Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 213

వికీసోర్స్ నుండి


రేకు: 0213-01 దేసాక్షి సం: 03-073 అధ్యాత్మ

పల్లవి:

ఇతనికంటే నుపాయ మిఁక లేదు
మతిలోన నున్నవాఁడు మర్మమిదే సుండీ

చ. 1:

ఇన్ని లోకసుఖములు ఇంద్రియప్రీతులే
తన్నుఁ గనిన తల్లిదండ్రి తనుపోషకులే
కన్ను లెదిటిధనాలు కారణార్థములే
వున్నతి నిష్టార్థసిద్ది కొక్కఁడే దేవుఁడు

చ. 2:

కల దేవత లిందరు కర్మఫలదాతలే
లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజల కొరకే
పలుమంత్రము లెల్లను బ్రహ్మలోక మీసందివె
వొలిసి ఇష్టార్థసిద్ది కొక్కఁడే దేవుఁడు

చ. 3:

అనుదిన రాజ సేవ లల్పార్థ హేతులే
కొనఁ గల్పవృక్షమైనఁ గోరిన విచ్చేటిదే
ఘన శ్రీవేంకటేశుఁడు కల్పించె జీవునిఁ గావ-
నొనర నిష్టార్థసిద్ది కొక్కఁడే దేవుఁడు


రేకు: 0213-02 బౌళి సం: 03-074 శరణాగతి

పల్లవి:

నన్ను నెవ్వరు గాచేరు నాఁటి పగెంతురుఁ గాక
నిన్న నేఁడీ రోఁతలై తే నీతి యౌనా నాకును

చ. 1:

దేవుఁడ నేనే యంటా తిరిగే నాస్తికుఁడనా
దేవతలకు మొక్కఁబోతే నిఁక నగరా
కావించి యింద్రియములే గతెని యిన్నాళ్లు నుండి
ఆవల జితేంద్రియుఁడనంటే నవి నగవా

చ. 2:

కర్మము దొల్లి సేయక కడుదూరమై ఇఁక నా-
కర్మము సేయఁగఁబోతే కర్మమే నగదా
దుర్మతి సంపారినై(???) తొయ్యలులకు మోహించి
అర్మిలి దూషించితేను అట్టె వారు నగరా

చ. 3:

నేనే స్వతంత్రుఁడనంటా నిండుదానాలెల్ల మాని
పూని యిఁకఁ జేయఁబోతే పొంచి యవి నగవా
నేనిన్నిటా సిగ్గుపడి నీ మరఁగు చొచ్చితిని
ఆనుకొని శ్రీవేంకటాధిపుఁడ కావవే


రేకు: 0213-03 సామంతం సం: 03-075 అధ్యాత్మ

పల్లవి:

పరుసము సోఁకక పసిఁడౌనా
పురుషోత్తముఁడే బుద్ధిచ్చుఁ గాక

చ. 1:

భువి భోగములకుఁ బుట్టిన దేహము
వివరపు మోక్షము వెదకీనా
యివల సకలమును యేలేటి దేవుఁడు
తవిలి రక్షింపుట ధర్మముఁ గాక

చ. 2:

బెరసి యాసలనే పెరిగేటి దేహము
ధరఁ గొంతయినాఁ దనిసీనా
అరుదుగ నంతర్యామగు దేవుఁడు
పొరిఁ బెర రేఁచుటే పొందౌఁ గాక

చ. 3:

ఘనమగు సంసారకారణ జీవుఁడు
తన సుజ్ఞానముఁ దలఁచీనా
వెనక మునుప శ్రీవేంకటపతియే
కనుఁగొని మమ్మిటు కాచుటఁ గాక


రేకు: 0213-04 లలిత సం: 03-076 దశావతారములు

పల్లవి:

నీమహి మది యెంత నీవు చేసే చేఁతలెంత
దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా

చ. 1:

నీ పాదతీర్థము నెత్తి మోచె నొకఁడు
పూఁపకొడుకై యొకఁడు బొడ్డునఁ బుట్టె
యేపున నింతటివారి కెక్కుడైన దైవమవు
మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా

చ. 2:

నీ లీల జగమెల్లా నిండి యున్నదొకవంకఁ
నోలి నీలో లోకాలున్నవొకవంక
యే లీలఁ జూచినాను యింతటి దైవమవు
బాలుఁడవై రేపల్లెలోఁ బారాడితివెట్టయ్యా

చ. 3:

శ్రీసతికి మగఁడవు భూసతికి మగఁడవు
యీ సరుస శ్రీవేంకటేశుఁడవు
రాసి కెక్కి నీవింతటి రాజసపు దైవమవు
దాసులము మా కెట్ల దక్కితివయ్యా


రేకు: 0213-05 ఆహిరి సం: 03-077 అధ్యాత్మ

పల్లవి:

కలకాల మిట్లాయఁ గాఁపుర మెల్లా
అల దైవమెందున్నాఁడో ఆలకించఁడుగా

చ. 1:

తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
తనకుఁ జింత పుట్టితే దైవము దూరు
మనుజుని గుణమెల్లా మాపుదాఁకా నిట్లానె
ఘనదైవ మెందున్నాఁడో కరుణఁ జూడఁడుగా

చ. 2:

విరివిఁ బాపాలు సేసేవేళ నాదాయము లెంచు
నరకమఁది పుణ్యము నాఁడు వెదకు
తిరమైన జీవుని తెలివెలా నీ లాగె
ధర దైవమెందున్నాఁడో దయఁ జూడఁడుగా

చ. 3:

వేళతో నిద్దిరింపుచు విరక్తునివలె నుండు
మేలుకొన్నవేళ నన్ని మెడఁ బూనును
యీలీల దేహిగుణము యెంచి శ్రీవేంకటేశుఁడు
యేలీ దైవమెందున్నాఁడో యిట్టే మన్నించఁడుగా


రేకు: 0213-06 శంకరాభారణం సం: 03-078 అధ్యాత్మ

పల్లవి:

ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానఁడింతేకాక

చ. 1:

యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల
కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁడింతేకాక

చ. 2:

యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా
దోమటి సంసారపు దొంతికర్మములఁ జిక్కి
కాముకుఁడై కిందుమీఁదు గానఁడింతేకాక

చ. 3:

యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ
శ్రీవేంకటేశ్వరు సేవచేత నుండఁగా
భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు
కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక