చీకటి వెలుగుల కౌగిలిలో
పల్లవి:
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (2)
ఏకమైన హృదయాలలో (2), పాకే బంగరు రంగులు
ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగపాయల మందారాలు (2)
ఎక్కడివీ రాగాలు, చిక్కని ఈ అరుణ రాగాలు
అందీ అందని సత్యాలా, సుందర మధుర స్వప్నాలా
చరణం:
తేటనీటి ఈ యేటి వొడ్డునా నాటిన పువ్వుల తోట (2)
నిండు కడవలా నీరు పోసి, గుండెల వలపులు కుమ్మరించి
ప్రతి తీగకు చేయూత నిచ్చి, ప్రతి మానూ పులకింపజేసి
మనమే పెంచినదీ తోట, మరియెన్నడు వాడనిదీ తోట
మరచి పోకుమా తోటమాలీ, పొరపడియైనా మతిమాలి (2)
చరణం:
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో
మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలు
అన్నీ మనకూ చుట్టాలేలే, వచ్చే పోయే అతిథులే
ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగపాయల మందారాలు
ఎక్కడివీ రాగాలు, చిక్కని ఈ అరుణ రాగాలు
చరణం:
ష్ ...గలగలమనగూడదు ఆకులలో గాలి
జలజలమనరాదు.. అలలతో కొండవాగు
నిదరోయే కొలను నీరు (2) కదపకూడదు
ఒరిగుండే పూలతీగ ఊపరాదు
కొమ్మ పైనిట జంట పువ్వులు, గూటిలో ఇట రెండు గువ్వలు (2)
ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగ పాయల మందారాలు (2)
ఎక్కడివీ రాగాలు, చిక్కనివీ అరుణ రాగాలు
మరచి పోకుమా తోటమాలీ, పొరబడియైనా మతిమాలి