తెలుగువారి జానపద కళారూపాలు/జనసంపదే జానపద కళారూపాలు

వికీసోర్స్ నుండి

జనసంపదే
జానపద కళారూపాలు

నాటకరంగానికి మాత్రుకతై యుగయుగాలుగా; తరతరాల వైభవాన్ని సంతరించుకున్న జానపద కళారూపాలను గురించి ఈ తరంవారికి ఎవరికీ తెలియదనటం అతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం, తరగని వైభవం.

మన నాటకరంగానికి నూరేళ్ళు దాటాయి. అలాగే నాటకాలనే వృత్తిగా చేసుకొని బ్రతుకుతున్న సురభి నాటకరంగం ఏర్పడి కూడా నూరు సంవత్సరాలు దాటాయి. ఇటీవలనే చలనచిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంది. ప్రాచీన కళారూపాలను పునరుద్ధరించి ప్రగతిశీల దృక్పధంతో నూతన ప్రయోగంతో ఆధునిక పద్ధతులలో ప్రజల మధ్యకు పోయి కళారూపాలలో ప్రజాసమస్యలను జోడించి నవ చైతన్యం కలిగించిన ప్రజానాట్యమండలి ఏర్పడి నలభై ఏడు సంవత్సరాలైంది.

అయితే నూరు సంవత్సరాలకు ముందు నాటకరంగం లేనినాడు మన ప్రజలకున్న కళారూపా లేమిటి? అని మనం ప్రశ్నించుకుంటే మనకు కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలే.

జానపద కళారూపాలంటే ఈనాడు చాలామందికి అర్థం కావు. జనపదమంటే పల్లెటూరనీ జనపదంలో నివసించేవారు జానపదులనీ, వారు పాడుకునే పాటలుగాని, ఆటలుగాని, నృత్యంగాని, జానపద కళారూపాలనీ పెద్దలు నిర్వచించారు.

జానపద సాహిత్యమనీ, జానపద గేయాలనీ, జానపద నృత్యమనీ, జానపద సంగీతమనీ, జానపద వీధినాటకమనీ, తోలుబొమ్మలనీ, బుర్రకథలనీ, యక్షగానాలనీ, జముకుల కథలనీ, పిచ్చుకుంటుల 'కథ ' లనీ, పగటి వేషాలనీ ఇలా ఎన్నో వందలాది కళారూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్నీ కలిగించాయి. అయితే జానపద కళారూపాలంటే అవి శాస్త్రీయమైనవి కావనీ, అవి కేవలం పామరుల కళారూపాలనీ, పనికిమాలినవనీ, ఏమాత్రం శాస్త్రీయత లేనివనీ కొంతమందిలో దురభిప్రాయముంది. కాని సంగీతానికి, నృత్యానికి, ఎలాంటి శాస్త్రీయత వుందో అలాంటి శాస్త్రీయతే వీటికీ వుంది. జానపద కశారూపాలలో సంగీతముంది. తాళం వుంది, లయ వుంది, నృత్య ముంది, అభినయం వుంది, ఆహార్య ముంది, వాయిద్య ముంది, లయబద్ధమైన కలయికా క్రమశిక్షణ వుంది.

జానపద కళలు అతి ప్రాచీనమైనవి. మానవుల యెక్క అనుభూతులకూ, మానసిక చైతన్యానికి, విజ్ఞాన వినోదాలకూ అనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి. అన్ని కళలకూ పునాదులై అగ్రభాగాన నిలిచాయి.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండువేల సంవత్సరాల నాటిది. నాటి నుంచి నేటి వరకు ఆయా రాజుల కాలంలో రకరకాలుగా ఈ జానపద కళలు పోషించబడ్డాయి, ఆచరించబడ్డాయి. అభివృద్ది చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు కూడ పోషించ బడ్డాయి. ప్రజలు ఆదరించారు.

ఆదిమ కళారూపాల అభివృద్ధి లోనే శాస్త్రీయత ఉద్భవించింది. త్యాగయ్య గారి కృతులకూ, అన్నమయ్య గారి గేయాలకూ, ఎవరు స్వరాలు ఏర్పాటు చేశారు? ఎవరు తాళగతుల్ని ఏర్పరచారు? ఆదిమ జానపద కళలే లేకపోతే, ఈ శాస్త్రీయత ఎక్కడిది? శాస్త్రీయతకు పునాది జానపద కళలే, అయితే ఈ శాస్త్రీయత పేరు మీద జానపద సంగీతాన్ని శాస్త్రీయ సంగీత వాగ్గేయకారులు, జానపద నృత్యకళను, శాస్త్రీయ నృత్యకారులు, అలాగే జానపద సాహిత్యాన్ని, గేయ సాహిత్యాన్ని గ్రాంధిక భాషావాదులు, శాస్త్రీయత చాటున దాగిన ఛాందసులూ, జానపద విజ్ఞానాన్ని అణచివేశారు, సర్వనాశనం చేశారు. వాటికి ఆదరణ లేకుండా చేశారు. ఈనాడు ధనికవర్గాలు బలహీన వర్గాలను ఎలా అణచివేశాయో అలాగే జానపద కళలను కూడ భూస్థాపితం చేశారు. అలా అజ్ఞాతంగా జానపద కళలు ఆదరణ లేక అలా వుండి పోయాయి.

శతాబ్దాలుగా రాజులుపోయినా, రాజ్యాలు మారినా, జానపద కళలు మాత్రం ప్రజాహృదయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళలనూ, కళాకారులనూ, కన్నబిడ్డలుగా చూసుకున్నారు. తెలుగు జాతి గర్వించతగిన కళారూపాలవి.

నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక సాంకేతిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటివల్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గిపోయారు. కళారూపాలు కడుపుకోసం ఆ కళలనే పట్టుకుని దేశసంచారులుగా తిరుగుతూ కళా ప్రదర్శనాలను ప్రదర్సిస్తూ చాలీచాలని ఆదాయలతో కడుపు నింపు కుంటూ జీవిస్తున్నారు.

ఎందరో నిష్ణాతులైన కళాకారులు ఎందరో కీర్తి శేషులైనారు. ఎన్నో కళా రూపాలు చితికి జీర్ణమై కాలగర్బంలో కలిసిపోయి వాటి స్వరూప స్వభావాలు ఎలా వుంటాయో కూడ తెలియకుండా శిధిలమై పోయాయి. మరికొన్ని జీర్ణమౌతూ శిధిలావస్థలో వున్నాయి. సమిష్టి బృందాలు, సమిష్టి ప్రదర్శనాలు నాశనమై వ్వక్తిగత పాత్రలుగా, చిల్లర వేషాలుగా మిగిలిపోయాయి. ఆ వేషాలతో రైళ్ళలో, గ్రామాల్లో బస్టాండుల్లో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్నారు.


1976 మార్చిలో హైదరాబాదు జానపద కళోత్సవాలలో సన్మానింప బడిన కళోద్ధారకులు.

ఎడమనుంచి— 1. పరదా ఆదినారయణ 2.గోపాల్ రాజ్ భట్టు 3. డా. బి. రామరాజు 4. డా॥ మిక్కిలినేని 5. శ్రీనివాస చక్రవర్తి 6. డా॥ యశ్వీ జోగారావు 7. యం. వి. రమణమూర్తి.

మరికొంత కాలం ఇలాగే సాగితే ఈనాడు కొనవూపిరితో వున్న ఈ కళా రూపాలు కూడ దక్కవు.

ఒకనాడు జీవిత విధానానికి, విజ్ఞానానికి, వినోద, వికాసాలకు ఆలవాలమైన ఆ కళాసంపదను కాపాడుకోవాలి, వాటిని పునరుద్ధరించాలి.

జీర్ణించి పోతున్న ఈ జానపద కళారూపాలను ఎవరు పునరుద్దరించాలి? రాజులు లేరు, జమీందారులు లేరు, పోషకులు లేరు. ఇంతవరకూ ప్రజలే ఆదరిస్తున్నా అవి అంతంత మాత్రమే. ఆ ఆదరణ చాలదు. వారికి ఇళ్ళస్థలాలు లేవు, ఇళ్ళు లేవు. ఒక వూరంటూ కొంతమందికి స్థిరనివాసం లేదు. చివరికి కొంతమందికి ఓటు హక్కు కూడా లేదు.

ఇందుకు ప్రభుత్వ సాంస్కృతిక వ్వవహారాల శాఖ, అకాడమీ పూనుకోవాలి. ఇది వరకు సంగీత, సాహిత్య, నృత్య, నాటక, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేసి వాటికీ ఎలా పునరుజ్జీవం కలిగించాయే జానపదకళల పునరుజ్జీవనానికి ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేయాలి. లోగడ అకాడమీలూ ప్రభుత్వమూ ఈ కళపట్ల సవతితల్లి ప్రేమనే చూపించాయి.

జానపద కళల అకాడమీలో నిష్ణాతులైన వారిని, ఆ కళలో పరిచయమున్న వారిని ఆ కళతో సంబంధమున్న కళాకారులకు ఆ అకాడమీలో స్థానం కల్పించాలి.

ముందు ఆంధ్రప్రదేశ్ నాలుగు చెరగులా వున్న జానపద కళారూపాలేమిటి? వాటిలో జీవించి ఉన్న కళారూపాలెన్ని? అందుకు సంబంధించిన కళాకారులు ఎంతమంది వున్నారు? వారి పరిస్థితి ఏమిటి? వారు ప్రదర్శించే కళారూపం, దానికి సంబందించిన సంగీతం, సాహిత్యం, వేష ధారణ మొదలైన వివరాలు సేకరించాలి. కళారూపాల సాహిత్యాన్నీ, పాటలనూ, వాటి బాణీలనూ టేపు రికార్డు చేయాలి. వారి వారి కళారూపాలకు సంబంధించిన వస్తుసామగ్రినంతా భద్రపరచాలి. మిగిలివున్న కళారూపాలను ఫిల్ములుగా తీయాలి. ఉన్న కళాకారులకు గ్రాంటులను, పెన్‌షన్ లనూ ఇచ్చి వారిని పోషించాలి. ఆ అపురూప సంపదను రక్షించుకోవాలి. రాష్ట్రమంతటా బిక్కుబిక్కుమంటున్న కళాకారులను ఆదుకున్ననాడు ఎన్నో కళారూపాలు ఉద్దరింప బడడమే కాక, ఎందరో కళాకారులకు జీవనాధారం ఏర్పడుతుంది.

తిరిగి జానపద కళావికాసం కలుగుతుంది. మన కళారూపాలన్నీ దేదీప్య మానంగా వెలుగొందుతాయి. తరతరాల జానపద కళావైభవం వెల్లివిరుస్తుది.

నేటి ఆధునిక కళారూపాలతో పాటు జానపద కళారూపాలు కూడ నూతన వైభోగం సంతరించుకుంటాయి. నేటి తరాన్ని అలంరించటమే కాక, ముందు తరాల వారికి, చారిత్రిక కళారూపాలుగా నిలబడాయి. జాతి జీవితంలోనూ, అఖిల

భారత స్థాయిలోను చరిత్రాత్మకమైన జానపద కళారూపాలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాయి. అందుకే నా యీ చిన్న ప్రయత్నం.