తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 287

వికీసోర్స్ నుండి


రేకు: 0287-01 సాళంగనాట సం: 03-500 హనుమ

పల్లవి:

అదివో నీప్రతాపము హనుమంతా
యెదురులేదు నీకు నెక్కడా హనుమంతా

చ. 1:

యెత్తిననీ కుడిహస్త మిల నసురలు చూచి
హత్తిరి పాతాళము హనుమంతా
చిత్తగించి నీ యెడమ చేతి పిడికిటికి
తత్తరించి చిక్కిరదె దైత్యులు హనుమంతా

చ. 2:

నలియఁ దొక్కిన నీ వున్నతపుఁ బాదముకింద-
నలమటించే రరులు హనుమంతా
చలపట్టి నీవు జంగ చాఁచిన పాదహతిని
బలుదానవులు భంగపడిరి హనుమంతా

చ. 3:

వడి నీవు మీఁదికి వాలమల్లార్చిన
అడఁగిరి రాక్షసులు హనుమంతా
బడినే శ్రీవేంకటేశుపంపున నీవు గెల్వఁగ
బెడిదమై పొగడేరు పెద్ద హనుమంతా


రేకు: 0287-02 మాళవి సం: 03-501 వేంకటగానం

పల్లవి:

దిక్కులెల్లా సాధించి దేవదుందుభులు మ్రోయ-
నెక్కడ చూచినఁ దానే యేఁగీ సేవించరో

చ. 1:

అదివో శ్రీహరి తేరు అదె గరుడధ్వజము
కదలేటి ఘనతురంగము లవిగో
పొదలుఁ బూదండలవే పూచి వాఁగే ఘంటలవే
యెదుటఁ దిరువీధుల నేఁగీ సేవించరో

చ. 2:

వారె అచ్చరలేమలు వారె మునులు రుషులు
వారక కొలిచే దేవతలు వారే
వీరె యనంతగరుడవిష్వక్సేనాదులు
యీ రీతిఁ బ్రతాపాన నేఁగీ సేవించరో

చ. 3:

వీఁడె శ్రీవేంకటేశుఁడు వీఁ డలమేల్మంగపతి
వీఁడె శంఖచక్రాదుల వెలసినాఁడు
పోఁడిమి వరములిచ్చీఁ బొసఁగ దాసులకెల్లా
యేఁడేఁడు దప్పకుండాను యేఁగి సేవించరో


రేకు: 0287-03 బౌళి సం: 03-502 నృసింహ

పల్లవి:

ఆనందనిలయ ప్రహ్లాదవరదా
భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా

చ. 1:

పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా

చ. 2:

భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళ కేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవపితామహవంద్య ప్రహ్లాదవరదా

చ. 3:

బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలితకరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా


రేకు: 0287-04 రామక్రియ సం: 03-503 హనుమ

పల్లవి:

పంతగాఁడు మిక్కిలి బంటతనమునను
అంతటాఁ గలశాపుర హనుమంతరాయఁడు

చ. 1:

నీరధి చంగన దాఁటి నెట్టన లంకచొచ్చి
శ్రీరాము నుంగరము సీతకిచ్చి
మేరమీరి యక్షుఁ గొట్టి మేటి వనము వెఱికె
ఆరయఁ గలశాపుర హనుమంతరాయఁడు

చ. 2:

ఘాతతో లంక గాలిచి గక్కన లంకిణిఁ జంపి
యీతలికి మగుడఁ దా నేతెంచి
సీతాశిరోమణి శ్రీరామునకు నిచ్చె
ఆతఁడే కలశాపుర హనుమంతరాయఁడు

చ. 3:

అల రావణుని గెల్చి అయోధ్యాపురికి వచ్చి
బలురాముని సీతతోఁ బట్టముగట్టి
నిలిచె శ్రీవేంకటాద్రినిలయుని యెదుటను
అలరెఁ గలశాపుర హనుమంతరాయఁడు


రేకు: 0287-05 ముఖారి సం: 03-504 నృసింహ

పల్లవి:

అవధారు సకలలోకైకనాథ
సువర్ణరూపమైన సుగ్రీవ నారసింహా

చ. 1:

అరుదుగ మీరు సింహాసనముపై నుండఁగ
యిరుగడ సేవించేరు ఇంద్రాదులు
పరగ నెట్టనెదుట ప్రహ్లాదుఁ డున్నవాఁడు
సొరిదినే చిత్తగించు సుగ్రీవ నారసింహా

చ. 2:

చాపలపు హిరణ్యుని సమయించి వున్నమీకు
చేపట్టి మొక్కేరు వశిష్ఠాదులు
యే పొద్దు మీ తొడమీఁద నిందిర గాచుకున్నది
చూపులఁ గరుణ నించు సుగ్రీవ నారసింహా

చ. 3:

లలితముగ నీవు జగములు రక్షించఁగా
వలనుగఁ బొగడేరు వ్యాసాదులు
యెలమి శ్రీవేంకటేశ ఇందునందు నెలకొని
సులభమూర్తివైతివి సుగ్రీవ నారసింహా


రేకు: 0287-06 శ్రీరాగం సం: 03-505 రామ

పల్లవి:

శరణు శరణు రామచంద్ర నరేంద్రా
సరి మమ్ముఁ గావు రామచంద్ర నరేంద్రా

చ. 1:

ఘన దశరథునకుఁ గౌసల్యాదేవికిని
జననమందిన రామచంద్ర నరేంద్రా
కనలి తాటకిఁ జంపి కౌశికు జన్నము గాచి
చనవు లిచ్చిన రామచంద్ర నరేంద్రా

చ. 2:

అరిది సీతఁ బెండ్లాడి అభయ మందరి కిచ్చి
శరధిఁ గట్టిన రామచంద్ర నరేంద్రా
అరసి రావణుఁ జంపి అయోధ్యానగర మేలి
సరవి నేలిన రామచంద్ర నరేంద్రా

చ. 3:

పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు-
సన్నిధి నిల్చిన రామచంద్ర నరేంద్రా
అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల-
సన్నుతి కెక్కిన రామచంద్ర నరేంద్రా