తెలుగువారి జానపద కళారూపాలు/భూమిక

వికీసోర్స్ నుండి

TELUGUVARI

JAANAPADA KALARUPALU

Dr. MIKKILINENI RADHAKRISHNA MURTHY

మొదటి ముద్రణ : 1992

ప్రచురణ సంఖ్య : 129

ప్రతుల సంఖ్య : 1500

ముఖచిత్రం : బాపు

©️ తెలుగు విశ్వవిద్యాలయం

వెల : 130 రూపాయలు


ప్రతులకు:

తెలుగు విశ్వవిద్యాలయం

ప్రచురణల విభాగం

పబ్లిక్ గార్డెన్సు, నాంపల్లి.

హైదరాబాదు - 500 004.


ముద్రణ : క్రాంతిప్రెస్, మద్రాసు - 600 001.

Center

భూమిక


పద్మభూషణ్
ఆచార్య
డా. సి. నారాయణరెడ్డి


తెలుగు భాషా సాహిత్య కళాసంస్కృతుల సర్వతోముఖ విలసనానికి, వికాసానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట ప్రకారం 1985 డిసెంబరు 2 వ, తేదీన రూపు దాల్చిన విశిష్ట విద్యాసంస్థ తెలుగు విశ్వవిద్యాలయం.

బోధన, పరిశోధన, ప్రచురణలతో పాటు విస్తరణ సేవ, రాష్ట్రేతరాంద్రులకూ, విదేశాంధ్రులకు సహాయ సహకారాల కల్పన వంటి బహుముఖీన కార్యక్రమాలను కూడ ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది.

పూర్వం వున్న అకాడమీలు, తెలుగు భాషాసమితి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, విలీనం కావడంతో విశ్వవిద్యాలయం, వివిధ పీఠాలు, కేంద్రాలు, విభాగాల సమాహారంగా వ్వవహరిస్తున్నది.

తెలుగు జాతి వైభవోన్నతులకు అద్దంపట్టే గ్రంథాల ప్రచురణ విశ్వవిద్యాలయ ప్రధానాశయాల్లో ఒకటి.

విశ్వవిద్యాలయంలో విలీనమైన అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవిశ్రాంత కృషి ద్వారా దేశ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సమకూర్చుకుంది.

1957 ఆగష్టు 7వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటైన ఈ అకాడమీ దేశం మొత్తంమీద ప్రప్రథమ రాష్ట్ర స్థాయి అకాడమి కావడం విశేషం.

ఈ అకాడమి ప్రామాణికమైన నిఘంటువులు, పదకోశాలు, కావ్యాలు, ప్రబంధాలు, వ్వాసాలు, విమర్శలు, కల్పనా సాహిత్యం, పరిశోధనాత్మక గ్రంధాలు, జీవిత చరిత్రలు, అనువాదాలు మొదలైనవి 163 గ్రంథాలు ప్రచురించింది.

తెలుగు విశ్వవిద్యాలయం, ఈ ప్రచురణ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు 123 గ్రంథాలను వెలువరించింది.

ప్రస్తుత గ్రంథం తెలుగు వారి జానపద కళారూపాలు.

నన్నయకు పూర్వంనుంచే తెలుగునాట బహుళ ప్రచారంలో వున్న జానపద కళారూపాల గురించి సమగ్రమైన అవగాహనతో రచించిన గ్రంథమిది.

తెలుగు నాటకరంగాన్ని గురించి, నటరత్నాల గురించి, లోగడ విలువైన గ్రంథాలు వెలువరించిన డా॥మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, తమకున్న పరిణతానుభావం ఫలితంగా ఈ రచనను రూపొందించారు.

నలభై ఏళ్ళకు పైగా జానపద కళారంగంలో మిక్కిలినేని గారు చేసిన సాధన, పరిశోధన, నిజానికి 800 వందల పుటల్లో ఇమిడేది కాదు.

అయితే కొన్ని అంశాలను క్లుప్తంగా వివరిస్తూ అన్ని కోణాలను ఉల్లేఖిస్తూ ఈ బృహత్ గ్రంథాన్ని రచించారు.

ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల కళారూపాలకు సంబంధించిన విశ్లేషణ ఇందులో ఇమిడి వుండటం విశేషం

ఈ పరిశోధన గ్రంథం జానపద కళాభిమానులకే కాకుండా, తెలుగు విశ్వ విద్యాలయంలో జానపద కళల శాఖ విద్యార్థులకూ విశేషంగా ఉపకరిస్తుంది.

విషయపుష్టమైన ఇంత చక్కని గ్రంథం రచించి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణగా వెలువరించే అవకాశం కలిగించిన డా॥మిక్కిలినేనిగారికి కృతజ్ఞతలు.

యథాపూర్వకంగా ఈ ప్రచురణ కూడ అందరి ఆదరాభిమానాలు చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.

హైదరాబాదు
3..1..92

ఆచార్య
సి.నారాయణ రెడ్డి,
ఉపాద్యక్షులు,
తెలుగు విశ్వవిద్యాలయం.