తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 278

వికీసోర్స్ నుండి

రేకు:0278-01 సామంతం సం: 03-447 దశావతారములు


పల్లవి :

సంసారమే మేలు సకలజనులకును
కంసాంతకుని భక్తి గలిగితే మేలు


చ. 1:

వినయపు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాఁగకుంటే మేలు
మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు


చ. 2:

కోరి వొకరి నడిగి కొంచపడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు
భారపుటీడుమలను పడకుండితే మేలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు


చ. 3:

పరకాంతల భంగపరచకుంటే మేలు
దొరకొని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీవేంకటాద్రివిభునిఁ గొల్చి
యిరవై నిశ్చింతుఁడైతే నిన్నిటాను మేలు

రేకు: 0278-02 లలిత సం: 03-448 విష్ణు కీర్తనం


పల్లవి :

భగవద్విభవపు ప్రత్యక్షం బిది
జిగి నిందొకటియుఁ జేయఁగఁ గలమా


చ. 1:

దైవికమేపో తతియగు వానలు
తావగు మొలకలు దైవికమే
కావిరినివెల్లాఁ గంటా వింటా
దైవమునేలో తలఁచము మనము


చ. 2:

జననమరణములు హరి దైవికమే
తనుపోషణములు దైవికమే
నసి యివెల్లా నెఱిఁగియు మరిగియు
కొన దైవమునేలో కొలువము మనము


చ. 3:

యిహపరంబులును యివి దైవికమే
తహతహ లుడుపఁగ దైవికమే
అహిపతి శ్రీవేంకటాధిపు కృపచే
మహిమ గంటిమిఁక మఱవము మనము

రేకు: 0278-03 బౌళి సం: 03-449 వైష్ణవ భక్తి

పల్లవి :

{{Telugu poem|type=చ. 1:|lines=<poem>


పల్లవి :

నన్నెంచఁ బనిలేదు నిన్నెంచుటే కాని
మన్నించు హరి నీ మఱఁగు చొచ్చితిని


చ. 1:

రాజుఁ బెండ్లాడిన యట్టి రమణి యేజాతైనా
పూజితమై యిన్నిటాను భోగించినట్టు
సాజాన నే నెంత సకలహీనుఁడనైనా
వోజతో నిన్నుఁ గొలిచి వున్నతుఁడనైతిని


చ.2:

వేల ముద్దుటంగరము వేడుకనిడి ప్రధాని
కేలెత్తి యిందరిచే మొక్కించుకొన్నట్టు
నేలనే నీ ముద్ర మోచి నే నేఁటివాఁడనైనా
పేలరి జగములోనఁ బెద్దనైతి నిదివో


చ. 3:

తల్లిదండ్రి గలవాఁడు తప్పులేమైనాఁ జేసి
తల్లితో ముద్దుగునిసి తప్పించినట్టు
చల్లని శ్రీవేంకటేశ సరవి నీ కృపవల్ల
కెల్లున నిన్ను నుతించి గెలిచితి నిదివో

రేకు: 0278-04 శుద్ధవసంతం సం: 03-450 వైష్ణవ భక్తి


పల్లవి :

ఎందు వెదకనేల యే ప్రయాసాలు నేల
యిందే వున్నది బ్రదు కిహపరములకు


చ. 1:

ముక్కోటి తీర్థములు ముకుందుదాసుల-
వొక్కపాదాంగుటమున నొలికీనిదే
మిక్కిలి జపతపాలు మించిన ప్రపన్నుల-
చిక్కని కృపాకటాక్షసీమ నున్నదిదివో


చ. 2:

చేసేటి పుణ్యఫలాలు శ్రీవైష్ణవులచేత
రాసులై యిరుదెసల రాలీనివే
ఆసల విజ్ఞానార్థ మదివో ప్రపన్నుల-
భాసురపుఁ బెదవులఁ బాఁతి పైపై నున్నది


చ. 3:

సకలదేవతలచే సాధించే వరములు
మొకరి తదియ్యులమూఁక నిదివో
వెకలి శ్రీవేంకటాద్రివిభుని మహిమలెల్లా
ప్రకటించి వీరి సల్లాపాన నున్నదిదివో

రేకు: 0278-05 సాళంగం సం: 03-451 శరణాగతి


పల్లవి :

నీకుఁ దొల్లే యలవాటు నిరుహేతుకపుదయ
జోక నురుత మెచ్చిన సులభఁడవేకా


చ. 1:

నేరములు దొలఁగించ నెలవులు గలిగించ
గారవించ హరి నీవే కలవు నాకు
నా పేరఁ బిలిచితే నారాయణ యనెనంటా
చేరి కాచినటువంటి శ్రీపతివిగా


చ. 2:

దురితము లణఁగించ దుఃఖములు పెడఁబాప
గరిమఁ గేశవ నీవే కలవు నాకు
మరమరా యంటేను మరి రామ యనెనంటా
తిరముగఁ గాచి నట్టి దేవుఁడవుగా


చ. 3:

వినుతులు చేకొని వేడుకతో నన్నుఁ గావ
ఘనుఁడ శ్రీవేంకటేశ కలవు నాకు
మనసునఁ దలఁచితే మాటలఁ బిలిచెనంటా
తనిసి కంభాన వెళ్లే దైవమవుగా

రేకు:0278-06 గుండక్రియ సం 03-452 వైష్ణవ భక్తి


పల్లవి :

ఏ పాటి తన కర్మ మాపాటి కాపాటె
శ్రీపతిదాసుఁ డయితే చిహ్న లిటువలెఁ బో


చ. 1:

అందరిని నిర్మలులే యని తలఁచిన తన-
నింద లేని మనసే నిర్మలము
మందలించి లోకులతో మంచి మాఁట లాడితేను
బందెలేని తన నోరే భావించ మంచిది.


చ. 2:

అంతటాను హరి యున్నాఁడని చూచినఁ దన -
యంతరంగమున నుండు నీ దేవుఁడే
చింతించి యీ జగము చేకొని పావనమంటే
పంతపు తన దేహముఁ బరమపావనమే


చ. 3:

పుట్టితేఁ దన పాలికిఁ బుట్టే నీ ప్రపంచము
దట్టమైన పుట్టెల్లఁ దనతోడిదే
యిట్టే శ్రీవేంకటేశుఁ డిచ్చినాఁడీ గుణము
పట్టమై నావద్దనుండు పరమవిజ్ఞానము