రేకు: 0269-01 లలిత సం:03-395 భక్తి
పల్లవి : |
తప్ప దీయర్థమొకటి దాఁచిన ధనము సుండీ
విప్పరాదు చెప్పరాదు వేదమందు నున్నది
|
|
చ. 1: |
హరిభక్తి గలిగిన యతనికి మోక్షము
పొరుగున నున్నట్టు పొసఁగినది.
దరిశనభక్తి చేఁ దనరినవారికి
యిరవైన మోక్షము యెదిటిది
|
|
చ. 2: |
మక్కువ భాగవతాభిమానము గలవారి-
కక్కరలేని మోక్ష మరచేతిది
నిక్కి యాచార్యాభిమాననిరతులైనవారికి
తక్కక మోక్షమింతాఁ దనలోనిది
|
|
చ. 3: |
యెంత విచారించుకొన్నా నేనేమి చదివినా-
నెంతవారికైనా మోక్ష మిందులోనిది
వింతగా శ్రీవేంకటవిభుని సంకీర్తన-
వంతులకు మోక్షము వదనములోనిది
|
|
రేకు: 0269-02 మలహరి సం: 03-396 అధ్యాత్మ
పల్లవి : |
ఎవ్వరిదూరఁగఁ జోటు లేదు మరియేమనఁగలదిదివో తగవు
యివ్వల నందరి బడిబడిఁ దిరిగే యీకర్మముదే నేరమి
|
|
చ. 1: |
నీ దాసులకును నేరమి లేదు నీవే గతియని వుండఁగను
ఆదినుండి నీకును నేరమి లేదఖిలానకుఁ గర్తవుగాన
పాదుపడక నడుమనుఁ దిరిగాడెడి ప్రపంచముదే నేరమి
యేదెస నొకచో నిజమేరుపడక యిటువలెఁ దిరిగాడెడిఁ గాన
|
|
చ. 2: |
పాపము లేదిదె యజ్ఞానులకును భావమెరంగని పశువులు గాన
మోపై సుజ్ఞానులకునుఁ బాపము మోవదు నినుఁ గొలిచిరి గాన
చాపలముగ నమ్మించి చెరుచు పలుచదువులదే యీ పాతకము
పైపై నొకయర్థ మేరుపరచక భ్రమయఁగ వాదము వెట్టెడిఁ గాన
|
|
చ. 3: |
యీలోకులకును అధర్మము లే దిన్నియు నీచేఁతలే కాన
మూలనున్నముక్తులకు నధర్మము మొదల లేదు నీ కృప గనక
కాలము గడపుచు నీవు రచించిన కపటపు మాయదే అధర్మము
అలరి శ్రీవేంకటేశ్వర య(యె?)క్కడనడ్డము తానేవచ్చీఁ గాన
|
|
రేకు:0269-03 బౌళి సం:03-397 అధ్యాత్మ
పల్లవి : |
ఇదె చిక్కితివిఁక నెందు వోయెదవు
వుదిరి తొలఁగరాదోహో నీవు
|
|
చ. 1: |
జీవుల లోపలఁ జెలఁగేటి మూర్తివి
దేవతలకు పరదేవుఁడవు
కైవల్యమునకుఁ గలుగు బ్రహ్మమవు
ఆవలి పరమున కర్ణమవు
|
|
చ. 1: |
ఘనకర్మమునకుఁ గలిగిన ఫలమవు
మనసు లోనికిని మాయవు
తనియని చదువుకు దాఁచిన ధనమవు
మునుప జగములకు మూలమవు
|
|
చ. 1: |
వలసినవారికి వర్ణించు రూపవు (???)
సులభులకు సంసారసుఖమవు
అలరిన దాసులమగు మాకైతే
కలిగిన శ్రీవేంకటపతివి
|
|
రేకు: 0269-04 భూపాళం సం: 03-398 వైరాగ్య చింత
పల్లవి : |
తెలిసియుఁ దెలియను తెగదీ చిక్కేమిటాను
కలకాల మిందుననే గరివడె బ్రదుకు
|
|
చ. 1: |
దేహముపై రోఁత తెలుసుకొనేటి వేళ
ఆహా యిదే హేయమై తోఁచును
మోహించి విషయాల మునిఁగిన వేళ నిదే
యీహల నంతటిలోనే ఇతవులై వుండును
|
|
చ. 2: |
చదివి నేఁ బురాణాలు సారెకు వినేటి వేళ
అదివో విరతి ఘనమై వుండును
కదిసి సంసార సుఖకాంక్షలఁ బొందేటి వేళ
మది నన్నియు మరచి మద మెక్కి వుండును
|
|
చ. 3: |
యెక్కడిది వివేక మెవ్వరు గెలిచినారు
చక్కఁ బొడవెక్కించు చరిఁ దోసును
దిక్కు నీవే శ్రీవేంకటదేవుఁడ నీ శరణంటే
యెక్కువ బ్రదుకుఁదోవ యిదియే కలది
|
|
రేకు:0269-05 దేసాక్షి సం: 03-399 శరణాగతి
పల్లవి : |
అల్లనాఁడే యిదెరఁగ మైతిమి గాని
యిల్లిదె దేవుని కృప యీడ నున్నది సుండి
|
|
చ. 1: |
చేరువవో మోక్షము శ్రీహరిభక్తికిని
ధారుణిఁ గర్మమునకే దవ్వుగాని
యీరీతి నింద్రియముల నించుకంతే దాఁటిన
దూరముగాదు జ్ఞానపుతోవ వున్నది సుండి
|
|
చ. 2: |
ధరఁ జేతిది వైకుంఠ మతని దాస్యమునకు
పరధర్మముల కగపడదు గాని
అరుదైన యాసల ఆయము వొడిచితేనే
అరసి యాకంతగుండా నందవచ్చుఁ జుండి
|
|
చ. 3: |
తలఁపులో దక్కె ముక్తి తగు శరణాగతికి
శిలుగుఁ బుణ్యములకుఁ జక్కదుగాని
తెలిసి శ్రీవేంకటేశు తిరుమంత్రము నాలికెఁ
బలికినాడనే దివ్యపద మబ్బుఁ జుండి
|
|
రేకు: 0269-06 సామంతం సం: 03-400 అంత్యప్రాస
పల్లవి : |
మూఁడుమూర్తులనైన ముంచుకొను నీవలపు
వేఁడి విరహములోనె వేఁచు నీవలపు
|
|
చ. 1: |
పాప మెరఁగదు వలపు భయ మెరంగదు వలపు
రూపెరంగదు మతికి రుచి సేయు వలపు
పూపవయసున పండు వొడమించు నీవలపు
తీపులకుఁ గడుదీపు దినదినము వలపు
|
|
చ. 2: |
సిగ్గెరంగదు వలపు శిర కెక్కును వలపు
వొగ్గించు నన్నిటికి వొడిగట్టు వలపు
బగ్గనను నటు గుండె పగిలించు నీవలపు
అగ్గలపజాణలకు నాయ మీవలపు
|
|
చ. 3: |
తెగువ దెచ్చును వలపు తేలించు నీవలపు
యిగిరించి కలిమిలే మెఱఁగ దీవలపు
వగల శ్రీవేంకటేశ్వరు మాయ లీవలపు
తగులు విరికాని (?) వలెఁ దగిలించు వలపు
|
|