రీ పురుషుల ఆకృతి వర్ణనలలోనూ కనిపిస్తుంది. మనుషులు పరస్పరం ఎందుకు అసహ్యించుకుంటారు. మానవజీవితంలో అపశ్రుతులకు కారణాలేమిటి? అనే విషయాలను ఆయన తరచి తాత్త్విక జిజ్ఞాసతో తనచుట్టూ ఉన్న సంఘాన్ని పరిశీలించి పాత్రలను సృష్టించాడు. బుచ్చిబాబు స్వీయచరిత్ర లోని ఏక దేశమైన 'ఆంతరంగకథనం' చదివితే బుచ్చి బాబు పరిశీలన, భావుకతా దృష్టి, భావావేశం అర్థంమవుతాయి. 'చివరకు మిగిలేది' నవలలో ఆయన సృష్టించిన కోమలి, అమృతం, ఇందిర, సుశీల, దయానిధి, జగన్నాథం, చిరకాలం నిలిచిపోయే సజీవమైన పాత్రలు. ఆధునిక విజ్ఞానం, ఖండాంతర సాహిత్యరీతులు, తత్త్వచింతన అన్నీ ఆకళింపుచేసుకొన్న వాడు బుచ్చిబాబు. అత్యంత గహనమైన విషయాలు, లలితకళా రంగంలో వచ్చిన, వస్తూవున్న ప్రయోగాలు, అవగాహన చేసుకొన్న వాడాయన. రసెల్ , మామ్, ఇలియట్ , ల వంటి అధునికులేకాక షేక్స్‌పియర్ , కాళిదాసులు కూడా బుచ్చిబాబు మేధాసంపదను ప్రభావితం చేసిన వారే. 1940 లలో మంచినవలను వ్రాసిన వారు రావూరి సత్యనారాయణరావు గారు వీరి నవల 'నెలవంక' కృష్ణాపత్రికలో ధారావాహికంగా వెలువడి తరవాత 1942 లోనూ 48 లోనూ రెండుముద్రణలు పొందింది. లలితమైన భాషలో గంభీరమైన ఇతివృత్తంతో, ఈ నవల చాలామంది పాఠకులను ఆకర్షించింది.

తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియకు బహుళ ప్రచారం కలగ జేసిన వాళ్ళుకొవ్వలి, జంపన, సోమరాజు రామానుజరావు మొదలైన వారు. కొవ్వలి, జంపనల నవలలను రైల్వే సాహిత్యమని కొందరు అధిక్షేపించవచ్చుగాని, పాఠకు లలో విపరీతమైన పఠనాసక్తిని పెంపొందించిన కృషి, గౌరవం నిస్సందేహంగా కొవ్వలికి చెందుతుంది. కొవ్వలి నవలల్లో అనుచిత శృంగార వర్ణనలు, మితిమీరిన కాముక ప్రవృత్తులూ ఏవీ లేవు ఉత్కంఠ, కుతూహలం రేకెత్తించే అపరాధ పరిశోధన నవలలు వ్రాసిన వారు సోమరాజు రామానుజరావు.

భారత స్వాతంత్ర్య సముపార్జనకు అవ్యవహితపూర్వంగా వ్రాసిన నవలలన్నిటా స్వాతంత్ర్యోద్యమ ప్రభావము , కారాగారాలు. సత్యాగ్రహాలు, విదేశ వస్త్ర బహిష్కారం, జాతీయ ప్రబోధం, మొదలైన విషయాలు ప్రసక్తం కావటం చూడవచ్చు. చారిత్రక నవల వ్రాసినా, పౌరాణికేతి వృత్తాన్ని స్వీకరించినా, ఏదో సందర్భం తీసుకొనివచ్చి పారతంత్ర్యంవల్ల జాతీయ జీవనానికి వాటిల్లుతున్న హాని, స్వాతంత్ర్యం సముపార్జించుకోవలసిన ఆవశ్యకత, ప్రబోధించేవారు రచయితలు.

ఈ శతాబ్దం ఉత్తరార్ధం ప్రవేశించడంతో తెలుగునవల ఇతివృత్తంలో కూడా చాలా మార్పు వచ్చింది. వారపత్రికలలో అన్నిటికన్నా ఆకర్షణ ధారావాహికంగా ప్రచురించే నవల కావడంతో, నవలా రచయితలకు ప్రోత్సాహం లభించింది. వారపత్రికలలో నవలలు ప్రచురించడం తప్పనిసరి అయింది. వి డి. ప్రసాదరావుగారి వంటి రచయితలు ఆంధ్రపత్రిక వారపత్రిక లో మినువాక , నాకబలివంటి నవలలు ప్రచురించారు. స్వాతంత్ర్యానంతరం వారపత్రికల, మాసపత్రికల సంఖ్య కూడా పెరిగింది.

స్వాతంత్ర్యానంతర సాహిత్యంలో ఎంతో వైవిధ్యం ప్రవేశించింది మధ్య తరగతి కుటుంబాల ఇతివృత్తాలు, సాంసారిక బరువు బాధ్యతలు, ఆశయాలు, ఆదర్శాలు జీవిత సాఫల్య వైఫల్యాలు, మొత్తంమీద విస్తృతసామాజిక చిత్రణ ప్రాధాన్యం వహించడం చూడవచ్చు.

ఆంధ్ర విశ్వకళా పరిషత్, పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించడం కోసం చారిత్రక నవలల పోటీలు నిర్వహించింది. శ్రీమతి మల్లాది వసుంధర ఈ పోటీలలో రెండుమూడు సార్లు బహుమానాలు గెల్చుకొన్నారు. ఈమె దూరపు కొండలువంటి సాంఘిక నవలలు కూడా వ్రాసినా, చారిత్రక నవలా రచయిత్రి గానే ప్రసిద్ధురాలు. ధూళిపాళ శ్రీరామమూర్తి, డా. పాటిబండ మాధవశర్మ, కొర్లపాటి శ్రీరామమూర్తి, మొదలైనవారు చారిత్రక నవలలు రచించారు. పిలకా గణపతిశాస్త్రి గారు కూడా కొన్ని చారిత్రక నవలలు రచించారు. వంగ దేశాన్ని ప్రభావితం చేసిన శరత్ చంద్రుడు, రవీంద్రుడు కూడా, అనువాదాల ద్వారా తెలుగుదేశాన్ని ప్రభావితం చేయడం జరిగింది. దేశికవితామండలి వంటి ప్రచురణ కర్తలు, శరత్ సాహిత్య సర్వస్వాన్ని తెలుగులో అందించారు అదేవిధంగా ప్రేమ్‌చంద్ , జైనేంద్రకుమార్ , కిషన్ చందర్ , ఇలాచంద్రజోషీ వంటి సుప్రసిద్ధ హిందీ రచయితల నవలలు కూడా ఆనువాదాలుగా తెలుగులో వెలువడ్డాయి.

