చిత్రలేఖనము/BOOK II/ఐదవ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తుప్పలకు గెంబోజియును వేయుట మంచిది. దగ్గర నున్నచెట్లకు ఆకుపచ్చను, బరంటు శయనారంగును వేయుట యుక్తము. గాడ మైనఆకుపచ్చ నెంతమాత్రము నుపయోగించరాదు.

మార్పులు, దిద్దుబాట్లు:- రంగులను వేయుటయం దనేకతప్పులకు లోనౌదుము. అందువలన దిద్దుట యనవసరము. కావలసినచోట్లయందే దిద్దవలెను కాని అనవసరముగ నీపనిని చేయరాదు. ఇటుల చేసినయెడల కాగితము చెడిపోవును. చిన్నదిద్దుబా టేమైన నున్నయెడల చిన్నతడిగుడ్డతో నైనను, రొట్టెతో నైనను చెఱపవచ్చును. ఈపనిని చేయునప్పుడు కాగితము కరకుగా నైపోయినయెడల గోరుతో నదిమిన నున్న నైపోవును. విస్తారము దిద్దుబా ట్లున్నయెడల సముద్రపుపాచి (Sponge) నుపయోగించుట యుక్తము. చెరుపునప్పుడు ఇతరస్థలములయందు ఈపాచి తగిలి చిత్రము చెడిపోవును. కనుక ఎంతవఱకు చెరుపవలయునో అంతవరకు మఱియొకడ్రాయింగు కాగితముపై కన్నము చేసి దాని స్థలమునం దుంచి తడిపాచిముక్కతో దానిపై వ్రాయవలెను. చిత్రముపై నొక్కచోటుననే దీనిని విస్తారముసే పుంచరాదు. పాచియందు విస్తారము జల ముండరాదు. చెరిపిన చోటున మఱియొకమారు చిత్రించవలె నన్న నిదివరకు చెప్పినపద్ధతి ననుసరించవలెను. స్పాంజితో చెరుపునప్పుడు కాగితము చెడిపోవచ్చును. అట్టి స్థలమునందు రంగులు వేయుట కష్టము. ఈస్థలమును బాగుచేయుటకు మఱియొక్క పద్ధతి యున్నది. చెడిపోయిన చోటును మంచియిసుకకాగితముతో (Sand Paper) మెల్లగ వ్రాసినయెడల కాగితమునకు తొలిరూపు వచ్చును.

చిన్నతప్పులను దిద్దుటయందు స్పాంజితోను, తడిగుడ్డతోను, రొట్టెతోను తుడుచుటకంటె జాగ్రత్తతోనచ్చోట తెలుపును వేసిన చాలును. ఈరంగు బాగుగ నారినతరువాత దీనిపై మీయిష్టమువచ్చినరంగులను వేయవచ్చును.

సమాప్తము:- పైనచెప్పిన వన్నియు బాగుగ తెలిసియుండవలెను. వీటిని కంఠపాఠము చేయు మని నా యుద్దేశముకాదు. ఈచిన్నగ్రంథమును దగ్గర పెట్టుకొని యిందు చెప్పియున్నప్రకారము చిత్రించుచున్నయెడల నదియే యలవడును. పిమ్మట నీవే స్వతంత్రుడవు కావచ్చును. అభ్యాసము చేసినకొలది నిపుణత్వము ఎక్కువ కాగలదు. గొప్పచిత్రకారులు వ్రాసి పూర్తిచేయునటువంటి చిత్రములను చూచి మనము విస్తారము నేర్చుకొనగలము. సుప్రసిద్ధ చిత్రకారుడు చిత్రించుటను చూచుటకంటె యీవిషయమున భాగ్యము కలదా?ఇట్టివి చూచుటవలన పూజ్యు లగునాపురుషులు ఎటుల రంగులను వేయుచుండిరో మనకు విశదమగును.

వివిధతరగతులయం దుండుచిత్రములను జాగ్రత్త చేసికొని వాటిసహాయముద్వారా రంగులను నేర్చుకొనుట మంచిది. ఎచ్చట నైన తెలియకపోయినయెడల కొంచెము వాటివైపున దృష్టిని నిగిడించిన చాలును. కష్ట మంతయు తొలగిపోవును.

ఇంతటితో నీవిషయము చాలింతము.

ఐదవ భాగము.

