Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/సాతాని వైష్ణవులు

వికీసోర్స్ నుండి

సాతాని వైష్ణవులు

సాతానులు వైష్ణవమత సంప్రదాయానికి చెందిన వారు. శైవం, వీరశైవం ఆంధ్రదేశంలో విజృంభించిన తరువాత తెలుగుదేశంలో రామానుజుని వైష్ణవం ప్రవేశించింది. వైష్ణవ దేవాలయాల్లో గుడి సేవకులుగా ఒక శూద్ర వర్గం ఏర్పడిందనీ, వారినే సాతానులంటారనీ, ఆరుద్ర గారు ప్రజాసాహితీ సంచికలో ఉదహరించారు.

తమిళంలో "సాత్తదవక" అనే మాట నుండి సాతాని అనే మాట వచ్చింది. సాతాని అంటే మూసుకోని వాడు. సాతానుల్లో ముఖ్యంగా పురుషులు మూడు భాగాలను మూసుకోకూడదట. అవి.... తలను జుట్టుతో మూయకూడదు, తప్పని సరిగా గుండు చేయించుకోవాలి, రొమ్మున వున్న జంధ్యాన్ని మూయకూడదు. పంచెను మొల దగ్గర పట్టీతో మూయకూడదు. సాతానులు చక్రాంకితాలు వేయించుకుంటారు. శరీరమంతా సుందరంగా పంగనామాలను ధరిస్తారు. తులసి వేరులను తలచుట్టూ చుట్టుకుంటారు. తులసి హారాలను మెడలో అలంకరించుకుంటారు. గజకర్ణం అనే విసన కర్రను కుడిచేత పట్టుకుని, నెత్తిమీద అక్షయ పాత్రను పెట్టుకుని అళ్వారుల పాశురాలను పాడుతూ భిక్షాటన చేస్తారు. బలిజ వారినీ, కోమట్లనూ యాచిస్తారు. కీర్తనలతో వైష్ణవ ప్రచారం చేస్తారు.