తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 366

వికీసోర్స్ నుండి


రేకు: 0366-01 ముఖారి సం: 04-387 దశావతారములు

పల్లవి:

అతఁడే యెక్కుడుదైవ మందరికంటే
తతినింకాఁ జెప్పిచూప దైవాలు గలవా

చ. 1:

జలధి దచ్చేనాఁడు సకల దేవత లుండ
యెలమి నేదేవుఁ జేరె నిందిరాదేవి
అల గజేంద్రుఁడు మూలమని మొరవెట్టునాఁడు
వెలయ నే దేవుఁడు విచ్చేసి కాచెను

చ. 2:

పుడమి గొలుచునాఁడు పొడవైన దేవతలు
కెడసి యెవ్వ రడుగు కింద దాఁగిరి
కడలేని జగములు గల్పించే బ్రహ్మదేవుఁ -
డడరి యే దేవు నాభియందుఁ బుట్టెను

చ. 3:

యెంచి నాఁడు దేవతల నింద్రియాల జొక్కించే -
పంచబాణుఁ డేదేవునిపట్టిఁ యిపుడు
కొంచక శ్రీ వేంకటాద్రిఁ గోరిన వరము లిచ్చి
అంచల లోకములేలీ నండ నే దేవుఁడు


రేకు: 0366-02 లలిత సం: 04-388 నామ సంకీర్తన

పల్లవి:

నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు నాకుఁ గొనసాగుటకు

చ. 1:

పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు

చ. 2:

పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి - యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది

చ. 3:

కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ -
యందె పరమపద మవల మరేది


రేకు: 0366-03 కాంబోది సం: 04-389 మనసా

పల్లవి:

కర్మ మెంత మర్మ మెంత కలిగిన కాలమందు
ధర్మ మిది యేమరక తలఁచవో మనసా

చ. 1:

చెలువల పొంతనుంటే చిత్తమే చెదురుఁగాని
కలుగనేర దెంతైనా ఘన విరతి
వులుక కగ్గి పొంతనుంటేఁ గాఁకలేకాక
చలువ గలుగునా సంసారులకును

చ. 2:

బంగారువోడ గంటేఁ బట్టనాస వుట్టుఁగాని
సంగతి విజ్ఞానపు జాడకు రాదు
వెంగలి యభిని దింటే వెఱి వెఱాటాడుఁగాక
అంగవించునా వివేక మప్పుడే లోకులకు

చ. 3:

శ్రీ వేంకటేశు భక్తి చేరితే సౌఖ్యముగాని
ఆవల నంటవు పాపా లతి దుఃఖాలు
చేవ నమృతము గొంటే చిరజీవియగుఁగాని
చావులేదు నోవులేదు సర్వజ్ఞులకును


రేకు: 0366-04 సామంతం సం: 04-390 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

ఒకరిబుద్ధులు వేరొకరి పనికిరావు
అకలంకుఁ డింతటికి నంతర్యామి

చ. 1:

పొడమించు నాతఁడే పొదలించు నాతఁడే
నొడిగించు నాతఁడే నోరఁగొలఁది
గడియించు నాతఁడే కడలేని సిరులెల్ల
అడియాలమగులోని యంతర్యామి

చ. 2:

మతి యిచ్చు నాతఁడే మరపించు నాతఁడే
గతియౌ నాతఁడే కరుణానిధి
వెతమాన్పు నాతఁడే వెలయించు నాతఁడే
అతిశయమగులోని యంతర్యామి

చ. 3:

యిహమిచ్చు నాతఁడే యెదురెదురనే వచ్చి
సహజపుఁ బరమిచ్చు సరి నాతఁడే
విహగ గమనుఁడు శ్రీ వేంకటేశుఁ డితఁడే
అహరహమాదరించు నంతర్యామి


రేకు: 0366-05 రామక్రియ సం: 04-391 కృష్ణ

పల్లవి:

కేవల కృష్ణావతార కేశవా
దేవ దేవ లోకనాథ దివ్య దేహ కేశవా

చ. 1:

కిరణార్క కోటి తేజ కేశవా
హరి లక్ష్మీ నాయక యాది కేశవ
గిరి రాజసుత నుత కేశవ నమో
శరధి గంభీర శాయి జయ జయ కేశవా

చ. 2:

కేకిపింఛావతంస కేశవ
శ్రీ కర గుణాభి రామ చెన్న కేశవ
కేక వాహన వరద కేశవ
పాక శాసన వంద్య భళి భళి కేశవా

చ. 3:

కింకర బ్రహ్మాది గణ కేశవ నా -
మాంకిత శ్రీ వేంకటాద్రి కేశవ
కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ -
శంకా హరణ నమో జగదేక కేశవా


రేకు: 0366-06 ముఖారి సం: 04-392 నామ సంకీర్తన

పల్లవి:

ఒలపక్షము లేనొక్క దేవుఁడవు
నలినాక్ష హరీ నమో నమో

చ. 1:

నేరిచిన నే నేరకుండిన నీ
కారుణ్య మొక్కటే కలది
పారి ఘంటాకర్ణుభ క్తికి సరిగా
చేరి శుకాదులఁ జేకొంటిగాన

చ. 2:

సాదనైన నేఁ జలమతినైనా నీ
పాదమొక్కటేఁ నే బట్టినది
పాదైన వసిష్ఠు భక్తికి సరిగా
మేదిని వాల్మీకి మెచ్చితి గాన

చ. 3:

యేమిటా శ్రీ వేంకటేశ యెంతైన నీ
నామమొక్కటే నే నమ్మినది
సామజము భక్తి సరిగా నీవును
ప్రేమతోఁ బ్రహ్లాదుఁ బెంచితిగాన