వివిధాంశములు.

నిలిచియున్ననీరు, ప్రతిబింబములు:- నిలిచి యున్ననీటియందు నలువైపుల నున్నవస్తువులు ప్రతిఫలించును. అందు కెరటములు లేనిసమయమున నెన్నియో చిత్రములను చూడ నగును. అట్టిచిత్తరువులను వ్రాయగలవాడే ధన్యుడు. కాని మనము కొంచెము దూరము నుండి చూచినయెడల నవి యన్నియు కానరావు. గాలివలన చిన్న కెరటములు పుట్టుచుండును. చేపలు కప్పలు కొంతవరకు నీటినిలుకడను చెరిపివేయును. దీనివిషయమై చెప్పుట కంతగా వీలు లేదు. 35 - 1 చిత్తరువును చూచిన గొంతవఱకు బోధపడును.

వాయువు నెమ్మదిగ నున్నపుడే నీరు నిలుకడగ నుండును. కాన నిట్టినీటిప్రదేశమును చిత్రించునపుడు గాలి వేయుచున్నటుల వ్రాయుట గొప్పతప్పిదము. ఇట్టినీటిపై ననేకపులుగు లెగురుచుండును. మధ్యమధ్య గడ్డి మొలచియుండును. కొంగలు నిలబడి యుండి యాహారమునకై బకధ్యానము చేయుచుండును. ఇట్టివస్తువులపేరులను వేనవేలు వ్రాయవచ్చును. కాని తుదకు లాభము లేకపోవును. ఇదివరకు చెప్పినప్రకసరము విద్యార్థి తన డ్రాయింగు పరికరములతో నిట్టిస్థలమునకు పోయి వ్రాయుచుండుటయే యుత్తమము. అభ్యాసమువలనను, అనుభవమువలనను అనేకవిషయములను నేర్చుకొనవలెను.

సముద్రపుకెరటములు :- ఈకెరటములు సదా భూమిపైకి దొర్చుచుండును. సాధారణముగ నివి సౌందర్యముగ నుండును. కాని వీటిముఖమున గాలి వీచుచున్నయెడల అనేకవిధము లగునాకృతులను దాల్చుచుండును. సముద్రతీరపుస్థితినిబట్టి యివి చాలవరకు మారుచుండును. 35 - 2 చూడుము.

సముద్రము పోటెక్కినపుడు కెరటముల కేమైన నడ్డు వచ్చినయెడల నవి మిక్కిలి యెత్తుగ లేచును. సాధారణముగ కెరటములు పండ్రెండడుగులకంటె యెత్తుగ లేవవు. కొన్నిసమయములయందు కెరటములవలన తుప్పరలు మిగుల నెత్తులేచును. అప్పుడప్పు డీజలబిందువులు వర్షమువలె కానవచ్చును. సముద్రమునందు తుపా నున్నయెడల నిట్టివి చూడనగును.

మేఘములు :- మేఘము లనేకవిధములు. వీటిలో కొన్నిటికి సిర్రసుమేఘములు (Cirrus), క్యూములను మేఘములు (Cumulus), స్ట్రేటసుమేఘములు (Stratus), సిర్రోక్యూములనుమేఘములు (Cirro Cumulus) క్యుములోస్ట్రేటసు మేఘములు (Cumulostratus), నింబసు (Nymbus) మేఘములు అందురు.

ప్రతిప్రదేశచిత్రమునందును మేఘములు ముఖ్యము. అందువలన వీటివిషయమై బాగుగ తెలిసి యుండవలెను. ఈమేఘములు మనుజులహృదయములయందు ఆశ్చర్యము నెలకొల్పును.వీటిని ప్రకృతి ననుసరించి చిత్రించుట నేర్చుకొనవలెను. సిర్రసుమేఘములు అన్నిమేఘములకంటె మంద మైనవి. ఇవి చాలయెత్తుగాను, సన్నముగాను, పొడవుగను, తెల్లగను నీలితో----మునం దివి కానవచ్చును. ఏకముగ నుండక విడివిడిగా సమాంతరములుగ నుండును. కొన్ని సమయములయందు ఇవి సమకోణములుగ కలిసికొనును. ఆకాశపుభావిస్థితి నెమ్మదిగ నుండునపుడు ఇట్టిమేఘములు కానవచ్చును. ఇవి కానబడునప్పుడు మంద మైనగాలి వీచి హృదయమును రంజింప జేయుచుండును.

