రేకు: 0262-01 దేవగాంధారి సం: 03-355 విష్ణు కీర్తనం
పల్లవి : |
వినరో భాగ్యము విష్ణుకథ
వెను బలమిదివో విష్ణుకథ
|
|
చ. 1: |
ఆదినుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీధివీధులనే విష్ణుకథ
|
|
చ. 2: |
వదలక వేద వ్యాసులు నుడిగిన-
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణుకథ
|
|
చ. 3: |
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకఁగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీవేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపే నీ విష్ణుకథ
|
|
రేకు: 0262-02 సాళంగనాట సం: 03-356 నామ సంకీర్తన
పల్లవి : |
భవరోగవైద్యుఁడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో
|
|
చ. 1: |
అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేని రతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో
|
|
చ. 2: |
పొలఁతులనెడి మహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారు.
అలరు చెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో
|
|
చ.3: |
తరుణుల కాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁ గారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదు సుఖాననుండే యంత్రమేదొకో
|
|
రేకు: 0262-03 సామంతం సం: 03-357 వైరాగ్య చింత
పల్లవి : |
కలిగినవాఁడే చుట్టరికంబులఁ దిరుగు నివి
నలుగడ నివి సతమని మతి నమ్ముట పాపమయా
|
|
చ. 1: |
దేహము తోడనె పెరుగును తీరనియీఇంద్రియములు
దేహము తోడనె ముదియును తేటతెల్లమిగను
ఆ పుట్టనినాఁడును అంతము నొందిననాఁడును
శ్రీహరిమాయలఁ దగులుక జీవునిఁ దడవ వివి
|
|
చ. 1: |
తెలిశున్నపడే తగులును తియ్యని యీ సంసారము
తెలివికిఁ బాసినయప్పుడు దిగఁబడుఁ దా నెందో
మలయక నిద్రించునప్పుడు మత్తుఁడై యున్నప్పుడు
చలమరి జీవుని తోడుత సమ్మతమే లేదు.
|
|
చ. 1: |
కన్నులు దెరచిన యప్పుడే కాన్పించును యీలోకము
కన్నులు మూసినయపుడె కడగడఁ దా నణగు
అన్నిట శ్రీవేంకటేశ్వరుఁ డాత్మను వెలిఁగెడివేళను
వున్నతి జీవులఁ దగులవు వొదుగుచుఁ దిరుగు నివి
|
|
రేకు: 0262-04 దేసాళం సం: 03-358 విష్ణు కీర్తనం
పల్లవి : |
ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు
ఆతని మానుటలెల్లా నవిధిపూర్వకము
|
|
చ. 1: |
యెవ్వని పేరఁ బిలుతు రిలఁ బుట్టిన జీవుల
నవ్వుచు మాసనక్షత్రనామములను
అవ్వల నెవ్వని కేశవాదినామములే
రవ్వగా నాచమనాలు రచియింతురు
|
|
చ. 2: |
అచ్చ మే దేవుని నారాయణనామమే గతి
చచ్చేటివారికి సన్యాసమువారికి
ఇచ్చ నెవ్వరిఁ దలఁచి యిత్తురు పితాళ్లకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము
|
|
చ. 3: |
నారదుఁడు దలఁచేటి నామమది యెవ్వనిది
గౌరి నుడిగేటి నామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
యీ రీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము
|
|
రేకు: 0262-05 దేవగాంధారి సం: 03-359 గురు వందన, నృసింహ
పల్లవి : |
పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు
అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు
|
|
చ. 1: |
పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి
చిత్తమనియెడు చేను చేనుగా దున్ని
మత్తిలి శాంతమనే మంచివాన వదనున
విత్తుదురు హరిభక్తి వివేకులు
|
|
చ. 2: |
కామక్రోధాదులనే కలువు దవ్వివేసి
వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి
దోమటి నాచారవిధుల యెరువులువేసి
వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు
|
|
చ. 3: |
యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి-
అందిన చేని పంట లనుభవించి
సందడించి తమవంటి శరణాగతులుఁ దాము
గొంది నిముడుకొందురు గురుకృప జనులు
|
|
రేకు: 0262-06 శంకరాభరణం సం: 03-360 వైష్ణవ భక్తి
పల్లవి : |
మానుప వశమా మాయ లివిన్నియు
శ్రీనాథుఁడు మును సేసినవే
|
|
చ. 1: |
రాతిరి చీఁకటి రతిఁ బగలు వెలుఁగు
ఘాతల నెప్పుడు గలదిదియే
యీతల జ్ఞానుల కిల నజ్ఞానుల
జాతివైరములు సహజములే
|
|
చ. 2: |
అసురలకు సురల కనాది నుండియు
అసమున వైరంబది గలదే
యెసగి వైష్ణవుల కీలఁ బ్రాకృతులకు
పొసఁగని వాదము భువిఁ గలదె
|
|
చ. 3: |
యిహమునుఁ బరమును యీలంకెలతో
విహితము చెప్పెడి వేదములే
అహిపతి శ్రీవేంకటాధిపు మతమిది
నిహితం బెఱిఁగిన నిశ్చలమే
|
|