జయ జయహే తెలంగాణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జయ జయహే తెలంగాణ పాట రచించినది అందెశ్రీ


జయ జయహే తెలంగాణ
జననీ జయ కేతనం
ముక్కోటి గొంతుకలు
ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల
తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు
ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణా
జై తెలంగాణ జైజై తెలంగాణా
...జయ జయహే...

కవి గాయక వైతాళిక
కళల మంజీరాలు
డప్పూ డమరుకము ఢక్కి
శారద స్వర నాదాలు

పల్లవుల చిరుజల్లుల
ప్రతి వుల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం
అమ్మ నీవు మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణా
జై తెలంగాణ జైజై తెలంగాణా
...జయ జయహే...

జానపదా జనజీవన
జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే
గీతాలా జనజాతర
వేలకొలదిగా వీరులు
నేల కొలిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం
మరువనిదీ శ్రమ యాగం
జై తెలంగాణ జైజై తెలంగాణా
జై తెలంగాణ జైజై తెలంగాణా
...జయ జయహే...

బడుల గుడులతో పల్లెల
ఒడలు పులకరించాల
విరిసే జనవిజ్ఞానం
నీ కీర్తిని పెంచాల
తడబడకుండా జగాన
తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి
ఓయమ్మా వెలుగాల
జై తెలంగాణ జైజై తెలంగాణా
జై తెలంగాణ జైజై తెలంగాణా
...జయ జయహే...

గోదావరి కృష్ణమ్మలు
తల్లి నిన్ను తడుపంగ
పచ్చని మాగాణాల
పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ
సుభిక్షంగ వుండాల
ప్రత్యేక రాష్ట్రాన
ప్రజల కలలు పండాల
జై తెలంగాణ జైజై తెలంగాణా
జై తెలంగాణ జైజై తెలంగాణా