తిక్కన సోమయాజి/తొమ్మిదవ యధ్యాయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తొమ్మిదవ యధ్యాయము

ఆంధ్రమహాభారతరచనము.

తిక్కనసోమయాజి దశకుమారచరిత్రము నంకితము నొందిన పిమ్మటఁ గొంతకాలముసకు మనుమసిద్ధిరాజునకు శత్రువులనుండి కష్టములు గలుగుచుండుటఁ గన్నులారఁ గాంచుట తటస్థ మగుచు వచ్చెను. రాజ్యసంరక్షణము దుర్భర మై గన్పట్టెను. మనుమసిద్ధిరాజు దాయాదివర్గమునుండి కలిగెడు బాధలను దప్పించుకొనుటకై కాకతీయ సైన్యాధిపతులకు వశ్యుఁడై మెలగవలసి వచ్చెను. తిక్కన సామాద్యుపాయ తంత్రముచే నెన్నితడవలు మనుమసిద్ధిరాజును గాపాడి రాజ్యము నిలువఁ బెట్టగలిగినను దుదకు దై వసంఘటనము, వేఱుగ నుండెను. కడపట గొల్లరాజులతోఁ బసులమేపుబీళ్ల కై తగవులు పడి యుద్ధములో మనుమసిద్ధియును, తనపెదతండ్రికుమారుఁడు ఖడ్గతిక్కనయు మరణము నొందుటను గాంచెను. వృద్ధుఁడైన పెదతండ్రి సిద్ధనామాత్యుడు గూఁఢ స్వర్గస్థుఁ డయ్యెను. మనుమసిద్ధి రాజ్యమును గాకతీయసైన్యాధిపతు లాక్రమించుకొని పరిపాలింప సాగిరి. దేశస్థితి యంతయును మాఱిపోయెను. జనులలో శైవవైష్ణవమతభేదములు ముదిరి పక్షము లేర్పడి తగవులు ప్రారంభ మయ్యెను. ప్రజలు ధర్మస్వరూపమును గుఱ్తెఱుంగఁ జాలక యధర్మమార్గ ప్రవర్తకులై వ్యవహరించుటను జూచి చింతిల్లు చుండెను. తిక్కనసోమయాజికి వయస్సు ముదిరినకొలది వైరాగ్యబుద్దియు నెచ్చగు చుండెను. మనునుసిద్దియు, గణపతి దేవచక్రవర్తియు నొసంగినయగ్రహారములు భుక్తికిఁ జూలియుండుటచేత తిక్కన సోమయాజి లౌక్యాధికార పదవులమీఁది యాసక్తిని విడిచి ధర్మానురక్తి గలిగి తనజీవితమును లోకహితార్థము వినియోగింప బ్రతిజ్ఞచేసి సంకల్పసిద్ధుఁడయ్యెను. ప్రజలకు సమస్తధర్మములను బోధించునది. పంచమవేద మనంబరగు మహాభారతము సంస్కృతభాషయందుండుట చేత జనసామాన్యమునకు దుర్గ్రాహ్యమై యుండెను. ఆంధ్రు లజ్ఞానాంధకారములో మునిగియుండి భాసురభారతార్థముల భంగుల నిక్క మెఱుంగనేరక గాసటబీసటలే చదివిఁ గాథలు త్రవ్వు చుండెడివా రని యెఱ్ఱాప్రెగ్గడ వక్కాణించెను. [1] ఆంధ్రులకు భారతధర్మముల నాంధ్రభాషమూలముగా బోధించుటయే పరమార్థముగా గ్రహించెను. ధర్మాద్వైతమతసాంప్రదాయము లాంధ్రులకు సులభసాధ్యము లగుటకుమార్గము భారత మాంధ్రభాషలో రచింపఁబడుట కర్తవ్య మని దృఢముగా నాతనిమనస్సునకుఁ దట్టెను. దీనినే తిక్కన సోమయాజి విరాటపర్వములో మొదట కృతినిర్మాణప్రస్తావనలో వివరించినాఁడు. విద్యత్సంస్తవనీయ భవ్యకవితావేశుఁడును, విజ్ఞానసంపద్విఖ్యాతుఁడును, సంయమిప్రకర సంభావ్యాను భావుఁడును, నగుకృష్ణద్వైపాయనుడు (వ్యాసుఁడు) అభిలాషతో లోక హితనిష్ఠను బూని భారతమనువేదమును ధర్మాద్వైతస్థితి ననుసరించి రచించె నని చెప్పినాఁడు. [2] ఇదియే ధర్మార్థకామమోక్షస్థితికి మూదల (మూలతల) యని నుడివెను. ఇట్టి భారతము నాంధ్రకవిత్వవిశారదుఁ డైన నన్నయభట్టారకుఁడు ప్రారంభించి మూఁడుకృతులు (మూఁడు పర్వములు) దక్షతతో రచించె నని,

"ఉ. ఆదరణీయసార వివిధార్థగతిస్ఫురణంబు గల్గియ
     ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెనుపొంది యుండ నం
     దాది దొడంగి మూఁడుకృత లాంధ్రకవిత్వవిశారదుండు వి
     ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టుదక్షత౯"

అనుపద్యములోఁ జెప్పి జనసంప్రార్థ్యము లౌటం జేసి నాలుగవపర్వ మగువిరాటపర్వము మొదలుకొని తక్కినపదునేను పర్వములును దుదిముట్ట రచించుట యొప్పు నని యిఅదిగువ పద్యములోఁ జెప్పి యున్నాఁడు.

"మ. హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసా
     భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
     బదియేనింటిఁ దెనుంగుబాస జననసంప్రార్థ్యంబు లై పెంపునం
     దుది ముట్ట౯ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారగ౯ ”

ఈ పై రెండుపద్యములం జదివినవారికిఁ దిక్కన సుహృదయముబోధపడక మానదు. ఇదివఱ కొకపండితునిచేఁ దెలిగింపఁబడినభాగమును మరల దాను దెలిగించుట ధర్మముగాదని విడిచి విరాటపర్వము మొదలుకొని రచించుట తగ వని చెప్పెను. కవిధర్మము నాలోచించి కొఱగానిపనులు గూడ వని తలంచి యామూఁడుపర్వములను దెలిగింపక విడిచిపెట్టినాఁడు గాని తెలిగింపఁ జేతఁగాక కాదు. అట్లుగాక తిక్కన మొదలనుండియుఁ దెలిగించెనేని నన్నయభట్టు మూడుపర్వములు నధర్వణాచార్యుఁడు రచించినపర్వములవలెనే సర్వత్ర వ్యాపింపక నశించిపోయి యుండును. అ ట్లొనరించుటకుఁ దిక్కన సమ్మతింప లేదు. దీన్నిఁబట్టి తిక్కన యెట్టెసుహృదయము గలవాఁడో తేఁటపడ గలదు. తాను దెనిగింపకుండుటయే గాక నన్నయ దక్షతతో మూఁడుకృతులు రచించె నని యోగ్యతాపత్రముగూడ నొసంగి గౌరవించి నాఁడు.

