తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 389
రేకు: 0౩89-01 మాళవిగౌళ సం: 04-514 రామ
పల్లవి:
అదె లంక సాధించె నవని భారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితఁడు
చ. 1:
రవి వంశ తిలకుఁడు రాముఁ డితఁడు
భువిఁ బుట్టె దశరథ పుత్రుఁ డితఁడు
భవుఁడెంచెఁ దారక బ్రహ్మ మీతఁడు
పవనజు కిచ్చినాఁడు బ్రహ్మపట్ట మీతఁడు
చ. 2:
బలువుఁడు సీతాపతి యితఁడు
తలకొన్న వాలి మర్దనుఁ డితఁడు
విలసిల్లె నేకాంగ వీరుఁ డితఁడు
చలమరి కోదండ దీక్షా గురుఁ డితఁడు
చ. 3:
శరణాగత వజ్రపంజరుఁ డితఁడు
సరిలేని యసుర భంజకుఁ డితఁడు
వరదుఁడు శ్రీ వేంకటేశ్వరుఁ డితఁడు
అరయ విజయనగరాధీశుఁ డీతఁడు
రేకు: 0389-02 రామక్రియ సం: 04-515 రామ
పల్లవి:
రాముఁడు లోకాభిరాముఁడు వీఁడిగో
వేమారు మొక్కుచు సేవించరో జనులు
చ. 1:
చెలువపు రూపమున జితకాముఁడు
మలసీ బిరుదున సమర భీముఁడు
పొలుపైన సాకేతపుర ధాముఁడు
యిలలోఁ బ్రజలకెల్లా హిమధాముఁడు
చ. 2:
ఘనకాంతుల నీల మేఘ శ్యాముఁడు
అనిశము నుతుల సహస్ర నాముఁడు
కనుపట్టు కపి నాయక స్తోముఁడు
తనునెంచితే దేవతా సౌర్వభౌముఁడు
చ. 3:
సిరుల మించిన తులసీ దాముఁడు
కరుణానిధియైన భక్త ప్రేముఁడు
వురుతర మహిమల నుద్దాముఁడు
గరిమల శ్రీ వేంకటగిరి గ్రాముఁడు
రేకు: 0389-03 సామంతం సం: 04-516 అధ్యాత్మ
పల్లవి:
అదిగాన నీతి శాంతాలన్నిటకిఁ గారణము
పదిలమై వివేకించి బ్రదుకఁగ వలయు
చ. 1:
తఱచు మాఁటలాడితే తప్పులెన్నైనాఁ దొరలు
పఱచై తిరిగితేను పాప మంటును
మెఱసి తిరిగాడితే మిక్కిలి దూరు ముట్టు
యెఱకగలవాఁ డిందు నేమఱ డెప్పుడును
చ. 2:
కన్నవెల్లాఁ జూచితే కడునాస లుప్పతిలు
కన్నెలు పెక్కుగూడితే కరఁగు మేను
సన్నలు సారెకునైతే చవుకౌ దొరతనము
యిన్నిట నేర్పరైనవాఁ డేమఱఁ డెప్పుడును
చ. 3:
మట్టుమీరి నవ్వితే మచ్చరా లూరకే పుట్టు
గుట్టులేక నడచితేఁ గొంచపడును
నెట్టినె శ్రీ వేంకటేశ నీకు శరణుచొచ్చి
యిట్టె నీ దాసుఁడైనవాఁ డేమరఁ డెప్పుడును
రేకు: 0389-04 సాళంగనాట సం: 04-517 రామ
పల్లవి:
జయము మనది వనచరులాల
రయమున దర్మదారలు తుత్తుతూ
చ. 1:
రక్కసుల మీఁద రాముఁడలిగె నలు-
దిక్కుల నడవుఁడు తిడిం తిడిం
యెక్కుఁడు సేనలు యిటు మొరయింపుఁడు
ఢక్కా నినదము ఢమఢమఢమం
చ. 2:
కుటిలదానవులఁ గొట్టుఁడు కోటలు
తటుకున దాఁటుఁడు ధణ౦ ధణం౦
పటుగతినార్చుచు పట్టుఁడు లగ్గలు
పెటులు చూఁడఁ డదె పెట పెట పెటల్
చ. 3:
గుట్టున నుండక కూలె రావణుఁడు
పట్టుఁడు సంకులు భం భం భం
యిట్టె శ్రీ వేంకటేశుఁడు గెలిచెను
దిట్టలై యాడుఁడు ధిం ధిం ధిం
రేకు: 0389-05 శంకరాభరణం సం: 04-518 రామ
పల్లవి:
వినుఁ డిదె రఘుపతి విజయములు
పనుపడి రాక్షస బాధ లుడిగెను
చ. 1:
కులగిరు లదరెను కుంభిని వడఁకెను
యిల రాముఁడు రథమెక్కినను
కలఁగె వారిధులు కంపించె జగములు
బలు విలునమ్ములు వట్టినను
చ. 2:
పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె
తొడిఁబడి బాణము దొడిగినను
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు
యెడపక రావణు నేసినను
చ. 3:
చుక్కలు డుల్లెను స్రుక్కె భూతములు
తొక్కి యసుర తల దుంచినను
గక్కన శ్రీ వేంకటగిరి నిలువఁగ
అక్కజమగు శుభ మందరి కొదవె
రేకు: 0389-06 బౌళిరామక్రియ సం: 04-519 రామ
పల్లవి:
ఇతఁడే పరబ్రహ్మ మిదియే రామకథ
శత కోటి విస్తరము సర్వ పుణ్య ఫలము
చ. 1:
ధరలో రాముఁడు పుట్టె ధరణిజఁ బెండ్లాడె
అరణ్య వాసుల కెల్లా నభయమిచ్చె
సొరిది ముక్కుఁ జెవులు చుప్పనాతిని గోసె
ఖర దూషణులను ఖండించి వేసె
చ. 2:
కినసి వాలిఁ జంపి కిష్కింధ సుగ్రీవు కిచ్చె
వనధి బంధించి దాఁటె వానరులతో
కనలి రావణ కుంభ కర్ణాదులను జంపి
వనితఁ జేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును
చ. 3:
సౌమిత్రియు భరతుఁడు శత్రుఘ్నుఁడుఁ గొలువఁగ
భూమి యేలె కుశలవ పుత్రలఁ గాంచె
శ్రీ మంతుఁడై నిలిచె శ్రీ వేంకటాద్రిమీఁద
కామించి విభీషణ లంకకుఁ బట్టము గట్టె