తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 325

వికీసోర్స్ నుండి

రేకు: 0325-01 వరాళి సం: 04-142 శరణాగతి


పల్లవి :

ఎవ్వరివాఁడాఁగాను యేమందు నిందుకు
నవ్వుచు నాలోని హరి నన్నుఁ గావవే


చ. 1:

కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు మేను
చూపుడుఁబూఁట వెట్టితి సొగసి నేను
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను
దాపుగ తొర్లుఁబూఁట తగిలించుకొంటిని


చ. 2:

మొదలఁ గర్మములకు మోసపోయి యీ బ్రదుకు
కుదువపెట్టితి నే గురి గానక
వెదకి కామునికి విషయములకు నే
అదివో నావయసెల్ల నాహివెట్టితిని


చ. 3:

ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు
కప్పిన గురుఁడు నీకు క్రయమిచ్చెను
వొప్పించి అందరు బలువుఁడు చేపట్టెననుచు
అప్పులెల్లఁబాసి నీసొమ్మైతినేనయ్యా

రేకు: 0325-02 దేసాళం సం: 04-143 శరణాగతి


పల్లవి :

వాసుదేవ నీవు నెలవరివి మగుడునేల
యీసరి నీవద్దనుండే యెట్టైనఁ జేయవయ్యా


చ. 1:

మాయదెచ్చి నాబదుకు మనుజలోకాన వేసె
కాయము సంసార వార్ధిగడ్డపై వేసె
పాయపు నాతమకము భామలవలల వేసె
చాయ నేనుండి వచ్చినడ జాడెఱఁగనయ్యా


చ. 2:

ఘనమైనయింద్రియాలు కర్మములవాత వేసె
మనసు సంసదయామనిలో వేసె
పనులెల్ల లంపటాల పయిఁ బక్కలా వేసె
కొనకెక్కె నేనె నాగురుతు గాననయ్యా


చ. 3:

అంచెల నాదినములు ఆఁకటి బారి వేసె
ముంచిన నాగుణములు మోహములు వేసె
యోంచఁగ శ్రీవేంకటేశ యెందెం దున్నాఁడనో
పొంచి నీకు శరణంటి బోధించవయ్యా

రేకు: 0325-03 బౌళి సం: 04-144 రామ


పల్లవి :

నమో నమో దశరధనందన రామ
కమనియ్య యాగభాగకర్త రామ


చ. 1:

కాకుత్సకుల రామ కౌసల్యాసుత రామ
శ్రీకరగుణోన్నత శ్రీరామ
కాకాసురవైరి రామ కౌశికవత్సల రామ
భీకరతాటకాంతకబిరుద రామ


చ. 2:

వారిధిబంధన రామ వాలిహరణ రామ
చారుహరకోదండభంజన రామ
ధారుణీజపతి రామదశకంఠహర రామ
సారవిభీషణాభిషేచన రామ


చ. 3:

అమరపాలిత రామ అయోధ్యాపతి రామ
సమరకోవిద రామ సర్వజ్ఞ రామ
విమల రామ శ్రీవేంకటగిరి రామ
రమణ శరణాగతరక్షక రామ

రేకు: 0325-04 సాళంగనాట సం: 04-145 హనుమ


పల్లవి :

హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
కరుణ నింత మన్నించె కమలావిభుఁడు


చ. 1:

విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె
విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను
శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే
శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు


చ. 2:

ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె
ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు
రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను
నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని


చ. 3:

దేవహితార్థముసేసఁ ద్రివిక్రముఁడు అట్టె
దేవహితార్ధమే జలధిలంఘనుఁడు
శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను
కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు

రేకు: 0325-05 పాడి సం: 04-146 నృసింహ


పల్లవి :

సుగ్రీవ నారసింహుని జూడరో వాఁడె
అగ్రపూజ గొన్నవాఁడు ఆది సింహము


చ. 1:

దేవతలు జయపెట్టి దివినుండి పొగడఁగ
దేవులతోఁ గూడున్నాఁడు దివ్య సింహము
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుఁడుండఁగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయ సింహము


చ. 2:

అసురలను గెలిచి అదె సింహాసనముపై
వెసఁగొలువున్నాడు వీర సింహము
పసిడివర్ణముతోడ బహుదివ్యాయుధాలతో
దెసల వెలుగొందీని ధీర సింహము


చ. 3:

నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల
ఆనుకొని రక్షించీఁ బ్రత్యక్ష సింహము
పూని శ్రీవేంకటాద్రిని బుధులెల్లాఁ గొలువఁగా
నానావరము లొసఁగీ మానవ సింహము

రేకు: 0325-06 శ్రీరాగం సం: 04-147 రామ


పల్లవి :

రామచంద్రుఁ డితఁడు రఘు వీరుఁడు
కామిత ఫలము లియ్యఁ గలెగె నిందరికి


చ. 1:

గౌతము భార్య పాలిటి కామధేనువు వితఁడు
ఘాతలఁ గౌశీకు పాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణీతఁడు
యీతఁడు దాసుల పాలి యిహ పర దైవము


చ. 2:

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుఁడీతఁడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము
గరిమ జనకు పాలి ఘన పారిజతము


చ. 3:

తలఁప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలఁడన్నవారి పాలి కన్ను లెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటేద్రి విభుఁడీతడు