చిరస్మరణీయులు, మొదటి భాగం/షేక్ ముహమ్మద్ గులాబ్
89
36. షేక్ ముహమ్మద్ గులాబ్
(-)
భారత స్వాతంత్య్రోద్యమంలో చంపారన్ రైతాంగ పోరాటం చిరస్మరణీయమైంది. బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్ల పెత్తనం, కిరాతక చర్యలకు వ్యతిరేకంగా చంపారన్ రైతులు ఉద్యమించి విజయం సాధించారు. ఈ రైతాంగ పోరాటం ఫలితంగా ఇండిగో ప్లాంటర్ల దుశ్చర్యలకు భరతవాక్యం పలికిన ప్రత్యేక చట్టం అమలులోకి వచ్చింది. అంతటి మహోద్యామానికి నాందీవాచకం పలికిన రైతుల నేత షేక్ ముహమ్మద్ గులాబ్.
బీహార్ రాష్రంలోని చంపారన్ ప్రాంతాన్నిబ్రిటిషర్లు ఇండిగో ఉత్పత్తికి అనుకూలమైన ప్రదేశంగా ఎంచుకుని స్థిర నివాసాలను, కర్మాగారాలు నిర్మించుకున్నారు. అవసరమైన ముడిసరుకు కోసం ఆ ప్రాంతపు భూములను ఉపయాగించదలిచారు. అందువల్ల తాము కోరిన పంటను మాత్రమే పండించమంటూ రైతుల వత్తిడి చేయసాగారు. అందుకు అంగీకరించని రైతులు ప్లాంటర్ల నుండి, ప్లాంటరకు అనుకూలంగా ఉన్న బ్రిటిష్ ప్రబు త్వం నుండి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతులను పశువుల కంటే హీనంగా భావించిన ప్లాంటర్లు, పోలీసు బలగాల సహకారంతో విరుచుకుపడ్డారు. రైతుల స్వేచ్ఛను హరించి వేశారు. ఆ కారణంగా చంపారన్ ప్రాంతపు గ్రామాలలోని రైతు లు అనుక్షణం భయంతో ప్రాణాలను అరచేత పెట్టుకుని బ్రతుకుతున్నారు.
చిరస్మరణీయులు 90
ఆ సమయంలో నిస్సహాయులైన రైతాంగాన్ని ఆదుకోటానికి 'నేనున్నా...నేనున్నా ...ఏడవకండి... ఏడవకండి' అంటూ విప్లవ తరంగమై షేక్ ముహమ్మద్ గులాబ్ తరలి వచ్చారు. ఆయన బీహార్ రాష్ట్రం లోహియా ఠాణాకు చెందిన చాంద్‌పూర్ గ్రామ నివాసి. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన షేక్ గులాబ్ బ్రిటిష్ ప్లాంటర్ల దాష్టీకాలకు బలవుతున్నరైతు కుటుంబాలకు అండగా నిలిచారు. రైతుల కడగండ్లను చూసి సహంచలేక పోయారు. రైతు బిడ్డడైన ఆయన రైతాంగపు సహజసిద్దమైన హక్కులను హరించదలచిన ప్లాంటర్ల మీద విప్లవ శంఖారావం పూరించాడు. ఈ మేరకు గులాబ్ సాగించిన ప్రయత్నాల ఫలితంగా ఆత్మగౌరవం కాపాడుకునేందుకు రైతులు ప్లాంటరకు వ్యతిరేకంగా పోరుబాటను ఎన్నుకున్నారు. షేక్ గులాబ్ మార్గదర్శకత్వంలో రైతు సంఘాలు ఉద్యమించాయి. రైతుల ప్రదర్శనలు, ఊరేగింపులు ప్రారంభమయ్యాయి.
చివరకు ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా రైతులు ప్రతిఘటనకు కూడాపూనుకున్నారు. ఆ క్రమంలో 1907లో బ్రిటిష్ ప్రభుత్వ బంటు అయిన కాళీచరణ్ ఇండిగో ప్లాంటును, గులాబ్ నేతృత్వంలో రైతులు చుట్టుముట్టారు. ఆ చర్యతో గులాబ్ అరెస్టుకు వారెంటు జారీ అయ్యింది. రైతుల అండగల గులాబ్‌ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. చివరకు బితియా సబ్‌డివిజన్ ఆధికారి ఇ.ఎస్. టేనర్ అతి కష్టం మీద రైతాంగ ఉద్యమ నేత గులాబ్‌ను అరెస్టు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది.
ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్లాంటర్ల దుర్మార్గాలను, రైతుల కడగండ్లను గులాబ్ న్యాయస్థానంలో వివరించారు. ఆ విషయాలను మౌల్వీ మహమ్మద్ యూనుస్ అను ఉపాధ్యాయుడు వ్యాసాలుగా రాసి భారతీయ వార్తాపత్రికలకు అందజేశారు. మౌల్వీ యూనుస్ వ్యాసాల వలన షేక్ గులాబ్ నాయకత్వంలో సాగుతున్న రైతాంగ పోరాటం వివరాలు దేశమంతా తెలిశాయి. ఆయన వ్యాసాల మూలంగా భారత జాతీయ కాంగ్రెస్ కూడా చంపారన్ రైతాంగ పోరాటం మీదదృష్టి సారించింది. చివరకు 1916 గాంధీజీ చంపారన్ రైతుల బాధలను విచారించడానికి కదలి రావాల్సి వచ్చింది.
ఆ తరువాత షేక్ గులాబ్ ఏమైపోయారో తెలియదు. మోతిహారిలో గాంధీజీనే అంతం చేయాలని పదకం రూపొందించిన ప్లాంటర్లు షేక్ ముహమ్మద్ గులాబ్‌ను అదృశ్యం చేసి ఉంటారని ఊహాగానాలు సాగాయి. ఆకస్మి కంగా గులాబ్ అంతర్ధానమైనా, రైతాంగ పోరాటం సాధించిన విజయాలతో రైతుల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం పొందటం మాత్రమే కాక స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చంపారన్ రైతు ఉద్యమం, ఆ ఉద్యమనేత షేక్ ముహమ్మద్ గులాబ్ సాహసం, త్యాగం ప్రత్యేక స్థానాన్ని పొందగలిగాయి.
................సయ్యద్ నశీర్ అహమ్మద్