Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/ఆరెవారి గొంధళే వీధి భాగోతాలు

వికీసోర్స్ నుండి

ఆరెవారి గొంధళే వీధి భాగోతాలు


ఆంధ్రదేశంలో ఆంధ్రులకే తెలియని అరె జాతి వారనే ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వారు, అనేక మంది తెలంగాణా జిల్లాలలో వున్నారనే విషయం చాల మందికి తెలియదనటం అతిశయోక్తి కాదు. వీరు ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలలో ఎక్కువ మంది నివశిస్తున్నారు.

గొంధళీలు తెలుగు దేశానికి ఎప్పుడు ఎలా వచ్చి స్థిరపడ్డారో చెప్పడానికి సరియైన చారిత్రక ఆధారాలు లేవు. కాని ఆరె వాళ్ళు వలస వచ్చిన తరువాతనో, లేక వారిని అనుసరిస్తూనో వినోద ప్రదర్శనాలు ఇవ్వడం కోసం వచ్చి, తెలంగాణాలో స్థిరపడి వుంటారని ఊహించవచ్చంటారు.

ఏది ఏమైనా ఈ గొంధళీలు కూడ మధ్య తెలంగాణా లోని ఆరె వాళ్ళ మాదిరి గానే, రాయలసీమ లోని సురభి వాళ్ళకన్న, అరె మరాఠీల కన్న ఆతి ప్రాచీనులని చెప్పవచ్చునని, డా॥ పేర్వారం జగన్నాథంగారు, వారు పరిశోధించిన ఆరె జానపద సాహిత్యం తెలుగు ప్రభావం అన్న గ్రంథం షష్ఠమ తరంగంలో వివరించారు.

కుండలాకార నృత్యం:

కుండలాకార నృత్య విశేషంగా చెప్పబడుతున్న గొండిలి, గొండ్లి, తోలు బొమ్మలాటల్లోని గాంధోళి గాడు గొంధళి, అనే పదాలన్నీ ఒకే కుదురు నుంచి పుట్టి వుండవచ్చునంటారు జగన్నాథంగారు. బుర్ర కథ, తోలు బొమ్మలాటల వంటి కళా రూపాలు కూడా మహారాష్ట్రనుండి తెలుగు దేశానికి వచ్చాయన్న ప్రతీతి కూడా వుంది.

ఆరె వాళ్ళు మహారాష్ట్ర నుండి తెలుగు దేశానికి వలస వచ్చి కొన్ని శతాబ్దాల క్రితమే స్థిరపడిపోయారు. తెలుగు ప్రజల జీవితాలతో వారు పెనవేసుకుపోయినా ఇప్పటికీ వారి భాషా సంస్కృతుల్నీ అచార వ్వవహారాల్నీ నిలుపుకొంటూ వస్తున్నారు. వీరిని ఆరె వాళ్ళని, ఆరుకాపులనీ, అరె మారాఠీలని అర్య క్షత్రియులనీ, వివిధ పేర్లతో పిలుస్తున్నారు. వీరు ప్రాచీన కాలం నుంచీ ఆయుధోపజీవులుగా వున్నట్లు కనిపిస్తున్నారనీ, శాంతి సమయంలో నాగలి పట్టి నేల దున్నటం, యుద్ధ సమయంలో కత్తిబట్టి కదనరంగంలో క్షాత్ర తేజస్సును ప్రదర్శించడం వీళ్ళకు అనువంశిక సంప్రదాయమైనట్లు కనిపిస్తున్నదనీ వివరిస్తున్నారు.

గొంధళే వీథి భాగోతాలు:

ఆరె వాళ్ళు గ్రామాలలో అరె భాషలో... వీథి భాగోతాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనాలను ఆరె వారితో పాటు, తెలుగు వారు కూడ ఆదరిస్తున్నారు.

ఆరెవారిలో అంబీర__ ఇంగ్లే __ గుండేకారి __ గుగై __ దూదాటి షేక్ నారా __ సింధే __అనే ఇంటి పేర్లు గల గొంధళీ కుటుంబాలు సుమారు రెండు వందలదాకా తెలంగాణా జిల్లాలలో వున్నట్లు జగన్నాథం గారు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా వీరంతా మహాలింగంపల్లె__ వరి కోలు __ వేములపల్లి __ కోయలాయ __ వెంకటాపురం __ అలాగే కరీంనగర్ జిల్లాలలోని గోపాలపురం జోజూనూరుపల్లి మొదలైన గ్రామాలలో వున్నారు. రంగస్థల కళాకారులైన వారు ఎక్కువగా మహాలింగంపల్లెలో వుంటున్నారు. ఈ గ్రామానికి సోమదేవరపల్లి అని కూడ మరో పేరు వుంది.

