జగత్తు - జీవము/కాలాకాశవైచిత్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జగత్తు - జీవము

4. కాలాకాశవైచిత్రి

జగత్తను ఈ మహా పరిశోధనా గారంలోనికి అన్వేషణ దృక్కు లంపినప్పుడు సృష్టియందలి విచిత్రము లప్పుడప్పుడు గోచరిస్తాయి. ఈ అనాది పరిశోధనాగారంలో అనుక్షణం సంభవిస్తూన్న అద్భుత ప్రయోగాలే అగోచరుడుగానున్న పరిశోధనాధ్యక్షుని రచనా కౌశలానికి, చాతుర్యానికి నిదర్శనాలు. ఈ అనంత పరిశోధనా గారంలో సృష్టి స్థితిలయాలు నిత్యం జరుగుచున్నాయి. పరమాణువులోని ఎలక్ట్రాను పరివారాలు శిథిలమై మహోగ్రమైన తేజోష్ణాలు ఒకవంక జనిస్తున్నాయి : పరమాణువు భస్మమై ఆ విభూతినుండి శక్తి జనిస్తూంది. అతి దీర్ఘయానంచేసి జవం కోల్పోయిన శక్తి ఆకాశరహఃకోణాలలో ద్రవ్యంగా పరివర్తనమొందుతూంది. నాతి దూరంగానున్న ద్రవ్యఖండాలు పరస్పరాకర్షణ బలబంధములచేత స్తోకనక్షత్ర రాశులుగ విభజింపబడి కుటుంబములట్లు ఆకాశయానం చేస్తూండగా, అతి దూరస్థ తారాకుటుంబములు పరస్పర విముఖములై ఆకాశార్ణవంలో చెదిరిపోతున్నాయి. జగత్సర్వము అత్యద్భుత పరిణామ మొందుతూంది !

శిశువుకి సైతం కండ్లు తెఱవగానే ఆకాశం కనిపిస్తుంది. కనుచూపుమేఱ ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. కోట్లకొలది మైళ్ళ దూరంగానున్న నక్షత్రాల కాంతి ఆకాశయానంచేసి మన కంట్లో పడినప్పుడే ఆ నక్షత్రాలు గోచరమౌతాయి ; ఆకాంతి మన కంట్లో పడుతున్నంతకాలము అవి గోచరిస్తూనే ఉంటాయి. సెకెనుకి 186000 మైళ్ళ వేగంతో కాంతి పరుగిడుతూన్నట్లు తెలిసింది. ఆ వేగంతో ఒక సంవత్సరం ప్రయాణంచేసిన కాంతి సుమారు 6 లక్షల కోట్ల మైళ్ళదూరం పోతుంది. ఆకాశంలో పడి నక్షత్ర విషయమై ముచ్చటించినప్పుడు మానవ మానములు అక్కరకు రావు. మన కతి సమీపంగానున్న తార 25 లక్షల కోట్ల మైళ్ళు దూరంగానుంది. దురూహ్యంగానున్న అట్టి విపరీత దూరాలకు అనువైన మానమొకటి ఏర్పరిచేరు. ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణం చేయగల దూరాన్ని - 6 లక్షల కోట్ల మైళ్ళు - ఒక "కాంతి సంవత్సరం" (light year) అన్నారు. ఆ మానంమీద మన సమీపతమ తారదూరం 4¼ కాంతి సంవత్సరాలు. మృగవ్యాధుని (Orion) క్రిందనున్న మహోజ్జ్వల తార అగు సిరియసు (sirius) దూరం 8½ కాంతి వత్సరాలు. నక్షత్రాల దూరం కాంతి సంవత్సరాలలో చెప్పుకొన్నప్పుడుకూడ ఊహాతీతమైనప్పటికి ఆ విధానంలో వైపరీత్యం కనిపించదు.

