జాజిమల్లి/ప్రథమ గుచ్ఛము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


జాజిమల్లి

సాంఘిక నవల

(ప్రథమ గుచ్చము)

పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోయిన తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన, చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. “అమ్మా! యీయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!” అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.

“మల్లెలు మల్లెలు కాడల మల్లెలు
జల్లులు జల్లులు తెల్లని మల్లెలు”

అని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని “ఓ లమ్మా! జడయెయ్యవంటే?” అని తల్లిని ప్రశ్నించింది.

ఇంక ఏమి పువ్వులుంటాయి ఆమె ఈ చిన్ననాటి జీవితంలో! వాళ్ళయ్య పనిచేసే దశరథరామిరెడ్డి పొలంలో సంక్రాంతి రోజులలో వికసించే బంతి పూవులూ, బొడగ బంతిపూవులూ, సీతామ్మవారి జడపూవులూ, బంగారం ముద్దలు, పొద్దుపొడుపు పూవులూ,

రకరకాల గోంగూర పూవులు చెవుల్లో పెట్టుకొనడానికి ఎంత అందంగా వుంటాయో అందుకనే వాటిని పూర్వకవులు కర్ణికా పుష్పాలనేవారు. గోంగూరపూవులలో ఎన్ని రంగులున్నాయి. ఎరుపు, నీలం, తెలుపు, పసుపు, చంద్రబింబాలులా విచ్చియున్న ఆ పువ్వుల హృదయంలో మధురరాగము. రాగవర్జిత విరాగహరితమై పుప్పొడులు ప్రసరిస్తూ పొలయించి వుంటుంది. దూరాన ఆవలి చిట్టడవిలో కొండ తంగేడు పూవులూ, మోదుగపూవులూ, వానకాలంనాటి దిరిశన పూవులూ ఆమెకు ఎంతో ఇష్టం.

ఆమెకు తల దువ్వడానికి నూనెలేదు. వాళ్ళదొర రెడ్డిగారింట్లో యిచ్చిన నువ్వులనూనె, కూర తాళింపుకోసం మాత్రం సరిపోయేది.

బిరుసైన ఉంగరాలజుట్టు తుమ్మెద రెక్కలలా నిగనిగలాడుతూ వున్నా, సంస్కారంలేక బాగా పెరగక తొలకరి చిరుమబ్బుల్ని నలుదిక్కులకూ ప్రసరిస్తూ ఉండేది. దొరబండ్లకు చక్రాల యిరుసులకు చుట్టిన నార తడపడానికి చిక్కని ఆముదం తెచ్చేవాడు తన అయ్య. అది నవ్వుకుంటూ చేతులకు రాసుకొని తలంతా పులుముకొనేది తల్లి దువ్వుకొనే కర్ర దువ్వెనతో చేతులు పడిపోయేటట్లుగా దువ్వుకొని, తల్లి దగ్గరకు పరుగెత్తి జడవేయించుకొనేది. అమ్మయ్య! అప్పుడు పెట్టుకొనేది పువ్వులు. ఆ బిడ్డ ‘పద్ది' పల్లెవాళ్ళ ఎఱ్ఱ చందనం బొమ్మ!

2

ఎంత నికృష్టమైన జీవితం పల్లెజాతివారిది? వారిని పల్లీలంటారు. వారిలో పెద్దలు కొందరు అగ్నికుల క్షత్రియులమని పిలుచుకుంటారు. ఆలాంటివాళ్ళు యజ్ఞోపవీతాలు కూడా వేసుకుంటారు. వారి గ్రామం 'కావలి'కి నాలుమైళ్ళ దూరములో ఉంది. అది గ్రామమేమిటి? అది పల్లెవాళ్ళ చిన్నపల్లె. ఆ బాలిక పూర్వీకులు అనాది కాలం నుంచీ సముద్రంలో పడవలు కట్టుకుపోవడం సాయంత్రానికి పడవలు చేపలతో తిరిగిరావడం, ఆ చేపలు ఎండబెట్టి ఎండు చేపల క్రింద ఎగుమతి చేయడం, లేక పచ్చిచేపలుగా అమ్మేయటమో అలాంటి వ్యాపారం చేసి జీవితం సాగిస్తూండేవారు.

