Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/గంభీర నినాదం రుంజ వాయిద్యం

వికీసోర్స్ నుండి

గంభీర నినాదం రుంజ వాయిద్యం


ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు, ఈ రుంజ వాయిద్య కళా రూపం కూడ విశిష్టమైంది. అయితే ఈ కళారూపం ఆంధ్ర దేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నదని చెప్పలేం. కాని విశ్వ బ్రాహ్మణులు ఏ మూల నున్నా ఈ కళా రూపం వారి దగ్గరకు చేరేది.

విశ్వ బ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిని అరాధిస్తూ వారిపై ఆధారపడినవారు రుంజ వారు. రుంజ అనే వాయిద్య పరికరానికి రౌంజ అనే నామాంతరం కూడ వుంది. దీనికి సంబంధించిన ఒక కథ ఈ విధంగా ప్రచారంలో వుంది.

రౌంజ కాసురుడు:

ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినది చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పార్వతీ దేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వకర్మ రౌంజకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగరంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరించబడింది.

రుంజ:

రౌంజకుడనే రాక్షసుని చర్మాన్ని రుంజ ల్వాయిద్యానికి వినియోగించడం వల్ల, రౌంజ అనే పేరు ఏర్పడి, కాలక్రమేణ అది రుంజగా రూపాంతరం చెందింది. రుంజను ఇత్తడితో తయారు చేస్తారు, ఈ వాయిద్యాన్ని బలమైన కఱ్ఱపుల్లలతో వాయిస్తారు. ఏట వాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమిపట్టి, చేతులతో త్రాడును లాగి, శ్రుతి చేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజవారని పిలవటం కూడ వాడుకలో వుంది.

రుంజ వాయిద్యకులు ఒక వేళ వ్వవసాయాన్ని కలిగి వున్నా, ప్రధానంగా రుంజ వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిస్తారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసముతో పాటు ఈ విద్యను కూడ కట్టుదిట్టంగా ల్నేర్చు కుంటారు. ప్రతివారూ ఈ విద్యలో ఉత్తీర్ణులై, గ్రామాలకు యాత్రలు సాగిస్తారు. సంసారాలతో పాటు ఎడ్లబండ్లలో బయలుదేరుతారు. నిత్య జీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలైనవ వాటిని కూడ వారితోనే వుంచుకుంటారు.

ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. విశ్వబ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి వారికి ధన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు, వారి వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింపచేస్తారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ వారి ప్రదర్శనాల్లో ప్రదర్శిస్తారు.

రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా గమకాలనిస్తూ వాయించడంతో రుంజవారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.

పల్లెల్లో ప్రదర్శన:

గ్రామంలో ప్రవేశించిన రుంజవారు ఒక రాత్రి విశ్వబ్రాహ్మణులకు కథను వివరిస్తారు. పంచ బ్రహ్మలను గురించి, వారి యొక్క వంశోత్పత్తిని గురించీ చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం యెక్క అస్థిత్వాన్ని గూర్చి, పంచభూతముల యొక్క విధులనూ వివరంగా వివరిస్తారు.

పంచ బ్రహ్మలంటే మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ మొదలైన వారి విధులను గురించి ఈ విధంగా వివరిస్తారు.

మనువుకు ఇనుప పనీ, వద్దు కర్రపనీ, త్ర్వష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజునికి బంగారు పనీ ఈ విధంగా వేరు వేరు విధులను వివరిస్తారు. తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు.

వారు చెప్పే కథలు పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞము, విశ్వగుణా దర్శనము, వీర భద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనము, దేవ బ్రాహ్మణ మాహోత్మ్యము, మూల స్థంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ ప్రకాశ మండలము మొదలైన వాటిని కథలుగా చెపుతారు. వీటిన్నిటికి పద్దెనిమిది అశ్వాసాలు గలిగి సంస్కృత శ్లోకాల మయమైన, తాళ పత్ర గ్రంధం, మూల స్థంభం అధారమని చెపుతారు.

ఉదాహరణకు వారి అంబాస్తుతి ఈ విధంగా ఉంటుంది.

అంబా స్తుతి(కాంభోజి రాగం.)

కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం
అంబుజాక్షీవేలా................................॥అంబా॥

ముజ్జగము లేలేటి
మోక్షదాయీ మహమ్మాయీ
సజ్జన రక్షాగాల్
గజ్జలు ఘల్మనంగ.....................॥అంబా నీవిందు రావే॥

అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మారించి తరువాత చేతులతో ఒక తాళాన్ని వాయ్హిస్తారు. ఆ తరువాత పంచముఖోద్భవ బ్రహ్మలనూ, వారి వారి విధులనూ, శ్రోతలకు వివరిస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వకర్మ రక్షిస్తున్నాడంటూ సకల విశ్వం యొక్క కర్తవ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు. అలాగే

ఇండ్లు కట్టేదెట్లో ... పెండ్లి చేయుట యెట్లో
కృషి యెట్లో శకటాద్రి క్రీడ లెట్లో
కూప ఖననం బెట్లో... ఘోర సార్జన మెట్లో
పాకంబు లెట్లో.... జలపాత్ర లెట్లో
దేవతార్చన లెట్లో... దేవాలయము లెట్లో
భార్యకు నగలెట్లో ... పండమంచము లెట్లో
మంగళసూత్రము ... మద్దెలెట్లో
నిజము మాచేతి ... పనులనన్నిటిని లెస్స
వివరముగ లెక్క పెట్టగ యెవరి తరము
తెలివి గలిగి కృతజ్ఞులై తెలియవలయు
శాశ్వత పదాభిలేశ... విశ్వ ప్రకాశ

అంటూ, ఈ పదంలో పంచముఖ బ్రహ్మలొనర్చే అనేకమైన పనులను వివరిస్తూ వీరు లేకపోతే జగత్తు జరగ్బదనీ వివరిస్తూ వుంది.

