Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 101

వికీసోర్స్ నుండి

రేకు: 0101-01 కాంబోది సం: 02-001 అధ్యాత్మ

పల్లవి: విచారించు హరి నావిన్నప మవధరించు
      పచారమే నాది గాని పనులెల్లా నీవే
      
చ. 1: తనువు నాదెందుఁ గాని తనువులో నింద్రియములు
అనిశము నాచెప్పినట్టు సేయవు
మనసు నాదెందుఁ గాని మర్మము నాయిచ్చరాదు
పనివడి దూరు నాది పరులదే భోగము
         
చ. 2: అలరి నానిద్దుర నాదెందుఁ గాని సుఖమెల్ల
కలలోని కాఁపిరాలకతల పాలె
తెలివి నాదెందుఁ గాని దినాలు కాలము సొమ్ము
యెలమిఁ బేరు నాది యెవ్వరిదో బలువు
         
చ. 3: కర్మము నాదెందుఁ గాని కర్మములో ఫలమెల్ల
అర్మిలి నాజన్మముల ఆధీనమె
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు
నిర్మితము నీదింతే నేరుపు నీమాయది

రేకు: 0101-02 ఆహిరి సం: 02-002 అధ్యాత్మ

పల్లవి: విడువరా దెంతైనా వెఱ్ఱివాఁడనైన నీకు
కడవారు నవ్వకుండాఁ గాచుకో నన్నును
    
చ. 1: జ్ఞానము నే నెఱఁగ నజ్ఞానముఁ నే నెఱఁగను
మానను విషయములు మరిగెంతైనా
నీనామము నొడిగి నాదాసుఁడ ననుకొందు
దీనికే వహించుకొని తిద్దుకో నన్నును
    
చ. 2: అకర్మము నెఱఁగను సుకర్మము నెఱఁగను
ప్రకటసంసారముపై పాటు మానను
వొకపనివాఁడనై వూని ముద్రధారినైతి
మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును
    
చ. 3: వెనకఁ గానను ముందు విచారించి కానను
నినుపై దేహధారినై నీకు మొక్కేను
ఘనుఁడ శ్రీవేంకటేశ కన్నులెదుటఁ బడితి
కని పోవిడువరాదు కరుణించు నన్నును

రేకు: 0101-03 సాళంగనాట సం: 02-003 అంత్యప్రాస

పల్లవి: దొరకె మాపాలికిఁ గందువయర్థము
దరిదాపై యుండిన తత్త్వార్థము
    
చ. 1: తిరముగ నల్లదీవిఁ దెచ్చిన యర్థమిదివో
విరజవోడరేవున వెళ్లినర్థము
పరమభాగవతులు పాఁతినర్థమిదివో
పురుషోత్తముఁడనేటి పురుషార్థము
    
చ. 2: చందపువేదముల(లు ? ) శాసనము వేసినర్థము
ముందు సుముద్రల కెల్లా మొదలర్థము
అందరి యాత్మలనేటి అంగళ్లలోనియర్థము
యెందు సహస్రనామపు టెన్నికర్థము
    
చ. 3: కొలచి బ్రహ్మాండముల కొప్పెరలో నర్థము
యిల నిహపరముల కెక్కినర్థము
యెలమి హీనునినై న యెక్కుడుసేసే యర్థము
అలరి శ్రీవేంకటేశుఁడై న యర్థము


భైరవి సం: 02-004 అధ్యాత్మ

పల్లవి: దైవమా నీమాయ తలమొ లెఱఁగనీదు
కావరపు విషయాల కట్లు వదలవు

చ. 1: గక్కునఁ బెరిగివచ్చీ కాలము మీఁదమీఁద
వొక్కనాఁటి కొక్కనాఁటి కొత్తుకొత్తుక
నిక్కి తుమ్మిదలవంటి నెరులెల్లాఁ దెల్లనాయ
కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు

చ. 2: చిన్ననాఁడు మోహించిన చెలులు నేఁ జూడఁగానే
పన్నిన వయసు మీరి ప్రౌఢలైరి
వన్నెకుఁ బెట్టిన సొమ్ము వడి రాసి యెత్తుదీసె
మున్నిటివే వెనకాయ ముచ్చటాఁ దొలఁగదు

చ. 3: సిగ్గులెల్లాఁ బెడఁబాసె చేరి యవ్వరు నవ్వినా
యెగ్గుపట్టదు మనసు యెఱుకతోనే
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు నన్ను నేలుకొని
దగ్గరి నాలోనుండఁగా తలపూఁ గైవాలదు

రేకు: 0101-05 ముఖారి సం: 02-005 అధ్యాత్మ

పల్లవి: పులుగు చెప్పెడినదె పొంచి మాగురుఁడు నీకు
తలఁచుకో నేఁడు నీవు దాఁచినర్థము

చ. 1: యిలమీఁద తమసొమ్ము లెవ్వరివద్ద నుండినా
తలపిడి కొలుపిడి తగిలినట్టు
తొలుత పంచేంద్రియపు దొంగలవద్ద నున్నాఁడ
వెలయ నీసొమ్మనుచు విడిపించుకొనవే

చ. 2: చేరి తమవూరివారి చెఱవట్టుకొని పోతే
కోరి కుయివోయి తెచ్చుకొన్నట్టు
వూరక నీకుక్షిలోనవున్న నన్ను నీమాయ
వీరానఁ జెఱవట్టెను విడిపించుకొనవే

చ. 3: బడిదప్పి తిరిగేటి పడుచుల తమవారు
తడయక తెచ్చుక ఆదరించినట్టు
వెడబుద్ధిఁ దిరిగేను వెఱ్ఱిని శ్రీవేంకటేశ
విడువక అజ్ఞాని నన్ను విడుపించుకొనవే

రేకు: 0101-06 ఆహిరి సం: 02-006 వైరాగ్య చింత

పల్లవి: ఇందులో మొదలికర్త యెవ్వఁడు లేఁడు గాఁబోలు
ముందు కరివరదుఁడే ముఖ్యుఁడు గాఁబోలు
    
చ. 1: ఆడితిఁబో బహురూపా లన్నియోనులఁ బుట్టి
తోడనె బ్రహ్మాదులనే దొరలెదుటా
జాడలు మెచ్చాలేరు చాలునన్నవారులేరు
వేడుక నడవిఁగాసే వెన్నెలాయ బ్రదుకు
    
చ. 2: అన్నికర్మములుఁ జేసి ఆటలో బ్రాహ్మణుఁడనైతిఁ-
నన్ని వేదములనేటి యంగడివీధి
నన్నుఁ జూచేవారు లేరు నవ్వేటివారు లేరు
వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు
    
చ. 3: సంసారపునాటకసాలలో ప్రతిమనైతి
కంసారి శ్రీవేంకటపతి మాయలోన
యింస లిన్నియుఁ దేరె నిందరుఁ జుట్టములైరి
హంసచేతి పాలునీరునట్లాయ బ్రదుకు