మనకిప్పుడు కనిపిస్తూన్న నక్షత్రాలన్నీ వాటి వాటి యథాస్థానాలలో నున్నాయని చెప్పలేము. ప్రమాదవశాత్తు ఈ క్షణాన్ని సిరియసు భిన్నమై అంతరించినప్పటికి 8½ ఏండ్లవరకు తనస్థానంలో సిరియసు భద్రంగా నున్నట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఏమంటే సిరియసు భిన్నమయే పూర్వం దానినుండి బయలుదేరిన కాంతి 8½ ఏండ్లు ఆకాశయానం చేసినపిమ్మట మనకంట్లో పడుతుంది. కాబట్టి 8½ ఏండ్లవరకు మృగవ్యాధుని క్రింద దేదీప్యమానంగా సిరియసు ఉన్నట్లే మనం భావిస్తాము. అంటే, నేడు మనం చూసిన సిరియసు యొక్క కాంతి, ఆకారం, వర్ణం మొదలైనవి 8½ ఏండ్ల క్రిందటివి కాని, నేటివికావు. ఇట్లే వందలు, వేలు, లక్షలాదిగ కాంతి సంవత్స రాల దూరంలోనున్న నక్షత్రాలు, నెబ్యులూలు, గెలాక్సీలు ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. అట్టివి క్రమంగా వందలు, వేలు, లక్షలాది సంవత్సరాల పూర్వపుచరిత్రనే మనకు నివేదిస్తున్నాయి కాని, వాటి వర్తమాన చరిత్ర మనమెరుగము. ఉదాహరణగా : ఏండ్రొమెడా (Andromeda) రాశిలో నున్న పెద్ద నెబ్యులాదూరం 800,000 కాంతి సంవత్సరాలు. ఇప్పుడాకాంతిని విశ్లేషించి ఆనెబ్యులా యొక్క చరిత్ర చెప్పగలిగినట్లయితే 8 లక్షల సంవత్సరాల క్రిందటి చరిత్రను కనుగొన్నామే కాని, అది నేడెట్లుంటుందో ఎరుగము. ఇప్పుడు మన కంట్లో పడుతూన్న కాంతి ఆ నెబ్యులానుండి బయలు దేరుసరికి భూమిలో మానవుడు జన్మించనేలేదు ! ఒకనాడు అకస్మాత్తుగా అ నెబ్యులా అంతర్ధానమైపోతే నాటికి 800,000 ఏండ్ల క్రితమే అది లయమైనట్లు భావించుకోవాలి. అగుట ఒక్కొక్క నక్షత్రాన్ని చూచినప్పుడు, భూతకాలంలో ఒక్కొక్క నిశ్చిత కాలభాగాన్ని విలోకిస్తున్నాము. ఇట్లు, 4¼ నుండి కొన్నికోట్ల సంవత్సరాలవరకు గడిచిన భూతకాలదృశ్య పరంపరను ఒకేసారి చూడగలుగుచున్నాము. ఇదే కాలప్రవాహానికి ఎదురీదడమేమో !

కాలమొక జీవనదీ ప్రవాహంగా భావింపబడుతూంది. సర్వజనామోదమైన నిత్య వ్యవహారంకొఱకు కాలాన్ని భూతభవిష్య ద్వర్తమానములను మూడు విభాగాలు చేసేరు. గతించినది భూతకాలము, జరుగుచున్నది వర్తమానము, రానున్నది భవిష్యత్తు. భూతకాల మనంతము ; భవిష్యత్కాలము అనంతమే. వర్తమానమెంత సూక్ష్మాతి సూక్ష్మమో ఊహించలేము. కనురెప్పపాటులో వర్తమానము భూతకాలభాగంలో చేరిపోతూంది. అనంత భవిష్యత్తు నుండి సూక్ష్మ కాలఖండాలను చెండి మానవ చై తన్యము భూత కాలానికి జమ చేస్తూంది. ఇది అనుక్షణం సంభవిస్తూంది. అయినప్పటికి ఈకాల విభాగాల అగత్యముంది. అయితే, ఈ విభాగం భూలోక మొక్కదానికేనా, యావద్విశ్వానికి వర్తిస్తుందా అన్నది విచారణీయము.

జ్యేష్ఠానక్షత్ర కూటంలోని మహోజ్జ్వల తార అగు ఆంటారిసు (Antares) మనకు 360 కాంతి సంవత్సరాల దూరంలోనుంది. ఆంటారిస్‌లోగాని, ఆంటారిసుని ఆశ్రయించిన గ్రహాలలోగాని జీవమున్నదనుకొందము. ఆలోకవాసులు మనకన్న అత్యధిక మేదావంతులని జ్ఞానసంపన్నులని అంగీకరిద్దాము. అందున్న విజ్ఞానులలో ఒక మహామేధావి దూరదర్శిని (Telescope) కన్న ఉత్తమమైన సంకుల యంత్రాన్ని మన భూమివైపు త్రిప్పి భూలోక దృశ్యాలను పరిశీలిస్తున్నాడనుకొందము. చంద్రగోళంలోని పర్వతాలను, ఎడారులను మనం చూచుచున్నట్లే ఆంటారిస్‌లోని విజ్ఞాని భూలోకదృశ్యాలను స్పష్టంగా చూడగలడనుకొనుటలో దోషంలేదు. మనలోకంనుండి బయలుదేరిన కాంతి 360 సంవత్సరాలు ఆకాశయానంచేసిన పిదప ఆ యంత్రంలో జొరబడుతుంది. కాబట్టి, ఆ విజ్ఞాని 360 ఏండ్ల క్రిందటి దృశ్యాన్ని నేడు చూస్తూ ఉంటాడు.

