Jump to content

తరికొండ నృసింహశతకము/ముందుమాట

వికీసోర్స్ నుండి

ముందుమాట

కలియుగదైవంగా ప్రశస్తిగాంచిన వేంకటరమణుని భక్తపరంపరలో ఒక్కొక్కరిది ఒక విశిష్టత, ఈ విశిష్టత ఆ యా భక్తులు శ్రీవారిని ఆరాధించటంలో అవలంబించిన మార్గాలవల్ల మనకు వెల్లడవుతూవుంటుంది. 'శ్రీ వేంకటాచలమాహాత్మ్యం' వంటి సరస కావ్యాలను స్వామికి సమర్పించి తరించిన తరిగొండ వెంగమాంబ ఆ దేవదేవుని భక్తబృందంలో అగ్రగణ్యయైన కవయిత్రీశిరోమణి! ఈ 'కవితాతపస్విని' తిరుమల క్షేత్రంలో తపోవనం లాంటి ఒక తులసీ బృందావనాన్ని నెలకొల్పింది. ఆ 'బృందావనం'లో రాజయోగసాధనతో పాటు, వాఙ్మయ తపస్సు కావిస్తూ శ్రీనివాసునకు అంకితంగా అనేక కృతులను వెలువరించింది.

ఈ మహాకవయిత్రి రచించిన పదునెనిమిది కృతుల్లో చాలా భాగం అముద్రితంగా, సాహితీపరులకు అందుబాటులో లేనివిగా అజ్ఞాతంగా ఉంటున్నాయి. తిరుమలేశునికి మీదుకట్టి అవతరించిన ఈ రచనల నన్నిటిని ప్రచురించవలసిన ఆవశ్యకతను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈకవయిత్రి పేరట ఒక గ్రంథ పరిష్కరణ ప్రాజెక్టును నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తి.తి.దే. "శ్వేత" సంస్థ సంచాలకులయిన శ్రీ 'భూమన్' గారికి అప్పగించింది.

ఉద్యమస్ఫూర్తి మేళవించిన ఉత్సాహపూరితులయిన "శ్వేత” సంచాలకులు శ్రీ 'భూమన్' గారు ఇటీవలే ఈ కవయిత్రి సారస్వతంపై ఒక జాతీయ సాహితీసదస్సును విజయవంతంగా నిర్వహించటమే కాక,. ఈ కవయిత్రి రచనలయందలి వేర్వేరు గీతాలకు ఆడియో సీ.డీ.లను తగిన గాయనీ గాయకులచే తయారు చేయిస్తుండటం మిగుల ముదావహమయిన విషయం.

హరికీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలలాగానే, ఈ కవయిత్రి యొక్క సాహితీ సమారాధనోత్సవాలను ఈమె జన్మదినమైన నృసింహుని జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించడానికికూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిశ్చయించింది. ఇందులకు అనుగుణంగా మే 1వ తేదీన జరుపబోయే వెంగమాంబ జయంతి ఉత్సవ సందర్భంలో ఆవిష్కరించే నిమిత్తంగా ఈ క్రింది ప్రచురణలను చేపట్టి సిద్ధంచేస్తూవుండటం ఆహ్లాదదాయకంగా ఉంది.

1. తరిగొండ నృసింహశతకము
2. శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి (స్తుతి కావ్యము)
3. రమా పరిణయము (ద్విపద కావ్యము)
4. బాలకృష్ణ నాటకము (యక్షగానము)
5. చెంచు నాటకము (యక్షగానము)
6. భక్తిగీత సుధాలహరి (వెంగమాంబ యక్షగానాల్లోని 108 గేయాల సంకలనం)
7. అష్టాంగయోగ సారము (పద్యకావ్యము)

ఈ ప్రచురణలన్నీ సహృదయ సాహితీ లోకాన్ని అలరింపజేయగలవని ఆశిస్తున్నాను.

ఇలాగే ఈ భక్త కవయిత్రియొక్క రచనలన్నీ శ్రీనివాసుని దివ్యానుగ్రహవిశేషంచేత అచిరకాలంలోనే చక్కని పీఠికలతో గూడిన సుపరిష్కృత రూపాలతో వెలుగుచూడగలవని ఆకాంక్షిస్తున్నాను.

తిరుపతి

ఎ.పి.వి.ఎన్. శర్మ

28, మార్చి 2007

శ్రీకార్యనిర్వహణాధికారివర్యులు

తిరుమల తిరుపతి దేవస్థానములు.