యువతరం నవలారచయితలలో అగ్రగణ్యుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి సంప్రదాయ ఛాందసాలపైన తిరుగుబాటు చేసి కథారచనలో నవలారచనలో విప్లవపంథా లేవదీసినవాడు. ఈయన తొలినాళ్ళలో రచించిన నవల అల్పజీవి, పాఠకులను, సాహిత్య విమర్శకులను ఆకర్షించింది. బాహ్య సంఘటనలను మాత్రమే వర్ణించి కథాగమనాన్ని నిర్వహించడంకాక అంతర సంఘర్షణలను కూడా నేర్పుతో అల్పజీవి నవలలో విశ్వనాథశాస్త్రి చిత్రించారు. నవలా రచనలోనే కొత్త ప్రయోగం అల్పజీవి. ఇందులో కథానాయకుడు సుబ్బయ్య. భయస్థుడు. పిరికివాడు. అవమానాలను, పీడనలను కిమ్మనకుండా సహించడం అతడి రక్త లక్షణం. లంచాలు తీసుకోలేడు వంచన మాటలు మాట్లాడలేడు. నిర్భయంగా తల ఎత్తుకొని వీథివైపుచూడలేడు. భార్యమీద కూడా తన దర్పాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించలేడు చిన్న తనంలో అతడిలో సుప్తచై తన్యంగా ప్రవేశించిన భీరుత్వం, ఆత్మన్యూనతాశంకగా పరిణమించి, తానెందుకూ కొరమాలినవాడనుకొనే నమ్మకం అతడిలో స్థిరంగా కుదురుకొన్నది. దానికి అతడి జీవితంలో ఎదురైన అనేక సంఘటనలు, వాతావరణమూ కారణాలు. గవరయ్య కాంట్రాక్టరు. అతడు చిన్నతనంలో పువ్వుల్లో పెట్టి పూజించుకొన్న భార్య కాస్తా లేచిపోయింది. ఈ గవరయ్య చదువుసంధ్యలు రానివాడైనా డబ్బు సంపాదించి ప్రయోజకుడైనాడు. ఇతడి కనుసన్నల్లో రౌడీలు మెలగుతారు. ఈ గవరయ్య పాత్ర చిత్రణనుకూడా విశ్వనాథశాస్త్రి సమర్థవంతంగా నిర్వహించారు. ఇతనిలో ఏదో కసీ, ప్రతీకారమూ, సమాజాన్ని వంచించి దోచుకొనే రూపంలో సాక్షాత్కరం అవుతాయి. అందులో ఆశ్చర్యపడవలసిందిలేదు. గవరయ్య పాత్ర చిత్రణలో రచయిత సునిశితమైన ప్రతిభ చూపాడు. సుబ్బయ్య బావమరిది వెంకటరావుపాత్ర కూడా సహజమైనది. రెండు తరాల క్రింద సంఘంలో అటువంటి మనుషులు ఎక్కువ గానే కనపడేవాళ్ళు. పడిపోబోతున్న ఒక వ్యవస్థ యొక్క చిన్న చిన్న స్తంభాల లాంటి వాళ్ళు వెంక ట్రాపువంటి వ్యక్తులు. జమీందారులు ఆ వ్యవస్థ తాలూకు పెద్ద స్తంభాలు. దోపిడీ వ్యవస్థ మూల స్తంభాలు. పనీపాటలు లేకుండా, అన్యాయంగా ముందుతరాల వాళ్ళు ఆర్జించిన ఆస్తిపాస్తులతో విలాసజీవనం గడిపే కొందరు వ్యక్తులు వెనకటి తరాల్లో బాహాటంగా కన్పించేవాళ్ళు. వెంకట్రావులోని నయవంచన, ఔద్ధత్యం, డాబు, రచయిత నేర్పుగా వర్ణించాడు. ఇతివృత్తం, కథాకథనం, నిర్వహణం మొదలైన వీటన్నిటినీ మించి భాషావిషయికంగా అపూర్వతను సాధించాడు విశ్వనాథశాస్త్రి. ఇందులో ఆయన వ్రాసినభాష, వాక్య నిర్మాణం, అనితర సాధ్యం అనిపిస్తాయి. అన్నిటా నవ్యతను సాధించిన నవల అల్ప జీవి

పందొమ్మిదివందలయాభైలలో అల్పజీవి వచ్చింది. పందొమ్మిదివందల డెభై వచ్చేసరికి మరొక అద్భుతమైన నవలను తెలుగువాళ్ళ కందించారు విశ్వ నాథశాస్త్రి గారు.

'రాజు_మహిషి' అనే పేరుతో ఆయన వ్రాసిన నవల అది. ఇందులో రచయిత ప్రేమ, మనిషి, దైవం, న్యాయం, ధర్మం, సత్యం, మానవ జీవితంతో, ఏవిధంగా చెలగాట మాడుతూ, చెలామణి అవుతున్నాయో చిత్రించారు. "తెలుగులో సంతృప్తికరమైన కవిత్వం వచ్చినట్లు, కథలు వచ్చినట్లు, నవలలింకా రాలేదని నాదో చిర కాలపు ఫిర్యాదు ఉంది. ఈ నవల సమగ్రమైన మంచి నవలగా రూపొందుతుందని నాకు విశ్వాసం ఉంది " అన్నారు శ్రీ శ్రీ ఈ పుస్తకాన్ని గూర్చి వ్రాస్తూ. ఇది ఇరవైయ్యో శతాబ్దపు క్లాసిక్ గా నిలుస్తుందని శ్రీ శ్రీ మెచ్చారు. నిస్సందేహంగా గొప్ప నవల వ్రాసేరు విశ్వనాథశాస్త్రి గారు ఇందులోని పాత్ర చిత్రణలో అనంతమైన వైవిధ్యం చూపించారు రచయిత. ఛైర్మన్ భీమ సేనరావు, మందుల భీముడు, జమీందారు పురుషోత్తమరావు, రంగారావు, ప్రసాద్, మిస్ ప్రేమ, హెడియో, గేదెల రాజమ్మ, ప్రపంచంలోని చిత్రవిచిత్ర సహజ స్వాభావిక ప్రవృత్తులకు ప్రతినిధులు. ఆధునికసంఘంలో ఏయే వేళల ఏయే ప్రదేశాలలో ఏయే విధంగా దగా, కుట్ర, మోసం, వంచన అభ్యుదయ పరంపరాభివృద్ధిగా విజృంభిస్తున్నాయో, అన్న దాఖలాలతో యీ నవలలో చూడవచ్చు. భగవంతుడిపట్లా, ఆయన ఏర్పరచిన కర్మ సిద్ధాంతంపట్లా, ఈ నవల చదివినవాళ్ళకు సందేహాలు తప్పకుండా కలుగుతాయి. అది రచయిత గొప్ప ప్రతిభకు తార్కాణం. మునిసిపాలిటీలు,కోర్టులు, ఎన్నికలు, రాజకీయ పార్టీలు, గొప్ప గొప్ప ఇళ్ళవాళ్ళ రంకులు, బొంకులు, సారాకొట్లు, సానిసంసారాలు, ఒకటేమిటి మహాభారతంలో లేనిది లేదు అందే భూప్రపంచకంలో ఏదీ ఉండదు అన్నట్లుగానే ఆధునిక మహాభారతంలో ఈ వ్యవస్థలో జరుగుతున్న చరిత్ర అంతా సర్కస్ చూస్తున్నంత సరదాగా, సినిమా చూస్తున్నంత స్పష్టంగా చూపించారు రచయిత. ఇందులోని వర్ణనలు, భాష. భావ ప్రకటనలోని శక్తిసామర్థ్యాలు ఇదివరకు తెలుగు సాహిత్యంలో విన్నవీ కన్నవీకావు. చాలా శక్తిమంతమైనవి. సుమారు నాలుగు వందల పేజీల గ్రంథం యీ నవల. అయినా ఇది అసంపూర్ణం. తెలుగు నవలా సాహిత్యంలోనే ఇది బహుకాలం పేరు ప్రఖ్యాతులతో నిలిచివుంటుందనడానికి సందేహంలేదు

ఈ తరం రచయితలలో చెప్పుకోదగిన రచయిత శ్రీ మహీధర రామమోహనరావుగారు స్పష్టమైన రాజకీయ సిద్ధాంతపరిజ్ఞానం, విశేషమైన జీవిత ప్రత్యక్షానుభవం. చెప్పదలచుకొన్నది సూటిగా, సరళంగా చెప్పగల నేర్పుగల రచయిత వీరు.

ఓనమాలు, రథచక్రాలు, దవానలం అనే పేర్లతో, తెలంగాణాలో శతాబ్దంలో జరిగిన భూస్వామ్య వ్యతిరేకోద్యమాన్ని ఇతివృత్తంగా మూడు నవలలుగా వ్రాశారు రామమోహనరావు గారు. ఆనాటి కర్షకుల, కార్మికుల దయనీయమైన పరిస్థితులు, ఉద్యమసారథుల త్యాగజీవితాలు క్రూరమైన ఫ్యూడల్ రాజ్యాధికార యంత్రాంగపు చావుకళలు, సమర్థవంతంగా వర్ణించారు ఈ నవలల్లో రచయిత. ’కొల్లాయి గట్టితేనేమి?' అనే నవలలో ఈ శతాబ్ది ద్వితీయ పాదంలోని గాంధీజీ నాయకత్వం క్రిందసాగిన స్వాతంత్ర్యోద్యమం తెలుగుదేశాన్ని ఏవిధంగా ప్రభావితం చేసిందో వర్ణించారు. స్వయంవరణం వంటి సామాజిక సమస్యాత్మక నవలలను రచించారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందాలనీ, మగవాళ్ళతోపాటు అన్ని రంగాలలోను సరిసమానంగా నిలవాలని, రామమోహనరావుగారి నవలలు ప్రతిపాదిస్తాయి.