క్యూములసుమేఘములు సిర్రసుమేఘములకంటె కొంచెము దట్టముగ నుండును. గాలితో నివి కదలుచుండును. వర్ష చిహ్నములు కానవచ్చునప్పు డివి విడిపోయి ముద్దలుముద్దలుగ నున్నటుల కానవచ్చును.

స్ట్రేటసుమేఘములు భూమికి చాల దగ్గరగ నుండును. ఇవి యేకముగ కనబడును. గుండ్రముగాను, పొరలు పొరలుగాను ఇవి యున్నటుల కానవచ్చును. ఈమేఘములు కానవచ్చునపుడు పెద్దగాలి సాధారణముగ వచ్చును.

క్యూములోస్ట్రేటసుమేఘములు మిక్కిలి భయంకరములుగ కానవచ్చును. ఇట్టిమేఘములను చూచినప్పు డెవరి మనములు వేదాంతసంబంధ మైనయూహలతో నిండకుండును? వీటిఅంచులు తెల్లగ నుండును. అందువలన మంచుతో కప్పబడినపర్వతసమూహములవలె కనబడి హిమాలయపర్వతములను జ్ఞప్తికి దెచ్చును.

నింబసు మేఘములను వర్ష మేఘము లని పిలుచుటయం దేమియు నతిశయోక్తి లేదు. ఇవి వేగముగ నాకాశము నావరించి ప్రపంచము నంతను కాంతిహీనముగ చేసివేయును. అంతకంత కివి యభివృద్ధి నొందును. వెంటనే మెరపులతోను, ఉరుములతోను, భయంకరముగ వర్షించును. వర్షాంతమునం దివి వెంటనే మాయ మైపోవును. ఇట్టివాటిని మీ రనేకపర్యాయములు చూచియే యుందురు. పైజెప్పినమేఘము లెప్పు డైన మీకు కనబడినయెడల వెంటనే వాటిచిత్రములను వ్రాసి పదిలపఱిచియుండవలెను. ఎప్పటికైన నీచిత్తరువులు పనికివచ్చును.

గాలులు :- గాలులు మనకు కానరావు. ఇవి మనకు చాల ఆవశ్యక మైనవి. ఇవి వీచి, యిండ్లు చెట్లు మొదలుగాగలనిర్మాణముల నన్నిటిని పాడుచేయుచుండును. గాలిని చిత్రమునందు చూపలేము కాని అది చేసినట్టియు చేయుచుండినట్టియు పనిని చూపగలము. చెట్లు విరిగిపోయినట్టును, విరుగుచున్నటులను, విరిగిపోబోవుచున్నటులను, ఆకులుమొదలగునవి యెగురుచున్నటులను, బట్టలు గాలియందు కొట్టుకొనుచున్నటులను, వ్రాసినయెడల గాలి వీచుచున్నటుల వెంటనే విదిత మగును కాని గాలి యొకేవైపునకు వీచుచుండును. అందువలన సృష్టియం దుండు వస్తువు లన్నియు నొకేవైపునకు వాలియుండును. సుడిగాలులు బహువిచిత్రముగ నుండును. ఆకులు, యిసుక, యింక దానియావరణమునకు వచ్చినవస్తువులు మీది కెగిరిపోవును. ఎడారులయందు సుడిగాలి వీచుసమయమునయిసుక స్తంభములు లేచుచుండును. ఇరువైపులనుండి రెండు సమానబలము గలగాలులు వీచునప్పు డిట్టివి సంభవించును.

సైమూనుగాలులు అరేబియాయందు విస్తారము ప్రబలును. ప్రారంభమున నాకాశము నిర్మలముగ నుండును. సూర్యుడు తీక్ష్ణముగ ప్రకాశించును. ఈసైమూనుగాలి వీచుచు దానితో యిసుకను తీసుకొని పోవుచుండును. ఇవి చాలవరకు విషవాయువులు. వీటిబారినుండి తప్పించుకొనుటకు మనుష్యులు భూమిమీదను పండుకొనెదరు. ఒంటెలు వాటిమూతులను ఇసుకలో దూర్చివేయును. చలికాలమునం దీగాలులు చల్లగనుండును. ఇట్టిగాలులను ప్రదర్శింపవలె నన్న,ఇసుక యెగురుచున్నటుల, మనుజులు, ఒంటెలు, యిసుకమీద చచ్చి పడియున్నటుల వ్రాయవలెను.

