తిట్ల దండకం

వికీసోర్స్ నుండి

తిట్లదండకము

పోలిపెద్ది వేంకటరాయకవి

పీఠిక

ఇతఁడు ‘తిట్లదండక’మను చిన్నకృతికూడ చేసెను. అందు వచ్చిన తిట్టు మరల రాదు. అద్భుతమయిన ధారాధోరణి. ఇట్టి దండకమునకుఁ గారణమయిన యితివృత్తము నించుక తెలిసికొందము.

కార్వేటినగరమున ఆ కాలమున రాచనగరున నిత్యావసరవస్తుభాండారాధ్యక్షుఁడుగ (ఉగ్రాణాధికారిగ) కోవూరి రామయ్య యను నియోగిబ్రాహ్మణుఁ డుండెడివాఁడు.

అతని నివాసమందిర మగ్రహారమున మన కవియింటికిఁ బ్రక్కదే. ఒకానొకనాఁడు రామయ్యయింటి దొడ్డిలోని కూరపాదులలోని మొలకలను వేంకటరాయకవి బఱ్ఱె మేసిపోయినది. అది చూచిన రామయ్య భార్య, కామాక్షమ్మ క్రోధావేశమునఁ గవిగారి యింటికిఁ బోయి వారితోఁ దగవులాడెను. అప్పుడు కవి ఆమెం గని “అమ్మా, ఏదో తెలివిలేని గొడ్డు చేసిన పనికి ఇంత యల్లరెందులకు? దానిని స్వేచ్ఛగా మేఁతకు విడిచిన తప్పు మాదే. నీ తోటకూర మొలకల క్రయము వలసిన నిత్తును. పొరపాటును క్షమించుము” అని బతిమాలెను. కాని యీర్ష్యాపరురాలయిన కామాక్షమ్మకు ఆ మాటలు రుచింపమిచేఁ జీటికిమాటికి నాకున పోకున కవిని అతని కుటుంబమును దిట్టుచునే యుండెను. అట్లొక సంవత్సరము గడచెను.

ఒకనాడు ప్రాతఃకాలమున మన కవి యెటకో పోయివచ్చుచు అమ్మలక్కలతో నింటివాకిట నిలిచి బిగ్గఱగాఁ దన్ను దూషించు కామాక్షమ్మను జూచి క్రోధము పట్టజాలకయు, రాజోద్యోగి భార్య కావునఁ దటాలున నేమియుఁ జేయజాలకయు విసవిస ప్రభువుచెంత కేఁగి “రాజేంద్రా, కోవూరి రామయ్య భార్య స్వల్పదోషమును బురస్కరించికొని మమ్మెల్ల నొక్కయేడాదిగా నాడిపోసికొనుచున్నది. దీనికి బ్రతీకారమే లేదా?” అని జరిగిన విషయమంతయు బూసగుచ్చినట్లు నివేదించి “క్షత్రియ ప్రభువులైన తామొక్క క్షణముగూడ నిట్టి యవినయ మోర్వరు. అప్పుడే తల దీయించి యుందురు. బ్రాహ్మణుఁడను గనుక నోర్వదగినంత కాల మోర్చితి. ఇఁక నోర్వఁజాలను. క్షాత్రమునఁ బ్రతీకారము చేయింతురా? కాదని బ్రాహ్మ్యమున నేనే చేయుదునా?” అనఁగానే యేలిక కవిం జూచి ‘యేమి చేయుమందు’ రనెను. కవియుఁ ‘మీరైనఁ దలఁ దీయింతురు. కాని అది బ్రాహ్మణస్త్రీహత్య యగుటచే మనకిరువురకు నరకము తప్పదు. కానఁ దల గొఱిగింపుఁడు. చాలును’ అని మనవి చేసికొనఁ బ్రభునకుఁ బచ్చివెలగకాయఁ గుత్తుక నడఁచికొన్నట్లయి, కొంతసేపేమియుఁ బలుకకుండి, తుదకు “మేమట్టి కార్యమునకుఁ బూనుకొనుట భావ్యమా? లోక మేమనుకొనును? ఇక్కార్యము అపకీర్తికారకము గదా! శాంతింపుడు” అని ప్రాధేయపడెను. “అగుచో నేనే ఆమె తల గొఱిగించెదను. అంతవఱకు నాకు శాంతికలుగదు ప్రభూ! మన్నింపుడు” అనెను. అయినను రామయ్యను విచారించి మందలింతమను నూహతో రాజేంద్రుఁ డాతనికొఱకు హర్కారును బంపెను.