తెలంగాణలో భూస్వామ్యవ్యతిరేక పోరాటాన్ని వర్ణించే మరొక నవల వట్టికోట ఆళ్వారుస్వామి గారి 'ప్రజలమనిషి'. తరతరాలు అణగదొక్కిన, అక్షరాస్యతలేని, సామాన్య జనంలో చైతన్యం తీసుకొనిరావడానికి ఉద్యమ కార్యకర్తల కృషీ, వారి త్యాగ జీవితాలు, ప్రజలమనిషి నవలలోని ఇతివృత్తం. జాగిర్దారుల, భూస్వాముల, అధికారుల దౌర్జన్యాలు, క్రమంగా ప్రజలలో తమ హక్కులను గురించి, అగచాట్లను గురించి అవగాహన కలగటం, స్వర్గీయ ఆళ్వారుస్వామి చక్కగా వర్ణించారు. ఈయన 'గంగు' 'గిర్దావరు' మొదలైన నవలల్లో తెలంగాణా ప్రాంతపు సామాజిక జీవితాన్ని వర్ణించారు.

1050 వ సంవత్సరంలో వెలువడిన మరొక గొప్ప తెలుగు నవల ఉప్పల లక్ష్మణరావుగారి 'అతడు-ఆమె'. తెలుగు నవలాసాహిత్యంలోనే ఈ నవలకు ఆపూర్వమైన స్థానమున్నది. ఇందులో రచయిత చూపిన శిల్పం చాలా మెచ్చదగినది. ఆసాంతమూ, నాయికానాయకుల దినచర్య లేఖనంగా ఈ నవలను నిర్వహించారు. లక్ష్మణరావుగారు. ఈ నవలలో శైలి దానికదే సొటి, లక్ష్మణరావుగారి బహుముఖ ప్రజ్ఞ, విస్తారమైన లోకానుభవం, వివిధ దేశ పర్యటనానుభవం, పాండిత్యం ఈ నవలలో ప్రత్యేకమైన ముద్రతో కన్పిస్తాయి. ఎమ్. ఏ. ప్యాసై, క్వీన్ మేరీస్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న శాంత, సీమ నుంచి బారిస్టరై వచ్చిన చిదంబరణాశ్రీ ప్రేమించుకొని పెళ్ళిచేసుకొని, సంసారయాత్ర సాగించిన ఘట్టాలన్నీ ఎవరికి వారు వారి దృక్పథంతో డైరీలలో వ్రాసుకొన్నారు. ఈ విధంగా డైరీలలో ఇంత పెద్ద నవలను వ్రాయడం గొప్ప ప్రజ్ఞ అనే చెప్పాలి. భార్యా భర్తలిద్దరూ విద్యాధికులు, ప్రపంచ విషయాలన్నీ తెలిసినవాళ్ళు వీరి డైరీలలో నవల నంతా ఉత్కంఠను పోషిస్తూ నడపడం ఈ నవల ప్రత్యేకత. ఈ శతాబ్దపు రెండోపాదంలోని చెన్న పట్టణంలోని ఆధునిక సమాజం, తెలుగు దేశంలో వచ్చిన మార్పులు. రాజకీయాలు, ఎన్నికలు, ఖద్దరు, గాంధీఉద్యమం కోర్టులు, కేసులు, లావాదేవీలు, డాక్టర్లు, లాయర్లు, వాళ్ళ సంపాదనలు, ఒకటేమిటి ఎన్నెన్నో సంగతులు ఈ నవలలో చోటుచేసుకొన్నాయి.

తెలుగు నవలాసాహిత్యం శాశ్వతంగా ఋణపడి వుండవలసిన నవల వ్రాసినవాడు స్వర్గీయ తెన్నేటి సూరి. చంఘిజ్ ఖాన్ ఆ నవల. ఉత్తమ కళాఖండంగా ఈ నవల నాయన రూపొందించారు.తెలుగులో చారిత్రక నవలలన్నిటిలో ఇది కోటి కాంతుల కోహినూరులా తళతళ లాడే నవల. అద్భుతమైన నవల. భాషలో, భావ తీవ్రతలో, శిల్పంలో, తరతరాల నరజాతి చరిత్ర సమస్త విశ్లేషించిచూపడంలో, అనితరసాధ్యం నా మార్గం అంటుంది. యీ నవల ఇంగ్లీషులోనే దీనిని ఇంత గొప్పగా వ్రాయగలిగివుంటే (పాటలు, గేయాలు, మంచుగుట్టల వర్ణనల,గోబీ ఎడారిచలి, సూర్యోదయాస్తమాన వర్ణనలు, రెల్లు పూలు, పన్నెండో శతాబ్ది చైనాదేశపు సమగ్ర స్వరూపం, సంచార జాతుల సాహసాద్భుత జీవిత వృత్తాంతాలు, మంగోల్ జాతులన్నిటినీ సమీకృతం చేసిన మహావీరుడు,జగన్నియంత, భగవదంశ సంభూతుడుగా అరచేతిలో కకు డ్రేఖతో పుట్టినవాడని మంగోల్ జాతీయులు నమ్మిన చంఘిజ్ ఖాన్ మహా సాహసోద్యమాలను, ఇంగ్లీషులో వ్రాయకపోతే మానె. తెలుగు సాహిత్యంలో నవలకు, గొప్ప సేవ చేశాడు) అంతర్జాతీయ ఖ్యాతి, ప్రపంచ సాహిత్య బహుమానాలు తప్పక శ్రీ సూరి గెలుచుకొని వుండే వారు ఆయన ఎన్నేళ్ళు శ్రమించారో, మంగోల్ చరిత్రనంతా ఎంతగా పరిశోధించారో, ఎ దివ్యచక్షువులతో ఆ మహోజ్వల గాథ లన్నీ త్రవ్వి తీశారో, దర్శించారో, ఆ భావోద్విగ్నతను, ఆ ప్రజ్ఞను, ఆ వర్ణనలను, ఆ పాత్ర చిత్రణను తలచుకొంటే మహదానందం కలుగుతుంది. మహాద్భుత మనిపిస్తుంది. నివ్వెరపాటు ఆవహిస్తుంది. 'ఇతిహాసపు చీకటికోణం అట్టడుగునపడి కాన్పించని కథలన్నీ , కావాలిప్పుడు' అన్నాడు శ్రీశ్రీ. ధగధ్ధగాయమానమైన మణిని ఎత్తి తీశాడు సూరి. 'సదాపశ్యంతి సూరయః'-అని పెద్దలంటారు.

నరహంత, నరరూపరాక్షసుడు మహా క్రూరుడు అని చరిత్రకారులు కొందరు చంఘిజ్ ఖాన్ ను వర్ణించారు. ఒక్కొక్కడు ఒక మహాహంతకుడు- అని హంతకుల జాబితాలో చేర్చారు చంఘిజ్ ఖాన్ ను శ్రీశ్రీ కూడా. కాని ఈ నవల చదివితే ధర్మసంస్థాపనార్థం సంభవించినవాడు, అధర్మం అభ్యుత్థానం చెందినప్పుడు, దానిని రూపుమాపటానికి అవతరించిన మహావీరుడని, చంఘిజ్ ఖాన్ ను స్తుతించడానికి సందేహం కలగదు. ఈవిధంగా నిరూపించడానికి కావలసిన చారిత్రక సాక్ష్యాధారాలన్నీ శ్రీ తెన్నేటి సూరి పరిశ్రమించి సేకరించి అధ్యయనం చేసి, మహోజ్జ్వలమైన నవల వ్రాశారు. శ్రీ తెన్నేటి సూరి ఈ నవలను ఈ వాక్యాలతో ముగించారు. “పీడనవల్ల అగ్ని పుడుతుంది. 'చంఘిజ్ ఖాన్ ' దుర్భరమైన ప్రజాపీడనలో అవతరించిన జ్వాలా రేఖ. విధ్వంసకరమైన జ్వాలా రేఖ ప్రభవించరాదనేవారు మానవజగత్తులో భరించరాని ఈ ప్రజాపీడన యెందుకు వుండాలో సమాధానం చెప్పవలసి ఉంటుంది".