ప్రాణాలు ఒడ్డి, పడవడు చేపలు పట్టుకొని వచ్చినా మధ్యవర్తకుల పాళ్ళన్నీపోగా ఇంక వారికి మిగిలేది ఏముంటుంది గనుకా? అందుకని ఆమె అయ్య దశరధరామిరెడ్డి గారికి పాలేరుపని చేస్తూండేవాడు. దానా దీనా అతడి పెద్ద కుటుంబం ఆకలిగీత దాటకుండా బ్రతుకుదారిలో ప్రయాణం చేస్తూండేది.

ఆమె తాత, అవ్వ, పెద్దయ్య, అయ్య, చిన్నయ్య, వాళ్ళందరి బిడ్డలు, ఆమె అన్నదమ్ములు, అక్క సెల్లెళ్ళు మొత్తం వారి రెండు మూడు గుడిసెల్లో అందరూ కలిసి ముప్పై ఆరుగురుండేవారు. ఏటిలో వలలువేసి చేపలు పట్టినా, సముద్రంలోకి పోయి చేపలుపట్టినా, ఆ పాటు అంతా మగవాళ్ళదే. తట్టలతో కావలీ, బిట్రగుంటా పోయి అమ్ముకురావడం వంతు ఆడవాళ్ళది.

తమ బట్టలన్నీ చేపల వాసనకొట్టేవి. తమ యిండ్ల చుట్టూ చేపలవాసన. ఇల్లంతా చేపలవాసన. చివరికి వళ్ళంతా చేపలవాసనే! వారి పూర్వీకురాలైన మత్స్యగంధి చరిత్ర ఎవరు వినలేదు! ఆమె జీవితములో పరాశరుడు ప్రవేశించి ఆమెను యోజనగంధిని చేసినాడు. ఈ బాలిక పద్దాలు జీవితములో బుచ్చి వెంకులు పరాశరుడూ, శంతనుడూ కూడా!

3

పద్దాలుకు పదహారో ఏడు వచ్చింది.

సముద్రం మధించిన లావణ్యాలు సుడులు సుడులుగా ఆమెలో చేరుకుంటున్నాయి.

చింపిరిజుట్టు పొడుగై, ఉంగరాలు తిరిగి, లోతు సముద్రాల నీలాలై, సముద్రం ఆవలిగట్టు కాటుక కొండలై నిగనిగలు తేలింది.

ఆమెకు యవ్వనం వచ్చి రెండేళ్ళయింది:

ఆ పల్లెవాళ్ళలో పల్లెనాయకుడు వీరాస్వామి కొడుకు బుచ్చి వెంకన్న. అతనికి పద్దిని ఇవ్వడానికి వారిరువురి చిన్నతనంలోనే నిశ్చయం చేశారు పెద్దలు. ఉక్కు విగ్రహంలాంటి బాలుడు. సముద్రం మొసలిలాంటి శక్తిమంతుడు, నల్లమద్ది చెట్టులా కమ్మెచ్చులు తిరిగిన కండలుకట్టిన దేహంతో బార ఈతలో సముద్రములో ఎంత దూరానికైనా వెళ్ళేవాడు.

బుచ్చి వెంకులంటే పద్దికి తన ఎనిమిదో ఏటినుంచీ ప్రాణమే. ఆనాటికే వాడు ఒక్కడూ తెరచాప ఎత్తి నావ నడుపుకుపోయేవాడు! ఎంతదూరమైనా సముద్రంలోనికే. మాటలు తక్కువ. చేతకు ఎప్పుడైనా సిద్దమే. తన పల్లెలో ఏ పని వచ్చినా, అంత చిన్నతనంలోనూ అతడు ఎన్నడూ వెనుదీయలేదు. ఆమెకు పన్నెండు వచ్చింది. అతనికి పదహారో ఏడు వచ్చింది. అప్పుడే వీళ్ళిద్దరి పెండ్లి చేయడానికి సంకల్పించారు. పెళ్ళి మూడురోజు లుందనగా బుచ్చివెంకన్న పడవ సముద్రములో మాయమైపోయింది. ఆ చుట్టుప్రక్కల పల్లెవాడలలో పల్లెనాయకులందరూ అతనికోసం ఆ తీరమంతా గాలించారు. ఆ బాలకునికోసం పల్లెవాడలన్నీ గగ్గోలు పుట్టాయి.

