తారక మంత్రము
ధన్యాసి రాగం ఆది తాళం
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము||
మీరిన కాలుని దూతల పాలిటి
మృత్యువు యని నమ్మకయున్న ||తారక మంత్రము||
మచ్చికతో నితరాంతరమ్ముల
మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు
లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము||
ముచ్చటగా తా పుణ్యనదులలో
మునుగుట పని ఏమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో
సుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము||
ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
ఏకో నారాయణుడన్న
అన్ని రూపులై యున్న పరాత్పరు
నా మహాత్ముని కథ విన్నా ||తారక మంత్రము||
ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
యీ జన్మముతో విడునన్నా
అన్నిటి కిది కడసారి జన్మము
సత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము||
నిర్మల అంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్ష పద్ధతిని
కన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము||
ధర్మము తప్పక భద్రాద్రీశుని
తన మదిలో నమ్ముకయున్న
మర్మము తెలిసిన రామదాసు హృ
న్మందిరమున నే యున్న ||తారక మంత్రము||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.