మంగోల్ జాతి ప్రజల నందరినీ సంఘటితం చేసిన చంఘిజ్ ఖాన్ తాను చేసిన పనిని గూర్చి ఇట్లా చెప్పుకుంటాడు. "ఆ దీనావస్థలోవున్న గోబీ ప్రజలను చూసుకుంటే నా హృదయం యెంత ఱంపపుకోతలు పడిపోయిందో మీరు ఊహించుకోలేరు. ఈ గోబీజాతులనందర్నీ ఏకైకజాతిగా సంఘటితపరచి శక్తివంతుల్ని చేయగలిగే వరకూ వీరికి విముక్తి లేదనే సత్యాన్ని నేను పసితనంలోనే అర్థం చేసుకున్నాను. ఇదే ఏకైక లక్ష్యంతో అహోరాత్రులూ, నేటివరకూ కృషి చేశాను.

'ఈ కార్యక్రమాన్ని కొనసాగించటంలో నేను అనేక ఆకార్యాలు చేశాను. ఈ లక్ష్యాన్ని సాధించటానికి అనేక కిరాతాలు చేశారు. జాతులకు జాతులనే తుడిచివేశాను..." ఏభై ఆరు ప్రకరణాలలో పన్నెండో శతాబ్దపు చరిత్రను ఉత్తమ కళాఖండంగా రూపొందించటం అసామాన్య ప్రజ్ఞాశీలికి మాత్రమేసాధ్యం, శ్రీ తెన్నేటి సూరి తెలుగు చారిత్రక నవలా రచయితల లో మహోన్నతుడు . మహోద్వేగంతో ఈ నవల నాయన వ్రాసినట్లు కనపడుతుంది. సమకాలీన ప్రపంచ చరిత్రను ఆకళింపు చేసుకొంటే ఆయనకు ఎన్నో సందేహాలు తలిగినయ్ . సంతాపాలు కలిగినయ్. చిక్కుముడులు ఎదురైనయ్. తన ప్రశ్నలకు సమాధానాల కోసం తీవ్రమైన అన్వేషణతో, తపనతో, ఆయన నిఖిల ధరాతల మానవ చరిత్రనే అధ్యయనం చేయటానికి పూనుకొన్నట్లున్నది. నలభై నాలుగో ప్రకరణంలో ప్రస్తావికంగా శ్రీ తెన్నేటి సూరి యీ వాక్యాలు వ్రాశారు.

"...పశుపక్ష్యాదులకు బుద్ధివుండదంటారు చాలామంది. ఈ వాచం ఎంత వరకు నిజమో మనకు తెలీదుగాని ఒక్కొక్కప్పుడు పశుపక్ష్యాదులు మానవుల కంటే వివేకంగా సంచరించిన ఉదాహరణలు మానవ చరిత్రలో ఎన్నో వున్నయ్ . పరస్పరం అర్థం చేసుకుని కలిసిమెలిసి బ్రతకటం బుద్ధి యొక్క ఆస్తిత్వానికి నిదర్శనమని అంగీకరించి, ఈ గుణం మానవులలోకంటే జంతువులలోనే యెక్కువగా కనిపించుతోంది. పరస్పరం అర్థంచేసుకుని కలసి, మెలసి బ్రతకటాన్ని బుద్ధికీ మానవత్వానికి ప్రధానపరీక్షగా తీసుకుంటే ఏ జంతుజాతుల్లోనూ , కూడా చేర్చటానికి వీల్లేనివ్యక్తులు మానవజాతిలో ఈనాడు నూటికి తొంభై ముగ్గురు తేలుతారు. అయినా జంతువులలో బుద్ధి, వివేచనాజ్ఞానం వున్నాయా? లేవా? అనే విషయం తేల్చాలంటే ఆయా జంతుజాతులు మాట్లాడుకునే భాషలు మనకు అర్థం కావాలి. వాటి భాషల జ్ఞానం మనకు లేకపోవటం చేత తేలికగా వాటిని బుద్ధి లేనివాటి క్రింద కట్టేస్తున్నాము. వాటిభాషలు మనకు యెలా అర్థంకావో, అలానే మనం మాట్లాడుకుంటున్న భాషలు పశుపక్ష్యాదులకు కూడా అర్థంకావు అందు చేత ఆవి మన్ని కూడా బుద్ధిలేని జంతువులని అనుకుంటే అనుకుంటూ వుండవచ్చు."

ఈ నవలలో శ్రీ తెన్నేటి సూరి ప్రకృతి వర్ణనలు పరమాద్భుతంగా చేశారు. తెలుగు నవలల్లో ఉత్తమోత్తమమైన పది నవలలను ఎన్నిక చేస్తే, సూరి వ్రాసిన యీ నవల మొదటి ఐదింటిలో ఉండకతప్పదు.

ఈ నవలను శ్రీ సూరి మంగోల్ ప్రజల చరిత్రను సముద్ధరించటానికి సర్వస్వం త్యాగం చేసిన హెన్రీ హెచ్. హేవర్త్ దంపతులకు అంకితం చేశారు. ఈ నవలకు రచయిత వ్రాసిన పరిచయం, అవశ్యం చదవదగినది. పండిట్ నెహ్రూ తన జీవిత చరిత్రలో 'Chenghiz Khan is my hero- చంఘిజ్ ఖాన్ నా ఆదర్శ వీరుడు'. అని వ్రాశారుట. తెలుగు సాహిత్యంలో శ్రీ సూరి పేరును శాశ్వతంగా నిలపటానికి ఈ ఒక్క నవల చాలు.

ఈ శతాబ్ది ఉత్తరార్ధం వచ్చేసరికి తెలుగు నవలలో కుటుంబ జీవనం ప్రధానేతివృత్తం అయింది. బలివాడ కాంతారావు మంచి నవలలు, నవలికలు - భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో ప్రచురించారు. గోడ మీద బొమ్మ, దగాపడిన తమ్ముడు, పుణ్యభూమి, సంపంగి, నాలుగు మంచాలు, వంటి మంచి నవలలు శ్రీ కాంతారావు ఎన్నో వ్రాశారు. ఆదర్శోన్ముఖమైన సామాజిక వాస్తవికతా చిత్రణం ఈయన నవల లన్నిటా కనపడుతుంది. మృదువైన భావన, అంతరికమైన వ్యక్తిత్వపు విలువలు, సుకుమారంగా సున్నితంగా శ్రీ కాంతారావు ప్రదర్శించగలరు. సజీవమైన రూపురేఖలతో, పాఠకుడి మనస్సుపై ముద్రవేసే పాత్ర చిత్రణం ఈ రచయిత ప్రత్యేకతగా చెప్పవచ్చు.

స్వర్గీయ శ్రీ భాస్కరభట్ల కృష్ణారావు వింత ప్రణయం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు, భవిష్యద్దర్శనం వంటి మంచి నవలలు వ్రాశాడు. ఆధునిక జీవితంలో మధ్యతరగతి కుటుంబాల ఆశలు, ఆశయాలు, కోరికలకు, వాస్తవిక జీవితాలకు సంఘర్షణలు సమర్థవంతంగా చిత్రించాడు. చైతన్య స్రవంతి అనే శిల్పం, అధివాస్తవిక రచన మొదలైన ఆధునిక ఆంగ్ల సాహిత్యపు పోకడలను శ్రీకృష్ణరావు బాగా అర్థం చేసుకొన్న వాడు. ఈయన సృష్టించిన పాత్రల్లో చాలా వైవిధ్యం కనపడుతుంది. ఉత్తమ మధ్యతరగతి కుటుంబాల సమస్యలు, హైదరాబాదు నగర జీవిత వాతావరణమూ భాస్కరభట్ల నవలల్లో కానవస్తాయి

స్వర్గీయ శ్రీసింగరాజు లింగమూర్తి రచనలన్నిటా భావుకత, సృజనశక్తీ కల మధ్యతరగతి స్వీయ జీవితానుభవం నగ్నంగా ప్రత్యక్షమవుతూవుంటుంది. చాలా పరిశీలనాశక్తి ప్రతిభవున్న మంచి రచయిత శ్రీ లింగమూర్తి, నిరలంకారంగా, వాస్తవిక జీవితం తననుతాను ప్రత్యక్ష పరచుకొంటుంది. శ్రీ లింగమూర్తి నవలల్లో 'ఆకర్షణలో అపస్వరాలు', 'ఆదర్శాలు- ఆంతర్యాలు', 'రంగుల మేడ' వంటి మంచి నవల లెన్నో వ్రాశాడాయన. స్వాప్నికజగత్తులో విహరించడం, యౌవనపు సమస్యలు. ఆసక్తికరమైన మలుపులు లేకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు, అత్యంత వాస్తవికంగా చిత్రించగల నేర్పు శ్రీ లింగమూర్తిది.