ఱేని యానతి ననుసరించి సత్వరముగ రామయ్య అతని సన్నిధానమునకు వచ్చుచుండ, అల్లంతదూరముననే ఆతనిం గాంచి దండతాడితభుజంగమువలె వేంకటరాయకవి మండిపడి “ఛీఛీ, ఒరే పాతకా, ఘాతకా, ప్రేత” అని యారంభించి “కోవూరి రామా, అయో రామ, రామా!” యని దండకము ముగించెను. దానిని బఠించుచున్నంతసేపు నృపాలుఁ డా కవి వంక గ్రుడ్లప్పగించి చూచుచుండి నిట్టూర్పు పుచ్చి లేచి యంతిపురిం బ్రవేశించెను. కవీంద్రుఁడును గోపభారము తగ్గిపోవ శాంతించి యింటిదారిని బట్టెను. దురదృష్టవంతుఁడగు కోవూరి రామయ్య ప్రభునియెదుట దనకు జరిగిన పరాభవమునకు ఖేదమొందుచుఁ, దలవాంచి పరాకుతో నింటిని జొచ్చునపుడు ద్వారబంధము గాటముగ శిరమునకుఁదగిలి గొప్ప గాయమయి, పడుకఁ బట్టి వేదనాదోదూయమానుఁడై కొలదిదినములలో మరణించెను. కవికోరికయు సిద్ధించెను.

ఈ చరిత్ర ముప్పదియైదేండ్లనాఁడు మా యూర (కార్వేటినగరమున) నాకు వేదాధ్యాపక గురువులుగ వెలసిన శ్రీతిప్పావఝుల అనంతయ్యగారు చెప్పఁగా వింటిని. వారి కప్పటి వయస్సు డెబ్బది దాఁటినది. చరిత్రకాలమున వారు చాలఁ జిన్నవారఁట.

“తిట్లదండకము”నకయి నే నిరువదియేండ్లుగఁ బ్రయత్నింప నిప్పటికి దొరకినది. పుత్తూరుబోర్డు ఉన్నత పాఠశాలా ప్రధానాంధ్రపండితులగు విద్వాన్ శ్రీ టి. శ్రీనివాసరావుగారు సంగ్రహమగు పైచరిత్రతోఁ గూడ తిట్లదండకము సంపాదించి పంపినందులకు వారికెంతయు గృతజ్ఞుడను.

పంచాగ్ని ప్రదానము (కోవూరు రామయ్యకు)

పోషకుని కెగ్గు దలఁచు నల్పుం డెవండొ,
స్వార్థమున కొక మితి లేని చవట యెవఁడొ,
మేలొనర్చిన హితుఁ దిట్టు కూళ యెవఁడొ,
వానికిది చీఁపురులమాలయై నెగడుత!

తల్లి చనుబాలు ద్రావి యా తల్లి ఱొమ్మె
గుమ్ము సత్పుత్రుఁ డెవ్వఁ, డన్నమ్ము వెట్టి-
నట్టి యింటికిఁ గన్నమ్ము వెట్టు నెవఁడొ
వాని కీ కృతి యగుత శూర్పముల శాళ్వ!

ఱేయి దన యమ్మ ప్రక్కను హాయిఁ బండి
ముదమనుభవించి, యంతట నుదయమగుడు
‘అమ్మ! తే తేవె, నా కూలి’ యనెడు ద్రోహి
టక్కరికి నిది తృణకిరీటమయి తనరు!

పీనుఁగందపుఁ బొటినక్క మేని కాకి,
పొట్టవొడిచిన ముక్క లేనట్టి బోఁకి,
పాకిదొడ్ల కస్మాలపు లేకి యెవఁడొ
వాని కీ కృతి యినుంపపతక మగుత!

పంచకోలకషాయము పంచిపెట్టి,
పరుల యెంగిలిమెతుకులు పంచిపెట్టి,
పాసికంపు బండారము పంచిపెట్టి,
బ్రతుకుచెడు గీ కృతికి నగు బడిసివాటు!

తిట్లదండకము (తగణ దండకము)

చీ, చీ, ఒరే, పాతకా, ఘాతుకా, ప్రేత, దుర్నీత, మన్బోత, ఉచ్చిష్టపున్ రోఁత, వారాంగనామూత్రముల్పట్టు ముంతా! ఇదే చూడరా, ధాత నీ వ్రాత నా చేత పట్టిచ్చెరా నేఁడు; దుర్బీజమా, నైజమా, సాజమా, నీతమా! ఏర కోవూరి రామా, హరామా, గులామా, పురీషంపు తూమా, ఉపారాల వేటా, వలిక్కాలి చేటా, దగాకోరు ఫాజీ, దగుల్బాజి మాజీ, దులాభీల ఖాజీ, శనైశ్చర్యు తేజీ, గరాస్పంద [1]ముర్టారు, హల్కా, దివానా, బహంచోతు, లమ్డీకె, ఖంగారు కప్తా, చమర్బేహియా, చూతియా, మొండి లండీ, శిఖండీ, చణిర్భీసు, దర్భీసు, మట్రాసు, పట్రాస్, కఫర్భేటి చోటీ, నమర్దా, ముఠాల్, గాడ్దె లష్కారు, భడ్వా! ద[...]ళాన్, దివాల్కోరు, [2]బేకూఫు, బేమాని లుచ్ఛా, హరాంకోరు బచ్చా, బలాదూరు తుచ్చా, [3]తెగిన్పాత ముచ్చా, సురాపాన పూర్షాధమా, వ్రాత్యమా, త్వాష్ట్రమా, ఖొజ్జ, శుంఠా, యనాథాతతాయీ!