"ఆరణ్యపర్వము నాంధ్రీకరించుటచేతనే నన్నయభట్టు మతిభ్రమణము గలిగి మృతినొందె నని తలఁచుకొని తాను దానిని దెలిగించినచో తనగతియు నట్లే యగునన్న భీతిచేత నితఁడు దానిని తెనిఁగింపఁ డయ్యెను. అందుచేత తెనుఁగు భారతము కొంతకాలము పూర్ణముగా లేక కొఱతపడి యుండెను. ఆకాలమునందు వ్రాయఁబడినతాళపత్ర గ్రంథములు కొన్ని యిప్పటికిని వనపర్వశేషము లేకయే కానఁబడుచున్నవి. కవిని బట్టినభీతియే తరువాత నారణ్యపర్వశేషమును జేసిన యెఱ్ఱాప్రెగ్గడకును పట్టి తనపేరిట గ్రంథరచన చేయక రాజనరేంద్రుని కంకితముగా నన్నయభట్టు పేరుపెట్టియే దానిని రచించెను. అంతేకాక భారతమును చదువువారు సయితము నేటివఱకును ఆరణ్యపర్వము లోనికొంతభాగము వదలియే మఱి గ్రంథపఠనము చేయుచున్నారు." అని యాంధ్రకవుల చరిత్రమునం దతి శయోక్తిగా వ్రాయఁబడిన వాక్యములు యథార్థములుగాఁ గన్పట్టవు. ఆరణ్యపర్వమును సంపూర్తిగానే నన్నయభట్టు రచించె నని తిక్కనపద్యమువలనఁ దెల్లమగుచున్నది. నన్నయభట్టు కృతారణ్యపర్వము తిక్కన కాలమునాటికి బాగుగానే యుండి యెఱాప్రెగ్గడకాలమునాటికి నాపర్వములోని కడపటిభాగము నశించి యుండవచ్చును. దానిని శంభుదాసు తెనిఁగించి యుండును. అంతియకాని యారణ్యపర్వము తెనిగించుటచేత నన్నయకుఁ బిచ్చి యెత్తిన దని భయపడి తిక్కన దానిని విడిచి పెట్టి విరాటపర్వము నుండియుఁ దెనిగించినాఁ డనిచెప్పెడికథ లేవియును విశ్వాసార్హములు గావు. నన్నయభట్టునకు రెండుశతాబ్దులకు బిమ్మటనున్న తిక్కనసోమయాజి వఱకు భారతమాంధ్రీకరింపఁ బడియుండుటకుఁ గారణమునడుమకాలమునఁ గవులు లేక యుండుట గాదు. కవుల నేకులు గలరు. కాని వారి కాత్మశక్తి యందు విశ్వాసము లేదు. ఈమహోత్కృష్టగ్రంథము నాంధ్రీకరించుటకు గొప్ప ప్రతిభాశాలి పుట్టవలయు నని తలంచి యుందురు. వారు తలంచినవిధముగానే ప్రజ్ఞానిధి పుట్టెను. నిర్వచనోత్తరరామాయణము రచించునాటికిఁ దిక్కన తానెంత వైదికమార్గప్రవర్తకుఁడై యున్నను శివభక్తిపరాయణుఁడై యుండెను. తరువాత శ్రౌతస్మార్తక్రియాతత్పరుఁడై పూర్వమీమాంస మతావలంబకుఁడై కర్మాచరణమె ప్రాధాన్యముగాఁ దలంచెను. భారతమును రచించునాటికి హరిహరులకభేదమును బాటించి యద్వైతమునం దాసక్తిజనించియే తన్మతసాంప్రదాయములను ధర్మములను లోకమున వ్యాపింపఁజేయ సంకల్ప ముదయించి యందుకొఱకే తక్కినజీవితకాలము నంతయు వినియోగించి కృతకృత్యుఁడై ధన్యుఁడయ్యెను. కావున సోమయాజిమతము ప్రథమమునుండియు నొక్కతీరున నుండెననిచెప్ప వీలులేదు. అద్వైతమతధర్మములను సిద్ధాంతములను

భారతము మూలముగా నాంధ్రభాషలో మొదట రచించినవాఁడు తిక్కన యనియే భావించెదను. తిక్కనసోమయాజి హరిహరనాధరూపుఁ డగు పరవస్తువును సగుణబ్రహ్మముగాఁ భావించి,

"ఉ. శ్రీ యన గౌరి నాఁబరఁగుచెల్వకుఁ జిత్తము పల్లలివింప భ
    ద్రాయతమూర్తియై హరిహరం బగురూపముఁ దాల్చి విష్ణురూ
    పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
    ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికి౯."

అని సకలబ్రహ్మప్రార్థనము చేసి తత్ప్రసాదలబ్ధకవిత్వతత్త్వ నిరతిశయాను భావానందభరితాంతః కరణుం డగుచుఁ బైని నుడివినవిధముగాఁ బదేనుపర్వములు రచించుటకుఁ బూనుకొని యీప్రబంధమండలి కెవ్వని నధినాధునిగాఁ బేర్కొందునా యనియొకనాఁడు వితర్కింపుచు నిద్రించెనఁట. ఇక్కడ తిక్కనసోమయాజి తనకుఁ గలపితృభక్తిని దేఁటపఱచుటకై చమత్కారముగా స్వప్నవృత్తాంతమును గల్పించి చొప్పించినాఁడు. తనతండ్రియైన కొమ్మనామాత్యుడు స్వప్నములోఁ గన్పడఁ దిక్కన నమస్కారము చేసెనఁట. అందుల కాతఁడు వాత్సల్య మతిశయించు నట్లుగా వాని నాదరించి దీవించి కరుణార్ద్ర దృష్టితోఁ జూచి యిట్లు పలికె నఁట. కుమారా! "కిమస్థి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వమ్| కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవస్వాదు వదప్రభోమే!” అని నీవు తొల్లి రచించిన పద్యమును గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుఁ డైనహరిహరనాథుఁడు నీదెస దయాళుఁడై యునికిం జేసి నిన్నుఁ గృతార్థునిఁ జేయఁ గార్యార్థి యయినాకలోకనివాసి యయిననాకుఁ దనదివ్యచిత్తమునం గలకారుణ్యము తెఱం గెఱుంగు నట్టిశ క్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయంచేయుచున్నవాఁ”డని చూపె నఁట. అంతఁ దిక్కన సవిశేషసంభ్రమసంభరిత హృదయుండై యవ్వలను గనుంగొను నప్పుడు సర్వేశ్వరుఁ డీక్రింది స్వరూపముతో సాక్షాత్కరించె నని యిట్లు వర్ణించి యున్నాఁడు.

“సీ, కరుణారసము వొంగి తొరగెడుచాడ్పు స
          శశిరేఖ నమృతంబు జూలువాఱ
    హరినీలపాత్రిక సురభిచందనమున
          గతినాభి ధవళపంకజము మెఱయ
    గుఱియైన చెలువున నెఱసిన లోకర
          క్షణ మనంగ గళంబు చాయ దోఁపఁ
    బ్రథమాద్రిఁ దోతెంచుభానుబింబము నా ను
          రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప

 తే. సురనదియును గాళిందియును బెరసి నట్టి
    కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
    నామనంబు నానందమగ్నముగ జేయ
    నెలమి సన్నిథిసేసె సర్వేశ్వరుండు."

అట్లు సర్వేశ్వరుఁడు ప్రత్యక్షము కాఁగా నతఁడు భక్తియుక్తముగా సాష్టాంగదండప్రణామం బాచరించి కొంచెము దొలఁగి వినయావనతుఁడై లలాటోపరిభాగమున నంజలిపుటంబు ఘటించి నయనంబులు ప్రమదబాష్పసలిలవిలులితంబులుగను నవయవంబులు, పులకపటలపరి కలితంబులుగను నుండ నిలు చుండె నఁట, అంత నద్దేవుం డనుకంపాతిశయముచేతఁ జిఱు నగవు నగుచు నిట్లనియె నఁట.

"ఉ. వైదికమార్గనిష్ఠ మగువర్తనముం దగ నిర్వహించుచు౯
     భేదములేనిభక్తి నతనిర్మలవృత్తిగఁ జేయుచుండి మ
     త్పాదనిరంతరస్మరణ తత్పరభావముకల్మి నాత్మ స
     మ్మోదముఁ బొంది కార్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడు౯."