అగ్నిపర్వతములు:- ఇవి నిజముగ పర్వతములు కావు. అగ్నిచే చేయబడలేదు. భూమియొక్క అంతర్భాగమున కొన్నిమార్పులు కలిగి అనేకవస్తువులు ద్రవరూపముగ మాఱి భూమిని పగుల్చుకొని, పైకివచ్చి యెత్తుగ లేచును. ఆపదార్థములే నలువైపుల పడును. అందువలన చుట్టును భూమి యొకపర్వతాకారమును దాల్చును. ఈఅగ్నిపర్వతములు విజృంభించునపుడు దగ్గర కెవరును వెళ్లజాలరు. 35 - 3 చూడుము. ఎల్లసమయములయందు నిది యిట్టిస్థితియం దుండదు. కొన్నిసమయములయందు చల్లారి నల్లనిపొగమాత్రము వచ్చుచుండును. మఱికొన్నిసమయములయం దీపొగకూడ రాదు. అట్టిసమయమునందు మనము వెళ్లి దాని కన్నము ద్వారా చూచినయెడల, అన్నివస్తువులు కరిగి అగ్నిప్రవాహమువలె ప్రవహించుచున్నటుల చూడగలము. దీనిని చిత్రించునపు డెఱుపును నలుపును విస్తార ముపయోగపడును.

వేడినీటియూటలు చూచుట కగ్నిపర్వతమువలె కానవచ్చును. కాని యిందు రాళ్లు, పొగ మొదలగునవి పైకి రావు. వేడినీళ్లుమాత్రము పైకి లేచుచుండును.

వర్షము :- వర్షమునందు దగ్గర నున్నవస్తువులు కొంచెము కానబడుచుండును. దూరముగ నున్నవి కాన బడవు. గాలివీచును చెట్లు వంగియుండును. దేశమంతయు నీటిమయమైయుండును. జంతువు లన్నియు తడిసిపోవును. మనుజులు గొడుగులు వేసికొని పడిపోవుదు రేమో యనుభయముతోను, బట్టలు తడిసిపోవు నేమో యను భీతితోను అతిభయముగ నడచుచుండురు. ఆకాశమంతయు భయంకర మై మేఘావృత మై యుండును. చీకటి క్రమ్మియుండును. ఇట్టిచిత్రమును వ్రాయు టతికష్టము.బాగుగ నభ్యాసమైననేగాని యిట్టివాటిని చిత్రించుటకు పూనుకొనరాదు.

ఇంద్రధనుస్సు యిట్టిసమయములయందు కాననగును. ఇందు రంగు లెటువలె నుండునో యిదివరకే చెప్పి యుంటిని. దానిప్రకారము నిపుణతతో చిత్రించవలెను. ఇం దేమియు చెప్పుటకు వీలులేదు. చెప్పిన లాభము లేదు. అందువలన విద్యార్థులు ఆకాశమునం దీయొంద్రధనస్సును చూచి వ్రాయుట యుత్తమము.

సూర్యుడు :- భానుడు లోకబాంధవుడు. ఈతడు లేనియెడల లోకమంతయు నంధకారబంధుర మైయుండును. జీవరాసు లన్నియు చనిపోవును.

సూర్యునివెలుతురు, ప్రకృతిని చాలవఱకు మార్చి వేయు ననియు, సూర్యుడు ప్రకాశించునప్పుడు ప్రదేశ చిత్రములను వ్రాయుట కష్ట మనియు నిదివరకే చెప్పితిని.

ప్రస్తుతము సూర్యుని చిత్రించుటను నేర్చుకొందము. 35 - 4 లో చూపిన విధముగ చిత్రింపవలెను.

సూర్యబింబమునకు విస్తారము తెలుపు.

ఇంద్రధనుస్సువలెనే దీనిని జాగరూకతతో చిత్రింపవలసియుండును.

దూరముగనుండుసముద్రముయొక్క రంగును, సూర్యునియొక్క రంగును ఒకేవిధముగ నుండును. ఇరువైపులు నుండుజలభాగమునకు నలుపును, ఇండిగోరంగును, కొబాల్టును, బరంటుశయనారంగును వేయవలెను.ఆకుపచ్చమాత్రము విస్తారము వేయకూడదు.

