తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 329

వికీసోర్స్ నుండి

రేకు: 0329-01 రామక్రియ సం: 04-166 జానపదము


పల్లవి :

లెండో లెండో మాటాలించరో మీరు
కొండలరాయనినే పేర్కొన్న ది జాలి


చ. 1:

మితిమీరెఁ జీకట్లు మేటితలవరులాల
జతనము జతనము జాలో జాలి
యితవరులాల వాయించే వాద్యాలకంటే-
నతిఘోషములతోడ ననరో జాలి


చ. 2:

గాములువారెడిపొద్దు కావలికాండ్లాల
జాము జాము దిరుగరో జాలో జాలి
దీమనపు పారివార దీవెపంజులు చేఁబట్టి
యేమరక వమీలో మీరు యియ్యరో జాలి


చ. 3:

కారుకమ్మె నడురేయి గడచెఁ గట్టికవార
సారెసారెఁ బలుకరో జాలో జాలి
యీరీతి శ్రీవేంకటేశుఁ డిట్టె మేలుకొన్నాఁడు
గారవాన నిఁక మానఁ గదరో జాలి

రేకు: 0329-02 వరాళి సం: 04-167 హనుమ


పల్లవి :

పదియారు వన్నెల బంగారుకాంతుల తోడ
పొదలిన కలశాపుర హనుమంతుఁడు


చ. 1:

యెడమచేతఁ బట్టె నిదివో పండ్లగొల
కుడిచేత రాకాసిగుంపులు గొట్టె
తొడిఁబడ నూరుపులతోఁ దూరుపుమొగమైనాఁడు.
పొడవైన కలశాపుర హనుమంతుఁడు


చ. 2:

తొక్కి యక్షకుమారునిఁ దుంచి యడగాళ సంది
నిక్కించెను తోఁక యెత్తి నింగి మోవను
చుక్కలు మోవఁ బెరిగి సుతు వద్ద వేదాలు
పుక్కిటఁ బెట్టెఁ గలశాపుర హనుమంతుఁడు


చ. 3:

గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో
పట్టపు శ్రీవేంకటేశుబంటు తానాయ
అట్టె వాయువుకును అంజనిదేవికిని
పుట్టినాడు కలశాపుర హనుమంతుఁడు

రేకు: 0329-03 శ్రీరాగం సం: 04-168 ఇతర దేవతలు


పల్లవి :

నల్లఁబల్లి చెన్నుఁడు నాపాలిటి వెన్నుఁడు
యెల్ల జీవులకు మరి యిన్నిటాఁ బ్రసన్నుడు


చ. 1:

కమలావరుడు శ్రీకర మదనగురుఁడు
సమర దానవకుల సంహారుఁడు
విమల గుణాకరుఁడు విజయచక్రధరుఁడు
కమనియ్య భక్తజన కరుణాకరుఁడు


చ. 2:

వేదాంతవేద్యుఁడు విశ్వహితాపాద్యుఁడు
ఆదియునంత్యములేని యనవద్యుఁడు
సాదితయోగిహృద్యుఁడు శమితోగ్రచైద్యుఁడు
సోదించి చూచితేను సురలకు నాద్యుఁడు


చ. 3:

కామితఫల శక్తుఁడు ఘనమహిమ యుక్తుఁడు
ఆముకొన్న లోకరక్షణ సక్తుఁడు
నేమాన శ్రీవేంకటాద్రి నిలిచి మమ్మేలినాఁడు
కోమలుఁడు వీఁడిగో గోపకాస రక్తుఁడు

రేకు: 0329-04 పాడి సం: 04-169 రామ


పల్లవి :

రాముఁడు రాఘఁవుడు రవికులుఁ డితఁడు
భూమిజకుఁ బతియైన పురుషనిధానము


చ. 1:

అరయఁ బుత్రకామేష్టియందుఁ బరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపఁ నసురల శిక్షింపఁగ
తిరమై యుదయించిన దివ్యతేజము


చ. 2:

చింతించే యోగీంద్రుల చిత్తసరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకి కనేయట్టి-
కాంతులఁ జెన్నుమీరిన కైవల్యపదము


చ. 3:

వేదవేదాంతములందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొనఁ బలికేటి పరమార్థము
పోదితో శ్రీవేంకటాద్రిఁ బొంచి విజనగరాన
ఆదికి సనాదియైన అర్చావతారము

రేకు: 0329-05 కన్నడగౌళ సం: 04-170 రామ


పల్లవి :

శరణు శరణు దేవ సర్వపోషక
కరుణానిలయ రామ కౌసల్యనందన


చ. 1:

వారిధిబంధన రావణ శిరశ్ఛేదక
మారీచ సుబాహుబలమర్దన
దారుణ కుంభకర్ణ దనుజ సంహారక
వీరప్రతాప రామ విజయాభిరామ


చ. 2:

సవనరక్షక మునిజనకుల నిర్వాహక
దివిజవంద్య కపిసేనానాయక
వివిధ సప్తతాల విధ్వంసన చతుర
భువనేశ సాకేతపురవాస రామ


చ. 3:

హరచాపహర అహల్యాశాప విమోచక
ఖరశర వాలినిగ్రహ బిరుద
నిరతి శ్రీవేంకటేశ నిజభక్తరక్షక
ధరణిజా సమేత దశరథరామా

రేకు: 0329-06 శంకరాభరణం సం: 04-171 ఇతర దేవతలు


పల్లవి :

వినోదకాఁడవౌదువు విఠలేశ్వరా
వినుతించ నెట్టువచ్చు విఠలేశ్వరా


చ. 1:

పసులఁగావఁగానె బ్రహ్మ నిన్ను నుతించే
వెస నీమహిమ యెంత విఠలేశ్వరా
పసిబాల వయసున బండిఁదన్ని విరిచితి
వెసగె నీమాయలెల్లా యివె విఠలేశ్వరా


చ. 2:

వెన్న నీవు దొంగిలఁగ వేదాలు వొగడీని
విన్న కన్న సుద్ది గాదు విఠలేశ్వరా
చన్ను దాగి రాకాసిపీఁచము హరించితివి
యెన్నికకెక్కె నీబిరు దిటు విఠలేశ్వరా


చ. 3:

గొల్లెతలఁగూడి చేకొంటివి బ్రహ్మచర్యము
వెల్లవిరాయఁ బనులు విఠలేశ్వరా
బల్లిదపు శ్రీవేంకటపతివై పాండురంగాన
చల్లఁగా నెలకొంటివి జయ విఠలేశ్వరా