అవి అక్బరు చక్రవర్తి పరిపాలిస్తున్నరోజులు. ఏకచ్ఛత్రాధిపత్యం వహించి, ఉదారమైన మత సహనంతో ప్రజాస్వామిక ప్రభుత్వంకన్న ఉత్తమమైన పధాలలో యావజ్జనామోదంగా రాజ్యపాలన మొనరిస్తున్నాడు. హిందూ మహమ్మదీయ తీవ్ర వైషమ్య వృక్షాన్ని కూకటివేళ్లతో పెఱకి పారవైచి అంతర్మతసామరస్యాభ్యుదయానికి అనేక నవ్యమార్గాల ననుగమించినవాడు అక్బరుచక్రవర్తి. తానొక రాజపుత్ర నారీరత్న పాణిగ్రహణమొనర్చి మతాంతర వివాహాలకు మార్గదర్శకుడై నవాడు మొగల్ సామ్రాట్టు అక్బరు.

సంవత్సరాని కొకసారి మొగలాధీశుని వినోదార్ధం నౌరోజా మహోత్సవం జరిగేది. నేటికి 360 ఏండ్ల క్రిందటి వత్సరంలో జరిగిన ఉత్సవమందు రాజనగరు నేత్రానందపర్వంగా అలంకరింప బడింది. ఉత్సవ ప్రదేశం నానావర్ణదీపికలచే శోబాయమానంగా రాజిల్లుతూంది. సామ్రాజ్యాధీశు దర్శన వాంఛాప్రేరితులైన రాజపుత్ర కోమలాంగులు స్ఫురత్ రత్నాలంకార భూషితలై, అత్యంతాకర్ష చీనాంబరధారిణులై, ఉత్సాహ స్రవంతులచే నెఱ్ఱవారిన చెక్కిళ్లతో స్వైరవిహారం చేస్తున్నారు. మానమే ప్రాణంగా భావించిన వీర వనితలు దాస్య శృంఖలాబద్ధలౌట ఉత్సవములోపాల్గొనక వీలులేమి నిరుత్సాహులై, ఆభరణాద్యలంకార రహితలై జీవచ్ఛవము లట్లు అందందు సంచరిస్తున్నారు. రారాజుల మన్ననల గొను సామ్రాజ్యాధిపతి అంతఃపురకాంతపగిది సముచితాలంకృతుడై నారీసందోహ సందర్శనానంద పారవశ్యమున అపార సౌందర్య రసాస్వాదన మొనరిస్తూ యధేచ్ఛగా విహరిస్తున్నాడు.

దేవతలకు సైతం తలవంపులు ఘటించు నౌరోజా మహోత్సవ సందర్భమందు, భూమినుండి ఆనాడు బయలుదేరిన కాంతి దిగ్వలయం వ్యాపించి ఆకాశయానం చేస్తూనే ఉంది. ఆ కాంతి ఆంటారిస్ మండలాన్ని చేరుకొంది. ఆ లోకంలోని విజ్ఞాని భూమి వైపు త్రిప్పిన యంత్రంలో ప్రవేశించింది. నౌరోజా విశేషాలను ఆ విజ్ఞాని ఇప్పుడే చూస్తున్నాడు. నవరత్నఖచిత స్వర్ణాభరణాలంకృతలై, నానావర్ణ దుకూలధారిణులైన నిరుపమాన సౌందర్యవతీ లలామలు ఆతని దృక్పథంలో సంచరిస్తున్నారు. జగద్విఖ్యాత సామ్రాజ్యాధీశుడయ్యు ముహూర్తమాత్ర భోగలాలసతకు దాసు డై నారీమణివలె సాలంకృతుడై పూవుబోండ్లను హెచ్చరిస్తున్న పురుష సింహమగు అక్బరును ఆ విజ్ఞాని చూస్తున్నాడు; చూచి, అపరిమితానందానుభూతిలో నున్నాడు.

