Jump to content

తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/సంతానప్రాప్తిరస్తు

వికీసోర్స్ నుండి

సంతానప్రాప్తిరస్తు

అశుభజీవితము గడుపుటలో లగ్నమైనవానికి మరొక అశుభమును సూచించు తిట్టు దీవెనరూపములో గలదు. అదియే "సంతానప్రాప్తిరస్తు లేక శ్రీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు" వీటి అర్థము నీకు సంతానము కలుగుగాక అనడము. భార్యరాకతో దైవమార్గమంటే ఏమిటో తెలియక దాని ధ్యాసలేకుండ పోయిన భర్తకు, అదే విధముగ భర్తరాకతో దేవుని విషమేమిటో తెలియక దాని ధ్యాసకూడ లేకుండ పోయిన భార్యకు సంతానముతో కాలమంత వారికే వినియోగమగుట చేత ఏమాత్రము దైవమును తెలుసుకొను అవకాశమే లేకుండ పోవును. భార్యకు లేక భర్తకు సంతానము వలన ప్రపంచములో లగ్నమగుటకు అవకాశము ఎక్కువగుచున్నది. అందువలన కొందరు జ్ఞానులు తమ పాటలలో ఆలు మాయ, పిల్లలు మాయ అన్నారు. మాయ దేవునికి వ్యతిరిక్త దిశలో నడిపించునది. ఆలు పిల్లలు దైవమార్గ మునకు ఆటంకములే కావున వారిని మాయ అన్నారు. సంతాన ప్రాప్తిరస్తు అనగా నీవు ఇంకా మాయలో కూరుకపొమ్మని చెప్పినట్లున్నది, కావున ఈ వాక్యమును దూషణ పక్షములోనికే చేర్చడమైనది. "పుత్ర ప్రాప్తిరస్తు" అనిన "సంతాన ప్రాప్తిరస్తు" అనిన రెండు ఒకే విధానమును తెల్పుచున్నవి. ఈ వాక్యములు సంతానములేని వారికి గాని, పుత్రుడు లేనివారికి గాని సంతోషమును కల్గించును. అయినప్పటికి దైవజ్ఞానరీత్య అంత సంతోషింపదగిన విషయములేమి కావు.


పైకి మేలు చేసినట్లు కన్పించు వాక్యములు దీవెనలరూపములో అప్పటికి సంతోషమును కలుగజేయునవై ఉన్నప్పటికి వాటివలన అశుభమే చేకూరును. కావున దీవెనలవలె కన్పించు వాక్యములను దూషణలుగ చెప్పుచున్నాము. అలాగే పైకి కీడుచేయునట్లు కన్పించు వాక్యములు ఇప్పటి కాలములో దూషణలుగ కన్పించుచున్నప్పటికి వాటివలన శుభమే చేకూరును. కావున దూషణలుగ కన్పించు వాక్యములను దీవెనలుగ చెప్పుచున్నాము. దైవజ్ఞానమున్నపుడే దూషణలేవి, దీవెనలేవని తెలియగలదు. జ్ఞానములేని వారికి వాటి తారతమ్యము తెలియదు, కనుక ఇపుడు మేము చెప్పిన తిట్లలో గల జ్ఞానమును, దీవెనలలో గల అజ్ఞానమును వారు అర్థము చేసుకోలేక పోవచ్చును. కొంత జ్ఞానము తెలిసి చూడగలిగితే తిట్ల జ్ఞానము దీవెనల అజ్ఞానము సులభముగ అర్థము కాగలదు. ఈ పుస్తకములో కొన్ని దీవెనలను, కొన్ని దూషణలను మాత్రమే తెలియజేసాము. ఇంకను మనము చెప్పుకోని మరికొన్ని దీవెనలు మరికొన్ని దూషణలు కూడ గలవు. వాటిని కూడ జ్ఞానముతో యోచించి చూచినపుడే వాస్తవముగ అవి ఏవో తెలియగలదు.


నేటికాలములో తిట్లను కొంత పరిశీలించితే వాటి స్థానములో వాటివలెనున్న కొన్ని వాక్యములు చోటు చేసుకొని ఉన్నాయి. వాస్తవముగ అవి తిట్లు కాక పోయిన తిట్లవలె చలామణి అగుట చోద్యముగనున్నది. భూతుమాటలను కొన్నింటిని దూషణలుగ కొందరు వాడుటవలన వాస్తవమైన దూషణలను కూడ భూతులుగ, భూతులను దూషణలుగ తలచుటకు అవకాశము గలదు. అర్థముండునవి దూషణలని, అర్థములేక కేవలము భూతులతో కూడుకొన్న మాటలు దూషణలుకావని గుర్తించవలెను. పూర్వము దూషణలను కాని, దీవెలను కాని జ్ఞానము కల్గిన గురువులు చెప్పెడివారు. కాలక్రమేణ పద్దతులు మారిపోయి దీవెనల స్థానములో దూషణలు దూషణ స్థానములో దీవెనలు నిలచిపోయి వాటిని జ్ఞానములేనివారు కూడ చెప్పడము జరుగుచున్నది. అంతేకాక పూర్వకాలము దీవెనలు నేటికాలపు తిట్లుగ చలామణి అగుచుండగ వాటి స్థానములో భూతులు కూడ స్థానము చేసుకొని అజ్ఞానుల నోటిలో నానుచున్నవి. జుగుప్సాకరముగ, అసహ్యముగ ఉన్న భూతుమాటలను కొన్ని పల్లె ప్రాంతములలో తిట్లుగ వాడుచున్నారు. భూతుమాటలే తిట్లు, అసలైన తిట్లు శాపనార్థములుగ కొందరి లెక్కలోనున్నవి. నేటి కాలములో నున్న భూతుమాటను, దూషణలను, దీవెనలను వివరించి చెప్పి వాటికి సరియైన అర్థమిదని చెప్పడమే ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక పాఠకులందరు సదుద్దేశముతో చదివి అర్థము చేసుకోవలెనని కోరుచున్నాము.

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు

IGV logo
IGV logo


అసత్యమును వేయిమంది చెప్పిన అది సత్యము గాదు,

సత్యమును వేయిమంది కాదనిన అది అసత్యము గాదు.