తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 198
రేకు: 0198-01 శ్రీరాగం సం: 02-502 శరణాగతి
పల్లవి:
ఎఱిఁగితి నమ్మితి నితఁడు దయానిధి
మఱఁగులు మొరఁగులు మరి యిఁక లేవు
చ. 1:
వేదోద్ధరణుఁడు విశ్వరక్షకుఁడు
ఆదిమూర్తి శ్రీఅచ్యుతుఁడు
సోదించి కొలిచితి సుముఖుఁడై మమ్మేలె
యేదెస మాపాల నితఁడే కలఁడు
చ. 2:
పరమపురుషుఁ డాపన్నివారకుఁడు
హరి శాంతుఁడు నారాయణుఁడు
శరణంటి మితఁడు చేకొని కాచెను
తరవాతిపనులఁ: దప్పఁడితఁడు
చ. 3:
హృదయాంతరంగుఁడు యీశ్వరేశ్వరుఁడు
ఇదివో శ్రీవేంకటేశ్వరుఁడు
వెదికితి మీతఁడు విడువఁడు మమ్మిఁక
తుదకును మొదలికి దొరికినవాఁడు
రేకు: 0198-02 మాళవిగౌళ సం: 02-503 దశావతారములు
పల్లవి:
ఇట్టె మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేఁడు
బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి
చ. 1:
చదువుల చిక్కుదిద్ది చక్కఁగఁ జేసితివి
మొదలఁ గుంగినకొండ మోఁచి యెత్తితి
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి
అదనునఁ బ్రహ్లాదు నట్టె మన్నించితివి
చ. 2:
అడుగులు మూఁటనే యఖిలము గొలచితి
బడిబడినే రాచపగ నీఁగితి
బెడిదపు లంక విభీషణు నేలించితివి
అడరి పాండవులదిక్కై నిలిచితివి
చ. 3:
త్రిపుర కాంతలగుట్టు దీర బోధించితివి
వుపమఁ గలికిరూపై యున్నాఁడవు
ఇపుడు శ్రీవేంకటేశ యేలితివి లోకాలెల్ల
యెపుడు నుతులకు నిరవైతివి
రేకు: 0198-03 శంకరాభరణం సం: 02-504 అధ్యాత్మ
పల్లవి:
ఇతని ప్రసాదమే యిన్నియును
గతి యితనిదే కన కాదనరాదు
చ. 1:
కాయములో నొకఘనసంసారము
ప్రాయంబులతోఁ బ్రబలీని
ఆయ మందుకును హరి దానేయై
దాయక పాయక తగిలున్నాఁడు
చ. 2:
వొనరిన కలలో నొకసంసారము
మనసుతోడనే మలసీని
ననిచి యందుకును నారాయణుఁడై
కొనమొదలై తా గురియైనాడు
చ. 3:
వుడిబడి కోర్కుల నొకసంసారము
బడిబడి యాసలఁ బరగీని
విడువక యిది శ్రీవేంకటేశ్వరుఁడే
తొడిఁబడఁ గల్పింది ధ్రువమయినాఁడు
రేకు: 0198-04 ముఖారి సం: 02-505 అధ్యాత్మ
పల్లవి:
ఊరకే కలుగునా వున్నతపు మోక్షము
శ్రీరమణు కృపచేతఁ జేరు మోక్షము
చ. 1:
కలుషముఁ బెడఁబాసి కర్మగండము గడచి
మలసి నప్పుడుగా మరి మోక్షము
చలనమించుక లేక సంసారవారధి దాఁటి
నిలిచినప్పుడుగా నిజమోక్షము
చ. 2:
పంచేంద్రియాల మీరి భక్తి హరిమీఁద బెట్టి
మంచివాఁడైనప్పుడుగా మరి మోక్షము
అంచల యాసలు మాని ఆచార్యుసేవ చేసి
మించినప్పుడుగా ఆమీఁది మోక్షము
చ. 3:
శాంతమే కూడుగానుండి సమచిత్తమునఁ బొంది
మంతుకెక్కినప్పుడుగా మరి మోక్షము
అంతట శ్రీవేంకటేశుఁ డాదరించి మన్నించితే
నంతరంగమున నున్న దనాది మోక్షము
రేకు: 0198-05 వరాళి సం: 02-506 గురు వందన
పల్లవి:
వెదకనేఁటికి నేయి వెన్న చేతఁ బట్టుకొని
మొదలఁ గలిగితేనే ముందరాఁ గలుగుట
చ. 1:
తన పూర్వభావము తలఁచి మరవకుంటే
పనివడి తనపుణ్యఫల మబ్బుట
మనవార్తి నానాఁటిమాయ చూపెట్టకుండితే
జనించిన తనకు విజ్ఞానసిద్ది యగుట
చ. 2:
పుట్టినయప్పటి తనభోగముఁ దలఁచుకొంటే
కొట్టఁగొన తనకోర్కి కొనసాగుట
నట్టనడిమి జగమునటనఁ దెలుసుకొంటే
గుట్టుతోడి గురుబోధ గురుతు చేచిక్కుట
చ. 3:
జీవకళ నంటినట్టి చిక్కు విదిలించుకొంటే
దేవుఁడు తనచేఁ జిక్కి తిరమౌట
శ్రీవేంకటేశుఁ డీతనిఁ జేరి శరణంటేను
ఆవల నీవలఁ దాను అన్నిటా గెలుచుట
రేకు: 0198-06 పాడి సం: 02-507 శరణాగతి
పల్లవి:
హరి నారాయణ కృష్ణ అదివో మావిన్నపము
తరవాతి మాట నీవే తలఁచుకోవయ్యా
చ. 1:
నడిఁబడ్డ తలఁపు చక్కఁగాక వుండినాను
వొడయఁడవు నీకృప వొగిఁ జక్కనే
గుడిగొన్న యేరెంత కొంకరవంకరలైనా
పుడమికి లోఁగొనకపోవునటవయ్యా
చ. 2:
కాయకపు నాభక్తి కడుఁ గొంచమైనాను
ఆయపు నీవరములు అతిఘనమే
యేయెడ గుడి గొంచమయిన గుడిలో దేవుని-
కాయెడ మహిమ ఘనమందురు గదవయ్యా
చ. 3:
శ్రీవేంకటేశ నిన్ను జింతించక నే నుండినా
జీవాంతరాత్ముఁడవై చేకొంటి నీవే
ఆవటించి కీలుబొమ్మ అచేతనమై యుండినా
ఆవేళ సూత్రధారుఁ డాడించుఁ గదవయ్యా