తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 229

వికీసోర్స్ నుండి


రేకు: 0229-౦1 దేవగాంధారి సం: 03-162 కృష్ణ

పల్లవి:

ఒకరి కొకరు వొడ్డు దప్పులనే
పకపక నవ్వు పచరించేరు

చ. 1:

కొట్టీ నుట్లదె గోవిందుఁ డంతలో
తిట్టేరు గోపసతీమణులు
పట్టీ జన్నులట్టే పైపై గోవిందుఁడు
మెట్టెల పాదాల మెట్టే రింతులు

చ. 2:

వారవట్టీఁ బాలు వంచి గోవిందుఁడు
గోర గీరే రదే గొల్లెతలు
చీర లంటీనట్టె చెంది గోవిందుఁడు
మేరతోఁ గొప్పు వంచి మించే రింతులు

చ. 3:

కెలసి వెన్నారగించీ గోవిందుఁడు
తొలఁగఁ దోసేరు దొడ్డవారు
కలసెను శ్రీవేంకటాద్రి గోవిందుఁడు
అలమేరు మరి నంగనలు


రేకు: 0229-02 శంకరాభరణం సం: 03-163 ఉత్సవ కీర్తనలు

పల్లవి:

మదనజనకునికి మజ్జనవేళ
పదివేలు భోగములు పరగీనదె

చ. 1:

వున్నతి వేద ఘోషాల నుర్వీధరుని మీఁద
పన్నీటి కాలువలు పారీనదె
మున్నిటి మునుల హస్తములఁ గప్పురపుధూళి
కన్నులపండుగగాఁ గప్పీనదె

చ. 2:

సేసలుగా నలువంక శ్రీసతి విభునిమీఁద
వాసన తట్టుపుణుఁగు వడిసీనదె
భాసురపుఁ జంద్రగావిపట్టుదట్టి కాంతలెల్లా
ఆసల మొలఁ గట్టగా నమరీనదె

చ. 3:

చెలరేఁగి సొమ్ములెల్లా శ్రీవేంకటేశ్వరు మేన
నెలకొని కాంతులతో నిండీనదె
అలమేలుమంగ వురమందు నెలకొని యట్టె
సలిగె గృపారసము చల్లీనదె


రేకు: 0229-03 సాళంగనాట సం: 03-164 ఉత్సవ కీర్తనలు

పల్లవి:

భీకరపు చక్రమదె పిడుగులు రాలీనదె
పైకొని నిలువరాదు పారరో దిక్కులకు

చ. 1:

బండికండ్లరవమదే బంగారుమెఱుఁగులవే
కొండవంటి రథమదె గొడగులవే
మెండుగ దేవుఁడు వీధి మెరసి యేతెంచీ వాఁడే
బండుబండై యసురలు పారరో దిక్కులకు

చ. 2:

గరుడధ్వజమదే ఘంటారవములవే
సొరిది ముత్యాలకుచ్చులు నవే
బిరుదుశంఖముమ్రోఁత బెరయించీ దేవుఁడదే
పరగ దానవులెల్లఁ బారరో దిక్కులకు

చ. 3:

ముంగిట బలములవే మొరసీ భేరులవే
సంగతిఁ బ్రతాపమదే సాకారమదే
కుంగ కలమేలుమంగఁ గూడి శ్రీవేంకటేశుఁడు
భంగపెట్టీ దైతేయులు పారరో దిక్కులకు


రేకు: 0229-04 శ్రీరాగం సం: 03-165 వేంకటగానం

పల్లవి:

భావించరే చెలులాల పరమాత్ముని
చేవదేరి చిగురులో చేఁగయై యుండెను

చ. 1:

మలసి పన్నీట హరి మజ్జనమాడేవేళ
కలశాబ్ధిఁ దేలే మాణికమువలె నుండెను
అలరి కప్పుర కాపు అవధరించేటి వేళ
మొలచిన వెన్నెల మొలకయై యుండెను

చ. 2:

అంచలఁ దట్టుపుణుఁగు అవధరించేటి వేళ
యెంచ నంజనాద్రిపై యేనుగై వుండెను
మించిన హారములెల్ల మేన నించుకొన్న వేళ
మంచిమంచి నక్షత్ర మండలమై యుండెను

చ. 3:

వున్నతి నలమేల్మంగ నురమున నుంచు వేళ
పెన్నిధై పూచినట్టి సంపెంగవలె నుండెను
వన్నె శ్రీవేంకటేశుఁడు వరములిచ్చేటి వేళ
తిన్ననై యందరి భాగ్యదేవతయై యుండెను


రేకు: 0229-05 సామంతం సం: 03-166 కృష్ణ

పల్లవి:

చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితఁడు
కప్పి కన్నుల పండుగగాఁ జూడరో

చ. 1:

అద్దుచుఁ గప్పురధూళి యట్టే మేన నలఁదఁగా
వొద్దిక దేవునిభావ మూహించితేను
మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి
మద్దులకాంతి మేన మలసినటుండె

చ. 2:

అమరఁ దట్టుపుణుఁగు అవధరించఁగాను
తమితోఁ బోలికెలెల్లఁ దచ్చిచూడఁగా
యమునానది నాఁగేట నండకుఁ దీసుకొనఁగా
యమునానది నలుపు అంటిన యట్టుండె

చ. 3:

అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్లఁ జెలరేఁగఁగా
బంగారపు టలమేలుమంగ నురాన నుంచఁగా
బంగారము మేననెల్లాఁ బరగినట్టుండె


రేకు: 0229-06 పాడి సం: 03-167 శరణాగతి

పల్లవి:

నేరనైతి నింతేకాక నే నిన్నాళ్లు
యే రీతి విచారించినా నిదివో నిశ్చయము

చ. 1:

నాకుఁగా వేరొకరు విన్నపము సేసేరా నీకు
వాకుచ్చి నేనే ఆడవలెఁ గాక
యీకడ నాకంటే హీనునిఁక నీవు గా(ం)చేవా
శ్రీకాంతుఁడ యిఁక నీ చిత్తమింతే కాక

చ. 2:

నీవల్ల బతుకలేక నేనొకరి వేఁడేనా
వావిరి నిన్నే కొసరవలెఁ గాక
నీ వితరణగుణము నీలోనే దాఁచుకొనేవా
సోవ నావంటివారికిఁ జూపవలెఁ గాక

చ. 3:

తల్లికి లేని ముద్దు దాదికిఁ గలదా మరి
చెల్లుబడి నీవే దయ సేయుటఁ గాక
తొల్లె శ్రీవేంకటేశ్వర తూరి నాలో నున్నాఁడవు
చల్లఁగా నీ చనవిచ్చి జరుపుటఁ గాక