జడకుచ్చులు/జన్మభూమి

వికీసోర్స్ నుండి

జన్మభూమి

దేశమేగినా ♦ ఎందుఁ గాలిడిన
ఏపీఠ మెక్కినా ♦ యెవ రెదురయిన
పొగడరా నీతల్లి ♦ భూమి భారతిని
నిలపరా నీజాతి ♦ నిండుగర్వమ్ము
లేదురా యిటువంటి ♦ భూదేవి యెందు.

లేరురా మనవంటి ♦ ధీరులింకెందు.
ఏ పూర్వపుణ్యమో ♦ ఏయోగబలమొ!
జనియించినాడ వీ ♦ స్వర్గలోకమున
ఏమంచిపూవులన్ ♦ బ్రేమించినావొ!
నినుమోచె నీతల్లి ♦ కనక గర్భమున.

సూర్యుని వెలుతురు ♦ సోకునందాక
ఓడల జెండాలు ♦ ఆడునందాక.
నరుడు ప్రాణాలతో ♦ నడుచు నందాక
అందాకగల యీయ ♦ నంత భూతలిని
మన భూమివంటి క ♦ మ్మని భూము లేదు.

తమతపస్సులు ఋషల్ ♦ ధారఁబోయంగ
చండవీర్యము శూర ♦ చంద్రు లర్పింప

రాగదుగ్ధము భక్త ♦ రాజు లీయంగ
భావసూత్రము కవి ♦ బాంధవు లల్ల
దిక్కుల కెగఁదన్ను ♦ తేజంబు వెలుఁగ
జగముల నూగించు ♦ మగతనం బెగయ.
రాలు పూవులుసేయు ♦ రాగాలు సాగ
సౌందర్య మెగఁబోయు ♦ సాహిత్య మొప్ప

వెలిగిన దీదివ్య ♦ విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్య ♦ దేశంబు పుత్ర!

అవమానమేలరా ♦ అనుమాన మేల?
భరతపుత్రుఁడనంచు ♦ భక్తితోఁ బలుక !