శ్రీ పోతుకూచి సాంబశివరావు ఉదయకిరణాల నవల ద్వారా మంచి నవలా రచయితగా పరిచయమైనాడు. మధ్యతరగతి కుటుంబాల చైతన్యం, ఆశావాదం, సంఘర్షణలు, రాజీలు, కలలు, కలవరింతలూ, నేర్పుగా కళాత్మకంగా చిత్రించగల ప్రతిభ శ్రీ సాంబశివరావుది. ఏడు రోజుల మజిలీ, అన్వేషణ వంటి మంచి నవలలు ఈయన వ్రాశాడు. ఈ జంటనగరాల సామాజిక, సాంస్కృతిక చైతన్యజీవితమంతా, అన్వేషణ నవలలో సాంబశివరావు ప్రతిభా వంతంగా ప్రదర్శించాడు. 'అన్వేషణ' నవలలో విస్తృతమైన కేన్వాస్ మీద, ఆధునిక మానవ జీవితాన్ని, ఆర్థిక రాజకీయ నైతిక సమస్యలను , అనంతమైన వైవిధ్యాన్ని ఈయన దర్శించి ప్రదర్శించడం జరిగింది

తెలుగు నవలాసాహిత్యంలో మేధావి వర్గ రచయితగా శ్రీ ఆర్. ఎస్. సుదర్శనంగారికి సముచితమైన స్థానమున్నది. తత్త్వచింతన, ఆర్థిక సాంఘిక రాజకీయ సమస్యల, దృక్పథాల సమ్యగవగాహన, ప్రయోగశీలత, శ్రీ సుదర్శనం గారి ప్రత్యేకతలు. రచయితగా ఈయన చాలా ఎదిగిన వ్యక్తిత్వం కలవారు, సాహిత్య ప్రయోజనాన్ని , అనుభూతి తీవ్రతను ఏకదేశంగా కాక, పూర్ణంగా దర్శించగలగటాన్ని, వీరి ఆలోచనను రేకెత్తించే విమర్శలద్వారా, అవగాహన చేసుకోవచ్చు. 1960 కి పూర్వమే శ్రీ సుదర్శనంగారు 'అనుబంధాలు' అనే మంచి నవలను వ్రాశారు. ఆటుతరవాత మళ్ళీ వసంతం అనే నవల వొకటి వీరిది వచ్చింది. ఇటీవల 'అసుర సంధ్య' అనే నవల వ్రాశారు. మనోవైజ్ఞానిక చిత్రణ, తాత్త్విక చింతన ఆలంబనంగా శ్రీ సుదర్శనంగారు పాత్రలను సృష్టిస్తారు.

శ్రీరంధి సోమరాజుగారి బాణే విలక్షణమైనది. భావుకుడు, సౌందర్య పిపాసి ఈయన. కళాకారుడి కుండవలసిన భావతీవ్రత సంయమనమూ కూడా పుష్కలంగా వున్న వాడు. ఆదర్శవాది. ఈయన వర్ణనలు కవితా ఖండికల్లాగా ఉంటాయి. ఎందుకు ఆలోచించరు? ఎందుకు సత్యాన్ని గ్రహించరు? ఎందుకు సమన్వయ దృష్టి నుండి దూరంగా తొలగిపోతారు? అనే తపన సోమరాజు గారి రచనల్లో ధ్వనిస్తుంది. 'ఆదర్శాలు అవరోధాలు' 'సౌందర్యం-సౌశీల్యం' 'దుఃఖితులు' సోమరాజు గారు వ్రాసిన చాలా మంచి నవలలు. ఈయన పరిశీలనా శక్తి అపారం పలుకుబడి విలక్షణం. “మీ బాధలు, మీ గాథలు అవగాహన నాకవు తయ్." అన్నట్లు, ఈయన పాత్ర చిత్రణ చేస్తారు. తన పాత్రలతో తనకేదో ఆత్మీయతా, తాదాత్మ్యభావమూ, తీవ్రమైన అనుభూతి దఘ్నంగా ఈయన రచనలుండటం వల్లనే, ఆ పాత్రలన్నీ సజీవంగా హృదయాన్ని తాకుతవి.

'హిత శ్రీ' రచించిన చిన్న నవలలు అంతర్వాహిని, సామాన్యుని కామన పేర్కొనదగినవి. మధ్యతరగతి కుటుంబపు విలువలను,సుతిమెత్తగా, హుందాగా, వ్యక్తీకరిస్తవి వీరి రచనలు. ఉత్తమ సంస్కారాన్ని, ఉదాత్తమైన భావాలను, దుర్భరంకాని వాస్తవికతలను ఈయన రచనలు ప్రతిబింబిస్తాయి.

ఇచ్ఛాపురపు జగన్నాధరావుగారి నవలలు 'గులాబిముళ్ళు' 'సుఖమూ- సుందరి' 'అందిన మేఘాలు' ' విజయ-శారద', మధ్యతరగతి కుటుంబాలలో అంతరికమైన ఉద్వేగాలు, భావుకతలు, ఇష్టానిష్టాలు, ప్రేమోద్విగ్నతలు, వర్ణించే నవలలు. మంచి పరిశీలనా శక్తి, కథాకథనాన్ని అందంగా నిర్వహించే నేర్పు, మానసికానుభూతుల ప్రకటీకరణశక్తి జగన్నాథరావుగారి రచనలలో కన్పిస్తాయి.

ఓగేటి శివరామకృష్ణ అనే రచయిత మధ్యతరగతి కుటుంబ గాథలను కథలుగా, నవలలుగా రచించారు. ఈయన వ్రాసిన 'మఱది' అనే నవల జాగృతి పత్రికలో ధారావాహికంగా పచురితమై పాఠకులను ఆకర్షించింది. ధనికొండ హనుమంతరావు, చౌడేశ్వరీదేవి, రావూరి భరద్వాజ అడుగుపొరల జీవితాలను వర్ణిస్తూ నవలికలు వ్రాశారు. ఇటీవల శ్రీ రావూరి భరద్వాజ రచించిన నవల 'పాకుడురాళ్ళు' యధార్థ జీవిత వ్యథార్త దృశ్యాలను ఆవిష్కరించింది. తెరమీద మెరిసే చలనచిత్ర జీవుల సంచలనాత్మక జీవితచిత్రాలను, తెర వెనుక గాథలను, అత్యంత వాస్తవికంగా శ్రీ భరద్వాజ తమ నవలలో ప్రదర్శించారు. తెలుగులో నూటికి నూరుపాళ్ళు వాస్తవిక నవల ఇది అని చెప్పవచ్చు. సినిమాతారల జీవితరహస్యాలు, సినిమాపత్రికల, పత్రికా రచయితల జీవితోదంతాలు, భరద్వాజ ఈ నవలలో విస్తృత ప్రాతిపదికపైన వర్ణించారు. ఇటువంటి నవలలు తెలుగులో ఇదివరకేవీ లేకపోవడం దీని ప్రత్యేకత.

1960 వ సంవత్సరం వచ్చేసరికి వారపత్రికలు నవలా రచనలో పోటీలు నిర్వహించడం, పెద్ద పెద్ద బహుమతులు ప్రకటించడం, అవి రచయితలనాకర్షించడం, ఎందరో కొత్త రచయితలు ప్రేరణ పొంది, వైవిధ్యంగల ఇతివృత్తాలతో నవలలు వ్రాయడం గమనించవలసిన అంశము.

