Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 260

వికీసోర్స్ నుండి

రేకు: 0260-01 భూపాళం సం: 03-343 వైరాగ్య చింత


పల్లవి :

వెఱ్ఱి దెలిసి జగము వెస రోఁకలి చుట్టేను
వొఱ్ఱె దేవతల వరాలొగి నెందు కెక్కునో


చ. 1:

తగిలి సంపదలచేఁ దనిసినవారు లేరు
అగపడి దైవమానుషాలందును
వొగరు సంసారభార మోపనన్నవారు లేరు
వగవఁగఁ జదువు లెవ్వరికిఁ జెప్పెనో


చ. 2:

జడిసి ఆయుష్యము చాలునన్నవారు లేరు
పొడమేటి పదునాల్గుభువనాలందు
తడవి తనముదిమి తా రోసేవాఁడు లేఁడు
యెడయని తపముల యెవ్వరి దెచ్చెనో (?)


చ. 3:

నడుమనే తిరిగాడీ నానాధర్మములు
పడనిపాట్ల నేము పడఁగాను
తడవి శ్రీవేంకటేశుదాసులు మమ్ముఁ గాచిరి
బడిబడి నిత్యకర్మఫలము లెన్నటికో

రేకు: 0260-02 రాయగౌళ సం: 03-344 శరణాగతి


పల్లవి :

ఇంతగాలమాయను యేడనున్నారో వీరు
వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు


చ. 1:

యేలేవారి దూరితి యెడరు పుట్టినవేళ
కాలమును దూరితిని కలఁగేవేళ
తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి
యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము


చ. 2:

దైవమును దూరితి తమకించినట్టివేళ
కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ
సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి
యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము


చ. 3:

 పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ
కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి
జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె
యిట్టె యింతటివారు యెవ్వరును లేరు

రేకు: 0260-03 నాట సం: 03-345 అద్వైతము


పల్లవి :

తల మొలా నొక్కసరా తను వొక్కటౌఁగాక
కొలఁది యెరిఁగతనిఁ గొలువరో మీరు


చ. 1:

బొడ్డున బ్రహ్మఁ గనిన పురాణపురుషుఁడే
దొడ్డుఁ గాక ఆతని తోడివాఁడ (డా?]
వొడ్డిన కైలాసమే లేవు మాపతిఁ గడుపులో
వెడ్డువెట్టి పెంచేవాఁడు వీరితోవాఁడా


చ. 2:

చక్కని కన్నుల సూర్యచంద్రులుగాఁ గలవాఁడు
యెక్కుడుగా కిందరిలో నీడువెట్టేదా
అక్కర యీ దేవతల కాపద మానిపేవాఁడు
వెక్కసమే కాక యెంచ వీరిలోనే వొకఁడా


చ. 3:

అందరు నీతనియందే అయితే నౌదురుఁ గాక
యెందును శ్రీపతి తోడియీడువారా
కందువ శ్రీవేంకటాద్రి ఘనవరము లోసఁగె
దిందుపడ్డ లోకులకు ద్రిష్టమిదే కాదా

రేకు: 0260-04 పాడి సం: 03-346 అధ్యాత్మ



పల్లవి :

ఏమి చెప్పెడినో శాస్త్రరహస్యము యేమిచెప్పెడినొ వేదములు
తామసమై బహునాయకమాయను తత్త్య మెఱంగఁగఁ దరమేదయ్యా


చ. 1:

కొన్నిజంతువులు రోసిన హేయము కొన్నిజంతువుల కమృతము
కొన్ని జంతువుల దివములే రాత్రులు కొన్ని జంతువులకు
అన్నియు నిట్లనె వొక్కటొక్కటికి అన్యోన్య విరుద్ధములు
పన్నిన జీవుల కేకసమ్మతము భావించఁగ మరి ఇఁక నేదయ్యా


చ. 2:

కొందరు విడిచిన సంసారము మరికొందరికి నది భోగ్యంబు
కొందరి పునుకులు వూర్ధ్వలోకములు కొందరివునుకులు పాతాళంబు
అందరు నందరె వారివారి రుచు లివిగాదిది(వి?) యనరాదు
కందువ జీవులు విచారించేటి కార్యాకార్యము లిఁకనేదయ్యా


చ. 3:

కొంతభూమి నటు చీఁకటినిండినఁ గొంతభూమి వెన్నెల గాయు
కొంతట సురలును కొంతట నసురలు కోరికై కొనిరి జగమెల్లా
ఇంతట శ్రీవేంకటేశ్వర నీవే యిందరి యంతర్యామివి
చింతలు వాయవు యెవ్వరిమనసునఁ జేరి నీకు శరణంటేఁ గాని

రేకు: 0260-05 సామంతం సం: 03-347 మాయ


పల్లవి :

అణుమాత్రపు దేహినంతే నేను
ముణిఁగెద లేచెద ముందర గానను


చ. 1:

తగు సంసారపు తరఁగలు నీమాయ
నిగమముల యడవి నీమాయ
పగలునిద్రలు వుచ్చే భవములు నీమాయ
గగనపు నీమాయఁ గడవఁగ వశమా


చ. 2:

బయలువందిలి కర్మబంధములు నీమాయ
నియమపుఁ బెనుగాలి నీమాయ
క్రియ నిసుకపాఁతర కెల్లొత్తు నీమాయ
జయమంది వెడలఁగ జనులకు వశమా


చ. 3:

కులధనములతోఁ జిగురుఁగండె నీమాయ
నిలువు నివురగాయ (?) నీమాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుటఁ గాక యిది గెలువఁగ వశమా

రేకు: 0260-06 బౌళి సం: 03-348 శరణాగతి


పల్లవి :

ఎన్నఁడుఁ దీరవు యీ పనులు
పన్నిన నీ మాయ బహుళంబాయ


చ. 1:

పెక్కు మతంబుల పెద్దలు నడచిరి
వొక్క సమ్మతై వొడఁబడరు
పెక్కుదేవతలు పేరు వాడెదరు
తక్కక ఘనులము తామేయనుచు


చ. 1:

పలికెటి చదువులు బహుమార్గంబులు
కలసి యేకవాక్యత గాదు
చ(ఛ?)లవాదంబులు జనులును మానరు
పలు తర్కంబులె పచరించేరు


చ. 1:

శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
తిరముగ నీవే తీర్చితివి
పరమవైష్ణవులు పట్టిరి వ్రతము
యిరవుగ నాచార్యు లెరుఁగుదురు