అందును,

క. పారాశర్యునికృతి యయి
   భారత మను పేరఁ బరఁగుపంచమవేదం
   భారాధ్యము జనులకుఁ ద
   ద్గౌరవ మూహించి నీ వఖండితభక్తి౯

తే. తెనుఁగుబాస వినిర్మింపఁ దివురు టరయ
   భవ్యపురుషార్థతరుపక్వఫలము గాదె
   దీని కెడనియ్యకొని వేడ్క నూని కృతిప
   తిత్వ మర్థించి వచ్చితి తిక్కశర్మ.”

ఇట్టిదివ్యవచనామృతముచే నాతనియుల్లంబును వెల్లి గొలుపఁ బునఃపునఃప్రణామంబు లాచరించి యప్రమేయ ప్రభావభావనాతీతుం డయ్యు నాపరమేశ్వరుఁ డాశ్రితులకు నత్యంతసులభుఁ డని యదివఱకు బుధులవలన వినియుండుటఁజేసి తనుబోటి బాల స్వభావునకు నిట్టి మహనీయమహిమ దొరకొనుటయుఁ గలుగునుగాక యని తలంచుచు నాదేవునకు విన్నపము సేయుఁవాఁడై కొమ్మనామాత్యు నానన మాలోకించె నఁట. అంత నతం డనుమతి యొసఁగె నఁట. అందుపైఁ దిక్కన యా దేవున కిట్లు విన్నవించుకొనియె నఁట.

"క. భూరిభవత్కారుణ్య
    క్షీరాంబుధి సాదుతుచ్చచిత్తంబున వి
    స్తారమహితముగ నునిచితి
    వారయ నచ్చెరువుగాదె యఖిలాండపతీ.

ఉ. ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి న
   త్యంతవిభూతిఁ బెం పెసఁగు నట్టినినుం గొనియాడఁజేతఁదా
   నెంతటిపెద్ద నీకరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింకజ
   న్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసిసుఖాత్ముఁజేయవే."

అని యుపలాలితుఁ డగుబిడ్డఁడు తనకొలఁది యెఱుంగక మహాపదార్థమును వేడువిధముగా బ్రహ్మనందస్థితం గోరి యా జగన్నాధునకు మరల సాష్టాంగ నమస్కారం బాచరించె నఁట. అప్పుడు భగవంతుఁడు ప్రసన్నముఖుఁ డై యిట్లు పలికె నఁట.

"తే. జనన మరణాదు లైన సంసారదురిత
    ములకు నగపడకుండంగఁ దొలఁగుతెరువు
    గనువెలుంగు నీకిచ్చితి ననిన లేచి
    నిలిచి సంతోష మెదనిండ నెలవుకొనఁగ."

అంతఁ దిక్కన మేలుకాంచె నఁట. అంత భక్తితాత్పర్యములు మానసంబున ముప్పిరిగొన నతం డిట్లు ప్రతిజ్ఞాదికమును జేసెను.

“ఉ. ఇట్టిపదంబుగాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
     పట్టునఁ బూజ్యమూర్తి యగుభారతసంహితఁ జెప్పఁ గంటినా
     పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుం
     గట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.

ఉ. కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగు౯ జనా
    భ్యర్చిత మైనభారత మపారకృపాపరతంత్రవృత్తిమైఁ
    బేర్చినదేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ది నా
    నేర్చినభంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికి౯.

ఇది అనన్యసామాన్యం బగుపరమధర్మప్రకారంబు,

ఉ. కావున భారతామృతము గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
    ధ్రావలి మోదముం బొరయు నట్లుగ సాత్యవతేయసంస్మృతి
    శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వదీ
    క్షావిధి నొంది పద్యముల గద్యముల౯ రచియించెదం గృతుల్.”

ఈ పైయవతారికలోని స్పప్నవృత్తాంతమును మనము చక్కఁగాఁ బరిశీలించువార మగుదుమేని తిక్కనసోమయాజి స్వాభిప్రాయ ప్రకటనము నెంత ప్రౌఢముగాఁ జేసి యున్నాఁడో స్పష్టముగాక మానదు. ఈస్వప్నవృత్తాంత మీతనికిఁ బితృభక్తివిశేషముగాఁ గలదని తేఁటపఱచుచున్నది. తనపితృభక్తిని లోకమునకు వెల్లడించుకొఱకే స్వప్న వృత్తాంతమును జొప్పించినాఁడు. తిక్కనతండ్రి కొమ్మనామాత్యుఁడు తిక్కన బాల్యముననే మృతి నొందియుండును. తిక్కన యిట్టిపవిత్రమైనభక్తిని జూపుట కదియే కారణమై యుండు నని నాయభిప్రాయము. ఇందు హరిహరనాథుని స్వరూపము నెంతో చక్కఁగా వర్ణించి యున్నాడు. దేవునకును దనకును నడుమను దనతండ్రిని బ్రవేశపెట్టి వానిమూలమున దేవునిఁ బ్రత్యక్షము గావించుకొని “కృతిపతిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ” అని యతఁడే కావ్య మంకితము చేయు మని యడిగి నట్లుగాఁ జెప్పినది ప్రౌఢముగా నున్నదనుటకు సంశయము లేదు. తిక్కనసోమయాజి తనకుఁ గలవైదికమార్గ నిష్ఠ మగువర్తనమును, హరిహరులయెడ భేదములేక సమభ క్తి గలిగి యుండుటయును, స్మరియించి తదుభయ సగుణమూర్త్యధి దేవతయగు హరిహరనాధునియెడఁ దనకుండు నిరంతరభక్తితోఁ గూడుకొన్న యాత్మానందానుభవమును లోకమునకుఁ దెలిపిన విధము మిక్కిలి ప్రౌఢముగా నున్నది. భారతము పంచమవేద మని ప్రసిద్ధిఁ జెందినగ్రంథ మగుటచేతఁ దానిం దెనిగించునపుడు దనకును దనవంశమునకును గలశ్రేష్ఠత్వమును, దేవతాభక్తి మొదలగు వానిని బ్రకటింపక యున్నచోఁ దనగ్రంథము సర్వజనాదరణ పాత్రముగా దనుతలంపుతో సోమయాజి స్వకీయశిష్టత్వమును బ్రకటించుకొనె ననికవిజీవిత గ్రంథకారుఁడు సూచించెను. ఇదియే నిజమైనయెడల తిక్కన వైదికమార్గనిష్ఠమగు ప్రవర్తనము కల్ల యని తేటపడఁ గలదు. అభినవదండి దశకుమారచరిత్రమునఁ దిక్కననుగూర్చి చేసిన వర్ణనము తిక్కనసోమయాజి చెప్పుకొన్న వైదికమార్గనిష్ఠమగు వర్తనము కల్లగాక సత్యమైనదే యని వేనోళ్ళ రుజువు చేయు చున్నది. కాని యాకవిజీవితగ్రంథకారుఁడే మఱియొక చోట

"కాని స్వప్నములను నమ్మి వానిని గ్రంథస్థముఁ జేసినయాంధ్రకవులలో నీతఁడే మొదటివాఁడు. భగవదుపాసనాపరులకుఁ దన్మూలముగ నంతఃకరణపరిపాకము గలిగి యిట్టిభగవదనుగ్రహ సూచకస్వప్నంబు లగుటయు విశేషమహత్తులు లభ్యమగుటయు నైసర్గికములే యని యాస్తికుల కు విశేషించి చెప్పవలసినది లేదు. సోమయాజియు నట్టియుపాసనాబలంబున విజ్ఞానసంపన్నుఁడై భారతరహస్యార్థములఁ దెలిసికొని వేదముం బ్రకటించిన చతురాననప్రతిష్ఠ నంది యుండె నని చెప్పుటకు సందియము లేదు. ** * * * సోమయాజికి వేదాంతాది శాస్త్రములందును, సాంఖ్యయోగాది శాస్త్రములలోపలను గలవిశేషపాండిత్యము శాంత్యానుశాసనిక పర్వములను తక్కినపర్వములలోఁ దత్త్వముం జెప్పెడు నితిహాసాదులవలనం గోచరంబులుగాఁ గలవు. పూర్వోత్తరమీమాంసశాస్త్రము లెంతయు నేర్చినవాఁ డని సోమయాజి జైనపండితులతోఁ జేసిన సంవాదాదికము వలనం గోచరంబగును. అట్టివాని వివరములు గ్రంథస్థములు గాకున్నను. అట్టిసంవాదములు విషయముమాత్రము సోమదేవరాజీయము మొదలగు గ్రంథములలో గొంత వివరింపఁ బడియున్నదానినే నీవఱకే ప్రకటించితిని.”

