తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/ఇష్ఠార్థ ఫల సిద్దిరస్తు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇష్ఠార్థ ఫల సిద్దిరస్తు

ఈ పద్ధతి ప్రకారమే మరికొన్ని తిట్లు నేడు దీవెనలరూపములలో అక్కడక్కడ వినిపిస్తున్నవి. వాటిలో "ఇష్ఠార్థ ఫలసిద్ధిరస్తు" అను ఒకదానిని వివరించుకొందాము. మానవునికి ఇష్టము రెండురకములుగ ఉండును. ఇష్టము అనునది మానవునికున్న గుణము కానేకాదు. అట్లని జ్ఞానము కాదు. గుణములపట్ల ఉన్న శ్రద్ధను ఇష్టము అంటున్నాము. గుణములు ప్రపంచవిషయములకు సంబంధించినవి, కావున గుణములలోనున్న శ్రద్ధను విషయశ్రద్ధని అంటున్నాము. అదే విధముగ గుణముల సంబంధము లేకుండ దైవజ్ఞానము మీదగల ఇష్టమును జ్ఞానశ్రద్ధ అంటున్నాము. ఈ విధముగ ఒకటి విషయశ్రద్ధ, రెండు జ్ఞానశ్రద్దని మొత్తము రెండు రకములు గలవు. మనిషికి 'శ్రద్ధ' లేక 'ఇష్టము' అనునది గుణము కాదు, కావున అది కర్మననుసరించి వచ్చునదికాదు. మానవునికి జన్మతః కల్గిన హక్కు శ్రద్ధ. మనిషి విషయశ్రద్ధనుగాని లేక జ్ఞానశ్రద్ధనుగాని స్వతహాగా ఏకర్మప్రమేయము లేకుండ కల్గియుండ వచ్చును. జ్ఞానశ్రద్దను బట్టి జ్ఞానము లభించును, కావున 'శద్ద్రవాన్‌ లభతే జ్ఞానమ్‌' అని భగవద్గీతలో చెప్పారు. జ్ఞానశ్రద్ధ ఉన్నవానికి శ్రద్ధను బట్టి జ్ఞానము లభించునుగాని, విషయశ్రద్ధను బట్టి విషయములు నెరవేరుననుకోకూడదు. కర్మలిఖితములో జ్ఞానముండదు, కావున శ్రద్ధయున్నంత జ్ఞానము లభించును. కర్మలిఖితములో విషయ ప్రాప్తము అప్రాప్తములుండును, కావున శ్రద్ధయున్నంత మాత్రమున విషయములు నెరవేరుననుటకు వీలులేదు. ఉదాహరణకు ఒకనికి ఆహారపదార్థములలోకెల్ల లడ్డుమీద ఎక్కువ ఇష్టముండవచ్చును. అయినంత మాత్రమున లడ్డువానికి లభించునని చెప్పుటకు వీలులేదు. ఏపూట ఏ ఆహారము తినవలెనని కర్మప్రకారము వ్రాసిపెట్టబడియుండునో ఆ విధముగనే వానికి ఆహారము లభించును. దీనినిబట్టి శ్రద్ధ రెండు రకములున్నప్పటికి ఒకటి కర్మాతీతమై నెరవేరునదై ఉన్నది, రెండవది కర్మాధీనమై నెరవేరునని చెప్పుటకు వీలులేనిదై ఉన్నది. ఇష్ఠార్థము అన్నపుడు శ్రద్ధను బట్టి అను అర్థమొచ్చును. "ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు" అన్నపుడు శ్రద్దను బట్టి ఫలము సిద్ధించవలెనని చెప్పడము. నీశ్రద్ధను బట్టి ఫలము కలుగవలెనని పెద్దలు చెప్పినప్పటికి ఆ వాక్యము దీవెనగ మారవచ్చును లేక దూషణగ మారవచ్చును. ఒకే వాక్యము దీవెనగ మరియు దూషణగ ఎట్లు మారుచున్నదనగా! ఒక మనిషికి జ్ఞానము మీద శ్రద్ధయున్నపుడు పెద్దలు అతనికిచ్చిన వాక్యము దీవెనగ మారును. ఎందుకనగ వానికి లభించునది జ్ఞానము, కనుక శుభమును చేకూర్చు వాక్యము కావున దానిని దీవెన అనవచ్చును. జ్ఞానమును గురించి దీవించకున్నను అతనికెట్లయిన జ్ఞానమేలభించును. దీవించితే వానికి దీవెన బలము కూడ చేకూరును. ఒకవేళ మనిషికున్న శ్రద్ధ విషయశ్రద్ధ అయితే, అది నెరవేరవలెనని దీవించినప్పటికి అది మరుజన్మమున నెరవేరినప్పటికి, ప్రపంచ విషయములలో కూరుకపోయేదే, కావున అది దీవెనగ కనిపించినప్పటికి వాస్తవముగ దానిని దూషణ అనియే చెప్పవచ్చును. "ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు" అను వాక్యము ఒక్కటి మాత్రము ఒకప్పుడు దీవెనగ, మరొకప్పుడు తిట్టుగ మారుటకు అవకాశము గలదు. ఇష్టము అనిన శ్రద్ధ అనిన రెండు ఒక్కటే, అలాగే ఆశ అనిన కామము అనిన రెండు ఒక్కటే. కావున ఇష్టార్థమునకు కామ్యార్థమునకు ఎంతో తేడాగలదు. ఇష్టము జీవునికిగల స్వంత హక్కు కాగ, ఆశ గుణచక్రములో గల మొదటిగుణము. గుణములకు సంబంధించిన వాక్కు ఏదైన వాస్తవముగ దూషణ అగును. అలాగే జ్ఞానమునకు సంబంధించిన వాక్కు ఏదైన వాస్తవముగ దీవెన అగును. గుణములకు సంబంధించినవేవైన విషయసుఖములలో ముంచునని, మానవునికి చెడును చేకూర్చునవి, కర్మనుమూట గట్టునవి కావున వాటిని దూషణలనియే చెప్పవచ్చును. జ్ఞానమునకు సంబంధించినవేవైన విషయములనుండి కడతేర్చునవి, మానవునికి శుభమును చేకూర్చునవి, కర్మలనుండి విముక్తి కల్గించునవై ఉండును. కావున వాటిని దీవెనలనియే చెప్పవచ్చును. గుణ విషయములకు సంబంధించి దీవెనలవలెనున్న దూషణలలో మరొక దానిని క్రింద చూస్తాము.

-***-