తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 360

వికీసోర్స్ నుండి


రేకు: 0౩60-01 లలిత సం: 04-351 వైరాగ్య చింత

పల్లవి:

దైవమే నేరుచుఁగాక తగిలించ విడిపించ
యీవల సంసారికి నేమిసేయ వచ్చును

చ. 1:

ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు
వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు
వేసట యెక్కడ నుండు వీతరాగ మాడనుండు
యీసుల నీలంకెవాప నెవ్వరికిఁ దరము

చ. 2:

అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు
మతిఁ బంత మెందుండు మత్సర మందుండు
మతకము లేడనుండు మాయలును నందు నుండు
యితరు లెవ్వరు నిందు కేమనఁగలరు

చ. 3:

తనభక్తి యెందుండు తపమును నందుండు
మనసెందు నుండు దీమసమును నందుండు
తనివి యొక్కడ నుండు తగు సుఖ మందుండు
తనర శ్రీ వేంకటేశు దైవికము లివియే


రేకు: 0360-02 ముఖారి సం: 04-352 దశావతారములు

పల్లవి:

వింతనా నేఁ దనకు వేసాలవాఁడు
కంతునికి గురుఁ డనగలిగినవాఁడు

చ. 1:

జడిగొని మొదలఁ దా జలసూత్రపువాఁడు
వెడమాయలుగ బారి విద్యలవాఁడు
కడుసోద్యములనే కర్మపుఁ జేఁతలవాఁడు
అడరి కంభపుసూత్ర మాడెడివాఁడు

చ. 2:

యిలనుండి మిన్ను ముట్టే యింద్రజాలములవాఁడు
తల ద్రుంచి బ్రదికించుతక్కులవాఁడు
తెలియఁ గొండలు నీళ్ళఁ దేలవేసినవాఁడు
కలసి పగలు రేయిగాఁ జేసేవాఁడు

చ. 3:

మగువల భ్రమ యించే మౌన వ్రతముల వాఁడు
వెగటై రాయి గంతులు వేయించేవాఁడు
చిగిరించే వరముల శ్రీ వేంకటాద్రివాఁడు
బగివాయ కిట మమ్ముఁ బాలించేవాఁడు


రేకు: 0౩60-03 ముఖారి సం: 04-353 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

నగవులు నిజమని నమ్మేదా
వొగి నడియాసలు వొద్దనవే

చ. 1:

తొల్లిటికర్మము దొంతుల నుండఁగ
చెల్లబో యిఁకఁజేసేదా
యెల్లలోకములు యేలేటి దేవుఁడ
వొల్లనొల్ల నిఁక నొద్దనవే

చ. 2:

పోయినజన్మము పొరుగులనుండఁగ
చీయనక యిందుఁ జెలఁగేదా
వేయినామములవెన్నుఁడ మాయలు
వోయయ్య యిఁకనొద్దనవే

చ. 3:

నలి నీనామము నాలికనుండఁగ
తలకొని యితరముఁ దడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్నుఁగొలిచి
వొలుకుఁ జెంచలములొద్దనవే


రేకు: 0360-04 మంగళకౌశిక సం: 04-354 శరణాగతి

పల్లవి:

భారకుఁ డతఁడే బంధువుఁ డతడే
చేరితి మతనినే చెంచెలమేలా

చ. 1:

చెనకునాయుధము చేతఁ గలిగితే
ఘననిర్భయుఁడై కడఁగీనట్ల
అనంతాయుధుఁ డాతుమనుండఁగ
వెనుకొని యెందుకు వెఱవఁగనేలా

చ. 2:

భువి నొకరాజునుఁ బొందుగఁ గొలిచిన
యివల నచ్చికం బెరఁగఁడట
భువనరక్షకుఁడె పొదిగొని యేలఁగ
వివరించి యొరుల వేఁడఁగనేలా

చ. 3:

తోవ విధానము దొరకినయప్పుడే
యేవిధములు మరి యెంచఁడట
శ్రీ వేంకటపతి చేకొని కావఁగ
భావన నితరోపాయములేలా


రేకు: 0360-05 సామంతం సం: 04-355 ఇతర దేవతలు

పల్లవి:

తానే తానే యిందరి గురుఁడు
సానఁ బట్టిన భోగి జ్ఞాన యోగి

చ. 1:

అపరిమితములైన యజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ది పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మ యోగి

చ. 2:

అన్ని చేఁతలును బ్రహ్మార్పణవిధి జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరఁగఁ గరుణించ
పన్నగ శయనుఁడే బ్రహ్మ యోగి

చ. 3:

తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాస యోగి


రేకు: 0360-06 కన్నడగౌళ సం: 04-356 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

పరమాత్మఁడవు నీవు పరంజ్యోతివి నీవే
యిరవుగఁ గంటి వింటి నిదివో నీరూపము

చ. 1:

పెక్కురోమకూపముల పెనుబ్రహ్మాండాలు మోచే
వెక్కసపు నీకుఁ ద్రివిక్రమాకృతి యేమి
అక్కడ వేదశ్రుతి 'యత్యతిష్ఠద శాంగుల'
మెక్కువయని పొగడీ నిదివో నీరూపము

చ. 2:

వెడక జీవులలోనే వేవేలు రూపుల నీకు
యెదిటి దశావతారాలేమి యరుదు
అదె 'విశ్వతోముఖ యనంతమూర్తి'వని
యిదె శ్రుతి వొగడీని యిదివో నీరూపము

చ. 3:

దిందుపడి సురలు నీతిరుమేనఁ బొడమఁగ
యిందరు నీవేయవుట యేమి యరుదు
యెందును శ్రీ వేంకటేశ 'యేకో నారాయణ'
యిందులో శ్రుతి చాటీ నిదివో నీరూపము