తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 225
రేకు: 0225-01 రామక్రియ సం: 03-138 హనుమ
పల్లవి:
అన్నిటా నేరుపరి హనుమంతుఁడు
పిన్ననాఁడే రవినంటె పెద్ద హనుమంతుఁడు
చ. 1:
ముట్టిన ప్రతాపపు రాముని సేనలలోన
అట్టె బిరుదుబంటు శ్రీహనుమంతుఁడు
చుట్టి రానుండినయట్టి సుగ్రీవు ప్రధానులలో
గట్టియైన లావరి చొక్కపు హనుమంతుఁడు
చ. 2:
వదలక కూడినట్టి వనచర బలములో-
నదె యేకాంగవీరుఁడు హనుమంతుఁడు
చెదరక కుంభకర్ణు చేతి శూలమందరిలో
సదరాన విరిచె భీషణ హనుమంతుఁడు
చ. 3:
త్రిజగముల లోపల దేవతాసంఘములోన
అజుని పట్టాన నిల్చె హనుమంతుఁడు
విజయనగరాన శ్రీవేంకటేశు సేవకుఁడై
భుజబలుఁడై యున్నాఁ డిప్పుడు హనుమంతుఁడు
రేకు: 0225-02 గౌళ సం: 03-139 అధ్యాత్మ
పల్లవి:
వివరించుకోనివారి వెఱ్ఱితనమింతే కాక
తవిలి రెంటికి గురి తామే కారా
చ. 1:
కడుఁ బాపకర్మానకుఁ గలిగినట్టి బలిమి
నడుమఁ బుణ్యకర్మమునకు లేదా
అడరి నరలోకమందు గలిగిన విధి
కడు మంచి స్వర్గలోకమునకు లేదా
చ. 2:
తప్పక బంధములను తగిలించే కోరికె
ముప్పిరిఁ గొనేటి మోక్షమునకు లేదా
కప్పి యట్టె కల్లలాడఁగలిగిన నాలికె
దప్పిదీర శ్రీహరిఁ దలఁచఁగ లేదా
చ. 3:
పంచుకొన్న విషయాలబారిఁ జిక్కే జీవుఁడు
అంచెల వైరాగ్యమునందు లేఁడా
పంచల నరుల వెంటఁ బారాడించే మనసు
కొంచక శ్రీవేంకటేశుఁ గొలిపించలేదా
రేకు: 0225-03 దేసాక్షి సం: 03-140 వేంకటగానం
పల్లవి:
తలఁచినప్పుడు వచ్చు దయ యెప్పుడూఁ దలఁచు
కలసిన బంధువుడు కమలారమణుఁడే
చ. 1:
ఆతుమలోననే వుండు అన్నిటాఁ బాయనివాఁడు
యీతల నాతలఁ దానే యేమైనా నిచ్చు
చేతిలోఁ జేసే కర్మాలు చెడనియ్యఁ డెన్నఁడును
ఆతుర బంధువుఁడు హరి యొక్కఁడే
చ. 2:
నిచ్చలు విందులు వెట్టు నెలఁతల నొడఁగూర్చు
యిచ్చెరిఁగి కప్ప గోకలెందైనాఁ దెచ్చు
మెచ్చు నేమిటికినైనా యిచ్చినవి గైకొను
ముచ్చటైన బంధువుఁడు ముకుందుఁడే
చ. 3:
తోడునీడై వచ్చు మరి దొరతనము సేయించు
పాడితోఁ బంచేంద్రియాలఁ బంపు సేయించు
మేడెపు సంసారములో మించిన నిద్ర దెలుపు
వేడుక బంధువుఁడు శ్రీవేంకటేశుఁడే
రేకు: 0225-04 వసంతవరాళి సం: 03-141 శరాణగతి
పల్లవి:
నారాయణుఁ డీతఁడు నరులాల
మీరు శరణనరో మిమ్ముఁ గాచీని
చ. 1:
తలఁచిన చోటను తానే వున్నాఁడు
వలెననువారి కైవసమెపుడు
కొలచెను మూఁడడుగుల జగమెల్లాను
కొలిచినవారిఁ జేకొనకుండునా
చ. 2:
యెక్కడఁ బిలి(చి)నా నేమని పలికి
మొక్కిన మన్నించు మునుముగను
రక్కసుల నణఁచి రక్షించు జగములు
దిక్కని నమ్మినఁ దిరముగా నేలఁడా
చ. 3:
చూచిన యందెల్ల చూపును రూపము
వోచికఁ (?) బొగడిన వుండు నోటను
యేచిన శ్రీవేంకటేశుఁడే యితఁడట
చేచేతఁ బూజింప సేవలు గొనఁడా
రేకు: 0225-05 సాళంగనాట సం: 03-142 కృష్ణ
పల్లవి:
కొమ్మలు చూడరే గోవిందుఁడు
కుమ్మరించీ ముద్దు గోవిందుఁడు
చ. 1:
దిట్ట బాలులతోఁ దిరిగి వీధుల
గొట్టీ నుట్లు గోవిందుఁడు
పట్టిన కోలలు పైపైఁ జాఁపుచు
కుట్టీ దూంట్లుగా గోవిందుఁడు
చ. 2:
నిలువుఁగాశతో నిడిగూఁతలతో
కొలకొలమని గోవిందుఁడు
వలసిన పాలు వారలు వట్టుచు
కులికి నవ్వీ గోవిందుఁడు
చ. 3:
బారలు చాఁపుచుఁ బట్టగ నింతులఁ
గూరిమిఁ గూడీ గోవిందుఁడు
చేరి జవ్వనుల శ్రీవేంకటాద్రిపై
గోరఁ జెనకీ గోవిందుఁడు
రేకు: 0225-06 సాళంగనాట సం: 03-143 హనుమ
పల్లవి:
అంజనాతనయుఁడైన హనుమంతుఁడు
రంజితపు మతంగపర్వత హనుమంతుఁడు
చ. 1:
రాకాసునెల్లాఁ గొట్టి రావణుని భంగపెట్టి
ఆకాసము మోచెనదే హనుమంతుఁడు
చేకొని యుంగరమిచ్చి సీతకు సేమము చెప్పె
భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుఁడు
చ. 2:
రాముని మెప్పించి మధ్యరాతిరి సంజీవి దెచ్చి
ఆముకొని యున్నాఁడు హనుమంతుఁడు
స్వామికార్యమునకే సరిఁ బేరువడ్డవాఁడు
ప్రేమముతోఁ బూజగొనీఁ బెద్ద హనుమంతుఁడు
చ. 3:
ఉదయాస్తశైలముల కొక్కజంగగాఁ జాఁచి
అదె సూర్యుతోఁ జదివె హనుమంతుఁడు
యెదుట శ్రీవేంకటేశు కిష్టుఁడై రామజపానఁ
బెదవులు గదలించీఁ బెద్ద హనుమంతుఁడు