అనివ్రాసి యుండెను. ఇన్నిశాస్త్రములు చదువుకొని యిన్ని సాంప్రదాయములు దెలిసియుండి యింతవిజ్ఞానసంపన్నుడైనవేదవేత్త యాకాలమున వైదికమార్గనిష్ఠమగు పర్తనము గలిగి యుండెననుట యవిశ్వాసపాత్రము గాదు. వేదాంతతత్త్వరహస్యంబులు, చిదచిద్వివేకంబుల ధర్మాధర్మంబులు, రాజనీతిప్రకారంబులు, భారతవీరుల ప్రభావంబులు మొదలుగాఁగల భారతార్థముల నాంధ్రావలి మోదముం బొరయు నట్లుగాఁ దెలిపి యాంధ్రప్రపంచము సుద్దరించుటయే తిక్కనసోమయాజి మనోసంకల్పమై యుండెను. అందుకొఱకే యామహానుభావుఁడు మహాకవిత్వ దీక్షావిధిని బూని సాత్యవతేయుని సంస్మరించి 'యీదృశంబు లగు పుణ్యప్రబంధములు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్కయారాధనవిశేషంబుగాఁ దలంచి'

"క. హరిహరనాథునకు మరు
    త్సరిదాకల్పితమనోజ్ఞ చరణ శిరస్సుం
    దరమూర్తికి భావనత
    త్పరచేతోయుక్త భక్తపరతంత్రునకు౯."

తాను 'విన్నపంబు సేయుతెఱంగుగా నంతస్సన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబుసేయు' వాడై

“శ. జలనిధిహిమవద్భూధర
    కలితజననకేళి కౌతుకవ్యక్తావ్య
    క్తలలిత సౌందర్యస్ఫుర
    దలఘుతను స్త్రీసవాథ హరిహరనాథా!"

"దేవా దివ్యచిత్తంబున నవధరింపు" మని హరిహరనాథునిఁ బ్రసాదాభిముఖుని గావించుకొని విరాటపర్వము మొదలుగా స్వర్గారోహణపర్యంతముఁ బదునేనుబర్వముల నాంద్రీకరించి యాంధ్రదేశీ యుల నుద్ధరించి,

చ. పరమపదాప్తిహేతు వగుభారతసంహిత శౌనకాదిభూ
    సురవరు లింపునం గరంగుచొప్పనఁ జెప్పిన వారు మోదసం
    భరితతఁ బొంది యక్కథకు బ్రాఁతిగ నర్పితుఁ జేసి రర్మిలి౯
    హరిహరనాథ సర్వభువనార్చిత న౯ దయఁ జూడు మెప్పుడు౯."

అనుపద్యమున హరిహరనాథుని సదయావలోకనముఁ బ్రార్థించి స్వర్గారోహణపర్వాంతమున నున్నమాలినీవృత్తములో "సంభృతానందభావా" యనుసంబోధనమునఁ దాను మొదటఁ గోరిన 'బ్రహ్మానంద సంభృతిని' వచించెను. తిక్కనసోమయాజి కాలమున నెల్లూరున హరిహరాలయము గల దనియు నాతనిపేరిటనే తిక్కనసోమయాజి తనభారతము నంకితము గావించె నని చెప్పెదరుగాని యది యథార్థము గాదు. తిక్కనసోమయాజికాలమున హరిహరనాథుని యాలయము నెల్లూరున లేదని చెప్ప వచ్చును. తిక్కనసోమయాజిచే భారతమున స్మరింపఁ బడిన హరిహరనాథుఁడు హరి హరులకు భేదము పాటింపని యద్వైతుల కుపాస్యుఁడును హరిహరుల కధినాథుఁడు నగుసర్వేశ్వరుఁడని విరాటపర్వము లోనియవతారికనుగాని యాశ్వాసాద్యంత పద్యములను గాని విమర్శించి చూచినపక్షమున బోధపడఁగలదు. నన్నయభట్టారకుఁడును తిక్కనసోమయాజియును నేకకాలమునం దున్నవారని కథలు కొన్ని కవిజీవితములందును, కవులచరిత్రమునందును నుదాహరింపఁబడుటయేగాక కవిజీవితములం దావాదమే సిద్ధాంతముచేయఁ బడియున్నది. కాని నూతనపరిశోధనములవలన నాయిరువురును సమకాలికులుగా రనియు నిరువుర కిన్నూరు సంవత్సరములు కాలభేదము గలదనియు స్పష్టపడినది. కావున నాకథ లన్నియు నవిశ్వాసపాత్రములై వ్యర్థములై పోయినవి. నన్నయ పదునొకండవశతాబ్దిమధ్యమునను, తిక్కన పదుమూఁడవ శతాబ్దిమధ్యమున నుండిరి.

ఈ మహాభారతమును రచించునపుడు తిక్కనసోమయాజి చేసిననియమము మఱియొక్కటి గానవచ్చుచున్నది. ఏదియన,

"గీ. కథ జగత్ప్రసిద్ది గావునఁ బూర్వప
    ర్వార్థయుక్తిఁ జేయు నట్టియెడల
    యత్న మించు కంతయైనను వలవదు
    వలసినట్లు చెప్ప వచ్చి యుండు.”

అని చెప్పి సోమయాజి గ్రంథము ప్రారంభము చేసెను.

అనఁగా భారతకథ జగత్ప్రసిద్ధమైనది; కావునఁ బూర్వ పర్వార్థములను సందర్భింపఁ జేయునప్పుడు యత్న మేమాత్ర మక్కరయుండ దనియును, ఇష్టానుసారముగ సందర్భము పొసగింపవచ్చు ననిచెప్పినపద్యమెగాని మఱియొండు గాదు. ఈ పద్యమును బురస్కరించుకొనియె కాఁబోలు సోమయాజి భారతముఁ దెనిగించుచో మాతృకయైన మూలగ్రంథమును ముట్టకయె యాశుధారగ నిరంకుశప్రజ్ఞతో జేసి యున్నాఁ డనుప్రవాద మొకటి లోకములో వ్యాపించి యున్నది. ఈ తెలుఁగుభారతము కష్టపడి సావకాశముగా నాలోచించి చక్కఁగాఁ జేయఁబడినగ్రంథమేగాని జనులనుకొనునట్లు మూలగ్రంథమును ముట్టక తెఱలోఁ గూరుచుండి నోరికివచ్చిన ట్లెల్లను చేయఁబడినది కా దనికవులచరిత్రమునం దీయఁబడిన సమాధానము సమంజసమైనదిగా నున్నది. తిక్కనసోమయాజి యీ భారతమును. జెప్పు నప్పుడు దీనిని వ్రాయుటకై నిర్ణయింబడిన వాఁడు కుమ్మరగురునాథుఁ డనిచెప్పుదురు. ఈగురునాథునకు చెప్పిన దానిని మరల నడుగక వ్రాయఁ గలశక్తియున్న దట. ఈభారతమును రచించునపుడు తిక్కనసోమయాజి తడవుకొనకుండ గవిత్వముఁ జెప్పెద ననియు, తానొక్కసారి చెప్పినదానిని మరలఁ జెప్ప ననియు, చెప్పినదానిని మరల మార్చుకొన ననియు, ప్రతిజ్ఞ చేసి నట్లును, చెప్పినమాటను మరుల నడుగక గురునాథుఁడు వ్రాయుచుండగా శల్యపర్వములో ప్రథమాశ్వాసము కడపట సహదేవుఁడు శకునిని చంపినతరువాత దుర్యోధనుఁడు తొలఁగిపోయె నని ధృతరాష్ట్రునితో సంజయుఁడు చెప్పుభాగమున,