ఆ నౌరోజాలో పాల్గొన్న మహిళలు, మొగలుసామ్రాట్టు గతించి 3 శతాబ్దాలు గడిచేయి. ఆ నారీగణంలో మచ్చున కొక్క వ్యక్తికూడ నేడులేదు. చరిత్రస్థమైయున్న విఖ్యాత స్త్రీ నామముల కన్న ఇతరుల నామములే మనకు తెలియవు. కాని, ఆంటారిస్‌లోని విజ్ఞాని ఆ నారీమణుల నందరనుచూచి ఆనందిస్తున్నాడు. ఆవిజ్ఞాని కాదృశ్యం వర్తమానంలో సంభవిస్తూంది. మనకు ఆ దృశ్యం భూతకాలంలో జరిగిపోయింది. అందు పాల్గొన్న వ్యక్తులు లయమయి పోయి వందలకొలది ఏండ్లు గతించేయి. మనకు భూతకాలమైనది మరొకరికి వర్తమానమౌతూంది. అయినచో భూతభవిష్యద్వర్తమానము లన్నప్పుడు ఎవరి దృక్పథంలో వాటిని నిర్వచించడం ? కాలవిభాగం గురించి నిర్ణయించడానికి మనకున్నంత హక్కు ఆంటారిస్ లోకవాసికి మాత్రం లేదా ?

ఇంకొకవిశేషము : ఆంటారిస్ విజ్ఞాని సూక్ష్మోపకరణ సహాయంతో కొన్నిసంవత్సరాల దూరంలోనున్న మరొక నక్షత్రవాసితో సంప్రతింపగల సామర్థ్యం సంపాదించేడనుకొందము. ఆ నక్షత్రవాసి విశేష సంస్కృతిగలవాడౌటచేత తనకు మరికొన్ని కాంతివత్సరాల దూరంలో నున్న మరొక లోకవిజ్ఞానికి సందేశమంపగలడని, ఇట్లు భూలోక దృశ్యవార్త నక్షత్రంనుండి నక్షత్రానికి వ్యాపింపబడుతూందని అనుకొందము. మహా మేధానిధులైన అన్యలోకవాసులు నియత వేగం గల కాంతికిరణంతో కాక మనోవేగంతోనే వార్తలను పంపగల రనుకొందము. అట్టి సామర్థ్యం గల ఆంటారిస్ విజ్ఞాని తను నేడు చూస్తున్న నౌరోజా మహోత్సవం గురించి మృగవ్యాథకూటంలోని రిగెల్ (Rigel) నక్షత్రవాసికి మనోవేగంతో వార్త పంపినట్లయితే ఏమని చెప్పవలసి ఉంటుంది ? సుమారు 150 సంవత్సరాలైన పిదప రిగెల్ విజ్ఞాని హృదయంగమమైన భూలోక దృశ్యాన్ని చూడగలడని సందేశమంపాలి. భూలోకజీవితాన్ని పరిశీలింప కుతూహలమున్న రిగెల్ విజ్ఞాని ఆవార్త నెరిగినది మొదలు ఎప్పుడెప్పుడు 150 సవత్సరాలు గతిస్తాయా అని, ఆనాటి నౌరోజా మహోత్సవం నాడు బయలుదేరిన కాంతి ఎప్పుడు తన యంత్రంలో పడి ఆచక్కని దృశ్యాన్ని చూపుతుందా అని ఉవ్విళ్ళూరుతుంటాడు. అగుట, ఆంటారిస్ విజ్ఞానికి వర్తమానమైనది మనకు భూతకాల భాగమయినది రిగెల్ విజ్ఞానికి భవిష్యత్తుకానున్నది. అయితే, భూతభవిష్యద్వర్తమానములేవి ?

