తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నా చవితి
నా చవితి
ఒక భర్తకు ఇద్దరు భార్యలున్నపుడు మొదటి భార్య, రెండవ భార్యను నాచవితి అని అంటుంది. అలాగే రెండవ భార్య, మొదటి భార్యను నాచవితి అని అంటుంది. ఈ విధముగ ఇద్దరు భార్యలు లేక ఎక్కువమంది భార్యలున్న చోట భార్యలందరు ఒకరుకొకరు చవితి, నాచవితి అనుకోవడము పరిపాటిగా ఉన్నది. ఇక్కడ ఒక విశేషమేమంటే, భార్యలందరు ఒకరుకొకరు ప్రేమగా ఉండు సమయములలో అక్కా, చెల్లీ అని చిన్న పెద్దను బట్టి ప్రేమగా పిలుచుకొనుచుందురు. ఒకవేళ వారిమధ్యలో వైషమ్యాలూ, అభిప్రాయబేధములూ ఉన్నపుడు వారిమధ్యలో ప్రేమ ఉండదు. ఒకరుకొకరు అసూయ కల్గియుందురు. అటువంటి సమయములలో ఆమె నాకు అక్క అనిగానీ, ఈమె నాకు చెల్లి అనిగానీ చెప్పుకోరు. అది నాచవితి అనీ, ఇది నా చవితి అని అంటుంటారు. ఇంకా కొందరు పోట్లాడుకొను సమయములో నీవు నాచవితివే అనియో, లేక నాచవితి అని తిట్టుకొనుచుందురు. ఈ విధముగా "నాచవితి" అనుమాట తిట్ల జాబితాలోనికి చేరిపోయినది.
పూర్వము కృతయుగము, త్రేతాయుగములలో "నా చవితి" అను మాట గొప్ప జ్ఞానముతో కూడుకొని ఉండెడిది. పూర్వము దైవజ్ఞానముగా ఉన్నమాట ఈ కాలములో తిట్టుగా మారిపోయినది. కావున తిట్టులో జ్ఞానమున్నదని మనము ఈ రోజు చెప్పుకోవలసి వచ్చినది. తిట్లజ్ఞానములో నా చవితి అను పదమునకు ఏమి జ్ఞానమున్నదో అని యోచిస్తే మరియు ఆలోచిస్తే, ఆ రహస్యము ఈ విధముగా తెలియబడుచున్నది. చాతుర్వర్ణమ్ అను పదము భగవద్గీత జ్ఞానయోగములో 13వ శ్లోకమున చెప్పబడినది. చాతుర్వర్ణమ్ అను పదములో చతుర్, వర్ణమ్ అను రెండు పదములు కలిసి యున్నవి. చతుర్ అనగా నాలుగు అని అందరికి తెలుసు. ఇకపోతే వర్ణమ్ అను పదమును గురించి యోచిస్తే, వరస అను శబ్దము నుండి వర్గము, వర్ణము అను పదములు ఏర్పడినవి. వీటన్నిటికి అర్థము వరసలు అనగ వేరు వేరు క్రమముగా కనిపించుచున్నవివని, వర్గములు అనగా వేరు వేరు గుంపులని, వర్ణములు అనగా వేరువేరు రంగులని చెప్పవచ్చును. వర్ణమ్ అను పదమునకు ముందు చతుర్ అని చెప్పుటవలన నాలుగు రంగులని చెప్పవచ్చును. సందర్భానుసారము ఇంకా వివరముగా చెప్పుకొంటే నాలుగు వేరు వేరు విధములుగా ఉన్నవని చెప్పవచ్చును. ఇప్పుడు తిట్టుగా చెప్పుకొన్న పదములో "చవితి" అను పదము ఉండుటవలన దానిని గురించే విశేషముగా చెప్పుకోవలసియున్నది. 'విదియ' అనగా రెండవదని, 'తదియ' అనగా మూడవదని, చవితి అనగా నాల్గవదని అర్థము చేసుకోవచ్చును. ముందు యుగములలో "చవితి" అను శబ్దము ఆత్మజ్ఞానము కల్గినదై ఉండుట వలన దాని వివరము ఇలాగున్నది.