భువిన్ గల్గు సంకర్లు, సుంకర్లు, యాకిర్లు, పోకిర్లు, దొమ్మర్లు, దిమ్మర్లు, కమ్మర్లు, కుమ్మర్లు, [4]పట్సాలె, [5]ముత్రాసులున్, జాండ్రులున్, ఈండ్రులున్, కోయలున్, బోయలున్, జోగులున్, వేఁగులున్, పల్లెలున్, గొల్లలున్, మాదిగల్, మాల, లింగ్లీసులున్, [6]బుడ్తకీచుల్, [7]పరాసుల్, [8]గరాసుల్, పిసాసుల్, తురుష్కుల్, ఒలందాలు, [9]తోడాలు, పార్సీలు, చండాలురున్, బుల్కసుల్, శ్వాపచుల్, మాగధుల్, బండలండాలు, [10]పిండార్లు, [11]పింజారులున్, జారులున్, జోరులున్, గుక్కలు, న్నక్కలున్, కోఁతులున్, [12]బూతులున్, కోళ్లునుం, దేళ్లునున్, లేళ్లు, తాఁబేళ్లునున్, గొఱ్ఱెలున్, బఱ్ఱెలున్, ఏనుఁగల్, [13]తూనిగల్, చీమలున్, దోమలున్, పిల్లులున్, బల్లులున్, మల్లులు, న్నల్లులున్ [14]రాసభాల్, [15]వేసడా, లెడ్లు, [16]కొర్నాసిగాం, [17]డ్లుష్ట్ర, [18]భల్లూకముల్, [19]ఘూకముల్, కాక, శార్దూల, మార్జార, [20]మాయూర, [21]మండూకముల్, [22]గృధ్ర, [23]పారావతా లాదియౌ ప్రాణిజాలంబులున్, [24]చిత్తగల్ రేగి, నీ యమ్మనుం గ్రుమ్మ, నీ యబ్బనుం ద్రొబ్బ, నీ యక్కపైనెక్క, నీ యత్తనున్మొత్త, నీ యన్ననుం దన్న, నీ చెల్లెలిన్గొట్ట; నీ యాలు కామాక్షి నిష్కారణం బూరకే మమ్ము నిందింపఁగా జూచి, నీవైన “ఏమోసి, [25]యేబ్రాసి, [26]కస్మాలమా, చాఁకిబండా, చలం గల్గు ముండా, [27]సగం కోయ రండా, [28]అమేధ్యాల బొండా, అనాకారి [29]తుండా, [30]అడావూడి లండా, ఫిరంగీల గుండా, వికారాల బండా, విసర్జించు కుండా, [31]వ్యభీచారి, నీ సిగ్గు మండా, అపస్మారమా, [32]లేకి, పల్గాకి, [33]గాల్గుడ్డ, [34]రాల్గాయి, [35]జ్యేష్ఠా, కులభ్రష్ట, [36]బాడ్గోల, [37]పెంటచ్చ, తల్కొట్లమారీ, [38]బజారీ, [39]మిటారీ, [40]తుటారీ, పురిట్లోని కాటేరి, మిల్టేరి, జల్దారి, భస్మాసురీ, [41]కాఫిరీ, [42]లాహిరీ, [43]తుప్పు దుగ్గాని, పైశాచి, బస్వీ, దసీ, పాడుగోడా, [44]పుసిం గారు పూడా, నెగుల్ బుట్ట, కడ్గండ్ల దుంపా, [45]బడిం ద్రిప్పు గంపా, రగుల్పాట్ల కొర్వీ, [46]చెడే యుల్పిగొట్టా, ఒసే బోడి, [47]బోగ్బోడి, [48]మైలార్గుడీ, సంతలంజా, మహామైథునీ, లంకిణీ, తాటకీ, భూతకీ, ఘాతకీ, చుప్పనాతీ, ఫిరాతిన్నిరాతీ, దసీ - గండుకోతీ, కసీసంపు మూతీ, శ్మశానంపు జ్యోతీ, యథాజాత ఆషాఢభూతీ, యరాతీ, బళీ ఱంకులాఁడీ,” యటం చొక్కమాఱైన గద్దించి, నీకిద్ది మేల్బుద్ది గాదంచు వాదింపరాదా? మదిం దోఁపలేదా? తుదిన్ నీకు నా చేత చావయ్యెఁ గాదా? సదా దాని పాదాలకున్ లొంగి, వెంటాడుచున్ కూడుచున్నుందువే? మంకుకుంకా! మలంబెత్తు పెంకా, నినుం బంకజాక్షుండునుం, బంకజాసీనుఁడున్ శంకరుండైన గావంగ లేరింక, నిశ్శంకగాఁ జెప్పెదన్, నిగ్రహానుగ్రహాదిప్రభావంబు నా వాకునందున్నదో లేదొ, నీ కిప్పుడే కన్పడుం జూడుమా, నాదు శాపంబు వమ్మౌనె? ముమ్మాటికిం గాదు సుమ్మా, అదే, మృత్యువేతెంచి, కేల్సాచి, నిన్బట్టఁగాఁ బొంచి, కాలంబు లెక్కించుచుంటన్ విలోకింపుమా, మూర్ఖపూర్షాధమా!