1960 నాటికే కొమ్మూరి వేణుగోపాలరావు, వీరాజీ, గొల్లపూడి మారుతీరావు, మొదలైన యువరచయితలు నవలా రచయితలుగా సుప్రసిద్ధులైనారు. కొమ్మూరి వేణుగోపాలరావుగారి నవలలు పాఠకుల్ని బాగా ఆకర్షించాయి. ఈయన వ్రాసిన 'పెంకుటిల్లు' మధ్యతరగతి కుటుంబాలలోని కలిమిలేములను, కాంక్షలను, ఆంక్షలను, సహజసుందరంగా, సముత్కంఠను పోషించే రీతిలో వర్ణించింది కాబట్టి తారుణ్యపు తొలిరోజుల పాఠకులను ఎంతగానో ఆకర్షించింది. వైద్యవృత్తిని ఇతివృత్తంగా తీసుకొని ఇటీవల శ్రీ వేణుగోపాలరావు 'హౌస్ సర్జన్' అనే మంచి నవల వ్రాశారు.

శ్రీ పురాణం సూర్యప్రకాశరావు రచించిన 'జీవనగంగ' 'మారేమనుషులు ' ఆధునిక సమాజంలోని ఆటుపోట్లను వర్ణించడంతో పాఠకులను బాగా ఆకర్షించాయి. వీరాజీ వ్రాసిన “విడీ విడనిచిక్కులు', ' ప్రేమకుపగ్గాలు' 'ఎదిగి ఎదగనిమనుషులు 'తొలిమలుపు' నవలలు యూనివర్శిటీ చదువులు ముగిస్తూ, యౌవన ప్రాంగ ణంలో అడుగు పెడుతున్న యువతీయువకుల సమస్యలను చిత్రించే నవలలు

తెలుగు నవలలను గూర్చి ప్రస్తావించేటప్పుడు కీ. శే. శారద వ్రాసిన నవలలు మంచీ చెడూ, అపస్వరాలు, తెలుగు నవలాసాహిత్య చరిత్రలోనే నూతనాధ్యాయం సృష్టించినవని చెప్పాలి. శారద(ఆర్. నటరాజన్) రచయితగా స్వయంభువు, బలమైన విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా పైకివచ్చి, ఆకాశాన్ని , తనచుట్టూ వాతావరణాన్ని చూసి విస్తుపోయినట్లు, తానున్న సమాజమనే పాదులోంచి పుట్టిన రచయిత 'శారద', 'అపస్వరాలు' మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని అత్యంత సమర్థవంతంగా చిత్రించిన నవల. 'మంచి చెడు' ఆధునిక నాగరికతలోని మంచి-చెడులను, దిగువ తరగతి ప్రజల ఆర్థిక దుస్థితిని, వాళ్ళ జీవిత విధానాలను చిత్రించే నవల.

శంకరమంచి సత్యం, 'రేపటిదారి' అనే మంచి నవలికను వ్రాశారు. రానున్న తరం ఆమోదించి ఆదరించే విలువల ప్రస్తావన యీ నవల.

తాళ్ళూరి నాగేశ్వరరావు, ఎదగనిపువ్వు, ఆకలి-అవినీతి, కొత్త ఇల్లు మొదలైన మంచి నవలలు వ్రాశారు. కొత్త ఇల్లు, పాత కొత్తతరాల భావసంఘర్షణ ప్రతిపాదించే నవల. అవినీతి అనేది ఆకలికి సంబంధించిన సమస్య కాదని, కొందరి జీవితాలలో అది అపరిహార్యంగా ప్రవేశిస్తుందని ఆయన ఆకలి-అవినీతిలో సమర్థవంతంగా చిత్రించాడు.

'రాఘవ' శిఖరాలు - సెలయేళ్ళు, పరాధీన, వంటి నవలలు చాలా రచించాడు. ఈ రచయిత వర్ణనలు విలక్షణంగా వుంటాయి. ఉషఃశ్రీ, మథురాంతంకం రాజారాం, ఇటీవల నవలికలు ప్రకటించినా కథారచయితలుగా వాళ్ళు సుప్రసిద్ధులు.

వాసమూర్తి కోనేరు-సెలయేరూ, ఇహపరాలు, మంచి నవలలు. ఆదివిష్ణు, మంచి నాటక రచయితగా, కథారచయితగా ప్రసిద్ధుడైనా 'సగటు మనిషి' అనే మంచి నవలను కూడా ఇటీవల ప్రకటించారు. కొలకలూరి ఇనాక్ 'అనాథ' 'ఎక్కడుంది ప్రశాంతి'? మొదలైన మంచి నవలలు వ్రాశాడు. ఆనదల జీవితాలు, అడుగుపొరల మనుషులకు ఎదురయ్యే అన్యాయాలు ప్రతిభావంతంగా ఈ రచయిత చిత్రించగలడు. డా. అరిపిరాల విశ్వం ఇటీవల కొన్ని మంచి నవలలు ప్రకటించారు. కవితాత్మకంగా వుంటుంది వీరి శైలి. తాత్త్వికగవేషణ, మానవత్వపు లోతులను పరిశీలించడం, భావోద్విగ్నత వీరి రచనలలో కానవస్తాయి

రుద్రాభట్ల నరసింగరావు చాలా ఆశలు రేకెత్తించిన రచయిత. అయితే ఆయన పెద్ద నవలేమీ వ్రాయలేదు. ఆయన వ్రాసిన చిన్న నవలిక ఆదర్శ శిఖరాలు ఆయన ప్రతిభను చాటుతున్న ది. అవసరాల రామకృష్ణరావు "సంపెంగలు-సన్న జాజులు", "కనకాంబరాలు" మొదలైన నవలల్లో ఆధునిక సమాజస్వరూపాన్ని, ఆవిష్కరించారు. సామాజిక సమస్యల అవగాహన, చిత్రణ, చురుకైన శైలి, ఆహ్లాదకరమైన వ్యంగ్యం, రామకృష్ణరావు రచనలకు వైలక్షణ్యం చేకూరుస్తాయి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ ప్రతిభావంతుడైనరచయిత. “చంద్రుడికో నూలుపోగు” అనే మంచి నవలను వ్రాశారు.

ఇటీవల వడ్డెర చండీదాసు అనే ఆయన హిమజ్వాల అనే పేరుతో ప్రయోగాత్మకమైన నవల నొక దానిని ప్రకటించారు. చాలామంది పాఠకుల నాకర్షించింది ఈ నవల.

ఎన్. ఆర్. నంది నైమిశారణ్యం పేరుతో హరిజనులను అగ్రకులాల వారు నేటికీ ఏవిధంగా వంచిస్తున్నారో, హింసిస్తున్నారో వర్ణించారు. మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక సమస్యలు, స్త్రీలు ఉద్యోగాలు చేయడంలో అభ్యుదయ భావాలు బాగా ప్రచారమవుతున్న ఈ కాలంలో కూడా వాళ్ళు, ఎదుర్కోవలసిన కష్టాలు ఈ నవలలో ఆయన వర్ణించారు.

పోలాప్రగడ సత్యనారాయణమూర్తి ప్రతిభావంతుడైన రచయిత.

ఈయన కౌసల్య, సంఘంచేసిన మనిషి, దీపశిఖ, నవోదయం, భోగి మంటలు మొదలైన నవలలు, ఆధునిక సమాజంలో మానవత్వపు విలువలను ప్రస్తావించే నవలలు, చురుకైన హాస్యం, సులలితమైన భాష, సున్నితమైన వ్యంగ్యం, ఈయన రచనల విలక్షణతలు.

మంజుశ్రీ మానవతావాది. ఆర్ద్రమైన, సుకుమారమైన భావన చేయగలవాడు ఈయన వ్రాసిన “జారుడు మెట్లు", "నూరు శరత్తులు" మానవుల మమతలను పెంచేటందుకు దోహదం చేసే నవలలు.