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమందు మొట్టమొదటి శ్లోకమున మొదటనే "ఊర్ధ్వమూలమ్" అను పదము గలదు. జీవితమునకు గల మూలము శరీరమునకు పైన గల తలయందున్నదని, ఆ పదమునకు అర్థము. శరీరమునకు పైన శిరస్సుగలదు. ఆ శిరస్సులోపల కనిపించే మెదడుయందు కనిపించని మూలమున్నదని భగవంతుడు చెప్పాడు. ఇటు భౌతికశాస్త్రవేత్తలకు, అటు విజ్ఞానులకు తలయందు కనిపించే మెదడున్నదని తెలుసు, కానీ కనిపించని మూలమేమిటో తెలియదు. ఆ మూలమునే భగవద్గీత జ్ఞానయోగములో 13వ శ్లోకమున "చాతుర్వర్ణమ్" అని చెప్పాడు. శిరస్సు మధ్యభాగములో కనుబొమల మధ్యభాగమునుండి దాదాపు ఒకటి నుండి ఒకటింపావు అంగుళము పొడవుతో నాలుగుచక్రములు బ్రహ్మనాడి శక్తిని ఇరుసుగ (ఆధారముగ) చేసుకొని తిరుగుచున్నవి. ఆ నాలుగు చక్రములలో క్రిందిచక్రమైన గుణచక్రము బ్రహ్మనాడియందు ఆరవ నాడీకేంద్రమైన ఆగ్నేయస్థానమున ఉన్నది. ఆగ్నేయ నాడీకేంద్రము మెదడు మధ్యలో కనుబొమల మధ్యన గలదు. పై చక్రమైన బ్రహ్మచక్రము, మెదడు పై భాగమైన సహస్త్రార నాడీకేంద్రమున గలదు. మిగత రెండు చక్రములైన కర్మచక్రము, కాలచక్రములు ఆగ్నేయ కేంద్రమునకు, సహస్త్రార కేంద్రమునకు మధ్యలో గలవు. జ్ఞాననేత్రమునకు తెలియబడే ఆ చిత్రము ఈ విధముగ ఉన్నది. క్రింది పటములలో చూడుము.
మనిషి మెదడులో గల గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రములనబడు నాల్గుచక్రములలో క్రింది చక్రము గుణచక్రము. ఆ గుణచక్రమును వివరించుకొని చూస్తే, అందులో గుణములున్న భాగములు మూడు, గుణములులేని భాగము ఒకటి గలదు. మొత్తము నాలుగు గదులుగా గుణచక్రము విభజింపబడి ఉన్నది. అందులో బయటినుండి లోపలికి మొదటది తామస గుణభాగము, రెండవది రాజస గుణభాగము, మూడవది సాత్త్విక గుణభాగము, నాల్గవది గుణములేని ఆత్మ భాగము. భూమిమీద పుట్టిన జీవుడు ఎవడైనాగానీ ఈ నాలుగు భాగములలోనే ఉండును. మొదటి భాగములో ఉన్న జీవున్ని ఆ గుణభాగమునుబట్టి తామసుడనీ, రెండవ భాగములోనున్న జీవున్ని రాజసుడనీ, మూడవ భాగములోనున్న జీవున్ని సాత్త్వికుడనీ, నాల్గవ భాగములోనున్న వానిని యోగి అని అనుచుందురు. మొదటి మూడు భాగములలో గుణములుండగ, చివరి నాల్గవ భాగములో ఆత్మ గలదు. అందువలన ఆత్మస్థానములో చేరిన జీవున్ని యోగి అని అనుచున్నాము. గుణచక్ర నాల్గు భాగములను క్రింది పటములలో చూడుము.
యోగి అయినవాడు గుణచక్రములోని నాల్గవస్థానములో ఉంటాడు. కావున వానిని నాల్గవవాడని, చవితియని అనడము పూర్వముండెడిది. ప్రథమ (పాడ్య), విదియ, తదియ, చవితి అను నాలుగు పేర్లు వరుసగ తామస, రాజస, సాత్త్విక, యోగులకు వర్తించెడివి. గుణచక్రములో మొదట తామసుడు అజ్ఞాని, అందువలన వానిని మౌడ్యముగలవాడని అనెడివారు. మౌడ్యము అను పదము ఎలా వచ్చినదనగా? ప్రథమ అను శబ్దము పాఢ్యమి
గుణచక్రములోని లోపలి నాల్గవభాగములో జీవుడుంటే యోగి అవుతాడు. అటువంటి యోగిని పూర్వము జ్ఞానము తెలిసినవారు నాల్గవ వానిగా గుర్తించి చవితి అని సంబోధించి పిలిచెడివారు. మిగత మూడు గుణములలోని మనుషులు ఎవరైనా ఎదుటివాడిని గౌరవిస్తూ వాడు యోగి కాకున్ననూ, వానికి గౌరవ ప్రథముగా యోగియొక్క విలువనిచ్చి చవితి అనెడి వారు. ఈ విధముగా యోగులనుగానీ, యోగులతో సమానమైన వారిని గానీ, గౌరవముగా పలకరిస్తూ నా చవితీ బాగున్నావా అని అనెడివారు. తామసుడుగానీ, రాజసుడుగానీ, సాత్త్వికుడుగానీ మూడు రకములవారు యోగస్థానములోని వానిని చవితి అనుట ఆనాటి జ్ఞానపుమాట. ఈనాడు, ఆనాటి జ్ఞానము తెలియని దానివలన ఆ మాటను దూషణగా వినియోగిస్తున్నారు. అది ఈనాటి తిట్టుగా ఉండినా, వివరించు కొని చూస్తే అందులో జ్ఞానమున్నది. దానిని తిట్ల జ్ఞానముగా మనము చెప్పుకొంటున్నాము.
ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే నాల్గవస్థానమైన ఆత్మ స్థానములో ఉన్నవానికి అక్కడ గుణములు లేవు. కావున వాని బుద్ధి యోచించవలసిన పనిలేదు. గుణములున్నపుడే బుద్ధికి పని ఉండును. గుణములు లేనపుడు బుద్ధికి ఏమాత్రము పని ఉండదు. అందువలన యోగికి బుద్ధితో పనిలేదు అనియు, బుద్ధిలేదు కావున యోచించడు అనియు పూర్వము పెద్దలు వివరించారు. యోగి అయినవాడు గుణములున్న వారివలె యోచించడు అని తెల్పుటకు, ఆ రోజులలో "నా చవితికి బుద్ధిలేదు" అనెడి వారు. అంతేకాక "నా చవితీ! నీకు బుద్ధి ఉందా" అని అడిగినట్లు మాట్లాడేవారు. ఆ విధముగా అనడము వలన ఎదుటి వానిని యోగిగ వర్ణించునట్లు అర్థమయ్యేది. అంతేకాక యోగి అయినవాడు తొందరగా మోక్షమును పొంది లేకుండ పోతాడు అను ఉద్దేశముతో, ఎదుటివాని యోగమునకు విలువనిస్తు "నా చవితీ నీవు తొందరగా నాశనమై పోతావు" అని అనెడి వారు. ఈ మాటలన్నియు పూర్వము మంచి జ్ఞాన ఉద్దేశమును కల్గియుండగా, అవే మాటలు అన్నియు నేడు తిట్ల జాబితాలోనికి చేరిపోయినవి.
ఒకమాట యొక్క అర్థము, దానివిలువ తెలిసి మాట్లాడితే అది జ్ఞానమవుతుంది. తెలియక మాట్లాడితే అజ్ఞానమవుతుంది. ఈ సూత్రము ప్రకారము 'నా చవితి' అను మాట తెలిసినవానికి జ్ఞానము, తెలియనివానికి అజ్ఞానముగా ఉన్నది. ఈ విషయము బాగా అర్థమగుటకు చిన్న ఉదాహరణను చెప్పుకొందాము. ఈ కాలములో బాగా కష్టాలలో కూరుకుపోయిన పుల్లయ్య అను వ్యక్తి నారాయణస్వామి దేవాలయమునకు పోయి, అక్కడ విశ్రాంతిగ కూర్చొని, తన మిత్రునితో ఈ విధముగా అంటున్నాడు.
పుల్లయ్య :- నేను పది సంవత్సరములనుండి క్రమము తప్పకుండ ఈ గుడికి వచ్చి నారాయణస్వామికి మ్రొక్కి పోతున్నాను. అయినా నాకు వరుసగా కష్టములు వస్తూనే ఉన్నాయి. చివరికి పూర్తి దరిద్రున్నయి పోయాను. నేను ఈయనను మ్రొక్కుట వలననే దరిద్రున్నయి పోయాను, కాబట్టి నేను దినము మ్రొక్కే దేవుడు దరిద్రపు నారాయణ అని తెలిసిపోయింది.
మిత్రుడు :- నీకు దరిద్రము వస్తే నారాయణస్వామి కూడ దరిద్ర నారాయణగా కనిపించాడా?
పుల్లయ్య :- లేకపోతే ఏ మని చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పేమాటే కాదు. పూర్వము నేను చిన్నప్పుడు కొందరు దరిద్రపు నారాయణ అని కష్టాలు వచ్చిన వానిని అనేవారు. ఆ సామెత నాకు నిజమైనది. అందువలన నేను మ్రొక్కే నారాయణను దరిద్రపు నారాయణ అన్నాను.
