జ్యోతిష్య శాస్త్రము/జ్యోతిష్యము శాస్త్రమా?

వికీసోర్స్ నుండి

2. జ్యోతిష్యము శాస్త్రమా?[మార్చు]

జ్యోతిష్యము శాస్త్రమా? కాదా? అని చాలామందికి ప్రశ్నగానే ఉన్నది. కొందరు శాస్త్రమంటున్నారు, కొందరు శాస్త్రము కాదంటున్నారు. చెప్పినది నెరవేరినది కదా అందువలన జ్యోతిష్యము శాస్త్రమే అని కొందరు అంటున్నారు. చెప్పినవి చాలా నెరవేరలేదనీ, అందువలన జ్యోతిష్యము శాస్త్రము కాదు అని చాలామంది అంటున్నారు. ఎవరి మాట నిజమని యోచిస్తే, వీరు జ్యోతిష్యము కాని దానిని పట్టుకొని ఒకటి నెరవేరింది కావున శాస్త్రమనీ, పది నెరవేరలేదు కావున శాస్త్రము కాదనీ అంటున్నారు. చీకటిలో పాముకాని తాడును చూచి వంకరగ ఉన్నది కాబట్టి పాము అంటే, కదలలేదుకదా పాము కాదేమో అని మరొకడు అన్నట్లు, అసలు జ్యోతిష్యము కాని దానిని పట్టుకొని నేనన్నది నెరవేరింది కదా! అందువలన ఇది శాస్త్రమే అని ఒకడూ, మేము అడిగింది నెరవేరలేదు కదా! అందువలన ఇది శాస్త్రము కాదని మరికొందరు అన్నట్లున్నది. చీకటిలో పాము అనుకొన్నది అసలు పామో కాదో, అలాగే జ్యోతిష్యము అనుకొన్నది జ్యోతిష్యమో కాదో చూడవలసిన అవసరమున్నది. అలా చూస్తే మనమనుకొన్నది జ్యోతిష్యము కాదు కనుక, దానిని శాస్త్రమా కాదా అని చూడవలసిన పనేలేదు. జ్యోతిష్యమన్నది ఆత్మజ్ఞానమున్నవారూ, కర్మ విధానము తెలిసిన వారూ, పాపపుణ్య ఫలితములను తెలిసినవారూ, చెప్పునదని తెలియుచున్నది. కర్మంటే ఏమిటో తెలియనివారు, ఆత్మంటే ఏమిటో తెలియనివారు చెప్పునది జ్యోతిష్యము కానేకాదు. ఎలాగైతే ఏమి, ఆత్మజ్ఞానులు, కర్మజ్ఞేయులు తెలిసిన జ్యోతిష్యమనునది ఒకటున్నదని తెలియుచున్నది. ఇపుడు జ్ఞానులు చెప్పు జ్యోతిష్యమును శాస్త్రము అనవచ్చునా! అని అడిగితే తెలియు వివరము ఏమనగా! శాస్త్రములు మొత్తము ఆరు గలవు. వాటినే షట్శాస్త్రములని పూర్వమునుండి పెద్దలు చెప్పుచున్నారు. షట్శాస్త్రములలో అతి పెద్దది లేక అతిముఖ్యమైనది ‘బ్రహ్మవిద్యాశాస్త్రము’ బ్రహ్మ అంటే ఎవరో దేవుడనుకోవద్దండి. బ్రహ్మ అనునది పేరేకాదు బ్రహ్మ అంటే పెద్ద అని అర్థము. బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య అని అర్థము. బ్రహ్మవిద్యా శాస్త్రమునే ‘యోగశాస్త్రము’ అనికూడ అంటారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తర్వాత రెండవ స్థానములో గల శాస్త్రము జ్యోతిష్యశాస్త్రము. వీటి తర్వాత మిగత నాలుగు శాస్త్రములు కలవు. ఆరుశాస్త్రములలో రెండవ స్థానములోనున్నది జ్యోతిష్యశాస్త్రము, కావున జ్యోతిష్యమును శాస్త్రమే అంటున్నాము. ఇక్కడ కొందరికి శాస్త్రము అంటే ఏమిటి? అను ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఏమనగా!

శాసనములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును. శాసనము అనగా తూచ తప్పకుండ నెరవేర్చబడునదని అర్థము. చెప్పినది లేక వ్రాసినది ఏదైనా తప్పక జరుగు సత్యమైనపుడు, దానిని ‘శాసనము’ అంటాము మరియు శాస్త్రము అని కూడ అంటాము. చెప్పిన దానిని శాసనము అనీ, వ్రాసిన దానిని శాస్త్రము అనీ అనుట జరుగుచున్నది. వ్రాసినది శాస్త్రము కావాలంటే, వ్రాయకముందే తాను పరిశోధన చేసిన పరిశోధకుడై కనుగొనినదై ఉండాలి. అలాగే చెప్పినది శాసనము కావాలంటే, చెప్పకముందే తాను అధికారముకల్గినవాడై నెరవేరునట్లు చెప్పినదై ఉండాలి. కానీ ఇక్కడ గమనించదగిన విషయమొకటున్నది. ఇటు పరిశోధన లేకుండా, అటు అధికారము లేకుండ చెప్పినది జరుగు విధానము ఒకటి కలదు. దానినే ‘శాపము’ అంటున్నాము. శాస్త్రము, శాసనము రెండూ వేరు వేరుగా ఉండినా, శాసనముతో కూడుకొన్నది శాస్త్రమని చెప్పినట్లే, శాస్త్రముతో కూడుకొన్నది శాసనమని కూడ చెప్పవచ్చును. పరిశోధనకానీ, అధికారము గానీ లేని శాపము, శాస్త్రము, శాసనముతో సమానమైనదే. అందువలన శాపము, శాసనము, శాస్త్రము మూడు సమానపదములని చెప్పవచ్చును. జ్యోతిష్యము మొదట శాపమునుండి వచ్చినది కావున చివరకు శాస్త్రమైనది.