"క. పలపలనిమూకలోఁ గా
    ల్నిలువక గుఱ్ఱంబు డిగ్గి నీకొడుకు గదా
    కలితభుజుఁడగుచు నొక్కఁడుఁ
    దొలఁగి చనియె-

అన్నంతవఱకుఁ బద్యమును జెప్పి తరువాత నేమియుఁ దోఁచక తిక్కన "యేమిచెప్పుదున్గురు నాధా" యని కుమ్మరగురునాథు నడిగి నట్లును, అతఁ డదితన్నడిగినప్రశ్నగా భావింపక పద్యముతోఁ జేర్చి "తొలఁగి చనియె నేమిచెప్పుదు న్గురునాథా" యని వ్రాసినట్లును, అప్పుడు తిక్కనసోమయాజి తనప్రతిజ్ఞకు భంగమువచ్చె ననిచింతించుచుండఁగా "నేమిచెప్పుదు న్గురునాథా" కవిలేఖకునిగూర్చి యుద్దేశించినది 'కురునాథా' యని ధృతరాష్ట్రున కన్వయించి యాప్రశ్నయే పద్యపూరణమున కనుకూలించె నని గురునాథుఁ డాతని నూరార్చి నట్లును ఒక పిచ్చకథ కలదని యాంధ్రకవులచరిత్రమునందు గ్రంథస్థముగా వింపఁబడి 'శ్రీమహాభారతము నాంద్రీకరించిన యీమహాకవికీ చిఱుపద్యములోని యల్పభాగము తోఁచకపోయె ననిసాధించుట కీకథపనికిరాదు గాని తిక్కన యాశుధారగా కవిత్వము చెప్పఁగలవాఁ డనిస్థాపించుటకై యీకథ కల్పింపఁ బడె నని మాత్ర మూహింపఁ దగి యున్న దని యాంధ్రకవులచరిత్రమునం దేసమాధానము చెప్పఁబడి యుస్నది. ఈపద్యము మూలముననే గురునాథుఁ డొకఁడు జన్మ మెత్తినాఁడు. ఈ పద్యము మహాభారతమునఁ దిక్కనసోమయాజి వ్రాయ కుండె నేని కుమ్మరగురునాథుఁడు జన్మమెత్తకయే యుండును.

తిక్కనసోమయాజికిఁ గుమ్మరగురునాథుఁడు లేఖకుఁడుగా నుండె ననుట సత్వము గాదు. తిక్కన చేసినప్రతిజ్ఞ మాటయు సత్యము కాదు. తిక్కన పూర్వాపరసందర్భములను జక్కగా నాలోచించి కవిత్వము చెప్పినవాఁడుగాని పై ప్రతిజ్ఞతోఁ జెప్పినవాడు కాఁడని యీక్రిందివిషయమునుబట్టి స్పష్టపడఁగలదు.

ఒకసారి చెప్పినవిషయమును మరలఁ జెప్పవలసినచ్చినప్పుడును, పూర్వోక్తార్థమున కనువాదముఁ జేయవలసినప్పుడును తిక్కనసోమయాజి తొలుతఁ జెప్పినగద్యపద్యములనే మరలఁ జెప్పుచు వచ్చెను. మఱియు నొకప్రకరణమునఁ జేసిన వర్ణనము మఱియొక ప్రకరణమునఁ జేయవలసివచ్చినప్పుడు ప్రకరణానురూపముగఁ గొంచెము మార్పుచేసి మున్పటిగద్య పద్యములనే వాడియున్నవాఁడు. ఇట్టిపద్దతి భారతములో నుంచుటయెగాక తానురచియించిన నిర్వచనోత్తరరామాయణలోని పద్యములను సైతము నించుక మార్చియు మార్పకయు సందర్భముగలిగినపుడు భారతములోఁ జొప్పించి యున్నాఁడు. ఇందులకుఁ గొన్ని దృష్టాంతములను జూపు చున్నాఁడను.

ద్రోణపర్వమునం దభిమన్యుఁడు చంపఁబడినతరువాత ధర్మరాజునకు దుఃఖోపశమనముగా కృష్ణద్వైపాయనుఁడు బోధించిన షోడశరాజచరిత్రమును దెలుపు నట్టిపద్యములనే శాంతి పర్వమున బంధుమరణార్తిచేఁ దపింపుచున్న ధర్మరాజునకు గదాగ్రజుఁ డాకథను జెప్పవలసిన సందర్భమునఁ బొందుపఱిచి యున్నాడు.

విరాటపర్వము ద్వితీయాశ్వాసములో కీచకుఁడు తనయెడ మోహావేశపరవశుఁడైనపు డాతని నదల్చుటకై ద్రౌపదిచేఁ జెప్పించిన,

"శా. దుర్వారోద్యమ బాహువిక్రరసాస్తోక ప్రతాప స్ఫుర
    ద్గర్వాంధ ప్రతివీర నిర్మథననిద్యాపారగు ల్మత్పతు
    ల్గీర్వాణాకృతు లేవు రిప్డు నినుదోర్లీల౯ విజృంభించి గం
    ధర్వుల్ ప్రాణము మానముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!"!

అనుపద్యమునే ద్రౌపదితనభంగపాటును భీమునితో విన్నవించు నపుడును తాను గీచకుని ట్లదల్చితి నని చెప్పుసందర్భమున నీపద్యమునే మరల చెప్పి యున్నాఁడు. ఉద్యోగపర్వములో కౌరవులకడకు శ్రీకృష్ణునిరాయబారిగాఁ బంపినపుడు పాండవు లేవురును తమతమయభిప్రాయములను వేఱువేఱ కృష్ణునితోఁ జెప్పునప్పుడు భీముఁడు దన మాటగాఁ జెప్పినట్లుండు,

"తే. అన్నదమ్ములమై యుండి యకట మనకు
    నొరులు దలయెత్తి చూడ నొండొరులతోడఁ
    బెనఁగ నేటికి నీ నేల పెద్దవారి
    బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొ?"

అనుపద్యమునే స్త్రీపర్వములో గాంధారికిఁ గోపశాంతి కలిగించుటకై వినయముతో భీముఁడు ప్రయత్నించి నపుడును జెప్పియున్నాడు.

విరాటపర్వములో ప్రథమాశ్వాసమున విరాటరాజు తనకూఁతు రగునుత్తరను నాట్యశిక్షకై బృహన్నల కప్పగించుటకై రప్పించునప్పు డామెను వర్ణించిన,

"సీ. అల్లదనంబున ననువు మైకొనఁ జూచు
             నడపుకాంతికి వింతతొడవు గాఁగ
    వెడనెడ నూఁగారి వింతయై యేర్పడ
             దారనివళులలో నారు నిగుడి
    నిట్టలు ద్రోఁచుచు నెలవుల కలమేర
             లెల్లను జిగియెక్కి యేర్పడంగఁ
    దెలుపును గప్పును వెలయంగ మెఱుఁగెక్కు .
             తారకంబులఁ గల్కితనము దొడరఁ

"ఆ. జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు
     జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు
     చునికిఁ దెలుపుచుండ నుత్తర సనుదెంచె
     నలరుమరునిపువ్వుటమ్మువోలె."