మిత్రుడు :- అలా అనడము మంచిది కాదేమో! మనము దరిద్రులమైతే నారాయణను దరిద్రము అనడము మంచిది కాదు కదా!
పుల్లయ్య :- అలా అనక ఏమనాలి? నేను ఇంతకాలము మ్రొక్కినా ఏమీ ప్రయోజనము లేదు. దేవుని దగ్గర నీతిలేదు, న్యాయములేదు. ఆయనకు కొంచెమైనా దయ కూడ లేదు, నాకు తెలిసింది అంతే. ఈ విధముగ మాట్లాడిన ఇద్దరి మిత్రుల మాటలను రామయ్య, ఈరయ్య అను మరొక ఇద్దరు మిత్రులు విన్నారు. ఆ మాటనువిన్న రామయ్య, ఈరయ్య ఈ విధముగా మాట్లాడుకొనుచున్నారు.
రామయ్య :- పుల్లయ్య మాట్లాడములో తప్పేముంది? ఆయనకు కష్టాలు ఎక్కువైనాయి, కాబట్టి దేవుని దగ్గర నీతి, న్యాయములేదు, కొంచెమైనా దయలేదు అన్నాడు. ఎక్కువ కష్టాలు వస్తే ఇంతకాలము మ్రొక్కిన దేవుని మీద కోపము రాక ఎవరిమీద వస్తుంది.
ఈరయ్య :- పుల్లయ్యకు కోపమువచ్చి దేవున్ని "దరిద్రపు నారాయణ" అన్నాడు. అది నీకూ, పుల్లయ్యకు తిట్టుగా ఉండవచ్చును. కానీ అతను ఆ మాటను చెప్పడములో కొంత మార్చి తేడాగా చెప్పాడు. కానీ ఆ తేడాను సరిచేసి పలికితే, ఆ మాట వాస్తవమైనదేనని చెప్పవచ్చును. ఆ మాటను పూర్వము దరిద్రపు నారాయణ అని పలికెడివారు కాదు, "దరిదాపు నారాయణ" అని పలికెడివారు. దరిదాపు అను పదము కొంత పలకడములో మారిపోయి "దరిద్రాపు" అని పలకడము జరిగినది. మొదట "దా" కు "ర" వత్తు వచ్చినది. తర్వాత కొంత కాలమునకు 'ద్రా' దీర్గము పోయి "ద్ర"గ మిగిలిపోయినది. చివరకు దరిద్రపు అని నేడు పిలువబడుతున్నది. పూర్వము జ్ఞానుల ఉద్దేశము "దరిదాపు" అని కలదు దాని అర్థము దరి అనగా సవిూపమున అని, దాపు అనగా దూరముగా అని తెలియవలెను. నారాయణ అనగా నాశనము లేని దేవుడని అర్థము. నాశనములేని దేవుడు మనకు దగ్గరలోనున్నాడు, మరియు దూరములో కూడ ఉన్నాడు. దీనినిబట్టి దేవుడు అంతటా అణువణువున వ్యాపించియున్నాడని తెలియుచున్నది. దగ్గర, దూరము, అంతటా ఉన్నాడనుటకు, ఇందుగలడు అందులేడు అనుటకు వీలుకాకుండ, దరిదాపులో ఉన్నాడని పెద్దలు పూర్వము చెప్పినమాట "దరి దాపు నారాయణ". కొందరు భక్తులు ఈ విషయము ఒక పాటగా పాడుట చూచాను.
1. దరి దాపు నారాయణ! నీకు తెలియంది లేదు నారాయణ!
2. ముందు వెనుక నారాయణ! నీవులేని జాగాలేదు నారాయణ!
3. పైన కింద నారాయణ! నీవు చూడంది లేదు నారాయణ!
అని పాట పాడెడివారు. పూర్వపు జ్ఞానులు పోయారు, వారి జ్ఞానము పోయింది. నేడు దరిదాపు నారాయణ అను పదము దరిద్రపు నారాయణగా మారిపోయింది. పూర్వము జ్ఞానము కల్గినవారు దేవున్ని కీర్తించే దానికి ఆ పదము వాడితే, నేడు అజ్ఞానముతో దేవున్ని దూషించేదానికి ఆ పదమును కొంత మార్చి వాడుతున్నారు.
రామయ్య :- అరే! ఈ మాటలో ఇంత అర్థము దాగి ఉన్నట్లు ఎవరికీ తెలియదే! కాలక్రమేపి మాట కొంత మారిపోయి ఎంత అజ్ఞానములో పడి పోయాము.