ఉదాహరణకు ఇటు అధికారముగానీ, అటు పరిశోధనగానీ లేని ఒక ఆత్మజ్ఞాని పాపము గల వానిని అనగా తప్పు చేసిన వానిని శపించాడు. ఆ శాపము తప్పక నెరవేరింది. అలా మొదట ఒక జ్ఞాని చేత ముందే చెప్పబడిన వాక్కు, తర్వాత నెరవేరడమును జ్యోతిష్యము అని కొందరన్నారు. ముందు చెప్పినది జరిగితేనే కదా! దానిని జ్యోతిష్యమనేది. మనకు అర్థమగుటకు మరొక ఉదాహరణను వివరించుకొందాము. ఒకడు ఒక హీనమతిగల స్త్రీని ఊరికి దూరముగానున్న నిర్జన ప్రదేశమునకు తీసుకపోయి బలవంతముగ ఆమె మీద అత్యాచారము చేసి, ఆ విషయము ఎవరికీ తెలియకుండుటకు ఆమెను హత్య చేశాడు. అతడు చేసినది మంచిపని కాదు, చెడుపని. ఆ చెడుపనికి అతనికి పాపము వచ్చియుంటుంది. ఆ పాపమునకు శిక్ష అంటూ ఒకటి ఉంటుంది. ఆ శిక్షను అతడు తప్పక ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిందే. కానీ ఆ శిక్ష ఏమిటి? అన్నది మనకు తెలియదు. కానీ అక్కడ జరిగిన విషయమేమంటే ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే, ఆ తప్పుచేసిన వ్యక్తి మత్తు పానీయమును త్రాగి, మత్తు ఎక్కినవాడై దారిలో పోతున్న ఒక ఆత్మజ్ఞానిని ఎదురుగా తగలడమేకాక, అతనినే కళ్ళు కనిపించడము లేదా అని దూషించెను. అట్లు వాడు తగలడమేకాక మత్తులో ఉండి దూషించడమూ, కళ్ళు కనిపించలేదా అనడమూ అన్నీ ఆ ఆత్మజ్ఞానికి కోపమును తెప్పించాయి. అప్పుడు ఆత్మజ్ఞాని ‘‘నీవు జీవితాంతము కళ్ళు కనిపించని గ్రుడ్డివాడవై పోవుదువు గాక’’ అని శపించాడు. ఆ విధముగ శపించిన ఆత్మజ్ఞాని తన దారిన తను పోయాడు. ఆ శాపమును అక్కడున్న కొందరు విన్నారు. ‘‘వీడు శాపము పెట్టితే నాకు తగిలేదానికి వీడేమైన దేవుడా’’ అని త్రాగినవాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతయు గమనిస్తే ఒకడు హత్యచేసి తప్పు చేశాడు, తర్వాత కొద్ది రోజులకే దారిలో మరొకరిని తగిలాడు, తగిలింది పెద్దతప్పు కాకపోయినా అనుభవించవలసిన శిక్షను అతను శాపము రూపములో పొందాడు. జరుగబోవు శిక్ష ఏమిటో దానిని మిగత కొందరు కూడ విన్నారు. ఇక్కడ తప్పు చేసినవానికి జరుగబోవు శిక్ష ముందే చెప్పబడినది. అలా జరుగబోవు దానిని ముందే చెప్పడము జ్యోతిష్యము అయినది, చెప్పినవాడు ఆత్మజ్ఞాని, తప్పు చేసినవాడు ఎంత తప్పుచేశాడని యోచించకనే, వానిని గూర్చిన పరిశోధన చేయకనే, వాని మీద అధికారము లేకుండనే, ఆత్మజ్ఞాని చెప్పిన దానిని శాపము అంటున్నాము. శాపము రూపములో జరుగబోవు దానిని ముందే చెప్పడము వలన దానిని జ్యోతిష్యము అంటున్నాము. అట్లు జ్ఞానినోట వచ్చిన మాట ప్రకారము లేక జ్యోతిష్యము ప్రకారము మరుజన్మలో వాడు పుట్టు గ్రుడ్డివాడైపోయి జీవితాంతము అంధుడుగానే ఉండెను. ఇట్లు తప్పక జరుగునది శాపము, కావున దానిని శాస్త్రము అంటున్నాము. ఈ విధముగ తప్పుచేసిన వానిని గూర్చి చెడు జరుగునని చెప్పిన శాపమను మాటగానీ, మంచిచేసిన వానిని గూర్చి మంచి జరుగునని చెప్పిన ‘దీవెన’ అను మాటగానీ తప్పక జరుగునవే కావున శాస్త్రమనీ, ముందే చెప్పడము వలన జ్యోతిష్యము అనీ అనడము జరిగినది. అందువలన జ్యోతిష్యము జ్యోతిష్యశాస్త్రమైనది. మొదట ఈ విధముగ మొదలైన జ్యోతిష్య శాస్త్రము కొంత పరిశోధన రూపములో సాగినది. అలా కొందరి చేత పరిశోధన చేయబడి, వారి చేత కనుగొన్న జ్యోతిష్య సిద్ధాంతములు గ్రంథరూపములో వ్రాయబడినవి. అలా సిద్ధాంత రూపములో ఉన్న గ్రంథమును జ్యోతిష్య గ్రంథము అంటున్నాము. ఆరు శాస్త్రములలో పెద్దదైన బ్రహ్మవిద్యా శాస్త్రమును స్వయముగా దేవుడే చెప్పగా, మిగతా ఐదు శాస్త్రములు మనిషి చేత చెప్పబడినవి. మొత్తము ఆరు శాస్త్రములు పూర్వమునుండి ఉన్నవే, అయినా కాలక్రమమున కొన్ని భావములు మారిపోయిన దానివలన, మనుషులు వాటిని పూర్తి అసలైన భావముతో అర్థము చేసుకోలేక పోతున్నారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తర్వాతనున్న జ్యోతిష్యశాస్త్రముపై పూర్తి అవగాహన లేకపోగా, మిగత ఖగోళశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయన శాస్త్రము, గణితశాస్త్రము అను నాలుగు శాస్త్రములు ఎంతో అభివృద్ధి చెంది మనిషికి బాగా అవగాహనలో ఉన్నాయి. పెద్దవైన బ్రహ్మవిద్యాశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము రెండూ మనిషి అవగాహనలో లేకుండ పోవడము వలన వాటిలోని శాస్త్రీయత అనునది తెలియకుండ పోయినది. శాస్త్రీయతను చూడకుండ మనిషి తనకిష్ట మొచ్చినట్లు చెప్పుకోవడము వలన, జ్యోతిష్యమును శాస్త్రమే కాదని కొందరంటుండగ, బ్రహ్మవిద్యాశాస్త్రమనునది అసలుకే లేదని నాస్తిక వాదులు అంటున్నారు. నేటికాలములో నాస్తికులకుగానీ, ఆస్తికులకుగానీ బాగా కనిపించే శాస్త్రములు 1) గణిత, 2) ఖగోళ, 3) రసాయన, 4) భౌతిక శాస్త్రములే! అందువలన ఆ నాలుగు, బహుళ ప్రచారములో ఉండగ, శాస్త్రీయత లోపించినవిగా జ్యోతిష్యము, బ్రహ్మవిద్య రెండూ కనిపిస్తున్నవి. ఎవరికి ఎట్లు కనిపించినా, ఈ రెండు స్వచ్ఛమైన శాస్త్రములే. బ్రహ్మవిద్యనూ, జ్యోతిష్యమునూ పూర్వమువలె చెప్పుకొంటే అవి రెండు శాస్త్రములని ఇటు నాస్తికులకు, అటు ఆస్తికులకు, శాస్త్రపరిశోధకులకు తెలియగలదు.