వినుకొండ నాగరాజు రచించిన ఊబిలోదున్న ప్రయోగాత్మక నవల. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఈ నవల మంచి కశామాతం. ఈయన శైలిలో భావ వ్యక్తీకరణలో పదునుచూపగల రచయిత. యువరచయితలలో విలక్షణమైన శైలి. ఇతివృత్తవైవిధ్యం, గొప్పశిల్పం చూపగల రచయిత శ్రీ శీలా వీర్రాజు ఈయన వ్రాసిన నవల "మైనా" చాలా గొప్ప నవల. ఒక పోలీసు కానిస్టేబుల్ స్వీయ జీవితాత్మకంగా ఈ నవల సాగుతుంది. ఈయన చిత్రకారుడు కూడా కావడంతో, శైలిలో పదచిత్రాలతో ఒక విలక్షణమైక వాతావరణాన్ని సృష్టించగలరు. అంగర వెంకటకృష్ణారావు, ఘండికోట బ్రహ్మాజీరావు నెల్లూరి కేశవస్వామి, మొదలైనవారు విశాఖమండలం రంగభూమిగాను తెలంగాణా ప్రాంతం రంగభూమిగానూ కొన్ని మంచి నవలలు వ్రాశారు. స్వర్గీయ మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది కృష్ణాతీరం పేరుతో ఒక నవల వచ్చింది. అనితర సాధ్యమైన శైలీవిన్యాసం. ఇతివృత్త నిర్వహణం ఈ నవలలో కనపడతాయి.

పాతికేళ్ళ క్రితందాకా కొనసాగిన తెలంగాణా ప్యూడల్ వ్యవస్థాస్వరూపాన్ని, దానికి గురిఅయిన ప్రజల దయనీయమైన గాథలను శ్రీ దాశరధి రంగాచార్యులుగారు చిల్లర దేవుళ్ళనే నవలలో వర్ణించాడు. మోదుగ పూలు, మాయజలతారులాంటి ఇతర నవలలు కూడా వీరు రచించారు.

స్వర్గీయ కందుకూరి లింగరాజు 'సమర్పణ' అనే మంచి నవలను రచించారు. “మిగిలేదేమిటి", మొదలైన తదితరనవలల్లో భూడిదమ్ముల(?) మధ్య మానవ జీవితపరమార్థాన్ని జిజ్ఞాసాదృష్టితో వీరి రచనలు పరిశీలించాయి.

మాండలిక భాషలో నవలలు వ్రాయడమన్న ప్రయోగాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించిన ప్రత్యేకత శ్రీ పోరంకి దక్షిణామూర్తికి లభించింది. ఈయన గోదావరి మాండలికంలో వెలుగు, వెన్నెల-గోదారి, తెలంగాణా మాండలికంలో ముత్యాలపందిరీ, రాయలసీమ మాండలికంలో రంగవల్లి నవలలు వ్రాసి తెలుగునవలా సాహిత్యంలో వొక ప్రత్యేకశాఖను ప్రారంభించారు.

బహుళ ప్రచారం పొందకపోయినా గొప్ప నవలలు వ్రాసిన వారు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారు. వీరి ధర్మనిర్ణయం చాలాగొప్ప నవల తెలుగులో ఉత్తమోత్తమమైన పది నవలలు లెక్కించి చెప్పవలసివస్తే తప్పకుండా చేరవలసిన నవల. తిక్కన సోమయాజి, అన్నమాచార్యలు, అనే, చారిత్రక నవలలు కూడా శ్రీ రామలింగేశ్వరరావు గారు రచించారు. ఉత్తమమైన భారతీయ సంస్కృతిని. ఆర్ష ధర్మాన్ని, శ్రీరామలింగేశ్వరరావుకు తమ నవలలో ప్రతిపాదిస్తారు. ఆయన గొప్ప పండితుడు వ్యుత్పన్నుడు, మంత్రశాస్త్రవేత్త. ధర్మనిర్ణయం నవలలో ముస్లిం విద్యాధికురాలు, నారాయణరావనే హిందూ యువకుణ్ణి ప్రేమించడం, వారి ప్రేమపర్యవసానం, ఆనుషంగికంగా నారాయణరావు కుటుంబంలోని ఆధ్యాత్మిక సంస్కారం, రెండు మూడు తరాల క్రితం మన దేశంలో పల్లెటూళ్ళలో ప్రచురంగా కన్పించే మంత్రవిద్యలూ, యోగవిద్యలూ బహుముఖీనమైన ప్రతిభతో ఆయన వర్ణించారు. తిక్కన సోమయాజి నవలలో శ్రీ రామలింగేశ్వరరావుగారు చూపిన ప్రజ్ఞ నిరుపమానమైనది. తిక్కన సోమయాజి, సమగ్ర మూర్తిమత్వాన్ని అత్యుదాత్తంగా, పరమోజ్జ్వలంగా ఆయన రూపుకట్టించారు.

స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యంలో ప్రత్యేకించి సగర్వంగా పేర్కొనవలసింది మహిళలు అధిక సంఖ్యాకంగా నవలలు వ్రాయడం. సంఘంలో వచ్చిన మార్పులు, ఆర్థిక సాంఘిక వ్యవస్థలలోని పరివర్తనలు, కుటుంబ జీవితంలో స్త్రీలు నేడు నిర్వహిస్తున్న పాత్ర, ప్రత్యేకించి స్త్రీల సమస్యలు, తరాల అంతరాలు, అత్యధిక శక్తిమంతంగా మహిళ లెందరో నవలలుగా రూపొందించారు.

స్వర్గీయ పి. శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు, స్వాతంత్ర్యానంతరం వెలువడిన నవలలో మంచి నవల. ఉద్యోగాలు చేసుకొంటున్న మహిళల సమస్యలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలో అంటి పెట్టుకొని వుండే అభాసపు విలువలు ఈమె ఈ నవలలో శక్తిమంతంగా చిత్రించారు. శైలి, భావవ్యక్తీకరణం, నవీనాలు.

శ్రీమతి మాలతీచందూర్ రచించిన చంపకం, చెదపురుగులు, రేణుకాదేవి ఆత్మకథ, మేఘాల మేలిముసుగు, లావణ్య, మొదలైన నవలల్లో ఆధునిక సమాజ స్వరూపాన్ని ఆవిష్కరింపచేశారు. ఈమె ప్రతిభావంతురాలైన రచయిత్రి. ఇటీవల ద్వివేదుల విశాలాక్షగారు గ్రహణం విడిచింది, గోమతి, వారధి, కొవ్వొత్తి మొదలైన మంచి నవలలు ప్రకటించారు. ఆలోచనాత్మకమైన ధోరణిలో, చురుకైన శైలిలో, వాస్తనిక సమస్యలను ఈమె నేర్పుతో చిత్రించగలరు

శ్రీమతి రంగనాయకమ్మ తిరుగుబాటు రచయిత్రి. బలమైన శైలి, తీవ్రమైన భావావేశం, కళ్ళముందు కనపడుతున్న సాంఘిక సమస్యలు, తరతరాల పురుషజాతి స్త్రీలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా జేసి, అవివేకంలో వాళ్ళను అన్యాయంగా వుంచడం, సంఘంలో రావలసిన మార్పులు, బలిపీఠం, కూలిన గోడలు, స్త్రీ, అంధకారంలో, చదువుకొన్న కమల, రచయిత్రి, మొదలైన తమ నవలల్లో వర్ణించారు.

“బీనాదేవి" ఇటీవల రచించిన "హాంగ్ మి క్విక్ " ఆలోచనలు రేకెత్తించడంలోనూ, భాషలోనూ, భావాలలోనూ, శిల్పంలోనూ, ప్రత్యేకతను సంపాదించుకొన్న నవల. అతి నవీన శైలి, ఉగ్రవాద రాజకీయ సిద్ధాంత ఛాయలు, రాచకొండవారి అనుయాయిత్వం, ఈ రచయిత్రి రచనలలో కానవచ్చే లక్షణాలు.

వాసిరెడ్డి సీతాదేవి గ్రామీణ జీవితాన్ని, ఆధునిక సమాజ నగరీకరణాన్ని సమర్థవంతంగా చిత్రించగల రచయిత్రి. సమత, మట్టిమనిషి, మొదలైన నవలలు ఈమెకు గల సామాజికావగాహనను ప్రకటిస్తాయి.

ఇల్లిందల సరస్వతీదేవిగారు కథారచయిత్రిగా, నవలాకారిణిగా ప్రసిద్ధురాలు. యద్ధనపూడి సులోచనారాణిగారి నవలలు, తరుణులను ఇనుమిక్కుటంగా ఆకర్షిస్తాయి. కౌసల్యాదేవిగారి నవలల్లో స్వాప్నిక జగత్తు అందంగా సాక్షాత్కరిస్తుంది. పరిమళాసోమేశ్వర్ మధ్యతరగతి కుటుంబాల, ఆధునిక యువతీ యువకుల మనస్తత్వాలను తమ నవలల్లో నేర్పుగా చిత్రిస్తున్నారు సి ఆనందారామం చురుకైన శైలితో, భావోద్వేగంతో, ఇతివృత్త వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్న రచయిత్రి. తురగా జానకీరాణి, కోమలాదేవి, అబ్బూరి ఛాయాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, ఉన్నవ విజయలక్షి, కొలిపాక రమామణి వేదుల శకుంతల, డి. కామేశ్వరి, పి రామలక్ష్మి, కె రామలక్ష్మి, మాదిరెడ్డి సులోచన. ఈ విధంగా పేర్కొంటూ పోతే, ఇవాల్టి దిన, వార, పక్ష, మాసపత్రికా ప్రపంచాన్ని యథేచ్ఛగా పరిపాలిస్తున్న రచయిత్రీమణు లెందరినో గూర్చి వ్రాయవలసి వుంటుంది. వీళ్ళంతా ఆధునిక సమాజస్వరూపాన్ని, ముఖ్యంగా ఎగువ, దిగువ తరగతులకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాల సమస్యలను, పెళ్ళిళ్ళు, కట్నాలు, తరతరాల నుంచి వస్తున్న కుటుంబ సంప్రదాయాలను కాపాడుకోవటానికి పడే కష్టాలు, ప్రేమలు, ఆర్థికమైన ఇబ్బందులు, స్త్రీలు ఉద్యోగం చేయడంలో వాళ్ళు ఎదుర్కొనే అవాంఛనీయమైన పరిస్థితులు, వర్ణాంతర, కులాంతర వివాహాలు వాటి సాధక బాధకాలు, మొదలైన ఇతివృత్తాలు తీసుకొని నవలలు వ్రాస్తున్నారు. నేటి రచయితపై నేటి సినిమా ప్రభావం కూడా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

"లత" తిరుగుబాటు భావాలుగల రచయిత్రి. ఈమె చాలా నవలలు వ్రాసింది. మోహనవంశి, వారిజ, ఎడారిపువ్వులు, మొదలైన నవలలెన్నిటినో ఇతివృత్త వైవిధ్యంతో ఈమె రచించారు. ఈమెగారు వెలువరచే భావాలలోను, భావ ప్రకటనలోనూ, నవ్యతతోపాటు. ఆలోచనను రేకెత్తించగల ధోరణీ కనపడతాయి.

శ్రీమతి మాదిరెడ్డి సులోచనగారి నవలలను అధిక సంఖ్యలో పాఠకులాదరిస్తున్నారు. అందుకే అవి సినిమాలుగా కూడా రావడం జరుగుతున్నది. లలితమైన భాష, కమనీయమైన కథాకథనమూ, ఈమె నవలలోని ఆకర్షణలు.

"అరవింద" గారు వ్రాసిన నవలలు తాత్విక చింతనను, లోతైన ఆలోచనను, వాస్తవిక చిత్రణకు భంగం కలగని విధంగా ఆదర్శోన్ముఖత్వాన్ని ప్రతిబింబిస్తాయి

మొత్తానికి ఇప్పుడు మహిళ లెందరో మంచి నవలలు వ్రాస్తున్నారు. ఇది సమాజాభ్యుదయానికి శుభసూచనం. ఈ పాతిక సంవత్సరాలలో పాఠకుల సంఖ్యను ఈ మహిళల రచనలు ఎంతగానో పెంచాయి. గత పాతిక సంవత్సరాలలో మంచిరచనలు మహిళలనుంచే, ముఖ్యంగా నవలా ప్రక్రియకు సంబంధించి వెలువడినాయనడం అతిశయోక్తి కాదు.

తెలుగు నవల పుట్టిన శతజయంతి జరిగినా, శిల్పవిషయంగా, కొత్త కొత్త ప్రయోగాలూ, నవ్యధోరణులూ, విశేషించి ప్రవేశించలేదు. ఉప్పల లక్ష్మణరావుగారి తరవాత డైరీల రూపంలో గంగినేని వెంటటేశ్వరరావుగారు "పాము-నిచ్చెన" పేరుతో ఒక నవల వ్రాశారు.

సుప్రసిద్ధ కథానికా రచయిత శ్రీ పాలగుమ్మి పద్మరాజుగారు “రామరాజ్యానికి రహదారి " "నల్లరేగడి" "రెండో అశోకుని మూణ్ణాళ్ళ పాలన" మొదలైన నవలలు వ్రాశారు. జాతీయోద్యమం నాటి తెలుగుదేశం గూర్చిన నవలలు తెలుగులో తక్కువే వచ్చాయి. శిల్పమూ, భాషా, భావతీవ్రత, సమకాలిక సమాజావగాహన విలక్షణంగా చూపగల మేథావివర్గ రచయిత శ్రీ పద్మరాజు.

విద్యార్థుల సమస్యలు, యూనివర్శిటి జీవితము, హాస్టళ్ళలో ఉంటూ, పెద్ద తరగతులు చదువుకొంటూ, సామాజిక జీవితానికి తమనుతాము తరిఫీదు చేసుకొనే యువతరం వారి ఉద్వేగ ప్రవృత్తులు, నవీన్ ఇటీవల ప్రచురించిన తమ "అంపళయ్య" నవలలో వర్ణించారు. ఇందులో ఆయన నవీన శిల్పాన్ని ప్రదర్శించారు. చైతన్య స్రవంతి, అధివాస్తవికతాధోరణి ఈ నవలలో ఆయన ప్రవేశ పెట్టారు.

ప్రపంచ సాహిత్యంలో మణిదీపాలుగా పుట్టిన విశ్వవిఖ్యాత నవలలను ప్రతిభావంతులైన మేధావులైన రచయితలు, తెలుగులోకి అనువదించి తెలుగు నవలను సుసంపన్నం చేయటమూ జరిగింది. రోమారోలా "జీన్ క్రిస్టోఫ్" నవలను విద్యాన్ విశ్వం అనువదించారు. హోవర్డు ఫాస్ట్ నవల “స్పార్టకస్" ను ఆకెళ్ళ కృష్ణమూర్తిగారనువదించారు. గోర్కీ నవల ఆమ్మను క్రొవ్విడి లింగరాజు గారనువదించారు. స్వర్గీయు బెల్లంకొండ రామదాసు పెరల్. ఎస్. బక్ నవలను ప్రతిభావంతంగా అనువదించారు. రెంటాల గోపాలకృష్ణ, అలెగ్జాండర్ కుప్రిన్ నవల "యమరి ఎల్ హోల్"ను యమకూపం పేరున అనువదించారు. తెలుగులో ఈ నూరు సంవత్సరాలలో కనీసం పదివేల నవలలైనా వచ్చి వుండవచ్చు. అయితే ప్రపంచ సాహిత్య స్థాయిలో పదిమంది తెలుగు నవలా రచయితల పేర్లు చెప్పవలసివస్తే వారా, వీరా, అని తడుముకోవలసి వస్తుంది. పోనీ శరత్, ప్రేమచంద్, ఠాగూర్ లాగా, గొప్ప ప్రచారాన్ని పొందిన రచయితలైనా నవలా సాహిత్యంలో ఎందుకు లేరో తెలుగు వాళ్ళు ఆలోచించి సమాధానం చెప్పుకోవలసి వుంటుంది.


-:(0):-

ఇతర కాపీలు

[మార్చు]
  • భారత డిజిటల్లో లైబ్రరీ వారి మూలప్రతులు.[1]


Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.