తెలుగువారి జానపద కళారూపాలు/యామయ్య స్వామి నృత్యం
యామయ్య స్వామి నృత్యం
ఈ నృత్యం ఆంధ్రదేశంలో ఎక్కడా కనిపించదు. ఇది ప్రాంతీయ నృత్యం. ఇలాంటి ప్రాంతీయ నృత్యాలు ఆంధ్రదేశంలో అక్కడక్కడ వున్నా అవి ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేక పోయాయి. స్థానికంగానే పరిమితమై పోయాయి. అలాంటిదే ఈ యామయ్య స్వామి నృత్యం. అనంతపురం జిల్లాలో వుందని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్దిగారు తమ జానపద నృత్య కళారూపాలు గ్రంథంలో వివరించారు. యోగి వేమన శిష్యుల మంటూ ఒకప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి గుఱ్ఱంపై వస్తూ వుండగా గుఱ్ఱం ముందు భాగాన గొఱ్ఱె పొట్టేలు వచ్చేది. వారు ప్రతి గ్రామాన్ని పర్యటిస్తూ వెళుతూ వుంటే వీరికి భోజన సదుపాయాలు చేసేవారు.
యామయ్యస్వామి కాషాయ వస్త్రాలు ధరించి గుఱ్ఱం ఎక్కి వడివడిగా వచ్చేవాడు. ముందు పొట్టేలు పరుగెత్తేది. గ్రామస్థులందరూ అమిత భక్తి శ్రద్ధలతో ఆ దృశ్యాన్ని తిలకించే వారు. గుఱ్ఱం అడుగులతో కదను త్రొక్కేది. గ్రామ మధ్యలో గుఱ్ఱాన్ని సకిలింప జేసేవారు. ముందరి కాళ్ళను కళ్ళాన్ని లాగిపట్టి పైకి ఎత్తించే వాళ్ళు. ఇలా యామయ్య స్వామే గుఱ్ఱంతో చేయించేవాడు. గుఱ్ఱాన్ని ప్రేక్షకుల ముందు గుండ్రంగా త్రిప్పుతూ వుండేవాడు. ఈ కళా రూపం ఇటీవల కాలంలో మరుగున పడి పోయింది. ఇప్పుడు యామయ్య స్వాములు రావడంలేదు.