పద్యాలనూ, శ్లోకాలనూ, తాళ వాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి పిల్లలకు నేర్పుతారు. అంతే గాక వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో భక్తి భావంతో వారు నేర్చుకుంటారు.

వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ క్రింది ఉదాహరణ చూస్తే మనకు అర్థమౌతుంది.

1.తక్కు ధిక్కు , ధిక్కు తకధిక్కు తకయని
అంబుజాసనుడు తాళంబు వేయ

అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలాలలో తాళం వేస్తారు.

2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ఘాతవేసి
తాళము చూపును మృదంగ ధ్వన్యనుకరణ చేయును.

3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట

అని తాళము చూపును.

4. కకుందకు ధరికిట తుతుందక యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు

అని చదివి వివిధ ధ్వనులతో చక్కగా మృదంగ వాయిద్యంలాగా వాయిస్తారని విశేషం రామానుజాచార్యులు గారు నాట్యకళ పత్రికలో ఉదహరించారు. ధ్వన్యనుకరణ పదాల్ని మౌఖికంగా చదివి ప్రయోగాత్మకంగా రుంజపై వాయిస్తారు. బ్రహ్మ, విష్ణు, సరస్వతీ దేవులు స్వరాలను తాళాలను మృదంగాలను వీణలపై చూపగా, మహేశ్వరుడు తాండవ నృత్యం చేశాడని తెలియచేస్తాడు.

శివతాండవం సందర్భంలో డమరుక ధ్వనిని వినిపించి మనోహరంగా హృదయతాండవం చేయిస్తారు. ఈ వాయిద్యపు శబ్దాలు మృదుమధురంగా వుంటాయి. మృదంగ ధ్వనిని అనుకరిస్తారు.

రుంజ వారిలో నిష్ణాతులైన కళాకారులు. ఇదే వాయిద్యాలపైన వివిధ ధ్వనుల్నీ అనుకరించి వాయిస్తారు.

అంతే కాక మిలిటరీ సైనికుల బూట్ల చప్పుడు మాదిరిగానూ, గుఱ్ఱపు కాలి డెక్కల ధ్వని మాదిరిగానూ, మార్చింగ్ బ్యాండు వాయిద్యంగానూ, వీరంగం సమయంలో వాయించే డప్పు ధ్వనులను అత్యద్భుతంగా ఈ రుంజు వాయిద్యంలో వినిపిస్తారు.

తమ రంజ వాయిద్య సందర్భంలో నాద బ్రహ్మను ప్రశంసించే ఈ క్రింది శ్లోకాన్ని కూడ వల్లిస్తారు.

శ్లోకం

చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.

ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగజేస్తారు.

అవే కాక నాదబ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంబికా స్తవాన్ని సమిష్టిగా రాగయుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు.

చెప్పే కథలు:

ఇలా ఒక గంట కాలం అనేక రకాలైన శ్లోకాలతో, పాటలతో వచనాలతో, వివిధ రకాలైన ధ్వనులను వినిపించి, కథను పూర్తి చేస్తారు. వీరు చెప్పే కథల్లో ముఖ్యమైనవి. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భావము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య శ్రావ్వమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపాలలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామాసుతుని బట్టి పాదారవిదములకు అనే పారంపర్యంగా వచ్చే మంగళ హారతినే వీరూ అనుకరిస్తారు.

ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోకమీసా లోకమనియా
లాకులేక కోక కరుణతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ॥ఓం॥

పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................॥ఓం॥

ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రీతి లేదని నిలిచి కొలిచిన......................॥ఓం॥

రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వకర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతిహాసం తెలియచేస్తూవుంది.

రుంజ కథకులు అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తారు. సర్కారాంధ్ర దేశంలో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ పాశంపాలలోచనుడు, జీడికంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ

రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నానాటికి శిధిలమై పోతున్న రుంజ వాయిద్య కళారూపం విశిష్టమైనది. దీనిని పరిరక్షించాల్చిన అవసరం ఎంతో వుంది.

ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు

గంగిరెద్దుల వాడు కావర మణచి
ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు

అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతిప్రాచీన కాలం నుంచీ ఈ గంగిరెద్దాటలు ప్రచారంలో వున్నాయని తెలుసుకోవచ్చు.

డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా
వురుకుతు రారన్నా రారన్న బసవన్నా
అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు
మునసబు గారికి దండంబెట్టూ
కరణం గారికి దండంబెట్టూ
రారా బసవన్నా, రారా బసవన్నా....

అంటూ

ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలను ఊపిస్తారు.