సూర్యోదయమును, సూర్యాస్తమయమును, 35 - 5 లో చూసిన విధముగ చిత్రింపవలెను.

దీని కుపయోగించురంగులు:-

(1) కొంచెము ఆకుపచ్చ, నీలి.

(2) కోబాల్టును, కొంచెము క్రిమిజనులేకును, బరంటుశయనారంగు.

(3) విస్తారముకోబాల్టు, కొంచెము ఇతరరంగులు.

(4) ఇంక విస్తారము కోబాల్టు, చాలకొంచెము ఇతరరంగులు.

(5) గ్రేవర్ణము, కోబాల్టు, క్రిమిజనులేకు, బరంటుశయనారంగు.

(6) క్రిమిజనులేకు, వెర్మిలియనువర్ణము. ఇట్టిసమయమునందు ఆకాశమునకు వివిధ మైనరంగులు వచ్చును. దీనిదగ్గర నున్ననీటియం దీరంగులు వేయవలెను. కాని కొంచెము పలుచగ వేయుట యుక్తము.

ఆకాశమునకును, నీటికిని, పనికివచ్చురంగులు:- కోబాల్టు ఆకాశమునకును, సముద్రమునకును వేయుటకు మిక్కిలి యుపయోగపడును. ఇది ఆఱినతరువాత నీరంగును మార్చుటకు చిందూరరంగును, కావిరంగును వేసిన చాలును.

నీలివర్ణము బ్రౌనుమేడరురంగులోను, కావిరంగుతోను కలిపి వీటికి వేయవచ్చును. పసుపుతో కలిపినయెడల తుపానుసమయమునందు ఆకాశమునకు వేయుటకు పనికివచ్చును.

ఇండిగోరంగును నలుపుతో కలిపిన రాత్రులయందు కానవచ్చుమేఘములకును, దూరముగ నుండుపర్వతములకును, పనికివచ్చును. బ్రౌనుమేడరురంగుతో కలిపిన రాత్రులయందు కానవచ్చిననీటికి పూయవచ్చును. బ్రౌనుమేడరురంగుతోను బరంటుశయనారంగుతోను, కలిపిన గాడ మైనరంగుగలరాళ్లకు వేయవచ్చును.

బ్రౌనుమేడరురంగును, కోబాల్టుతోను, వేండిక్కుబ్రౌనురంగుతోను కలిపిన దూరమున నుండువస్తువులకు వేయవచ్చును. నీలిరంగుతోను, బరంటుశయనారంగుతోను కలిపిన చాయనువేయుటకు పనికివచ్చును.

వెర్మిలియనువర్ణము, ఉదయపు సాయంకాలపు ఆకాశములకు పనికివచ్చును. గోపిచందనపురంగుతోను, కోబాల్టుతోను కలిపినయెడల తుపానుఆకాశమునకు వేయవచ్చును. గాడముగ నుండుమేఘములకు లైటురెడ్డును కలిపిన చాలును. దూరముగ నుండుగృహములకు చిందూరవర్ణమును, బరంటుశయనారంగును, బ్రౌనుమేడరురంగును ఈరంగుతో కలిపి వేయవచ్చును. తేలిక యైనఎఱుపురంగును కోబాల్టుతో కలిపినయెడల మేఘములకు పనికివచ్చును. ఈరంగుపై బరంటుశయనారంగును వేసియెడల గాడత తగ్గును. ఇండిగోరంగుతో కలిపిన ఛాయకు పనికివచ్చును.

గోపిచందనపురంగు ఆకాశమునకును, పడవలకును, ఇండ్లకును, పనికివచ్చును. ఇతరరంగులతో కలిపినయెడల చెడిపోవును. అందువలన నితరరంగులపై నిద్దానిని పలుచగ వేసుకొని రావలెను.

బరంటుశయనారంగు రాళ్లకును, బురదకును, ఇండ్లకును, వేయుట కత్యంతోపకారిగ నుండును. వీనితో కలిపిన మంచిఆకుపచ్చవర్ణము లభించును. కోబాల్టుతో కలిపిన చక్కనిరంగును, నీలితోకలిపిన గాడ మైనరంగునుచ్చును. న్యూట్రల్‌టింటుతో కలిపిన అనేకవిధముల నుపయోగపడును.