ఈరయ్య :- అవును రామయ్య! మననోటివెంట వచ్చే మాటలు ఎంతో అర్థముతో కూడుకొనియున్నా, వాటి భావము మనకు తెలియకుండ పోయిన దానివలన మంచి మాటను చెడ్డమాటగా, చెడ్డమాటను మంచి మాటగా లెక్కించుకొనుచున్నాము. మనకు చెడును కల్గించు వాక్యములను దీవెనలని, మంచిని సూచించు వాక్యములను దూషించు తిట్లని అనుకొనుచున్నాము. ఇప్పుడు పుల్లయ్య కూడ తనకు తెలియని దానివలన మంచి వాక్యములనే పలుకుచు, దేవున్ని నిలదీసి అడిగినట్లు దేవునికి దయలేదు, నీతిలేదు, న్యాయములేదు అన్నాడు కదా! పుల్లయ్య ఏ భావముతో చెప్పినా ఆయన అన్నవన్ని సత్యమైన వాక్కులే. పుల్లయ్య దేవున్ని నిందించు భావముతో అనినా, వాస్తవముగా దేవుడు దయలేనివాడే. దేవునికి గుణములుండవు, దేవుడు గుణరహితుడు. కోపము అను గుణమునకు వ్యతిరేఖమైనది దయా గుణము. దేవుడు గుణరహితుడు కావున ఆయనకు మంచి గుణమైన దయగానీ, చెడు గుణమైన కోపముగానీ ఉండవు. అందువలన పుల్లయ్య చెప్పినమాట వాస్తవమైనదే. అంతేకాక పుల్లయ్య తన స్నేహితునితో దేవుని వద్ద నీతి, న్యాయములేదని అన్నాడు. ప్రపంచములో నీతి, న్యాయము లేని వానిని అవినీతి పరునిగా, అన్యాయపరునిగా మొత్తము మీద చెడ్డవానిగా లెక్కించుకొంటాము. పుల్లయ్య దేవుని మీద కోపముతో దేవుడు నీతి న్యాయము లేనివాడనినా ఆ మాట వాస్తవమే.
ప్రపంచములో పుట్టిన మనిషి సక్రమముగా నడుచుకొనుటకు నీతి, న్యాయము అవసరము. కానీ దేవునికి నీతి, న్యాయము అవసరము లేదు. దేవునివద్ద ఉండునవి జ్ఞానము, ధర్మము. దేవునికి ప్రపంచము నీతిగానీ, ప్రపంచపు న్యాయముగానీ అవసరములేదు. దేవుడు నీతి, న్యాయము ఆధారము చేసుకొని ఉండడు. దేవుడు జ్ఞానము, ధర్మములను కల్గియుండును. అందువలన మనిషి కూడ జ్ఞానము, ధర్మములను తెలుసుకొంటేనే దేవుని వద్దకు పోగలడు. అట్లుకాక ప్రపంచములోని నీతిని, న్యాయమును ఆధారము చేసుకొని ఎవరు దేవునివద్దకు పోలేరు. నీతి, న్యాయము వలన మనిషికి పుణ్యము, అవినీతి అన్యాయము వలన పాపము వస్తాయి, కానీ ముక్తిరాదు. అందువలన నీతి, న్యాయము లోక సంబంధమైనవి. జ్ఞానము ధర్మము దైవసంబంధమైనవని చెప్పవచ్చును. పుల్లయ్య తెలియక చెప్పినప్పటికి దేవునికి నీతి న్యాయము లేదు అనునది సత్యమైన మాటయే. ఈ విధముగా అనేక విధములుగా మంచిని చెడుగా, చెడును మంచిగా మనిషి అర్థము చేసుకోవము వలన తిట్లేలో దీవెనలేవో తెలియక, తిట్ల స్థానములోనికి దీవెనలు, దీవెనల స్థానములోనికి తిట్లు చేరిపోయినవి. ఉన్న సత్యమును ఆలోచిస్తే పూర్వమున్న భావమునకు, ఇప్పటి భావమునకు ఎంతో తేడా వచ్చినదని చెప్పవచ్చును. ఆ తేడాలనే ఈ గ్రంథములో విప్పి చెప్పడమైనదని గ్రహించవలెను. అట్లుకాక మేము ఏవో కల్పితములు చేసి వ్రాసినాడని అనుకోవద్దండి. ఇవి కల్పితమైన కవిత్వముగాదు, యదార్థమైన, మార్పు చెందిన విషయములని తెల్పుచున్నాము.
-***-