గోంధళీ బుర్ర కథలు:

ఇంతకు పూర్వం తెలంగాణాలో గొంధళీలు ఒక ప్రత్యేక మైన పద్దతిలో వీరరసాత్మకాలైన కథలనూ, కరుణారసభరితాలైన కథలనూ బుర్ర కథలుగా చెప్పేవారట. ఈ కథలు చెప్పే బృందాల్లో కథకుడు పొడుగాటి బొందెల జుబ్బాను ధరించి, ధోవతి కట్టి, నెత్తికి రంగుతో కూడిన రుమాలు చుట్టి, గవ్వల హారాన్ని జెందెం మాదిరిగా ధరించే వాడట. ఒకడు మద్దెల వాయిస్తూ వుండగా, మరొకడు కిన్నెర వాయించేవాడట. ఇంకొకడు తాళం వేస్తూ వుండగా కథకుడు ఆరె భాషలో కథ చెపుతూ వుండేవాడట, అయితే ఆ విధంగా కథలు చెప్పే వారు ఈనాడు లేరట.

వీథి భాగోతాలు:

అయితే ఈ గొంధళీలు, మధ్య తెలంగాణా ప్రాంతంలో ఆరె వారు ఎక్కువగా వుండే గ్రామలకు వెళ్ళీ, ఈనాటికీ వీధి భాగోతాలు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనాలు చాల వరకు మన వీధి నాటకాల పోలికలోనే వుంటాయట. వీరి భాగోతాలకు హంగుదార్లుగా హార్మోనియాన్ని, మద్దెలనూ ప్రక్క వాయిద్యాలుగా ఉపయోగిస్తారట. వీరు ప్రదర్శించే కథా ఇతి వృతాలు, భారత గాథలకూ, జానపద గాథలకూ సంబంధించి వుంటాయి. మన వీథి నాటకాలలో మాదిరి విదూషకుడులా వీరి భాగోతాలలో హాస్య పాత్ర ప్రవేశించి ప్రేక్షకుల్ని హాస్యం ద్వారా కడుపుబ్బ నివ్విస్తుంది. అంతే గాదు మధ్య మధ్యలో ఆరె భాషను తెలుగులోకి అనువదిస్తూ వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి హాస్య పాత్ర సంస్కృత నాటకాల్లోని విదూషకుని పాత్రను పోలి వుంటుంది. రాజు పాత్రలకు అతి సన్నిహితంగా వుంటాడు. వీరి భాగోతాల్లో స్త్రీ పాత్రల్ని పురుషులే ధరిస్తారు. ఇక కథలో వచ్చే పాత్రల పేర్లన్నీ మహారాష్ట్ర సంస్కృతికి సంబంధించినవే వుంటాయి. అయితే మరికొన్ని పాత్రల పేర్లు తెలుగు పేర్లుగానే వుంటాయి. ప్రదర్శించే రంగ స్థలంలో ఒక పొడుగాటి గవ్వల హారాన్ని వ్రేలాడ దీస్తారు. ఈ దండను వారు అంబా భవానికి చిహ్నంగా ఆరాధిస్తారు. గొంధళీ కళాకారులు అరె వారి పారితోషికాలతోనే జీవిస్తున్నారు. తెలుగు ప్రజలు కూడ వారిని ఆదుకుంటున్నారు.

అయితే గొంధళీల భాగోత ప్రదర్శనలకిప్పుడు ప్రజాదరణ తగ్గిపోతూవుంది. అందువల్ల గొంధళీలలో చాల మంది వ్వవసాయాన్ని వృత్తిగా స్వీకరిస్తున్నారు. మరి కొంతమంది, వేరే వృత్తిలో జీవిస్తున్నారు. క్రమ క్రమంగా ఈ కళ క్షీణించిపోయే దశకు చేరుకుంది. ఇటీవల ఔత్సాహికులైన గొంధళే కళాకారులు ఈ కళను కాపాడుకోవడం కోసం మహాలింగంపల్లి కేంద్రంగా గొంధళే నాటక మండలిని స్థాపించుకున్నారు.

