తెలుగువారి జానపద కళారూపాలు/సిరిసిరిమువ్వల చిరుతల రామాయణం
సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం
చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాల వ్వాప్తిలో వుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.
ఊరు బయట విశాలమైన స్థలంలో ఒక కర్ర పాతి, దానికి జండాలు కట్టి, చిరుతలు పట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తారు. న్యాయానికి ఇది మన కోలాటం లాంటిదే అయితే వీరు ముఖ్యంగా కోలాటం పాటలు కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృంద సభ్యులే పాత్రలుగా వ్వవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమని పేరు వచ్చింది.
- పాత్రల ఎంపిక:
ప్రథమంలో బృంద సభ్యుల అకారాల ననుసరించి, పాత్రలను ఎంపిక చేస్తారు. తరువాత వేషధారణ లేకుండానే ప్రతి పాత్రకూ పాటను నేర్పుతాడు. ప్రతి పాత్రధారికీ క్షుణ్ణంగా పాట వచ్చి తీరాలి. ఈ విధంగా ఒక మాసం రోజులు గురువు బృంద సభ్యులతో రామాయణం శిక్షణ ఇస్తాడు. అభ్యాసం అయిన తరువాత రామ పట్టాభిషేకం వుంటుంది. ముఖ్యంగా సీతారామ పాత్రలు ధరించేవారు. ధనవంతుల ఇళ్ళలో చీరలు, పంచెలు, నగలు సంపాదించి వేషధారణను సమకూర్చుకుంటారు.
విశాలమైన స్థలంలో రామాయణానికి సంబంధించిన సన్నివేశాల ననుసరించి సినిమా సెట్సు మాదిరి, రావణాసురుని లంక, అయోధ్య, కిష్కింధ, ఇలా వేరు వేరు భాగాలను కట్టెలతో మంచెల్లాగా నిర్మిస్తారు.
ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహపరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గాన చేసి, ఉదయం శ్రీరాముని పట్టాభి షేక మహోత్సవం చేస్తారు.
ఈ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతారాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీత ఒడిలో పెట్టి,దేవతా మూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈనాడు
చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆదరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోట పల్లి, చెర్ల బూత్కూరు, చింత కుంట, వీణ వంక గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈ నాటికి పని చేస్తున్నాయి.