పద్దమ్మ దుఃఖానికి మేరలు లేవు. ఆ లేతహృదయం చితికిపోయినట్లే అయింది. వారం రోజులకి పెన్నసముద్రంలో చేరే ప్రదేశానికి తెరచాప ఎత్తుకొని కొనవూపిరితో ధైర్యం చెడకుండా వచ్చి చేరుకున్నాడు బుచ్చి వెంకన్న. ఈ సంగతంతా చెప్పి కావలిలో వున్న ఒక అయ్యవారిని అడిగితే ఆయన బుచ్చివెంకన్న రోజులు మంచివి కావనీ, రెండేళ్ళ వరకూ బుచ్చి వెంకన్నకూ, పద్దమ్మకూ పెండ్లి చేయవద్దని సలహా యిచ్చాడు.

పద్దమ్మకు పదహారోయేట బుచ్చి వెంకన్నకు ఇరవయ్యో యేట వాళ్ళిద్దరకు పల్లెపాకలలో ఎన్నడూ ఎరుగని వేడుకలతో పెళ్ళి చేశారు. కెరటమూ కెరటమూ కలసిపోయినట్లు గాలీ గాలీ ఒరుసుకుపోయినట్లు, ఏరులో ఏరు సంగమించినట్లు వారి జీవితాలు కలిసినవి. రెండు తిమింగలములులా వారు ఉప్పొంగినారు. సముద్రాల ఈదులాడినారు. రెండు కృష్ణ డేగలలా వారు మైమరపులతో ఆకాశాల తేలిపోయినారు!

ఇంతలో ప్రపంచపు బ్రతుకు మార్గాల జటలమారెమ్మ, ఠాకినీదేవి యుద్ధము అవతరించింది. జపాను యుద్ధరంగంలోకి దిగింది. భారతీయ యువకులెంతమందో కడుపుకోసం యుద్ధంలోకి జేరేరు. ఎంతమందో సరదాకోసం యూనిఫారము వేసికొన్నారు. చాలామంది ఏ సంగతీ తెలియకుండా మాయమాటలు నమ్మి సైన్యాల జట్టులలో జేరిపోయినారు. అలాగే యుద్దములోకి వెళ్ళిపోయినాడు బుచ్చి వెంకన్న. తాను పద్మ కోసమే యుద్ధానికి వెళ్ళ నిశ్చయించాడు. వెళ్ళాడు.

చేరిన ఆరునెలల్లో కోహీమా రంగానికి వెళ్ళవలసి వచ్చింది. మరి ఆరునెలలు తిరక్కుండా యుద్ధం ఆగిపోయింది. టకటక సైనిక వేషంలో జేబునిండా డబ్బుతో సంచులనిండా చిత్ర విచిత్రమైన వస్తువులతో, సువాసన నూనెలతో, రంగు రంగుల సబ్బులతో, ఫేసుపౌడర్లతో, దిబ్బనతో లోలకులతో అనేకరకాల వెన్నెలలాంటి చీరలతో యింటికి వచ్చాడు బుచ్చి వెంకట్రావు జమాదారు.

4

తన పల్లెలో తన వాళ్ళతో ఉండడానికి యిష్టంలేక పోయింది బుచ్చి వెంకట్రావుకు. వచ్చి కావలిలో మకాము పెట్టాడు. తాను చేపల వర్తకము ప్రారంభించాడు. పెళ్ళానికీ తనకూ చదువు చెప్పడానికి ఒక మేష్టర్ని పెట్టుకున్నాడు. పెళ్ళాన్ని పద్మావతీ అని పిలిచాడు. తాను బుచ్చి వెంకట్రావయినాడు! పద్మావతి కంఠం ఎంత మధురమైనది? ఆమె చిన్నతనంలోనే

“ఏడుకలూ పెళ్ళి ఏడుకలూ

భూమంత పందిరేసి

పువ్వుల తోరణాలు

బూరాలు ఊదారు
ఏడుకలూ పెళ్ళి ఏడుకలూ
పడవెక్కి తెడ్డేసి
నడిసముద్రాన్ని చేరి
ఆలిచిప్పల మద్దె ముత్యాల జాలరులు
ఏడుకలూ పెళ్ళి ఏడుకలూ”

