తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 378
రేకు: 0378-01 ముఖారి సం: 04-453 దేవుడు-జీవుడు
పల్లవి:
పట్టినవ్రతము నీవే పరిపాలింతువుగాక
బట్టిబయలింతే నేను బలిమున్నదా
చ. 1:
దేవ నీవు మనసు సోదించఁగా నే ధీరుఁడనై
ఆవలఁ జలించకుండే యంతవాఁడనా
పూవు వంటి చిత్త మింతే పొల్లువంటికాయ మింతే
భావించ నిందులఁ బస వున్నదా
చ. 2:
అంతరాత్మవై నీవు యటు మరఁగులుసేయ-
నంతనె నినుఁ దెలిసే యంతవాఁడనా
గంతివంటిగుణ మింతే గాలివంటిప్రాణ మింతే
యింతరట్టుసేయ నిందు నెడమున్నదా
చ. 3:
మచ్చిక శ్రీ వేంకటేశ మాట నీవై యుండఁగాను
అచ్చపు నిన్ను నుతించే యంతవాఁడనా
గచ్చువంటియిహ మింతే గనివంటి పర మింతే
ముచ్చట కిందుకుఁ దుద మొద లున్నదా
రేకు: 0378-02 పాడి సం: 04-454 దశావతారములు
పల్లవి:
నరసింహ రామకృష్ణ నమో శ్రీ వేంకటేశ
సరుగ నాశత్రుల సంహరించవే
చ. 1:
బావ తిట్లకు శిశుపాలునిఁ జంపిన-
యేవ కోపకాఁడవు నేఁ డెందు వోతివి
నీవాఁడనని నన్ను నిందించి శత్రువును
చావఁగొట్టి వానినిట్టే సంహరించవే
చ. 2:
దాసుని భంగించేటి తరిఁ గస్యఁపుఁ జంపిన
యీసు కోపకాఁడ విపు డెందువోతివి
మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే
సాసించి శత్రువును సంహరింపవే
చ. 3:
కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్దఁజంపిన
యెల్లగాఁగఁ గోపకాఁడ వెందువోతివి
యిల్లిదె శ్రీ వేంకటేశ యీ నీ మీఁదిపాటలు
జల్లన దూషించు శత్రువు సంహరింపవే
రేకు: 0378-03 వరాళి సం: 04-455 అంత్యప్రాస
పల్లవి:
ఎరిఁగీ నెరఁగదు యేమి సేతు మతి
హరిదాస్యం బదియే సుఖము
చ. 1:
వెతలఁబొరలే ఘన విభవముకంటే
అతి పేదరిక మది సుఖము
గతి నెరవుల సింగారము కంటెను
సత మగు తన నిచ్చలమే సుఖము
చ. 2:
పలుబాములఁబడు పగలిటికంటే
తెలిసి నిద్రించు రాతిరి సుఖము
అలమట గడించు నమృతముకంటే
కలపాటి తనకు గంజే సుఖము
చ. 3:
పరపీడలొసఁగు భవమునకంటే
ధరఁ బొడమని చందము సుఖము
గరిమల శ్రీ వేంకటపతి నీకే
శరణని యెడి నాజన్మమే సుఖము
రేకు: 0378-04 బౌళి సం: 04-456 అంత్యప్రాస
పల్లవి:
పుట్టఁగా బుట్టిన నాభోగపుటాస
పట్టి యేమిగట్టుకొంటి బదుకవో యాసా
చ. 1:
వూరు దిప్పినట్టి యాస వుగముదిప్పిన యాస
చేరవచ్చి దైన్యమందించిన యాస
భారపెట్టి దేహమెల్లా బడిలించిన యాస
పారి మమ్మేఁచితి వింత బదుకవో యాసా
చ. 2:
నాలుక రుచుల యాస నాతులకాఁకల యాస
కాలకాసుకైన బొంకు గరుపే యాస
వోలిఁ బుణ్య తపమెల్ల వొరులకమ్మించు నాస
పాలుమాలించితి వింక బదుకవో యాసా
చ. 3:
కిందుపరచేటి యాస గేలిసేయించేటి యాస
పొందియట్టే సంతసానఁ బొదిపే యాస
కందువ శ్రీ వేంకటేశుఁ గని శరణంటి నేను
పందతనమొల్ల నింక బదుకవో యాసా
రేకు: 0378-05 సామంతం౦ సం: 04-457 భగవద్గీత కీర్తనలు
పల్లవి:
ఆ రూపమునకే హరి నేను మొక్కెదను
చేరి విభిషణుని శరణాగతుఁడని చేకొని సరిఁ గాచితివి
చ. 1:
ఫాలలోచనుఁడు బ్రహ్మయు నింద్రుఁడు
సోలి నగ్నియును సూర్యచంద్రులును
నీలో నుండఁగ నెరిఁ గనెఁ గిరీటి
మూల భూతి వగు మూర్తివి గాన
చ. 2:
అనంత శిరసుల ననంత పదముల-
ననంత నయనము లనంత కరముల
ఘన నీ రూపము గనుఁగొనెఁ గిరీటి
అనంత మూరితి వన్నిటఁ గాన
చ. 3:
జగము లిన్నియును సకల మున్నీంద్రులు -
నగు శ్రీ వేంకటనాథుఁడ నిన్నే
పొగడఁగఁ గిరీటి పొడగనె నీ రూపు
అగణిత మహిముఁడ వన్నిటఁగాన
రేకు: 0378-06 రామక్రియ సం: 04-458 హనుమ
పల్లవి:
ఆంజనేయ యనిలజ హనుమంత నీ -
రంజకపుఁ జేఁతలు సురల కెంచ వసమా
చ. 1:
తేరిమీఁద నీ రూపు దెచ్చిపెట్టి యర్జునుఁడు
కౌరవుల గెలిచె నంగర భూమిని
సారెకు భీముఁడు పురుషామృగముఁ దెచ్చుచోట
నీరోమములు గావా నిఖిల కారణము
చ. 2:
నీమూలమునఁగాదె నెలవై సుగ్రీవుఁడు
రామునిఁ గొలిచి కపిరాజాయను
రాముఁడు నీవంకనే పో రమణి సీతాదేవిఁ
బ్రేమముతో మగుడను బెండ్డాడెను
చ. 3:
బలుదైత్యులను దుంచ బంటతనము మించ
కలకాలమును నెంచఁగలిగితిగా
అల శ్రీ వేంకటపతి యండనే మంగాఁబుధి -
నిలయపు హనుమంత నెగడితిగా