అనుపద్యమునే శాంతిపర్వ ప్రథమాశ్వాసములో సృంజయరాజు కూఁతును నారదుఁడు మోహించినకథను జెప్పుచు దాని వర్ణనసేయుచు నాఁటవెలదిగీతి 3, 4 పాదములనుఁ "ఉనికి దెల్ప సృంజయునిపుత్త్రి మెలఁగు విధంబు నారదునకుఁ దగులొనర్చె" అని మార్చి ప్రయోగించి యున్నాఁడు.

భీష్మపర్వము మొదట సంజయుఁడు ధృతరాష్ట్రునకు భీష్ముశరతల్పగమనమును జెప్పునప్పుడు వ్రాసిన

"సీ. ఆత్మయోధుల కెల్ల నాధార మగునట్టి
            తనకు నస్త్రంబు లాధార మయ్యెఁ
    బరశురామునకు మేల్సరియైన తనయందుఁ
            గలిగె భంగంబు శిఖండిచేత
    జనపతి దనునచ్చి మునుజూద మొనరించెఁ
            దాను గయ్యంపుజూదమునఁ నోడెఁ
    దనయార్పు టెలుగునఁ దలకు వైరులు
            వొంగ నొఱలుచు నేలకు నొఱఁగె నేఁడ

 ఆ. తీవ్రబాణజాలదీప్తులు పరగించి
     పాండు తనయసైన్యబహుళతమము
     లీలఁ బదిదినంబు లోలిమై విరియించి
     యధిప భీష్మభానుఁ డస్తమించె."

అనుపద్యములోఁ గడపటియాటవెలదిగీతినే స్త్రీపర్వద్వితీయాశ్వాసమున గాంధారి భీష్ముం గూర్చి శోకించుచుఁ గృష్ణునితోఁ జెప్పునప్పుడు మూఁడునాలుగు పాదములలోనుండు 'పదిదినం లోలిమై విరియించి యధిప' యనుపదములను 'పదిదినములు దోలి వినోదించి యనఘ' యనుపదములతో మార్చివ్రాసెను. ద్రోణపర్వము తృతీయాశ్వాసములో సైంధవవధార్థ మర్జునుఁ డరుగుచు ధర్మరాజును బట్టి దుర్యోధనున కిచ్చునటులు ద్రోణుఁడు జేసినప్రతిజ్ఞ మనస్సునకుఁ దట్టఁగా సాత్యకిం బిలిచి యాతనిరక్షణార్థము నియోంగించు నప్పుడు చెప్పిన

"క. మనకునిమిత్తము లెంతయు
    ననుకూలము లయ్యె గెలుతు మాహవమున నేఁ
    జనియెదఁ ప్రతిజ్ఞ దీర్పఁగ
    ననఘా ధర్మసుతురక్ష కరుగుము నీవు౯,"

"క. వినుసింధురాజవధయును
    మనుజాధిపరక్షణంబు మనకు సరియ కా
    వున నేనొకపని నీవోక
    పనిమేకొని చేయు టరయఁ బాడియ కాదే.

"ఆ. ఏనునిలిచినట్ల కా నూఱడిల్లు నీ
    వున్న నన్నరేశ్వరోత్తముండు
    నిర్బరుండ వగుము నీవు నాదెస నాకు
    హరి గలండు గలఁడె యచట నితఁడు.

వ. ఎల్లభంగుల రాజరక్షణార్థంబుగా నీకుంబోవలయును, బరాక్రమధుర్యుం డగునాచార్యుని ప్రతిన యెఱుంగవే యనుటయు. " అనుపద్యగద్యములనే ధర్మరాజు సాత్యకి నర్జునకుఁ దోడ్పడఁ బొమ్మనినప్పు డతఁ డతనితో నీసమాచారము జెప్పుసందర్భమునఁ బ్రయోగించి యున్నాఁడు. అప్పటిమాటలే యనువాదమునఁ జెప్పుట యెంతయుఁ జతురమై యుండెను.

కర్ణపర్వము ప్రథమాశ్వాసమునఁ గర్ణుని దినయుద్ధమున శల్యునిపోరు వర్ణించుసందర్భమునఁ బ్రయోగించిన

"సీ. కమలాకరములీలఁ గలఁచియాడెడు గంధ
           దంతావళము సముద్దండతయును
    దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా
           వధియించు కంఠీరవంబు నేపు
    నీరసారణ్యంబు నిర్భరాటోపతఁ
           గాల్చుదావాగ్నియుగ్రక్రమంబుఁ
    బ్రకటవిక్రాంతిఁ బురత్రయంబును సమ
           యించుఫాలాక్షునియేడ్తెఱయును

"ఆ. బోల్పఁ బడియెనపుడు భుజగర్వశౌర్యప్ర
     తాపదుర్దమప్రకోపములకు
     మద్రవిభుఁడు గోలుమసఁగి శాత్రవసైన్య
     హననకేళి సల్పునవసరమున.”

అనుపద్యమునే యాఁటవెలదిగీతి మొదటి పాదమున "పోల్పఁబడియెనపుడు" అనుపదములను "పోల్పబట్టుగాఁగ" అనుపదములతో మార్చి శల్యపర్వప్రథమాశ్వాసమున శల్యుని యుద్ధమును వర్ణించుచోఁ జెప్పియున్నాఁడు. ఇఁక నిర్వచనోత్తరరామాయణములోని పద్యములను గొన్నిటిని మార్చియు, మార్పకయు భారతమునఁ బ్రయోగించినవానిలో నొకటిరెండు దృష్టాంతములను జూపి విరమించు చున్నాను.

"చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దారఁ భీ
     షణముగ నుప్పతిల్లి రభసంబున రేఁగినమాడ్కిఁ దీవ్రమా
     ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబులఁ గప్ప శార్‌జ్ఞ ని
     క్వణనము గోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్."

ఈపద్యమును నిర్వచనోత్తరరామాయణములో మూడ వయాశ్వాసమున మొదట వ్రాసియున్నాఁడు. దీనినే విరాటపర్వములో నైదవయాశ్వాసమునఁ గొంచెము మార్పుచేసి యీక్రిందిరీతిగాఁ బ్రయోగించి యున్నాడు.

"చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ జాల భీ
     షణముగ నుప్పతిల్లి రభసంబున రేఁగినమాడ్కిఁ దీవ్రమా
     ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబులఁ గప్పగాండిర
     క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రత౯."

ఇందు 'తార' యనునది 'చాల' గను 'శార్‌ఙ్గనిక్వణన' మనునది 'గాండివక్వణనము' గను మార్చఁ బడినవి.

మఱియు తిక్కన సోమయాజి,

"మ. కలఁగెం దోయధిసప్తకంబు గిరివర్గం, బెల్ల మాటా డె సం
     చలతం బొందె వసుంధరావలయ మాశాచక్ర మల్లాడెఁ గొం
     దల మండెం ద్రిదశేంద్రుపట్టణము పాతాళంబు ఘూర్ణిల్లె నా
     కుల మయ్యెం గ్రహతారకాకులము సంక్షోభించె నావేధయున్,"

అనునిర్వచనోత్తర రామాయణములో నైదవయాశ్వాసము లోని పద్యమును మార్పు చేయకయె విరాటపర్వములో నాలవయాశ్వాసములోఁ బ్రయోగించి యున్నాడు.

నిర్వచనోత్తర రామాయణములో నాఱవయాశ్వాసమున దేవదానవ యుద్ధసందర్భమున రచియింపఁబడిన

"మ. పటువేగంబున శాతభల్ల చయసంపాతంబున౯ మింట మి
     క్కుటమై పర్వ ధగద్దగీయ మగుచుం గోపంబు రూపంబు లై
     చటులక్రీడఁ జరించు నట్లిరువురు౯ శౌర్యోన్నతిం బోరీ రు
     త్కటదర్పోద్దతులై పరస్పరజయాకాంక్షా ప్రచండంబుగన్,"

అనుపద్యమునే రెండవపాదమున “పర్వధగద్దగీయమగుచున్" అనుపదములు. "మంటధగద్ధగయనన్ " అను పదములతో మార్చియు నాలవపాదమునందలి 'పరస్పరజయాకాంక్షా ప్రచండంబుగన్" అనుసమాసమును 'బరస్పరజయాకాంక్షం బ్రచండంబుగన్' అనివ్యస్తపదములగఁ జేసియు విరాటపర్వము మూఁడవ యాశ్వాసమున దక్షిణగోగ్రహణ యుద్ధమునం బ్రయోగించి యున్నాడు.

"శా. శ్రావ్యంబై చెలఁగ౯ గభీరమధురజ్యానాద ముద్దారువీ
     రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచు౯
     సవ్యప్రౌఢి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచు౯
     దివ్యాస్త్రంబులఁ బోరి రిద్దఱును సాదృశ్యం బదృశ్యంబుగ౯.”

అను నిర్వచనోత్తరరామాయణములోఁ జతుర్థాశ్వాసమున రావణకుబేరులకు జరిగినయుద్ధ సంధర్భమునఁ బయోగింపఁబడిన దానిని మార్పేమియుఁ జేయకయే విరాటపర్వపంచమాశ్వాస మున నుత్తరగోగ్రహణమున ద్రోణార్జునసమర వర్ణనమునం జొప్పించి యున్నాఁడు. ఇట్టివానిని పెక్కులు చూపవచ్చును. గ్రంధవిస్తరభీతిచే వానిని విరమించుచున్నాను. నన్నయతిక్కనాదులు సంస్కృత మహాభారతమును యథాక్రమముగా నాంద్రీకరింప లేదనియును, మాతృకకు సరిగా నుండక పోవుటయేగాక మూలములోనిపెక్కు భాగములను దెనిగింపక యు, సంగ్రహపఱిచియు నిచ్చానుసారము రచించినారని యిప్పటిపండితులు కొందఱు దోషారోపణము చేయుచున్నారు. వారిపద్దతియే వీరికి బోధపడినట్టు గన్పట్టదు. ఆంధ్రభారతము సంస్కృతభారతములోనికథను మాత్రము గైకొని స్వతంత్రకావ్యముగా వ్రాయఁబడినగ్రంథమె గాని కేవలము సంస్కృతభారతమునకు భాషాంతరీకరణ మనుకొనుట పొరబాటు. ఇప్పటిసంస్కృత భారతము నన్నయతిక్కనాదులకాలములో నిట్లే యున్నదనుకొనుట మఱియొక పొరబాటు. తిక్కనకృతభారతమును సంస్కృత మహాభారతమునకు భాషాంతరీకరణ మనితలంచుట తిక్కనయెడ మనము సేయునపరాధముగాఁ బరిగణింపవలయును. సంస్కృతమహాభారతము నుండి కథనుమాత్రము గైకొని మూలములో లేని యర్థాలంకారములును, రసభావములును, మానవస్వభావవర్ణనలును విచ్చలవిడిగాఁ బెంచియు, మూలములో విసుగుపుట్టించాడు ననేకదీర్ఘకథానకములను వర్ణనలను, వేదాంతఘట్టములను సంగ్రహపఱిచి యు, నిరంకుశవృత్తి గైకొని మూలముకంటెను వేయిరె ట్లధికమనోహరముగా నుండునటుల రచించిన స్వతంత్రమహాకావ్యమనియే చెప్పఁ దగియున్నదిగాని మఱి యన్యము గాదు. తిక్కనసోమయాజి సంస్కృతభారతములో నున్న దానిని ముక్కకు ముక్కఁగాఁ దెనిగింది పెట్టియుండిన యెడల నీయాంధ్రభారత మింతయుత్తమోత్తమకావ్యముగా నుండకయె పోవును. సంస్కృత కావ్యములను భాషాంతరీకరింప వలసినరీతి నిప్పటిపండితులకంటె నెక్కువబాగుగా నెఱింగిన వాఁడె గాని యల్పుడు గాఁడు. ఈసందర్భముననే వ్రాయుచు విజ్ఞానసర్వస్వసంపాదకు లగు శ్రీయుతకొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులుగారు "సంస్కృతభారతము బంగారపుముద్ద వంటిది. ఆంధ్రభారత మాముద్దలోనుండి కావలయునంత బంగారమును దీసికొని స్వర్ణ కారునిబుద్ధి వైభవముతోఁ జేయఁబడిన చక్కని సువర్ణకమలము వంటిది. ఉభయభారతములలోని యీభేదముఁ జూపి స్వర్ణకారుని బుద్ధివైభవము వెల్లడిచేయుటయే మాయుద్దేశము." అని యొకచోట వ్రాసి యున్నారు. ఇదియెంతయు సయుక్తికమును సమంజసము నైనవాదము. ఆంధ్రకవుల చరిత్రములో భగవద్గీతలను దెనిగింపనేలేదని వ్రాయఁ బడియెను. తిక్కనసోమయాజి దానిని ముట్టకపోలేదు. దానిని గూడ సంగ్రహముగాఁ దెనిగించియే యున్నాఁ డని కీర్తిశేషులైన శతఘంటము వేంకటరంగశాస్త్రిగారు తాము వ్రాసిన విమర్శనపీఠికలోని దాని నీదిగువ నుదాహరించుచున్నాఁడను.

"భగవద్గీత లీతండు తెనుఁగుసేయక యుపేక్షించె నని జనప్రతీతి కలదు గాని యది యట్లు గాదు. దానింగూడ సంగ్రహముగఁ దెనుఁగుఁ జేసి యున్నాఁడు.

"శ్లో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సావః
    మామకా! పొండవా శ్చైవ కీ మకుర్వతసంజయ.

అనుభగవద్గీతా ప్రథమశ్లోకమును.

"క. మానుగ ధర్మక్షేత్రం
    బైనకురుక్షేత్రమున మహాహవమునకుం

      బూని మనబలముఁ బాండవ
     సేనయు నిటువన్ని యేమిసేసెం జెపుమా."

అను కందపద్యమునఁ దెనిఁగించి

"తే. ఇంతపాపంబు సేయంగ నెత్తికొందు
     రయ్య రాజ్యలోభంబున నఖిలబంధు
     జనుల వధియింపఁ దొడఁగితి నని రథంబు
     మీఁదఁ గూర్చుండఁ బడియెఁ జే యూఁది కొనుచు."

అనుపద్యముపర్యంతము ప్రథమాధ్యాయ మంతయుఁ దెనిఁగించెను.

"వ. ఇవ్విధంబున శోకసంవిగ్న మానసుండును విషాదవిహ్వలుండును, బరమకరుణా భరితుండు నై శరశరాసనంబులు విడిచి కన్నీరు దొరంగ నూరకున్న సవ్యసాచిం జూచి మధుసూదనుం డిట్లనియె.”

అనువచనము మొదలుగా ద్వీతీయాధ్యాయముఁ దెనిగింపఁ బూని సంగ్రహముగా విభూతి యోగాంతము లైనతొమ్మిది యధ్యాయముల సారాభిప్రాయము సంక్షేపముగాఁ దెలిపి విశ్వరూపసందర్శన యోగాధ్యాయ మందలికథను,

"మ. అతిగుహ్యం బిది నీవు భూరికృప నీయధ్యాత్మముం గానఁ
     సితి నాకిమ్మెయి విన్కిఁ గొంతభ్రమవాసె౯ యోగిహృద్ధ్యేయమై
     యతు లైశ్వర్యవిభూతి నొప్పు భవదీయంబైనరూపంబు సూ
     చు తలం పెత్తెడుఁబోలు నేని దయఁ జక్షుఃప్రీతిఁ గావింపవే."