అని తల్లితోపాటు చేపలు ఎండవేసేటప్పుడుగాని, అయ్య యిచ్చిన చేపల్ని బుట్టలో తీసుకొనివచ్చి అమ్మకు అందిచ్చేటప్పుడుగాని, సన్నటి రొయ్యపప్పు రంగూన్ యెగుమతి కోసం తండ్రితోపోయి బుట్టలలో కట్టేటప్పుడుగాని, వెన్నెల రాత్రుల ఒడ్డుకు తేలుకుంటూ వచ్చి పాటపాడేటి ఉప్పునీటి కెరటాలతో కలిపిగాని ఆమె గొంతెత్తి ఎన్నో పాటలు పాడుతూ ఉండేది. ఆ పల్లెవాళ్ళ వేడుకలలో, ఉత్సవాలలో పద్దమ్మ పాడకపోతే అవన్నీ పరిమళాలులేని పువ్వులులా అయిపోయేవి. అడవి పువ్వులకు దోహదాలు కావాలా అందమైన సువాసనలను వెదజల్లడానికి! కావలిలో ఆ బాలిక గొంతు విని ప్రయివేటు మాష్టరు “ఏమండీ వెంకట్రావుగారు! మీ వాళ్ళకు సంగీతం చెప్పించండి” అని ప్రోత్సహించాడు. అప్పుడే పద్మావతి జీవితములో నరసింహమూర్తి మేష్టారు ప్రవేశించాడు.

సముద్రపు ఒడ్డున పాలసముద్రపు కెరటాలులా ఉబికి ఉన్న ఆ ఇసుక తిన్నెలలో ఆటలాడుకుంటూ, నత్తగుల్లలు ఏరుతూ, శంఖాలు ప్రోగుచేసుకుంటూ, రంగురంగుల పీతల్ని తరుముతూ కూరకు పనికివచ్చే పెద్ద పీతల జోలికి పోకుండా ఆటలాడుకునే పల్లె బాలికలకు ఆ సముద్రం అవతల ఒడ్డున ఏమున్నదో ఏమి తెలుసు? కెరటాలు ఎందుకు పుడతాయో వాళ్ళు ఆలోచిస్తారు. సముద్రపు లోయల్లో ఏ రాక్షసో నిట్టూర్పులు విడుస్తూవుంటే ఆ కెరటాలు ఏర్పడుతాయేమో? ఉతుకు ఎరుగని పేలికలైన పరికిణీ చొక్కాలు ధరించి మహారాజు కుమార్తెలా గంతులువేస్తూ ఆడుకొనే పద్దాలుకు, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సముద్రానికి ఇవతల ఒడ్డు అవతల ఒడ్డు సముద్రుని పోటుపాటూ, సముద్రుని పెండ్లాము నదీసుందరి రాకపోక, తోలుబొమ్మల ఆటలులా జరిగిపోయేవి.

ఎందుకు అందమైన బట్టలు కట్టుకోవాలో తెలియకపోయినా రంగురంగుల కొత్త పరికిణీలు చక్కని వల్లెవాటులను, చుక్కచుక్కల రవికెలు కావాలని చిన్నతనంనుంచీ వాంఛించేది పద్దాలు.

పెద్దవాళ్ళ యిళ్ళలో తిండికోసము ఏమి వండుకుంటారో అని పద్దాలు ఎప్పుడూ ఊహించుకోనయినా ఊహించుకోలేదు. అనుకుంటే ఇంకా చిక్కటి గంజీ, ఇంకా చిక్కటి సంకటి ఇంకా పెద్దవి చేపలు, కోడిమాంసపు కూరలు ఉంటాయి. అంతకన్నా ఏమిటో అవి ఎప్పుడైనా అనుకున్నదేమో! కాని కావలి పట్టణపు బజారులలో మిఠాయి అంగడులమీద అమ్మే ఆ నోరూరిస్తూ ఘుమఘుమలాడే అవేవో పకోడీలు, కారంపూసా, అవి తన అయ్య పాలిపని చేసే రెడ్డిగారింట్లో తింటారు కాబోలు అని అనుకునేది.