వేదవేదాంతతత్త్వజ్ఞుఁడన్, వైదికశ్రేష్ఠుఁడన్, సజ్జనస్తవ్యుఁడన్, సాధుసాంగత్యమున్ గల్గువాఁడన్, సదాచారశీలుండ, శ్రీ వేణుగోపాలసద్భక్తుఁడన్, పోలిపెద్దాన్వయాబ్ధీందుతుల్యుండ, శ్రీ వేంకనార్యుండ, నాస్థానవిద్వాంసుఁడన్, సత్కవీంద్రుండ, శ్రీ కారువేటీ పురాధీశు శ్రీమన్ మహామండలేత్యాది వాక్యాళిసంశోభితున్, రాజరాజేశ్వరున్, మాకరాడ్వంశసంజాతు, శ్రీ వేంక్టపెర్మాళ్ళ రాజాశ్రితుండన్, సదాచార సన్మానితుండన్, ననుం దిట్టఁగాఁ బూని, యేడాదిగాఁ దిట్టి, బల్ దిట్టనంచెంచెఁ గాఁబోలు, నీ యాలు, కామాక్షి, హా, దాని గర్వంబు నేమందురా, క్రూర, పాపిష్ఠ, నీ పాడె గట్టా, యనాచారపున్ ముట్టుబట్టా, నినున్ మిత్తి [49]నణ్ణెత్తిపైఁ గొట్ట, పాపాల బుట్టా, యముండిట్టి నిన్బట్టి, కాల్సేతులం గట్టి, కొంపోవఁగా వచ్చె, నీ కాలముం జెల్లె, నా శాప మీడేఱు, నిక్కంబు, నిక్కంబు, నీ వింటికిం బోయి, వేవేగ, కాల్ప్రోలికిన్ నేగుమా, సాగి, కోవూరి రామా, యయో, రామ, రామా, సమాప్తం, సమాప్తం, సమాప్తం!

  1. మురారు, మురాళ్ - ఒకే పదము
  2. బేవకూప్
  3. తెగిన పాతముచ్చె
  4. పట్టుసాలె
  5. ముత్తరాచులు
  6. పోర్చుగీసులు
  7. ఫ్రెంచివారు
  8. దుష్టులు
  9. కొండజాతి చోరులు
  10. మహారాష్ట్ర ప్రాంతమున బాటసారులఁ జంపుచుండిన దారిదోపిడిగాండ్రు
  11. దూదేఁకులవారు
  12. కుచ్చితపుఁ దిట్టు దిట్టువారు [ఇక్కడ ‘బాతులున్’ అనే పదం ఉండడం సందర్భానుసారంగా, ఉచితంగా తోస్తుంది. - ‘ఆంధ్రభారతి’]
  13. తూనీఁగలు
  14. గాడిదలు
  15. కంచరగాడిదలు
  16. కణఁతులు అను అరణ్యమృగములు
  17. ఒంటెలు
  18. ఎలుగుబంట్లు
  19. గ్రుడ్లగూబలు
  20. నెమిళ్ళు
  21. కప్పలు
  22. ఊదలు
  23. పావురాళ్ళు
  24. చిత్తకార్తెకు జతగూడు మృగములవలె చెలరేఁగి
  25. రోఁత కలదాన
  26. మలినము గలదాన
  27. నిలువున (నిన్ను) సగమునకు కోసివేయ
  28. అపవిత్రాల చిప్పా
  29. మొద్దా
  30. అల్లరి కూళా
  31. ఱంకులాఁడి
  32. అప్రయోజకురాలా
  33. దరిద్రురాలా
  34. తుంటరిదానా
  35. పెద్దమ్మా
  36. మానము లేనిదాన
  37. పెంట గలదాన
  38. దేహమమ్ముకొను చెడిపె
  39. మదము గలదాన
  40. దిట్టతనము గలదాన
  41. విమతవర్తనఁ గలదాన
  42. సారాయి మైకము కలదాన
  43. తుప్పుపట్టిన రాగి (నాణెమా) కాసా
  44. మలస్రావము గల పాయువా
  45. దృష్టిదోషము పోవుటకై త్రిప్పు గంపా
  46. దుర్మార్గురాలా
  47. దూఁబఱఁదిండి గలదాన
  48. క్షుద్రదేవతాలయమా
  49. నడినెత్తిపై