అనుపద్యము మున్నుఁగాఁ గొన్నింటఁ దేటపఱిచి పిమ్మటి యధ్యాయముల యభిప్రాయమును సంగ్రహించుచు మోక్షసన్న్యాస యోగప్రతిపాదక మగుకడపటి యధ్యాయమందుఁ బ్రధానమయిన

"శ్లో. సర్వధర్మా౯ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
     అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామిమాశుచః."

ఆనుశ్లోకమును,

"తే. క్రందుకొను సర్వధర్మవికల్పములను
    నెడల విడిచి దృఢంబుగ నే నొకండ

     శరణముగ నాశ్రయింపుము సకలదురిత
     ములకుఁ దొలగింతు నిన్నుఁ బ్రమోమంద."

అనుపద్యమున దేనిఁగించి

"శ్లో. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః
     తత్ర శ్రీర్విజయో భూతిర్థ్రునా నీతిర్మతిర్భ్రతు||

అనుభగవద్గీత్యాంతశ్లోకమును .

"తే. అధిపయో గేశ్వరేశ్వరుం డైనకృష్ణుఁ
    డను థనుర్ధరవర్యుఁ డర్జునుఁడు నెచట
    నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు
    భూత నిత్యంబు లగు విది నాతలంపు."

అనుపద్యమున నాంధ్రీకరించెను.

తిక్కనకృతమైన మహాభారతకావ్యభాగ మాంధ్రభాషలో నద్వితీయ మైనదిగా నున్నది. ఇది ప్రపంచములోని యుత్తమోత్తమకావ్యములలో నొక్కటియనుటకు సంశయములేదు. ఇతని కవిత్వమహిమాదులను గూర్చి పూర్వకవుల యొక్కయు పండితులయొక్కయు నభిప్రాయములను దెలుపుటకంటె నేను జెప్పఁదగిన దింతకంటె నేమియునులేదు. ఆంధ్రకవులచరిత్రమునందు రావుబహదరు వీరేశలింగముపంతులుగా రిటులు వ్రాసి యున్నారు.

'కాని తిక్కనసోమయాజిశైలితో సమానముగా వ్రాయుటమాత్ర మెవ్వరికిని సాధ్యముగాదు. తెలుఁగుభాషయం దేన్నోగ్రంథములున్నను తిక్కసోమయాజికవిత్వముతో సమానముగాఁ గాని దానిని మించునట్లుగాఁ గాని కవిత్వము చెప్పఁ గలిగినవారు నేటివఱ కొక్కరును గనఁబడలేదు. తిక్కనకవిత్వము ద్రాక్షాపాకమై, మిక్కిలి రసవంతముగా నుండును. ఈతని కవిత్వమునఁ బాదపూరణమునకై తెచ్చిపెట్టుకొనెడు వ్యర్థపదము లంతగా నుండవు, పదములకూర్పు మాత్రమె గాక యర్థసందర్భమును మిక్కిలి పొందికగా నుండును. ఏవిషయము చెప్పినను యుక్తియుక్తముగాను ప్రౌఢముగాను నుండును. ఎక్కడ నేవిశేషణము లుంచి యేరీతి నేపదములు ప్రయోగించి రసము పుట్టింపవలయునో యీకవికిఁ దెలిసి నట్లు మఱియొకరికిఁ దెలియదు. ఈతనికవిత్వము లోకోక్తులతోఁ గూడి జాతీయముగా నుండును. ఈయన పదలాలిత్యమును, యుక్తిబాహుళ్యమును, అర్థగౌరవముసు, రచనాచమత్కృతియు, శయ్యావిశేషమును, సందర్భశుద్ధియు, కల్పనాకౌశలమును, అన్యులకు రావు."

శ్రీమదాంధ్రమహాభారతమునకుఁ బీఠిక వ్రాసిన కీర్తిశేషులైన శతఘంటము వేంకటరంగశాస్త్రిగా రీకవికవిత్వమహిమను గూర్చి యిట్లు వ్రాసి యున్నారు.

"విషయమునం జూచినను నిమ్మహాకవికి సమానుఁడని చెప్పఁ దగినకవియొక్కడు నిప్పటికి వినంబడఁడు. ఇఁక నధికుఁడు లేఁడని చెప్ప నేల? ఈమహాకవికవనముంగూర్చియెంత సెప్పినం జెప్పవలసియే యుండును గాని యొకప్పటికైనం దనివి దీఱఁ జెప్పి నట్లుండదు ......ఈమహాకవి గ్రంథముం జూచి నేర్చుకొనవలసిన విషయములు నెన్నియేనిఁ గలవు. ఆంధ్రభాషాకవిత్వ మర్మ మీతనికిఁ దెలిసినట్టులు మఱియే యాంధ్రకవికి నిప్పటికిని దెలియదనియు, నిరాక్షేపముగాఁ జెప్పవచ్చును.”

ఇట్టిమహత్కార్యమును నెఱవేర్చుటచే నాధునికవిద్వాంసులే గాదు గొనియాడినది. తిక్కనసోమయాజి యనంతరకాల ములోని పురాణకవులలో వివేషజ్ఞులు సోమయాజిని బ్రహ్మ యనియే పొగడియున్నారు.

హరివంశములో నెఱ్ఱాప్రెగ్గడ:-

"మ. తనకావించినసృష్టి, తక్కొరులచేతం గాదు నా నేముఖం
     బునఁ దాఁ బల్కినఁ బల్కు లాగమములై పొల్పొందు నా వాణిన
     త్తనునీతం డొకరుండ నాఁ జనుమహత్త్వాప్తిం గవిబ్రహ్మ నా
     వినుతింతుం గవితిక్కయజ్వనిఖి లోర్వీదేవతాభ్యర్చితు౯.”

భీమేశ్వరపురాణములో శ్రీనాథకవి.

"ఉ. పంచమవేదమైపరఁగు భారతసంహిత నాంధ్రభాషఁ గా
     వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్దితబుద్ది నెవ్వఁ డ
     క్కాంచనగర్బతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
     ర్వంచితకీర్తివైభవిరాజికిఁ దిక్కనసోమయాజికి౯."

తిక్కనసోమయాజి కవివాగ్బంధన మనులక్షణగ్రంథము నొకదాని రచియించి నటు లీక్రింది పద్యమువలనఁ దెలియుచున్నది.

"క. తనరం గవివాగ్బంధన
    మనుఛందం బవని, వెలయ హర్షముతోఁ
    దిక్కనసోమయాజి చెప్పెను
    జను లెల్ల నుతింప బుధుల సమ్మతిగాఁగ౯."

తిక్కనసోమయాజి కవిత్వములోనుండు మహద్విషయముల నన్నిటి నెత్తి చూపి యొకకావ్య విమర్శగ్రంథముగా వ్రాయుట నాయుద్దేశముగాదు గావున నాప్రయత్న మిందే తెలియజూపక విడిచిపెట్టినాఁడను.

సమాప్తము

 1. "ఉ. భాసురభారతార్థముల భంగుల నిక్క మెఱుంగ నేరమిన్
       గాసటబీసటే చదివి గాథలఁ ద్రవ్వు తెనుంగువారికన్
       వ్యాసముని ప్రణీతపరమార్థము తెల్లఁగఁ జేసి నట్టియ
       బ్జాసనకల్పులం దలంతు నాద్యుల నన్నయతిక్కనార్యుల౯."
                                              (నృసింహపురాణము)

 2. "శా. విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞానసం
       పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు గృ
       ష్ణ ద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించే ధ
       ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యంబైనయామ్నాయము౯."