మనోవేగంతో నివేదించగల విజ్ఞానులు గల లోకాలన్నిటిలో నాటి నౌరోజా విషయమై వార్త ప్రాకిపోయిఉంటుంది. నక్షత్ర లోకాలలోనే కాదు, నెబ్యులాలకుకూడ వ్యాపించవచ్చును. కాని వెంటనే ఆయా లోకవాసులు ఆ దృశ్యాన్ని చూడలేరు. నాడు భూమినుండి బయలుదేరిన కాంతి సెకెనికి 186,000 మైళ్ళ చొప్పున, సంవత్సరానికి 6,000,000,000,000 మైళ్లచొప్పున శుష్కాకాశ యానం చేస్తూ ఆకాశార్ణవం తరిస్తూ, ఒక్కొక్క లోకాన్ని చేరుకోవాలి ఆ కాంతి ఎప్పుడేలోకాన్ని చేరుకొంటుందో ఆ లోకాని కప్పుడాదృశ్యం గోచరిస్తుంది. ఈ ప్రకారంగా ఒకసారి భూమినుండి బయలుదేరిన కాంతి ఆచంద్రతారార్కముగ దిగ్విలయం వ్యాపిస్తూ ఒక్కొక్క నక్షత్రవాసులకు ఒక్కొక్కసారి గోచరిస్తుంది. ఇట్లు శతాబ్దాలక్రింద భూలోకంలో గతించిన జీవులు ఆకాశంలోను ఆకాశ కృతకాలంలోను జీవిస్తూనే ఉన్నారు. ఆజీవుల వర్తమానం అంతం కాలేదు. అది అంతంలేని ఆకాశంలో పొడిగింపబడుతూంది. కాబట్టి కాలవిషయంలో గతించినది ఆకాశవిషయంలో చిరస్థాయిగా వర్ధిల్లుతూంది. అంతేకాదు; జీవం ఒక స్థలంలో నశించవచ్చును, ఒక కాలంలో నశించవచ్చును. కాని, జీవంయొక్క ప్రతిమ కాలాకాశంలో ఎన్నడును నశించదు. అయితే దానిని పునః గ్రహించు విధానం నేటివరకు మన మెరుగము. అయినప్పుడు సత్యమైన కాలమేది ? సత్యమైన ఆకాశమేది ? సత్యమైన జీవమేది ?

ఇట్లు, విశ్వజనీన దృష్టితో యథార్థం పరిశీలిస్తే మనకెన్నడో జరిగిపోయిన ఒక ఘటన ఆంటారిస్ విజ్ఞాని దృష్టిలో ఇప్పుడు సంభవిస్తూంది. అందులో పాల్గొన్న జీవులు వానికొఱకై నేడు పునర్జీవితులు కాలేదు. వారందరు భూలోక జీవితం చాలించి, 17 వ శతాబ్దంలో భూదేవికి శరీరాల నర్పించినవారే ! కాని, ఆంటారిస్ విజ్ఞానికి దృఢశరీరాలతో ఇప్పుడు గోచరిస్తున్నారు. వాని వర్తమానంలో ఆజీవులు సజీవులై యున్నారు. ఇక, రిగెల్ విజ్ఞానిదృష్టికి ఆ ఘటన భవిష్యత్తులో గుప్తమై యుంది. మరొక 150 సంవత్సరములు గతిస్తేనేకాని అతనికాదృశ్యం గోచరించదు. ఈ 150 సంవత్సరాలలో కాంతి యాత్ర సాగిస్తూనే ఉంటుంది. వానిదృష్టిలో అక్బరు పుట్టనేలేదు.

అసలు, కాలభావం ఆకాశంతో జనించింది. ఆకాశంలో వస్తు చలనం లేకపోతే కాలభావమే కలుగకపోను. త్రికాలవృక్షంలో భూతకాలమూలాన్ని ఛేదిస్తే వృక్షం నశిస్తుంది. భూతకాల విషయాలను పరిశీలించి, విమర్శించి భవిష్యత్తునకుపకరించు నియమాలను ఏర్పాటు చేయడమవుతూంది. భూతకాల మసత్యమైతే మన భవిష్యత్తు గాలిమేడవలె కూలిపోతుంది. కాని, మనతో సంబంధం లేనిదే కాలాన్ని భావించుకోలేము. ఒక విషయం "ఎప్పుడో జరిగింది" "ముందు వాటిల్లుతుంది" అన్నప్పుడు ఆ విషయాన్ని చూచినవారో చూచువారో, అనుభవించినవారో అనుభవించువారో అగు మానవులతో దానికి సంబంధం ఏర్పరుస్తున్నాము. కాబట్టి, కాలానికి స్వతంత్రమైన ఉనికిలేదని స్పష్టమే. అదీగాక, ఆకాశంతో సంబంధం లేని కాలాన్ని ఊహించుకోలేము. అగుట, వ్యక్తకాలమే ఆకాశమని, అవ్యక్తంగానున్న ఆకాశమే కాలమని విజ్ఞులు భావిస్తున్నారు.