బ్రౌనుమేడరురంగును కోబాల్టుతో కలపిన నీడ కుపయోగపడును. ఇండిగోరంగుతో కలిపిన దగ్గరనున్న వాటిఛాయ కత్యంతోపకారిగ నుండును. న్యూట్రలుటింటుతో కలిపిన గాడ మైననీడను చిత్రించుటకు పనికివచ్చును. ఎఱుపుతో కలిపిన ఛాయకును దూరముగ నుండుఎఱుపుబావుటాలకును, దగ్గరగ నుండు ననేకవస్తువులకును వేయుట కుపయోగపడును.

సిపియాను మసిరంగుతోను (Lamp Black) బ్రౌనుమేడరుతోను కలిపిన ప్రదేశచిత్రములయందు పనికివచ్చును.

మసిరంగును బరంటుశయనాతోను బ్రౌనుమేడరురంగుతోను కలిపి ప్రదేశపటములయం దుపయోగించెదరు.

పైరంగులను విద్యార్థులవిషయమై చెప్పితిని. మంచిఅభ్యాసముగలవారు ఇంక నెక్కువరంగుల నుపయోగించెదరు. కాని వారుకూడ ఈరంగులతోనే అభ్యసించి అనుభవశాలులైరి. చిత్తరువులను కొలదిరంగులతోనే చిత్రింపవచ్చును. అందువలన సాధ్యమైనంతవరకు విద్యార్థులు తక్కువవర్ణములనే యుపయోగించెదరు. చెట్లకు పూయు రంగులు :- దూరముగనుండు చెట్ల కీవిధముగ రంగు పూయుదురు.

1. కోబాల్టుతోను, నిమ్మపండువర్ణముతోను పూసి, కోబాల్టుతోను, గోపిచందనపురంగుతోను ఛాయ నివ్వవలెను.

2. కోబాల్టును, గోపిచందనపువర్ణమును, గులాబిరంగును కలిపి పూసి, కోబాల్టుతోను, గెంబోజితోను, ఛాయనిచ్చుట మంచిది.

3. కోబాల్టుతోను,ఇండియాపసుపుతోను, చిత్రించి, కోబాల్టును, రాఅంబరును, (Raw Umber) ఛాయ కుపయోగించెదరు.

4. కోబాల్టును, గెంబోజిని, గులాబిని వేసి, కోబాల్టుతోను, బ్రౌనుమేడరురంగుతోను, ఛాయను చిత్రించెదరట.

5. పరాసునీలితోను, గోపిచందనమురంగుతోను, చిత్రించి, పరాసునీలిని, గెంబోజని, బ్రౌనుమేడరురంగును ఛాయ కుపయోగించెదరు.

దగ్గఱనుండు చెట్లకు వేయు రంగులు.

1. ఇండిగోరంగును, గెంబోజిని, క్రిమిజనును వేసి నీలితోను, గెంబోజితోను, బరంటుశియనాతోను ఛాయ నిచ్చెదరు.

2. నీలిని, గోపిచందనమురంగును వేసి నీలిని, ఇండియాపసుపును ఛాయకుపయోగింపవలెను. లేనియెడల నీలిని, బరంటుశయనారంగును ఛాయకు పనికివచ్చును.

3. ఇండిగోరంగును, గెంబోజిని వేసి ఇండిగోరంగును, ఇండియాపసుపును ఛాయనిచ్చుటకు సాధారణముగ నుపయోగించెదరు.

సాధారణముగ చెట్ల కీదిగువరంగులు పనికివచ్చును.

1. ఇండిగోరంగుతోను, గోపిచందనమురంగుతోను చిత్రించి, ఇండిగోరంగుతోను, బరంటుశయనారంగుతోను ఛాయనిచ్చెదరు.

2. ఇండిగోను, గెంబోజిని, బరంటుశయనారంగును వేసి ఇండిగోను, గెంబోజిని, బ్రౌనుమేడరురంగును ఛాయను చిత్రించుట కుపయోగించెదరు.

3. ఇండిగోను, గులాబిమిశ్రితమైన బరంటుశయానారంగును వేసి, పరాసునీలితోను, గులాబిమిశ్రితమైన బరంటుశయనారంగుతోను, బ్రౌనుమేడరురంగుతోను ఛాయనిచ్చెదరు.


సంపూర్ణము.