జ్యోతిష్య శాస్త్రము/కర్మను అనుభవించు వాడు ఎవడు?

వికీసోర్స్ నుండి

9. కర్మను అనుభవించు వాడు ఎవడు?

ఇంతవరకు కాలచక్రమునూ, కర్మచక్రమునూ, గుణచక్రమునూ గురించి వరుసగా తెలుసుకొన్నాము. ఇపుడు కర్మను అనుభవించు జీవున్ని గురించి తెలుసుకొందాము. కర్మను పరిపాలించుటకు కాలచక్రములోని గ్రహములున్నాయి. కర్మను పుట్టించుటకు గుణచక్రములోని గుణములు ఉన్నాయి. కర్మను అనుభవించుటకు జీవుడు గుణచక్రములోనే ఉన్నాడు. జీవుడు కర్మను అనుభవిస్తూ, కాలమును గడపడమునే ‘జీవితము’ అంటాము. ‘‘నహి కశ్చిత్‌ క్షణమపి’’ అని భగవద్గీతలో అన్నట్లు, ఒక్క క్షణము కూడ వృథా కాకుండ, జీవుడు జీవితములో కర్మను అనుభవిస్తున్నా డని తెలియుచున్నది. జీవుడు అనుభవించబోవు కర్మను తెలుసుకోవడమే ‘‘జ్యోతిష్యము’’ అంటున్నాము. జ్యోతిష్యమును సమగ్రముగ తెలుసుకో వాలంటే, కర్మను అనుభవించే జీవున్ని గురించి పూర్తిగా తెలుసుకోవలసి యుండును. కర్మను అనుభవించు జీవుడు, తలలోని కర్మచక్రము క్రిందనున్న గుణచక్రములోనే ఉండును. గుణచక్రము యొక్క మూడు భాగములలో ఏదో ఒక భాగములో జీవుడుండి, ఆ గుణముల ప్రవర్తనల వలన కలుగు సుఖదుఃఖములను అనుభవించుచుండును. తామసములో నున్న జీవున్ని ఈక్రిందగల 9వ పటములో చూడవచ్చును.

గుణచక్రము - 9వ పటము

తామసములో జీవుడున్నపుడు మిగతా రాజస, సాత్త్వికములలో జీవుడుండడు. ఒక్కోసారి జీవుడు తామసమును వదలి రాజసభాగములోనికి కూడ చేరును. అపుడు మిగత తామస,సాత్త్వికములలో జీవుడులేడని తెలియు చున్నది. రాజసగుణముల మధ్యలో జీవుడున్న చిత్రమును క్రిందగల 10వ పటములో చూడుము.

గుణచక్రము - 10వ పటము

ఈ విధముగా జీవుడు మూడు గుణముల భాగములను మారుటకు ఒక కారణము కలదు. అదేమనగా! ప్రారబ్ధకర్మను బట్టి జీవుడు అస్వతంత్రుడై గుణముల భాగములను మారవలసియున్నది. ఆ విధముగా మారుచున్న జీవుడు ఒక్క సమయములో, ఒక్క గుణభాగములో, ఒక్క గుణమునందు లగ్నమగుచుండును. ఏ గుణ భాగములోనున్న జీవున్ని ఆ గుణభాగము పేరుతో పిలువడము జరుగుచున్నది. తామస భాగములోనున్నపుడు తామసుడనీ, రాజస భాగములోనున్నపుడు రాజసుడునీ, సాత్త్విక భాగములో నున్నపుడు సాత్త్వికుడనీ పిలుస్తున్నాము. ఇపుడు సాత్త్వికములోనున్న సాత్త్వికుణ్ణి క్రింది 11వ పటములో చూస్తాము.

గుణచక్రము - 11వ పటము

జ్ఞానదృష్ఠితో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాల్గుచక్రముల చట్రమును చూడవచ్చును. అదే విధముగ క్రింద గుణచక్రములోని ఏదో ఒక భాగములోనున్న జీవున్ని చూడవచ్చును. దీనినిబట్టి గుణములకూ, జీవునికీ కూడ ఆకారము కలదని తెలియుచున్నది. ఇంతవరకు, భూమిమీద ఎక్కడా తెలియని విధానమునూ, గుణముల యొక్కయు మరియు జీవుని యొక్కయు ఆకారములనూ మనము తెలుసుకోగలిగాము. సమగ్రముగా చూస్తే జీవుని ఆకారము ఈ విధముగా గలదు. జీవుడు మూడు పొరల మధ్యన బంధింపబడిన ఖాళీ స్థలము అని తెలియుచున్నది. జీవుని ఆకారమును క్రింది 12వ పటములో చూడవచ్చును.

జీవుని ఆకారము - 12వ పటము

ఇంతవరకు కాలచక్రమును, కర్మచక్రమును, గుణచక్రమును అందులోనున్న జీవున్ని గూర్చి తెలుసుకొన్నాము. ఇక మూడు చక్రములకంటే పైన గల బ్రహ్మచక్రమొకటి గలదు. బ్రహ్మచక్ర వివరము ఇక్కడ జ్యోతిష్యమునకు అవసరము లేదు. అది ఒక బ్రహ్మవిద్యాశాస్త్రమునకు మాత్రమే పరిమితమైనది. కావున రెండు భాగములుగానున్న బ్రహ్మచక్రమును ఇక్కడ వివరించుకోక వదలి వేయుచున్నాము. జ్యోతిష్యమునకు కావలసినది కాల, కర్మ, గుణచక్రముల సమగ్ర సమాచారము మాత్రమేనని తెలుపు చున్నాము. గుణచక్రములోని గుణములను, జీవున్ని గురించి తెలుసు కొన్నాము. కర్మచక్రములోని కర్మను గురించి తెలుసుకొన్నాము. కానీ కాలచక్రములో గ్రహములను గురించి తెలుసుకోవడములో కొంత మిగిలి ఉన్నది.