Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 342

వికీసోర్స్ నుండి

రేకు: 0342-01 సాళంగం సం: 0342-01 సాళంగం సం: 04-244 శరణాగతి


పల్లవి :

హరివల్ల కడమలే దంతనంత నున్నవాఁడు
గరిమఁ గాననివారికల్ల యింతే సుండీ


చ. 1:

లోనఁ హరిఁ దలచితే లోపలందె పొడచూపు
పూని వెలిఁ దలచితే భూమినల్లాఁ బొడచూపు
తానే యిందరిలోన దైవమయి వున్నవాఁడు
కానకవుండినవారికల్ల యింతే సుండీ


చ. 2:

పట్టి విచారించుకొంటేఁ బ్రాణముతోఁ బొడచూపు
జట్టిఁదనదండనల్లా సంసారమై చూపు
పట్టపగలై వున్నాఁడు బాయట నెందు చూచిన
గట్టిగా గాననివారికల్ల యింతే సుండీ


చ. 3:

శరణముచొచ్చితేనె చేతిలోనే వున్నవాఁడు
పరమభాగవతులపలుకులో నున్నవాఁడు
యిరవుగ శ్రీవేంకటేశుఁడెదుటనే వున్నాఁ డతని -
కరుణ గాననివారికల్ల యింతే సుండీ

రేకు: 0342-02 ఆహిరి సం: 04-245 వైష్ణవ భక్తి


పల్లవి :

మాకు నేమీఁ బనిగాదు మరి యేమిగలిగినా
శ్రీకాంతు నడుగరో చిత్రగుప్తులాల


చ. 1:

ధరణీశుపనులకుఁ దగు బందె లేదట
హరిదాసులకుఁ బాపమంటునా మరి
సరిఁ జక్రపుడాగు లిచ్చటఁ జూచుకోరో మీరు
అరసి మీఁదటిమాట లాతని నడుగరో


చ. 1:

లావరిమన్ననపాత్రులకు వెట్టి లేదట
కావింప వైష్ణువులకుఁ గర్మమున్నదా
దేవునిలాంచన మిదె తిరుమణి చూచుకోరో
ఆవల నేమిగల్లాను ఆతని నడుగరో


చ. 1:

సతి రాణివాసమైతే జాతికులమెంచరట
హితశరణాగతులకేది జాతి
తతి శ్రీవేంకటపతిదాస్య మిది చూచుకోరో
యితవై మరేమిగల్లా నీతని నడుగరో

రేకు: 0342-03 లలిత సం: 04-246 శరణాగతి


పల్లవి :

ఎంచి చూచితే మాకు నిందే నిత్యసుఖము
కొంచి యనుమానమైతే కొనదాఁకా లేదు


చ. 1:

హరి నీగర్భములోన నంగమయి వున్నారము
యిరవై వేరేమోక్ష మెంచ నున్నదా
నిరతిఁ జూచినవెల్లా నీరూపులే మాకు
ధరలోన నింతకంటే ధ్యానమున్నదా


చ. 2:

అంతరాత్మవైన నిన్నే యాతుమకు నిచ్చితిని
యింతకంటె నే నడిగేది యిఁకనున్నదా
పొంతనే భూకాంత పుట్టిన నెలవు మాకు
యింతకంటే తల్లిదండ్రు లిఁకనున్నారా


చ. 3:

పొరి నెరుకే జ్ఞానము పొంచి మరపే సమాధి
సొరిది నేఁడింతకంటే సుఖమున్నదా
గరిమ శ్రీవేంకటేశ కల్పితమింతా నీదె
శరణంటే యింకా విచారమున్నదా

రేకు: 0342-04 శుద్ధవంతం సం: 04-247 వైరాగ్య చింత


పల్లవి :

దైవమా నీచేఁతలు తప్పదు మా రోఁతలు
యేవలఁ జూచిన బాయ దేమందమయ్యా


చ. 1:

కాయములో హేయమదె కమ్మఁబూఁత మీఁద నదె
రోయదు చిత్తమునకు రుచియే తోఁచీ
మాయలనే పొరలేది మాఁటలనే విసిగేది.
యేయెడఁ గనీ గాన మేమందమయ్యా


చ. 2:

పుట్టుగది యెంగిలి పూఁచిన దాచారము
గుట్టు చెడదందునాను గుణమే తోఁచీ
వట్టియాసఁ బొరలేది వంతఁ బడి తిరిగేది
యెట్టు వేగించఁగవచ్చు నేమందమయ్యా


చ. 3:

నిక్కిచూచితే నెరుక నిద్దిరించితే మరపు
మక్కళించినబదుకు మంచిదై తోఁచీ
మిక్కిలి శ్రీవేంకటేశ మీకు నేను శరణంటే
యెక్కువాయ నాపదవి యేమందమయ్యా

రేకు: 0342-05 శ్రీరాగం సం: 04-248 మాయ


పల్లవి :

అటమీఁదిపనులకు హరి నీవే కలవు
సటలైన నిజమైనా జరపేముగాక


చ. 1:

పరమాత్మ నీమాయఁ బాయగ నే నెంతవాఁడ
దొరయైతే రాజాజ్ఞ దోయవచ్చునా
తొరలిన యింద్రియాలఁ దోసిపోవ నెట్టువచ్చు
సిరుల నేలికపంపు సేయు టింతేకాక


చ. 2:

శ్రీపతి యీసంసారము సేయకుండ నెంతవాఁడ
మాపుదాఁకా రాచవెట్టి మానవచ్చునా
పాపపుణ్యము లొల్లక పరగ నాకెట్టు వచ్చు
తేపఁ దల్లి వుగ్గువెట్టఁ దినకుండవచ్చునా


చ. 3:

చ. 3: దేవ నీవిచ్చినమేను తెగి రోయ నెంతవాఁడ
కావించి రాచయీవికిఁ గడమున్నదా
శ్రీవేంకటేశ నీచిత్తములోవాఁడ నింతే
యేవిధిఁ బెట్టినా నేనియ్యకొంటగాక

రేకు: 0342-06 భైరవి సం: 04-249 కృష్ణ


పల్లవి :

అనుచు మునులు ఋషు లంతనింత నాడఁగాను
వినియు విననియట్టె వీడె యాడీఁగాని


చ. 1:

ముకుందుఁ డితఁడు మురహరుఁ డితఁడు
అకటా నందునికొడుకాయఁగాని
శకుంతగమనుఁ డితడు సర్వేశుఁ డితఁడు
వెకలి రేపల్లెవీధి విహరించీఁగాని


చ. 2:

వేదమూరితి ఇతఁడు విష్ణుదేవుఁ డితఁడు
కాదనలేక పసులఁ గాచీఁగాని
ఆదిమూల మితఁడు యమరవంద్యుఁ డితఁడు
గాదిలిచేఁతల రోలఁ గట్టువడెఁగాని


చ. 3:

పరమాత్ముఁ డితఁడే బాలుఁడై వున్నాఁడుగాని
హరి యీతఁడే వెన్నముచ్చాయఁగాని
పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతఁడె
తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీఁగాని