జానపద గేయాలు/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జానపద గేయాలు

ఎన్ని వందలఏండ్ల అవధులూ, అగడ్తలూ దాటుకుని వచ్చాయో ఈ జానపద గేయాలు! ఎంత ప్రాణం ఉన్నదో వీటికి! ఆ ప్రాణంతో ఎటువంటి అందచందాలూ, అలంకరణలూ ఉన్నాయో వీటికి! వాస్తవిక జీవితానుభవాలూ, ఆ అనుభవములు రేపిన ఆవేశాలు, ఆ ఆవేశాలు ప్రేరేపించిన భావనా, ఆ భావన కల్పించిన చిత్రాలూ, ఆ చిత్రాల్ని నిర్మించిన మాటలూ, ఆ మాటలు మళ్ళీ, మనుష్యులై మనయెదుట నవ్వడమూ, నాట్యం చేయడమూ, నిట్టూర్చడమూ, జీవితఖండాలను ప్రదర్శించడమూ - ఈ జానపద గేయలకు ప్రజలకులాగే జరామరణాలు లేవు. ఎప్పుడో బయలుదేరి ఎక్కడికో పోతూవున్న అఖండ ప్రజావాహినికి ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు, నిండుతనమూ, జీవనమూ ఇస్తూ, కదలిస్తూ, ఈ జానపద గీతాలనే ఉపనదులు ఉపకరిస్తూ వస్తున్నాయి. ఇవి సరళంగా ఉంటూ సుందరంగా ఉంటాయి. వాస్తవికంగా ఉంటూ వైకుంఠానికి నిచ్చెనలేస్తాయి. అమాయకంగా ఉంటూ, మానవ ప్రకృతిలోనే, అచల శిఖరాలూ, అఖాతాలూ అందుకుంటాయి. అచ్చంగా భూగర్భంలోంచి పొడుచుకుని వచ్చి మొలుచుకుపోయే చెట్లూ, చామలూ, లతలూ, పూతలూ వంటివి ఈ జానపద గేయాలు.

మన దేశంలోని అల్ప సంఖ్యాకులూ, నాగరికులూ, అయిన పట్టణ వాసులకులాగే లక్షలాది గ్రామాలలో నివసించే జానపదులకు కూడా, ఒక విశిష్టమైన సంస్కృతి ఉంది. అదివాళ్ల నిరాడంబర జీవితాన్ని ప్రతిఫలింపజేసే వాళ్ల జానపద గేయాల్లో ఉట్టి పడుతూంటుంది. దేశంలోని ప్రతి ప్రాంతం వారికీ ఎన్నో జానపద గేయాలున్నాయి కాని, బాహుళ్యంలోను ప్రశస్తిలోనూ, వివిధత్వములోను, అవేవీ తెలుగువారి జానపద గేయాలకు సాటేరావనీ, ఆ విశిష్టతకు కారణము తెలుగుభాష యొక్క తియ్యదనమే నని సుప్రసిద్ధ జానపద పరిశోధకుడైన ప్రొఫెసర్ దేవేంద్ర సత్యార్ధి తాను రచించిన " మిట్ మై పూపుల్ " అనే గ్రంధంలో వ్రాసారు.

ఎందరు కవులరచనలో , ఆ కవులు అస్తమించగానే కాలగర్భంలో కలిసిపోతుండగా, లెక్కలేకపోతుండగా పుట్టుకు వస్తున్న జానపద గేయాలన్నీ చెక్కూ, చెదురూ లేకుండా, నాటికీ నేటికీ, సజీవంగా ఉన్నాయంటే ఆశ్చర్యమే. ఈ పాటలకు వార్ధక్యం రాకుండా నిత్యయౌవ్వనంగా మార్చిన శక్తి కొంతవరకు ఆ పాటలకు దక్కినా చాలావరకు ఆ పాటల సంగీతానికే దక్కుతుంది.

జానపద గేయాలన్నీ ఆ ప్రాంతీయ జానపద వ్యవస్థల నుండి పాతాళగంగలా పొంగి పొరలి వచ్చే అశుధారలే, బృందరచనలే. వివిధ వృత్తుల్లో దినమంతా కష్టించి బతికే జానపదుల నిత్య జీవిత సమస్యల రాపిడికీ వేడికి, సంగీతసాహిత్యాలు, ఏకకాలంలో ఏకధారగా పుట్టుకుని వస్తాయి. అవి అకల్మషులూ, నిరాడంబరులూ, అయిన గ్రామీయుల భావాలు, ఆశలు, ఆశయాలు, ఏకమై ఉప్పొంగిన అయాచిత అశుధారే జానపదగేయము. ఆ గేయాలు నవరస భరితాలు.

ఆంధ్రులకు ఆశయాలూ, అవహేళనలూ కూడా ఎక్కువే కదా ! పండుగలకూ , పబ్బాలకూ, కష్టాలకూ, సుఖాలకూ, జానపదులకు, హృదయతంత్రులు, ఇచ్చే స్పందన వెంటనే సంగీతంతో పెనవేసుకు పోయిన, మాటలే జానపద గేయాలు. తెలుగునాటి జానపదులంతా తమ్ముతామే యెరుగని , తమ సంస్కృతి ప్రతిబింబాన్ని చూసుకోవడం చేతకాని అదృశ్యవాగ్గేయకారులే అనిపిస్తుంది. మానవజీవితంలోని వెలుగు నీడలు , ప్రేమ, ద్వేషము, శాంతి, జానపద, సమరము, సంరంభం, సంతాపం, యౌవ్వనము, వృద్ధాప్యమూ అన్నీ జానపద గేయాలకు కధా వస్తువులే. తెలుగునాట జానపద తటాకంలోని ప్రతి అలా ఒక గేయంగా రూపొందుతూ వచ్చింది. తెలుగువారి నిత్య జీవిత క్రమాన్ని అనుసరించే వారి జానపద గేయాల క్రమము కూడా ఏర్పడింది. తెలుగువారి జానపద సంగీతానికి, శాస్త్రీయ లలిత సంగీతాలతోపాటు ఒక గౌరవస్థానం, సభార్హత, వచ్చాయంటే, దానికి ముఖ్య కారకురాలిని నేనని చెప్పుకోక తప్పదు. నా చిన్ననాటి నుంచీ జానపద గేయాలు సేకరించడం, పాడడం, నాకు సరదా. నేను పుట్టిన ఊరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ. ఆ ఊరికి కాస్త పట్నవాసపు పోకడ పల్లెటూరి వాతావరణం ఉండేవి. దాని ప్రతిబింబాన్ని నేను. నా చిన్నప్పుడు మా మామయ్య కృష్ణశాస్త్రి ఊరైన పిఠాపురం వెళ్లాలంటే బస్సులు లేవు. రెండెడ్ల బండిలో వెళ్లేవాళ్లం. త్రోవలో పొలాల్లో పాడుకునే పాటలు, పిఠాపురంలో, పొన్నాడమంద బయల్లో సత్యభామ కట్టిన భామాకలాపం, రథోత్సవాలలో చెక్క భజనలూ, తప్పెటలూ, కోలాటాలూ, తోలుబొమ్మలూ, వీధినాటకాలూ, మా ఊరు ఉప్పుటేరు గట్టున పడవవాళ్లు పాడుకుంటే పోయే పాటలు, ఇంటిప్రక్క ఆముదం ఫ్యాక్టరీలో పనివాళ్ల పాటలు, మా నూకాలమ్మ గుడివద్ద సంవత్సరాది సంబరంలో ఆడించే గరగలూ, సిరిబొమ్మా - ఇవన్నీచూసి, ఉత్తేజితురాలు నయి, ఆ పాటలను తు.చ. తప్పకుండా గ్రహించి, సేకరించి, నేర్చి, పాడేదాన్ని. చుట్టుప్రక్కల గ్రామాల్లో తీర్థాలూ, జాతరలూ, జరిగాయంటే, అక్కడికి నేను మా నాన్నగారితో వెళ్లడం, ఆ జానపద వినోదాలు చూసి, ఆ పాటల్ని సేకరించడం జరిగేది. ఆ అభిరుచే నాలో ఒక ఉద్యమంగా రూపొంది, జానపద రచనల్ను, వాటి సంగీతాన్ని సేకరించి, పొందుపరచి, ప్రచారంలోకి తేవడం నా జీవితాశయం అయింది. నాయీ ఆశయాన్ని, అభిరుచినీ, పెంపొందించిన వారు జానపద సంగీత పితామహులు, కీ.శే. వల్లూరి జగన్నాధరావు గారు. కర్ణాటక, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాల్లో పాండిత్యం కలిగి, జానపద సంగీతంలోని మెళకువల్ని, మాధుర్యాన్ని గ్రహించి, నాకనుగ్రహించిన వారు. జానపద గేయాలకు నా గ్రాత్రం బాగుంటుందని గుర్తించి, నాల్గవ ఏటనే నాచేత, ప్రఖ్యాత గేయం "అయ్యోకొయ్యోడ", ఇంకా ఎన్నో జానపద గేయాలు, గ్రామఫోను రికార్డులు ఇప్పించారు. దానికి నేనెంతో ఋణపడి ఉన్నాను. నేను నేర్చి సాధనం చేసిన శాస్త్రీయ సంగీతం, నేను ముందంజవేసి సాధించిన లలిత సంగీతం, నేను శ్రమించి సేకరించిన జానపద సంగీతం ఈ మూడు నా దృష్టిలో, ఒకే సంగీతార్ణవంలో కలిసే మూడు జీవస్రవంతులని నా నమ్మకం. నా చిన్నప్పటి కచేరీలలో ఈ మూడింటికీ సమాన స్థానమిచ్చి గౌరవించేదాన్ని.

శాస్త్రీయ సంగీతంలో లాగే, జానపద సంగీతంలో కూడా, ప్రతి రాగము సంపూర్ణంగా ఉండాలని మనం అనుకోకూడదు. జానపద సంగీతానికి ఏ శాస్త్రగ్రంధాలూ ప్రమాణాలు కావు. వాళ్ళ హృదయాలే వాళ్ళకు ఆధారం. అందువల్ల అనుకోకుండా కొన్ని పాటలు పూర్తి రాగాల్లొ దొర్లినా చాలవరకు వాళ్ళ పాటల్లో రాగచ్ఛాయలు మాత్రమే కనపడుతూ ఉంటాయి. అందుకే నా యీ పుస్తకంలో రాగం పేరుకాక, ఫలానా రాగస్వరాలు అని మాత్రమే వ్రాశాను. తరచుగా హనుమతోడి (8), వకుళాభరణం (14), మాయామాళవగౌళ (15), నటభైరవి (20), కీరవాణి (21), ఖరహరప్రియ (22), హరికాంభోజి (28), ధీర శంకరాభరణం (29) ఈ మేళకర్తలకు చెందిన రాగాల్లోనో, రాగచ్ఛాయల్లోనో జానపదుల పాటలు ఉంటూంటాయి. అవి వాళ్ళ మనస్తత్వాలకి ఎక్కువ సన్నిహితమైనది అనిపిస్తుంది. ముఖ్యంగా, నాటకు రంజి, నవరోజు, యదుకుల కాంభోజి, రేగుప్తి, ఆనందభైరవి, ముథారి, వాళ్ళకి అభిమాన రాగాలా అనిపిస్తుంది.

అదే విధంగా, ఏ సంగీతానికైనా సరే అలంకారం గమకాలే, శాస్త్రీయ గాయకుల్లాగే జానపద గాయకులు, గమకాలను దశవిధాలుగా విభజించి, ప్రయత్న పూర్వకంగా వాటిని ప్రయోగించక పోవచ్చునుగాని, ఆ గమకాలన్నీ వారి సంగీతంలో అప్రయత్నంగా దొర్లుతూనే ఉంటాయి. జంటదాలు, స్ఫురికం, కంపిత, హరిసికం - లాంటి గమకాలన్నీ జానపద గేయల్లో ఉండనే ఉన్నాయి. పోతే గాత్రానికి గమకం అనేది ఉగ్గు పాలతో అలవడుతుంది. 35 సంవత్సరాల ముందే నేను తెలుగు దేశం వివిధ ప్రాంతాలు పర్యటించి పొందుపరచిన కొల్లలైన జానపద గేయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఏయే రాగచ్ఛాయలలో ఉన్నాయో, ఏ గమక ప్రయోగాలు చేశారో గుర్తించి, వారి యాస, వారి భాష, పాడే పద్ధతి అలవర్చుకున్నాను. నాది ఒక విధమైన రిసెర్చి అనవచ్చు. నా యీ జ్ఞాన్ని (Knowledge) పాడడంలో చూపించాను కాని, డిగ్రీలకి ఆశపడలేదు. అయితే 1977వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ వారు లలిత, జానపద సంగీతాల్లో నేను చేసిన కృషిని గుర్తించి, నాకు "కళాప్రపూర్ణ" (Honorary Doctorate) ఇచ్చి గౌరవించారు. నేను సేకరించిన జానపదగేయ సమూహంలో నుంచి చాలా పాటలు నా చెల్లెలు వింజమూరి సీతాదేవికిచ్చి, ఆమె M. Litt. కి సహకరించాను. ఈ పుస్తకంలో కొన్ని పాటలను మాత్రమే స్వరపరచి, సంగీతంలో ప్రవేశం ఉన్న వారందరూ పాడుకోవడానికి వీలుగా ఈ గ్రంథ రూపంలో మీకు అందజేస్తున్నాను.

ఈ ప్రచురణకు కారకులైన ఆంధ్ర ప్రభుత్వము వారికి, ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ వారికి, తొలిపలుకు వ్రాసిన సోదరుడు డా|| బాలమురళీకృష్ణకు, నన్ను గురించి నాలుగు మాటలు వ్రాసిన వోలేటి వెంకటేశ్వర్లు గారికీ ఫ్రూఫ్ లు చూసిపెట్టిన మంచాల సోదరులకు, ముఖచిత్రం వేసిన మా బుజ్జాయికీ నా కృతజ్ఞతలు.

అనసూయదేవి.