తుది మొదలు లేని దా నాటి తొలి నిశీథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తుది మొదలు లేని దా నాటి తొలి నిశీథ

పుం దమము;

అఖాత మయ్యది;

అందు దారి

లేదు; మిణుగురేనియు కానరాదు;

ఒకండ

పొంచి యొదిగితి నే మూల మూల లందు.


నాటి నిశీథ నీల గగనమ్ముపయిం

గనుమోడ్చు మేఘపుం

గాటుక కౌగిలింతల పెనంగి

సుకమ్ముగ నిద్రవోవు నీ

వేటికొ యొత్తిగిల్లి, తరళేక్షణ!

నూత్న వియోగ శోకపుం

జాటున స్రుక్కు దీను కనినా

వనురాగము మోసు లెత్తగాన్.


నీ కనుచూపుచీకటుల నీడల

నా యెద నిల్వలేదు, పే

రాకలి గొన్న నా బ్రతుకునందు

త్వదీయ మనోజ్ఞ హాసరే

ఖా కమనీయ కాంతిసుధ

కాల్వలు కట్టగలేదు, కాని యే

మో కలగున్ మనమ్ము

వలపుం దమకమ్మున ని న్దలంచినన్!


నవసి ద్వదీయమౌ కరమృణాళము

వీణియమీద మూగయై

యవశత వాలెనో!

అనలమై దహియించు విషాదబాధ డి

ల్ల వడెనొ నీ మనోజ్ఞ మధురమ్మగు కంఠము,

కారుచిచ్చు వే

సవి గళ మెత్తి పాడుటకు

చాలని సోనవిధాన ప్రేయసీ!