బాలవంతి కథా ప్రదర్శనం:

వారు ప్రదర్శించే ప్రదర్శనాలలో బాలవంతి కథ ఒకటి బాలవంతి కథలో రాజుకు సంతానం కలగదు. సంతాన ప్రాప్తికోసం తపస్సు చేసి

ఈశ్వరునివల్ల వరం పొంది రావలసిందిగా రాణి రాజును ప్రోత్స హిస్తుంది. మొదట రాజు అంగీకరించడు. ఐనా రాణి బలవంతం చేస్తుంది. రాజు తన రాజ్య భారాన్ని లింబోజీ ప్రధానికి అప్పగించి తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాతాడు. ఆ సందర్బంలో వారిరువురి మధ్యా ఇలా సంవాదం జరుగుతుంది.

బాలవంతి: __ వారి ఆరె భాషలో ఇలా వుంటుంది.

ఐకుమి రాజా మీతోటి సంగిత కానిదారు ఐకుమి రాజా
అంచనామయూ అంచనామగాదు సంగిత మీ అంచనామయూ
వరదనుదదాలా తేరపరచదనుదదాల బోలుధడావో వరదనుదదాలా
వింబోజిదదాలా అతేవింబోజిదదాల బోలుధడావే వింబోజిదదాలా

ఈ విధంగా సాగే వారి సంవాదం తెలుగులో ఇలా వుంటుంది.

బాలవంతి:__

ఓ రాజా... నేనోమాట చెబుతాను చెవున బెట్టవలసింది
మన పేరూ మన వూరు పేరు చెబుతాను
మనకీ రాజరికం వుండి లాభమేమి
మనకీ ధనద్రవ్యాలు కూడా వుండి ఏమి లాభం లేదు.
వేములవాడ దేవుడుండీ కూడ లాభం లేకుండా వున్నది
వినవయ్యా ఓ రాజా.... నేనో మాట చెబుతాను
ఇటు చెవి బెట్టివిను.

అవర్సింగ్:__

ఓ నారీ? అదేమి సంగతో చెప్పు వింటాను.

బాలవంతి:__

మనకు కొడుకులూ కూతుళ్ళూ లేరు
నిన్ను నాన్నా అని పిలిచే కొడుకులు లేరు
నన్ను అమ్మా అని పిలిచే కూతుర్లు లేరు
తండ్రి చెప్పులు తొడిగే కుమారుడు లేడు
తల్లి రవికెలు తొడిగే కూతురు లేదు
ఓ రాజా నీవిప్పుడు ఢౌలగిరి (ధవళగిరి)కి వెళ్ళాలి
నీవు కొడుకూ కూతుర్ల దానం పొందాలి.

అవర్ సింగ్:__

ఓ నా రాణీ... నేను కూడ ఓ మాట చెబుతాను
ఓ నారీ దేవుడివ్వందే కూతుర్లెట్టా కలుగుతారు
ఓ నారీ దేవుడివ్వందే కొడుకులెట్టా కలుగుతారు
సంతానం కోసం నేనెక్కడికీ వెళ్ళను
నాతో నీవున్నూ ఇట్లా చావవలసిందే తప్ప
నేను సంతానం కోసం ఎటూ వెళ్ళను సుమా.

బాలవంతి:__

వినవయ్య ఓ రాజా.. నేనో మాట చెబుతాను
కొడుకు కూతుర్ల వరం పొందడం కోసం నీవు తప్పక వెళ్ళాలి

ఇట్లా బాలావంతి చెప్పడం ప్రారంభించింది.

అవర్ సింగ్:__

మంకవతిని వెంటనే రప్పించాలి
సోదరుడు లింబోజీని కూడ పిలిపించాలి
ఆ లింబోజి అన్నకు ఈ రాజ్యం అప్పాగించాలి
పెద్ద చిన్న లంతా కూర్చున్నా రీ సభలో
కోమట్లూ బామండ్లూ కూడ కూర్చున్నా రిక్కడ
ఓ నారాణీ? నేనీ రాజ్యాన్ని ఎవరి కిచ్చేది?
అక్కడ అరెండు పైసల్ని ముడి వేయాలి
ఒక్క పైసను మాత్రం నేను ఒడిలో కట్టుకుంటాను.

ఇలా వారి సంవాదం జరుగుతుంది. ఈ ప్రదర్శనాలను ఈ నాటికి వారు ఆంధ్రదేశంలో ప్రదర్శిస్తున్నారు. మన జానపద కళారూపాలు ఎలా శిధిలమై పోతున్నాయో గొంధళే వీధి భాగోతాలు కూడ నశిస్తున్నాయి. అవీ మన కళారూపాలతో పాటు పెరిగాయి గాబట్టి వాటిని

సంరక్షించాల్చిన బాధ్యత వుంది. ఈ గొంధళే వీథి భాగోతాలను పరిశోధించిన పేర్వారం జగన్నాథం గారికి కృతజ్ఞతలు.